
ముంబై: ఒకవైపు అంతర్జాతీయంగా పసిడి పరుగు, మరోవైపు దేశీయంగా డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనత, పెళ్లిళ్ల సీజన్ డిమాండ్‌తో దేశంలో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. బుధవారం పలు పట్టణాల స్పాట్ మార్కెట్లలో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాములు ధర రూ.1,000కుపైగా పెరిగి రూ.44,000 దాటిపోయింది. న్యూఢిల్లీలో ధరలు రూ.1,155 ఎగసి, రూ. 44,383కు చేరింది. వెండి ధర కూడా కేజీకి రూ.50,000 కొంచెం అటు ఇటూ పలుకుతుండడం గమనార్హం. ప్రపంచ వృద్ధికి కోవిడ్–19 భయాలు, దీనితో తమ పెట్టుబడులకు బంగారాన్ని సురక్షిత సాధనంగా ఇన్వెస్టర్లు భావిస్తుండడం, దీనికితోడు వృద్ధికి బలాన్ని ఇవ్వడానికి అమెరికా ఫెడ్‌సహా పలు సెంట్రల్ బ్యాంకులు సరళతర ద్రవ్య విధానాలను అవలంభిస్తుండడం వంటి అంశాలు పసిడికి అంతర్జాతీయంగా బలాన్ని ఇస్తున్నాయి.
రూపాయి... 17 నెలల కనిష్టం
ఇదిలావుండగా, ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం మరో 20 పైసలు నష్టపోయి.. 73.39 వద్ద ముగిసింది. ఇది 17 నెలల కనిష్ట స్థాయి. ట్రేడింగ్ మొదట్లో 72.90 వద్ద ప్రారంభమైన రూపాయి, 74 పైసల కనిష్ట–గరిష్ట స్థాయిల మధ్య తిరగడం గమనార్హం. బుధవారం ఒక దశలో 73.64 స్థాయినీ చూసింది. 2018 అక్టోబర్ 9న రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. తర్వాత పలు సానుకూలతలతో క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. అయితే ఇక్కడ నుంచి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment