Wedding season
-
Gold Price: తగ్గేదేలే అంటున్న బంగారం ధర
పెళ్లిళ్ల వేళ పసిడి ధర చుక్కలు చూపిస్తుంది. గతేడాది కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించడంతో రాబోయేది పెళ్లిళ్ల సీజన్ కావడంతో ముందే కొనేసుకుందాం అని అనుకున్నారు. కానీ పసిడి మాత్రం తగ్గేదేలే అంటూ పెరుగుతూ వస్తుంది. దీంతో శుభకార్యాలకు బంగారం కొనేవారు బెంబేలెత్తిపోతున్నారు. బుధవారం 10 గ్రాముల బంగారం రికార్డు స్థాయిలో రూ.87,500 పలికింది. వెండి ధర 10 గ్రాములకు రూ.970 నమోదు అయ్యింది. దీంతో వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.గత 20 ఏళ్లలో బంగారం, వెండి ధరలు అడ్డూ అదుపు లేకుంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధర కొండెక్కి కూర్చుంది. దేశీయంగా డాలర్ విలువ రూ.87.36 కావడంతో మన దేశంలో పసిడి మరింత భగ్గుమంటుంది. 2004 ఏప్రిల్ బంగారం ధర 10 గ్రాములు రూ.5,800 ఉంది. 2024 ఏప్రిల్ నాటికి రూ.71,300కు పెరిగింది. కాగా ఫిబ్రవరి 5న నాటికి ఎప్పుడూ లేని రీతిలో రికార్డు స్థాయిలో రూ.87,500 పలికింది. వెండి 10 గ్రాములకు రూ.970 నమోదయ్యింది. గత డిసెంబర్లో రూ.72 వేలు, ఈ జనవరిలో రూ.74 వేలు ఉండగా వారం రోజుల్లోనే అమాంతంగా పెరిగింది. జిల్లాలో మెదక్ కేంద్రంగా బంగారం వ్యాపారం జోరుగా సాగుతుంది. ఇక్కడ సుమారు 80 వరకు బంగారు దుకాణాలు ఉండగా, సీజన్లో రోజుకు రూ.కోటి టర్నోవర్ జరుగుతుంది. అయితే ఈ మధ్యలో ధరలు పెరగడంతో గిరాకీ తక్కువగా ఉంటుందని వ్యాపారులు వాపోతున్నారు.పెళ్లికి కొనలేని పరిస్థితి..ప్రస్తుతం పెళ్లీళ్ల సీజన్ ప్రారంభంకావడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఇంట్లో పెళ్లి చేస్తే వధువుకు ఎంత లేదన్నా కనీసం 5 తులాల పైగానే బంగారం పెడుతుంటారు. ఈ మధ్యలో మగ పెళ్లివారు కట్న కనుకలు అడుగకుండా మీ అమ్మాయికి ఇంత బంగారం పెడితే చాలు అంటూ తేలిగ్గా చెప్పేస్తున్నారు. దీంతో పెళ్లి కూతురు తరఫున వారు బంగారం ధర చూసి నోరెల్ల బెడుతున్నారు. పెళ్లి ఖర్చుకంటే బంగారానికే ఎక్కువ ఖర్చు అవుతుందని, రూ.లక్షలు పెట్టి కొనలేక వెనక్కి తగ్గుతున్నారు. ఈ సీజన్లో పసిడి ధర మరింత పైకి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.తలకు మించిన భారంబంగారం ధరలు ఇలా పెరిగితే ఎలా కొంటాం. ఆడ కూతుళ్ల పెళ్లీళ్లు చేయాలంటే మధ్య తరగతి కుటుంబాలకు తలకు మించిన భారం అవుతోంది. ఈ రోజుల్లో ఎంత లేదన్నా అమ్మాయికి కనీసం 10 తులాలు పెట్టాలి. ఇలా ధరలు పెరిగితే వారి పరిస్థితి ఏంటి. ఈ రోజు రూ.87,500 తులం బంగారం ఉంది. ప్రభుత్వం స్పందించి బంగారం ధరలపై నియంత్రణ ఉంచేలా చర్యలు తీసుకోవాలి.– కుకూనూరు స్వప్న, గృహిణి, పాపన్నపేట -
డిసెంబర్లో భారీగా పెళ్లిళ్లు.. మోగనున్న పెళ్లి బాజా
సాక్షి, అమలాపురం: పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తోంది. బ్రహ్మచారులు కొత్త బంధంలో ఒదిగిపోయేందుకు సిద్ధమవుతున్నారు. కన్నెపిల్లలు సిగ్గుల మొగ్గలవుతూ ముస్తాబులకు రెడీ అవుతున్నారు. పెళ్లి ఏర్పాట్లకు వధూవరుల కుటుంబాలు ఉరుకులు, పరుగులు పెడుతున్నాయి. నగలు, వస్త్రాలు, కల్యాణ మండపాలు, సన్నాయి, కేటరింగ్‌కు డిమాండ్ ఏర్పడింది. నగలు, వస్త్ర దుకాణాల్లో అప్పుడే షాపింగ్ కళ పెరిగిపోయింది. పెళ్లి బంధం ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమైంది. తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఆచితూచి శుభఘడియలను ఎంచుకుని ముడేస్తారు. తద్వారా వారి వివాహ బంధం జీవితకాలం ఎలాంటి ఆటుపోట్లకు లోనవకుండా ఉండాలని కోరుకుంటారు.మార్గశిరం మంచిదని..మార్గశిర (డిసెంబర్) మాసంలో మళ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ మాసంతో పాటు వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. మార్గశిర మాసంలో బలమైన ముహూర్తాలు ఉండటంతో పాటు జనవరిలో పుష్యమాసం కావడం.. మార్చి రెండో వారం నుంచి శుక్ర మౌఢ్యమి (మూఢం) రానుండటంతో ఇప్పుడున్న ముహూర్తాల్లోనే పెళ్లిళ్లు చేయాలని పెద్దలు ఆరాటపడుతున్నారు. ప్రస్తుత కార్తీక మాసంలో ఈ నెల 24న చివరి ముహూర్తం ఉంది. కార్తీకంలో పెళ్లిళ్లు జరిగినా పెద్దగా లేవనే చెప్పాలి. డిసెంబర్ 2వ తేదీ నుంచి మార్గశిర మాసం మొదలు కానుండటంతో వివాహాలు అధిక సంఖ్యలో జరగనున్నాయి. తెలుగునాట మాఘం, వైశాఖం, శ్రావణ మాసాల తరువాత మార్గశిర మాసంలోనే ఎక్కువగా వివాహాలు జరుగుతుంటాయి. జనవరిలో ముహూర్తాలు లేవుడిసెంబర్ 25 తరువాత నుంచి జనవరి 30వ తేదీ వరకూ పుష్యమాసంలో వివాహాలు, ఇతర శుభ కార్యక్రమాలు పెద్దగా చేయరు. జనవరి 31 నుంచి మార్చి 7వ తేదీ వరకూ మాఘమాసంలో ముహూర్తాలున్నాయి. మార్చి 13 నుంచి శుక్ర మౌఢ్యమి (మూఢం) మొదలు కానుండటంతో ముహూర్తాల కోసం మళ్లీ నెల రోజులకు పైగా ఎదురుచూపులు తప్పవు. ఈ కారణాలతో మార్చి 7లోపు పెళ్లిళ్లు చేసేందుకు చాలామంది ఆరాటపడుతున్నారు.7న అతి పెద్ద ముహూర్తండిసెంబర్ నెల పొడవునా ముహూర్తాలున్నాయి. ఆ నెలలో ఏడో తేదీ అతి పెద్ద ముహూర్తం. ఆ రోజున సుమారు 30 పెళ్లిళ్లకు ముహూర్తాలు పెట్టాను. డిసెంబర్ 22వ తేదీ ఆదివారం సైతం పెద్దఎత్తున పెళ్లిళ్లు జరగనున్నాయి. జనవరిలో పుష్యమాసం కావడంతో పెద్దగా ముహూర్తాలు లేవు. ఈ కారణంగా డిసెంబర్లో ఎక్కువగా వివాహాలు జరగనున్నాయి. – దైవజ్ఞరత్న ఉపద్రష్ట నాగాదిత్య సిద్ధాంతి, అమలాపురం25 వరకూ శుభముహూర్తాలుమార్గశిర మాసంలో డిసెంబర్ 4వ తేదీ బుధవారం బలమైన ముహూర్తాలున్నాయని పురోహితులు, సిద్ధాంతులు చెబుతున్నారు. ఆ రోజు రాత్రి 7.54 గంటలకు, తెల్లవారుజామున 4.28 గంటలకు (తెల్లవారితే గురువారం), అలాగే 5, 6 తేదీల్లో ముహూర్తాలున్నాయి. 7వ తేదీన కూడా అతి పెద్ద ముహూర్తాలున్నాయి. ఆ రోజు రాత్రి 7.50, తెల్లవారుజామున 4.24 (8వ తేదీ ఉదయం) రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు జరగనున్నాయి. అలాగే, 10వ తేదీన సైతం అధిక సంఖ్యలో వివాహాలు చేయనున్నారు. డిసెంబర్ 11, 14, 20, 22, 24, 25 తేదీల్లో పెళ్లిళ్లతో పాటు, వివిధ శుభ కార్యక్రమాలకు సైతం మంచి ముహూర్తాలు ఉన్నాయి. -
బంగారంపై ఆఫర్లు
హైదరాబాద్: పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్ ‘వివాహ ఉత్సవ్’ ఆఫర్లు ప్రకటించింది. ఇందులో భాగంగా లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణాల కొనుగోలుపై 10 గ్రాముల వెండి బార్‌ను ఉచితంగా ఇస్తుంది. డైమండ్లు, అన్ కట్ డైమండ్లు, ఫ్రెషస్ స్టోన్లపై ఫ్లాట్ 25% తగ్గింపు ఇస్తుంది. ఈ ప్రత్యేక ఆఫర్లు అన్ని జోయాలుక్కాస్ షోరూంల్లో డిసెంబర్ 1 వరకు అందుబాటులో ఉంటాయి. -
పెళ్లి బాజా @ రూ.5.9 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: రాబోయే పెళ్లిళ్ల సీజన్ కోసం వధూవరులతో పాటు వ్యాపారులు కూడా చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈసారి వివాహాల విషయంలో గెస్ట్‌ల సంఖ్య తగ్గినా ఖర్చు బాజా మాత్రం గట్టిగానే మోగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నవంబర్ 12 నుంచి డిసెంబర్ 16 మధ్య 18 రోజుల పాటు దివ్యమైన పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని.. ఈ సీజన్లో రిటైల్ రంగంలో రూ.5.9 లక్షల కోట్ల మేర వ్యాపారం ఉంటుందని అఖిల భారత ట్రేడర్స్ సమాఖ్య (సీఏఐటీ) లెక్కగట్టింది. అంతేకాదు ఒక్క ఢిల్లీలోనే 4.5 లక్షల మేర వివాహాలు జరుగుతాయని.. రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారానికి ఆస్కారం ఉందని పేర్కొంది. అతిథుల సంఖ్య తగ్గుతోంది... వివాహ పరిశ్రమలో ఫ్యాషన్, ట్రావెల్, ఆతిథ్యం ఇంకా ఇతరత్రా సర్వీసులు కలగలిసి ఉంటాయి. ముఖ్యంగా దేశీయంగా కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ సంస్కృతి పెరుగుతుండటంలో ట్రావెల్, ఆతిథ్య రంగానికి ఫుల్ జోష్ లభిస్తోంది. ప్రత్యేకమైన ఫుడ్ మెనూల నుంచి గెస్ట్‌లకు విభిన్నమైన అనుభూతులను అందించడంపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ‘ఇటీవలి కాలంలో పెళ్లిళ్లకు అతిథుల సంఖ్యను తగ్గించుకుంటున్నారు. ముఖ్యంగా మిలీనియల్ జంటలు తమకు అత్యంత దగ్గరి బంధువులు, ఆత్మీయులను మాత్రమే అతిథులుగా పిలుస్తున్నారు. గెస్ట్ లిస్టులో కోత పెట్టినప్పటికీ.. మొత్తంమీద బడ్జెట్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. అందుకే ఏటికేడు విహహాల ఖర్చు పెరుగుతూనే ఉంది.అలంకరణలు, వ్యక్తిగత సర్వీసులు, అతిథుల అభిరుల మేరకు కేటరింగ్ ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యేకత కోరుకుంటున్నారు’ అని న్యూఢిల్లీలోని షాంగ్రీలా ఈరోస్ జనరల్ మేనేజర్ అభిõÙక్ సాధూ పేర్కొన్నారు. మరో నెల రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ కళకళలాడనుండటంతో ఈ లగ్జరీ హో టల్ చైన్ ‘బంధన్ బై షాంగ్రీలా’ పేరుతో వివా హ సేవలను ప్రారంభించింది. ఈ హోటల్లో సాదారణ స్థాయి పెళ్లి బడ్జెట్ రూ. 25 లక్షలతో మొ దలై కోట్లలోకి వెళ్తోంది. జైపూర్ హయత్ ప్యాలెస్‌లోనూ సాధారణ పెళ్లి బడ్జెట్ రూ.20–30 లక్షలుగా ఉంది. ఖర్చెంతైనా తగ్గేదేలే... పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం... పెళ్లి ఖర్చు రూ. 25 లక్షల స్థాయి నుంచి ఏకంగా రూ.100 కోట్లకు కూడా వెళ్లే సందర్భాలున్నాయట. విహాహ వేడుకను గ్రాండ్‌గా జరిపించేందుకు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సై అంటున్నారని, అవసరమైతే కొందరు ఆస్తులమ్మేందుకూ వెనుకాడటం లేదంటున్నా రు పరిశీలకులు! మధ్యతరగతి వర్గాల పెళ్లి ఖర్చు రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ ఉంటుందని, ఎగువ మధ్యతరగతి విషయానికొస్తే.. ఇది రూ. 25 లక్షల నుంచి రూ.2.5 కోట్లకు చేరుతోందని వెడ్డింగ్ ప్లానర్ వెడ్డింగ్సూత్ర.కామ్ సీఈఓ పార్తీప్ త్యాగరాజన్ పేర్కొన్నారు. ‘సంపన్నులు (హెచ్ఎన్ఐలు) రూ.1.5 కోట్ల నుంచి రూ.25 కోట్ల స్థాయి లో వెచ్చిస్తున్నారు. అల్ట్రా హెచ్ఎన్ఐల బడ్జెట్ అ యితే ఏకంగా రూ.2.5 కోట్ల నుంచి రూ.100 కోట్లకు కూడా దూసుకెళ్తోంది’ అని ఆయన వివరించారు. ఇటీవలి కాలంలో అనంత్ అంబానీ–రాధికా మర్చెంట్ వివాహ వేడుక ఖర్చు చూసి (దాదాపు రూ.5,000 కోట్లుగా అంచనా) ప్రపంచమంతా నోరెళ్లబెట్టడం తెలిసిందే!! భారతీయుల పెళ్లిళ్లా మజాకానా అనే రేంజ్లో అంగరంగ వైభవంగా ఈ వివాహం జరిగింది.డెస్టినేషన్ వెడ్డింగ్ క్రేజ్బ్రైడల్ మేకప్ నుంచి ఫోటోగ్రఫీ, వేదిక, డెకరేషన్, వెడ్డింగ్ లొకేషన్ వరకూ ప్రత్యేకంగా ఉండాలని యువ జంటలు కోరుకుంటున్నారు. ‘గతంలో వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి రూ. 2 లక్షలు వరకు ఒక కుటుంబం ఖర్చు చేస్తే, ఇప్పుడిది రూ. 6 లక్షలకు చేరుతోంది. కొందరు వధువులు టాప్ మేకప్ ఆర్టిస్ట్‌లతో ప్రత్యేకంగా సింగారించుకుంటున్నారు. ఒక్కో ఫంక్షన్‌కు ఖర్చు రూ. లక్ష వరకూ ఉంటోంది’ అని త్యాగరాజన్ తెలిపారు. ఇక జైపూర్, ఉదయ్‌పూర్, జోద్పూర్, గోవా, మహాబలిపురం వంటి డెస్టినేషన్ వెడ్డింగ్ హాట్స్పాట్లకు క్రేజ్ ఓ రేంజ్లో ఉంటోందట! శీతాకాలంలో పెళ్లిళ్లు, శుభ ముహూర్తాలు కూడా ఉండటంతో హోటల్ రేట్లు భారీగా ఎగబాకుతున్నాయని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. కాగా, రాజస్థాన్, గోవా, కేరళ ప్రాచుర్యం కొనసాగుతుండటంతో పాటు ఇప్పుడు డెహ్రాడూన్, రిషికే‹Ù, కూర్గ్ వంటి కొత్త ప్రదేశాలు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్స్ లిస్టులోకి చేరుతున్నాయి. ‘అత్యంత సంపన్న వర్గాల్లో 10 శాతం మాత్రమే పెళ్లిళ్ల కోసం విదేశీ గమ్యాలను ఎంచుకుంటున్నారు, ఈ విషయంలో థాయ్‌లాండ్ తొలి స్థానంలో ఉంది. ఇక్కడ ఏటా 450–550 భారతీయ పెళ్లిళ్లు జరుగుతున్నాయి’ అని త్యాగరాజన్ వివరించారు. -
వెడ్డింగ్ సీజన్: ఇన్స్టెంట్ గ్లో, ఫ్రెష్ లుక్ కావాలంటే..!
సమ్మర్ వచ్చిందంటే..వెడ్డింగ్ సీజన్ వచ్చేసినట్టే.. ఒక్కోసారి అనుకోకుండా ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాల్సి వస్తుంది. తీరిగ్గా తయారయ్యేంత సమయం ఉండకపోచ్చు. అందంగా, సూపర్ స్టైలిష్ లుక్‌తో అందరిలో స్పెషల్‌గా కనిపించాలి అందరీకి ఉంటుంది. అందులోనూ చాలా మంది ఆఫీసులో పని తర్వాత పెళ్లికో, రిసెప్షన్కో హాజరు కావాల్సిన పని ఉంటుంది. పని ఒత్తిడి ఖచ్చితంగా ముఖం మీద కనిపిస్తుంది. మరి అలాంటి ఇన్స్టెంట్గా ఫేస్‌లో గ్లో కావాలంటే ఏం చేయాలి. చిన్న టిప్స్ ద్వారా చర్మానికి తక్షణ నిగారింపు తీసుకురావచ్చు. అవేమిటో చూద్దాం.. క్లెన్సింగ్: ముందుగా కొద్దిగా రోజ్ వాటర్ ని తీసుకుని.. దానిని ముఖం అంతా అప్లై చేసుకోవాలి. ఇది స్కిన్ కి టోనర్ గా పని చేస్తుంది. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు బిగుస్తాయి. చర్మానికి మేలు చేస్తుంది. స్క్రబ్బింగ్: ఆ తర్వాత ఫేస్ కి స్క్రబ్బింగ్ చేయాలి. ఇందుకోసం టమాటాను తీసుకుని దాన్ని మధ్యలోకి కట్ చేయాలి. ఇలా తీసుకున్న టమాటా మీద కాస్త పంచదార అద్ది దానితో ముఖంపై రుద్దాలి. ఇలా చేస్తే చర్మంపై ఉండే నల్లమచ్చలు, ట్యాన్ తొలగి చర్మం మిలమిలలాడుతుంది. మసాజ్: కలబంద గుజ్జు... అదేనండీ... కాస్తంత అలోవెరా జెల్‌ను తీసుకుని దీనితో చర్మంపై మృదువుగా మసాజ్ చేయాలి. ఆలోవెరాలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉండటం వల్ల అది మీ చర్మాన్ని కాంతిమంతంగా, మృదువుగా ఉండేలా చేస్తుంది. బొప్పాయి: ఇంట్లో బొప్పాయి పండు ఉందా? కేవలం 10 నిమిషాల్లో ముఖానికి అందమైన మెరుపు కావాలంటే బొప్పాయిని మించింది లేదు.బొప్పాయిలో విటమిన్ ఏ, సీ,మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మాన్ని తేమగా ఉంచుతుంది. చిన్న బొప్పాయిని ముక్క తీసుకొని ముఖమంతా 10 నిమిషాలు మసాజ్ చేస్తే, చక్కటి గ్లో వస్తుంది. పాలు: పాలలో విటమిన్ ఏ, సీ, బి6, బి12, కాల్షియం, పొటాషియం , చర్మానికి మేలు చేస్తాయి. పచ్చి పాలలో కాటన్ ప్యాడ్‌ని ముంచి ముఖం, మెడ అంతటా అప్లై చేయండి. 10 నిమిషాలు అలాగే ఉంచి కడగాలి. కాంతి వంతంగా, ఫ్రెష్‌లుక్ మీ సొంతం. -
42 లక్షల పెళ్లిళ్లు - రూ.5.5 లక్షల కోట్లు!
మన దేశంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. జనవరి 15 నుంచి జులై 15 వరకు దేశం మొత్తం మీద సుమారు 42 లక్షల పెళ్లిళ్లు జరిగే సూచనలు ఉన్నట్లు 'కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్' (CAIT) నిర్వహించిన సర్వే ద్వారా తెలిసింది. దీని ద్వారా దేశంలో బిజినెస్ పెద్ద ఎత్తున జరిగే సూచనలు ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది జులై 15 వరకు జరిగే పెళ్లిళ్ల ద్వారా సుమారు రూ.5.5 లక్షల కోట్ల వ్యాపారాలు జరిగే అవకాశం ఉందని సీఏఐటీ వెల్లడించింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో మాత్రమే 4 లక్షలకు పైగా వివాహాలు జరుగుతాయని, దీని ద్వారా దాదాపు రూ.1.5 లక్షల కోట్ల వ్యాపార ఆదాయం సమకూరుతుందని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భారతీయ, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. గతేడాది డిసెంబర్ 14తో ముగిసిన పెళ్లిళ్ల సీజన్లో దాదాపు 35 లక్షల పెళ్లిళ్లు జరిగాయి, ఈ పెళ్లిళ్ల ద్వారా రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారాలు జరిగినట్లు తెలిసింది. వ్యాపారుల సంఘం ప్రకారం, ఈ పెళ్లిళ్ల సీజన్లో ఒక్కో పెళ్లికి కనీసం రూ.3 లక్షలు ఖర్చు అవుతుందని. సంపన్నులు పెళ్లి చేసుకుంటే ఈ ఖర్చు కోట్ల రూపాయలకు చేరుతుందని తెలుస్తోంది. ప్రతి వివాహానికి అయ్యే ఖర్చులో దాదాపు 20 శాతం వరుడు, వధువు కుటుంబాలకు ఇద్దరికీ కేటాయించినా.. మిగిలిన 80 శాతం వివాహ ఏర్పాట్లలో పాలుపంచుకున్న థర్డ్ పార్టీ ఏజెన్సీలకు వెళుతుందని సీఏఐటీ అధికారులు వెల్లడించారు. పెళ్లి అనగానే హౌస్ రేనోవేషన్, పెయింటింగ్ వంటివి మాత్రమే కాకుండా.. నగలు కొనుగోలు చేయడం, బట్టలు, ఫర్నిచర్, రెడీమేడ్ వస్త్రాలు, దుస్తులు, పాదరక్షలు, వివాహ గ్రీటింగ్ కార్డులు, డ్రై ఫ్రూట్స్, స్వీట్లు, పండ్లు, పూజా సామాగ్రి, కిరాణా, ఆహార ధాన్యాలు, అలంకరణ వస్తువులు, గృహాలంకరణ, ఎలక్ట్రికల్ యుటిలిటీస్, ఎలక్ట్రానిక్స్ మొదలైన వాటికి భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: ఒక్క రోజులోనే రూ.57 వేల కోట్లు మటాష్.. అయినా ఆవిడే ప్రపంచంలో రిచెస్ట్! పెళ్లి అవసరాలకు కావలసినవన్నీ సమకూర్చుకున్నాక.. బాంక్వెట్ హాళ్లు, హోటళ్లు, ఓపెన్ లాన్లు, కమ్యూనిటీ సెంటర్లు, పబ్లిక్ పార్కులు, ఫామ్‌హౌస్‌లు వంటి వివాహ వేదికలు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బుక్ చేసుకోవడం మాత్రమే కాకుండా.. వాటిని అలంకరించడానికి కూడా భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. మొత్తం మీదే పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. -
మాఘమాసం.. మంచి ముహూర్తం!
మాఘం...శుభ ముహూర్తాల మాసం. అందుకే అందరూ ఈ మాసం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు.ఈ నెల 11 నుంచి మాఘమాసం ప్రారంభం కానుండగా.. జిల్లాలో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కల్యాణ మంటపాల వద్ద సందడి కనిపిస్తోంది. హిందూపురం అర్బన్: వివాహం... ప్రతి ఒక్కరి జీవితంలో అపురూపమైన వేడుక. అందుకే కలకాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలని అందరూ భావిస్తుంటారు. పిల్లల తల్లిదండ్రులైతే మంచి ముహూర్తంలో మూడుముళ్లు వేయించాలని భావిస్తుంటారు. అందుకోసం అవసరమైతే నెలల తరబడి వేచి చూస్తుంటారు. మిగతా మాసాలు ఎలా ఉన్నా మాఘమాసం మాత్రం మంచి ముహూర్తాలను మోసుకువస్తుంది. అందుకే అందరూ ఎదురుచూస్తుంటారు. ఈ నెల 11 నుంచి క్రోదనామ సంవత్సర చైత్రమాసం వరకు (ఏప్రిల్ 26) మూడు నెలల పాటు 30 మాత్రమే వివాహ ముహూర్తాలున్నాయి. తర్వాత శ్రావణ మాసం(ఆగస్టు)లోనే తిరిగి వివాహాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు. అన్నింటికీ డిమాండ్.. ఈ మాఘ మాసంలో జిల్లా వ్యాప్తంగా వేలాది జంటలు ఒక్కటి కానున్నాయి. ఈ మేరకు ఆయా కుటుంబాలు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ నెల 13న మంచి ముహూర్తం ఉండటంతో జిల్లా వ్యాప్తంగా భారీగా స్థాయిలో వివాహాలు జరగనున్నాయి. సుమారు రెండు నెలల తరువాత మంచి ముహూర్తాలు వస్తుండటంతో ఇప్పటికే కల్యాణ మంటపాలన్నీ ఫుల్ అయ్యాయి. ప్రముఖ దేవాలయాల వద్ద పెళ్లి సందడి కనిపిస్తోంది. ఇక బంగారం, దుస్తుల దుకాణాలు కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. పురోహితులు, కేటరింగ్, సన్నాయి మేళం, డెకరేషన్స్, సప్లయర్స్‌కు గిరాకీ పెరిగింది. ప్రధానంగా హిందూపురం, కదిరి, ధర్మవరం ఇలా ప్రధాన పట్టణాలతో పాటు, అక్కడి దేవాలయాల ప్రాంగణాల్లో ఎక్కువ పెళ్లిల్లు జరగనున్నాయి. వివాహ సముహూర్తాలు ఇవే.. మాఘమాసం : ఫిబ్రవరి 13, 14, 17, 18, 24, 28, 29, మార్చి నెల 2, 3 తేదీలు. పాల్గుణం: మార్చి 15, 17, 20, 22, 24, 25, 27, 28, 30 తేదీలు, ఏప్రిల్ 3, 4 తేదీలు. చైత్రం: ఏప్రిల్ 9, 18, 19, 20, 21, 22, 24, 26 తేదీలు. ఏప్రిల్ వరకూ ముహూర్తాలు ఫిబ్రవరి 2 ఆదివారం మొదలు మంచి ముహూర్తాలు. కానీ మాఘమాసంలోనే ఎక్కువగా వివాహాలు జరుగుతాయి. మాఘమాసం ప్రారంభం నుంచి ఏప్రిల్ 26 వరకు మంచి ముహూర్తాలున్నాయి. అవి దాటితే మళ్లీ ఆగస్టులోనే. ఉపనయనాలు, వివాహాలు, గృహ ప్రవేశాలకు ఇదే మంచి తరుణం. – సునీల్‌శర్మ, పండితులు, హిందూపురం. -
ఈసారి రూ. 4.7 లక్షల కోట్ల వ్యాపారం..
న్యూఢిల్లీ: ఈసారి పెళ్లిళ్ల సీజన్లో వ్యాపారం భారీగా జరుగుతుందని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) అంచనా వేస్తోంది. పెళ్లిళ్లకు సంబంధించిన కొనుగోళ్లు, ఇతరత్రా సర్విసులపై వినియోగదారులు రూ. 4.74 లక్షల కోట్ల మేర వెచ్చించే అవకాశం ఉందని భావిస్తోంది. గత సీజన్లో నమోదైన రూ. 3.75 లక్షల కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రూ. 1 లక్ష కోట్లు అధికం. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు ఉన్న వివాహాల సీజన్లో దాదాపు 38 లక్షల పెళ్లిళ్లు జరగొచ్చని భావిస్తున్నట్లు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ విలేకరుల సమావేశం సందర్భంగా తెలిపారు. ‘గతేడాది సుమారు రూ. 3.75 లక్షల కోట్ల వ్యయంతో దాదాపు 32 లక్షల వివాహాలు జరిగాయి. ఈసారి ఇది దాదాపు రూ. 1 లక్ష కోట్లు మేర పెరగొచ్చని అంచనాలు ఉన్నాయి. దేశ ఎకానమీకి, రిటైల్ వ్యాపారానికి కూడా ఇది మంచిదే‘ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్‌లో 23, 24, 27, 28, 29 తేదీల్లో, అలాగే డిసెంబర్లో 3, 4, 7, 8, 9, 15 తేదీల్లో వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఒక్క ఢిల్లీలోనే 4 లక్షల పైగా పెళ్లిళ్లు ఉంటాయని, వీటితో రూ. 1.25 లక్షల కోట్ల మేర వ్యాపారం జరగొచ్చని అంచనా వేస్తున్నట్లు ఖండేల్వాల్ తెలిపారు. -
సామాన్యుడికి ‘నగదు’ కష్టాలు!
సాక్షి, కామారెడ్డి: కూతురు పెళ్లి కోసం బంగారం కొనడానికి వెళ్లాలంటే నాన్నకు భయం.. పండుగ పూట కుటుంబం అంతా షాపింగ్‌కు వెళ్లాలంటే జంకు.. దసరా సీజన్లో వచ్చిన డబ్బులను ఇంటికి తీసుకెళ్లడానికి ఆలోచిస్తున్న ఓ వ్యాపారి.. వెంట తీసుకెళ్లిన డబ్బులను ఎన్నికల తనిఖీల్లో భాగంగా పోలీసులు పట్టుకుంటారని ఇలా సామన్యులు భయపడుతున్నారు. ఎన్నికల్లో నగదు పంపిణీని కట్టడి చేయడానికి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహించే వాహనాల తనిఖీలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల తనిఖీ బృందాలు అతిగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోలు చేయడానికి, షాపింగ్ కోసం డబ్బులు తీసుకుని వెళ్లడానికి కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వ్యాపారులు కూడా షాపు కట్టేసిన తరువాత డబ్బులను ఇంటికి తీసుకు వెళుతుంటారు. వెళ్లేటపుడు పోలీసులు తనిఖీ చేసి స్వాధీనం చేసుకుంటుండడంతో ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు ఐదారు బ్యాంకులు ఉన్నాయి. డబ్బులు బ్యాంకుల్లో జమ చేయడానికి వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు. మున్సిపల్ కార్యాలయం సమీపంలో బ్యాంకుల ఎదుటే తనిఖీలు చేపడుతుండడంతో డబ్బులను జమ చేయడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్‌తో.. శుభముహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్లు, ఫంక్షన్లు నిశ్చయం చేసుకున్న వారు అవసరమైన ఆభరణాలు చేయించడానికి బంగారం కొనుగోలు కోసం వెళ్లేందుకు వెంట డబ్బులు తీసుకెళ్లడం ఇబ్బందికరంగా మారింది. తులం బంగారం కొనాలంటే రూ.62 వేలు అవసరం. పెళ్లిళ్లలో తక్కువలో తక్కువ ఐదు తులాల నుంచి ఇరవై తులాల వరకు బంగారం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రూ.లక్షలు వెంట తీసుకువెళితే పోలీసులు ఎక్కడ ఆపి ఇబ్బంది పెడతారోనని ఆందోళన చెందుతున్నారు. పెళ్లి దుస్తులు కొనడానికి కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. అంత డబ్బు వెంట తీసుకు వెళితే తనిఖీలతో ఇబ్బంది పెడతారేమోనని ఆందోళన చెందుతున్నారు. నవంబర్‌లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. దీంతో ముందుగా బంగారం, దుస్తులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఫంక్షన్ హాళ్లకు అడ్వాన్సులు చెల్లించాల్సిన పరిస్థితుల్లో రూ.50వేల కన్నా ఎక్కువ తీసుకువెళితే ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. వ్యాపారుల అవస్థలు తమ వ్యాపారాలకు సంబంధించి దుకా ణంలో జమ అయిన డబ్బులను చాలా మంది రాత్రి పూట ఇంటికి తీసుకెళ్తారు. కామారెడ్డి పట్టణంలో మెడికల్ ఏజెన్సీలు, సూపర్ మా ర్కెట్లు, బంగారం, బట్టల దుకాణాలు... ఇలా వ్యాపారులంతా రాత్రి షాప్ క్లోజ్ చేసి అప్పటి వరకు జమ అయిన డబ్బులను వెంట తీసుకు వెళ్తారు. భారీ మొత్తంలో డబ్బులు ఉన్నపుడు పోలీసులు ఆపితే లెక్క చూపని సందర్భంలో స్వాధీనం చేసుకుంటారని వ్యాపారులు ఆందో ళన చెందుతున్నారు. రాజకీయ పార్టీల వాళ్లు డబ్బులు అక్రమంగా తరలిస్తే పట్టుకోవాలని, వ్యాపారాలు చేసుకునే వారిని ఇబ్బంది పెట్టడం సరికాదని వారు అంటున్నారు. -
జోస్ ఆలుక్కాస్ శుభ మాంగళ్యం బ్రైడల్ కలెక్షన్స్–2023
చెన్నై: పెళ్లిళ్ల సీజన్‌కు మరింత శోభను చేకూర్చేందుకు జోస్ ఆలుక్కాస్ ‘‘శుభ మాంగళ్యం బ్రైడల్ కలెక్షన్ – 2023 ఫెస్టివ్ ఎడిషన్’’ ను ఆవిష్కరించింది. చెన్నైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆభరణాల కలెక్షన్‌ను సినీ నటులు కీర్తి సురేశ్, అనార్కలి మారికర్లు ప్రారంభించారు. ఇందులోని ప్రతి ఆభరణాన్ని భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రూపొందించామని సంస్థ చైర్మన్ జోస్ ఆలుక్కాస్ తెలిపారు. స్వచ్ఛమైన బంగారు ఆభరణాలపై 4.99% తరుగు చార్జీలు ఆఫర్ చేస్తుంది. వజ్రాభరణాలపై 20%, ప్లాటినం వస్తువులపై 7% డిస్కౌంట్ అందిస్తుంది. ఎస్బీఐ కార్డు, పెళ్లి కోసం బంగారం కొనుగోలుపై 5% ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. ఇప్పటికే ఆభరణాల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కలెక్షన్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు వర్గీస్ ఆలుక్కా, పాల్ జె ఆలుక్కా, జాన్ ఆలుక్కాలు పాల్గొన్నారు -
పెళ్లిళ్ల సీజన్.. టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. శుభకార్యాలకు అద్దె బస్సులపై ప్రత్యేక రాయితీని కల్పిస్తోంది. అన్ని రకాల బస్ సర్వీస్‌లపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 30 వరకు అద్దె బస్సులపై 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. కార్తీక మాసం, వనభోజనాలు, శబరిమల అయ్యప్ప దర్శనం సందర్భంగా అద్దె బస్సులకు రాయితీని గతంలో సంస్థ కల్పించింది. గత ఏడాది డిసెంబర్ 31తో ఆ రాయితీ గడువు ముగిసింది. తాజాగా పెళ్లిళ్ల సీజన్ రావడంతో డిమాండ్ దృష్ట్యా.. 10 శాతం రాయితీ కల్పించాలని క్షేత్రస్థాయి అధికారులు సూచన చేశారు. ఈ మేరకు ఆ రాయితీని సంస్థ ప్రకటించింది. శుభకార్యాల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో అద్దె బస్సులపై 10 శాతం రాయితీ కల్పించినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ వెల్లడించారు. ప్రైవేట్ వాహనాల కన్నా చాలా తక్కువ ధరకే తమ సంస్థ బస్సులను అద్దెకు ఇస్తోందని పేర్కొన్నారు. ముందస్తుగా ఎలాంటి నగదు డిపాజిట్ లేకుండానే ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నామని వివరించారు. చదవండి: బదిలీ వెనుక రాజకీయం.. చక్రం తిప్పిన ఇద్దరు ప్రజాప్రతినిధులు..? అద్దె బస్సుల బుకింగ్ కోసం తమ అధికారిక వెబ్సైట్ www.tsrtconline.in ను సందర్శించాలని సూచించారు. పూర్తి వివరాలకు స్థానిక డిపో మేనేజర్‌ను సంప్రదించాలన్నారు. శుభకార్యాలు, పెళ్లిళ్లకు తమ అద్దె బస్సులకు వినియోగించుకుని టీఎస్ఆర్టీసీని ప్రోత్సహించాలని కోరారు. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో డిమాండ్‌ను బట్టి అద్దె బస్సులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. -
శ్రీరస్తు.. కల్యాణమస్తు
భీమవరం (ప్రకాశం చౌక్): ఈ ఏడాది శుభాకార్యాలకు మంచి తరుణం. ప్రస్తుతం తెలుగు సంవత్సరాది శుభకృత్ నామ సంవత్సరం నడుస్తోంది. మార్చి నుంచి శోభకృత్ నామ సంవత్సరం ప్రారంభమవుతుండడంతో అంతా శుభం కలగనుంది. అధిక సంఖ్యలో పెళ్లి ముహూర్తాలు ఉండడంతో కల్యాణ నామ సంవత్సరంగా ఈ ఏడాదిని చెప్పవచ్చు. ఏప్రిల్ నెలలో గురుమూఢమి, జూలై నెలలో ఆషాఢం, అధిక శ్రావణం కావడంతో ఈ ఏడాది ఈ రెండు నెలల మినహా మిగిలిన 10 నెల ల్లో 104 పెళ్లి ముహూర్తులు ఉండడం విశేషం. గడిచిన మూడేళ్లతో పోల్చితే ఈ ఏడాది పెళ్లి ముహూర్తాలు అధికంగా ఉన్నాయి. ఏడాదంతా భాజాభంత్రిల మోత మోగనున్నాయి. పెళ్లిళ్లతోపాటు గృహప్రవేశాలు తదితర శుభకార్యలకూ మూహూర్తులు ఉన్నాయి. 25 నుంచి ముహూర్తాలు ప్రారంభం ఈనెల 25 తేదీ నుంచి పెళ్లిళ్ల ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. ఈనెలలో 4, ఫిబ్రవరి 12, మార్చి 13, మే 16, జూన్ 7, ఆగస్టు 8, సెప్టెంబర్ 6, అక్టోబర్ 10, నవంబరు 14, డిసెంబర్లో 14 ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్, జూలై నెలల్లో ముహూర్తాలు లేవు. జోరుగా వ్యాపారాలు జిల్లాలోని కల్యాణ మండపాలు, పంక్షన్ హాల్స్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. వీటిని పెళ్లిళ్లకు నెల నుంచి రెండు నెలల బుక్ చేసుకుంటున్నారు. దీంతో వ్యాపారం జోరుగా సాగుతోంది. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నర్సాపురం పట్టణాల్లోని సంపన్నులు తమ ఇంట పెళ్లిళ్లకు ఖరీధైన పంక్షన్ హాల్స్‌ను బుక్ చేసుకుంటున్నారు. దుస్తులు, బంగారం, కిరణా వ్యాపారాలకు మూడు పువ్వులు, ఆరుకాయలు అన్నట్లుగా వ్యాపారం సాగుతోంది. లైటింగ్, డైకరేషన్, షామియన, టైలర్స్, వాయిద్యా కళాకారులు, బ్రహ్మణులు, రజకులు, నాయీబ్రహ్మణులు, వంట మేస్త్రీలు, పువ్వులు, పెయింటర్స్, ఫొటోగ్రాఫర్స్, ట్రావెల్స్ తదితరులు అందరికీ మంచి ఉపాధి లభించనుంది. పుణ్య క్షేత్రాల్లో ముందస్తు రిజర్వేషన్లు జిల్లాలోని పలు పుణ్య క్షేత్రాల్లో వివాహాల నిర్వహణకు ముందుగా ఆలయ ప్రదేశాలను రిజర్వేషన్ చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ద్వారాకతిరుమల, పశి్చమగోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు పంచారామక్షేత్రాలు, భీమవరం, కాళ్లకూరు, తణుకు వెంకటేశ్వరస్వామి దేవస్థానాలు, భీమవరం భీమేశ్వరస్వామి, నర్సాపురం, ఆచంట, తాడేపల్లిగూడెం, యలమంచిలి, పెనుగొండ తదితర ప్రాంతాల్లో ప్రముఖ దేవస్థానాల్లో పెళ్లిళ్లు ఎక్కువగా నిర్వహిస్తుంటారు. మొక్కుబడి ఉన్నవారంతా ఆలయాల్లోనే పెళ్లిళ్లు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ముహూర్తాలు ఎక్కువే గడిచిన మూడేళ్లతో పోల్చితే ఈఏడాది పెళ్లిళ్ల ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది రెండు నెలల మినహా మిగిలిన 10 నెలల్లో ప్రతి నెలా ముహూర్తాలు ఉన్నాయి. పెళ్లిళ్లూ, ఇతర శుభకార్యాలకు ఈ ఏడాదంతా శుభపరిణామమే. ప్రస్తుతం తెలుగు సంవత్సరాది శుభకృత్ నామ సంవత్సరం నడుస్తోంది. మార్చి నుంచి శోభకృత్ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ తెలుగు ఏడాది కూడా అన్ని శుభకార్యాలకూ అనువైనది. – లింగాల సూర్యప్రసాద్, ఘనపాఠి, భీమవరం పంచారామక్షేత్రం అస్థాన వేదపండితులు -
కల్యాణం.. ప్రతి తంతూ కళాత్మకం
సాక్షి అమలాపురం: పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఇదో మధుర ఘట్టం. కొత్త జీవితానికి నాంది పలికే శుభదినం. మరి ఆ ముచ్చట సాదాసీదాగా జరిగిపోతే ఎలా! వివాహంలో నయనానందకరంగా సాగే ప్రతి తంతూ జీవితాంతం సుమధుర జ్ఞాపకాలుగా మిగిలిపోవాలంటే కాస్త వెలుగు జిలుగులు అద్దాల్సిందే. పెళ్లంటే తాళిబొట్లు.. తలంబ్రాలు.. పూలదండలు.. ఆభరణాలు.. వేదమంత్రాలు.. సన్నాయి మేళాలు.. షడ్రుచుల భోజనాలే కాదు.. ఇప్పుడా సందడి సరికొత్త శోభను అద్దుకుంటోంది. ప్రతి తంతూ కళాత్మకంగా మారిపోతోంది. మనోఫలకంపై బలమైన ముద్ర వేస్తోంది. పెళ్లిలో జరిగే ప్రతి ఘట్టంలో వాడే వస్తువులు, వాటి తయారీ వెనుక ఉన్న శ్రామికుల పనితనం.. చేయి తిరిగి నైపుణ్యం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఫొటో, వీడియో షూట్ల ప్రాధాన్యం పెరిగిన తరువాత పెళ్లిలో వాడే ప్రతి వస్తువునూ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. మూడు నెలల మూఢం కొద్ది రోజుల్లో ముగిసిపోతోంది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభ కాబోతోంది. ఈ తరుణాన వివాహ వస్తువులు తయారు చేసేవారు బిజీగా మారిపోయారు. ఎన్నో డెకరేషన్లు ► వధూవరుల మంగళ స్నానాలకు చేస్తున్న డెకరేషన్లే చిన్న సైజు పెళ్లిని తలపిస్తున్నాయి. పసుపు నీళ్లు వేసేందుకు అందాల జల్లెడ.. సప్తవర్ణ శోభితమైన బిందెలు.. మహారాజుల వైభవాన్ని గుర్తుకు తెచ్చే కంచు పాత్రలు.. వాటిలో పన్నీరు కలిపిన నీళ్లు.. అందులో తేలియాడే రంగురంగుల పూలతో కొత్త వన్నెలు అద్దుతున్నారు. ► బాసికాలు.. పెళ్లి కుమారునికి అలంకరించే మహారాజా తలపాగాలు.. సంప్రదాయ టోపీలు.. కాళ్లకు తొడిగే పాముకోళ్లు.. రోళ్లు.. రోకళ్లకు రకరకాల రంగులతో ముస్తాబులు.. పెళ్లి కుమార్తెకు కొత్తందాన్ని తెచ్చే అలంకరించే పూలజడలు.. ఖరీదైన జాకెట్లు.. చేతులకు కళాత్మక మెహందీలు.. ముఖానికి ఫేషియల్స్.. పెళ్లి కుమార్తెను తీసుకు వెళ్లే బుట్ట.. గొడుగు.. ఇలా వివాహ వైభవంలో ఎన్నో నూతన ఆకర్షణలు బంధుమిత్రులను కట్టిపడేస్తున్నాయి. ► శాస్త్ర సమ్మతమా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే.. వివాహ సమయంలో వధూవరుల మధ్య ఏర్పాటు చేసే తెరను సైతం అందంగా తీర్చిదిద్దుతున్నారు. వాటి మీద సీతారాములు, అలమేలుమంగా సమేత వేంకటేశ్వర స్వామి వంటి దేవతలను లేసు దారాల అల్లికలతో తీర్చిదిద్దుతూ.. ఆ సమయానికి దైవానుగ్రహం ప్రసరిస్తుందనే భావన కలిగిస్తున్నారు. ► వివాహ సమయంలో వధూవరుల చేతుల్లో పెట్టే కొబ్బరి బొండాలకు ముత్యాలు, పగడాలు, కెంపులతో కొత్త ఆకర్షణలు తీసుకువస్తున్నారు. ► సంప్రదాయ కర్పూర దండలు కొత్త రూపాల్లో కనువిందు చేస్తున్నాయి. ► తలంబ్రాలకు వాడే కొబ్బరి చిప్పలను సైతం అద్భుతంగా ముస్తాబు చేస్తున్నారు. ► వధూవరులతో పాటు పెళ్లి తంతులో జరిగే ప్రతి కార్యక్రమానికీ వినియోగించే ప్రతి వస్తువునూ ఎంతో మంది అద్భుత ప్రతిభతో కళ్లు తిప్పుకోలేని రీతిలో ముస్తాబు చేస్తున్నారు. ఫొటో షూట్లు వచ్చాక ఆకర్షణకు ప్రాధాన్యం పెళ్లికూతుళ్ల ముస్తాబు నుంచి కార్ల డెకరేషన్ వరకూ ప్రతి దానికి అదనపు ఆకర్షణలు అద్దుతున్నారు. ఫొటోల కోసం ప్రతి వస్తువునూ అందంగా తీర్చిదిద్దుతున్నారు. వధూవరుల అలంకరణే చిన్న సైజు పెళ్లిని తలపిస్తుంది. – శ్రీపతి ప్రకాష్, కల్వకొలను వీధి, అమలాపురం -
Fashion: లెహంగా ఒక్కటే కాదు.. పెళ్లిలో మరింత ఆకర్షణీయంగా కనిపించాలంటే!
Latest Fashion In Wedding Season- Matching Trends: వధువుకు వరుడిని మ్యాచ్ చేసినట్టే.. డ్రెస్‌కి ఆభరణాలను మ్యాచ్ చేసినట్టే... చేత పట్టుకునే బ్యాగ్‌నూ కాళ్లకు ధరించే చెప్పులనూ మ్యాచ్ చేద్దాం. చెవి జూకాలను, కాలి జూతీలను మ్యాచ్ చేద్దాం. లెహంగా అంచులను షూస్ ఎంబ్రాయిడరీతో మ్యాచ్ చేద్దాం. మ్యాచింగ్‌లో కొత్త ట్రెండ్‌కు వేదిక వేద్దాం. ఇది వివాహాది శుభకార్యాలు ఎక్కువగా జరిగే సీజన్. సాధారణంగా పెళ్లిలో పట్టు రెపరెపలు, ఎంబ్రాయిడరీ జిలుగులు కళ్లను మెరిపిస్తుంటాయి. వాటికి మ్యాచింగ్‌గా ఆభరణాల ఎంపిక ఉంటుంది. ఇప్పుడిక లెహంగా డిజైన్‌కు సరిపోయే మ్యాచింగ్ క్లచ్‌లు, పాదరక్షల ఎంపిక సరికొత్త ట్రెండ్ అయ్యింది. అందుకే నవ వధువులు కూడా తమ అలంకరణలో ప్రత్యేకత చాటాలనుకుంటున్నారు. వధువు తన వరుడి ఇంటి పేరును బ్యాగులపై జత చేర్చి భద్రంగా మండపానికి తీసుకువస్తుంది. లెహంగా పైన ఉన్న ఎంబ్రాయిడరీ జిలుగులను పొట్లీ వాలెట్‌తో మ్యాచ్ చేస్తుంది. విభిన్నంగా కనిపించాలనే తాపత్రయానికి కొత్త కొత్త హంగులు అదనంగా వచ్చి చేరుతున్నాయి. ఒక సర్వే ప్రకారం తేలిందేమంటే.. ఎవరైనా మనల్ని కలిస్తే, ముందుగా వారి కళ్ళు మన పాదాలపైకి వెళ్తాయి. అందువల్ల మేకప్, డ్రెస్సింగ్‌పై ఎంత శ్రద్ధ చూపుతారో, పాదరక్షల పట్ల కూడా సమాన శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. గతంలో వధువులకు పాదరక్షల గురించి పెద్దగా అవగాహన ఉండేది కాదు. గోల్డెన్, రెడ్ మెరూన్ వంటి సాధారణ రంగుల ఫుట్‌వేర్ మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉండేవి. బ్రైడల్ లెహంగాలు కూడా పరిమిత రంగులతో ఉండటమే దీనికి కారణం. నేడు వధువులు తమ మేకప్లోకి ప్రతి రంగునూ ఆహ్వానిస్తున్నారు. అందుకు సరిపోయే పాదరక్షలు, హ్యాండ్ బ్యాగ్లకూ ప్రాధాన్యత ఇస్తున్నారు. వివాహాది శుభకార్యాల వంటి ప్రత్యేక సందర్భాలలో రూపొందించిన పాదరక్షలు, బ్యాగ్‌ల మెటీరియల్‌ను. సిల్క్, వెల్వెట్, శాటిన్, వేగన్ లెదర్‌తో రూపొందిస్తారు. వాటిపై మోటిఫ్, జర్దోసీ, మోతీ, జరీ, దబ్కా, థ్రెడ్ వర్క్‌తో మెరిపిస్తారు. దీనివల్ల ఈ అలంకారాలన్నీ మరింత అందంగా కనిపిస్తాయి. చదవండి👉🏾Beauty Tips: మామిడి పండు గుజ్జు, ఓట్స్.. ట్యాన్, మృతకణాలు ఇట్టే మాయం! చదవండి👉🏾Hair Care Tips: వాల్నట్స్ తింటున్నారా.. ఇందులోని ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ వల్ల -
గోల్డ్ రష్
సాక్షి, అమరావతి బ్యూరో: పుత్తడి ధర అందనంతగా పరుగులు తీస్తోంది. బంగారం రోజురోజుకూ ప్రియమవుతోంది. పెళ్లిళ్ల సీజన్ ఆరంభమైన తరుణంలో పసిడి ధరలు ప్రియం కావడం శుభకార్యాలు నిర్వహించే కుటుంబాలకు భారంగా మారుతోంది. విజయవాడలో జనవరి రెండో వారంలో పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.50 వేల లోపు, 22 క్యారెట్ల ధర రూ.46 వేల వరకు ఉంది. ప్రస్తుతం విజయవాడ, విశాఖలో 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర రూ.50,470 ఉంది. అంటే మూడు నెలల్లో 10 గ్రాములపై రూ.4,200 నుంచి 4,500కిపైగా పెరిగింది. బంగారం మరింత ఎగబాకే అవకాశం ఉందని చెబుతున్నారు. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఇంట్లో వివాహ వేడుకలకు కనీసం నాలుగైదు తులాల (45–55 గ్రాముల) బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. పెరుగుతున్న కొనుగోళ్లు.. పసిడి ధర అమాంతం పెరుగుతున్నప్పటికీ శుభకార్యాలు నిర్వహించే కుటుంబాలకు కొనుగోలు చేయక తప్పడం లేదు. పెళ్లిళ్ల సీజను మొదలు కావడం, బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న ప్రచారంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మూడు నాలుగు నెలల క్రితంతో పోల్చితే ప్రస్తుతం బంగారం అమ్మకాలు బాగున్నాయని విజయవాడ వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన జ్యుయలరీ షాపు యజమాని నరేంద్ర ‘సాక్షి’కి తెలిపారు. కారణాలివీ.. ఆభరణాల కోసమే కాకుండా ఎలక్ట్రానిక్ డివైస్ల తయారీలోనూ బంగారాన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఉత్పత్తి రంగాలు పుంజుకుంటున్నాయి. దీంతో ఎలక్ట్రానిక్ డివైస్ల తయారీ కూడా ఊపందుకుంటోంది. మరోవైపు రష్యా–ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు గణనీయంగా పెరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం, బంగారంపై పెట్టుబడులు సురక్షితమనే ఉద్దేశం, బ్యాంకుల వడ్డీ రేట్లు క్షీణించడం, షేర్ మార్కెట్లలో అనిశ్చితి.. వెరసి పసిడి ధరల పెరుగుదలకు ప్రత్యక్ష, పరోక్షంగా దోహదం చేస్తున్నాయని బులియన్ మార్కెట్ వర్తకులు విశ్లేషిస్తున్నారు. -
పెళ్లి వేడుకలు.. ఘనమైన అలంకారాలతో.. ప్రాచీన కళకు కొత్త హంగులు
సంప్రదాయ వేడుకల్లో తెలుగింటి వేషధారణకే అగ్రతాంబూలం ఉంటుంది. అయితే, రాచకళ తీసుకు రావాలన్నా, మరిన్ని హంగులు అమరాలన్నా ప్రాచీనకాలం నాటి డిజైన్స్‌కే పెద్ద పీట వేస్తున్నారు నేటి డిజైనర్లు. ‘నవతరం కోరుకుంటున్న హంగులను కూడా సంప్రదాయ డ్రెస్సులకు తీసుకువస్తున్నాం’ అని చెబుతున్నారు వెడ్డింగ్ డ్రెస్ డిజైనర్ భార్గవి అమిరినేని. కాబోయే పెళ్లికూతుళ్లు కోరుకుంటున్న డ్రెస్ డిజైన్స్ గురించి ఈ విధంగా వివరిస్తున్నారు.. ‘కలంకారీ ప్రింట్స్, బెనారస్, కంచి పట్టులను సంప్రదాయ డిజైన్స్‌కు వాడుతుంటారు. అయితే, నవతరం మాత్రం వీటితోనే ఆధునికపు హంగులను కోరుకుంటున్నారు. ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్‌తోనే వెస్ట్రన్ కట్ కోరుకుంటున్నారు. నెక్, హ్యాండ్ డిజైన్స్ విషయంలోనే కాదు తమ ‘ప్రేమకథ’కు కొత్త భాష్యం చెప్పేలా ఉండాలని పెళ్లి కూతుళ్లు కోరుకుంటున్నారు. అందుకే వివాహ వేడుకలకు మరింత కొత్త హంగులు వచ్చి చేరుతున్నాయి. రంగుల కాంబినేషన్లు మాత్రం వేడుకను బట్టి మారిపోతున్నాయి. వీటిలో పేస్టల్ నుంచి గాఢమైన రంగుల వరకు ఉంటున్నాయి. డబుల్ లేయర్ దుపట్టాలు, లేయర్డ్ స్కర్ట్, టాప్స్.. కూడా వీటిలో ఎక్కువ ఉంటున్నాయి’ అని వివరించారు. వివాహ వేడుకలకు సిద్ధమవ్వాలంటే ఘనమైన అలంకారాలతో గొప్పగా సింగారించాలనుకుంటారు. అందుకు తగినట్టే నేటి వేడుకలకు తరతరాలుగా వస్తున్న ప్రాచీన కళకు కొత్త హంగులను అద్దుతున్నారు. మహారాణి దర్పం పెళ్లి కూతురు వేషధారణలో కంచి పట్టుచీర తప్పక ఉంటుంది. దీనికి కాంబినేషన్ బ్లౌజ్‌తోపాటు కుడివైపున వేసుకునే దుపట్టా కూడా ఓ హంగుగా అమరింది. దుపట్టాను బ్లౌజ్‌కు సరైన కాంబినేషన్ సెట్ అయ్యేలా మెజెంటా కలర్‌ను ఎంచుకొని, గ్రాండ్‌గా మగ్గం వర్క్‌తో మెరిపించడంతో లుక్ మరింత ఆకర్షణీయంగా మారింది. కాస్ట్యూమ్తోపాటు ఆభరణాలు కూడా పాతకాలం నాటివి ఎంపిక చేయడంతో రాయల్ లుక్ వచ్చేసింది. ఈ గెటప్‌కి వడ్డాణం లేదా వెయిస్ట్ బెల్ట్ యాడ్ చేసుకోవచ్చు. దుపట్టాను అవసరం అనుకుంటే వాడచ్చు. లేదంటే, ఎప్పటికీ గుర్తుగా కూడా ఉంచుకోవచ్చు. ఎంబ్రాయిడరీ బ్రోచ్లు కూడా అలంకరణలో వచ్చి చేరుతున్నాయి. కాన్సెప్ట్ బ్లౌజ్ పెళ్లికూతురు డ్రెస్ అనగానే అందరికన్నా ప్రత్యేకంగా కనిపించాలనే తాపత్రయం ఉంటుంది. దీంట్లో భాగంగా పెళ్లికూతురు ధరించే బ్లౌజ్పైన అమ్మాయికి అబ్బాయి తన ప్రేమను వ్యక్తపరుస్తున్నట్టుగా, అలాగే వారి పేర్లూ వచ్చేలా డిజైన్ చేయడంతో గ్రాండ్‌గా కనిపిస్తుంది. ఆభరణాల్లో ఉండే పచ్చలు, కెంపులు బ్లౌజ్ డిజైన్లలోనూ వాడుతున్నారు. ఈ బీడ్స్ ధరించే ఆభరణాలకు మ్యాచ్ అయ్యేలా చూసుకుంటున్నారు. పెద్దంచు మెరుపు సంప్రదాయ లుక్ ఎప్పుడూ అందానికి సిసలైన నిర్వచనంలా ఉంటుంది. పెద్ద అంచు లెహంగా మీదకు ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్, దుపట్టా జత చేస్తే చాలు వేడుకలో ఎక్కడ ఉన్నా అందంగా కనిపిస్తారు. అయితే, హాఫ్ శారీ అనగానే గతంలో దుపట్టాలను ఓణీలా చుట్టేసేవారు. ఇప్పుడు ఒకే వైపున వేసుకోవడం కూడా ఫ్యాషన్‌లో ఉంది. డిజైన్స్లోనే కాదు అలంకారంలోనూ వచ్చిన మార్పు మరింత మెరుపునిస్తుంది. కలంకారికి మిర్రర్ ప్రాచీనకాలం నుంచి వచ్చిన మనవైన కళల్లో కలంకారీ ఒకటి. ఇప్పుడు ఈ ఆర్ట్‌పీస్ మరింత ఘనంగా సందడి చేస్తోంది. కలంకారీ క్రాప్టాప్కు మిర్రర్‌తో హ్యాండ్స్, నెక్‌లైన్‌ను డిజైన్ చేయడం ఈ డ్రెస్ స్పెషల్. బ్రొకేడ్ లెహెంగా మీదకు ఈ కలంకారీ బ్లౌజ్ జత చేయడంతో మరింత గొప్పగా అమరింది. – నిర్మలారెడ్డి -
Omicron impact: పెళ్లిళ్లపై ఒమిక్రాన్ పంజా, వ్యాపారం కుదేలు!
-
Omicron impact: పెళ్లిళ్లపై ఒమిక్రాన్ పంజా, వ్యాపారం కుదేలు!
సాక్షి, హైదరాబాద్: పెళ్లిళ్లు, ఫంక్షన్లపై కరోనా మహమ్మారి మరోసారి ప్రభావం చూపనుందా? 2021లో పెళ్లి ముహూర్తాలు జోరుగా సాగాయన్న సంతోషం ఎంతో కాలం నిలవకముందే తాజాగా ఒమిక్రాన్ పంజా విసురుతోంది. దీంతో పెళ్లి వాయిదా వేసుకోవాలా? వద్దా , గెస్ట్ల్లో ఎవర్ని తగ్గించాలి రా బాబూ అనే మీమాంసలో పడిపోయారు జనం. మరోవైపు ఈ కల్లోలంతో పెళ్లిళ్ల సీజన్ కోసం ముస్తాబవుతున్న ఫంక్షన్ హాల్స్ వెలవెలబోనున్నాయనే భయం బిజినెస్ వర్గాలను వెంటాడుతోంది. ఈ సీజన్‌పై ఆధారపడ్డ ఇతర వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి? నిపుణులు ఏమంటున్నారు. అలనాటి రామచంద్రుడి కన్నింటాసాటి అనే మురారి సినిమాలోని పెళ్లి పాట గుర్తుందా.. బ్యాండ్ బాజా బారాత్ అంటూ ఆ లెవల్లో పెళ్లి చేసుకోవాలని ఈ కాలపు పెళ్లీడు పిల్లలు ముచ్చపడుతుంటారు. అలాగే ఆకాశమంత పందిరి, భూదేవి అంతపీట వేసి బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభోగంగా పెళ్లి వేడుకను సంబరంగా జరిపించాలని పేరెంట్స్ కూడా కోరుకుంటారు. అయితే కరోనా ఎంటర్ అయినప్పటి నుంచి ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏ క్షణంలో కేసులు పెరుగుతాయో..ఏ నిమిషంలో ఎలాంటి ఆంక్షలు అమల్లోకి వస్తాయో తెలియని గందరగోళ పరిస్థితి 2022లో కూడా వెంటాడుతోంది. జనవరి -మార్చి నెలల కాలాన్ని శుభప్రదమైన పెళ్లిళ్ల సీజన్‌గా భావిస్తాం. పరిశ్రమ అంచనాల ప్రకారం జనవరి 14, మార్చి 31 కాలంలో 30 లక్షల ముహూర్తాలు ఖరారైనాయి. తద్వారా దాదాపు రూ. 4 లక్షల కోట్ల వ్యాపారం జరగనుందని భావించారు. దీంతో డిమాండ్‌కు తగ్గట్టుగా వ్యాపారులు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా ఉన్న బాంక్వెట్ హాళ్లు, హోటళ్లు, మ్యారేజ్ లాన్లు, ఫామ్‌హౌస్‌లు తదితరాలు పూర్తి స్థాయిలో ముస్తాబయ్యాయి. అంతేనా ఫైవ్ స్టార్ హోటల్స్, క్యాటరింగ్, డెకరేషన్, క్రాకరీ, లాజిస్టిక్స్, వీడియోగ్రాఫర్లు, బ్యాండ్లు, డీజేలు, లైటింగ్, టెంట్లు, ఇలా ఎండ్-టు-ఎండ్ వెడ్డింగ్ సొల్యూషన్స్ సంస్థలు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు కూడా చాలా ఆశలు పెట్టుకున్నాయి. ఇక పట్టు వస్త్రాలు, డిజైనర్ దుస్తులు, వెండి బంగారు, ఇతర ఆభరణాలు, పాదరక్షలు తదితర వ్యాపారాలు సీజన్‌కు తగ్గట్టుగా ఫుల్‌గా ప్రిపేర్ అయిపోయాయి. కానీ తాజా పరిస్థితులు సంబంధిత వ్యాపారాలను దెబ్బతీయనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల ఉధృతి, ఫిబ్రవరి నాటికి కరోనా థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌కు చేరుకుంటుందన్న నిపుణుల హెచ్చరికలతో పెళ్లిళ్ల వాయిదాకు లేదా, సాధ్యమైనంత తక్కువ మందితో ఆ వివాహ తంతును ముగించేందుకు జనం సిద్ధపడుతున్నారు. ఈ మేరకు తమ ఇప్పటికే క్యాన్సిలేషన్ ఆర్డర్లు చాలా వచ్చాయని వెడ్డింగ్ ప్లానర్లు తెలిపారు. ఈ సీజన్లో వెడ్డింగ్ బిజినెస్ నాలుగు లక్షల కోట్ల రూపాయల నుంచి 1.5 లక్షల కోట్లకు తగ్గే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు. ఈ సారి సీజన్ బావుంటుందని భావించాం కానీ, పరిస్థితి మళ్లీ మొదటి కొచ్చింది, జనవరిపై ఆశల్లేవు అంటూ ఫెర్న్స్ అండ్ పెటల్స్ ఎండీ, వ్యవస్థాపకుడు వికాస్ గుట్గుటియా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే 2020లో నాటి తీవ్ర ప్రభావం ఉండక పోవచ్చని మాట్రిమోనీ.కాం ఫౌండర్ మురుగవేల్ జానకిరామన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నిబంధనలకు అనుగుణంగా షిప్ట్ వెడ్డింగ్స్‌పై జంటలు మొగ్గు చూపే అవకాశం ఉందన్నారు. పెళ్లిళ్లను వాయిదా వేయకుండా, వేదిక మార్చుకోవడమో, బ్యాచ్‌ల వారీగా అతిథులను అనుమతించి వేడుకను ముగించుకొని, ఆ తరువాత గ్రాండ్‌గా రిసెప్షన్ ఇచ్చుకునే అవకాశముందని నమ్ముతున్నామన వెడ్డింగ్‌వైర్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్-మార్కెటింగ్ అనమ్ జుబైర్ అన్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. దేశంలో ఓ వైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 1,892కు చేరుకుంది.దీంతో కేసులు లోడ్ ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర , పశ్చిమ బెంగాల్ వివాహాలకు వచ్చే అతిథుల సంఖ్యను 50కి పరిమితం చేయగా, రాజస్థాన్‌లో ఇది 100గా ఉంది. ఢిల్లీలో 20 మంది అతిథులకు మాత్రమే అనుమతి. రాబోయే రోజుల్లో మరిన్ని ఆంక్షలు అమల్లోకి వస్తే ఈ సీజన్ వ్యాపారంపై ప్రభావం భారీగాపడే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
తరుముతున్న థర్డ్‌వేవ్: ‘ఫిబ్రవరి వద్దు.. డిసెంబర్లోనే కానివ్వండి పంతులు గారూ’
సాక్షి, బాన్సువాడ(నిజామాబాద్): కరోనా విజృంభనతో గత ఏడాది వివాహాల కళ తప్పింది. నిబంధనల మధ్య కొద్ది మందితో, నిరాడంబరంగా పెళ్లిల్లు జరపాల్సి వచ్చింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే వివాహాలకు కళ వచ్చింది. పెళ్లిళ్ల సందర్భంగా ఫంక్షన్‌హాల్స్ జనంతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా వివాహాల హడావుడే కనబడుతోంది. కానీ మళ్లీ ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ వస్తుందనే ప్రచారంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. గత రెండేళ్లలో జరిగిన కరోనా పెళ్లిళ్లను గుర్తు చేసుకుంటూ ముందస్తుగా డిసెంబర్లోనే పెళ్లిళ్లను జరిపిస్తున్నారు. ఎప్పుడు, ఏమవుతుందోనని.. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభించకముందే ప్రజలు పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిపించాలనుకుంటున్నారు. ఈక్రమంలో డిసెంబర్లో 12,14,16,19,21, 22,24,26 27,28, 29రోజులలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో ముందుముందు పరిస్థితులు ఎలా ఉంటాయని భయపడుతూ.. ముందస్తుగా డిసెంబర్లోనే పెళ్లి తంతు ముగించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోను ముహుర్తాలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నా ముందుగానే పెళ్లికి ముహుర్తాన్ని ఖరారు చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 6 నుంచి 22వరకు ముహుర్తాలు ఉన్నాయంటు పలువురు పండితులు తేదీలను నిర్ణయించినా కూడా ఆ సమయానికి ఒప్పుకోవడం లేదు. చదవండి: అడగండి అది మన హక్కు..పెట్రోల్ బంకుల్లో ఈ ఆరు సేవలు ఉచితం థర్డ్‌వేవ్ వచ్చే ప్రమాదం.. ప్రస్తుతం పెళ్లిళ్ల సందడి, జనం గుంపులుగా తిరగడం చేస్తుండటం వల్ల థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉంది. దీంతో ఇప్పటినుంచే జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని పలువురు పేర్కొంటున్నారు. చదవండి: వేమనపల్లి ప్రాణహిత తీరంలో ఏళ్లనాటి డైనోసార్ శిలాజాలు డిసెంబర్లో జోరుగా పెళ్లిళ్లు జనాలు థర్డ్‌వేవ్ వస్తుందన్న భయంతోనే డిసెంబర్లోనే పెళ్లి చేయాలని అంటున్నారు. దీంతో పురోహితులు ముహూర్తం ఉన్న రోజు రెండు నుంచి మూడు పెళ్లిళ్లు చేస్తున్నారు. ఫిబ్రవరిలో సైతం ముహుర్తాలు ఉన్నాయి. –వెంకటేష్పంతులు, దుర్కి మూణ్నాలుగు పెళ్లిళ్లకు వెళ్తున్నా.. డిసెంబర్ నెలలో ముహుర్తాలు చాలా ఉండటంతో రోజు మూడు నుంచి నాలుగు పెళ్లిళ్లకు హాజరవ్వాల్సి వస్తుంది. కొన్ని పెళ్లిళకు ప్రయాణం దూరం కావడంతో కొన్ని పెళ్లిళ్లకే హాజరవుతున్నాను. కొన్ని పెళ్లిళ్లకు వెళ్లడానికి సమయం సైతం సరిపోతలేదు. –పెర్క రాజు, మైలారం -
ఈ మూడు నెలలు జాగ్రత్తగా ఉండండి
న్యూఢిల్లీ: పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరిగే ప్రమాదముందని ఈ మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో సాధ్యమైనంత వరకు జనం గుమికూడే చోటుకు వెళ్లొద్దని సూచించింది. అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని, ఆన్లైన్ పద్ధతుల్లోనే షాపింగ్ చేసుకోవాలని కోరింది. మహమ్మారి సెకండ్‌వేవ్ ఇంకా ముగియలేదని పునరుద్ఘాటించిన కేంద్ర ఆరోగ్య శాఖ.. ప్రస్తుతానికి పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ ఇప్పటికీ దేశంలో రోజువారీ కేసులు 20 వేల వరకు నమోదవుతున్నాయని గుర్తు చేసింది. ‘‘ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉందని, ఏమరుపాటు తగదు. మహమ్మారి ఇంకా మనమధ్యే ఉంది. అప్రమత్తంగా లేకుంటే అనుకోకుండా పరిస్థితి విషమించవచ్చు’ అని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ గురువారం మీడియాతో అన్నారు. దేశంలోని 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 34 రాష్ట్రాల్లో వారం పాజిటివిటీ రేట్ 10%కి మించి ఉందన్నారు. దేశంలోని అర్హులైన 71% మంది కనీసం ఒక్క డోసైనా కోవిడ్ టీకా వేయించుకోగా, వీరిలో 27% మందికి రెండు డోసులు పూర్తయిందని వివరించారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ కొరత లేనే లేదని స్పష్టం చేశారు. ఒక వేళ రోజువారీ కరోనా కేసులు 4.5–5 లక్షల వరకు పెరిగితే పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో 8.36 లక్షల పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరో 1.35 లక్షల ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. -
భయం లేకే కోవిడ్ వ్యాప్తి
న్యూఢిల్లీ: కోవిడ్ వైరస్ సోకుతుందన్న భయం లేకపోవడం, స్థానిక సంస్థల ఎన్నికలు, పెళ్లిళ్ల సీజన్ వెరసి మహారాష్ట్రలో భారీగా కేసులు నమోదవుతున్నాయని కేంద్రం ఆదివారం తెలిపింది. కోవిడ్ కేసుల పెరుగుదలను పరిశీలించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ నిపుణుల బృందం గతవారంలో రాష్ట్రంలో పర్యటించింది. చాలా అంశాలున్నాయి.. కోవిడ్ వ్యాప్తికి నిర్ణీత కారణాన్ని చెప్పలేమని, కేసుల పెరుగుదల చాలా అంశాల మిళితం వల్ల జరుగుతోందని చెప్పారు. వాటిలో రోగం పట్ల భయం లేకపోవడం, మహమ్మారి పట్ల ఉదాసీనత, సూపర్ స్ప్రెడర్లను గుర్తించలేకపోవడం, ఎన్నికల్లో సరైన కోవిడ్ నిబంధనలు పాటించలేకపోవడం, పెళ్లిళ్ల సీజన్ కావడం, పాఠశాలలు తెరవడం, గుంపులు గుంపులుగా ప్రయాణాలు చేయడం వంటి కారణాల వల్ల కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని కేంద్రం నివేదిక ద్వారా వెల్లడించింది. ప్రస్తుత కేసుల్లో చాలా వరకు లక్షణాలు లేని రోగులే ఉంటున్నారని, అలాంటి వారికి అవగాహన కల్పించడంలో విఫలం కావడం కూడా కారణమని చెప్పింది. ఇప్పటికైనా మేలుకొని అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించింది. డాక్టర్లలోనూ ఉదాసీనత.. డాక్టర్లలో ప్రత్యేకించి ప్రైవేటు డాక్లర్లు కొన్ని కేసులను కేవలం ఫ్లూగా కొట్టిపారేస్తూ టెస్టుల వరకూ వెళ్లనివ్వట్లేదని.. కోవిడ్ రోగులను జూనియర్ డాక్టర్లకు వదిలేస్తున్నారని దీంతో కోవిడ్ తీవ్రత పెరుగుతోందని కేంద్రం పేర్కొంది. కోవిడ్ నియంత్రణ కోసం కంటితుడుపు చర్యలు తీసుకోకుండా పని చేయాలని, ప్రత్యేకించి రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో పని చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు ఉంటాయని తెలిపింది. ఎంత మందికి వ్యాక్సినేషన్ చేస్తామన్నారో, ఎందరికి వ్యాక్సిన్ వేశారో చెప్పాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరిందని మహారాష్ట్రలో పర్యటించిన బృందం తెలిపింది. కేంద్రం స్థాయిలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తే ఈ వివరాలు తెలుస్తాయని ముఖ్యమంత్రి సూచించినట్లు చెప్పింది. -
ఇక ముహూర్తాల్లేవ్!
సాక్షి హైదరాబాద్: ఈ ఏడాది పెళ్లి ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయని పండితులు తేల్చి చెబుతున్నారు. దీంతో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నవారు నిరుత్సాహానికి గురవుతున్నారు. గురు మౌఢ్యమితో పాటు శుక్ర మౌఢ్యమి సైతం వెనువెంటనే రావడంతో పెళ్లి ముహూర్తాలకు అడ్డంకి అవు తోందని, దీంతో శుక్రవారం వరకే పెళ్లి ముహూర్తా లు ముగిశాయని, ఇక ఈ ఏడాది మే నెల వరకూ మంచి రోజులు లేవని పండితులు స్పష్టం చేస్తున్నారు. మే 14 తర్వాతే.. ఈ నెల 14న శూన్యమాసం ప్రారంభం కానుంది. ఇది ఫిబ్రవరి 12 వరకూ కొనసాగనుంది. శూన్యమాసంలో శుభముహూర్తాలు ఉండవు. అంటే సుమారు నెల రోజుల పాటు గురుమౌఢ్యమి ఉంటుందని పండితులు తెలిపారు. ఇక ఫిబ్రవరి 14న మాఘ శుద్ధ తదియ నుంచి మే 4వ తేదీ బహుళ అష్టమి వరకూ అంటే 80 రోజుల పాటు శుక్రమౌఢ్యమి ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత శుభదినాలు ప్రారంభమైనప్పటికీ 10 రోజులు పాటు బలమైన ముహూర్తాల్లేవని అంటున్నారు. మే 14 తర్వాత మంచి ముహూర్తాలు ఉన్నప్పటికీ అవి కొద్ది రోజులు మాత్రమే. జూలై 4 నుంచి ఆషాఢమాసం ప్రారంభమై ఆగస్టు 11తో ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు చేసుకునేందుకు మంచి రోజులు కావని పండితులు అంటున్నారు. గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి ఇలా రెండు వరుసగా కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇవి చెడు ప్రభావాన్ని కలిగించనప్పటికీ ఈ రోజులలో పెళ్లిళ్లకి అంత మంచి రోజులైతే కాదని చెబుతున్నారు. నిరుడు కరోనా కాటు...ఇప్పుడు ముహూర్తాల లోటు పెళ్లి ముహూర్తాలు లేకపోవడంతో ఇటు పెళ్లీడుకొచ్చిన యువతీ యువకులు, అటు తల్లిదండ్రులు నిరాశ చెందుతున్నారు. అసలే గతేడాదంతా కరోనా సమస్యలతో శుభకార్యాలు తక్కువగా జరిగాయి. ఈ ఏడాదైనా కాస్త వెసులుబాటు వస్తుందని భావిస్తే..ముహూర్తాలు దెబ్బతీశాయని వారంటున్నారు. ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు, అర్చకులు, పూలు, పండ్ల వ్యాపారులకు కూడా ఇది నష్టం కలిగించే అంశమే. ముహూర్తాలు తక్కువే.. ఈ ఏడాది తెలుగు మాసాల్లో ఒక మాసం అధికంగా వచ్చింది. కాబట్టి ఎలాంటి శుభకార్యాలు చేయరు. నిజ మాసంలో..అది కూడా బలమైన ముహూర్తం ఉంటేనే శుభకార్యాలు నిర్వహస్తారు. ఇంగ్లీషు సంవత్సరం ప్రకారం ఈ ఏడాది ప్రారంభం నుంచి దాదాపు ఐదు నెలల వరకు మంచి రోజులు లేవు, మిగిలిన రోజుల్లో కూడా బలమైన ముహూర్తాలు ఎక్కువగా లేవు. –బాచిమంచి చంద్రమౌళి, సిద్ధాంతి -
నాలుగు నెలల దాకా పెళ్లిళ్లు లేనట్టే!
సాక్షి, కదిరి: కొత్త సంవత్సరం వచ్చిందన్న ఆనందంతో యువత కేరింతలు కొడుతుంటే.. ఈ ఏడాది పెళ్లి ముహూర్తాలు తక్కువేనని పండితులు చెబుతుండటంతో పెళ్లీడుకొచ్చిన వారిని నిరుత్సాహ పరుస్తున్నాయి. గురు మౌఢ్యమితో పాటు శుక్ర మౌఢ్యమి సైతం వెనువెంటనే రావడంతో పెళ్లి ముహూర్తాలకు కాస్త అడ్డంకిగా మారుతోంది. ఈ నెల 8వ తేదీ వరకే పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఉన్నాయని, ఇంకా చెప్పాలంటే 7వ తేదీనే చివరి మంచి ముహూర్తమంటూ సిద్ధాంతులు చెబుతున్నారు. ఆ తర్వాత మే నెల వరకూ మంచి ముహూర్తాలు లేవని అంటున్నారు. మే 14న బలమైన ముహూర్తం ఈ నెల 8తో పెళ్లి ముహూర్తాలకు శుభం కార్డు పడితే, తిరిగి ఈ ఏడాది మే 14న మంచి ముహూర్తం ఉంది. అప్పటి నుంచి పెళ్లిళ్ల సీజన్ మళ్లీ ప్రారంభం కానుంది. ఈ నెల 14న శూన్యమాసం ప్రారంభం కానుంది. ఇది ఫిబ్రవరి 12 వరకూ కొనసాగనుంది. శూన్యమాసంలో శుభముహూర్తాలు అనేవేవీ ఉండవని అర్చకులు అంటున్నారు. ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 12 వరకూ అంటే సుమారు నెల రోజుల పాటు గురు మౌఢ్యమి ఉంటుందని అర్చక స్వాములు అంటున్నారు. 80 రోజుల పాటు శుక్ర మౌఢ్యమి ఈ ఏడాది ఫిబ్రవరి 14 మాఘ శుద్ధ తదియ నుంచి మే 4వ తేదీ బహుళ అష్టమి వరకూ అంటే 80 రోజుల పాటు శుక్ర మాఢ్యమి ఉంటుందని సిద్ధాంతులు చెబుతున్నారు. ఆ తర్వాత శుభ దినాలు ప్రారంభమైనప్పటికీ 10 రోజులు పాటు అంత బలమైన ముహూర్తాలు లేవని అంటున్నారు. మే 14 నుంచి బలమైన ముహూర్తాలు ఉంటాయని పేర్కొంటున్నారు. జూలై 4 నుంచి ఆషాఢం ఈ ఏడాది మే 14 తర్వాత మంచి ముహూర్తాలు ఉన్నప్పటికీ అవి కొద్ది రోజలు మాత్రమేనని పండితులు అంటున్నారు. జూలై 4 నుంచి ఆషాఢమాసం ప్రారంభమై ఆగస్టు 11తో ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు చేసుకునేందుకు మంచి రోజులు కావని చెబుతున్నారు. 2021లో బలమైన ముహూర్తాల కొరత ఎక్కువగానే ఉంటోందని అర్చకులు అంటున్నారు. ఇన్నాళ్లూ కోవిడ్–19 ప్రభావంతో పెళ్లిళ్లు బ్రేక్ పడితే మళ్లీ నెలల తరబడి సుముహూర్తాలు లేవనే అంశం పెళ్లిపీటలు ఎక్కబోయే వారిని నిరుత్సాహపరుస్తున్నాయి. రెండు మూఢాలు రావడం అరుదు గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి ఇలా రెండు వరుసగా కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇవి చెడు ప్రభావాన్ని కలిగించనప్పటికీ ఈ రోజుల్లో పెళ్లిళ్లు చేయడానికి అంత మంచి రోజులైతే కాదు. అలాగని శాస్త్రీయంగా చెడు జరుగుతుందనేందుకూ సరైన ఆధారాల్లేవు. అయితే జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన ఘట్టం. కాబట్టి మంచి ముహూర్తంలో చేసుకోవడం మంచిది. – ఏవీ నరసింహాచార్యులు, ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు, కదిరి -
ముహూర్తాలకు నేటితో ‘శుభం’
సాక్షి, హైదరాబాద్: కరోనా, లాక్డౌన్ నిబంధనలతో ఇప్పటివరకు నిరాడంబరంగా కొనసాగుతూ వస్తున్న శుభకార్యాలకు ఇక తెరపడనుంది. శుక్రవారంతో శుభ ముహూర్తాలు ముగియనున్నాయి. మరో రెండు నెలల వరకు వివాహ, శుభకార్యాల ముహూర్తాలు లేవు. కరోనా కట్టడిలో భాగంగా దేశమంతా మార్చి 22 నుంచి లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. అప్పట్నుంచి రెండున్నర నెలల పాటు అత్యవసర సేవలు, నిత్యావసర సరుకుల విక్రయ దుకాణాలు మినహా మిగతావన్నీ మూతబడ్డాయి. అసలే వివాహాలు, శుభకార్యాలు జోరుగా సాగే సమయంలో లాక్డౌన్ విధించడంతో వీటి నిర్వహణ అయోమయంలో పడింది. ఇంతలో కాస్త వెసులుబాటునిస్తూ అతి తక్కువ మందితో భౌతికదూరం పాటిస్తూ, మాస్కులు ధరించి ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. దీంతో శుభకార్యాలను వాయిదా వేసుకుందామనుకున్న వారంతా నిరాడంబరంగా చేసుకునేందుకే ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్‌లాక్ ప్రక్రియ కొనసాగుతుండగా, లాక్డౌన్ సీజన్లోనే మంచి ముహూర్తాలు దాదాపు వెళ్లిపోయాయి. ఇక, ఆగస్టు 14.. చివరి శుభ ముహూర్త తేదీ. ఈరోజు తప్పిందంటే శుభకార్యాలు చేసుకునే వారంతా మరో రెండున్నర నెలలు ఆగాల్సిందేనని పురోహితులు చెబుతున్నారు. (పాప తుమ్మిందనీ.. 30వేలు సమర్పయామి..) మళ్లీ దసరా తర్వాతే.. శ్రావణ బహుళ దశమితో ప్రస్తుతం శుభకార్యాల ముహూర్తాలు ముగుస్తున్నాయి. భాద్రపద మాసంలో ఎక్కువగా పితృదేవతలకు నిర్వహించే కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తుండడంతో శుభ కార్యాలకు మంచి ముహూర్తాలు ఉండవు. తరువాత వచ్చే ఆశ్వయుజం అధిక మాసం వస్తుండడంతో శుభకార్యాలకు మరో నెల రోజులు బ్రేక్ పడనుంది. అనంతరం దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాక మళ్లీ శుభ ముహూర్తాలు ఉన్నాయని పంచాంగకర్తలు చెబుతున్నారు. దీంతో శుభకార్యాలు చేసుకునే వారంతా దాదాపు రెండున్నర నెలల పాటు ఆగాల్సిందే. మరోపక్క ఈ నెల 31తో అన్‌లాక్ 3.0 ముగియనుంది. వచ్చే నెలలో మరిన్ని కార్యకలాపాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతివ్వనుంది. మరో రెండు నెలల్లో క్రమంగా అన్ని రంగాలు తెరుచుకుంటాయని, తిరిగి శుభ ముహూర్తాలు దగ్గరపడే నాటికి లాక్డౌన్ పూర్తిగా తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. (33 రూపాయలకే కరోనా ట్యాబ్లెట్) -
కల్యాణం.. కరోనా ముళ్లు!
చెన్నేకొత్తపల్లి మండలం పెనుబోలు గ్రామానికి చెందిన పోతలయ్య మోతుబరి రైతు. తన కుమార్తె పావని వివాహం ఈ శ్రావణ మాసంలో ఆగస్టు 1, 2 తేదీల్లో చేయాలని నిర్ణయించాడు. బంధువులందరినీ పిలిచి ఘనంగా చేయాలని భావించాడు. కానీ కరోనా పరిస్థితుల్లో విధిలేక 20 మంది బంధువుల సమక్షంలో కల్యాణం జరిపించాల్సి వస్తోంది. ఇక నగరానికి చెందిన శివశంకర్ రెడ్డి లాయర్. తన కుమారుని వివాహం భారీగా చేయాలని భావించినప్పటికీ కరోనా కేసుల కలకలంతో ప్రభుత్వ సూచనలకు లోబడి తక్కువ మందితోనే పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది ఆర్భాటంగా పిల్లల పెళ్లిళ్లు జరిపించాలని భావించినా కరోనా నేపథ్యంలో ప్రభుత్వ సూచన మేరకు అతితక్కువ మంది సమక్షంలో కానిచ్చేస్తున్నారు. అనంతపురం: ఇన్నిరోజులూ పెళ్లి చేయాలంటే కనీసం నాలుగు నెలల ముందు నుంచే ఏర్పాట్లలో మునిగిపోయేవారు. పెళ్లి పత్రికలు మొదలుకుని వేదిక, డెకరేషన్, వంటకాలు, ఆర్కెస్ట్రా, బంధుమిత్రుల కలయిక ఇలా ప్రతి విషయంలోనూ ఎంతో ఆర్భాటం చేసేవారు. ఖర్చు విషయంలో వెనుకాడేవారు కాదు. అయితే ప్రస్తుతం కరోనా పుణ్యమా అని పరిస్థితి పూర్తిగా మారింది. కేవలం 20 మంది సమక్షంలోనే పెళ్లి తంతును పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పెళ్లిళ్ల సీజన్ షురూ... ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా గుంపులు కలవలాంటే జనం జంకుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా మార్చి 22 నుంచి లాక్డౌన్ అమలులో ఉన్నా కొద్ది రోజుల తర్వాత నిబంధనల్లో కాస్తా సడలింపులిచ్చారు. ఈ పరిస్థితుల్లో కరోనా బారిన పడేవారి సంఖ్య క్రమేనా పెరుగుతుండటంతో కంటోన్మెంట్ ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చారు. గుంపులుగా కలిస్తే కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంటుందనే ఆలోచనతో శుభ కార్యాలయాల నిర్వహణ విషయంలో నిబంధనలను తీసుకొచ్చారు. ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో తప్పనిసరిగా అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈనెల 21 నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతోంది. ఈ మాసం అంటేనే పెళ్లిళ్లకు పేరు. ఈ నెల 22 నుంచి వచ్చేనెల 16 వరకు బలమైన ముహూర్తాలున్నాయి. మంచిముహూర్తాలు ఉండడంతో చాలామంది పెళ్లిళ్లు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కరోనా టెస్టు తప్పనిసరి ♦ ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వివాహ కార్యక్రమాలకు కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఇస్తారు. వరుడు, వధువు ఇద్దరి తరుఫున ఈ సంఖ్యకు మించకూడదనే నిబంధనను విధిస్తున్నారు. ♦ మండల మెజిస్ట్రేట్ అయిన తహసీల్దార్ల వద్దే దీని కోసం అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ♦ పెళ్లి కార్యక్రమం పెట్టుకున్న వారు అనుమతి కోసం రూ. 10 నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌పై అఫడవిట్ తహసీల్దార్‌కు అందజేయాలి. ♦ దరఖాస్తుదారులు తమ ఆధార్‌కార్డులతో పాటు కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు వైద్య ధ్రువీకరణపత్రం తప్పకుండా జత చేయాలి. ♦ నిబంధనలు ఉల్లంఘిస్తే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005లోని 188 సెక్షన్ మేరకు చర్యలు తీసుకుంటారు. తగ్గనున్న ఖర్చులు ఫంక్షన్ హాలు, లైటింగ్, భోజనాలు, డెకరేషన్ తదితర వాటికి గతంలో ఖర్చు తడిసి మోపడయ్యేది. కరోనా పుణ్యమా అని ఈ ఖర్చులు భారీగా తగ్గిపోతున్నాయి. ఐదు నెలల కింద వరకు వీటి ఖర్చు కోసం రూ.లక్షలు ఖర్చు చేసేవారు. ఇప్పుడు వేల రూపాయలలోనే పెళ్లిళ్లు పూర్తి కానున్నాయి. పరిమితికి మించి అనుమతులు ఇవ్వకపోవడంతో ఆర్భాటాలకు వెళ్లే అవసరం ఉండదు. కరోనా భయంతో ఎంత సాదాసీదాగా చేసుకుంటే అంత మంచిదనే అభిప్రాయం సంపన్న వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ఇక ఖర్చు విషయంలో మధ్య, పేద తరగతి వర్గాలకు చాలా వరకు ఉపశమనం కల్గినట్లే. నిబంధనలకు లోబడే పెళ్లిళ్లు శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి. చాలా మంది పెళ్లిళ్లు చేసేందుకు ముహూర్తాలు కట్టుకున్నారు. కరోనా నేపథ్యంలో పరిమితికి లోబడే హాజరయ్యేలా చూడాలని వధువు, వరుడు బంధువులకు చెబుతున్నాం. నిబంధనలకు అనుగుణంగానే పెళ్లిళ్లు చేసేందుకు వారంతా సానుకూలంగా ఉన్నారు.– భూపతి శివ కుమార్ శర్మ, పురోహితులు, కొడవండ్లపల్లి ముదిగుబ్బ -
పెళ్లికి పిలవకుండా ఉంటే బాగుణ్ణు..
ప్రొద్దుటూరు : రండి..రండి.. దయచేయండి.. అంటారు..ఇదో రకమైన ఆహ్వానం.. ఇక మీరు దయచేయవచ్చు..అంటారు కొందరు..అంటే మీరు వెళ్లవచ్చు..అని పరోక్ష అర్ధం ధ్వనిస్తుంది. కరోనా సమయంలో పెళ్లిళ్ల ఆహ్వానాల పరిస్థితి అలానే తయారైంది. సమూహంగా ఏర్పడితే కరోనా వైరస్ సోకే ప్రమాదముంటుందనే హెచ్చరికల నేపథ్యంలో పెళ్లిళ్లు లాంటి శుభ లేదా అశుభ కార్యక్రమాలు నిర్వహించడం చాలావరకూ మానుకుంటున్నారు. కొందరు తప్పని సరి పరిస్థితుల్లో నిర్వహించినా అధికారుల అనుమతి పొందాల్సి ఉంటుంది. అది కూడా కేవలం 20 మంది మాత్రమే హాజరు కావాలని నిబంధన విధిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇది అనివార్యం కూడా. 20మంది అనే సరికి ఎవరిని పిలవకుండా ఊరుకోవాలో తెలియక నిర్వాహకులు సతమతం అవుతున్నారు. పిలవకపోతే ఏమనుకుంటారో అనే ఫీలింగ్..ఇదిలా ఉంటే మరోకోణంలో పెళ్లికి పిలుస్తారేమోనని అటువైపు భయపడుతున్నారు. పిలవకుండా ఉంటే బాగుణ్ణు అని కూడా అనుకుంటున్నారు. కాగా ఇప్పటివరకూ కార్యక్రమాలకు అనుమతి జిల్లా కలెక్టరేట్ నుంచి పొందాల్సివచ్చేది. దీనివల్ల జాప్యం అవుతోంది. దీంతో మండల పరిధిలో తహసీల్దార్లకే బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈనెల 21వ తేదీ నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుంది. ఈ మాసంలో పెద్ద సంఖ్యలో వివాహాలు నిర్వహించుకోవడానికి బంధువులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్‌కింది స్థాయిలోనే పెళ్లిళ్లకు అనుమతులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. కేవలం పెళ్లిళ్లకు మాత్రమే అనుమతులు ఇస్తామని ప్రొద్దుటూరు తహసీల్దారు జె.మనోహర్‌రెడ్డి తెలిపారు. మిగతా శుభకార్యాలకు ఎలాంటి అనుమతులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ♦ కలెక్టర్ ఆదేశాల ప్రకారం కేవలం 20 మందికి మాత్రమే తహసీల్దార్ అనుమతి ఇస్తారు. ♦ పెళ్లి కుమార్తె, పెళ్లికుమారుడికి సంబంధించి ఇరువైపులా కలిపి ఈ సంఖ్యను మాత్రమే అనుమతించనున్నారు. ♦ వివాహ ఆహ్వాన పత్రికతోపాటు అనుమతి కోరేవారు రూ.10 నాన్ జ్యుడీషియల్‌స్టాంప్‌పై అఫిడవిట్‌ను తహసీల్దార్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ♦ ముందుగా దరఖాస్తు చేసుకునేవారు తమ ఆధార్ కార్డులతోపాటు కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు వైద్యులు ఇచ్చినపత్రాలను జత చేయాలి. ♦ నిబంధనలను ఉల్లంఘిస్తే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్–188 ద్వారా కఠిన చర్యలు తీసుకుంటారు. -
ఇక వేసవిలో మూడు ముహూర్తాలే..
చూపులతో మొదలై.. మూడు ముళ్లతో ముగిసే పెళ్లికి హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఒక ఇంట్లో పెళ్లంటే.. బంధువుల ఇళ్లలోనూ హడావుడి మొదలవుతుంది. ఎన్నో రోజుల ముందు నుంచే పెళ్లి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. వందలు, వేల సంఖ్యలో వచ్చే వారి ఆశీర్వాదం కోసం వధూవరులు సిద్ధమవుతారు. ఎక్కడెక్కడి నుంచో బంధువులు, స్నేహితులు చేరుకుంటారు. తోడూ నీడగా నూరేళ్ల జీవితాన్ని గడపాలని ఆ రోజున ముక్కోటి దేవతలు దీవిస్తారని నమ్ముతారు. పంచ భూతాల సాక్షిగా ఇద్దరు ఒక్కటవుతారు. ఇదంతా గతం.. ప్రస్తుతం వైభవంగా పెళ్లిళ్లను నిర్వహించాలనుకున్న వారికి మాత్రం లాక్డౌన్ నిరాశే మిగిల్చింది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు పెళ్లిళ్లకు వచ్చే వారి సంఖ్యను తగ్గించాలని సూచించడంతో కొద్ది మంది సమక్షంలోనే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. సాక్షి, సిటీబ్యూరో :కరోనా లాక్‌డౌన్‌తో కల్యాణ శోభ మారుతోంది. హంగూ, ఆర్భాటాలు లేకుండా పరిమిత సంఖ్య అతిథుల మధ్య సాదాసీదాగా వివాహాలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు కరోనా వైరస్ భయం, మరోవైపు లాక్డౌన్ కట్టడి కష్టాలు తెచ్చిపెట్టింది. అతిథులు సైతం శుభకార్యాలయాలకు హాజరయ్యేందుకు భయపడుతున్నట్లు తెలుస్తోంది. లాక్డౌన్ కంటే ముందే నిర్ణయించుకున్న పెళ్లిళ్లు చాలా వరకు వాయిదా పడగా, కొందరు ముహూర్తాలు దగ్గర్లో లేకపోవడంతో ఇళ్లలోనే పెళ్లి తంతు కానిచ్చేశారు. వాస్తవానికి దగ్గర్లో మంచి ముహూర్తాలు లేకుండా పోయాయి. ఇప్పటికే పలు ముహూర్తాలు ముగిసిపోగా, ఇక గురు, శుక్ర మూఢాలు, అధిక అశ్వీయుజ మాసం, ఆషాఢం, భాద్రపదం తదితర కారణంతో శుభకార్యాలు చాలా తక్కువ. ఎన్నో రంగాలకు గడ్డు పరిస్థితులు పెళ్లిళ్లపై ఆధారపడిన రంగాలకు గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. వివాహాది శుభకార్యాలకు అనుసంధానంగా ఉండే రంగాలపై ప్రభావం పడింది. ఆయా వర్గాలకు మునుపెన్నడూ లేనివిధంగా ఉపాధి దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఫంక్షన్ హాల్స్, కల్యాణ మండపాలు, డీజేలు, బ్యాండ్ బాజా, సన్నాయి మేళం, క్యాటరింగ్, వంటలు వండే వారు, మేకప్, ఈవెంట్ మేనేజ్మెంట్, టెంట్‌హౌస్, పెళ్లి దుస్తులు, దర్జీలు, ఫొటోలు, వీడియోగ్రాఫర్లు, పురోహితులు,బంగారం, పూలు, పెళ్లిపందిరి, కూరగాయలు, అద్దె వాహనాల ఉపాధి దెబ్బతిసినట్లయ్యింది. ముహూర్తాలు ముగిసిపోగా.. వేసవి కాలం ముహూర్తాల్లోనే వివాహాలు జరుపుకునేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. సెలవు కాలం అందరికీ కలిసి వస్తోందని భావిస్తారు. ఈ వేసవి కాలంలోని ఏప్రిల్, మే నెలల్లోనే చాలా వరకు ముహూర్తాలు ఇప్పటికే ముగిసిపోగా, ఈ నెల 29, వచ్చేనెల 10, 11 తేదీల్లోనే శుభ ముహూర్తాలు ఉన్నాయి. మే 30 నుంచి జూన్ 9 వరకు 10 రోజుల పాటు మూఢం కారణంగా శుభకార్యాలకు వీలుండదు. ఆ తర్వాత రెండురోజులు ముహూర్తాలు ఉన్నా.. జూలై 20 వరకు ఆషాఢమాసం.. శూన్యమాసం కావడంతో శుభకార్యాలు ఉండవు. జూలై 23 నుంచి వరుసగా రెండు రోజులపాటు శుభముహూర్తాలు ఉన్నాయి. తిరిగి వారం రోజుల తర్వాత ఆగస్టు 2, 7, 8, 14వ తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. వర్షాకాలం కావడంతో ఈ సమయం అత్యధిక శాతం శుభకార్యాలకు ఆసక్తి కనబర్చరు. ఇక ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 17 వరకు భాద్రపదం, శూన్యమాసం కావడంతో శుభకార్యాలు ఉండవు. ఆ తర్వాత అక్టోబర్ 16వ వరకు నెల రోజులు అధిక అశ్వీయుజ మాసం, శూన్యమాసం కావడంతో మంచి ముహూర్తాలకు అవకాశం లేకుండా పోయింది. అక్టోబర్ 21, 28, 29, 30, నవంబర్ 6, 11 నుంచి డిసెంబర్ 6 వరకు మంచి ముహూర్తాలు ఉన్నా శుభకార్యాల కోసం పెద్దగా ఆసక్తి కనబర్చరు. ప్రణాళికలను సైతం పక్కన పెట్టి.. తాజాగా మరింత విస్తరిస్తున్న కరోనాతో లాక్డౌన్ పొడిగించే అవకాశాలు ఉండటంతో తక్కువ బంధువులతో నిబంధనలకు లోబడి వివాహాలు జరిపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే పెండ్లి నిర్వహణ కోసం రూపొందించుకున్న ప్రణాళికలను సైతం పక్కన పెట్టి పరిస్థితులకు అనుగుణంగా స్వల్ప ఏర్పాట్లతో సిద్ధమవుతున్నారు. పెళ్లి శుభలేఖలను సైతం వాట్సాప్‌ల ద్వారా పంపించి సెల్‌ఫోన్ లేదా వీడియో కాలింగ్స్ ద్వారా ఆహ్వానం పలుకుతున్నారు. పెళ్లిలకు ఇరవై మంది వచ్చినా సరే అంటూ పెళ్లిలకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక అనుమతి తప్పనిసరి.. కరోనా కట్టడికి లాక్డౌన్లో వివాహాలు జరుపుకునేందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఖచ్చితమైన నిబంధనల మేరకు పెళ్లిలు జరిపించాల్సి ఉంటుంది. పెండ్లి తరఫు కుటుంబీకులు పోలీసులకు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. బ్యాండ్ బాజా పెట్టుకోవద్దు. బరాత్‌లు నిర్వహించుకోరాదు. సామూహిక భోజనాలు పెట్టకూడదు. పరిమిత సంఖ్యలో అతిథులను మాత్రమే ఆహ్వానించాలి. భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టాలి. ఇవ్వన్నీ పాటిస్తామంటేనే అనుమతి లభిస్తోంది. -
క్లిక్.. లాక్.. సీజన్లో దెబ్బతీసిన లాక్డౌన్
ఝరాసంగం(జహీరాబాద్): ఒక్క క్లిక్‌తో వచ్చే రూపానికి తుది మెరుగులు దిద్దుతారు. మధుర జ్ఞాపకాలను పది కాలాల పాటు పదిల పరుచుకునేలా అందమైన ఫోటోల్లో వాటిని బందిస్తుంటారు. ఏడాదంతా ఒక ఎత్తతైతే ఈ సమ్మర్ సీజన్ వీరికి మరో ఎత్తు. ఈ మూడు నెలల్లో ఫోటో, వీడియో గ్రాఫర్లు బీజీగా ఉంటారు. పెళ్లిళ్ల సీజన్ వారికి పెద్ద పండుగతో పాటు మంచి ఉపాధి సమయం. కాని ఈ సంవత్సరం మాత్రం సీజన్ ప్రారంభం నుంచి కరోనా ప్రభావం పడింది. షాపు యజమానులతో పాటు సిబ్బంది కూడా ఆర్థిక భారంతో సతమతం అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కోవిడ్(19) వైరస్ వ్యాప్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌కు పిలుపు నిచ్చాయి. దీంతో ప్రజలు ఇంటి వద్దే ఉండిపోతున్నారు. ఫలితంగా శుభకార్యాలు, పెండిళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా ఈ వృత్తినే నమ్ముకున్న ఫొటో, వీడియో గ్రాఫర్లకు దిక్కుతోచని పరిస్థితులు ఎదురయ్యయి. ఉపాధి ఎఫెక్ట్ జిల్లా వ్యాప్తంగా సుమారు 6 వేలకు పైగా ఫొటో, వీడియో గ్రాఫర్లు ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు. ఫోటో, వీడియో గ్రాఫర్లకు మంచి సీజన్ చేజారుతుంది. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు తప్పటం లేదు. లాక్డౌన్ కారణంగా బుకింగ్‌లు చాలా వాయిదా పడినట్లు పేర్కొంటున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు లాక్‌డౌన్‌తో ఫోటో, వీడియో గ్రాఫర్లకు ఉపాధికి ఎఫెక్ట్ పడింది. ప్రతి సంవత్సరం ఈ సమ్మర్లో శుభకార్యాలు, పెళ్లిళ్లు ఎక్కువగా ఉండటంతో మంచి ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. కాని కరోనా లాక్‌డైన్‌తో ఉపాధికి ఎఫెక్ట్ పడింది. –వీరన్న, ఫొటో గ్రాఫర్, ఝరాసంగం -
గ్రేటర్లో నిలిచిపోనున్న 15వేల పెళ్లిళ్లు
పెళ్లంటే రెండు కుటుంబాల మధ్య వారధే కాదు.. సకల వృత్తులవారికి ఉపాధి కూడా. లక్షలాది రూపాయల మేర జరిగే వ్యాపారం. ఎంతో మందికి బతుకుదెరువు. ఒక్క వివాహం ఎన్నో కుటుంబాలకు ఉపాధినిస్తుంది. బాజాభజంత్రీలు.. తళుకులీనే వర్ణరంజిత విద్యుద్దీపాలు.. పెళ్లి మండపాల్లో అలంకరణలు.. విందు భోజనాలు.. స్వర్ణాభరణాలు.. నూతన వస్త్రాలు.. వంటింటి సామగ్రి కొనుగోళ్లు.. ఇలా చెబుతూ పోతే ఈ జాబితా చాంతాడంత అవుతుంది. ఇంత తతంగం ఉంటుంది పెళ్లంటే. ప్రతియేటా ఏప్రిల్ నెలలో బాజాభజంత్రీలతో అట్టహాసంగా సాగే పెళ్లి వేడుకల దృశ్యాలే ప్రస్తుతం కనిపించడంలేదు. లాక్‌డౌన్‌తో ముహూర్తాలు మూలకు చేరాయి. వివాహ తంతు వాయిదా పడింది. కల్యాణ మంటపాలు కళతప్పాయి. ఫంక్షన్ హాళ్లు వెలవెలబోయాయి. పురోహితుడి నుంచి బ్యాండ్ వాద్యకారుల దాకా అన్ని వృత్తులపై తీవ్ర ప్రభావం చూపింది. సాక్షి, సిటీబ్యూరో : ‘పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. చప్పట్లు తాళాలు తలంబ్రాలు.... మూడే ముళ్లు..ఏడే అడుగులు....అంతేనా... పెళ్లంటే ఒక సామాజిక జీవితం. వందల కోట్ల రూపాయాల వ్యాపారం. లక్షలాది మందికి బతుకుదెరువు. ఒక్క పెళ్లి ఎన్నో కుటుంబాలకు ఉపాధినిస్తుంది. రెండు జీవితాలు ముడిపడి ఒక్కటయ్యే వేళ... వినిపించే బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాలు, గుబాళించే పూలసౌరభాలు, రంగురంగుల విద్యుద్దీపాలు, కనువిందు చేసే పెళ్లిమండపాల అలంకరణ, పసందైన విందు భోజనాలు, తళుకులీనే వస్త్రాభరణాలు,బంధుమిత్రుల రాకపోకలు.సందడిగా కనిపించే రహదారులు...మార్చి నెలాఖరు నుంచి మే నెలాఖరు వరకు సుమారు 2 నెలల పాటు జరిగే పెళ్లిళ్లు ఒక్క ఏడాది కాలానికి సమానమైన వ్యాపారసామ్రాజ్యాన్ని నిర్మిస్తాయి. బంగారు ఆభరణాలు, బట్టల అమ్మకాలు, వెండి వస్తువులు, వంటింటి సామాగ్రి, ఫర్నీచర్ వంటి అనేక రకాల వస్తువులు ఈ సీజన్లోనే ఎక్కువగా అమ్ముడవుతాయి. అలాంటి పెళ్లిళ్ల సీజన్‌కు కరోనా కాటేసింది. లాక్డౌన్ బ్రేక్ పడింది. ఏప్రిల్ 15వ తేదీ ముహూర్తం కోసం మార్చి రెండో వారంలోనే అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న వధూవరులు ఎక్కడి వాళ్లు అక్కడే ఇళ్లకు పరిమితమయ్యారు. ఇప్పటికే చాలా ముహూర్తాలు వాయిదా పడ్డాయి. గతేడాది ఏప్రిల్, మే నెలల్లో సుమారు 12,500 పెళ్లిళ్లు జరిగినట్లు అంచనా. ఈసారి ఇదే కాలంలో 15000 లకు పైగా పెళ్ళిళ్లు జరిగేందుకు అవకాశం ఉన్నప్పటికీ లాక్డౌన్ కారణంగా అన్నీ వాయిదా పడినట్లు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పురోహితులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గ్రేటర్ పరిధిలోని సుమారు 5 వేలకు పైగా చిన్నవి. పెద్దవి ఫంక్షన్‌హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, పెళ్లి మండపాలు ఎలాంటి కళా కాంతులు లేకుండా వెలవెలాపోతున్నాయి. కేటరింగ్ సర్వీసుల్లో, బ్యాండ్ మేళ్లాల్లో పని చేసే సిబ్బంది, కళాకారులు ఉపాధిని కోల్పోయారు.సుమారు 2 లక్షల మంది ఉపాధిపైన మహమ్మారి కరోనా వేటేసింది. కేటరింగ్ పై వేటు... రుచికరమైన ఆహారపదార్ధాలను వడ్డించి పెళ్లి భోజనాలకు పెట్టింది పేరుగా నిలిచే కేటరింగ్ సంస్థలు చతికిలాపడ్డాయి. ఆయా సంస్థల యజమానులు, నిర్వాహకులే కాకుండా కేటరింగ్‌లో పని చేసే వంటవాళ్లు, సిబ్బంది వేలాది మంది ఉపాధిని కోల్పోయారు. సాధారణంగా ఒక పెళ్లికి కనీసం రూ. 2 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు కూడా భోజనాలకు ఖర్చవుతుంది. పెళ్లికి వచ్చే బంధుమిత్రుల సంఖ్యకు అనుగుణంగా, వడ్డించే పదార్ధాలను బట్టి ధరల్లో హెచ్చతగ్గులు ఉంటాయి. నగరంలోని వందల కొద్దీ కేటరింగ్ సంస్థలు, నిర్వాహకులపైన లాక్డౌన్ ప్రభావం పడింది. అంతేకాకుండా పూలు, పండ్ల వ్యాపారాలు, వివిధ రకాల వస్తువుల విక్రయాలు సైతం నిలిచిపోయాయి. మొత్తంగా పెళ్లిళ్లతో ముడిపడిన ఒక వ్యవస్థ స్తంభించింది. ముహూర్తాలు బలమైనవే... కానీ ఏం లాభం... లాక్డౌన్ నిశీధిలో రహదారులు నిర్మానుష్యమయ్యాయి.నిజానికి ఈ లాక్డౌన్ లేకుండా అంతా సాదాసీదాగా ఉండి ఉంటే బుధవారం అంటే (ఏప్రిల్ 15వ తేదీ) నుంచి గురు (16),శుక్ర (17) వారాలు మూడు రోజుల పాటు వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరిగేవి. ఈ మూడు రోజుల పాటు వృశ్చికం, కుంభలగ్నం బలమైన ముహూర్తాలు ఉన్నాయి. ఆ తరువాత ఏప్రిల్ 25, 26, 29 తేదీల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. మే నెలలో 1, 3. 6, 7, 13, 17 తేదీల్లోనూ బలమైన పెళ్లి ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు తెలిపారు. ఆ తరువాత జూన్ 13వ తేదీ వరకు ఎలాంటి ముహూర్తాలు లేవు. ఒకవేళ వధూవరుల పేరు బలంపైన నిర్ణయించే పెట్టుడు ముహూర్తాలు మినహా ప్రత్యేకంగా ఎలాంటి ముహూర్తాలు లేవు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్, మే నెలల్లోనే ఎక్కువ శాతం పెళ్లిళ్లు జరుగుతాయి. ఈ లెక్కన ఏప్రిల్, మే నెలల్లోని 12 రోజుల పెళ్లి ముహూర్తాల్లో సుమారు 15 వేలకు పైగా పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉన్నట్లు పురోహిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా ఈ పెళ్లిళ్లన్నీ వాయిదా పడ్డాయి. ‘‘ ఆ తరువాత జూలై , ఆగస్టు నెలల్లో కొన్ని ముహూర్తాలు ఉన్నాయి. తిరిగి అక్టోబర్, నవంబర్,డిసెంబర్ నెలల్లోనే ఎక్కువ సంఖ్యలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. కరోనా కారణంగా వాయిదా పడిన పెళ్లిళ్లన్నీ నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.’’ అని మణికొండకు చెందిన పురోహితుడు శ్రావణ్‌కుమార్ తెలిపారు. లాక్డౌన్ కారణంగా ఈ మూడు రోజుల్లోనే వేలాది పెళ్లిళ్లకు బ్రేక్ పడినట్లు పేర్కొన్నారు. ఫంక్షన్ హాళ్లు వెలవెల.. నోవాటెల్ వంటి పెద్ద పెద్ద హోటళ్లు, హెచ్ఐసీసీ వంటి కన్వెన్షన్ సెంటర్లు మొదలుకొని చిన్న, పెద్ద ఫంక్షన్ హాళ్ల వరకు వేల సంఖ్యలో ఉన్నాయి. దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్, కర్మన్‌ఘాట్, చంపాపేట్, బీఎన్‌రెడ్డి నగర్, సికింద్రాబాద్, తిరుమలగిరి, అల్వాల్, మేడ్చెల్, తదితర అనేక ప్రాంతాల్లో సుమారు 5 వేలకు పైగా ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు ఏప్రిల్, మే నెలల్లో సందడిగా ఉంటాయి, ప్రతి రోజు పెళ్లి వేడుకలతో వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. సాధారణంగా అయితే కనీసం 3 నెలలు ముందే బుక్ చేసుకోవలసి ఉంటుంది. ఒక్కో ఫంక్షన్ హాల్ కనిష్టంగా రూ.2 లక్షల నుంచి గరిష్టంగా రూ.10 లక్షల వరకు చార్జీ చేస్తుంది. ఈ లెక్కన ఒక చిన్న ఫంక్షన్ హాల్ 12 రోజుల్లో కనీసం రోజుకు రెండు ముహూర్తాల చొప్పున పెళ్లిళ్లు జరుగుతాయి. కోట్లాది రూపాయాల ఆదాయం లభిస్తుంది. ఇక భారీ ఫంక్షన్‌హాళ్లలో వందల కోట్ల రూపాయాల ఆదాయానికి లాక్డ్న్ బ్రేక్ వేసింది. ‘‘రెండు నెలల్లో 12 ముహూర్తాల్లో రోజుకు రూ.5 లక్షల చొప్పున కనీసం రూ.60 లక్షల ఆదాయం లభించేది. కరోనా వల్ల కోల్పోవలసి వస్తోంది.’’ అని మేడ్చెల్‌కు చెందిన ఫంక్షన్‌హాల్ నిర్వాహకుడు ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. లాక్డౌన్ వల్ల వందల కోట్ల వ్యాపారకార్యకలాపాలు ఎక్కడికక్కడ స్తంభించాయి. చప్పుడు ఆగింది... ఇక పెళ్లిళ్లలో బ్యాండు భజంత్రీలు, మేళ,తాళాలు, సన్నాయి వాయిద్యాలకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, హైదరాబాద్‌లో సుమారు 10 వేల మంది వందల కొద్దీ బృందాలుగా ఏర్పడి శుభకార్యాల్లో పాల్గొంటున్నారు. ఈ బ్యాండుమేళాల్లో పని చేసే కళాకారులు, సిబ్బంది తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా ఒరిస్సా, మహారాష్ట్ర, తదితర పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. పెళ్లిళ్ల సీజన్ అయిపోయే వరకు హైదరాబాద్‌లోనే ఉంటారు. ఈ సీజన్లో సంపాదించుకొన్న డబ్బుతోనే వాళ్లు ఏడాది పాటు కుటుంబాన్ని పోషించుకుంటారు.ఒక పెళ్లికి రూ.25 వేల నుంచి రూ.50 వేలు, రూ.లక్షకు పైగా కూడా ఆదాయం వస్తుంది. పెళ్ళిళ్ల స్థాయి, హోదాకు అనుగుణంగా బ్యాండుమేళాల ఆదాయం ఉంటుంది. ‘ ఇలాంటి సంక్షోభం తమ జీవిత కాలంలోనే చూడలేదని పలువురు బ్యాండు కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన నర్సింగ్ 30 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నాడు, తనతో పాటు 50 మంది పని చేస్తున్నారు. ఇప్పుడు వాళ్లంతా రోడ్డున పడ్డారు.‘‘ కరోనా వచ్చుడు, జనం సచ్చుడేందో కానీ, పని లేక ఆకలితో సచ్చిపోయేటట్లున్నం,...’’ అని విచారం వ్యక్తం చేశాడు. ఇక నవంబర్ మాసంలోనే చాలా మంది ఏప్రిల్, మే నెలల్లో జరిగే పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. వీరంతా నవంబర్, డిసెంబర్ మాసాల్లోనే ముహూర్తాలు ఖరారు చేసుకుంటున్నారు. ఏ విధంగా చూసినా ఈ ఏడాది పెళ్లిళ్ల సందడి పెద్దగా ఉండకపోవచ్చు. లాక్డౌన్ కారణంగా ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోయారు. – శ్రావణ్‌కుమార్ శర్మ, పురోహితుడు, మణికొండ కరోనా కంట్రోల్ అయ్యాకే మాఇంట్లో పెళ్లి ఏప్రిల్ 5న మా అన్నయ్య కుమార్తె వివాహం జరగాల్సి ఉంది. కరోనా కారణంగా వాయిదా వేశాం. సాదాసీదాగా జరుపుకునే దాని కంటే వాయిదా వేసుకోవడమే ఉత్తమం అని భావించాం. అందుకే కరోనా పూర్తి స్థాయిలో కంట్రోల్ అయ్యాక మంచి ముహూర్తం చూసుకుని పెళ్ళి చేయాలనుకుంటున్నాం. ఈ సమయంలో భౌతిక దూరం పాటించడం ద్వారానే మనం కరోనాను జయించగలం. – మారుతి, మోడల్‌కాలనీ పెళ్లిళ్లన్నీ వాయిదానే.. చాలా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. మల్కాజిగిరి చుట్టుపక్కల 15 ఫంక్షన్ హాళ్లు మూసివేశారు. పౌరోహిత్యంపైనే ఆధారపడిన మాలాంటి వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. కుటుంబ నిర్వహణ భారంగా మారింది. పెళ్లిళ్లతో పాటు ఇతర శుభకార్యాలు సైతం పెద్దసంఖ్యలో వాయిదాపడ్డాయి. – వెంకట రమణాచార్యులు,పురోహితుడు, మల్కాజిగిరి ఉపాధి ఉఫ్.. నాతో పాటు మరో 50 మందికి ఉపాధి లభించేది పెళ్లిళ్ల సీజన్లోనే.. కానీ లాక్డౌన్ కారణంగా అన్నీ ఆగిపోయాయి. ఒక్కో సీజన్లో 100 నుంచి 150 పెళ్లిళ్లకు బ్యాండ్ వాయిస్తాం. ఈ ఏడాది ఒక్క పెళ్లి ఆర్డర్ కూడా ఇప్పటి వరకు రాలేదు. వచ్చే అవకాశమూ లేదు. కుటుంబ పోషణ భారంగా మారింది. పూటగడవడం కష్టంగా ఉంది. ప్రభుత్వం మమ్మల్ని అన్ని విధాలా ఆదుకోవాలి. – గంగాధర్, గీతా బ్యాండ్ మేళా, సికింద్రాబాద్ ►పేట్‌బషీరాబాద్ సుభాష్‌నగర్‌కు చెందిన సుధాకర్‌రెడ్డి కూతురు వివాహం ఈ నెల 21న జరగాల్సి ఉంది. అమెరికాలోని వర్జీనియాలో ఉండే అబ్బాయితో ఆన్లైన్లోనే ఎంగేజ్మెంట్ చేశారు. లాక్డౌన్ ఎత్తివేస్తే పెళ్లి చేయవచ్చని భావించారు. కానీ లాక్‌డౌన్‌ను మరోసారిపొడిగించడంతో పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ►మణికొండకు చెందిన ఓ అమ్మాయికి బెంగళూర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగితోవివాహం నిశ్చయమైంది. ఈ నెల 16నజరగాల్సిన పెళ్లి లాక్డౌన్ కారణంగావాయిదా పడింది, మరో ముహూర్తం ఇంకానిర్ణయించుకోలేదు. ►కుత్బుల్లాపూర్మాణిక్నగర్కు చెందినరమేష్కు నెల్లూరు జిల్లా కావలికి చెందిన యువతితో మార్చి 12న వివాహం నిశ్చయమైంది. ఏప్రిల్ 5న ముహూర్తం ఖరారు చేశారు. మార్చి 22న పెళ్లి దుస్తులు కొనుగోలు చేసేందుకు అమ్మాయి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు వచ్చారు. కానీ లాక్డౌన్ కారణంగా ఇక్కడేచిక్కుకుపోయారు. దీంతో వివాహం వాయిదా పడింది. వాళ్లంతా తిరిగి కావలికి చేరుకోలేని పరిస్థితి. -
బంగారం రూ.44,000 పైకి..
ముంబై: ఒకవైపు అంతర్జాతీయంగా పసిడి పరుగు, మరోవైపు దేశీయంగా డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనత, పెళ్లిళ్ల సీజన్ డిమాండ్‌తో దేశంలో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. బుధవారం పలు పట్టణాల స్పాట్ మార్కెట్లలో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాములు ధర రూ.1,000కుపైగా పెరిగి రూ.44,000 దాటిపోయింది. న్యూఢిల్లీలో ధరలు రూ.1,155 ఎగసి, రూ. 44,383కు చేరింది. వెండి ధర కూడా కేజీకి రూ.50,000 కొంచెం అటు ఇటూ పలుకుతుండడం గమనార్హం. ప్రపంచ వృద్ధికి కోవిడ్–19 భయాలు, దీనితో తమ పెట్టుబడులకు బంగారాన్ని సురక్షిత సాధనంగా ఇన్వెస్టర్లు భావిస్తుండడం, దీనికితోడు వృద్ధికి బలాన్ని ఇవ్వడానికి అమెరికా ఫెడ్‌సహా పలు సెంట్రల్ బ్యాంకులు సరళతర ద్రవ్య విధానాలను అవలంభిస్తుండడం వంటి అంశాలు పసిడికి అంతర్జాతీయంగా బలాన్ని ఇస్తున్నాయి. రూపాయి... 17 నెలల కనిష్టం ఇదిలావుండగా, ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం మరో 20 పైసలు నష్టపోయి.. 73.39 వద్ద ముగిసింది. ఇది 17 నెలల కనిష్ట స్థాయి. ట్రేడింగ్ మొదట్లో 72.90 వద్ద ప్రారంభమైన రూపాయి, 74 పైసల కనిష్ట–గరిష్ట స్థాయిల మధ్య తిరగడం గమనార్హం. బుధవారం ఒక దశలో 73.64 స్థాయినీ చూసింది. 2018 అక్టోబర్ 9న రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. తర్వాత పలు సానుకూలతలతో క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. అయితే ఇక్కడ నుంచి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది. -
డబుల్ గ్లామర్
రెండు భిన్నమైన రంగుల లెహంగా ఒకటి.. ఒకే రంగులో రెండు పొరల లెహంగా మరొకటి. ఒకేరకం ఫ్యాబ్రిక్ లెహంగా ఒకటి.. రాసిల్క్– నెటెడ్ రెండు రకాల మెటీరియల్తోడిజైన్ చేసిన లెహంగా మరొకటి.ఇలా దేనికది భిన్నంగా, మది దోచేలా ఆకట్టుకుంటున్నాయి ఈ టు లేయర్డ్ లెహంగాలు. ట్విన్ లేయర్డ్ లెహంగాలుగానూ పేరున్న ఇవి వేడుకల్లో హైలైట్‌గా నిలుస్తున్నాయి. క్యాజువల్‌గానూ కలర్‌ఫుల్ అనిపిస్తున్నాయి. డబుల్ గ్లామర్ అని ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇండియన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ యేడాది వెడ్డింగ్ సీజన్లో భాగంగా డబుల్ లేయర్డ్ లెహంగాలను డిజైన్ పలువురి ప్రముఖుల ప్రశంసలు పొందారు. ‘వివాహ వేడుకల్లో గ్రాండ్‌గా వెలిగిపోవడానికి గ్రాండ్ ఎంబ్రాయిడరీతో పాటు ట్విన్ లేయర్డ్ కూడా ప్రధాన కారణం’ అంటారు మనీష్ మల్హోత్రా. కుచ్చుల లెహంగా గురించి మనకు తెలిసిందే. లెహంగా ఎన్ని కుచ్చులతో ఉంటే అంచు భాగం అంత ఫ్లెయర్తో ఆకట్టుకుంటుంది. ►ఉత్తర భారతదేశంలో దాండియా వేడుకల్లో భాగంగా పుట్టుకొచ్చిందే ఈ రెండు పొరల లెహంగా. దీనికి డిజైనర్ టచ్ ఇచ్చి సౌతిండియా సైతం సరికొత్తగా ముస్తాబు చేసింది. వేడుకల్లో ప్రత్యేకంగా నిలిపింది. ►ఒక లెహంగా పార్ట్‌ని తక్కువ కొలత తీసుకొని, దాని అంచు వద్ద మరొక పొరగా కుచ్చుల భాగాన్ని జత చేస్తే ఈ అందమైన లెహంగా డిజైన్ వచ్చేస్తుంది. ►పై భాగం ప్లెయిన్ పట్టు మెటీరియల్ తీసుకుంటే, కుచ్చుల భాగం నెటెడ్తో జత చేస్తే ఇలా కొత్తగా కనువిందుచేస్తుంది. ►ఈ లెహంగాకి వెస్ట్రన్ స్టైల్ క్రాప్‌టాప్ ధరిస్తే ఇండో–వెస్ట్రన్ లుక్‌లో ఆకట్టుకుంటారు. ►లాంగ్ జాకెట్ ధరిస్తే ఒకలా, ఎంబ్రాయిడరీ ఛోలీ ధరిస్తే మరోలా భిన్నమైన లుక్‌లో కనిపిస్తారు. ►కాటన్, సిల్క్, నెటెడ్.. ఇలా ఏ ఫ్యాబ్రిక్‌తోనైనా ఈ డబుల్ లేయర్డ్ లెహంగాలను డిజైన్ చేసుకోవచ్చు. -
‘సొనాటా’ వెడ్డింగ్ కలెక్షన్
హైదరాబాద్: వివాహ సీజన్ సందర్భంగా నూతన వధూవరుల కోసం ప్రత్యేక వెడ్డింగ్ కలెక్షన్‌ను ప్రారంభించినట్లు టైటాన్ కంపెనీకి చెందిన ప్రముఖ వాచీల బ్రాండ్ ‘సొనాటా’ వెల్లడించింది. హ్యాండ్ క్రాఫ్టెడ్ డిజైన్లను ఈ కలెక్షన్లో భాగంగా అందిస్తోంది. వివాహ సమయంలో వధువులకు సరిగ్గా సరిపడే విధంగా బంగారం, రోజ్ గోల్డ్ ప్లేటింగ్‌తో నూతన వేరియంట్స్ అందుబాటులో ఉండగా... పురుషులు కోసం నాణ్యత, డిజైన్ పరంగా ప్రీమియంగా కనిపించే లెదర్ స్ట్రాప్స్, రోజ్ గోల్డ్ బై వంటి 10 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయని వివరించింది. వీటి ధరల శ్రేణి రూ.1,399 నుంచి రూ.2,299 వరకు ఉన్నట్లు తెలిపింది. -
ఉందిలే మంచి ముహూర్తం.. ముందుముందున
పశ్చిమగోదావరి, ఏలూరు(సెంట్రల్): శుభ ముహూర్తాల కోసం ఎదురు చూసే వారిళ్లల్లో సందడి నెలకొంది. వైశాఖ మాసంలో శుభ ఘడియల్లో జిల్లాలో వందలాది జంటలు ఒక్కటి కానున్నాయి. పెళ్లి ఏర్పాట్లతో ఆయా కుటుంబాల్లో సందడి నెలకొంది. వైశాఖ, జ్యేష్ట మాసాల్లో సుమారు 20 పెద్ద ముహూర్తాలు ఉన్నాయిని పురోహితులు చెబుతున్నారు. దీంతో పెళ్లి మండపాలు, బ్యాండ్ పార్టీలు, డెకరేషన్ సామగ్రి, పురోహితులు, లైటింగ్‌కు డిమాండ్ పెరిగింది. పెళ్లిళ్లతో పాటు గృహ ప్రవేశాలు, నిర్మాణాలకు సంబంధించిన శంకుస్థాపనలు సైతం ఉపందుకున్నాయి. రెండు నెలలు మంచి ముహూర్తాలు ఈ నెల 5వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు వైశాఖ మాసం. జాన్ నుంచి జూలై 1వ తేదీ వరకు జ్యేష్ట మాసం కొనసాగుతుంది. ఈ రెండు మాసాలలో మంచి ముహూర్తాలు ఉండడంతో వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు తదితర శుభకార్యాలు జోరుగా సాగుతున్నాయి. మార్చి 31 నుంచి 45 రోజుల పాటు మంచి ముహూర్తాలు లేకపోవడంతో ప్రజలు ఎటువంటి సుభకార్యాలకు పూనుకోలేదు. బుధవారం నుంచి ఈనెల 30 వరకు మంచి ముహూర్తాలు ఉండడంతో శుభకార్యాలు జరుపుకునేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. ఈనెల 15, 16, 17,19, 23, 25, 26, 29, 30 తేదీల్లో ఉన్న ముహూర్తాల్లో పెద్ద సంఖ్యలో వివాహలు జరగనున్నాయి. దాంతో పాటు వచ్చే జూన్‌లో జ్యేష్ట మాసంలో 8, 9, 12, 13, 17, 19, 20, 22, 26, 27 తేదీల్లో వివాహాలు జరగనున్నట్లు పండితులు తెలిపారు. జోరుగా సాగుతున్న వ్యాపారాలు పెళ్లిళల్లో కీలకమైన మంగళ వాయిద్యాలకు మంచి గిరాకీ ఏర్పాడింది. పూర్తిస్థాయి బ్యాండ్ పార్టీలు దొరికే పరిస్థితి ఏమాత్రం కనిపించకపోవడంతో కొన్ని వాయిద్యాలతోనే సరిపెట్టుకోవాల్సివ స్తోంది. రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు ఈ బ్యాండ్ పార్టీలు ధర పలుకుతున్నాయి. పెళ్లి మండపాలను అలంకరించేవారు కూడా బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం పెళ్లి సమయంలో ఖర్చుకు ఏమాత్రం వెనుకాడేవారు ఉండడం లేదు. దాంతో కల్యాణ మండపాలకు రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు చేసి అనేక రకాల పుష్పాలతో మండపాలను ఆకర్షనీయంగా అలకంరిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కన్వెన్షన్ హాల్స్ హవా కోనసాగుతోంది. వాటిలో పెళ్లి జరపడం ఇప్పుడు స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. గతంలో కనీస సౌకర్యాలతో ఉన్న కల్యాణ మండపం రూ.10 నుంచి రూ.20 వేల మధ్యలో అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుతం రూ.30 వేల నుంచి రూ.2 లక్షలు అద్దె తీసుకునే కన్వెన్షన్ హాల్స్ ఉన్నాయి. మంచి రోజుల్లో వాటిని బుక్ చేయించుకునేందుకు చాలా మంది బారులు తీరుతున్నారు. సుమారు 45 రోజుల పాటు ఖాళీగా ఉన్న కల్యాణ మండపాలన్నీ వివాహ వేడుకలతో కిటకిటలాడేందుకు సిద్ధమయ్యాయి. వాటితో పాటు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, ఇతర సామగ్రి దుకాణాలు వినియోగదారులతో కళకళలాడుతున్నాయి. వీడియోగ్రాఫర్లు, ఫొటో గ్రాఫర్లకు కూడా చేతినిండా పని దొరకడంతో వారు సైతం బిజీ అయిపోయారు. రెండు నెలల పాటు తీరిక లేదు చాలా రోజుల తరువాత మంచి ముహుర్తాలు రావడంతో శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయి .ఈ రెండు నెలల కాలంలో వందల సంఖ్యల్లో పెళ్లిళ్లు జరుగనున్నాయి. పెళ్లి సీజన్ రావడంతో పెళ్లిళ్లకు సంబంధించిన డెకరేషన్, సన్నాయి, ఫొటో, వీడియో గ్రాఫర్లు బీజీగా ఉన్నారు.– జి.మణికంఠ, ఫొటోగ్రాఫర్ చైత్ర మాసం వెళ్లిపోయింది ఈనెల 4వ తేదీ నుంచి చైత్ర మాసం ముగిసిపోయింది. వైశాఖ మాసం ప్రారంభం కావడంతో మంచి రోజులు వచ్చేశాయి. వైశాఖ మాసంలో నగరంలోని పెళ్లిళ్ల సందడి ప్రారంభమైంది. ఈ మాసంలో మంచి ముహుర్తాలు ఉండడంతో పెద్ద సంఖ్యలోనే నూతన జంటలు ఒక్కటి కానున్నాయి. – ఎన్. కృష్ణచైతన్య శర్మ, పురోహితుడు,ఏలూరు -
ప్రారంభమైన పెళ్లిళ్ల సీజన్..
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పెళ్లి సందడికి సిద్ధమైంది. చైత్ర మాసం పూర్తయి, ఆదివారం నుంచి వైశాఖం ప్రారంభమైంది. ఈ నెల మంచి ముహూర్తాలు ఉండడంతో ఎక్కువగా వివాహాలు జరగనున్నాయి. మరోవైపు వేసవి సెలవులు కూడా తోడవడంతో పెళ్లి సందడి ఓ రేంజ్లో ఉండనుంది. దుస్తులు, బంగారు ఆభరణాలు కొనుగోళ్లు ఊపందుకున్నాయి. పెళ్లిళ్లకు అవసరమైన వస్తు సామగ్రిని కొనుగోలు చేసేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. దీంతో దుణాకాల్లో రద్దీ నెలకొంది. బుధవారం నుంచి శుభకార్యాలు ప్రారంభమవుతాయని పూజారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ నెల 15 ,16, 29 తేదీల్లో ఎక్కువ పెళ్లిళ్లు ఉన్నాయన్నారు. ముందే బుకింగ్.. ఈ నెల మొత్తం మంచి ముహూర్తాలుఉండడంతో కల్యాణ మండపాలకు గిరాకీ ఏర్పడింది. పైగా ఈసారి ఎక్కువగా మధ్యాహ్నం మూహూర్తాలు ఉండడం, వేసవి కావడంతో ఏసీ కన్వెన్షన్ సెంటర్లు, మండపాలకు మరింత డిమాండ్ ఉంది. వీటి ధరలు కూడా రూ.లక్ష నుంచి రూ.6 లక్షల వరకు ఉండడంతో నగరవాసులు తమ స్థాయిని బట్టి ముందే బుక్ చేసుకుంటున్నారు. పెళ్లిళ్లతో పాటు ఇతర శుభకార్యాలు కూడా అధికంగా ఉండడంతో బస్తీల్లోని చిన్న ఫంక్షన్ హాళ్లకు కూడా డిమాండ్ ఏర్పడింది. గతంలో ఒక్క పురోహితుడు మాత్రమే పెళ్లి తంతు పూర్తి చేసేవారు. కానీ ఈ మధ్య ఎక్కువ పెళ్లిళ్లలో ఇద్దరు పురోహితులు కార్యక్రమాలు జరిపిస్తున్నారు. దీంతో పురోహితులకు ఫుల్ డిమాండ్ ఉంది. ఇక సాధారణ శుభకార్యాలకు ముగ్గురు వాయిద్యకారులు ఉంటే సరిపోతారని, పెళ్లికి కనీసం ఐదుగురు కావాలని పేర్కొంటున్నారు. దీంతో వాయిద్యకారులకూ మంచి గిరాకీ ఉంది. వీరు ఒక్కో పెళ్లికి రూ.10వేల నుంచి రూ.20 వేల వరకు తీసుకుంటున్నారు. దుకాణాలు కిటకిట.. ఓవైపు అక్షయ తృతీయ, మరోవైపు పెళ్లిళ్ల నేపథ్యంలో బంగారం ధర స్వల్పంగా తగ్గడం వినియోగదారులకు కొంత ఊరటనిచ్చే విషయం. గ్రాముకు రూ.40 వరకు తగ్గిందని బంగారం వ్యాపారులు పేర్కొంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఎక్కువ మంది రెడిమేడ్ నగలపైనే ఆసక్తి చూపుతున్నారు. వధవు, వరుడుకి కావాల్సిన నగలను పూర్తిస్థాయి సెట్ల రూపంలో దుకాణదారులు అందిస్తుండడంతో వినియోగదారులు వాటి వైపే మొగ్గు చూపుతున్నారు. వీటితో పాటు వస్త్రదుకాణాలు కూడా రద్దీగా మారాయి. పండుగల సమయంలో ఇస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్లు ఇప్పుడు కూడా అందుబాటులోకి వచ్చాయి. -
మోగింది కల్యాణ వీణ
ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి.. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి.. అన్నాడొక సినీ కవి. ఇళ్లన్నీ మామిడి తోరణాలతో మెరవాలి. వేద మంత్రోచ్ఛరణలు మార్మోగాలి. బాజాభజంత్రీలతో హోరెత్తాలి. ముచ్చటైన జంటను చూసిన బంధు జనం మురవాలి. మనసారా దీవెనల వర్షం కురవాలి. మాఘమాసం వచ్చేసింది. శుభ ముహూర్తాలకు వేళయ్యింది. ఒక్కటయ్యే జంటల కోసం పెళ్లి వేదిక నిరీక్షిస్తోంది. ఫిబ్రవరి 8, 9, 10, 11 తేదీల్లో జిల్లావ్యాప్తంగా భారీ సంఖ్యలో జరగనున్న పెళ్లిళ్లతో సందడి నెలకొంది. విజయనగరం మున్సిపాలిటీ:ఈ నెల 5 నుంచి మార్చి 6 వరకూ మాఘమాసం కొనసాగనుంది. ఈ పవిత్ర మాసంలో మంచి ముహూర్తాలు ఉండటంతో వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు తదితర శుభకార్యాలు జోరుగా జరగనున్నాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా పెళ్లిబాజాలు మోగనున్నాయి. జిల్లాలో వివాహాది శుభకార్యాలు చివరిగా మార్గశిర బహుళ నవమి అంటే డిసెంబర్ 30న జరిగాయి. తిరిగి 35 రోజుల విరామం అనంతరం బుధవారం నుంచి ఈ నెల 28 వరకూ జరగనున్నాయి. వీటిలో ఈ నెల 8, 9, 10, 11 తేదీల్లో ఉన్న ముహూర్తాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు చేసేందుకు చాలామంది ఏర్పాట్లు చేసుకున్నారు. మార్చి 7వ తేదీ నుంచి మొదలయ్యే ఫాల్గుణ మాసంలో కూడా వివాహాలు జరుగుతాయని పండితులు తెలిపారు. భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరగనుండటంతో పురోహితులు, సన్నాయి మేళాలు, కల్యాణ మండపాలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా రెండువేలకు పైగా జంటలు వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నాయి. జోరందుకున్న వ్యాపారాలు హిందూ సంప్రదాయం ప్రకారం మూఢం రోజుల్లో పెళ్లిళ్లు, ప్రారంభోత్సవాలు వంటి మంచి కార్యక్రమాల నిర్వహణకు ముందుకు రారు. దీంతో మూఢం ముగిసే వరకు వేచి ఉన్న వారంతా ఇప్పుడు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రధానంగా పెళ్ళిళ్లు నిశ్చయించుకున్న వారి ఇళ్లల్లో సందడి ప్రారంభమైంది. వస్త్రాలు, బంగారు ఆభరణాలు, ఇతర సామగ్రి కొనుగోలుకు పల్లె ప్రజలు పట్టణాలకు తరలి వస్తున్నారు. వీడియో గ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లకు కూడా చేతినిండా పని దొరికింది. కల్యాణ మండపాలకు కళ ఒకప్పుడు ఎవరి ఇంటి ముందు వారు పెళ్లి చేసుకునే సంప్రదాయం కనుమరుగై కల్యాణ మండపాలను ఆశ్రయించడం ఎక్కువైంది. కల్యాణ మండపంలో పెళ్ళి చేస్తే అయ్యే ఖర్చుకన్నా ఇంటి దగ్గర చేస్తే అయ్యే ఖర్చు ఎక్కువని అందరూ భావిస్తున్నారు. దీంతో ఆలయాలు, కల్యాణ మండపాలు, హోటళ్ళలో పెళ్లిళ్లకు ఎక్కువ మంది మక్కువ చూపిస్తున్నారు. ఆర్థిక స్థితిగతులను బట్టి వేదికలను ఎంపిక చేసుకుంటున్నారు. గతంలో కనీస సౌకర్యాలతో ఉన్న కల్యాణ మండపం రూ.5 వేల నుంచి రూ.10 వేల మధ్య అందుబాటులో ఉండేది. ప్రస్తుతం రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. హైటెక్ కల్యాణ మండపాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. రూ.కనీస అద్దె రూ.లక్షల్లో పలుకుతోంది. ఇటీవల కాలంలో కన్వెన్షన్ హాల్ సంప్రదాయం విస్తరిస్తుండటంతో మంచి రోజుల్లో వాటిని బుక్ చేయించేందుకు నిర్వాహకులు బారులు తీరుతున్నారు. మేళతాళాలకుముందస్తు నమోదు పెళ్లిళ్లల్లో కీలకమైన మంగళ వాయిద్యాలకు గిరాకీ పెరిగింది. పూర్తి స్థాయి బ్యాండ్ పార్టీలు దొరికే పరిస్థితి లేదు. కొందరు సన్నాయిమేళం తోనే సరిపెట్టుకోవలసి వస్తోంది. ఒక్కొక్క సారి తక్కువ మందిగల బ్యాండ్ పార్టీ కూడా దొరకడం గగనమవుతోంది. రూ.20 వేల నుంచి రూ.లక్షల్లో బ్యాండ్ పార్టీల ధరలు పలుకుతున్నాయి. మంచి రోజులు వచ్చేశాయి మాఘమాసం ప్రారంభం కావటంతో మంచి రోజులు వచ్చేశాయి. ఈనెల 5 నుంచి పుష్యమాసం ముగిసిపోయింది. మాఘమాసంలో జిల్లాలో పెళ్ళిళ్ల సందడి ప్రారంభం కానుంది. ఈ మాసంలో దివ్యమైన ముహూర్తాలు ఉండటంతో ఆ రోజుల్లో వేల సంఖ్యలో నూతన జంటలు ఒక్కటి కానున్నాయి. – కామేశ్వరశర్మ, వేద పండితుడు, నెల్లిమర్ల ఒకేరోజు నాలుగైదు వివాహాలు ప్రస్తుతం పురోహితులకు కూడా జిల్లాలో మంచి డిమాండ్ ఉంది. ఒక పురోహితుడు ఒకేరోజు నాలుగైదు వివాహాలు జరిపించే పరిస్థితి నెలకొంది. ఒక్కొక్క వివాహానికి స్థాయిని బట్టి రూ.7వేలకు పైగా తీసుకుంటున్నారు. -
ఇట్స్ లగ్గం టైమ్
బంజారాహిల్స్: నేటి నుంచి మాఘమాసం ప్రార ంభం కానుంది. మీనలగ్నం ప్రవేశంతో శుభకార్యాలకు వేళయింది. బుధవారం మొదలు జైష్టమాసం అంటే జూన్ నెలాఖరు వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. గత డిసెంబర్ నెలాఖరున శూన్యమాసం ప్రవేశించడంతో ఇప్పటి వరకు శుభ ముహూర్తాలు లేవు. ఇక ఇప్పటి నుంచి వచ్చే జైష్టమాసం వరకు మంచి ముహూర్తాలు ఉండడంతో సిటీజనులు శుభకార్యాలకు శ్రీకారం చుడుతున్నారు. మళ్లీ జూలై నుంచి ఆషాఢం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఐదు నెలల్లోనే శుభకార్యాలు జరుపుకునేందుకు ముహూర్తాలు చూసు కుంటున్నారు. దీనికి తోడు ఈ నెలంతా పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలున్నాయి. ఈ నెల 6, 7, 9, 10, 13, 14, 15, 18, 20, 21, 22, 23, 24, 28 తేదీల్లో బలమైన ముహూర్తాలున్నాయని జూబ్లీ హిల్స్ పెద్దమ్మ ఆలయం ప్రధాన అర్చకుడు చంద్రమౌళిశర్మ తెలిపారు. ఈ నెల 9న నగరంలో 50వేల పెళ్లిళ్లు జరగనున్నట్లు పేర్కొన్నారు. దీంతో సిటీకి పెళ్లి కళ వచ్చేసింది. ఫంక్షన్‌హాళ్లు బుక్ అయిపోయాయి. పెళ్లిళ్లతో పాటు గృహ ప్రవేశాలు, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు, కొత్త దుకాణాల ప్రారంభోత్సవాలకూ సిటీజనులు సిద్ధమవుతున్నారు. ఫంక్షన్‌హాల్స్ ఫుల్... పెళ్లిళ్లు పెద్ద సంఖ్యలో ఉండడంతో ఈ నెలంతా కల్యాణ మండపాలు దొరకని పరిస్థితి నెలకొంది. ప్రధాన ఫంక్షన్‌హాల్స్ ఇప్పటికే బుక్ అయిపోయాయి. దీంతో చాలా మంది తమ ఇళ్ల దగ్గరే లేదా కాలనీ, బస్తీల్లోని సామాజిక భవనాల్లో పెళ్లిళ్లు నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్నారు. పాఠశాలలు, ఖాళీ స్థలాలపై ఆధారపడుతున్నారు. తన కూతురు పెళ్లికి ఫంక్షన్‌హాల్ కోసం చూడగా దొరక్కపోవడంతో ఇంటి దగ్గరే చేయడానికి సిద్ధమయ్యానని ఫిలింనగర్‌కు చెందిన రాజబాబు అనే ఉద్యోగి తెలిపారు. ఇంకొంత మంది ఆలయాల్లో పెళ్లిళ్లు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. పురోహితులూ కష్టమే... ఫిబ్రవరిలో పెళ్లిళ్లు, ఒడుగు, ఉపనయనాలు, గృహ ప్రవేశాలు ఉండడంతో పురోహితులు దొరకడం కష్టంగా మారింది. దీంతో వారికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఒక పురోహితుడు ఒకేరోజు రెండు, మూడు పెళ్లిళ్లు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక క్యాటరింగ్ ఏజెన్సీలకూ డిమాండ్ పెరిగింది. సన్నాయి మేళాలు, బాజా భజంత్రీలు, డీజేలకూ గిరాకీ ఉంది. పెళ్లి పందిరి, వంటసామగ్రి, విద్యుత్ దీపాలు, కల్యాణ మండపాల అలంకరణ తదితర కాంట్రాక్టర్లకు చేతినిండా పని దొరుకుతోంది. -
ముహూర్తాలు వచ్చేశాయ్..
జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లిళ్ల సందడి మొదలైంది. ఈ నెల15తో అధిక జ్యేష్టమాసం ముగియడంతో ఇప్పటికే బ్యాండ్ బాజా మోగుతుండగా 27, 30 తేదీల్లో దివ్యమైన శుభ ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. జూ న్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్ చివరి వారం వరకు వేల సంఖ్యలో వివాహాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యక్రమాలను నిర్వహించేందుకు చాలా మంది సన్నద్ధమవుతున్నారు. జూన్16 నుంచి నవంబర్ మాసం మినహా డిసెం బర్ నెల చివరి వరకు 29 మంచి ముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు. జూలై 15 నుంచి ఆషాఢం రానుండడంతో ఆగస్టు 15వ తేదీ వరకు ముహూర్తాలు ఉండవని స్పష్టం చేశారు. శుభ ముహూర్తాలు.. శుభ గడియల కోసం ఎదురు చూసిన వారు ఆలస్యం చేయకుండా వివాహాది శుభకార్యాలకు సన్నద్ధమవుతున్నారు. 2018 జూన్‌లో ఇప్పటికే కొన్ని పెళ్లిళ్లు జరుగగా 27, 30, జూలై 1, 5, 6, 7, ఆగస్టు 15, 16, 17, 18, 19, 23, 24, 29, 30, 31, సెప్టెంబర్ 2, డిసెంబర్లో 12, 14, 21, 22, 27, 28, 29, 30 తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నట్లు శ్రీ సంతోషిమాత ఆలయ ప్ర«ధాన అర్చకులు తెలిపారు. తిరిగి 2019 ఫిబ్రవరి 07 నుంచి మంచి ముహూర్తాలు మొదలు కానున్నట్లు వివరించారు. భక్తి శ్రద్ధలతో.. ఆగస్టు 14 నుంచి శ్రావన మాసం ప్రారంభం కానుంది. ఈ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలు.. ప్రజలు ఉపవాస దీక్షలతో పూజలు చేస్తారు. శ్రావణ మాసం పండుగలకు.. శుభ కార్యాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ మాసంలో మంచి ముహూర్తాలు కలిసి వస్తుండడంతో పెళ్లిళ్లు, శుభకార్యాల సందడి నెలకొంటుంది. ఎగిరే కెమెరా... రూ.2.50లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేస్తూ.. జీవితంలో తీపి గుర్తులుగా మిగిలిపోయో ఫొటోగ్రఫీ, వీడియోలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి తోడు డ్రోన్ కెమెరాకు ఆదరణ పెరుగుతోంది. వివాహాల్లో డ్రోన్ హల్చల్ చేస్తుంది. గగనతలం నుంచి అత్యంత క్వాలిటీతో ఫొటోలు, వీడియోలు తీయడం డ్రోన్ కెమెరా విశిష్టత. భాజా భజంత్రీలు, డిజైన్స్, డెకరేషన్, పూలదండలు, లైటింగ్, డీజే, వస్త్ర, బంగారు దుకాణాల్లో సందడి మొదలైయింది. శుభకార్యాలకు అనువు.. 2018 జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్లో 29 శుభ ముహూర్తాలు ఉన్నాయి. జాతకాలను బట్టి పండితులు పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలను నిర్వహించేందుకు తేదీని చెబుతారు. –శ్రీనివాసశర్మ, అర్చకులు ఆభరణాల ఎంపికలో కీలకం.. పెళ్లి కూతురు.. వరుడి ఆభరణాల ఎంపికలో చాలా జగ్రత్తలు తీసుకుంటున్నారు. వధువు అలంకరణలో ఆభరణాల ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ.. వ్యాపారం మాత్రం జోరుగా సాగుతుంది. -
ముంచుకొస్తోంది.. ముహూర్తాల వేళ..
వీరఘట్టం: శుభముహూర్తాల సందడి ప్రారంభానికి వేళైంది. ఈ నెల 15తో అధిక జ్యేష్ఠమాసం ముగియడంతో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. మరో 20 రోజుల పాటు భాజా భజంత్రీలు మారుమోగనున్నాయి. ఈ నెల 18తో పాటు 22, 23, 24, 27, 28, 29, 30 తేదీల్లో దివ్యమైన శుభ ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. అలాగే జూలై 1, 2, 3, 5, 6,7 తేదీల్లో కూడా ముహూర్తాలు ఉండడంతో ఆయా రోజుల్లో వేల సంఖ్యలో పెళ్లిళ్లు, గృహ æప్రవేశాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించేందుకు చాలామంది సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 18 నుంచి జూలై ఏడో తేదీ వరకు అన్నీ మంచి రోజులేనని వేద పండితులంటున్నారు. జూలై 15 నుంచి నెల రోజుల పాటు ఆషాఢం రానుండడంతో ఆగస్టు 15వ తేదీ వరకు ముహూర్తాలు ఉండవని స్పష్టం చేస్తున్నారు. పురోహితులకు డిమాండ్ ఈ నెల 18వ తేదీ నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండడంతో పురోహితులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా రెండు వేల వరకూ వివాహాలకు ముహూర్తాలు ఖరారైనట్టు పురోహితులు చెబుతున్నారు. అలాగే కొద్దిరోజులుగా ఖాళీగా ఉన్న నాయీ బ్రాహ్మణులకు, పురోహితులకు డిమాండ్ పెరిగింది. ముందుగానే తేదీలను ఖరారు చేసుకోవడంతో చాలామంది ప్రశాంతంగా ఉండగా... మరికొందరు కల్యాణ మండపాలు ఖాళీలేక, బ్యాండు పార్టీలు... పురోహితులు దొరక్క ఆందోళన చెందుతున్నారు. వివాహాలతోపాటు రానున్న 20 రోజుల్లో 14 ముహూర్తాలు ఉండడంతో గృహప్రవేశాలు, నూతన భవానల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసేందుకు సైతం చాలామంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జోరందుకున్న వ్యాపారాలు వివాహాలు, గృహప్రవేశాలు ముంచుకొస్తోంది.. ముహూర్తాల వేళ..చేయాలనుకునేవారు తమకు కావల్సిన సామగ్రి కొనుగోలులో బిజీగా ఉన్నారు. వస్త్రాలు, బంగారు అభరణాలు, డెకరేషన్ ఇతర సామగ్రి కొనుగోలుకు జిల్లా కేంద్రానికి ప్రజలు పోటెత్తుతుడడంతో దుకాణాలన్నీ కళకళలాడుతున్నాయి. కల్యాణ మండపం అద్దె ధరలు పైపైకి... ప్రస్తుత రోజుల్లో చాలా మంది వివాహాల కోసం కల్యాణ మండపాలను ఆశ్రయిస్తున్నారు. అన్ని సౌకర్యాలు అక్కడే లభిస్తుండడంతో ఎక్కువ మంది అటు వైపే మొగ్గు చూపుతున్నారు. ఎవరి ఆర్థిక స్థితిగతులను బట్టి ఆయా వేదికలను ఎంపిక చేసుకుంటున్నారు. గతంలో కనీస సౌకర్యాలతో ఉన్న కల్యాణ మండపం అద్దె రూ.5 వేలు నుంచి రూ.10 వేల మధ్య ఉంటే ప్రస్తుతం రూ.10 వేల నుంచి రూ.20 వేలు పలుకుతోంది. ఏసీ సౌకర్యం ఉన్న కల్యాణ మండపాల ధరలైతే లక్షల రూపాయలకు పైనే పలుకుతున్నాయి. 18 నుంచి పెళ్లిళ్ల సీజన్ ఈ నెల 18 నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకు 20 రోజుల పాటు మంచి ముహూర్తాలున్నాయి. ఎక్కువగా ఈనెల 22, 23, 24, 27, 28, 29, 30 తేదీల్లో పెళ్లిళ్లు ఉన్నాయి. జూలై 15 నుంచి ఆషాఢం ప్రారంభం అవుతుంది. – ఎస్.వి.ఎల్.ఎన్.శర్మయాజీ, వేద పండితుడు, వీరఘట్టం -
నగ ధగలు... నయా వగలు
నగల.. వగలు మారుతున్నాయి. కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. సిటీలో జ్యువెలరీ ప్రియులు ఇప్పుడు ‘లైట్’ ఆభరణాలను ఇష్టపడుతున్నారు. ఒంటి నిండా దిగేసుకునే నగలకు బదులుగా... హెవీగా కనపడుతూనే లైట్‌గా ఉండే జ్యువెలరీ ట్రెండ్‌గా మారింది. గ్రాండ్‌గా కనపడుతూనే శరీరానికి చిరాకు కలిగించని ఆభరణాలను ఎక్కువ మంది యువతులు కోరుకుంటున్నారు. వీరిఅభిరుచులకు అనుగుణంగా జ్యువెలరీ డిజైన్లు రూపుదిద్దుకుంటున్నాయి. వేళ్లకు పెట్టుకునే ఉంగరాల నుంచి చెవి రింగులు, బుట్టాలు, మణికట్టు గొలుసులు, ముక్కు పుడకలు, వివిధ రకాలు హారాలు, వడ్డాణాలు కూడా ఇప్పుడు కొత్త రీతిలో తయారవుతున్నాయి. వేసవితోపాటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో సిటీలో లైట్ జ్యువెలరీకి ఆదరణ బాగా పెరిగింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌తో పాటు సమ్మర్ కూడా కలిసొచ్చింది. దీంతో వేడుకలు జరుపుకునే వారితో పాటు వాటికి హాజరయ్యే ఆభరణాల ప్రియులు సీజనల్ జ్యువెలరీ గురించిఅన్వేషిస్తున్నారు. గ్రాండ్‌గా కనపడుతూనే శరీరానికి చిరాకు కలిగించని, హెవీగాఅనిపించని ఆభరణాలను కోరుకుంటున్నారు. వీరి అభిరుచులకు అనుగుణంగా జ్యువెలరీ డిజైన్లు రూపుదిద్దుకుంటున్నాయి. భారీ ఆభరణాలకు బదులుగా రూపుదిద్దుకుంటున్న ఇవి... ఒకనాటి చిన్న సైజ్ ఆభరణాలను భారీగా మార్చేయడం విశేషం. సాక్షి, సిటీబ్యూరో: అందాన్ని మెరిపించేందుకు కావొచ్చు.. హుందాగా కనిపించేందుకు కావొచ్చు.. స్టేటస్ సింబల్ కావొచ్చు... విభిన్న రకాలుగా ఆభరణాన్ని తమ ఆహార్యంలో భాగం చేసుకోవడం సిటీజనులకు సర్వసాధారణంగా మారింది. ఇక వెడ్డింగ్ సీజన్లో ఈ సరదా శిఖరాలను తాకుతోందని చెప్పడానికి ప్రస్తుతం జ్యువెలరీ షోరూమ్స్ దగ్గర కనపడే రద్దీ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అయితే ఇదే సమయంలో ఒంటి నిండా దిగేసుకునే ఆభరణాలకు బదులుగా... హెవీగా కనపడుతూనే లైట్‌గా ఉండే జ్యువెలరీ ఇప్పుడు సిటీలో ట్రెండ్‌గా మారింది. మాంగ్ టీకా.. బంగారు పూల జడల గురించి మర్చిపోండి. ఇప్పుడు తలపై భాగంలో పెట్టుకునే మాంగ్ టీకా అనే ఆభరణం దాని స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. గోల్డ్, డైమండ్ ఫ్లాట్, డైమండ్ కుందన్... ఇది రూ.30వేల నుంచి రూ.2లక్షల దాకా ఉంటుంది. ఫ్యాన్సీగా కూడా వాడతారు. హెవీ నుంచి లైట్‌కి.. కొన్ని ఆభరణాలు భారీగా ఉండాల్సినవి నాజుకుగా మారుతున్నాయి. ఒకప్పుడు మెడ అంటే భారీగా ఉండే బంగారు గొలుసులకు కేరాఫ్. అయితే ఇప్పుడు మెడలో ధరించేందుకు బీడ్స్‌తో రూపొందుతున్న నెక్లెస్‌లు వచ్చాయి. పచ్చలు, కెంపులు, పగడాలు, ముత్యాలతో సైడ్ పెండెంట్స్, మిడిల్ పెండెంట్స్ పెట్టి త్రీలైన్, ఫోర్‌లైన్ బీడ్స్‌తో డిజైన్ చేస్తున్నారు. చూడడానికి పెద్దగా కనపడతాయి.. కానీ ధరిస్తే హెవీగా అనిపించవు. ఇన్స్టాంట్ రిచ్ లుక్ అందించే ఇవి రూ.లక్ష నుంచి రూ.6 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. సైజ్ జీరో... ఒకప్పుడు వడ్డాణం ధరిస్తే.. దాని నుంచి ఇంకో ఆభరణం మీదకి దృష్టి మళ్లడానికి చాలా టైమ్ పట్టేది. అంత భారీగా ఉండేవి. అయితే ఇప్పుడు లైట్ వెయిట్ వడ్డాణం వచ్చేసింది. దీనిలో కండోలి స్టైల్ వడ్డాణం అనేదైతే.. ఒకవైపు మాత్రమే ఉంటుంది. అలాగే మెడలోకి, నడుముకి రెండు రకాలుగానూ ఉపయోగించుకునేంత నాజూకైన నెక్లెస్ కమ్ వడ్డాణం కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఇది రూ.4లక్షల నుంచి ప్రారంభమై ఆపైన ఉంటుంది. మణికట్టు మెరిసె..మోచేయి మురిసె.. సన్నగా ఉన్నామా? లేమా అన్నట్టు ఉండే గాజులు, మణికట్టు గొలుసులు కూడా ఇప్పుడు హెవీగా మారిపోయాయి. వాటి స్థానంలో అందుబాటులోకి వచ్చిన బ్రాడ్ బ్రాస్లెట్ లేదా బ్రాడ్ బ్యాంగిల్.. చేతులకు సరికొత్త మెరుపుల్ని అందిస్తున్నాయి. మణికట్టు దగ్గర మొదలై మోచేయి దాకా వ్యాపిస్తూ అటు బ్రాస్లెట్ ఇటు గాజులు రెండింటిలాగా అమరిపోయే ఇవి రూ.లక్ష ఆపై ధరల్లో లభిస్తున్నాయి. వేళ్లకు వెలుగు... వేళ్లకు పెట్టుకునే రింగ్ అంటే బొటన వేలు, చూపుడు వేలు మధ్యలో చక్కగా అమరిపోయేది అనుకుంటున్నారేమో... అయితే ఇవి కాక్టెయిల్ రోజులు. రూపాయి కాయిన్ కన్నా కాస్త పెద్దగా పెండెంట్ సైజ్‌లో ఉండే కాక్టెయిల్ రింగ్ ఇప్పుడు ట్రెండ్. ఈవెనింగ్ పార్టీస్‌కి, రిసెప్షన్స్... తదితర వేడుకులకు వెళ్లేటప్పుడు ధరిస్తారు. కాబట్టి.. దీనిని కాక్టెయిల్ రింగ్ అని పిలుస్తారు. ఇవి డైమండ్, కుందన్ గోల్డ్‌తో తయారవుతాయి. గోల్డ్ అయితే రూ.50వేల నుంచి డైమండ్ అయితే రూ.లక్ష నుంచి అందుబాటులో ఉన్నాయి. ‘చెవులూరించే’..చెవులూగించే.. ఒకప్పుడు చెవి రింగులు అంటే ఎంత ఉండేవో తెలియంది కాదు. అంగుళం, అరంగుళం సైజ్‌కు మించేవి కావు. అయితే అదే ప్లేస్‌లో చెవులకు పెద్ద సైజ్‌లో వేలాడుతుండే షాండ్లియర్స్... ఇప్పుడు అమ్మాయిల హాట్ ఫేవరేట్. చెవి రింగుల స్వరూపాన్ని అమాంతం మార్చేసింది షాండ్లియర్స్ ట్రెండ్. చెవికి ఆభరణం ధరించామా? లేకపోతే ఆభరణానికి చెవిని ధరించారా! అన్నట్టు అనిపిస్తుంది. వేసవిలో చికాకు కలిగించే హెవీ జ్యువెలరీకి బదులుగా ఇవి బాగా ఆదరణ పొందుతున్నాయి. కలర్ స్టోన్స్ రూబీ, ఎమరాల్డ్, కుందన్లతో కళ్లు మిరుమిట్లు గొలిపేలా ముఖం మొత్తానికి అందాన్ని అందించే ఈ షాండ్లియర్స్లో బోలెడన్ని వెరైటీలు ఉన్నాయి. కనీసం ఒక షాండ్లియర్ జత రూ.లక్ష నుంచి రూ.6 లక్షల దాకా అందుబాటులో ఉన్నాయి. ఇవి 30ఏళ్ల లోపు వయసు వారికి మాత్రమే నప్పుతాయి. కాబట్టి యువతులే ఎక్కువగా వినియోగిస్తున్నారు. మధ్య వయస్కుల కోసం రూపాయి కాయిన్ సైజ్‌లో ఉండే పెద్ద స్టడ్స్ అందుబాటులో ఉన్నాయి. నట్ ఫర్ నోస్.. నాసిక ఎంత నాజూగ్గా ఉంటుందో ముక్కుకు పెట్టుకునే నోస్పిక్ లేదా ముక్కెర కూడా అంతకన్నా నాజూగ్గా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం అలా కాదు. ఉంగరం తరహాలో ఉండే నట్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు అమ్మాయిల్లో విపరీతమైన ట్రెండీ ఆభరణం ఈ నట్. విభిన్న రకాల స్టోన్స్‌తో ముక్కును మెరిపించే ఈ నట్ రూ.10వేల నుంచి అందుబాటులో ఉంది. సౌకర్యమే ప్రధానం.. నగలు ధరించాలని కోరుకుంటూనే అదే సమయంలో సౌకర్యానికి కూడా సిటీజనులు ప్రాధాన్యమిస్తున్నారు. కొత్త కొత్త అభిరుచుల క్రమంలో డిజైనర్ల సత్తాకు నిత్యం పరీక్షలు ఎదురవుతున్నాయి. దీంతో ఆభరణాలు రకరకాల మార్పుచేర్పులకు లోనవుతున్నాయి. ఫంక్షన్లకు వెళ్లే సమయంలో హెవీగా కనిపిస్తూనే ఒంటికి మాత్రం లైట్‌గా అనిపించే ఆభరణాలను ధరించడానికి అమ్మాయిలు బాగా ఇష్టపడుతున్నారు. – శ్వేతారెడ్డి,జ్యువెలరీ డిజైనర్ -
అన్నీ మంచి శకునాలే
జిల్లాలో పెళ్లిసందడి మొదలైంది. పలకరించే పచ్చనిపందిళ్లు.. ఆహ్వానం పలుకుతున్న మామిడాకుల తోరణాలు...కళ్లు చెదిరే అలంకరణతోవేదిక...పట్టుపావళ్ల యువతులూ...జరీ చీరెల గలగలలూ....చిన్నారులతుళ్లింతలూ...రంగురంగుల విద్యుద్దీపకాంతులు..సన్నాయి మేళాలసుస్వరాలు...ఆత్మీయతల పరిమళాలు...అనుబంధాలకమ్మదనంతో కల్యాణ వేదిక కళకళలాడుతోంది.మూడుముళ్ల బంధంతో ఇద్దరు ఒక్కటయ్యే శుభవేళ,రెండు కుటుంబాల మధ్య అనుబంధాలు పెనవేసుకొనేఘట్టం. జీవితంలో మరుపురాని, మధురమైన జ్ఞాపకంకానున్న ఘడియలు. ఇక ఏడాదంతా శుభముహూర్తాలే.. తల్లిదండ్రులకు మంచి శకునాలే.. కడప కల్చరల్ : ఇక ముహూర్తాలకు కొదువ లేదు. నాలుగు నెలల మూడం తర్వాత శుభఘడియాలు మొదలయ్యాయి. బాజాభజంత్రీలు మొగుతున్నాయి. మూడేళ్ల సుదీర్ఘ సమయం తర్వాత ఆ కరువు తీరేలా సంవత్సరం పాటు వరుస ముహూర్తాలు వచ్చాయి. ఈ బుధవారం తొలి ముహూర్తంతో ప్రారంభమైన ముహూర్తాలు 2019 వరకు ప్రతినెలా వరుసగా ఉన్నాయి. ఎలాంటి తొందర, హడావుడి, గందరగోళం లేకుండా ముహూర్తాలు, జాతకాలు, జన్మ నక్షత్రాలు సరిచూసుకుని తీరిగ్గా పెళ్లిళ్లు చేసుకొనే మంచి అవకాశం చాలా ఏళ్ల తర్వాత వచ్చింది. ముందుగానే బుకింగ్‌లు ఈ ముహూర్తాలలో వివాహాల కోసం జిల్లాలోని 500కుపైగా గల చిన్న, పెద్ద కల్యాణ మండపాలను నవంబరులోనే బుక్ చేసుకున్నారు. పెళ్లి పత్రికల హడావుడి ఫిబ్రవరి మొదటివారం నుంచి మొదలైంది. పురోహితులకు డిమాండ్ ఏర్పడడంతో ముందే వారికి అడ్వాన్సులు ఇచ్చారు. డిమాండ్‌ను బట్టి ఒక్కో అర్చకునికి కనీసం రూ.వెయ్యి ఇవ్వాల్సి వస్తోంది. స్థాయినిబట్టి ఒక్కొ పెళ్లికి ఇద్దరు నుంచి ఐదుగురు పురోహితులను మాట్లాడుకున్నారు. వచ్చే మార్చి వరకు అద్దె వాహనాలకు డిమాండ్ ఉంటుంది. పెట్రోలు, డీజల్ విక్రయాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. రూ. 200 కోట్ల పైమాటే.. ఈ సీజన్లో వివాహాల కోసం జిల్లా అంతటా రూ.150 నుంచి 200 కోట్ల వ్యాపారాలు జరిగే అవకాశం ఉంది. పెళ్లంటే పారిశుద్ధ్య కార్మికుల నుంచి పసిడి వ్యాపారుల వరకు దాదాపు 150 అనుబంధ రంగాల వ్యాపారాలు జరుగుతాయి. కడపలో 10 వేల నుంచి రూ. 2లక్షల అద్దెగల కల్యాణ మండపాలు 70దాకా ఉండగా, ప్రొద్దుటూరులో 50కి పైగాఉన్నాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 500కు పైగా ఉండగా మే వరకు రూ.7కోట్ల నుంచి రూ.10 కోట్ల ఖర్చయ్యే అవకాశం ఉంది. భోజనాలకు ప్లేటు ఒక్కింటికి కనీసం రూ.150 నుంచి రూ.300 ఖర్చుచేయాల్సి వస్తోంది. మే వరకు జరగనున్న వివాహ భోజనాలకు రూ.2కోట్లకు పైగా ఖర్చు కానుండగా, మండపాల అలంకారాలకు రూ.10 వేల నుంచి రూ.3లక్షలు చొప్పున ఈ సీజన్లో రూ.3కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. వ్యాపారం...బంగారం.. మే వరకు జిల్లావ్యాప్తంగా 500కు పైగా వివాహాలు జరగనున్నాయి. ఎంత చిన్న వివాహామైనా అమ్మాయికి కనీసం 10తులాల నుంచి కిలో దాక బంగారం పెడతారు. ఈ లెక్కన ఈ సీజన్లో రూ.70 కోట్ల మేరకు బంగారం వ్యాపారం జరిగే అవకాశం ఉంది. పెళ్లి వస్త్రాల కోసం మధ్యతరగతి కుటుంబం దాదాపు లక్ష రూపాయలు, పెద్ద కుటుంబాలైతే రూ.3 లక్షలు చొప్పున ఖర్చుచేస్తారు. దీంతో ఈ సీజన్లో రూ.6–10 కోట్ల మేరకు వస్త్ర వ్యాపారం జరిగే అవకాశం ఉంది. సంవత్సర కాలంగా నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంతో గణనీయంగా తగ్గిన ఈ రంగాల వ్యాపారాలు ఈ ముహూర్తాల కారణంగా లాభాలు చూసే అవకాశం ఉంది. అందరికీ శుభమే.. ఇవిగాక బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాలు, శుభలేఖలు, కిరణా సరుకులు, కూరగాయల వ్యాపారాలు ఈ సంవత్సరమంతా బాగా జరగనున్నాయి. ఈ వేడుకల్లో ఒక్కొ వివాహానికి ఫొటోలు, వీడియోలకు రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చవుతుంది. డ్రోన్ లాంటి పరికరాలతో కొత్తరకం షూటవుట్లకు బాగా ఖర్చు చేయనున్నారు. పూలు, కొబ్బరికాయల వ్యాపారాలు పెరిగి రైతు, వ్యాపారులతోపాటు ఆయా రంగాల శ్రామికులకు కూడా సంవత్సరంపాటు డబ్బు అందే అవకాశం లభిస్తుంది. అటు ప్రభుత్వ రవాణా రంగాలు, పెట్రోలు, డీజల్ వ్యాపారాలు నష్టాల నుంచి కోలుకొని లాభాలు పొందే అవకాశం ఉంది. మొత్తంపై దాదాపు సంవత్సరంపాటు గల ఈ ముహూర్తాలు, పెళ్లిళ్లు ఆయా కుటుంబాలకే కాకుండా పలు ఇతర రంగాల ప్రజలకు కూడా ఆనందాన్ని కలిగించనుండడం విశేషం. కల్యాణదాయకం..శుభం ఇలా దాదాపు సంవత్సరం పాటు వరుసగా ముహూర్తాలు ఉండడం అరుదైన విషయం. అందరికీ సంతోషదాయకం. అన్నిరంగాల వారికి పెళ్లిళ్ల సమయంలో పని లభిస్తుంది. ఈ ముహూర్తాలన్నీ మంచివే కావడంతో తొందర లేకుండా పెళ్లిళ్లు చేసుకోవచ్చు. – చక్రవర్తుల నాగాంజనేయశర్మ, వేద పండితులు, కడప కోలుకునే అవకాశం నోట్లరద్దు, జీఎస్టీతోపాటు ముహూర్తాలు లేకపోవడంతో సంవత్సర కాలంగా పనిలేక నష్టాలకు గురవుతున్నాం. ఈ వరుస ముహూర్తాలతో వ్యాపారాలు పుంజుకోగలవన్న ఆశ ఉంది. – ఎలిశెట్టి శివకుమార్, డెకరేషన్, కేటరింగ్ కాంట్రాక్టర్ నెలవారీగా ముహూర్తాలు ఫిబ్రవరి: 24, 25 మార్చి: 1, 3, 4, 8, 10, 23, 29, 30 ఏప్రిల్: 1, 5, 11, 12, 20, 22, 25, 28, 29 మే: 2, 6, 10 మే 16 నుంచి జూన్ 13 వరకు నిజ జేష్ఠమాసం, అధిక జేష్ఠమాసం ఉండడంతో ఈ సమయంలో వివాహాలు చేసుకోరు. ఆ తర్వాత 2019 మార్చి వరకు ముహూర్తాలకు కొదవ లేదు. -
పెళ్లి సందడి
పెళ్లిల్ల సీజన్ వచ్చేసింది. ఈనెల 17 నుంచి మే 13వ తేదీ వరకు వివాహ ముహూర్తాలు ఉన్నాయి. డిసెంబర్ 1 నుంచి ఈ ఏడాదిఫిబ్రవరి 16 వరకు మూఢాలు ఉండడంతో శుభకార్యాలు ముఖ్యంగా వివాహాలకు మూహూర్తాలు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం శుభ ఘడియలు రావడంతో పెళ్లిల్ల సందడి మొదలు కానుంది. సాక్షి, వరంగల్ రూరల్: శుభ ఘడియలు సమీపిస్తున్నాయి. ఉమ్మడి జల్లాలో ఊరూరా పెళ్లి బాజాలు మోగనున్నాయి. గత డిసెంబర్ ఒకటి నుంచి ఈనెల 16 వరకు మూడాలు ఉండడంతో ఉండటంతో వివాహాది శుభకార్యాలు పెద్దగా జరగలేదు. 17 నుంచి ఫాల్గుణ మాసం శుభ ముహూర్తాలను మోసుకొస్తుండడంతో శుభకార్యాలకు సిద్ధమవుతున్నారు. కల్యాణ మండపాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. మే 13 వరకు బలమైన ముహూర్తాలు ఉండడంతో వేల సంఖ్యలో జిల్లాలో వివాహాలు జరగనున్నాయని పురోహితులు చెబుతున్నారు. కల్యాణ మండపాలు బిజీ ఉమ్మడి జిల్లాలో కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్, ఫొటో, వీడియో, పురోహితులు టెంట్ హౌస్‌లకు డిమాండ్ రానుంది. పట్టణాల్లో ఉన్న ప్రముఖ కల్యాణ మండపాలతో పాటు చిన్న, మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండే ఫంక్షన్ హాళ్లు, ట్రావెల్స్, ప్లవర్స్ డెకరేషన్ ట్రూప్స్, బ్యాండ్ వాలాలను ముందుగానే రిజర్వు చేసుకుంటున్నారు. చిన్న, పెద్ద హోటళ్లలో గదులు ఇప్పటికే హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ట్రావెల్ ఏజెన్సీలు బిజీబిజీగా మారాయి. ముచ్చటైన వేదికలు.. పెళ్లికి గ్రాండ్ లుక్ తీసుకురావడంలో ఫంక్షన్ హాళ్లే కీలకం. ఖరీదైన కల్యాణ మండపాలు, స్టార్ హోటళ్లలో కాన్ఫరెన్స్ హాళ్లు వేదికలుగా నిలుస్తున్నాయి. ఇక పట్టణాల్లో కొంత మంది విశాలమైన మైదానాలను ఎంచుకుంటున్నారు. ఆకర్షణీకమైన సెట్టింగ్‌లు, ప్రత్యేక అలంకరణలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడడం లేదు. సెట్టింగ్‌లు వేసేందుకు హైదరాబాద్ నుంచి ఆర్ట్ డైరెక్టర్లను రప్పిస్తున్నారు. మే 13 వరకే... ఈనెల 17 నుంచి మే 13 వరకు వివాహ ముహూర్తాలు ఉన్నాయి. మే 14 నుంచి జూన్ 14 వరకు అధిక జేష్ఠ మాసం రావడంతో వివాహాలు లేకుండా పోయాయి. జూన్ 16 నుంచి జూలై 11 వరకు శుభమూహూర్తాలు ఉన్నాయి. ఫిబ్రవరిలో 17, 19, 23, 24, 26, మార్చి 2, 4, 6, 10, 14 ఏప్రిల్‌లో 1, 2, 5, 11, 19, 20, 22, 25, 27, 28, 29, 30, మే నెలలో 2, 9, 10వ తేదీల్లో అధికంగా ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు చెబుతున్నారు. ఫాల్గుణ మాసం నుంచి.. ఫాల్గుణ మాసం నుంచి చాలా దివ్యమైన మూహూర్తాలు ఉన్నాయి. ఈనెల 17 నుంచి మే నెల 13వరకు మళ్లీ నెల రోజుల విరామం తర్వాత జూన్ 16 నుంచి జూలై 11 వరకు వివాహాలు జరగనున్నాయి. ఆషాఢమాసంలో మళ్లీ పెళ్లిళ్లు ఉండవు. నేను ఉగాది వరకు 22 పెళ్లి మూహుర్తాలు పెట్టాను. గతేడాది కంటే ఈసారి ఎక్కువగానే వివాహాలు జరగనున్నాయి. –సముద్రాల సుదర్శనాచార్యులు,ప్రధాన అర్చకుడు, శ్రీనాగేంద్రస్వామి దేవాలయం, ఊకల్ -
భారీగా పెరిగిన బంగారం ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో, బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.325 మేర పెరిగి రూ.30,775గా నమోదైంది. అంతేకాక అంతర్జాతీయంగా కూడా బంగారానికి బలమైన సంకేతాలు వీస్తున్నాయి. సిల్వర్ కూడా రికవరీ అయింది. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ పెరుగడంతో, వెండి ధరలు రూ.600 మేర పెరిగి రూ.41వేల మార్కును దాటాయి. శనివారం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.41,150గా రికార్డైంది. ప్రస్తుతం దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో, స్థానిక జువెల్లర్స్ నుంచి బంగారానికి భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్‌తో దేశీయంగా బంగారం ధరలు పైకి ఎగిశాయి. అంతేకాక అంతర్జాతీయంగా డాలర్‌కు సెంటిమెంట్ బలహీనంగా ఉంది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.325 చొప్పున పెరిగి రూ.30,775గా, రూ.30,625గా నమోదయ్యాయి. గత రెండు రోజులుగా ఈ మెటల్ రూ.175 నష్టపోయింది. -
మాఘమాసం మెగాచిందులు
మాఘమాసం వచ్చింది.. పెళ్లిళ్ల సీజన్ తెచ్చింది మీ పెళ్లిళ్లు... మా పెళ్లిళ్లకు ఎవరొస్తారండీ బంధువులు తప్ప! ఇంకొంచెం ఖర్చు పెడితే స్నేహితులు వస్తారు! షారూఖ్‌ఖాన్ వస్తాడా? ఫరాఖాన్ డాన్స్ చేస్తుందా? షకీరా పాడుతుందా? తోట తరణి ప్యాలేస్ వేస్తాడా? పసుపు కొట్టడానికి బంగారు రోకలి ఉంటుందా? కన్యాదానం చేసేటప్పుడు కాళ్ల మీద ముత్యాలు ఒలుకుతాయా? మంగళసూత్రంలో డైమండ్లు మెరుస్తాయా? సినిమా ఇండస్ట్రీ అంతా దిగుతుందా? నాయకులంతా వరస కడతారా? యేడాదికి సరిపోయే తిండి వడ్డించుకోగలరా? పూలు యూరప్ నుంచి, పళ్లు జపాన్ నుంచి, దుస్తులు అమెరికా నుంచి దిగుమతి అవుతాయా? మందు ఫ్రాన్స్‌నుంచి పారుతుందా? అలాగైతేనే మాఘమాసం మెఘామాసం అవుతుంది! పైసలోల్ల పెళ్లి పెద్దోళ్ల కళ్యాణంగా మారుతుంది! ఇలాంటి పెళ్లిళ్లకి జీవితంలో మనల్ని ఎవరూ పిలవరు కానీ కనీసం అలాంటి వెడ్డింగ్కార్డ్ని ఎక్కడైనా చూసి సంతోషపడదాం!! ధనం.. విలాసాలకు చిరునామా! ఆకాశాన్ని పందిరిగా మలుస్తుంది! మబ్బులను వింజామరలను చేస్తుంది.. నక్షత్రాలతో తోరణాలు కడుతుంది.... భూదేవిని పీటలా పరుస్తుంది. సూర్యుడిని దివిటీగా వాడుతుంది. గ్రహాలను దిష్టిచుక్కలుగా పెడుతుంది. నెలవంకను వధువు జడలో తురుముతుంది. ముత్యాలను తలంబ్రాలుగా పోస్తుంది. కాసులతో దండలు అల్లుతుంది. పూలపారాణి పెడుతుంది. గాంధర్వులతో గాన కచేరి చేయిస్తుంది. అప్సరసలతో నాట్యప్రదర్శన ఇప్పిస్తుంది. ఆశీస్సులకు అతిరథ మహారథులను పిలుస్తుంది. బంగారు కానుకలు సమర్పిస్తుంది. నలభీములే నివ్వెరపోయే పంచభక్ష్యపరమాన్నాలు వడ్డిస్తుంది. అవును ఇది డబ్బు చేసే మాయ! మయసభను మరిపించే ఆర్ట్ సెట్టింగ్‌ల మధ్య మోగే బాజాభజంత్రీలు! బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్! పూలు.. పళ్లు.. బంగారు రేకులు.. పెళ్లి చూపులయిపోయి.. సంబంధం ఖాయం అయినప్పటి నుంచి మొదలవుతాయి.. ఈ వేడుకను ఘనంగా జరిపించేందుకు సన్నాహాలు. మన సంప్రదాయమూ దీన్నే వాడుకగా చేసింది. పెళ్లి తాలూకు వ్యవహారాలను పదహారు రోజులకు ఫిక్స్ చేసి! ఆ సంబరానికి నిశ్చితార్థం నాంది. దీన్నే పూలు.. పండ్లు అనీ పిలుస్తారు కొన్ని ప్రాంతాల్లో. అందుకే ఆ పూలు.. పళ్లు ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటున్నాయి ఈ పర్వంలో. పూలకు బెంగుళూరు నుంచి యూరప్ వరకూ సాగుతోంది ప్రయాణం. పళ్లకూ అంతే! సిమ్లా టు యూరప్. ఈ ఆనందానికి తీపినద్దడానికి దేశంలోని చేయితిరిగిన షెఫ్స్ హాజరవుతున్నారు. పాలు, మలాయ్, పంచదార, డ్రైఫ్రూట్స్‌తో చేసిన స్వీట్లతో నిశ్చితార్థాన్ని తీయని జ్ఞాపకంగా మిగులుస్తున్నారు. చాలా నిశ్చితార్థ వేడుకల్లో దేశీ భోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలుగు కుటుంబాలకు అచ్చ తెలుగు వంటకాలకే చవులూరుతున్నాయి. పులిహోర, దప్పళాలు, గారెలు, బూరెలు, పప్పు, పచ్చళ్లకే పొయ్యి రాజేస్తున్నారు. ఇందులో వెరైటీలు ఘుమఘుమలాడుతున్నాయి. లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రింగ్! డైమండ్ జిలుగులకు తగ్గట్లేదు. పెరిగిన పైడి ధర, ఈ మధ్యకాలంలో మెకాలడ్డిన డిమోనిటైజేషన్ ఈ వెలుగులనేమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. లగ్న పత్రిక రాసే కార్యక్రమమూ లగ్జరీగానే సాగుతోంది. ఇదివరకైతే ఎంత ఉన్నత కుటుంబాలైనా పసుపు, కుంకుమ రాసిన కాగితం ముక్క మీద లగ్నాన్ని రాసుకునేవారు. అన్నిటికీ దర్జా వచ్చినట్టే దీనికీ వచ్చింది. బంగారు రేకుల మీద పెళ్లి ముహూర్తం ముద్రిస్తున్నారు. ఇలాంటి నిశ్చితార్థాలకు 50 కోట్లకు పైనే ఖర్చు పెడుతున్నట్లు వినికిడి. పసుపు దంపుడు విఘ్నేశ్వరుడి పూజ తర్వాత పసుపు దంపే కార్యక్రమాన్నీ అంతే కన్నులపండువగా జరిపిస్తున్నారు. గతంలో అయిదుగురు ముత్తయిదువలు కలిసిచేసే ఈ సందడి ఇప్పుడో సంబరం. పసుపు దంచే రోలూ, రోకలీ బంగారు పూత అలంకారంతో పసుపుతో పాటు ఒయ్యారాన్నీ చిందిస్తున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో రోకళ్లు జత కలుస్తున్నాయి. పడుచు పిల్లల డ్యాన్సులతో లోగిళ్లు మురుస్తున్నాయి. ఇది ఓ అయిదు కోట్ల వ్యవహారమేనట. పెళ్లి పత్రికలు.. అభిరుచి చిత్రికలు ఇందులో సృజనాత్మకతకు, ఖర్చుకి ఆకాశమే హద్దు. పెయింటింగ్ నుంచి ఛాయాచిత్రాల దాకా.. నాలుగు మూలల కార్డు ముక్క నుంచి వటపత్ర, తాళపత్ర గ్రంథం దాకా.. పాకెట్లో పట్టే సైజ్ నుంచి పెట్టెల్లో అమరే పరిమాణం దాకా చేతులకందుతున్నాయి. రకరాల డిజైన్స్‌లో.. మెటాలిక్ రంగుల్లో మెరిసిపోతున్నాయి. వీటి ఎంపికలో టేస్ట్, ఆర్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అవుతున్నాయి. పదికోట్ల రూపాయల నుంచి ఖర్చు మొదలవుతుందట. పెళ్లి పిలుపులు.. దగ్గరి వాళ్లను పిలవడంలో దర్జా.. వేలువిడిచిన వాళ్లను పిలవడంలో ఆధునికతా సంతరించుకుంటున్నాయి. అయినవాళ్లను పిలవడంలో ఉన్న హంగే వేరు. పెళ్లి పత్రికతోపాటు, బంగారు చిరు కానుక, డ్రైఫ్రూట్స్ తాంబూలంతో పిలుపులు అందుతున్నాయి. ఇంకొంత మందయితే ఆహ్వానాన్ని మాట, పాట, ఆటతో ఏకంగా వీడియో తీసి పంపిస్తున్నారు. దీని ఖర్చు కనీసంగా 30 కోట్లరూపాయలు. సంగీత్.. నిజానికి ఇది ఉత్తర భారత సంప్రదాయం. డబ్బు ఎల్లలను చెరిపేస్తుంది అనడానికి ఇదో ఉదాహరణ. దక్షిణాది సంపన్న కుటుంబాలూ దీన్ని దత్తత తీసుకున్నాయి. ఇప్పుడైతే మధ్యతరగతి పెళ్లి ఇళ్లూ ఈ సంగీత్ ఆలాపనను ఆలింగనం చేసుకుంటున్నాయి. పిల్లా, పెద్దా అందరూ అడుగులేసే ఆనంద సంబరం. సందడి సమయం. రిచ్ ఫ్యామిలీస్ ఇంట జరిగే పెళ్లిళ్లలోని సంగీత్ సెలబ్రేషన్స్‌లో షారూఖ్ ఖాన్, మలైకా అరోరా వంటి బాలీవుడ్ స్టార్స్ వచ్చి స్టెప్స్ వేసి అలరిస్తున్నారు. విదేశాల్లో స్థిరపడ్డ భారతీయ పారిశ్రామివేత్తలయితే తమ పిల్లల పెళ్లిళ్ల సంగీత్లకు ఏకంగా పాప్స్టార్స్నే దింపుతున్నారు. సినిమా స్టార్స్‌ను పిలిచే రేంజ్ పార్టీలకయితే 30 కోట్ల వరకూ వెచ్చిస్తున్నాయట. మెహందీ.. పెళ్లికి కళ తెచ్చేది చేతుల్లో పండిన గోరింట, పాదాలకు పూసిన పారాణియే కదా! అందుకే ఆధునిక భారతంలో ఇదీ ఓ వేడుకే! ఓ పాతికేళ్ల కిందటి దాకా.. గోరింటాకు కోసం ప్రత్యేకమైన సంబంరం ఉండేది కాదు. పెళ్లి ముందు రోజు హడావిడిగా.. పెళ్లి కూతురి అరచేతులకు గోరింటాకు పెట్టేవారు అక్కలో, వదినలో, మరదళ్లో! ఇప్పుడలా కాదు.. మెహందీ డిజైనర్స్ వచ్చారు. ఈ డిజెన్స్ ఓ అభ్యాసం అయ్యాయి. కోర్స్‌లా మారాయి. అక్కడితో ఆగిపోలే.. నవీన కాలం గోరింటకు నవ రంగులను దిద్దుతోంది. ఎర్రటి పూతకు నల్లటి డైతో డైనింగ్ అద్దుతోంది. మధ్యలో బంగారు వర్ణాన్నీ నింపుతోంది. గోరింటాకు పెట్టడంలో సృజనాత్మకత, కళాత్మకత దేనికవే పోటీ పడుతున్నాయి. అరచేయిలోనే పూసే గోరింట ఇప్పుడు భుజాల దగ్గర నుంచి అరచేతుల నిండుగా పండి.. జఘనం మీదా వంపులు తిరిగి.. పాదాల పారాణి అవుతోంది. డిజైన్ బట్టి రేట్ నిర్ణయమవుతోంది. పెళ్లి కూతురు చేతులే కాదు.. ఆమె తాలూకు బంధువులందరి చేతులనూ ముద్దాడి రంగు పండిస్తోంది. ఇదీ పదికోట్ల రూపాయల వ్యవహారమే. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ప్రీ వెడ్డిం VŠ సెర్మనీస్లో లాస్ట్ బట్ లీస్ట్ .. పెళ్లి కూతురుని, పెళ్లి కొడుకును చేయడం. కొన్ని కుటుంబాలు తమ హోదా చూపించుకోవడం కోసం సెలబ్రెటీలతో ఈ కార్యక్రమాన్నీ ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ వేడుకకూ దేవలయం, కోట వంటి సెట్లను వేయిస్తున్నాయి. మొత్తమ్మీద కొన్ని కోట్ల ఖర్చుతో ఈ సంప్రదాయానికి కొత్త కళను తెప్పిస్తున్నాయి. పెళ్లి.. కావ్యాల్లో వర్ణించిన, కథల్లో చెప్పిన, సినిమాల్లో చూపించిన దానికంటే వెయ్యిరెట్లు వైభవంగా జరుగుతున్నాయి. కొబ్బరాకు పందిరి అల్లేవాళ్ల స్థానంలో సినిమా ఆర్ట్ డైరెక్టర్లు వచ్చి తిరుమలను తలపించే ఆలయ సెట్లను నిర్మిస్తున్నారు. రాజస్థాన్ మహళ్లను మరిపించే ప్యాలెస్‌లకు రూపమిస్తున్నారు. గుజరాత్ కోటలను తలదన్నే క్యాజిల్స్ని కడుతున్నారు. ఈవెంట్ మేనేజర్లు దానికో థీమ్‌ను ఇస్తున్నారు. ఫేమస్ ఫ్లారిస్ట్లు వచ్చి సొబగులద్దుతున్నారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కోసం పాపులర్ డ్రెస్ డిజైనర్స్ పెళ్లి వస్త్రాలను డిజైన్ చేస్తున్నారు. జ్యువలరీ డిజైనర్స్ వాళ్ల జ్యువలరీని డిసైడ్ చేస్తున్నారు. స్టయిలిస్ట్‌లు జుత్తును సరిచేస్తున్నారు. బ్రైడ్ అండ్ బ్రైడ్గ్రూమ్కి పౌడర్ అద్ది, కాటుక చుక్క దిద్దేది మేనత్తలు కాదు ప్రముఖ మేకప్ ఆర్టిస్టులు! పెళ్లి జరిపించేది ఊళ్లో పంతుళ్లు కాదు.. వేద పండితులు. ఇక ఈ పెళ్లికి అవసరమయ్యే పూలు, పళ్లు, తమలపాలకులు.. అన్నీ విదేశీవే! ఇంపోర్టెడ్ ఫ్రమ్ యూరప్ ఓన్లీ! భోజనాల దగ్గరా అసలు రాజీయే లేదు. గల్లీ ఫుడ్ నుంచి కాంటినెంటల్ దాకా అన్నీ ఉంటాయి. వచ్చినప్పటి నుంచీ వెళ్లిపోయేదాకా నోరూరిస్తూనే ఉంటాయి. ఒక్కోరకం వంటకానికి ఒక్కో షెఫ్ బృందం గరిటలు తిప్పుతుంది. శాస్త్రీయసంగీతంతో పాటు జాజ్ బ్యాండూ మిమ్మల్ని అలరిస్తుంది. క్లాసిక్‌తో పాటు క్యాజువల్ స్టెప్పులూ కనిపిస్తుంటాయి. వధూవరులకు మీరేం తెచ్చారని కాదు మిమ్మల్ని ఎంత సాదరంగా ఆహ్వానించి ఎంత ఘనంగా సాగనంపారన్నదే ఇక్కడ లెక్క. అందుకే రిటర్న్ గిఫ్ట్‌లూ పక్కాగా ఆ పెళ్లి రేంజ్‌లోనే ఉంటాయి. ఇంటికెళ్లి చూసుకుంటే అందులో బంగారమే బయటపడొచ్చు.. ముత్యమే మెరవచ్చు.. కాంజీవరం సిల్క్ సర్ప్రైజ్ చేయొచ్చు! ఒక్క ఈ వేడుకకే వంద నుంచి అయిదు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారట. పోస్ట్ వెడ్డింగ్ సెర్మనీస్.. వధువు, వరుడి ఇళ్లల్లో జరిగే సత్యనారాయణ వ్రతంతో మొదలవుతాయి. ఇంతకుముందు ఇదీ అయిన వాళ్ల మధ్యే నిరాడంబరంగా జరిగేది. ఇప్పుడు ఇదీ వేడుకే. 50 లక్షల ఖరీదు వ్యవహారం. రిసెప్షన్.. అబ్బాయింట జరిగే సంబరం. అమ్మాయి ఇంట జరిగిన పెళ్లికి దీటుగా నిర్వహించే ప్రయత్నం కాబట్టి అంతే ఆడంబరంగా ఉంటోంది. పొలిటికల్ లీడర్స్, సినిమా స్టార్స్ వచ్చి సందడి చేసి వెళ్తున్నారు. ఈ రిసెప్షన్ అలంకరణలోనూ ఆర్ట్డైరెక్టర్ల హస్తం ఉంటోంది. వస్త్రధారణలో డ్రెస్ డిజైనర్స్ అవసరముంటోంది. జ్యువెలరీ విషయంలో జ్యువెలరీ డిజైనర్స్ జోక్యం అనివార్యమవుతోంది. సేమ్.. గల్లి టు కాంటినెంటల్ ఫుడ్ స్టాల్స్.. గాన భజానా, డాన్స్‌ల హేల.. రిటర్న్ గిఫ్ట్స్ గోల... అమ్మాయి ఇంట జరిగిన పెళ్లిని మరిపించేట్టు సాగుతోంది. దీనికీ ఓ వంద కోట్ల నుంచి ఖర్చు మొదలవుతుందట. పదహారు రోజుల పండుగ.. ఇది వధువు ఇంట్లో జరిగే కార్యక్రమం. మంగళ సూత్రంలో నల్లపూసలు గుచ్చి వధువు మెడలో వేస్తారు. ఇది వరకూ దీన్నీ అయిదుగురు ముత్తయిదువులతో సరిపెట్టేవారు. ఇప్పుడూ ఊరంత పండగ చేస్తున్నారు. మంగళసూత్రం ఉత్త బంగారు తాడుతో సరిపెట్టుకోవట్లేదు. వజ్రాల జిలుగుల్నీ కోరుకుంటోంది. ఈ పదహారు రోజుల పండగతో పెళ్లి తంతంగం పూర్తయినట్టే! గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఆర్భాటానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో.. సంప్రదాయానికి అంతే పీట వేస్తున్నారు. పెళ్లిలో సరదాను ఎంత కోరుకుంటున్నారో.. తంతూ అంతే శాస్త్రోక్తంగా జరిగేలా చూస్తున్నారు. విఘ్నేశుడికీ వైభోగమే... ఏ శుభకార్యాన్నయినా విఘ్నేశ్వరుడి పూజతో ప్రారంభించడం ఆనవాయితీ. ఇదివరకైతే ఇది పెళ్లింటికే పరిమితమయ్యేది. మారిన కాలం దీన్నీ ఆర్భాటం చేస్తోంది. ఏ విఘ్నం కలగకుండా పెళ్లి పనులన్నీ సాఫీగా సాగిపోయేలా దీవించమని విఘ్నేశ్వరుడిని వైభోగంగా పూజిస్తున్నారు. కనీసం వంద మందికి పంక్తిలో భోజనం వడ్డిస్తున్నారు. సిమ్లా యాపిల్, చిలకలదిబ్బ తమలపాకులతో తాంబూలం ఇస్తున్నారు. ఖర్చు కోటి పై మాటే. బ్యాచ్లర్స్.. బ్యాచ్లరెట్స్ పార్టీలు త్వరలోనే జత కట్టబోతున్న అమ్మాయి, అబ్బాయి విడివిడిగా తమ స్నేహితులకిచ్చే పార్టీలివి. ఇదీ పాశ్చాత్య ధోరణియే. బీచ్, రిసార్ట్స్, హోటల్, టూర్.. అంటూ డెస్టినేషన్స్, కలర్, యాంబియెన్స్, డ్రెస్‌కోడ్ అంటూ థీమ్స్ ఈ పార్టీలకూ ఉన్నాయి. బిగ్ ప్యాట్ ఫ్యామిలీస్‌లోని వరులైతే దేశ సరిహద్దులు దాటి సీషెల్స్, మారిషస్, జమైకా వంటి తీర ప్రాంతాల్లో ఈ పార్టీలను సెలబ్రేట్ చేసుకుంటున్న దాఖలాలూ ఉన్నాయి. బ్యాచ్లర్స్ పార్టీలు పదేళ్ల కిందటి నుంచే హల్చల్ చేస్తున్నా.. వధువు తన స్నేహితులకిచ్చే బ్యాచ్లరెట్స్ పార్టీ ఒక అయిదేళ్ల కిందటి నుంచే ట్రెండ్‌గా మారింది. ఈ సరదా ఖరీదు పది కోట్ల రూపాయల వరకూ చేరుతోందట. మచ్చుకు కొన్ని బిగ్ఫ్యాట్ వెడ్డింగ్స్... 350 కోట్ల పెళ్లి ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీమిత్తల్ కూతురు వనీషాకు అమిత్ భాటియాతో 2004 లో పెళ్లయింది. వెర్సైల్స్‌లోని ఓ ప్యాలేస్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి ఖర్చు 350 కోట్ల రూపాయలు. ఈ పెళ్లి సంగీత్‌లో షారూఖ్‌ఖాన్, అక్షయ్‌కుమార్, కైలి, ఐశ్వర్యరాయ్, జూహి చావ్లా, సైఫ్ అలీఖాన్, రాణి ముఖర్జీలు డాన్స్ చేశారు. ఫరాఖాన్ కొరియోగ్రఫి అందించారు. 500 కోట్ల పెళ్లి ఇదీ లక్ష్మీమిత్తల్ కుటుంబ సభ్యులదే. లక్ష్మీమిత్తల్ సోదరుడి కూతురు సృష్టి మిత్తల్ పెళ్లి బార్సిలోనాలోని జాతీయ మ్యూజియం ‘కాటలాన్’లో జరిగింది. ఈ పెళ్లిలో విందుకోసం ఇండియా, థాయ్ ల్యాండ్ల నుంచి 200 మంది షెఫ్స్ను పిలిపించారు. 60 కిలోలున్న సిక్స్ టైర్ వెడ్డింగ్ కేక్‌ను తయారు చేయించారు. 10 మిలియన్ యూరోల పెళ్లి... బ్రిటన్‌లో స్థిరపడ్డ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ ప్రమోద్ అగర్వాల్ తన కూతురు వినీత పెళ్లిలో పాప్ స్టార్ షకీరాతో చిందేయించాడు. 2011, మేలో వెనీస్‌లోని శాన్ క్లెమెంట్ ప్యాలేస్ రిసార్ట్స్‌లో వినీతకు ముఖిత్ తేజతో ముడుముళ్లు పడ్డాయి. ఈ పెళ్లికి ప్రపంచవ్యాప్తంగా 800 మంది అథిరథమహారథులు అతిథులుగా వచ్చారు. 72 గంటలపాటు నిరవధికంగా వేడుకలు జరిగాయి. షకీరా ఆట, పాట ఈ పెళ్లికే ప్రత్యేకతను తెచ్చాయట. మోడర్న్ మ్యారేజెస్... రకాలు పురాణాలు ఎనిమిది రకాల పెళ్లిళ్లను వివరించినట్టు.. ఈ మోడర్న్ఏజ్ కొన్ని రకాల పెళ్లిళ్లను వర్ణిస్తోంది. డెస్టినేషన్ మ్యారేజ్: వీటికి నింగి, నేల, నీరే గమ్యాలు. వరల్డ్ ఫేమస్ ఐల్యాండ్స్‌లో ఈ వివాహాలు పందిరి అల్లుకుంటున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో ఈ పెళ్లిళ్లకు పీటలు వేసుకుంటున్నాయి. ఆకాశంలో ప్యారాచ్యూట్ ద్వారా గాల్లో ఎగురుతూ జంటలు తలంబ్రాలు పోసుకుంటున్నాయి. చార్టర్ ప్లయిట్స్లో, హెలీకాప్టర్స్లోనూ జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్నాయి. సముద్రగర్భంలో ఈదుతూ తాళి కట్టించుకుంటున్నాయి. థీమ్ అండ్ కాన్సెప్ట్ మ్యారేజెస్: ఈకో ఫ్రెండ్లీ అని, కంప్లీట్ ట్రెడిషనల్ అని, వెజ్ థీమ్ అని ఇలా రకరకాల కాన్సెప్ట్‌లతోనూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఫోర్ట్ మ్యారేజెస్: అంటే రాజకోటలో పెళ్లి చేసుకోవడం. కోటలున్న ప్రాంతాలకే వెళ్లి నిజమైన కోటలోనే పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి పెళ్లిళ్ల కోసం గుజరాత్, రాజస్థాన్‌లు చాలా డిమాండ్‌లో ఉన్నాయి. ప్యాలేస్ మ్యారేజెస్: ప్యాలెస్ సెట్లో కాకుండా నిజమైన ప్యాలేస్లోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. సల్మాన్‌ఖాన్ చెల్లెలు అర్పితాఖాన్ చేసుకుంది ఇలాంటి పెళ్లినే. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలేస్‌లో ఆమె పెళ్లి జరిగింది. దీనికి డిమాండ్ ఉన్న ప్లేస్ ఏంటో వేరే చెప్పక్కర్లేదు కదా! అవును రాజస్థానే. హోటల్ మ్యారేజెస్: దేశ, విదేశాల్లోని సెవెన్ స్టార్ హోటల్స్ ఈ పెళ్లిళ్లకు ఆతిథ్యం ఇస్తున్నాయి. బీచ్ మ్యారేజెస్: కేరళ కోవలం బీచ్ నుంచి కొంకణ్, గోవా తీరాలు దాటి యూరప్ సముద్ర తీరాలను వెదుక్కుంటూ వెళ్తున్నాయి ఈ వివాహాలు. టూర్ మ్యారేజెస్: ఇందులో ఒక టూర్ ప్యాకేజ్ ఉంటుంది. పెళ్లిలోని ఒక్కో తంతును ఆ టూర్‌లోని ఒక్కో ఊళ్లో నిర్వహిస్తారన్నమాట. పెళ్లి అయిపోయింది అన్నదాని కంటే ఎక్కడ అయింది, ఎలా అయింది అన్నదే వీళ్లకు ముఖ్యం. అందుకే ఖర్చు విషయంలో రాజీపడకుండా.. అభిరుచినే అందలమెక్కిస్తూ ఏడు సముద్రాలు దాటుతున్నారు.. ఆకాశాన్ని అంటుతున్నారు.. నీటిని చీల్చుకుంటూ వెళ్తున్నారు. -
న్యూ ట్రెండ్జ్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని తాజ్ కృష్ణా హోటల్లో బుధవారం ట్రెండ్జ్ ఎక్స్పో ప్రారంభమైంది. మొత్తం 75 మంది డిజైనర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని నిర్వాహకురాలు శాంతి కతిరావన్ చెప్పారు. రానున్న శ్రావణమాసం, పెళ్లిళ్ల సీజన్‌ను పురస్కరించుకుని అన్ని రకాల వస్త్రశ్రేణులు, ఆభరణాలు, యాక్సెసరీస్‌ను ప్రదర్శిస్తున్నామని వివరించారు. ఇది తమ 100వ ప్రదర్శన అని... మరో 2 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. -
ప్రయివేటు బస్సుల దోపిడీ
► పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెరిగిన ప్రయాణికుల రద్దీ ► విజయవాడ - హైదరాబాద్ బస్సులకు డిమాండ్ ► డబల్ చార్జీ వసూలు చేస్తున్న ప్రయివేటు ట్రావెల్స్ ► ఆర్టీసీ బస్సుల్లో స్పెషల్ సర్వీసు పేరిట బాదుడు విజయవాడ : పెళ్లిళ్ల సీజన్లో ప్రయివేటు బస్సులకు డిమాండ్ పెరిగింది. ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా తీసుకున్న ప్రయివేటు ఆపరేటర్లు అమాంతం రేట్లను పెంచేసి పయాణికులను నిలువునా దోచేస్తున్నారు. ప్రధానంగా విజయవాడ నుంచి హైదరాబాద్ మధ్య నడిచే ప్రయివేటు బస్సుల్లో ఆదివారం చార్జీలను రెట్టింపునకు పైగా పెంచారు. ఈ నెల 25వ తేదీన వివాహాలు, ఇతర శుభకార్యాలు అధికంగా ఉండటంతో హైదరాబాద్, విజయవాడ మధ్య ప్రయాణికుల రద్దీ పెరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రోజూ 187 ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుం టాయి. హైదరాబాద్ నుంచి తెలంగాణ ఆర్టీసీ నుంచి కూడా 50 బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. ఆదివారం విజయవాడ నుంచి అదనంగా 82 ప్రత్యేక సర్వీసులు నడిపారు. ఆర్టీసీ బస్సుల్లో సీట్లు పూర్తిగా బుక్ కావడంతో ప్రయాణికులు ప్రయివేటు బస్సుల వైపు ఎగబడ్డారు. దీంతో నగరం నుంచి ైహైదరాబాద్ వెళ్లే ప్రయివేటు బస్సుల చార్జీలను హైస్పీడులో పెంచేశారు. సాధారణ రోజుల్లో విజయవాడ, హైదరాబాద్ మధ్య 500 నుంచి 700 ప్రయివేటు బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. మామూలు రోజుల్లో 10 నుంచి 50 శాతం వరకు ఆన్లైన్లో చార్జీ తగ్గించి ఆఫర్లు ప్రకటిస్తున్న ప్రయివేటు ఆపరేటర్లు పెళ్లిళ్ల సీజన్లో జబర్దస్తీగా టికెట్ల ధరలు పెంచేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు సాధారణ రోజుల్లో ఏసీ బస్సుల్లో రూ.500 నుంచి రూ.600 చొప్పున చార్జీ వసూలు చేసేవారు. రద్దీ పెరగడంతో ఆదివారం ఏసీ ప్రయివేటు బస్సు చార్జీ రూ.1500 వరకు పలికింది. అదే స్లీపర్ కోచ్‌ల్లో రూ.2,200 వసూలు చేశారు. ప్రయివేటు ఆపరేటర్లు అందరూ ఇదే తరహాలో అధిక చార్జీలు వసూలు చేశారు. విజయవాడ, హైదరాబాద్ మధ్య నాన్ ఏసీ బస్సుల్లో రూ.400 చొప్పున ఉండే చార్జీని రూ.700 వరకు వసూలు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం అధిక చార్జీ ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యేక సర్వీసుల్లో 50 శాతం అధికంగా చార్జీ వసూలు చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే సూపర్ లగ్జరీ సర్వీసు చార్జీ రూ.269. అయితే ప్రత్యేక సర్వీసుల్లో రూ.404 చొప్పున వసూలు చేశారు. ఏసీ ప్రత్యేక సర్వీసుల్లో కూడా టికెట్ ధరలను ఆర్టీసీ అధికారులు పెంచారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే గరుడ చార్జీని రూ.559 నుంచి రూ.839కి పెంచారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన సర్వీసులు సిటీ బస్సులు, పల్లె వెలుగు సర్వీసుల్లో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతూ హైదరాబాద్, విజయవాడ మధ్య రాకపోకలు సాగించారు. -
పట్టు చీరకు కొత్త హంగులు..
పెళ్లిళ్ల సీజన్. పాత పట్టుచీరలను పెట్టెల అడుగునే ఉంచేయకుండా వాటికో కొత్త రూపు ఇస్తే న్యూ లుక్ ఇలా నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతాయి.సంప్రదాయ పట్టుచీరను ఆధునికపు హంగులు అద్ది లాంగ్ గౌన్‌గా రూపు కట్టవచ్చు.చీరంతా పాడైపోయినా, అంచులు, పల్లూ డిజైన్స్ జరీ మెరుపులు కొత్తగా అలాగే ఉండిపోతాయి. వీటిని అందమైన క్లాత్ హ్యాండ్ బ్యాగులుగా రూపొందించుకోవచ్చు. పట్టు చీరను ఇలా చుడీ టాప్‌గా డిజైన్చేయించుకోవచ్చు. చీరకట్టుకోవడానికి ఇబ్బంది పడే అమ్మాయిలు వీటిని సౌకర్యవంతంగా ధరించవచ్చు.అంచుల మీద ఆప్లిక్, గోటా వర్క్ చేసిన ఎరుపు, పచ్చ, నారింజ రంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న కంజీవరం లాంగ్ అనార్కలీ ఇది. చీరంతా పాడైపోయినా, అంచులు, పల్లూ డిజైన్స్ జరీ మెరుపులు కొత్తగా అలాగే ఉండిపోతాయి. వీటిని అందమైన క్లాత్ హ్యాండ్ బ్యాగులుగా రూపొందించుకోవచ్చు.