గ్రేటర్‌లో నిలిచిపోనున్న 15వేల పెళ్లిళ్లు | 15000 Marriages Postponed Due To Lockdown in Hyderabad | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ పొడిగింపు; లగ్గానికి పగ్గం

Published Wed, Apr 15 2020 10:19 AM | Last Updated on Wed, Apr 15 2020 11:01 AM

15000 Marriages Postponed Due To Lockdown in Hyderabad - Sakshi

పెళ్లంటే రెండు కుటుంబాల మధ్య వారధే కాదు.. సకల వృత్తులవారికి ఉపాధి కూడా. లక్షలాది రూపాయల మేర జరిగే వ్యాపారం. ఎంతో మందికి బతుకుదెరువు. ఒక్క వివాహం ఎన్నో కుటుంబాలకు ఉపాధినిస్తుంది. బాజాభజంత్రీలు.. తళుకులీనే వర్ణరంజిత విద్యుద్దీపాలు.. పెళ్లి మండపాల్లో  అలంకరణలు.. విందు భోజనాలు.. స్వర్ణాభరణాలు.. నూతన వస్త్రాలు..  వంటింటి సామగ్రి కొనుగోళ్లు.. ఇలా చెబుతూ పోతే ఈ జాబితా చాంతాడంత అవుతుంది. ఇంత తతంగం ఉంటుంది పెళ్లంటే. ప్రతియేటా ఏప్రిల్‌ నెలలో బాజాభజంత్రీలతో అట్టహాసంగా సాగే పెళ్లి వేడుకల దృశ్యాలే ప్రస్తుతం కనిపించడంలేదు. లాక్‌డౌన్‌తో ముహూర్తాలు మూలకు చేరాయి. వివాహ తంతు వాయిదా పడింది. కల్యాణ మంటపాలు కళతప్పాయి. ఫంక్షన్‌ హాళ్లు వెలవెలబోయాయి. పురోహితుడి నుంచి బ్యాండ్‌ వాద్యకారుల దాకా అన్ని వృత్తులపై తీవ్ర ప్రభావం చూపింది.         

సాక్షి, సిటీబ్యూరో :  ‘పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. చప్పట్లు తాళాలు తలంబ్రాలు.... మూడే ముళ్లు..ఏడే అడుగులు....అంతేనా... పెళ్లంటే ఒక సామాజిక జీవితం. వందల కోట్ల రూపాయాల వ్యాపారం. లక్షలాది మందికి బతుకుదెరువు. ఒక్క పెళ్లి ఎన్నో కుటుంబాలకు ఉపాధినిస్తుంది. రెండు జీవితాలు ముడిపడి ఒక్కటయ్యే వేళ... వినిపించే  బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాలు, గుబాళించే పూలసౌరభాలు, రంగురంగుల విద్యుద్దీపాలు, కనువిందు చేసే పెళ్లిమండపాల అలంకరణ, పసందైన విందు భోజనాలు, తళుకులీనే వస్త్రాభరణాలు,బంధుమిత్రుల రాకపోకలు.సందడిగా కనిపించే రహదారులు...మార్చి నెలాఖరు నుంచి మే నెలాఖరు వరకు సుమారు 2 నెలల పాటు జరిగే పెళ్లిళ్లు ఒక్క ఏడాది కాలానికి సమానమైన వ్యాపారసామ్రాజ్యాన్ని నిర్మిస్తాయి.

బంగారు ఆభరణాలు, బట్టల అమ్మకాలు, వెండి వస్తువులు, వంటింటి సామాగ్రి, ఫర్నీచర్‌ వంటి అనేక రకాల వస్తువులు  ఈ సీజన్‌లోనే ఎక్కువగా అమ్ముడవుతాయి. అలాంటి పెళ్లిళ్ల సీజన్‌కు కరోనా కాటేసింది. లాక్‌డౌన్‌ బ్రేక్‌ పడింది. ఏప్రిల్‌  15వ తేదీ ముహూర్తం కోసం  మార్చి రెండో వారంలోనే  అమెరికా నుంచి హైదరాబాద్‌ చేరుకున్న వధూవరులు ఎక్కడి వాళ్లు అక్కడే  ఇళ్లకు పరిమితమయ్యారు. ఇప్పటికే  చాలా ముహూర్తాలు వాయిదా పడ్డాయి. గతేడాది  ఏప్రిల్, మే నెలల్లో సుమారు 12,500 పెళ్లిళ్లు జరిగినట్లు అంచనా. ఈసారి ఇదే కాలంలో 15000 లకు పైగా పెళ్ళిళ్లు జరిగేందుకు అవకాశం ఉన్నప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా అన్నీ వాయిదా పడినట్లు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పురోహితులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు  గ్రేటర్‌ పరిధిలోని సుమారు 5 వేలకు పైగా చిన్నవి. పెద్దవి ఫంక్షన్‌హాళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లు, పెళ్లి మండపాలు ఎలాంటి కళా కాంతులు లేకుండా వెలవెలాపోతున్నాయి. కేటరింగ్‌ సర్వీసుల్లో, బ్యాండ్‌ మేళ్లాల్లో పని చేసే సిబ్బంది, కళాకారులు ఉపాధిని కోల్పోయారు.సుమారు 2 లక్షల మంది ఉపాధిపైన మహమ్మారి   కరోనా వేటేసింది.

కేటరింగ్‌ పై వేటు...
రుచికరమైన ఆహారపదార్ధాలను వడ్డించి పెళ్లి భోజనాలకు పెట్టింది పేరుగా నిలిచే కేటరింగ్‌ సంస్థలు చతికిలాపడ్డాయి. ఆయా సంస్థల యజమానులు, నిర్వాహకులే కాకుండా  కేటరింగ్‌లో పని చేసే వంటవాళ్లు, సిబ్బంది వేలాది మంది ఉపాధిని కోల్పోయారు. సాధారణంగా ఒక పెళ్లికి  కనీసం రూ. 2 లక్షల నుంచి  రూ.25 లక్షల వరకు కూడా భోజనాలకు ఖర్చవుతుంది. పెళ్లికి వచ్చే  బంధుమిత్రుల సంఖ్యకు అనుగుణంగా, వడ్డించే పదార్ధాలను బట్టి  ధరల్లో హెచ్చతగ్గులు ఉంటాయి. నగరంలోని వందల కొద్దీ కేటరింగ్‌ సంస్థలు, నిర్వాహకులపైన లాక్‌డౌన్‌ ప్రభావం పడింది. అంతేకాకుండా పూలు, పండ్ల వ్యాపారాలు, వివిధ రకాల వస్తువుల విక్రయాలు సైతం నిలిచిపోయాయి. మొత్తంగా  పెళ్లిళ్లతో ముడిపడిన ఒక వ్యవస్థ స్తంభించింది.

ముహూర్తాలు బలమైనవే... కానీ ఏం లాభం...
లాక్‌డౌన్‌ నిశీధిలో రహదారులు నిర్మానుష్యమయ్యాయి.నిజానికి ఈ లాక్‌డౌన్‌ లేకుండా  అంతా  సాదాసీదాగా ఉండి ఉంటే   బుధవారం అంటే (ఏప్రిల్‌ 15వ తేదీ) నుంచి గురు (16),శుక్ర (17) వారాలు మూడు రోజుల పాటు వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరిగేవి. ఈ మూడు రోజుల పాటు వృశ్చికం, కుంభలగ్నం బలమైన ముహూర్తాలు ఉన్నాయి. ఆ తరువాత ఏప్రిల్‌ 25, 26, 29 తేదీల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. మే నెలలో 1, 3. 6, 7, 13, 17 తేదీల్లోనూ బలమైన పెళ్లి ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు తెలిపారు. ఆ తరువాత జూన్‌ 13వ తేదీ వరకు ఎలాంటి ముహూర్తాలు లేవు.

ఒకవేళ వధూవరుల పేరు బలంపైన నిర్ణయించే పెట్టుడు ముహూర్తాలు మినహా  ప్రత్యేకంగా  ఎలాంటి ముహూర్తాలు  లేవు. దీన్ని దృష్టిలో ఉంచుకొని  ఏప్రిల్, మే నెలల్లోనే  ఎక్కువ శాతం పెళ్లిళ్లు జరుగుతాయి. ఈ లెక్కన ఏప్రిల్, మే  నెలల్లోని  12  రోజుల పెళ్లి ముహూర్తాల్లో  సుమారు 15 వేలకు పైగా పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉన్నట్లు పురోహిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా  ఈ పెళ్లిళ్లన్నీ వాయిదా పడ్డాయి. ‘‘ ఆ తరువాత జూలై , ఆగస్టు నెలల్లో కొన్ని ముహూర్తాలు ఉన్నాయి. తిరిగి అక్టోబర్, నవంబర్,డిసెంబర్‌  నెలల్లోనే  ఎక్కువ సంఖ్యలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. కరోనా కారణంగా వాయిదా పడిన పెళ్లిళ్లన్నీ నవంబర్, డిసెంబర్‌ నెలల్లో ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.’’ అని మణికొండకు చెందిన పురోహితుడు శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా  ఈ  మూడు రోజుల్లోనే వేలాది పెళ్లిళ్లకు బ్రేక్‌ పడినట్లు పేర్కొన్నారు. 

ఫంక్షన్‌ హాళ్లు వెలవెల..

నోవాటెల్‌ వంటి పెద్ద పెద్ద హోటళ్లు, హెచ్‌ఐసీసీ వంటి కన్వెన్షన్‌ సెంటర్లు మొదలుకొని చిన్న, పెద్ద ఫంక్షన్‌ హాళ్ల వరకు వేల సంఖ్యలో ఉన్నాయి. దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, హయత్‌నగర్, కర్మన్‌ఘాట్, చంపాపేట్, బీఎన్‌రెడ్డి నగర్, సికింద్రాబాద్, తిరుమలగిరి, అల్వాల్, మేడ్చెల్, తదితర అనేక ప్రాంతాల్లో సుమారు 5 వేలకు పైగా ఫంక్షన్‌ హాళ్లు, హోటళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లు ఏప్రిల్, మే నెలల్లో  సందడిగా ఉంటాయి, ప్రతి రోజు పెళ్లి వేడుకలతో వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. సాధారణంగా అయితే  కనీసం  3 నెలలు ముందే బుక్‌ చేసుకోవలసి ఉంటుంది. ఒక్కో ఫంక్షన్‌ హాల్‌  కనిష్టంగా రూ.2 లక్షల నుంచి గరిష్టంగా రూ.10 లక్షల వరకు చార్జీ చేస్తుంది. ఈ లెక్కన ఒక చిన్న ఫంక్షన్‌  హాల్‌ 12  రోజుల్లో  కనీసం రోజుకు రెండు ముహూర్తాల చొప్పున పెళ్లిళ్లు జరుగుతాయి. కోట్లాది రూపాయాల ఆదాయం లభిస్తుంది. ఇక భారీ ఫంక్షన్‌హాళ్లలో వందల కోట్ల రూపాయాల ఆదాయానికి లాక్‌డ్‌న్‌ బ్రేక్‌ వేసింది. ‘‘రెండు నెలల్లో  12 ముహూర్తాల్లో  రోజుకు రూ.5 లక్షల చొప్పున కనీసం రూ.60 లక్షల ఆదాయం లభించేది. కరోనా వల్ల కోల్పోవలసి వస్తోంది.’’ అని  మేడ్చెల్‌కు చెందిన ఫంక్షన్‌హాల్‌ నిర్వాహకుడు ఒకరు  ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ వల్ల  వందల కోట్ల  వ్యాపారకార్యకలాపాలు ఎక్కడికక్కడ స్తంభించాయి.

చప్పుడు ఆగింది...
ఇక పెళ్లిళ్లలో బ్యాండు భజంత్రీలు, మేళ,తాళాలు, సన్నాయి వాయిద్యాలకు ఉండే డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, హైదరాబాద్‌లో సుమారు 10 వేల మంది  వందల కొద్దీ బృందాలుగా  ఏర్పడి  శుభకార్యాల్లో పాల్గొంటున్నారు. ఈ  బ్యాండుమేళాల్లో పని చేసే కళాకారులు, సిబ్బంది  తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా ఒరిస్సా, మహారాష్ట్ర, తదితర పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. పెళ్లిళ్ల సీజన్‌ అయిపోయే వరకు హైదరాబాద్‌లోనే ఉంటారు. ఈ  సీజన్‌లో సంపాదించుకొన్న డబ్బుతోనే వాళ్లు ఏడాది పాటు కుటుంబాన్ని పోషించుకుంటారు.ఒక పెళ్లికి రూ.25 వేల నుంచి రూ.50 వేలు, రూ.లక్షకు పైగా కూడా  ఆదాయం వస్తుంది. పెళ్ళిళ్ల స్థాయి, హోదాకు అనుగుణంగా బ్యాండుమేళాల ఆదాయం ఉంటుంది. ‘ ఇలాంటి సంక్షోభం తమ జీవిత కాలంలోనే చూడలేదని  పలువురు బ్యాండు కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన నర్సింగ్‌  30 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నాడు, తనతో పాటు 50 మంది పని చేస్తున్నారు. ఇప్పుడు వాళ్లంతా రోడ్డున పడ్డారు.‘‘ కరోనా వచ్చుడు, జనం సచ్చుడేందో కానీ, పని లేక ఆకలితో సచ్చిపోయేటట్లున్నం,...’’ అని విచారం వ్యక్తం చేశాడు.

 ఇక నవంబర్‌ మాసంలోనే 
చాలా మంది ఏప్రిల్, మే నెలల్లో జరిగే పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. వీరంతా  నవంబర్, డిసెంబర్‌ మాసాల్లోనే ముహూర్తాలు ఖరారు చేసుకుంటున్నారు.  ఏ విధంగా చూసినా ఈ ఏడాది పెళ్లిళ్ల సందడి పెద్దగా ఉండకపోవచ్చు. లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోయారు.   
– శ్రావణ్‌కుమార్‌ శర్మ, పురోహితుడు, మణికొండ

కరోనా కంట్రోల్‌ అయ్యాకే మాఇంట్లో పెళ్లి
ఏప్రిల్‌ 5న మా అన్నయ్య కుమార్తె వివాహం జరగాల్సి ఉంది. కరోనా కారణంగా వాయిదా వేశాం. సాదాసీదాగా జరుపుకునే దాని కంటే వాయిదా వేసుకోవడమే ఉత్తమం అని భావించాం. అందుకే కరోనా పూర్తి స్థాయిలో కంట్రోల్‌ అయ్యాక మంచి ముహూర్తం చూసుకుని పెళ్ళి చేయాలనుకుంటున్నాం. ఈ సమయంలో భౌతిక దూరం పాటించడం ద్వారానే మనం కరోనాను జయించగలం.     
– మారుతి, మోడల్‌కాలనీ  

పెళ్లిళ్లన్నీ వాయిదానే..   
చాలా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. మల్కాజిగిరి చుట్టుపక్కల 15 ఫంక్షన్‌ హాళ్లు మూసివేశారు. పౌరోహిత్యంపైనే ఆధారపడిన మాలాంటి వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. కుటుంబ నిర్వహణ భారంగా మారింది. పెళ్లిళ్లతో పాటు ఇతర శుభకార్యాలు సైతం పెద్దసంఖ్యలో వాయిదాపడ్డాయి.
– వెంకట రమణాచార్యులు,పురోహితుడు, మల్కాజిగిరి

ఉపాధి ఉఫ్‌..
నాతో పాటు మరో 50 మందికి ఉపాధి లభించేది పెళ్లిళ్ల సీజన్‌లోనే.. కానీ లాక్‌డౌన్‌ కారణంగా అన్నీ ఆగిపోయాయి. ఒక్కో సీజన్‌లో 100 నుంచి 150 పెళ్లిళ్లకు బ్యాండ్‌ వాయిస్తాం. ఈ ఏడాది ఒక్క పెళ్లి ఆర్డర్‌ కూడా ఇప్పటి వరకు రాలేదు. వచ్చే అవకాశమూ లేదు. కుటుంబ పోషణ భారంగా మారింది. పూటగడవడం కష్టంగా ఉంది. ప్రభుత్వం మమ్మల్ని అన్ని విధాలా ఆదుకోవాలి.
– గంగాధర్, గీతా బ్యాండ్‌ మేళా, సికింద్రాబాద్‌  

►పేట్‌బషీరాబాద్‌ సుభాష్‌నగర్‌కు చెందిన సుధాకర్‌రెడ్డి కూతురు వివాహం ఈ నెల 21న జరగాల్సి ఉంది. అమెరికాలోని వర్జీనియాలో ఉండే అబ్బాయితో ఆన్‌లైన్‌లోనే ఎంగేజ్‌మెంట్‌ చేశారు. లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే పెళ్లి చేయవచ్చని భావించారు. కానీ లాక్‌డౌన్‌ను మరోసారిపొడిగించడంతో పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

►మణికొండకు చెందిన ఓ అమ్మాయికి బెంగళూర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగితోవివాహం నిశ్చయమైంది. ఈ నెల 16నజరగాల్సిన పెళ్లి లాక్‌డౌన్‌ కారణంగావాయిదా పడింది, మరో ముహూర్తం ఇంకానిర్ణయించుకోలేదు.

►కుత్బుల్లాపూర్‌మాణిక్‌నగర్‌కు చెందినరమేష్‌కు నెల్లూరు జిల్లా కావలికి చెందిన యువతితో మార్చి 12న వివాహం నిశ్చయమైంది. ఏప్రిల్‌ 5న ముహూర్తం ఖరారు చేశారు. మార్చి 22న పెళ్లి దుస్తులు కొనుగోలు చేసేందుకు అమ్మాయి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు వచ్చారు. కానీ లాక్‌డౌన్‌ కారణంగా ఇక్కడేచిక్కుకుపోయారు. దీంతో వివాహం వాయిదా పడింది. వాళ్లంతా తిరిగి కావలికి చేరుకోలేని పరిస్థితి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement