ప్రయివేటు బస్సుల దోపిడీ
► పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెరిగిన ప్రయాణికుల రద్దీ
► విజయవాడ - హైదరాబాద్ బస్సులకు డిమాండ్
► డబల్ చార్జీ వసూలు చేస్తున్న ప్రయివేటు ట్రావెల్స్
► ఆర్టీసీ బస్సుల్లో స్పెషల్ సర్వీసు పేరిట బాదుడు
విజయవాడ : పెళ్లిళ్ల సీజన్‌లో ప్రయివేటు బస్సులకు డిమాండ్ పెరిగింది. ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా తీసుకున్న ప్రయివేటు ఆపరేటర్లు అమాంతం రేట్లను పెంచేసి పయాణికులను నిలువునా దోచేస్తున్నారు. ప్రధానంగా విజయవాడ నుంచి హైదరాబాద్ మధ్య నడిచే ప్రయివేటు బస్సుల్లో ఆదివారం చార్జీలను రెట్టింపునకు పైగా పెంచారు. ఈ నెల 25వ తేదీన వివాహాలు, ఇతర శుభకార్యాలు అధికంగా ఉండటంతో హైదరాబాద్, విజయవాడ మధ్య ప్రయాణికుల రద్దీ పెరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రోజూ 187 ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుం టాయి. హైదరాబాద్ నుంచి తెలంగాణ ఆర్టీసీ నుంచి కూడా 50 బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. ఆదివారం విజయవాడ నుంచి అదనంగా 82 ప్రత్యేక సర్వీసులు నడిపారు.
ఆర్టీసీ బస్సుల్లో సీట్లు పూర్తిగా బుక్ కావడంతో ప్రయాణికులు ప్రయివేటు బస్సుల వైపు ఎగబడ్డారు. దీంతో నగరం నుంచి ైహైదరాబాద్ వెళ్లే ప్రయివేటు బస్సుల చార్జీలను హైస్పీడులో పెంచేశారు. సాధారణ రోజుల్లో విజయవాడ, హైదరాబాద్ మధ్య 500 నుంచి 700 ప్రయివేటు బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. మామూలు రోజుల్లో 10 నుంచి 50 శాతం వరకు ఆన్‌లైన్‌లో చార్జీ తగ్గించి ఆఫర్లు ప్రకటిస్తున్న ప్రయివేటు ఆపరేటర్లు పెళ్లిళ్ల సీజన్‌లో జబర్దస్తీగా టికెట్ల ధరలు పెంచేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు సాధారణ రోజుల్లో ఏసీ బస్సుల్లో రూ.500 నుంచి రూ.600 చొప్పున చార్జీ వసూలు చేసేవారు.
రద్దీ పెరగడంతో ఆదివారం ఏసీ ప్రయివేటు బస్సు చార్జీ రూ.1500 వరకు పలికింది. అదే స్లీపర్ కోచ్‌ల్లో రూ.2,200 వసూలు చేశారు. ప్రయివేటు ఆపరేటర్లు అందరూ ఇదే తరహాలో అధిక చార్జీలు వసూలు చేశారు. విజయవాడ, హైదరాబాద్ మధ్య నాన్ ఏసీ బస్సుల్లో రూ.400 చొప్పున ఉండే చార్జీని రూ.700 వరకు వసూలు చేశారు.
ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం అధిక చార్జీ
ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యేక సర్వీసుల్లో 50 శాతం అధికంగా చార్జీ వసూలు చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే సూపర్ లగ్జరీ సర్వీసు చార్జీ రూ.269. అయితే ప్రత్యేక సర్వీసుల్లో రూ.404 చొప్పున వసూలు చేశారు. ఏసీ ప్రత్యేక సర్వీసుల్లో కూడా టికెట్ ధరలను ఆర్టీసీ అధికారులు పెంచారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే గరుడ చార్జీని రూ.559 నుంచి రూ.839కి పెంచారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన సర్వీసులు సిటీ బస్సులు, పల్లె వెలుగు సర్వీసుల్లో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతూ హైదరాబాద్, విజయవాడ మధ్య రాకపోకలు సాగించారు.