Burden of charges
-
ప్రయివేటు బస్సుల దోపిడీ
► పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెరిగిన ప్రయాణికుల రద్దీ ► విజయవాడ - హైదరాబాద్ బస్సులకు డిమాండ్ ► డబల్ చార్జీ వసూలు చేస్తున్న ప్రయివేటు ట్రావెల్స్ ► ఆర్టీసీ బస్సుల్లో స్పెషల్ సర్వీసు పేరిట బాదుడు విజయవాడ : పెళ్లిళ్ల సీజన్లో ప్రయివేటు బస్సులకు డిమాండ్ పెరిగింది. ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా తీసుకున్న ప్రయివేటు ఆపరేటర్లు అమాంతం రేట్లను పెంచేసి పయాణికులను నిలువునా దోచేస్తున్నారు. ప్రధానంగా విజయవాడ నుంచి హైదరాబాద్ మధ్య నడిచే ప్రయివేటు బస్సుల్లో ఆదివారం చార్జీలను రెట్టింపునకు పైగా పెంచారు. ఈ నెల 25వ తేదీన వివాహాలు, ఇతర శుభకార్యాలు అధికంగా ఉండటంతో హైదరాబాద్, విజయవాడ మధ్య ప్రయాణికుల రద్దీ పెరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రోజూ 187 ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుం టాయి. హైదరాబాద్ నుంచి తెలంగాణ ఆర్టీసీ నుంచి కూడా 50 బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. ఆదివారం విజయవాడ నుంచి అదనంగా 82 ప్రత్యేక సర్వీసులు నడిపారు. ఆర్టీసీ బస్సుల్లో సీట్లు పూర్తిగా బుక్ కావడంతో ప్రయాణికులు ప్రయివేటు బస్సుల వైపు ఎగబడ్డారు. దీంతో నగరం నుంచి ైహైదరాబాద్ వెళ్లే ప్రయివేటు బస్సుల చార్జీలను హైస్పీడులో పెంచేశారు. సాధారణ రోజుల్లో విజయవాడ, హైదరాబాద్ మధ్య 500 నుంచి 700 ప్రయివేటు బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. మామూలు రోజుల్లో 10 నుంచి 50 శాతం వరకు ఆన్లైన్లో చార్జీ తగ్గించి ఆఫర్లు ప్రకటిస్తున్న ప్రయివేటు ఆపరేటర్లు పెళ్లిళ్ల సీజన్లో జబర్దస్తీగా టికెట్ల ధరలు పెంచేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు సాధారణ రోజుల్లో ఏసీ బస్సుల్లో రూ.500 నుంచి రూ.600 చొప్పున చార్జీ వసూలు చేసేవారు. రద్దీ పెరగడంతో ఆదివారం ఏసీ ప్రయివేటు బస్సు చార్జీ రూ.1500 వరకు పలికింది. అదే స్లీపర్ కోచ్‌ల్లో రూ.2,200 వసూలు చేశారు. ప్రయివేటు ఆపరేటర్లు అందరూ ఇదే తరహాలో అధిక చార్జీలు వసూలు చేశారు. విజయవాడ, హైదరాబాద్ మధ్య నాన్ ఏసీ బస్సుల్లో రూ.400 చొప్పున ఉండే చార్జీని రూ.700 వరకు వసూలు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం అధిక చార్జీ ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యేక సర్వీసుల్లో 50 శాతం అధికంగా చార్జీ వసూలు చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే సూపర్ లగ్జరీ సర్వీసు చార్జీ రూ.269. అయితే ప్రత్యేక సర్వీసుల్లో రూ.404 చొప్పున వసూలు చేశారు. ఏసీ ప్రత్యేక సర్వీసుల్లో కూడా టికెట్ ధరలను ఆర్టీసీ అధికారులు పెంచారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే గరుడ చార్జీని రూ.559 నుంచి రూ.839కి పెంచారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన సర్వీసులు సిటీ బస్సులు, పల్లె వెలుగు సర్వీసుల్లో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతూ హైదరాబాద్, విజయవాడ మధ్య రాకపోకలు సాగించారు. -
ఢిల్లీ, బెంగళూరు కన్నా మన మెట్రో మరీ భారం
సాక్షి, ముంబై: ముంబైలో మెట్రో రైలు ప్రయాణం ఢిల్లీ, బెంగళూర్‌లకంటే ఖరీదైనదిగా మారింది. సబ్సిడీ లేకపోవడం వల్లనే ప్రయాణికులపై చార్జీల భారం పడుతోంది. వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మార్గంలో ముంబైలోని మొదటి మెట్రో రైలు సేవలు వినియోగంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా మెట్రో రైలు చార్జీలు గణనీయంగా పెరిగాయి. దీనికి ప్రధాన కారణంగా ఢిల్లీ, బెంగళూరుల మాదిరిగా పన్నులో రాయితీలతోపాటు సబ్సిడీ లభించకపోవడమేనని నిపుణులు పేర్కొన్నారు.. ముంబై మెట్రో రైలు సేవలకు కూడా పన్ను రాయితీలతోపాటు సబ్సిడీ లభించినట్టయితే ప్రయాణ చార్జీలు 50 శాతం మేర తగ్గుతాయని వారు అభిప్రాయపడ్డారు. ఇటీవలే కోర్టు అనుమతించడంతో ముంబై మెట్రో రైలు చార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. ఈ చార్జీలు ఢిల్లీ, బెంగళూర్ మెట్రో రైలు చార్జీలకంటే అధికం కావడం విశేషం. ఢిల్లీ, బెంగళూర్ మెట్రో రైలు ప్రాజెక్టులకు తక్కువ వడ్డీతో రుణాలు లభించాయి. మరోవైపు ఎక్స్పర్ట్ డ్యూటీ లేకపోవడంతోపాటు అనేక పన్నులలో రాయితీలు లభిస్తున్నాయి. వీటితోపాటు ఢిల్లీ, బెంగళూర్ మెట్రో రైలు సేవల కోసం వినియోగించే విద్యుత్ కూడా సబ్సిడీ లభిస్తోంది. ఇలా ఢిల్లీ, బెంగళూర్ మెట్రో రైలు చార్జీల నియంత్రణలో ఉండగా మరోవైపు ఇలాంటివేమి లభించకనే మెట్రో రైలు ప్రయాణం ప్రియమైందని తెలిసింది. -
బస్సెక్కితే ఏడు రూపాయలు
సాక్షి, ముంబై: బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ ముంబైకర్లపై ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి (ఆదివారం) నుంచి చార్జీల భారం మోపనుంది. బెస్ట్ పరిపాలన విభాగం రూపొందించిన ప్రతిపాదనకు బీఎంసీ స్టాండింగ్ కమిటీ మంజూరు లభించింది. దీంతో మొదటి స్టేజీకి కనీస చార్జీ రూపాయి పెరగనుంది. ప్రస్తుతం బెస్ట్ బస్సులో కనీస చార్జీ ఆరు రూపాయలు చేస్తున్నారు. కాగా ఆదివారం నుంచి ఏడు రూపాయల చొప్పున వసూలు చేయనున్నారు. ఈ చార్జీల పెంపు సాధారణ బస్సులతోపాటు ఎక్స్‌ప్రెస్, లిమిటెడ్, ఏసీ బస్సులకు కూడా వర్తించనుంది. చార్జీల పెంపు ప్రభావం వృద్ధులకు, వికలాంగులకు, విద్యార్థులకు ఇస్తున్న రాయితీలపై కూడా పడనుంది. ఆర్థికంగా నష్టాల బాటలో నడుస్తున్న బెస్ట్ సంస్థను కొంతమేరకైనా గట్టెక్కించాలంటే చార్జీలు పెంచక తప్పలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. బెస్ట్ పరిపాలన విభాగం 2014లోనే చార్జీల పెంపు ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చింది. కానీ బీఎంసీలో అధికారంలో ఉన్న శివసేన-బీజేపీ కూటమి రూ.150 కోట్లు ఆర్థిక సాయం అందజేయడంతో చార్జీలు పెంపు వాయిదా పడింది. ఆ తరువాత ఆగస్టులో మరోసారి చార్జీల పెంపు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే శాసనసభ ఎన్నికలు సమీపించడం మళ్లీ వాయిదా వేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ఎట్టకేలకు చార్జీల పెంపు ప్రతిపాదనకు బీఎంసీ ఆమోదం తెలిపింది. అయితే చార్జీలను రెండు విడతలుగా పెంచాలని నిర్ణయించింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఒక రూపాయి, ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మరో రూపాయి మేరకు చార్జీలు పెంచాలని నిర్ణయించింది. తొలి విడత భారం ఈ ఆదివారం ఉంచి అమలులోకి రానుంది. రెండో విడత చార్జీల పెంపు కూడా అమలులోకి వస్తే నగరంలో బెస్ట్ బస్సు కనీస చార్జీ రూ.8కి చేరుకుంటుంది. కాగా సాధారణ ప్రజలు పొందే సీజన్ పాస్‌తోపాటు వివిధ రాయితీలు పొందే సీజన్ పాస్‌లకు కూడా ఇది వర్తిస్తుందని బెస్ట్ యాజమాన్యం తెలిపింది. అదేవిధంగా బీఎంసీ పరిధి దాటి వెళ్లే ప్రయాణికులు అదనంగా మరో రూపాయి చెల్లించాల్సి ఉంటుంది. టోల్‌నాకా, ఇతర పన్నులను దృష్టిలో ఉంచుకుని ఈ చార్జీలు నిర్ణయించారు. ఏసీ బస్సు ప్రయాణికులపై అదనంగా రూ.5 భారం పడనుంది. ఇదిలాఉండగా ఉద్యోగుల సౌకర్యార్థం నగరంలోని కొన్ని ప్రముఖ రైల్వే స్టేషన్ల నుంచి కార్పొరేట్ కార్యాలయాల వరకు ప్రత్యేకంగా నడుపుతున్న బస్సులకు కనీస చార్జీలు రూ.ఆరు మాత్రమే వసూలు చేసేవారు. కాని ఆదివారం నుంచి దూరాన్ని బట్టి చార్జీలు వసూలు చేయనున్నారు. అదేవిధంగా ఇదివరకు 3, 5, 7, 8, 15, 25, 35 కి.మీ.లకు ఒక స్టేజీ చొప్పున నిర్ధారించారు. ఆదివారం నుంచి 2, 4, 6, 10, 14, 20 కి.మీ.లకు ఒక స్టేజీగా నిర్ణయించారు. దీనివల్ల కొందరు ప్రయాణికులకు లాభం, మరికొందరికి నష్టం జరగనుంది.