సాక్షి, ముంబై: ముంబైలో మెట్రో రైలు ప్రయాణం ఢిల్లీ, బెంగళూర్‌లకంటే ఖరీదైనదిగా మారింది. సబ్సిడీ లేకపోవడం వల్లనే ప్రయాణికులపై చార్జీల భారం పడుతోంది. వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మార్గంలో ముంబైలోని మొదటి మెట్రో రైలు సేవలు వినియోగంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా మెట్రో రైలు చార్జీలు గణనీయంగా పెరిగాయి. దీనికి ప్రధాన కారణంగా ఢిల్లీ, బెంగళూరుల మాదిరిగా పన్నులో రాయితీలతోపాటు సబ్సిడీ లభించకపోవడమేనని నిపుణులు పేర్కొన్నారు.. ముంబై మెట్రో రైలు సేవలకు కూడా పన్ను రాయితీలతోపాటు సబ్సిడీ లభించినట్టయితే ప్రయాణ చార్జీలు 50 శాతం మేర తగ్గుతాయని వారు అభిప్రాయపడ్డారు.
ఇటీవలే కోర్టు అనుమతించడంతో ముంబై మెట్రో రైలు చార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. ఈ చార్జీలు ఢిల్లీ, బెంగళూర్ మెట్రో రైలు చార్జీలకంటే అధికం కావడం విశేషం. ఢిల్లీ, బెంగళూర్ మెట్రో రైలు ప్రాజెక్టులకు తక్కువ వడ్డీతో రుణాలు లభించాయి. మరోవైపు ఎక్స్‌పర్ట్ డ్యూటీ లేకపోవడంతోపాటు అనేక పన్నులలో రాయితీలు లభిస్తున్నాయి. వీటితోపాటు ఢిల్లీ, బెంగళూర్ మెట్రో రైలు సేవల కోసం వినియోగించే విద్యుత్ కూడా సబ్సిడీ లభిస్తోంది. ఇలా ఢిల్లీ, బెంగళూర్ మెట్రో రైలు చార్జీల నియంత్రణలో ఉండగా మరోవైపు ఇలాంటివేమి లభించకనే మెట్రో రైలు ప్రయాణం ప్రియమైందని తెలిసింది.
ఢిల్లీ, బెంగళూరు కన్నా మన మెట్రో మరీ భారం
Published Tue, Feb 10 2015 5:32 AM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM
Advertisement