లండన్: స్టార్టప్‌లలో బెంగళూరు అంతర్జాతీయంగా ప్రముఖ స్థానాన్ని సొంతం చేసుకుంది. ‘గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్ 2021’లో మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 23వ ర్యాంకును సొంతం చేసుకుంది. అంతర్జాతీయంగా విజయవంతమైన స్టార్టప్‌లు రూపాంతరం చెందేందుకు అనుకూల పరిస్థితుల ఆధారంగా ఈ ర్యాంకులను ‘స్టార్టప్ జీనోమ్’ అనే సంస్థ కేటాయిస్తుంటుంది.
ఢిల్లీతోపాటు ముంబై సైతం 36వ ర్యాంకును సొంతం చేసుకున్నాయి. ఈ పట్టణాల నుంచి ఎన్ని స్టార్టప్‌లు విజయం సాధించాయి, ఇతర పరిస్థితులు ర్యాంకులకు ప్రామాణికం. నిధుల తోడ్పాటు, అనుసంధానత, విజ్ఞానం ఈ అంశాలన్నింటిలో బెంగళూరు దేశం నుంచే ముందుండడం గమనార్హం.
ఈ ఏడాది 24 యూనికార్న్‌లు
2021 ఆగస్ట్ నాటికి భారత్‌లో (ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల్లో) 24 యూనికార్న్‌లు అవతరించగా.. ఇందులో ఆరు యూనికార్న్‌లు ఏప్రిల్‌లో కేవలం నాలుగు రోజుల్లోనే పురుడుపోసుకున్నాయి. బెంగళూరు ప్రపంచంలో నాలుగో అతిపెద్ద టెక్నాలజీ, ఆవిష్కరణల క్లస్టర్‌గా నిలిచింది. 400కు పైగా ప్రపంచస్థాయి పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కేంద్రాలు ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. ముంబైతోపాటు చెన్నై, పుణె, హైదరాబాద్ కూడా టాప్ 100 ఎమర్జింగ్ ఎకోసిస్టమ్స్‌లో స్టార్టప్ హబ్‌లుగా నిలవడం గమనార్హం.
టాప్ యూనికార్న్‌లలో అన్‌అకాడెమీకి అగ్రస్థానం!
దేశీయంగా టాప్ స్టార్టప్ కంపెనీల జాబితాలో లెర్నింగ్ ప్లాట్‌ఫాం అన్‌అకాడెమీ అగ్రస్థానంలో నిల్చింది. బీ2బీ ఈ–కామర్స్ ప్లాట్‌ఫాం ఉడాన్, ఫైనాన్షియల్ టెక్నాలజీ అంకుర సంస్థ క్రెడ్ వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి.
2021కి గాను 25 సంస్థలతో లింక్డ్‌ఇన్ ఈ వార్షిక స్టార్టప్స్ జాబితాను రూపొందించింది. ఉద్యోగి ఎదుగుదల, ఉద్యోగార్థుల ఆసక్తి, ఉద్యోగులు.. యాజమాన్యం మధ్య సఖ్యత, టాప్ కంపెనీల నుంచి ప్రతిభావంతులను రిక్రూట్ చేసుకోవడంలో ఆయా స్టార్టప్‌ల సామర్థ్యం అనే అంశాల ప్రాతిపదికన లింక్డ్‌ఇన్ దీన్ని తయారు చేసింది. కనీసం ఏడేళ్ల కార్యకలాపాలు, 50 మంది ఉద్యోగులు, ప్రైవేట్ యాజమాన్యం, భారత్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న అంకుర సంస్థలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకుంది.
3.44 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో అన్‌అకాడెమీ ఈ లిస్టులో అగ్రస్థానం దక్కించుకుంది. అప్‌గ్రేడ్ (4వ ర్యాంకు), రేజర్‌పే (5), మీషో (6), స్కైరూట్ ఏరోస్పేస్ (7), బోట్ (8), అర్బన్ కంపెనీ (9), అగ్నికుల్ కాస్మోస్ (10వ స్థానం) టాప్ టెన్ జాబితాలో ఉన్నాయి. జాబితాలో చోటు దక్కించుకున్న వాటిల్లో 60 శాతం అంకుర సంస్థలు బెంగళూరుకు చెందినవే కావడం గమనార్హం. లిస్టులో అత్యధిక శాతం కన్జూమర్ ఇంటర్నెట్ స్టార్టప్‌లు ఉన్నాయని, ప్రస్తుతం కంపెనీలు డిజిటల్ బాట పట్టడం ఎంత కీలకంగా మారిందన్నది ఇది తెలియజేస్తోందని లింక్డ్‌ఇన్ న్యూస్ ఇండియా ఎండీ అంకిత్ వెంగుర్లేకర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment