startup in India
-
అంకురాల అభివృద్ధిలో మనమెక్కడ..?
భారత ఆర్థిక వ్యవస్థకు అంకుర సంస్థలు కొత్త ఊపు తెస్తున్నాయి. స్టార్లప్‌ల రూపంలో కొత్తదనాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రాయితీలు అందిస్తున్నాయి. అందుకు అనువుగా ఒడుదొడుకులను తట్టుకొని ముందుకు సాగేలా వాటి వ్యవస్థాపకులను ప్రోత్సహిస్తున్నాయి. యువ జనాభా అధికంగా ఉన్న భారతదేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటికి రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు బ్యాంకు రుణాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్టాండప్ ఇండియా కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య అభివృద్ధి విభాగం (డీపీఐఐటీ) గుర్తింపు పొందిన అంకుర సంస్థలకు పన్ను రాయితీలు, ఆర్థిక సహాయంతో పాటు మేధాహక్కులూ వేగంగా మంజూరు అవుతున్నాయి. భారత్‌లో దాదాపు 110 యూనికార్న్ కంపెనీలు.. ప్రపంచంలో అంకురాల సంఖ్యలో భారత్ మూడో స్థానాన్ని ఆక్రమిస్తోంది. 2023 అక్టోబరు నాటికి దేశంలోని 763 జిల్లాల్లో డీపీఐఐటీ గుర్తింపు పొందిన 1,12,718 అంకురాలు వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రపంచంలో నవీకరణ, నాణ్యత పరంగా చూస్తే మన స్టార్టప్‌లు రెండో స్థానంలో నిలుస్తున్నాయి. 100 కోట్ల డాలర్ల విలువ సాధించిన అంకురాలను యూనికార్న్‌లుగా వ్యవహరిస్తారు. అలాంటివి భారత్‌లో 110 వరకు ఉన్నాయి. అమెరికా, చైనాల తరవాత ఇంత పెద్ద సంఖ్యలో యూనికార్న్‌లు ఉన్నది భారత్‌లోనే. ఒక్క 2022లోనే భారత్‌లో 42 టెక్నాలజీ అంకురాలు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ వెన్నుదన్నుతో ఇవి సాధిస్తున్న విజయాలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఐదు విభాగాల్లో డీపీఐఐటీ ర్యాంకింగ్‌లు.. స్టార్టప్‌ల వృద్ధికి అనుకూలమైన ఎకోసిస్టమ్‌ను నిర్మించడానికి 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేస్తున్న ప్రయత్నాలను పరిశీలించిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఇటీవల ఐదు రకాల ర్యాంకులను ఇచ్చింది. ఇందులో బెస్ట్ పర్ఫార్మర్స్, టాప్ పర్ఫార్మర్స్, లీడర్స్, ఆస్పైరింగ్ లీడర్స్, ఎమర్జింజ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ విభాగాల్లో గుర్తింపు ఇస్తున్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను వాటి జనాభా ఆధారంగా రెండు విభాగాలుగా విభజించారు. కోటి జనాభా కంటే ఎక్కువ ఉన్నవి, కోటి కంటే తక్కువ ఉన్నవిగా వర్గీకరించారు. ‘లీడర్స్’ కేటగిరీలో ఏపీ టాప్.. దేశంలోని ఎనిమిది రాష్ట్రాలను 'లీడర్స్' కేటగిరీలో చేర్చారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, త్రిపుర వరుస స్థానాల్లో ఉన్నాయి. ఆంత్రప్రెన్యూర్ల కోసం బలమైన స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడంలో గుజరాత్, కర్ణాటకలు బెస్ట్ పర్ఫార్మర్లుగా ర్యాంకులు తెచ్చుకున్నాయి. ఇదే లిస్టులో కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ తరువాత స్థానాల్లో నిలిచాయి. గుజరాత్ వరుసగా నాలుగోసారి బెస్ట్ స్టేట్‌గా నిలిచింది. కర్ణాటక ఈ విభాగంలో రెండో ర్యాంకు సాధించింది. మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయలు టాప్ పర్ఫార్మర్స్గా ఎంపికయ్యాయి. బిహార్, హరియాణా, అండమాన్ నికోబార్ దీవులు, నాగాలాండ్‌లు ఆస్పైరింగ్ లీడర్స్ విభాగంలో వరుస స్థానాల్లో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్, దిల్లీ, జమ్మూకాశ్మీర్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, లద్ధాఖ్, మిజోరాం, పుదుచ్చేరి , సిక్కింలు ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్ విభాగంలోకి చోటుసాధించాయి. ఇదీ చదవండి: తీరనున్న ఎగిరే ట్యాక్సీ కల! వీటి ఆధారంగానే ర్యాంకింగ్‌లు.. ఇన్నోవేషన్లను ప్రోత్సహించడం, మార్కెట్ యాక్సెస్, ఇంక్యుబేషన్ ఫండింగ్ సపోర్ట్ వంటి 25 యాక్షన్ పాయింట్ల ఆధారంగా ఈ ర్యాంకులను ఇచ్చామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్‌లకు ఎలాంటి సాయం అవసరమో తెలుసుకోవాలని అధికారులను కోరారు. స్టార్టప్‌లు పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌ల వంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఆర్‌లు) నమోదు కోసం డీపీఐఐటీ సాయం తీసుకోవాలని అన్నారు. -
స్టార్టప్‌లకు కేంద్రంగా భారత్
సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్‌లో టెక్నికల్ స్టార్టప్‌లకు భారతదేశం కేంద్ర బిందువుగా మారనుందని ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్(ఈఎస్సీ) చైర్మన్ సందీప్ నరూలా తెలిపారు. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మంగళవారం నిర్వహించిన ‘ఏపీ స్టేట్ స్టార్టప్ కాన్క్లేవ్’ను ఏయూ వీసీ డాక్టర్ పీవీజీడీ ప్రసాదరెడ్డితో కలిసి సందీప్ నరూలా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టార్టప్‌లకు సంబంధించిన సాంకేతికతను అందిపుచ్చుకునే విషయంలో పరస్పర సహకారం కోసం ఏయూ ఇన్నోవేటివ్ సొసైటీ, ఏయూ ఇంక్యుబేషన్ సెంటర్, ఈఎస్సీ సంస్థ ఎంవోయూ చేసుకున్నాయి. అనంతరం సందీప్ నరూలా మాట్లాడుతూ దేశంలో లోకల్ స్టార్టప్‌లు పెరగడం శుభపరిణామమన్నారు. స్టార్టప్‌లు స్థానిక ఆర్థిక ప్రగతికి ఊతమిస్తాయన్నారు. ఔత్సాహికుల ఆలోచనలను విజయవంతమైన వ్యాపారంగా మార్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఏయూ సహకారం అందించడం అభినందనీయమని కొనియాడారు. ప్రతి రాష్ట్రంలో స్టార్టప్‌ల పోటీలు నిర్వహిస్తున్నామని, వీటిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి త్వరలోనే జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమమైన స్టార్టప్‌లను ఎంపిక చేసి, శాన్ఫ్రాన్సిస్కోలో నిర్వహించనున్న అంతర్జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామని సందీప్ వివరించారు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ) సీనియర్ డైరెక్టర్ డాక్టర్ దేవీష్ త్యాగి మాట్లాడుతూ ఎస్టీపీఐకి దేశ వ్యాప్తంగా 62 కేంద్రాలు ఉన్నాయని, విశాఖ కేంద్రంలో బీపీవో 2.0 ప్రాజెక్టు అమలుకు సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో నెక్స్ట్ జనరేషన్ ఇంక్యుబేషన్ స్కీమ్ అమలుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఏయూలోని స్టార్టప్ సెంటర్లో 38 అంకుర పరిశ్రమలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఈఎస్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్, ఎస్టీపీఐ డైరెక్టర్ రామ్‌ప్రసాద్, ఈఎస్సీ ఏపీ చాప్టర్ చైర్మన్ సుధాకర్ పంతుల, ఏయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణమోహన్ పాల్గొన్నారు. -
స్టార్టప్ కలలు కంటున్నారా.. ఈ స్కూల్ మీకోసమే..!
ఉద్యోగం వెదుక్కోవాలి...అనేది నిన్నటి మాట. స్టార్టప్‌కు బాట వేసుకోవాలి... అనేది నేటి మాట. తమ స్టార్టప్ కలలను సాకారం చేసుకోవడానికి యూత్ ‘స్టార్టప్ స్కూల్ ఇండియా’ వైపు చూస్తుంది... ఎంబీఏ చేస్తున్న అభినయ(గోరఖ్‌పూర్)కు విజేతల కథలు చదవడం అంటే ఇష్టం. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, కేవలం తమ ప్రతిభనే పెట్టుబడిగా పెట్టి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్న స్టార్టప్ స్టార్లు ఆమెకు స్ఫూర్తి. తనకూ స్టార్టప్ కలలు ఉన్నాయి. కాని అవి పేపర్ మీద మాత్రమే ఉన్నాయి. ఎలా మొదలు కావాలి...అనే విషయం మీద అభినయకు అవగాహన లేదు. ఇది అభినయ పరిస్థితి మాత్రమే కాదు... దేశంలో ఉన్న ఎన్నో చిన్నపట్టణాల యువత పరిస్థితి...ఇలాంటి వారికి ఇప్పుడు ‘స్టార్టప్ స్కూలు’ రూపంలో ఒక దారి దొరకబోతోంది. గూగుల్ తాజాగా స్టార్టప్ స్కూల్ ఇండియా (ఎస్ఎస్ఐ) గురించి ప్రకటించింది. ‘స్టార్టప్’ అనగానే దేశంలో కొన్ని నగరాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. ‘ఇక్కడ మాత్రమే స్టార్టప్‌లకు అనువైన వాతావరణం ఉంది’ అనే భావన ఉంది. మరి చిన్న పట్టణాల పరిస్థితి ఏమిటి? అక్కడ స్టార్టప్‌లకు అవకాశం లేదా? అనే ప్రశ్నకు ‘కచ్చితంగా ఉంది’ అనే సమాధానం తన స్కూల్ ద్వారా ఇవ్వబోతోంది గూగుల్. దేశంలోని పది చిన్నపట్టణాల్లో, మూడు సంవత్సరాల కాలపరిధిలో, పదివేల మంది స్టూడెంట్స్‌ను స్టార్టప్ రూట్లోకి తీసుకురావాలనేది గూగుల్ స్టార్టప్ స్కూల్ లక్ష్యం. ఇన్వెస్టర్లు, సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్, ప్రోగ్రామర్స్‌ను ఒకే దగ్గరకు తీసుకువచ్చే వేదిక ఇది. ఎఫెక్టివ్ ప్రాడక్ట్ స్ట్రాటజీ, ప్రాడక్ట్ యూజర్ వాల్యూ, రోడ్ మ్యాపింగ్ అండ్ పిఆర్డి డెవలప్మెంట్... మొదలైనవి గూగుల్ కరికులమ్‌లో భాగం కానున్నాయి. వర్కింగ్ ఈవెంట్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు సంబంధించినవి తొమ్మిదివారాల కార్యక్రమంలో ఉంటాయి. ‘ఎన్నో స్టార్టప్‌లతో పనిచేసిన అనుభవం గూగుల్‌కు ఉంది. ఇప్పుడు ఆ అనుభవాలు యూత్‌కు గొప్ప పాఠాలుగా మారుతాయి’ అంటున్నారు మమవర్త్ కో–ఫౌండర్ వరుణ్ అలఘ్. స్టార్టప్‌ల దిశగా యూత్‌ను తీసుకెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం గూగుల్‌కు ఇదే మొదటిసారి కాదు. 2016లో దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో ఎంటర్ప్రెన్యుర్షిప్ వర్క్‌షాప్‌లు నిర్వహించింది. పదినగరాలలో నిర్వహించిన స్టూడెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఛాలెంజ్ (ఎస్ఈసి)కు మంచి స్పందన వచ్చింది. టాప్ 3 విన్నర్స్‌ను సిలికాన్‌వ్యాలీకి తీసుకెళ్లి గూగుల్ లీడర్స్‌తో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. ఇక తాజా‘స్టార్టప్’ స్కూల్ విషయానికి వస్తే... ‘టెక్నాలజీ, ఫైనాన్స్, డిజైన్... మొదలైన రంగాలకు చెందిన మార్గదర్శకులతో ఒక విశాల వేదిక ఏర్పాటు చేయడానికి స్కూల్ ఉపకరిస్తుంది’ అంటున్నారు గూగుల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ ఆనందన్. దేశంలో స్టార్టప్ కల్చర్ ఊపందుకోవడానికి అనువైన వాతావరణం ఉంది. అంతమాత్రాన ‘అన్నీ మంచి శకునములే’ అనుకోవడానికి లేదు. దాదాపు 90 శాతం స్టార్టప్‌లు అయిదుసంవత్సరాల లోపే తమ ప్రయాణాన్ని ఆపేస్తున్నాయి. లోపభూయిష్టమైన డిమాండ్ అసెస్మెంట్, రాంగ్ ఫీడ్‌బ్యాక్, నిర్వాహణలోపాలు... మొదలైన కారణాలు స్టార్టప్‌ల ఫెయిల్యూర్స్‌కు కారణం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గూగుల్ స్టార్టప్ స్కూల్ పాఠాలు యువతరానికి ఎంతో ఉపయోగపడనున్నాయి. ‘నా ఫ్రెండ్స్ కొందరు స్టార్టప్ మొదలు పెట్టి దెబ్బతిన్నారు. దీంతో నా స్టార్టప్ కలకు బ్రేక్ పడింది. అయితే ఒకరి పరాజయం అందరి పరాజయం కాదు. ఎవరి శక్తి సామర్థ్యాలు వారికి ఉంటాయి...అనేది తెలుసుకున్నాక నేనెందుకు నా ప్రయత్నం చేయకూడదు అనిపించింది. గూగుల్ స్టార్టప్ స్కూల్ నాలాంటి వారికి విలువైన మార్గదర్శనం చేయనుంది’ అంటుంది దిల్లీ–ఐఐటీ విద్యార్థి ఈషా. -
దేశంలోనే ఫస్ట్ ప్లేస్..స్టార్టప్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నగరం ఇదే!
లండన్: స్టార్టప్‌లలో బెంగళూరు అంతర్జాతీయంగా ప్రముఖ స్థానాన్ని సొంతం చేసుకుంది. ‘గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్ 2021’లో మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 23వ ర్యాంకును సొంతం చేసుకుంది. అంతర్జాతీయంగా విజయవంతమైన స్టార్టప్‌లు రూపాంతరం చెందేందుకు అనుకూల పరిస్థితుల ఆధారంగా ఈ ర్యాంకులను ‘స్టార్టప్ జీనోమ్’ అనే సంస్థ కేటాయిస్తుంటుంది. ఢిల్లీతోపాటు ముంబై సైతం 36వ ర్యాంకును సొంతం చేసుకున్నాయి. ఈ పట్టణాల నుంచి ఎన్ని స్టార్టప్‌లు విజయం సాధించాయి, ఇతర పరిస్థితులు ర్యాంకులకు ప్రామాణికం. నిధుల తోడ్పాటు, అనుసంధానత, విజ్ఞానం ఈ అంశాలన్నింటిలో బెంగళూరు దేశం నుంచే ముందుండడం గమనార్హం. ఈ ఏడాది 24 యూనికార్న్‌లు 2021 ఆగస్ట్ నాటికి భారత్‌లో (ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల్లో) 24 యూనికార్న్‌లు అవతరించగా.. ఇందులో ఆరు యూనికార్న్‌లు ఏప్రిల్‌లో కేవలం నాలుగు రోజుల్లోనే పురుడుపోసుకున్నాయి. బెంగళూరు ప్రపంచంలో నాలుగో అతిపెద్ద టెక్నాలజీ, ఆవిష్కరణల క్లస్టర్‌గా నిలిచింది. 400కు పైగా ప్రపంచస్థాయి పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కేంద్రాలు ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. ముంబైతోపాటు చెన్నై, పుణె, హైదరాబాద్ కూడా టాప్ 100 ఎమర్జింగ్ ఎకోసిస్టమ్స్‌లో స్టార్టప్ హబ్‌లుగా నిలవడం గమనార్హం. టాప్ యూనికార్న్‌లలో అన్అకాడెమీకి అగ్రస్థానం! దేశీయంగా టాప్ స్టార్టప్ కంపెనీల జాబితాలో లెర్నింగ్ ప్లాట్‌ఫాం అన్అకాడెమీ అగ్రస్థానంలో నిల్చింది. బీ2బీ ఈ–కామర్స్ ప్లాట్‌ఫాం ఉడాన్, ఫైనాన్షియల్ టెక్నాలజీ అంకుర సంస్థ క్రెడ్ వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. 2021కి గాను 25 సంస్థలతో లింక్డ్ఇన్ ఈ వార్షిక స్టార్టప్స్ జాబితాను రూపొందించింది. ఉద్యోగి ఎదుగుదల, ఉద్యోగార్థుల ఆసక్తి, ఉద్యోగులు.. యాజమాన్యం మధ్య సఖ్యత, టాప్ కంపెనీల నుంచి ప్రతిభావంతులను రిక్రూట్ చేసుకోవడంలో ఆయా స్టార్టప్‌ల సామర్థ్యం అనే అంశాల ప్రాతిపదికన లింక్డ్ఇన్ దీన్ని తయారు చేసింది. కనీసం ఏడేళ్ల కార్యకలాపాలు, 50 మంది ఉద్యోగులు, ప్రైవేట్ యాజమాన్యం, భారత్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న అంకుర సంస్థలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకుంది. 3.44 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో అన్అకాడెమీ ఈ లిస్టులో అగ్రస్థానం దక్కించుకుంది. అప్‌గ్రేడ్ (4వ ర్యాంకు), రేజర్‌పే (5), మీషో (6), స్కైరూట్ ఏరోస్పేస్ (7), బోట్ (8), అర్బన్ కంపెనీ (9), అగ్నికుల్ కాస్మోస్ (10వ స్థానం) టాప్ టెన్ జాబితాలో ఉన్నాయి. జాబితాలో చోటు దక్కించుకున్న వాటిల్లో 60 శాతం అంకుర సంస్థలు బెంగళూరుకు చెందినవే కావడం గమనార్హం. లిస్టులో అత్యధిక శాతం కన్జూమర్ ఇంటర్నెట్ స్టార్టప్‌లు ఉన్నాయని, ప్రస్తుతం కంపెనీలు డిజిటల్ బాట పట్టడం ఎంత కీలకంగా మారిందన్నది ఇది తెలియజేస్తోందని లింక్డ్ఇన్ న్యూస్ ఇండియా ఎండీ అంకిత్ వెంగుర్లేకర్ తెలిపారు. చదవండి: శభాష్ శ్రీజ.. పదో తరగతిలోనే స్టార్టప్‌కి శ్రీకారం -
మేకిన్ ఇండియా ప్రచారం కాస్త ఎక్కువైంది...
న్యూఢిల్లీ: ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించడంలో ప్రభుత్వం క్రియాశీలకంగానే వ్యవహరిస్తోన్నప్పటికీ.. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా కార్యక్రమాలకు ప్రచారం అతిగా ఉంటోందని పారిశ్రామికవేత్త, భారతీ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాజన్ భారత్ మిట్టల్ వ్యాఖ్యానించారు. స్టార్టప్‌లకు, చిన్న సంస్థలకు క్షేత్రస్థాయిలో చాలా సమస్యలు అలాగే ఉన్నాయని ఆయన చెప్పారు. చిన్న సంస్థల వ్యాపారాల నిర్వహణ చాలా కష్టతరంగానే ఉంటోందని ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) ఇండియా సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఏవో చిన్న చిన్న మార్పులు చేసి ర్యాంకింగ్‌లు మెరుగుపర్చుకోవడం, దాని గురించి గొప్పలు చెప్పుకోవడం కాకుండా.. సిసలైన మార్పును సాధించడానికి నడుం బిగించాలని రాజన్ చెప్పారు. చైనా మందగమన పరిస్థితుల మధ్య అవకాశాలను అందిపుచ్చుకునేందుకు భారత్ మరింత వేగంగా స్పందించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘ఒక్క చిన్న మార్పుతో ర్యాంకింగ్స్‌లో 12 స్థానాలు పైకి ఎగబాకేయొచ్చు.. గొప్పలు చెప్పుకుంటూ తిరగొచ్చు. కానీ, వాస్తవంగా మెరుగుపడాలంటే కొరడా ఝుళిపించాలి. మరింత పోటీతత్వంతో పనిచేయాలి. చైనాలో మందగమన పరిస్థితులను సద్వినియోగం చేసుకునేందుకు సరైన సమయంలో స్పందించకపోతే మరో అవకాశాన్ని.. తుది అవకాశాన్ని చేజార్చుకున్న వాళ్లం అవుతాము’ అని రాజన్ పేర్కొన్నారు.