
ఎంవోయూలను చూపిస్తున్న డాక్టర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి, సందీప్ నరూలా, దేవీష్ త్యాగి
సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్‌లో టెక్నికల్ స్టార్టప్‌లకు భారతదేశం కేంద్ర బిందువుగా మారనుందని ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్(ఈఎస్‌సీ) చైర్మన్ సందీప్ నరూలా తెలిపారు. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మంగళవారం నిర్వహించిన ‘ఏపీ స్టేట్ స్టార్టప్ కాన్‌క్లేవ్’ను ఏయూ వీసీ డాక్టర్ పీవీజీడీ ప్రసాదరెడ్డితో కలిసి సందీప్ నరూలా ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్టార్టప్‌లకు సంబంధించిన సాంకేతికతను అందిపుచ్చుకునే విషయంలో పరస్పర సహకారం కోసం ఏయూ ఇన్నోవేటివ్ సొసైటీ, ఏయూ ఇంక్యుబేషన్ సెంటర్, ఈఎస్‌సీ సంస్థ ఎంవోయూ చేసుకున్నాయి. అనంతరం సందీప్ నరూలా మాట్లాడుతూ దేశంలో లోకల్ స్టార్టప్‌లు పెరగడం శుభపరిణామమన్నారు. స్టార్టప్‌లు స్థానిక ఆర్థిక ప్రగతికి ఊతమిస్తాయన్నారు. ఔత్సాహికుల ఆలోచనలను విజయవంతమైన వ్యాపారంగా మార్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఏయూ సహకారం అందించడం అభినందనీయమని కొనియాడారు.
ప్రతి రాష్ట్రంలో స్టార్టప్‌ల పోటీలు నిర్వహిస్తున్నామని, వీటిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి త్వరలోనే జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమమైన స్టార్టప్‌లను ఎంపిక చేసి, శాన్‌ఫ్రాన్సిస్కోలో నిర్వహించనున్న అంతర్జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామని సందీప్ వివరించారు. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా(ఎస్‌టీపీఐ) సీనియర్ డైరెక్టర్ డాక్టర్ దేవీష్ త్యాగి మాట్లాడుతూ ఎస్‌టీపీఐకి దేశ వ్యాప్తంగా 62 కేంద్రాలు ఉన్నాయని, విశాఖ కేంద్రంలో బీపీవో 2.0 ప్రాజెక్టు అమలుకు సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు.
విశాఖపట్నంలో నెక్స్ట్ జనరేషన్ ఇంక్యుబేషన్ స్కీమ్ అమలుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఏయూలోని స్టార్టప్ సెంటర్‌లో 38 అంకుర పరిశ్రమలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఈఎస్‌సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్, ఎస్‌టీపీఐ డైరెక్టర్ రామ్‌ప్రసాద్, ఈఎస్‌సీ ఏపీ చాప్టర్ చైర్మన్ సుధాకర్ పంతుల, ఏయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణమోహన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment