2,287 మంది ఆంధ్రా యూనివర్సిటీల విద్యార్థులకు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు
తల్లిదండ్రుల చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చేందుకు కార్యక్రమం
ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా అచీవర్స్ డే నిర్వహించేందుకు ఏర్పాట్లు
అనుమతులు కూడా ఇచ్చిన జాయింట్ కలెక్టర్
ఇప్పటికే సుదూరు ప్రాంతాల నుంచి విశాఖకు చేరిన విద్యార్థుల తల్లిదండ్రులు
అయితే అచీవర్స్ డేని కూడా ఎన్నికలకు ముడిపెడుతూ ‘ఈనాడు’ విషకథనం
చివరకు అనుమతులు రద్దు చేసిన అధికారులు
టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్‌కు చెందిన ‘గీతం’లో మాత్రం యధావిధిగా అచీవర్స్ డే
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎల్లో మీడియా బరితెగించేస్తోంది. అధికారులు, పోలీసులు, వలంటీర్లు.. ఇలా ప్రతి ఒక్కరినీ తప్పుపడుతూ సొంత తీర్పులిచ్చేస్తున్న ఎల్లో మీడియా ఇప్పుడు విశ్వవిద్యాలయాలను కూడా వాటి పని వాటిని చేసుకోనీయడం లేదు. ప్రతిదానికి యాగీ చేయడం.. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ప్రచారం చేసేస్తున్నారని అసత్యాలు, అబద్ధాలు అచ్చేయడమే పనిగా పెట్టుకుంది. చివరకు జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలున్న ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని కూడా ఎల్లో మీడియా తమ రాజకీయ ప్రయోజనాలకు రోడ్డుకు ఈడుస్తోంది.
ఇదెలా తప్పు?
ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకుని ఉద్యోగాలు సాధించినవారికి శుక్రవారం వారి తల్లిదండ్రుల చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని విశ్వవిద్యాలయం సంకల్పించింది. అయితే ఇందులో కూడా ఎల్లో మీడియా తప్పులు వెతికింది. ఎచీవర్స్ డే పేరిట విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పిలిపించి వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తారని అభూతకల్పనలతో ఈనాడు పత్రిక ఒక అశుద్ధ కథనం అచ్చేసింది. ఏయూ ఈ కార్యక్రమం ఏర్పాట్లు చేస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని.. తన కథనంలో రంకెలేసింది. దీంతో ఈనాడు పత్రిక దుర్బుద్ధికి భయపడిన అధికారులు అచీవర్స్ డేని రద్దు చేస్తున్నట్టు గురువారం ప్రకటించారు. ఫలితంగా ఏయూలో చదువుకుని ఉద్యోగాలు సాధించి తమ తల్లిదండ్రుల చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్లు తీసుకోవాలని ఆశించిన 2,287 మంది తీవ్రంగా నిరాశ చెందారు. కాగా టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌కు చెందిన గీతం యూనివర్సిటీ మాత్రం ఎలాంటి ఎన్నికల కోడ్ వర్తించదంటూ ఏప్రిల్ 24న అచీవర్స్ డే నిర్వహించడం గమనార్హం.
అక్రమాల ‘గీతం’ కోసమే పన్నాగం..
ఈ ఏడాది ఏయూ సైన్స్ కళాశాల పరిధిలో 802, ఇంజనీరింగ్‌లో 900, ఆర్ట్స్‌లో 410, బీఈడీలో 175కి పైగా ఉద్యోగాలు విద్యార్థులకు లభించాయి. ఏ ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి ఇప్పటి వరకూ సాధ్యం కాని రికార్డును ఏయూ సొంతం చేసుకుంది. సైన్స్‌లో ఏకంగా 802 ఉద్యోగాలు రావడం ఇదే తొలిసారి. ఇంతటి ఘనమైన కీర్తిని సొంతం చేసుకున్న సమయంలో అచీవర్స్‌డేని తప్పుపడుతూ, దాన్ని ఎన్నికలకు ముడిపెడుతూ ఈనాడు పత్రిక తన దుర్బుద్ధిని చాటుకుంది. విద్యార్థి విశ్వవిద్యాలయంలో చేరినప్పుడు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించిన సందర్భంగా ఏటా ఏయూలో అచీవర్స్ డే నిర్వహిస్తున్నారు.
వేదికపై విద్యాన్థితో పాటు వారి తల్లిదండ్రులను సత్కరించి, వారికి విద్యార్థితో పాదాభివందనం చేయిస్తారు. ఏయూలో విద్యార్థులకు నియామక పత్రాలు అందించి, తల్లిదండ్రులను గౌరవించే ఈ కార్యక్రమాన్ని నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) నిపుణుల బృందం సైతం ఇటీవల ప్రశంసించింది. అయితే దీన్ని ఈనాడు పత్రిక తట్టుకోలేకపోయింది. పేద కుటుంబాల పిల్లలకు లక్షల రూపాయల వేతనాలతో ఉద్యోగాలు సాధించడంతో ప్రభుత్వ యూనివర్సిటీ అయిన ఏయూ ప్రతిష్ట పెరిగింది. దీంతో టీడీపీ నేత భరత్‌కు చెందిన గీతం యూనివర్సిటీకి, టీడీపీకి కంటగింపుగా ఏయూ మారింది. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భరత్ స్వయంగా గీతం డీమ్డ్ వర్సిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన తన వర్సిటీ ఉద్యోగులతో విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని సిబ్బంది ప్రభావితం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అనుమతి ఇచ్చి రద్దు చేశారు..
క్లాజ్ –22 ప్రకారం ఎన్నికల సమయంలోనైనా యూనివర్సిటీల పరిధిలో అపాయింట్‌మెంట్స్, రిక్రూట్‌మెంట్స్ ఆపడానికి వీల్లేదు. అందుకే.. 15 రోజుల ముందుగానే జాయింట్ కలెక్టర్ డా.మయూర్ అశోక్‌కు ఏయూ అధికారులు అచీవర్స్ డే కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎలాంటి అభ్యంతరం లేదని జేసీ కూడా అనుమతులు మంజూరు చేశారు. అచీవర్స్ డే కోసం విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. అయితే ఈనాడు విషకథనంతో అధికారులు చివరి క్షణంలో అచీవర్స్ డేకు ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు.
నేనెలా ప్రభావితమవుతాను?
నాకు 22 ఏళ్లు. పూర్తి పరిణితి చెందిన నేను సమావేశంలో ఒక వ్యక్తి చెప్పే ప్రసంగానికి ప్రభావితమై ఓటు వేస్తానని ఎలా అనుకుంటున్నారు? విద్యను రాజకీయంతో ముడిపెట్టడం ఏమాత్రం సరికాదు. ఏటా అచీవర్స్ డేను నిర్వహిస్తుండగా ఈ ఏడాది అడ్డుకోవడం తప్పు.
– ఒ.గోవర్ధన్, బయోటెక్నాలజీ విభాగం
చాలా బాధగా ఉంది..
నేను నాలుగు ఉద్యోగాలకు ఎంపికయ్యాను. 10 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రుల సమక్షంలో అపాయింట్‌మెంట్ ఆర్డర్ తీసుకోవచ్చని చాలా సంతోషించాను. ఇప్పుడు అచీవర్స్‌డే రద్దు కావడం పట్ల చాలా బాధగా ఉంది.
– ఎ.స్వాతి, స్టాటిస్టిక్స్ విభాగం
Comments
Please login to add a commentAdd a comment