Software Technology Parks
-
ఏపీలో 4 సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా కేంద్రాలు అమలులో ఉన్నట్టు కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు కోటగిరి శ్రీధర్ అడిగిన ప్రశ్నకు బుధవారం లిఖితపూర్వక సమాధానమిస్తూ.. కాకినాడ, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవి అమలులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆత్రేయపురం పూతరేకులకు జీఐ ట్యాగ్ ఆత్రేయపురం పూతరేకులకు జీఐ ట్యాగ్ మంజూరైందని కేంద్ర వాణిజ్యశాఖ సహాయ మంత్రి సోమ్‌ప్రకాశ్ తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యులు మార్గాని భరత్‌రామ్, వంగా గీతా విశ్వనా«థ్ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ.. సర్ ఆర్ధర్ కాటన్ ఆత్రేయపురం పూతరేకుల ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం విజ్ఞప్తి మేరకు జూన్ 14, 2023న జీఐ ట్యాగ్ మంజూరైనట్టు కేంద్ర మంత్రి వివరించారు. 3,841 కిలోమీటర్లు విద్యుదీకరణ ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది జూన్ 30 వరకూ 3,841 కిలోమీటర్లు (బ్రాడ్‌గేజ్ ) విద్యుదీకరణ పూర్తయినట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు ఆదాల ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. వైఎస్సార్సీపీ సభ్యులు చింతా అనూరాధ, కోటగిరి శ్రీధర్ అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఏపీలో నాలుగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు అందుతున్నట్టు రైల్వే మంత్రి తెలిపారు. కార్యాచరణ సాధ్యాసాధ్యాలు, ట్రాఫిక్ తదితర అంశాలకు లోబడి నూతన వందేభారత్ సేవలు నిర్వహిస్తున్నామని ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. కడప–పెండ్లిమర్రి ప్రాజెక్ట్ ప్రారంభం 268 కిలోమీటర్ల మేర కడప–బెంగళూరు ప్రాజెక్ట్ ఏపీ ప్రభుత్వ వ్యయ భాగస్వామ్య ప్రాతిపదికన బడ్జెట్లో మంజూరు చేసినట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు అవినాశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ.. పూర్తి ప్రాజెక్టు ఖర్చు రూ.2705.98 కోట్లలో 50శాతం ఏపీ ప్రభుత్వం భరించాల్సి ఉందన్నారు. మార్చి 2023 వరకూ ఈ ప్రాజెక్ట్‌కు రూ.358.60 కోట్లు వ్యయం చేయగా.. 21.30 కి.మీ పొడవున కడప–పెండ్లిమర్రి సెక్షన్ ప్రారంభించినట్టు పేర్కొన్నారు. కడప–బెంగళూరు వయా మదనపల్లికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కేవలం భూమి ఖర్చు మాత్రమే భరిస్తామని పేర్కొందని, అనంతరం పలు మార్పులు సూచించిందన్నారు. ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ–శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం రూట్‌ను అనుమతించామన్నారు. ఇది వైఎస్సార్ కడప జిల్లా మీదుగా వెళ్తుందని తెలిపారు. -
స్టార్టప్‌లకు కేంద్రంగా భారత్
సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్‌లో టెక్నికల్ స్టార్టప్‌లకు భారతదేశం కేంద్ర బిందువుగా మారనుందని ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్(ఈఎస్సీ) చైర్మన్ సందీప్ నరూలా తెలిపారు. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మంగళవారం నిర్వహించిన ‘ఏపీ స్టేట్ స్టార్టప్ కాన్క్లేవ్’ను ఏయూ వీసీ డాక్టర్ పీవీజీడీ ప్రసాదరెడ్డితో కలిసి సందీప్ నరూలా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టార్టప్‌లకు సంబంధించిన సాంకేతికతను అందిపుచ్చుకునే విషయంలో పరస్పర సహకారం కోసం ఏయూ ఇన్నోవేటివ్ సొసైటీ, ఏయూ ఇంక్యుబేషన్ సెంటర్, ఈఎస్సీ సంస్థ ఎంవోయూ చేసుకున్నాయి. అనంతరం సందీప్ నరూలా మాట్లాడుతూ దేశంలో లోకల్ స్టార్టప్‌లు పెరగడం శుభపరిణామమన్నారు. స్టార్టప్‌లు స్థానిక ఆర్థిక ప్రగతికి ఊతమిస్తాయన్నారు. ఔత్సాహికుల ఆలోచనలను విజయవంతమైన వ్యాపారంగా మార్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఏయూ సహకారం అందించడం అభినందనీయమని కొనియాడారు. ప్రతి రాష్ట్రంలో స్టార్టప్‌ల పోటీలు నిర్వహిస్తున్నామని, వీటిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి త్వరలోనే జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమమైన స్టార్టప్‌లను ఎంపిక చేసి, శాన్ఫ్రాన్సిస్కోలో నిర్వహించనున్న అంతర్జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామని సందీప్ వివరించారు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ) సీనియర్ డైరెక్టర్ డాక్టర్ దేవీష్ త్యాగి మాట్లాడుతూ ఎస్టీపీఐకి దేశ వ్యాప్తంగా 62 కేంద్రాలు ఉన్నాయని, విశాఖ కేంద్రంలో బీపీవో 2.0 ప్రాజెక్టు అమలుకు సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో నెక్స్ట్ జనరేషన్ ఇంక్యుబేషన్ స్కీమ్ అమలుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఏయూలోని స్టార్టప్ సెంటర్లో 38 అంకుర పరిశ్రమలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఈఎస్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్, ఎస్టీపీఐ డైరెక్టర్ రామ్‌ప్రసాద్, ఈఎస్సీ ఏపీ చాప్టర్ చైర్మన్ సుధాకర్ పంతుల, ఏయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణమోహన్ పాల్గొన్నారు. -
మాకియ్యరా ఎస్టీపీఐలు?
సాక్షి, హైదరాబాద్: కేంద్రం కొత్తగా ఏర్పాటు చేసే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కుల (ఎస్టీపీఐ) కేటాయింపులో రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇటీవల దేశవ్యాప్తంగా మంజూరు చేసిన 22 ఎస్టీపీఐలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా, బీహార్, పంజాబ్, జార్ఖండ్, కేరళకు దక్కాయని.. జాబితాలో తెలంగాణకు చోటు లేకపోవడం అన్యాయమన్నారు. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మంత్రి శనివారం లేఖ రాశారు. రాష్ట్రానికి ఎస్టీపీఐల కేటాయింపు అంశాన్ని పునః పరిశీలించాలని.. నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ పట్టణాలకు ఎస్టీపీఐలను కేటాయించాలని కోరారు. ఐటీ పరిశ్రమలో రాణిస్తూ జాతీయ సగటును మించి అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రం నుంచి 2014–15లో రూ.57,258 కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయని.. 2020–21లో రూ.1.45 లక్షల కోట్లకు ఎగుమతులు చేరాయని గుర్తు చేశారు. ఈ రంగంలో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య కూడా రెట్టింపై 6.28 లక్షలకు చేరిందన్నారు. కమర్షియల్ ఆఫీసు స్పేస్ విషయంలోనూ బెంగళూరును హైదరాబాద్ అధిగమించిందని, ఐటీ రంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్, రూరల్ టెక్నాలజీ, డేటా సెంటర్ వంటి ప్రత్యేక పాలసీలు రూపొందించిందని చెప్పారు. హైదరాబాద్‌తో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా ఐటీ పరిశ్రమను విస్తరించేందుకు ప్రభుత్వం వసతులు కల్పిస్తోందన్నారు. ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో అనేక సంస్థలు తమ కార్యకలాపాలు కూడా నెలకొల్పాయన్నారు. ఎస్టీపీఐల ఏర్పాటులో రాష్ట్రంపై వివక్ష ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎస్టీపీఐల ఏర్పాటులో కేంద్రం అన్యాయం చేస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఎస్టీపీఐల కేటాయింపులో రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. ఐటీఐఆర్ రద్దుతో ఇప్పటికే స్థానిక యువత ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని, ఎస్టీపీఐల మంజూరులో వివక్షతో మరింత ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. ఐటీఐఆర్ హోదా పునరుద్ధరణకు సీఎం కేసీఆర్, ఎంపీల బృందంతో పాటు ఐటీ మంత్రి హోదాలో తాను ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం స్పందించలేదని విమర్శించారు. -
రాష్ట్రంలో మరిన్ని సాఫ్ట్వేర్ పార్కులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ ఎగుమతులను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో మరిన్ని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఆరు పార్కులున్నాయి. త్వరలో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విజయవాడలో పార్కు అందుబాటులోకి రానుంది. దీని తర్వాత వైజాగ్, తిరుపతితోపాటు ఇతర నగరాల్లో పార్కులను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ) డెరైక్టర్ జనరల్ ఓంకార్ రాయ్ బుధవారమిక్కడ తెలిపారు. ఇట్స్‌ఏపీ 22వ వార్షిక అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 పార్కులు రెండేళ్లలో అందుబాటులోకి వస్తాయని, ఇందులో విజయవాడ ఒకటని చెప్పారు. మొత్తంగా సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు. ఎస్టీపీఐ పార్కుల్లో 10 వేల ఐటీ కంపెనీలు నమోదయ్యాయి. ఇందులో 3,750 కంపెనీలు ఎగుమతులు చేస్తున్నాయి. 2012-13లో ఈ కంపెనీల ఎగుమతుల విలువ రూ.2.51 లక్షల కోట్లు. వృద్ధి 10 శాతముంది. ఇంటర్నెట్ ఉచితం..: వైజాగ్, కాకినాడ, విజయవాడ, వరంగల్, తిరుపతి నగరాల్లోని ఇంక్యుబేషన్ సెంటర్లలో ఏర్పాటయ్యే నూతన కంపెనీలకు ఏడాదిపాటు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఇవ్వనున్నట్టు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఈ సందర్భంగా తెలిపారు. అలాగే ఆరు నెలలపాటు అద్దె కట్టనక్కరలేదని చెప్పారు. ఆ తర్వాత ఆరు నెలల కాలానికి ప్రభుత్వం నిర్దేశించిన అద్దెలో సగం చెల్లిస్తే చాలని పేర్కొన్నారు. కాగా, 23 విభాగాల్లో ఇట్స్‌ఏపీ అవార్డులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఐటీఈ అండ్ సీ విభాగం కార్యదర్శి సంజయ్ జాజు, రిసెర్చ్ సెంటర్ ఇమారత్ డెరైక్టర్ జి.సతీష్ రెడ్డి, ఇట్స్‌ఏపీ ప్రెసిడెంట్ వి.రాజన్న మాట్లాడారు.