ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా కేంద్రాలు అమలులో ఉన్నట్టు కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ సభ్యుడు కోటగిరి శ్రీధర్ అడిగిన ప్రశ్నకు బుధవారం లిఖితపూర్వక సమాధానమిస్తూ.. కాకినాడ, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవి అమలులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఆత్రేయపురం పూతరేకులకు జీఐ ట్యాగ్
ఆత్రేయపురం పూతరేకులకు జీఐ ట్యాగ్ మంజూరైందని కేంద్ర వాణిజ్యశాఖ సహాయ మంత్రి సోమ్‌ప్రకాశ్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు మార్గాని భరత్‌రామ్, వంగా గీతా విశ్వనా«థ్ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ.. సర్ ఆర్ధర్ కాటన్ ఆత్రేయపురం పూతరేకుల ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం విజ్ఞప్తి మేరకు జూన్ 14, 2023న జీఐ ట్యాగ్ మంజూరైనట్టు కేంద్ర మంత్రి వివరించారు.
3,841 కిలోమీటర్లు విద్యుదీకరణ
ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది జూన్ 30 వరకూ 3,841 కిలోమీటర్లు (బ్రాడ్‌గేజ్ ) విద్యుదీకరణ పూర్తయినట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ సభ్యుడు ఆదాల ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు చింతా అనూరాధ, కోటగిరి శ్రీధర్ అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఏపీలో నాలుగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు అందుతున్నట్టు రైల్వే మంత్రి తెలిపారు. కార్యాచరణ సాధ్యాసాధ్యాలు, ట్రాఫిక్ తదితర అంశాలకు లోబడి నూతన వందేభారత్ సేవలు నిర్వహిస్తున్నామని ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.
కడప–పెండ్లిమర్రి ప్రాజెక్ట్ ప్రారంభం
268 కిలోమీటర్ల మేర కడప–బెంగళూరు ప్రాజెక్ట్ ఏపీ ప్రభుత్వ వ్యయ భాగస్వామ్య ప్రాతిపదికన బడ్జెట్‌లో మంజూరు చేసినట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ సభ్యుడు అవినాశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ.. పూర్తి ప్రాజెక్టు ఖర్చు రూ.2705.98 కోట్లలో 50శాతం ఏపీ ప్రభుత్వం భరించాల్సి ఉందన్నారు.
మార్చి 2023 వరకూ ఈ ప్రాజెక్ట్‌కు రూ.358.60 కోట్లు వ్యయం చేయగా.. 21.30 కి.మీ పొడవున కడప–పెండ్లిమర్రి సెక్షన్ ప్రారంభించినట్టు పేర్కొన్నారు. కడప–బెంగళూరు వయా మదనపల్లికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కేవలం భూమి ఖర్చు మాత్రమే భరిస్తామని పేర్కొందని, అనంతరం పలు మార్పులు సూచించిందన్నారు. ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ–శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం రూట్‌ను అనుమతించామన్నారు. ఇది వైఎస్సార్ కడప జిల్లా మీదుగా వెళ్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment