
సాక్షి, తాడేపల్లి: తమ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి శాసనసభలో స్పీకర్ చేసిన కామెంట్స్‌పై వైఎస్సార్‌సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రజాస్వామ్యంలో దొంగలు అంటే ముఖ్యమంత్రిని వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కినోళ్లు. వేలంపాటలో ప్రజా ప్రతినిధులను, సభ్యులను కొనుక్కున్నవాళ్లు. వైస్రాయ్ హోటల్‌లో క్యాంప్‌లు నిర్వహించిన వాళ్లు. స్పీకర్‌ను అడ్డు పెట్టుకుని పార్టీ పక్షనేతను పోటు పొడిచిన వాళ్లు. జయప్రదంగా పార్టీని, పార్టీ నిధిని కైవసం చేసుకున్న వాళ్లు. ఈ విషయాన్ని స్పీకర్ గమనించాలి. అలాగే ఆయన ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
‘మేమేమీ గోడలు దూకి అర్ధరాత్రులు, అపరాత్రుల్లో అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టడం లేదు. మా నియోజకవర్గాల సమస్యలను ప్రశ్నల రూపంలో సభ ముందుకు తీసుకొచ్చే క్రమంలో అసెంబ్లీ సిబ్బంది సూచన మేరకు హాలు బయట, అందరి సమక్షంలో ఉండే రిజిస్టర్‌లో, అందరి ముందే సంతకం పెట్టాం తప్ప, అందుకోసం దొంగల్లా రాలేదు. ఎవరూ చూడకుండా సంతకం చేయలేదు. మేమేమీ దొంగలం కాదు, అలా వ్యవహరించడానికి!’.
‘విపక్షంలో ఉన్నా, మా బాధ్యత మరవడం లేదు. సభలో ప్రజా సమస్యలు ప్రస్తావించడం కోసం, వాటిపై చర్చ జరిగేలా చూడడం కోసం ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని కోరాం. కానీ, మాకు ఆ అవకాశం దక్కకూడదని మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా మీరు గుర్తించలేదు. తగినంత సభ్యులు లేకపోతే, ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించవద్దని, ఎక్కడా లేకపోయినా, ఆ సాకు చూపి, మా పార్టీ వైయస్సార్‌సీపీని మీరు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించలేదు. అందుకే మా హక్కు కోసం కోర్టును ఆశ్రయించాం. న్యాయస్థానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం’.
‘ఇంకా సభకు హాజరు కాకున్నా, ప్రజా సమస్యలు ప్రతి వేదిక మీద లేవనెత్తుతూనే ఉన్నాం. ప్రభుత్వ అక్రమాలు, అవినీతి చర్యలను ఎండగడుతూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. నిలదీస్తున్నాం. అలా ప్రజల పట్ల మా బాధ్యతను ఏనాడూ మర్చిపోలేదు. అందుకే దొంగల్లా కాకుండా, దొరల్లా బాహాటంగా సభ వద్దకు వస్తున్నాం. ప్రశ్నలు సంధిస్తున్నాం. నియమానుసారం అందరి ముందే రిజిస్టర్‌లో సంతకం చేస్తున్నాం’.
‘నిజం చెప్పాలంటే, సభలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు చాలా మంది నోరెత్తడం లేదు. వారి నియోజకవర్గాల సమస్యలు ప్రస్తావించడం లేదు. అక్కడి ప్రజలను అస్సలు పట్టించుకోవడం లేదు. సభలో ఉండి కూడా అంత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న వారి కంటే, మేము చాలా బాగా పని చేస్తున్నాం. వారు సభకు హాజరై, సభలో ఉన్నా, వారితో ప్రజలకు ఏ ప్రయోజనం లేదు. కానీ, మేము సభకు హాజరు కాకున్నా, మా నియోజకవర్గాలు, ప్రజా సమస్యలు ప్రశ్నల రూపంలో సభలో ప్రస్తావించి, ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం. దీన్ని కాదంటారా?’.
‘బహుజన శాసనసభ్యులను దొంగలుగా సంబోధించడం హేయం. మరి గత అసెంబ్లీలో అప్పటి విపక్షనేత చంద్రబాబు రెండున్నర ఏళ్లు సభకు హాజరు కాలేదు. మమ్మల్ని దొంగలు అన్న మీరు, మీ పార్టీ అధినేత అయిన చంద్రబాబుని ఏమంటారు? సభకు హాజరు కాకున్నా, కనీసం రిజిస్టర్‌లో సంతకం కూడా చేయకున్నా, శాసనసభ్యుడిగా, విపక్షనేతగా, ఆ హోదాలో అంతకాలం పాటు, అన్నీ పొందిన మీ పార్టీ అధినేతను ఏమనాలి? మమ్మల్ని ఉద్దేశించి అన్న దాని కంటే ఇంకా ఎక్కువ పదం వాడతారా?’
‘అయినా స్పీకర్ పదవిని మేము గౌరవిస్తాం. ఆయన ఎలా మాట్లాడినా, ఎన్ని విమర్శలు చేసినా సరే.. వాటన్నింటినీ ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం’.. అని వైఎస్సార్‌సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment