
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు కాదని.. విషం చిమ్మే నాయకుడంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. చంద్రబాబు బరితెగించి మాట్లాడుతున్నారని.. ఆయనకు ఎందుకింత కక్ష అంటూ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు చేసింది విద్వేషపూరిత వ్యాఖ్యలు.. మేం తలుచుకుంటే వైఎస్సార్‌సీపీ నేతలు రోడ్లపై తిరగలేరని హోంమంత్రి మాట్లాడుతున్నారు’’ అని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘చంద్రబాబుకి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందా?. పచ్చబిళ్ల పెట్టుకున్న వాళ్ల పనులు చేసిపెట్టమన్న అచ్చెన్నాయుడి వ్యాఖ్యలకు కొనసాగింపే చంద్రబాబు వ్యాఖ్యలు. రాగ ద్వేషాలతో సీఎం, హోంమంత్రి మాట్లాడుతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడితే అక్రమంగా కేసులు పెడుతున్నారు. దాడులు చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నా క్రూరంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేవలం టీడీపీ నేతల కోసం పనిచేస్తారా.. లేక ప్రజలందరి కోసం పనిచేస్తారా?’’ అంటూ చంద్రశేఖర్ నిలదీశారు.
‘‘తన కొడుకును సీఎం చేసుకోవటానికి లోకేష్ నియోజకవర్గానికి నిధులు మళ్లిస్తున్నారు. ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారు. కులం, మతం చూడకుండా జగన్ పాలన చేశారు. ప్రస్తుత కూటమి పాలనలో అంతా వివక్షే. రెడ్డి సామాజికవర్గంపై కక్ష సాధిస్తున్నారు. దళిత ఆఫీసర్లను ఇబ్బందులు పెడుతున్నారు. తన వ్యాఖ్యలపై చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు వ్యాఖ్యలపై గవర్నర్, కేంద్రం స్పందించాలి’’ అని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
‘‘గుక్కెడు నీటి కోసం ఇబ్బంది పడే పశ్చిమ ప్రకాశంపై ఎందుకు మీకింత పగ?. వెలిగొండ ప్రాజెక్ట్‌పై నిజాలు మాట్లాడే దమ్ముందా?. మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు ఆర్అండ్‌ఆర్ ప్యాకేజ్‌కు నిధులు కేటాయించకుండా మాటలు చెబుతున్నారు. వెలిగొండ కోసం త్వరలో పాదయాత్ర చేపట్టబోతున్నాం. ఎర్రగొండపాలెనికి మీ శాఖ ద్వారా ఏం చేశారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. వెలిగొండను సందర్శించి పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకోవాలి’’ అని చంద్రశేఖర్ హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment