
కార్యకర్త నుంచి ఎమ్మెల్యే స్థాయికి..
యర్రగొండపాలెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 15 సంవత్సరాలుగా నిజాయతీగల కార్యకర్తగా పనిచేసిన తాటిపర్తి చంద్రశేఖర్‌కు ఫలితం దక్కింది. మంగళవారం జరిగిన కౌంటింగ్‌లో ఎమ్మెల్యేగా ఆయన ఘన విజయం సాధించారు. సింగరాయకొండలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్న ఆయనను గుర్తించిన ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి యర్రగొండపాలెం(ఎస్సీ) టికెట్ ఇచ్చి గౌరవించారు. ఆ గౌరవాన్ని నిలుపుకోవటానికి నియోజకవర్గానికి కొత్త అభ్యర్థి అయినా గ్రామ స్థాయి కార్యకర్త నుంచి మండల స్థాయి నాయకుల వరకు ఆయన కలుపుకొనిపోయారు. నాయకుల మధ్య ఉన్న వర్గ విభేదాలను ఆయన ఎంతో సహనంతో పరిష్కరించగలిగారు. అందరినీ సమన్వయ పరచడంలో ఆయన అనేక కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది.
అనతి కాలంలోనే నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తెలుసుకొని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న నీటి సమస్యను వెనువెంటనే పరిష్కరించగలిగారు. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను తన సొంత నిధులతో మరమ్మతులు చేయించి ఆయా ప్రాంత ప్రజల మన్ననలు పొందారు. ప్రత్యర్థి టీడీపీ వర్గానికి చెందిన వారు అడుగడుగునా పెట్టిన కష్టాలను ఎదుర్కొంటూ ఆయన ఎన్నికల్లో ముందుకు సాగారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ చేస్తున్న కార్యక్రమాలకు అభ్యంతరం చెప్తూ ఆర్వోకు ఫిర్యాదు చేయడం, కేసులు నమోదు చేయించడం లాంటి కష్టాలను సైతం అధిగమించి ప్రత్యర్థితో పోరాడిన ఆయనను నియోజకవర్గ ప్రజలు 5,477 ఓట్ల మెజార్టీతో గెలిపించారు.
తన స్వగ్రామమైన సింగరాయకొండలో చేసిన స్వచ్ఛంద సేవలు ఈ ఎన్నికల్లో బాగా పనిచేశాయని చెప్పవచ్చు. తాటిపర్తి చంద్రశేఖర్ వదిన, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షురాలు వనజ, ఆయన భార్య భాగ్యసీమ చౌదరి, కుమార్తె ఆకాంక్ష ఇంటింటికీ తిరిగి చేసిన ప్రచారం నియోజకవర్గ ప్రజలు గుర్తించి వారికి తగిన ఫలితాన్ని అందించారు. వైఎస్సార్ సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, సచివాలయాల కన్వీనర్లు ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవటానికి తమ స్థాయికి మించి కష్టపడ్డారని చెప్పవచ్చు.