సత్యవర్థన్‌ని పోలీసులే వేధించి నిర్బంధించారు: తాటిపర్తి చంద్రశేఖర్‌ | YSRCP MLA Tatiparthi Chandrasekhar Serious On CBN Govt | Sakshi
Sakshi News home page

కూటమి నేతలకు అధికార మదం తలకెక్కింది: తాటిపర్తి చంద్రశేఖర్‌

Published Fri, Feb 14 2025 12:55 PM | Last Updated on Fri, Feb 14 2025 3:24 PM

YSRCP MLA Tatiparthi Chandrasekhar Serious On CBN Govt

సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికార మదాన్ని తలకి ఎక్కించుకుందని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌. కూటమి ప్రభుత్వంలో దుర్మార్గాలు, అరచకాలు పెచ్చరిల్లాయి. ఎవరికీ రక్షణ లేకుండా పోయిందన్నారు. కక్షలనే కర్తవ్యంగా మార్చుకున్నారని ఘాలు విమర్శలు చేశారు. గన్నవరం కేసులో సత్యవర్థన్‌ని పోలీసులు వేధించి, అక్రమంగా నిర్బంధించారని చెప్పుకొచ్చారు. 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో రాజ్యాంగం అమలు కావటం లేదు. కూటమి ప్రభుత​ం ఏర్పడిన తర్వాత దుర్మార్గాలు, అరాచకాలు పెరిగాయి. ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ దుర్మార్గానికి లక్ష్మి అనే మహిళ బలైంది. చివరికి ఆమె మీదనే‌ రివర్స్ కేసు పెట్టించి పక్క రాష్ట్రాల పోలీసులతో అరెస్టు చేయించారు. రాష్ట్రంలో అరెస్టులే తమ లక్ష్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కక్షలనే కర్తవ్యంగా మార్చుకున్నారు

గన్నవరం కేసులో సత్యవర్థన్‌ని పోలీసులు వేధించి, అక్రమంగా నిర్బంధించారు. సత్యవర్ధన్ నిజంగా కిడ్నాప్ అయితే పోలీసులకు ఎలా దొరికాడు?. గన్నవరం కేసులో తనను సాక్షిగా పిలిచి, ఫిర్యాదుదారుడిగా చేశారంటూ సత్యవర్ధనే జడ్జికి చెప్పాడు. దీన్ని తట్టుకోలేక వల్లభనేని వంశీ మీద అక్రమంగా మరో కేసు పెట్టి జైలులో పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికార మదాన్ని తలకి ఎక్కించుకుంది. కూటమి నేతలకు ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేదు. చట్టం, న్యాయం అంటే వీరికి గౌరవం లేదు.

గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతుంటే వారిని పట్టించుకోవడం లేదు. పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేశారు. గన్నవరంలో టీడీపీ కార్యకర్తలే తమ పార్టీ ఆఫీసుపై దాడి చేసుకున్నారు. టీడీపీ నాయకుడు పట్టాభి ఏకంగా పోలీసుల మీద దాడులు చేయించాడు. వారి చేతిలో సీఐ కనకారావు గాయపడ్డారు. తర్వాత కేసు మొత్తాన్ని మార్చేశారు.  వైఎస్సార్‌సీపీ పార్టీ ఆఫీసు మీద దాడి జరగటం, దగ్గర్లోనే అగ్ని ప్రమాదాలు జరగటంపై మాకు అనుమానాలు ఉన్నాయి. దోషులపై  కనీస చర్యలు కూడా తీసుకోని చేతగాని ప్రభుత్వం ఇది. ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టడం దగ్గర్నుంచి జైలు పాలు చేయటం వరకు అన్నీ ప్రభుత్వ పెద్దలే నిర్ణయిస్తున్నారు అని వ్యాఖ్యలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement