సాక్షి, హైదరాబాద్: కేంద్రం కొత్తగా ఏర్పాటు చేసే సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కుల (ఎస్‌టీపీఐ) కేటాయింపులో రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇటీవల దేశవ్యాప్తంగా మంజూరు చేసిన 22 ఎస్‌టీపీఐలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా, బీహార్, పంజాబ్, జార్ఖండ్, కేరళకు దక్కాయని.. జాబితాలో తెలంగాణకు చోటు లేకపోవడం అన్యాయమన్నారు.
ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మంత్రి శనివారం లేఖ రాశారు. రాష్ట్రానికి ఎస్‌టీపీఐల కేటాయింపు అంశాన్ని పునః పరిశీలించాలని.. నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ పట్టణాలకు ఎస్‌టీపీఐలను కేటాయించాలని కోరారు. ఐటీ పరిశ్రమలో రాణిస్తూ జాతీయ సగటును మించి అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రం నుంచి 2014–15లో రూ.57,258 కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయని.. 2020–21లో రూ.1.45 లక్షల కోట్లకు ఎగుమతులు చేరాయని గుర్తు చేశారు.
ఈ రంగంలో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య కూడా రెట్టింపై 6.28 లక్షలకు చేరిందన్నారు. కమర్షియల్ ఆఫీసు స్పేస్ విషయంలోనూ బెంగళూరును హైదరాబాద్ అధిగమించిందని, ఐటీ రంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్, రూరల్ టెక్నాలజీ, డేటా సెంటర్ వంటి ప్రత్యేక పాలసీలు రూపొందించిందని చెప్పారు. హైదరాబాద్‌తో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా ఐటీ పరిశ్రమను విస్తరించేందుకు ప్రభుత్వం వసతులు కల్పిస్తోందన్నారు. ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో అనేక సంస్థలు తమ కార్యకలాపాలు కూడా నెలకొల్పాయన్నారు.
ఎస్‌టీపీఐల ఏర్పాటులో రాష్ట్రంపై వివక్ష
ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎస్‌టీపీఐల ఏర్పాటులో కేంద్రం అన్యాయం చేస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఎస్‌టీపీఐల కేటాయింపులో రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. ఐటీఐఆర్ రద్దుతో ఇప్పటికే స్థానిక యువత ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని, ఎస్‌టీపీఐల మంజూరులో వివక్షతో మరింత ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. ఐటీఐఆర్ హోదా పునరుద్ధరణకు సీఎం కేసీఆర్, ఎంపీల బృందంతో పాటు ఐటీ మంత్రి హోదాలో తాను ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం స్పందించలేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment