స్టార్టప్‌ కలలు కంటున్నారా.. ఈ స్కూల్‌ మీకోసమే..! | Google Launches Startup School India, Targets 10000 Startups In Small Cities | Sakshi
Sakshi News home page

Google Srartup School Of India: స్టార్టప్‌ కలలు కంటున్నారా.. ఈ స్కూల్‌ మీకోసమే..!

Published Wed, Jul 13 2022 8:49 AM | Last Updated on Wed, Jul 13 2022 8:49 AM

Google Launches Startup School India, Targets 10000 Startups In Small Cities - Sakshi

ఉద్యోగం వెదుక్కోవాలి...అనేది నిన్నటి మాట. స్టార్టప్‌కు బాట వేసుకోవాలి... అనేది నేటి మాట. తమ స్టార్టప్‌ కలలను సాకారం చేసుకోవడానికి యూత్‌ ‘స్టార్టప్‌ స్కూల్‌ ఇండియా’ వైపు చూస్తుంది...

ఎంబీఏ చేస్తున్న అభినయ(గోరఖ్‌పూర్‌)కు విజేతల కథలు చదవడం అంటే ఇష్టం. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా, కేవలం తమ ప్రతిభనే పెట్టుబడిగా పెట్టి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్న స్టార్టప్‌ స్టార్‌లు ఆమెకు స్ఫూర్తి. తనకూ స్టార్టప్‌ కలలు ఉన్నాయి. కాని అవి పేపర్‌ మీద మాత్రమే ఉన్నాయి. ఎలా మొదలు కావాలి...అనే విషయం మీద అభినయకు అవగాహన లేదు. ఇది అభినయ పరిస్థితి మాత్రమే కాదు... దేశంలో ఉన్న ఎన్నో చిన్నపట్టణాల యువత పరిస్థితి...ఇలాంటి వారికి ఇప్పుడు ‘స్టార్టప్‌ స్కూలు’ రూపంలో ఒక దారి దొరకబోతోంది.

గూగుల్‌ తాజాగా స్టార్టప్‌ స్కూల్‌ ఇండియా (ఎస్‌ఎస్‌ఐ) గురించి ప్రకటించింది. ‘స్టార్టప్‌’ అనగానే దేశంలో కొన్ని నగరాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. ‘ఇక్కడ మాత్రమే స్టార్టప్‌లకు అనువైన వాతావరణం ఉంది’ అనే భావన ఉంది. మరి చిన్న పట్టణాల పరిస్థితి ఏమిటి? అక్కడ స్టార్టప్‌లకు అవకాశం లేదా? అనే ప్రశ్నకు ‘కచ్చితంగా ఉంది’ అనే సమాధానం తన స్కూల్‌ ద్వారా ఇవ్వబోతోంది గూగుల్‌.

దేశంలోని పది చిన్నపట్టణాల్లో, మూడు సంవత్సరాల కాలపరిధిలో, పదివేల మంది స్టూడెంట్స్‌ను స్టార్టప్‌ రూట్‌లోకి తీసుకురావాలనేది గూగుల్‌ స్టార్టప్‌ స్కూల్‌ లక్ష్యం. ఇన్వెస్టర్లు, సక్సెస్‌ఫుల్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్, ప్రోగ్రామర్స్‌ను ఒకే దగ్గరకు తీసుకువచ్చే వేదిక ఇది. ఎఫెక్టివ్‌ ప్రాడక్ట్‌ స్ట్రాటజీ, ప్రాడక్ట్‌ యూజర్‌ వాల్యూ, రోడ్‌ మ్యాపింగ్‌ అండ్‌ పిఆర్‌డి డెవలప్‌మెంట్‌... మొదలైనవి గూగుల్‌ కరికులమ్‌లో భాగం కానున్నాయి.

వర్కింగ్‌ ఈవెంట్స్, ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌కు సంబంధించినవి తొమ్మిదివారాల కార్యక్రమంలో ఉంటాయి. ‘ఎన్నో స్టార్టప్‌లతో పనిచేసిన అనుభవం గూగుల్‌కు ఉంది. ఇప్పుడు ఆ అనుభవాలు యూత్‌కు గొప్ప పాఠాలుగా మారుతాయి’ అంటున్నారు మమవర్త్‌ కో–ఫౌండర్‌ వరుణ్‌ అలఘ్‌. స్టార్టప్‌ల దిశగా యూత్‌ను తీసుకెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం గూగుల్‌కు ఇదే మొదటిసారి కాదు.

2016లో దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో ఎంటర్‌ప్రెన్యుర్‌షిప్‌ వర్క్‌షాప్‌లు నిర్వహించింది. పదినగరాలలో నిర్వహించిన స్టూడెంట్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ఛాలెంజ్‌ (ఎస్‌ఈసి)కు మంచి స్పందన వచ్చింది. టాప్‌ 3 విన్నర్స్‌ను సిలికాన్‌వ్యాలీకి తీసుకెళ్లి గూగుల్‌ లీడర్స్‌తో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు.

ఇక తాజా‘స్టార్టప్‌’ స్కూల్‌ విషయానికి వస్తే...
‘టెక్నాలజీ, ఫైనాన్స్, డిజైన్‌... మొదలైన రంగాలకు చెందిన మార్గదర్శకులతో ఒక విశాల వేదిక ఏర్పాటు చేయడానికి స్కూల్‌ ఉపకరిస్తుంది’ అంటున్నారు గూగుల్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజన్‌ ఆనందన్‌. దేశంలో స్టార్టప్‌ కల్చర్‌ ఊపందుకోవడానికి అనువైన వాతావరణం ఉంది. అంతమాత్రాన ‘అన్నీ మంచి శకునములే’ అనుకోవడానికి లేదు.

దాదాపు 90 శాతం స్టార్టప్‌లు అయిదుసంవత్సరాల లోపే తమ ప్రయాణాన్ని ఆపేస్తున్నాయి. లోపభూయిష్టమైన డిమాండ్‌ అసెస్‌మెంట్, రాంగ్‌ ఫీడ్‌బ్యాక్, నిర్వాహణలోపాలు... మొదలైన కారణాలు స్టార్టప్‌ల ఫెయిల్యూర్స్‌కు కారణం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గూగుల్‌ స్టార్టప్‌ స్కూల్‌ పాఠాలు యువతరానికి ఎంతో ఉపయోగపడనున్నాయి.

‘నా ఫ్రెండ్స్‌ కొందరు స్టార్టప్‌ మొదలు పెట్టి దెబ్బతిన్నారు. దీంతో నా స్టార్టప్‌ కలకు బ్రేక్‌ పడింది. అయితే ఒకరి పరాజయం అందరి పరాజయం కాదు. ఎవరి శక్తి సామర్థ్యాలు వారికి ఉంటాయి...అనేది తెలుసుకున్నాక నేనెందుకు నా ప్రయత్నం చేయకూడదు అనిపించింది. గూగుల్‌ స్టార్టప్‌ స్కూల్‌ నాలాంటి వారికి విలువైన మార్గదర్శనం చేయనుంది’ అంటుంది దిల్లీ–ఐఐటీ విద్యార్థి ఈషా.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement