
మైక్రోసాఫ్ట్ (Microsoft) సీఈఓ సత్య నాదెళ్ల తన అతిపెద్ద వృత్తిపరమైన పశ్చాత్తాపం గురించి ఇటీవల ఓపెన్ అయ్యారు. గూగుల్ (Google) విజయవంతంగా క్యాష్ చేసుకున్న వెబ్ సెర్చ్ మార్కెట్ ఆధిపత్యాన్ని అంచనా వేయడంలో విఫలమైనట్లు అంగీకరించారు. వెబ్ వికేంద్రీకృతంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ మొదట్లో భావించిందని, సెర్చ్ అత్యంత విలువైన వ్యాపార నమూనాగా మారుతుందని గ్రహించలేదని ఆయన అన్నారు.
చేజారిన అవకాశం..
వెబ్ మార్కెట్ వికేంద్రీకృతంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ మొదట్లో భావించిందని, కేవలం వెబ్ సెర్చ్ అంత పెద్ద బిజినెస్ మోడల్‌గా అంచనా వేయలేకపోయిందని సత్య నాదెళ్ల (Satya Nadella) అంగీకరించారు. ఈ పొరపాటు గూగుల్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, సెర్చ్ చుట్టూ భారీ వ్యాపారాన్ని నిర్మించడానికి దారితీసిందని చెప్పుకొచ్చారు. "వెబ్ లో అతిపెద్ద వ్యాపార నమూనాగా మారిన దానిని మేము మిస్ అయ్యాము. ఎందుకంటే వెబ్ అంతటా విస్తృతమవుతుందని మేమంతా భావించాము" అని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.
గూగుల్ దూరదృష్టి
సెర్చ్ ప్రాముఖ్యతను మైక్రోసాఫ్ట్ తక్కువగా అంచనా వేసినప్పటికీ, దాని సామర్థ్యాన్ని గూగుల్ గుర్తించింది. దూరదృష్టిని ప్రదర్శించింది. వ్యూహాన్ని లోపరహితంగా అమలు చేసింది. సెర్చ్ ద్వారా వెబ్ ను ఆర్గనైజ్ చేయడంలో విలువను చూసి గూగుల్ దాన్ని ఎలా క్యాపిటలైజ్ చేసిందో సత్య నాదెళ్ల వివరించారు. "వెబ్ ను ఆర్గనైజ్ చేయడంలో సెర్చ్ అతిపెద్ద విజేత అవుతుందని ఎవరు ఊహించి ఉంటారు? మేము స్పష్టంగా దానిని చూడలేదు, గూగుల్ దాన్ని చూసింది.. చాలా బాగా అమలు చేసింది" అని అంగీకరించారు.
నేర్చుకున్న పాఠాలు
సాంకేతిక మార్పులను అర్థం చేసుకుంటే సరిపోదని సత్య నాదెళ్ల ఉద్ఘాటించారు. విలువ సృష్టి ఎక్కడ జరుగుతుందో కంపెనీలు గుర్తించాలి. సాంకేతిక పురోగతిని కొనసాగించడం కంటే వ్యాపార నమూనాలలో మార్పులకు అనుగుణంగా మారడం చాలా సవాలుతో కూడుకున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ బిజినెస్ మోడల్ మార్పులు టెక్ ట్రెండ్ మార్పుల కంటే కూడా కఠినంగా ఉంటాయని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.
ఈ అవకాశాన్ని కోల్పోయినప్పటికీ, సత్య నాదెళ్ల సీఈవోగా (CEO) బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్ పై బలమైన దృష్టితో మైక్రోసాఫ్ట్ ఎదుగుదలకు నాయకత్వం వహించారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా ముందుకు సాగేందుకు, టెక్ పరిశ్రమలో మైక్రోసాఫ్ట్ నూతన ఆవిష్కరణలు, నాయకత్వం వహించేలా కంపెనీని నడిపిస్తున్నారు.
సన్ మైక్రోసిస్టమ్స్ లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్ లో చేరిన సత్య నాదెళ్ల అనేక ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. మంగళూరు విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ, విస్కాన్సిన్-మిల్వాకీ వర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ, చికాగో విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ పట్టా పొందారు.
Comments
Please login to add a commentAdd a comment