మేకిన్ ఇండియా ప్రచారం కాస్త ఎక్కువైంది...
న్యూఢిల్లీ: ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించడంలో ప్రభుత్వం క్రియాశీలకంగానే వ్యవహరిస్తోన్నప్పటికీ.. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా కార్యక్రమాలకు ప్రచారం అతిగా ఉంటోందని పారిశ్రామికవేత్త, భారతీ ఎంటర్‌ప్రైజెస్ వైస్ చైర్మన్ రాజన్ భారత్ మిట్టల్ వ్యాఖ్యానించారు. స్టార్టప్‌లకు, చిన్న సంస్థలకు క్షేత్రస్థాయిలో చాలా సమస్యలు అలాగే ఉన్నాయని ఆయన చెప్పారు. చిన్న సంస్థల వ్యాపారాల నిర్వహణ చాలా కష్టతరంగానే ఉంటోందని ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) ఇండియా సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఏవో చిన్న చిన్న మార్పులు చేసి ర్యాంకింగ్‌లు మెరుగుపర్చుకోవడం, దాని గురించి గొప్పలు చెప్పుకోవడం కాకుండా.. సిసలైన మార్పును సాధించడానికి నడుం బిగించాలని రాజన్ చెప్పారు. చైనా మందగమన పరిస్థితుల మధ్య అవకాశాలను అందిపుచ్చుకునేందుకు భారత్ మరింత వేగంగా స్పందించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘ఒక్క చిన్న మార్పుతో ర్యాంకింగ్స్‌లో 12 స్థానాలు పైకి ఎగబాకేయొచ్చు.. గొప్పలు చెప్పుకుంటూ తిరగొచ్చు. కానీ, వాస్తవంగా మెరుగుపడాలంటే కొరడా ఝుళిపించాలి. మరింత పోటీతత్వంతో పనిచేయాలి. చైనాలో మందగమన పరిస్థితులను సద్వినియోగం చేసుకునేందుకు సరైన సమయంలో స్పందించకపోతే మరో అవకాశాన్ని.. తుది అవకాశాన్ని చేజార్చుకున్న వాళ్లం అవుతాము’ అని రాజన్ పేర్కొన్నారు.