
ఆసియా పసిఫిక్‌లో 5వ ర్యాంకు
ఢిల్లీకి 8వ స్థానం
సీబీఆర్‌ఈ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: సీమాంతర పెట్టుబడులకు సంబంధించి ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని టాప్ 10 కీలక మార్కెట్ల జాబితాలో ముంబై, ఢిల్లీ చోటు దక్కించుకున్నాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్‌ఈ ఇండియా నిర్వహించిన సర్వే నివేదికలో ముంబైకి అయిదో ర్యాంకు, న్యూఢిల్లీకి ఎనిమిదో ర్యాంకు లభించింది. ఈ జాబితాలో ముంబై కన్నా ముందువరుసలో టోక్యో, సిడ్నీ, సింగపూర్, హోచిమిన్ సిటీ ఉన్నాయి. సర్వేలో పాల్గొన్నవారిలో సగం మంది పైగా ఇన్వెస్టర్లు 2025లో మరింతగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు వెల్లడించారు.
దేశీయంగా రియల్టీలో ఆఫీస్, రెసిడెన్షియల్ స్పేస్‌తో పాటు పారిశ్రామిక.. డేటా సెంటర్లపై కూడా ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. 2024లో భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలోకి పెట్టుబడులు 54 శాతం పెరిగి ఆల్‌టైం గరిష్టమైన 11.4 బిలియన్ డాలర్లకు చేరాయి.
‘భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడులు 2024లో రికార్డు స్థాయికి చేరాయి. ఇందులో దేశీ ఇన్వెస్టర్ల ఆధిపత్యం ఎక్కువగానే ఉన్నప్పటికీ విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కూడా గణనీయంగా పెరగడమనేది గ్లోబల్ రియల్ ఎస్టేట్ గమ్యస్థానంగా భారత్‌కి ప్రాధాన్యం పెరుగుతుండటానికి నిదర్శనంగా నిలుస్తుంది‘ అని సీబీఆర్‌ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. రియల్ ఎస్టేట్‌లో ప్రస్తుత విభాగాలతో పాటు కొత్త విభాగాల్లోకి సైతం పెట్టుబడుల ప్రవాహం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ–కామర్స్, వేగవంతమైన డెలివరీ సేవలకు డిమాండ్ నెలకొనడమనేది లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ పరిశ్రమకు ఊతమివ్వగలదని అన్షుమన్ చెప్పారు. దీనితో ఇటు డెవలపర్లు, ఇన్వెస్టర్లకు కూడా ఆకర్షణీయమైన అవకాశాలు లభించవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment