హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ, సాంకేతిక పరిశ్రమలకు కేంద్రాలుగా ఉన్న హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు నగరాలు అప్రెంటీస్‌ల నియామకం విషయంలో అత్యంత ఆశాజనక ప్రదేశాలుగా అవతరించాయి. టీమ్‌లీజ్ అప్రెంటిస్‌షిప్ ఔట్‌లుక్ నివేదిక ప్రకారం.. 14 నగరాల్లో 24 రంగాలకు చెందిన 597 కంపెనీలు ఇందులో పాలుపంచుకున్నాయి.
2022 జూలై–డిసెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–మార్చిలో అప్రెంటీస్‌ల నియామకాల కోసం ఆసక్తి 77 నుంచి 79 శాతానికి పెరిగింది. సర్వేలో పాల్గొన్న హైదరాబాద్ కంపెనీల్లో 83 శాతం అప్రెంటీస్‌ల నియామకాలను అధికం చేయాలని భావిస్తున్నాయి. ఢిల్లీ కంపెనీల్లో 82 శాతం, బెంగళూరులో 80, చెన్నై 81, ముంబై 77 శాతం కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. మెట్రోయేతర నగరాలైన కోయంబత్తూరు 79 శాతం, నాగ్‌పూర్ 76, పుణే 76, అహ్మదాబాద్ 70 శాతం కంపెనీలు ఉత్సాహం కనబరిచాయి.
వారి ప్రమేయమూ ఎక్కువే..
అప్రెంటీస్‌ల ప్రమేయం రంగాల వారీగా చూస్తే ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ కంపెనీల్లో 90 శాతం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ 88, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ 74 శాతం ఉంది. అప్రెంటీస్‌లను పెంచుకోవాలని ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ కంపెనీల్లో 94 శాతం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ 93, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ కంపెనీల్లో 85 శాతం ఆసక్తిగా ఉన్నాయి.
2023లో హైదరాబాద్, ఢిల్లీ, బెంగుళూరు వంటి నగరాల్లో నిరంతర వృద్ధితో దేశంలో అప్రెంటిస్‌షిప్ పట్ల ఆశాజనక దృక్పథాన్ని చూస్తాం’ అని నివేదిక వివరించింది. అప్రెంటిస్‌షిప్‌లో భాగంగా వేతనంతో కూడిన ఉద్యోగంతోపాటు శిక్షణ ఉంటుంది. అప్రెంటీస్‌లు తమ పని గంటలలో కొంత సమయాన్ని తరగతి గది ఆధారిత అభ్యాసాన్ని కళాశాల, విశ్వవిద్యాలయం లేదా కంపెనీలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
పుష్కల అవకాశాలు..
హైదరాబాద్, ఢిల్లీ, బెంగుళూరు నగరాలు ఐటీ, సాంకేతిక పరిశ్రమలకు కేంద్రాలుగా, ఈ రంగం వృద్ధికి దోహదపడుతున్నప్పుడు.. పరిశ్రమ నిర్దిష్ట నైపుణ్యాలు, జ్ఞానాన్ని పొందేందుకు అప్రెంటీస్‌లకు పుష్కల అవకాశాలను అందిస్తాయని టీమ్‌లీజ్ డిగ్రీ అప్రెంటిస్‌షిప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సుమిత్ కుమార్ వ్యాఖ్యానించారు.
‘అప్రెంటిస్‌షిప్ కార్యక్రమాలు కంపెనీ యజమానులు, అప్రెంటీస్‌లకు విజయవంతమైన పరిష్కారంగా ఉద్భవించాయి. నిరుద్యోగాన్ని తగ్గించడం, జీవనోపాధిని మెరుగుపరచడం, నైపుణ్యాభివృద్ధి ద్వారా సామాజికంగా సాధికారత వైపు నడుపుతున్నారు. వ్యాపారాల ఉత్పాదకత, ఆవిష్కరణలు, పోటీతత్వాన్ని ఆర్థికంగా పెంచుతున్నారు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment