మోతాదుకు మించి నమోదవుతున్న వాయు కాలుష్యం
పర్యావరణంతోపాటు మనుషుల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ వాయు కాలుష్యం కూడా తీవ్రస్థాయికి చేరుకుంటోంది. మరీ ముఖ్యంగా మహానగరం దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలిలో కాలుష్య స్థాయి పెరిగి వాయు నాణ్యత క్రమంగా తగ్గిపోతోంది. ఒకవైపు దేశ రాజధాని ఢిల్లీలో వాయునాణ్యత ప్రమాదకరంగా తగ్గిపోయి.. అక్కడి ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుండగా.. గతంలో ఈ సమస్య అంతగా లేని హైదరాబాద్‌లోనూ వాయు కాలుష్య స్థాయి పెరుగుతోంది.
నగరాల్లో వాయు నాణ్యత ప్రమాణాలు 0–50 పాయింట్లలోపు ఉంటే ఆరోగ్యకరమైనవిగా, 50 పాయింట్లకు పైబడి గాలి నాణ్యత రికార్డ్ అయితే కొంత సంతృప్తికరంగా, ఆ తర్వాత నుంచి అంటే వంద పాయింట్లకు పైబడి పెరుగుతున్న కొద్దీ ఇది వివిధ వర్గాల వారికి సమస్యాత్మకంగా మారుతూ ఆరోగ్యపరంగా, ఇతరత్రా రూపాల్లో ప్రభావితం చేస్తోంది. నగరంలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఇక్రిశాట్, పాశమైలారం, సనత్‌నగర్‌లలో 144 పాయింట్ల నుంచి 270 పాయింట్లు వాయు నాణ్యత స్థాయి (ఏక్యూఐ)లో రికార్డయ్యింది.
దీంతో హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాలు కూడా వాయు కాలుష్య తీవ్రత విషయంలో ఢిల్లీ బాటలోనే నడుస్తున్నాయా అన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఏక్యూఐ ఆధారంగా రూపొందించిన నివేదికను బట్టి చూస్తే.. వాయుకాలుష్యం పెరిగిన కారణంగా హైదరాబాద్ దేశంలోనే ఏడోస్థానంలో నిలిచింది. నగరంలో వివిధ రకాల వాహనాల సంఖ్య భారీగా పెరుగుదల, పలుచోట్ల సాగుతున్న నిర్మాణాలు, ఇండ్రస్టియల్ పొల్యూషన్ పెరుగుదల, పలుచోట్ల చెత్త దహనం, నాలుగువైపులా విస్తరణ, ఇతర రూపాల్లో గాలి నాణ్యత దెబ్బతింటోంది. దాదాపు ఏడాది కాలంలోనే హైదరాబాద్‌లో వాయు నాణ్యత గణనీయంగా క్షీణించడంతో కలుషిత నగరాల లిస్ట్‌లో చేరిపోయింది.
స్విస్ కంపెనీ ఐక్యూ ఏఐఆర్ నివేదిక ప్రకారం
అతి సూక్ష్మరూపాల్లోని ధూళికణాలు (పీఎం 2.5) ప్రామాణిక పాయింట్లపరంగా 30 పాయింట్లు దాటితే కాలుష్యకారకంగా పరిగణిస్తారు.
మనదేశంలోని ప్రధాన నగరాల్లో కాలుష్య స్థా యి జాతీయ సగటు కంటే రెండింతలు నమోదైంది. పీఎం 2.5 విషయానికొస్తే జాతీయ సగటు కంటే ఢిల్లీలో అధికరెట్లు నమోదుకాగా, హైదరాబాద్‌లో 2022లో 42.4 పాయింట్లు, 2023లో 39.9 పాయింట్లు నమోదైంది.
ప్రామాణికంగా చూస్తే పీఎం 10 స్థాయి (మైక్రోగ్రామ్ ఫర్ క్యూబిక్ మీటర్) 60 పాయింట్లు దాటితే వాయు కాలుష్య కారకాలు పెరిగినట్టుగా భావించాలి.
2023–24 నాటికి ఏడాదికి 20 నుంచి 30 శాతం పీఎం 10 సాంద్రతను తగ్గించాలని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే సగటు వార్షిక పీఎం 10 స్థాయి 2023–24లో ఢిల్లీలో 208, హైదరాబాద్‌లో 81 పాయింట్లు రికార్డయ్యింది.
ఏక్యూఐ ‘పూర్’ కేటగిరీలోనే ఉంది
ప్రస్తుతం హైదరాబాద్ గాలిలో నాణ్యత పరిస్థితిని బట్టి చూస్తే ధూమపానం అలవాటు లేకపోయినా రోజుకు మూడు సిగరెట్ల నుంచి వచ్చే పొగ పీల్చుతున్నట్టుగా భావించాలి. నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఏక్యూఐ ‘పూర్’కేటగిరీలోనే ఉంది. దీనిని బట్టి చూస్తే వాయు నాణ్యత అనేది ఏవైనా హెల్త్ సమస్యలున్న సున్నితమైన వ్యక్తులు అనారోగ్యకరమైనదిగానే భావించాలి.
మరీ ముఖ్యంగా ఉబ్బసం ఇతర వ్యాధులున్న చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలున్న పెద్దవారికి ఇది సమస్యగానే పరిగణించాలి. దీర్ఘకాల అనారోగ్య సమస్యలున్న వారు శ్వాస సంబంధిత సమస్యలున్న వారు బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువసేపు సంచరించకపోవడం మంచిది. ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్స్, కార్లలో ఫిల్టర్లు, బయటకు వెళ్లినప్పుడు ఎన్–95 మాస్క్‌లు ధరించడం ద్వారా వాయునాణ్యత క్షీణతను నియంత్రించే అవకాశాలున్నాయి.
– డాక్టర్ హరికిషన్, పల్మోనాలజిస్ట్, యశోద ఆస్పత్రి, సికింద్రాబాద్
మనిషి నిర్లక్ష్యం మరింత ప్రమాదకరం
కేంద్ర ప్రభుత్వా లు ఇప్పటిదాకా ‘ఎన్విరాన్ ప్రొటెక్షన్ అథారిటీ’ లేదా ‘ఎన్విరాన్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ వంటిది ఏర్పాటు చేయకపోవడం పెద్దలోపం. విపత్తులు సంభవించకుండా.. ఏదైనా ఉపద్రవం జరిగితే సహాయక చర్యలు చేపట్టేందుకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌డీఎంఏ) ఏర్పాటు చేశారు. వాయు, ఇతర కాలుష్యాలను నియంత్రించాలంటూ సుప్రీంకోర్టు అనేక తీర్పులిచ్చినా, ఇప్పటివరకు ఈ సంస్థ వాయు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
ప్రస్తుతం ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో వాయు కాలుష్య వ్యాప్తిని జాతీయవిపత్తుగా పరిగణించాలని ఎన్‌డీఎంఏను డిమాండ్ చేస్తున్నాను. దేశంలోని రాజకీయపార్టీలు కూడా కాలుష్య నియంత్రణ విషయంలో ఎలాంటి చొరవ తీసుకోవడం లేదు. వివిధ రూపాల్లోని కాలుష్య నియంత్రణలో సెంట్రల్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు పూర్తిగా వైఫల్యం చెందాయి. 1974 వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్, 1981 ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్, 1986 ఎన్విరాన్‌మెంట్ యాక్ట్‌లను దేశంలో కచ్చితంగా అమలు చేసి కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయాయి.
మనదేశంలో గాలి, నీరు, ఇతర రూపాల్లో కాలుష్యాలు తీవ్రస్థాయికి చేరుకొని ప్రమాదకరంగా మారాయి. అయినప్పటికీ వీటివల్ల తీవ్రంగా ప్రభావితమవుతున్న మనిషనేవాడు మాత్రం తనకేమీ కాదన్నట్టుగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాడు. ప్రజలంతా కూడా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. తమవంతుగా ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏమాత్రం ప్రయతి్నంచకుండా, కర్బన ఉద్గారాలను పెంచేందుకు తన చర్యల ద్వారా కృషి చేస్తున్నారు.
– ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్త
టీజీపీసీబీ ఏం చెబుతుందంటే...
హైదరాబాద్‌తోపాటు పరిసరాల్లోని వాయు నాణ్యతను 14 ప్రదేశాల్లో నిరంతర పరిసర ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్ల (సీఏఏక్యూఎంఎస్) ద్వారా ఆటోమేటిక్‌గా లెక్కించడంతోపాటు, మాన్యువల్‌గా 16 ప్రదేశాల్లో వాయు నాణ్యతను పర్యవేక్షిస్తున్నాం. హైదరాబాద్‌లో ఏక్యూఐ అనేది నవంబర్ 22న 120 , 23 న 123 పాయింట్లు, 24న 123 పాయింట్లుగా (మూడురోజులుగా మధ్యస్థంగా)ఉంది.ౖగాలి నాణ్యతను మెరుగుపరిచే కార్యాచరణ ప్రణాళిక అమలులో ఉంది.
దీని కారణంగా పీఎం10, పీఎం 2.5 సాంద్రతలు 2019 నుంచి 2023 వరకు వరుసగా 97 నుంచి 81 జ/ఝ3, 40 నుండి 36 జ/ఝ3కి తగ్గాయి. నగరంలో ఏక్యూఐ సాధారణంగా గుడ్ నుంచి మోడరేట్ అంటే 200 పాయింట్ల తక్కువ పరిధిలో ఉంటుంది. ఏక్యూఐ వర్షాకాలంలో బాగుంటుంది, శీతాకాలంలో మధ్యస్థంగా ఉంటుంది. రుతువుల్ని బట్టి ఇది మారుతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఆధారంగా గణిస్తారు. అయితే చాలా యాప్‌లు యూరప్, అమెరికా ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఆధారంగా ఏక్యూఐని గణిస్తున్నాయి, అది మనకు వర్తించదు. ఇది అధిక ఏక్యూఐ సూచిస్తుందని గమనించాలి.
– తెలంగాణ కాలుష్యనియంత్రణ మండలి (టీజీపీసీబీ)
Comments
Please login to add a commentAdd a comment