డిసెంబర్ క్వార్టర్‌లో 1.08 లక్షల ఇళ్ల అమ్మకాలు
స్థిరాస్తి డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ అంచనా
న్యూఢిల్లీ: దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో డిసెంబర్ క్వార్టర్‌లో గృహ అమ్మకాలు 21 శాతం తగ్గి 1.08 లక్షల యూనిట్లకు చేరుకోవచ్చని స్థిరాస్తి డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ అంచనా వేసింది. ఢిల్లీ–నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో (ఎన్‌సీఆర్) మాత్రం విక్రయాలు పెరుగుతాయని వెల్లడించింది. ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, నవీ ముంబై, కోల్‌కతా, బెంగళూరు, పుణే, హైదరాబాద్, చెన్నై, థానే నగరాల్లో గృహ విక్రయాల వివరాలను ప్రాప్‌ఈక్విటీ శనివారం విడుదల చేసింది. మొత్తం తొమ్మిది నగరాల్లో 2024 డిసెంబర్ క్వార్టర్‌లో 1,08,261 యూనిట్ల ఇళ్లు అమ్ముడు కావొచ్చు.
గతేడాది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 1,37,225 యూనిట్ల విక్రయాలు జరిగాయి. అయితే 2024 సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే అక్టోబర్–డిసెంబర్ అమ్మకాలు 5% పెరిగే అవకాశం ఉందని వివరించింది. అధిక బేస్ ధరల ప్రభావం కారణంగానే క్యూ3లో ఇళ్ల ధరలు తగ్గాయి. పండుగ డిమాండ్ కలిసిరావడంతో త్రైమాసిక ప్రాతిపదికన అమ్మకాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మూలాలు బలంగా, ఆరోగ్యకరంగా ఉన్నాయని ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు సీఈవో సమీర్ జసుజా తెలిపారు.
⇒ హైదరాబాద్ పరిధిలో విక్రయాలు 47% తగ్గొచ్చని అంచనా వేసింది. 2023–24 డిసెంబర్ త్రైమాసికంలో 24,044 గృహ విక్రయాలు జరిగితే ఈ ఏడాది 12,682 యూనిట్లకు పరిమితం కావొచ్చు.
⇒ బెంగళూరులో 13 శాతం తగ్గి విక్రయాలు 17,276 యూనిట్ల నుంచి 14,957 యూనిట్లకు దిగివచ్చే అవకాశం ఉంది. చెన్నైలో 4,673 యూనిట్ల నుంచి తొమ్మిది శాతం తగ్గి 4,266 యూనిట్లకు చేరుకోవచ్చు. కోల్‌కతాలో అమ్మకాలు 33% తగ్గి 5,653 నుంచి 3,763 యూనిట్లకు దిగిరావచ్చు.
⇒ ముంబై నగరంలో గృహ విక్రయాలు 13,878 యూనిట్ల నుంచి 27% పతనమై 10,077 యూనిట్లుగా ఉండొచ్చు. నవీ ముంబై పరిధిలో 13% విక్రయాలు తగ్గొచ్చు. కాగా 2023–24 డిసెంబర్ త్రైమాసికంలో 8,607 ఇళ్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది 7,478 గృహాలకు పరిమితం కావచ్చు. థానేలో 26,099 యూనిట్ల నుంచి 21,893 యూనిట్లకు పడిపోవచ్చు. పుణేలో ఇండ్ల విక్రయాలు 24 శాతం తగ్గే చాన్స్ ఉంది.
⇒ ఇన్వెస్టర్ల నుంచి బలమైన డిమాండ్ కారణంగా ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో గురుగ్రాం పరిధిలో లగ్జరీ ఇళ్లకు కొన్నేళ్లుగా డిమాండ్ అసాధారణ రీతిలో పెరుగుతోంది. 2023–24 డిసెంబర్ త్రైమాసికంలో 10,354 గృహ అమ్మకాలు జరిగితే.. ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ మధ్య 12,915 ఇళ్ల విక్రయాలు జరిగే అవకాశం ఉంది. అంటే 25% అమ్మకాలు పుంజుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment