తక్కువ సరఫరా, లగ్జరీ అపార్ట్మెంట్లకు అధిక డిమాండ్ కారణంగా ఈ ఏడాది జనవరి-మార్చిలో ఎనిమిది ప్రధాన నగరాల్లో అఫోర్డబుల్ ఇళ్ల అమ్మకాలు 4 శాతం క్షీణించి 61,121 యూనిట్లకు పడిపోయాయని ప్రాప్ ఈక్విటీ తెలిపింది. మొదటి ఎనిమిది స్థానాల్లో ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్ ఉన్నాయి.
రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ డేటా ప్రకారం గత క్యాలెండర్ ఇయర్ జనవరి-మార్చి కాలంలో రూ.60 లక్షల మేర విలువైన ఇళ్ల అమ్మకాలు 6,3787 యూనిట్లుగా ఉన్నాయి. చౌక గృహాల సరఫరా తక్కువగా ఉండటం అమ్మకాలు స్వల్పంగా పడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి. ప్రాప్ ఈక్విటీ డేటా ప్రకారం, ఈ టాప్ 8 నగరాల్లో 2024 జనవరి-మార్చి మధ్య కాలంలో రూ.60 లక్షల మేర విలువైన ఇళ్ల తాజా సరఫరా 53,818 యూనిట్ల నుంచి 33,420 యూనిట్లకు తగ్గింది.
ప్రాప్ ఈక్విటీ డేటా ప్రకారం.. ఈ ఏడాది జనవరి-మార్చిలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో రూ .60 లక్షల వరకు ధర కలిగిన గృహాల అమ్మకాలు 23,401 యూనిట్ల నుంచి 28,826 యూనిట్లకు పెరిగాయి. పుణెలో అమ్మకాలు 14,532 యూనిట్ల నుంచి 12,299 యూనిట్లకు పడిపోయాయి. అహ్మదాబాద్‌లో 8,087 యూనిట్ల నుంచి 6,892 యూనిట్లకు తగ్గాయి.
హైదరాబాద్‌లో ఈ ఇళ్ల అమ్మకాలు 3,674 యూనిట్ల నుంచి 3,360 యూనిట్లకు తగ్గగా, చెన్నైలో అమ్మకాలు 3,295 యూనిట్ల నుంచి 2,003 యూనిట్లకు పడిపోయాయి. బెంగళూరులో అమ్మకాలు 5,193 యూనిట్ల నుంచి 2,801 యూనిట్లకు తగ్గాయి. కోల్‌కతాలో మాత్రం అమ్మకాలు 2,831 యూనిట్ల నుంచి 3,741 యూనిట్లకు పెరిగాయి. ఢిల్లీ-ఎన్సీఆర్‌లో 2,774 యూనిట్ల నుంచి 1,199 యూనిట్లకు తగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment