రియల్‌ఎస్టేట్‌లో హైదరాబాద్ సత్తా చాటింది. గతేడాది నగరంలో ఇళ్ల అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరిగాయి. 2023లో భాగ్యనగరంలో ఇళ్ల అమ్మకాలు ఆల్‌టైమ్ గరిష్టాన్ని నమోదు చేసినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదికలో వెల్లడైంది.
ఆల్‌టైమ్ హై
నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన ఇండియా రియల్ ఎస్టేట్ - రెసిడెన్షియల్, ఆఫీస్ మార్కెట్ రిపోర్ట్ ప్రకారం.. 2023లో హైదరాబాద్‌లో చరిత్రాత్మక గరిష్ట స్థాయిలో 32,880 హౌసింగ్ యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇవి అంతకుముందు ఏడాది కంటే 6 శాతం పెరిగాయి. ఇక హౌసింగ్ యూనిట్ల ప్రారంభంలోనూ కొత్త రికార్డును నెలకొల్పుతూ, నగరంలో రెసిడెన్షియల్ లాంచ్‌లు 2023లో 7 శాతం పెరిగి 46,985 యూనిట్లకు చేరుకున్నాయి.
గృహ కొనుగోలుదారులు జీవనశైలి అప్‌గ్రేడ్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం, సౌకర్యాలు అధికంగా ఉండే కమ్యూనిటీలవైపు మొగ్గు చూపడం వంటివి ఈ పెరుగుదలకు కారణాలుగా నైట్‌ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. ఇక ఇళ్ల బలమైన డిమాండ్-సరఫరా, ఖరీదైన ఇళ్లకు కొనుగోలుదారుల ప్రాధాన్యత పెరగడం వంటి కారణాలు ఇళ్ల ధరల్లోనూ గణనీయమైన పెరుగుదలకు దారితీశాయి.
ఖరీదువారీగా చూస్తే..
రూ.కోటికి మించి ఖరీదైన ఇళ్ల అమ్మకాలు ఐదేళ్లలో రెట్టింపయ్యాయి. 2018లో మొత్తం అమ్మకాల్లో ఇవి 21 శాతం ఉండగా 2023లో 49 శాతానికి పెరిగింది. 2022తో 11,632 యూనిట్లతో పోలిస్తే 2023లో 16,086 యూనిట్లకు పెరిగాయి.
రూ.50 లక్షల లోపు విలువైన ఇళ్ల విక్రయాలు 2018లో 26 శాతం నుంచి 2023లో 11 శాతాకి సగానికి పైగా తగ్గింది. 2022లో 5,630 యూనిట్ల నుంచి 2023లో 3,674 యూనిట్లకు తగ్గిపోయాయి.
రూ.50 లక్షల నుంచి రూ.కోటి లోపు ధర ఉన్న ఇళ్ల అమ్మకాలు 2018లో 52 శాతం నుంచి 2023లో 40 శాతానికి క్షీణించాయి. ఈ ధర విభాగంలో 2023లో దాదాపు 13,120 రెసిడెన్షియల్ యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022లో 13,784 యూనిట్లతో పోల్చితే 5 శాతం తగ్గాయి.
భారీగా పెరిగిన ధరలు
నగరంలో ఇళ్ల ధరలు 2023లో భారీగా పెరిగాయి. పెరిగిన డిమాండ్ ఫలితంగా ఇళ్ల సగటు ధరలో 11 శాతం పెరుగుదల నమోదైంది. నగరంలోని వెస్ట్, సౌత్ రీజియన్లలో పెరుగుదల ఎక్కువగా ఉంది. ప్రాంతాలవారీగా తీసుకుంటే వెస్ట్ రీజియన్‌లోని కోకాపేటలో అత్యధికంగా 39 శాతం పెరుగుదల ఉంది. 28 శాతం పెరుగుదలతో మణికొండ ఆ తర్వాత స్థానంలో ఉంది. దీనికి విరుద్ధంగా నార్త్ రీజియన్‌లోని సైనిక్‌పురిలో 2 శాతం ధరలు తగ్గిపోవడం గమనార్హం.
ఆఫీస్ మార్కట్‌లోనూ..
ఆఫీస్ మార్కట్‌లోనూ హైదరాబాద్ గణనీయమైన పెరుగుదలను నమోదు చేసినట్లు నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (జీసీసీలు) ముఖ్యంగా తమ ఐటీ, బ్యాక్-ఆఫీస్ కార్యకలాపాలను నగరానికి విస్తరించడంతో 2023లో హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్‌లో వార్షిక లావాదేవీల్లో 32 శాతం పెరుగుదల నమోదైంది.
ఇక ఆఫీస్ లీజింగ్ కార్యకలాపాలు 2023లో 52 శాతం, 4.1 మిలియన్ చదరపు అడుగులకు పెరిగాయి. నగరంలో 2022లో 6.7 మిలియన్ చదరపు అడుగుల మేర ఆఫీస్ లావాదేవీల జరగ్గా 2023 సంవత్సరంలో 8.8 మిలియన్ చదరపు అడుగుల ట్రాన్సాక‌్షన్లు నమోదు చేసింది. మరో వైపు నగరంలో 6.5 మిలియన్ చదరపు అడుగుల కొత్త ఆఫీస్‌ల సరఫరా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment