న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ తన జోరు కొనసాగిస్తోంది. జూన్ త్రైమాసికంలో బలమైన పనితీరు చూపించింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. జూన్ క్వార్టర్‌లో హైదరాబాద్ మార్కెట్లో 15,085 ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్ముడుపోయిన ఇళ్లు 13,565 యూనిట్లతో పోల్చి చూస్తే 11 శాతం వృద్ధి కనిపించింది.
కానీ, ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికం అమ్మకాలు 19,660 యూనిట్లతో పోల్చి చూసినప్పుడు 23 శాతం క్షీణత నెలకొంది. ఇక దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లోనూ ఇదే ధోరణి కనిపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ కాలంలో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చినప్పుడు 5 శాతం పెరిగి 1,20,340 యూనిట్లుగా ఉన్నాయి. కానీ, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో విక్రయాలు 1,30,170 యూనిట్లతో పోల్చిచూస్తే 8 శాతం తగ్గాయి. ‘‘క్రితం త్రైమాసికంలో అధిక విక్రయాల బేస్ ఏర్పడినప్పడు తర్వాతి త్రైమాసికంలో అమ్మకాలు తగ్గడం సాధారణమే.
అంతేకాదు ఈ స్థాయిలో విక్రయాలు తగ్గడానికి గడిచిన ఏడాది కాలంలో గణనీయంగా పెరిగిపోయిన ప్రాపర్టీ ధరల ప్రభావం కూడా కారణమే. దీంతో కొంత మంది ఇన్వెస్టర్లను వెనక్కి తగ్గేలా చేసింది’’ అని అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి తెలిపారు. వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు హైదరాబాద్, పుణె, బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల అమ్మకాలు పెరగ్గా, చెన్నై, కోల్‌కతాలో తగ్గాయి. మార్చి త్రైమాసికంతో పోల్చిచూస్తే ఒక్క ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోనే అమ్మకాలు అధికంగా నమోదయ్యాయి.
పట్టణాల వారీగా..
» ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్లో జూన్ త్రైమాసికంలో 16,550 యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు ఒక శాతం పెరగ్గా, మార్చి త్రైమాసికం నుంచి ఆరు శాతం వృద్ధి చెందాయి.
» ఎంఎంఆర్‌లో 9 శాతం వృద్ధితో 41,540 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి.
» బెంగళూరులో 16,360 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగాయి. క్రితం ఏడాది జూన్ త్రైమాసికంతో పోల్చి చూస్తే 9 శాతం అధికంగా నమోదయ్యాయి.
» పుణె మార్కెట్లోనూ 2 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు 21,145 యూనిట్లుగా ఉన్నాయి.
» చెన్నైలో 5,020 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది జూన్ త్రైమాసికం గణాంకాలతో పోల్చి చూస్తే 9 శాతం తక్కువ.
» కోల్‌కతాలో 20 క్షీణతతో ఇళ్ల అమ్మకాలు 4,640 యూనిట్లకు పరిమితమయ్యాయి.
ఆల్‌టైమ్ గరిష్టానికి డిమాండ్
ఇళ్లకు డిమాండ్ అసాధారణ స్థాయిలో ఉన్నట్టు డీఎల్‌ఎఫ్ హోమ్స్ జాయింట్ ఎండీ, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆకాశ్ ఓహ్రి తెలిపారు. ముఖ్యంగా కరోనా తర్వాత గడిచిన రెండేళ్లలో డిమాండ్ ఆల్‌టైమ్ గరిష్టానికి చేరినట్టు చెప్పారు. ‘‘ఇంటి యాజమాన్యం విషయంలో ప్రజల ఆలోచనా ధోరణిలో వచ్చిన నిర్మాణాత్మక మార్పు ఇది. ఒక స్థలాన్ని కలిగి ఉండడం పట్ల విలువ ఇంతకముందెన్నడూ లేని స్థాయికి చేరింది. ఇల్లు వినియోగానికే కాకుండా, ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనంగా అవతరించింది. ముఖ్యంగా లగ్జరీ ఇళ్లపై రాబడులు పెట్టుబడుల డిమాండ్‌ను పెంచింది’’అని ఆకాశ్ ఓహ్రి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment