
దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గతేడాది(2024) ఆఫీసుల స్థలాల అద్దెలు 4–8% పెరిగినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ ఓ నివేదికలో తెలిపింది. కొత్త వ్యాపారాలు, కంపెనీల విస్తరణ కారణంగా కార్యాలయాల స్థలాలకు గణనీయమైన డిమాండ్ నెలకొందని పేర్కొంది. ‘భారత్‌లో అధిక జనాభా, భారీ కన్జూమర్ బేస్, వేగవంతమైన పట్టణీకరణతో పాటు టెక్నాలజీ, ఫైనాన్స్ రంగాల్లో తక్కువ ధరలకు నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి లభిస్తుంది. అందుకే అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఆఫీసు స్పేస్ కోసం భారత్ వైపు దృష్టి సారిస్తున్నాయి’ అని వెస్టియన్ సీఈవో శ్రీనివాస్ రావు తెలిపారు.
నెలవారీగా కార్యాలయ అద్దెల్లో న్యూఢిల్లీ 8.2 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. చెన్నై 7.7%, ముంబై 6.7% బెంగళూరు 4.7%, పూణే 4.5%, హైదరాబాద్ 4.4%, కోల్‌కత్తా 3.8 శాతం వృద్ధితో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
నగరాల వారీగా చూస్తే ముంబైలో చదరపు అడుగు నెలవారీ సగటు అద్దె 1.6 డాలర్లుగా ఉంది. బెంగళూరులో 1.1 డాలరు, పూణేలో 1 డాలరు, న్యూఢిల్లీలో 0.9 డాలరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో 0.8 డాలరు, పూణేలో 0.6 డాలరుగా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమంగా...
అంతర్జాతీయంగా ఎనిమిది పెద్ద ఓవర్సీస్ మార్కెట్లలో ఆఫీసు అద్దె వృద్ధి మిశ్రమంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. గతేడాది(2024) న్యూయార్క్‌లో సగటు ఆఫీసు అద్దె 1.3% క్షీణించింది. అక్కడ నెలకు చదరపు అడుగుకు అద్దె 7.5 డాలర్లుగా ఉంది. షాంఘైలో 6.8%, హాంగ్‌కాంగ్‌లో 6%, సియాటిల్‌లో 1.9% క్షీణత నమోదైంది. చదరపు అడుగు నెలవారీ సగటు అద్దెలు వరుసగా 2.8 డాలర్లు, 5.9 డాలర్లు, 4.7 డాలర్లుగా ఉన్నాయి.
ఇదీ చదవండి: ‘ఉన్నతాధికారులతో బేరసారాలు’.. వదలని పోలీసులు..
అయితే లండన్‌లో సగటు ఆఫీసు అద్దెలు 8.6% పెరిగాయి. అక్కడ నెలకు చదరపు అడుగు అద్దె 8.6 డాలర్లుగా ఉంది. మియామీలో 7.3% బోస్టన్‌లో 1.2%, సింగపూర్ 0.5 శాతం పెరిగాయి. చదరపు అడుగు నెలవారీ సగటు అద్దెలు వరుసగా 5.1 డాలర్లు, 5.5 డాలర్లు, 7 డాలర్లుగా ఉన్నాయి.