![Office Market High Demand in Hyderabad](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/office-space-high-demond.jpg.webp?itok=dwaQa3wH)
2030 నాటికి 200 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ
దేశ ఆఫీస్ మార్కెట్లో 15 శాతం వాటా
మెరుగైన వసతులు, నిపుణుల లభ్యత
సీబీఆర్‌ఈ, హైసియా సంయుక్త నివేదిక
హైదరాబాద్: ఆఫీస్ మార్కెట్‌కు ఆకర్షణీయ కేంద్రంగా హైదరాబాద్ అవతరిస్తోంది. 134 మిలియన్ చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) ఆఫీస్ స్పేస్‌తో దేశ ఆఫీస్ స్పేస్ (కార్యాలయ వసతులు) మార్కెట్‌లో హైదరాబాద్ 15 శాతం వాటా కలిగి ఉండగా, 2030 నాటికి 200 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీకి చేరుకుంటుందని సీబీఆర్‌ఈ దక్షిణాసియా, హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) సంయుక్త నివేదిక అంచనా వేసింది. అంతర్జాతీయ సంస్థల నుంచి ఆఫీస్ స్పేస్‌కు బలమైన డిమాండ్ నెలకొందని, 2014 నుంచి చూస్తే హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ పరిమాణం మూడొంతులు పెరిగినట్టు తెలిపింది.
అంతర్జాతీయ వ్యాపార, టెక్నాలజీ కేంద్రంగా హైదరాబాద్ అవతరించడం డిమాండ్‌కు అనుగుణంగా మారే స్వభావాన్ని తెలియజేస్తున్నట్టు సీబీఆర్‌ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగిజన్ పేర్కొన్నారు. విస్తృతమైన మౌలిక వసతులు, నైపుణ్య మానవ వనరుల లభ్యతతో భారత దేశ రియల్ ఎస్టేట్‌కు కీలక వృద్ధి కేంద్రంగా మారినట్టు తెలిపింది. టెక్నాలజీ, బీఎఫ్‌ఎస్‌ఐ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లకు (జీసీసీ) హైదరాబాద్ ముఖ్య ఎంపికగా ఉన్నట్టు వెల్లడించింది.
పర్యావరణ అనుకూల వసతులు..
గ్రీన్ సరి్టఫైడ్ (పర్యావరణ అనుకూల ధ్రువీకరణ పొందిన) ఆఫీస్ వసతుల పరంగా హైదరాబాద్ మార్కెట్ దేశంలో 18 శాతం వాటా కలిగి ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది.
డెవలపర్లు గ్రీన్ స్పేసెస్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని, పర్యావరణ అనుకూల చర్యలు తీసుకుంటున్నారని వివరించింది. ఇందుకు సానుకూల ప్రభుత్వ విధానాలు ప్రోత్సాహమిస్తున్నట్టు పేర్కొంది. హైదరాబాద్ ఆఫీస్ లీజింగ్‌లో టెక్నాలజీ రంగం 31 శాతం వాటాతో అగ్రగామిగా ఉన్నట్టు తెలిపింది.
జీసీసీలకు బెంగళూరు తర్వాత హైదరాబాద్ రెండో అతిపెద్ద కేంద్రంగా (లీజు పరంగా) ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. టెక్నాలజీ, ఫార్మా, బయో టెక్నాలజీ, ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఇలా వివిధ రంగాల్లో జీసీసీలను హైదరాబాద్ ఆకర్షిస్తున్నట్టు పేర్కొంది. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలైటిక్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీల వినియోగం పెరిగే కొద్దీ హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ వృద్ధి మరింత వేగాన్ని అందుకుంటుందని అంచనా వేసింది.
లీజింగ్‌లోనూ టాప్
ఆఫీస్ స్పేస్ మార్కెట్‌లో ఈ ఏడాది హైరాబాద్, ఢిల్లీ ఎన్‌సీఆర్ అత్యధిక వృద్ధిని చూస్తాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘కొలియర్స్ ఇండియా’ సంస్థ అంచనా వేసింది. ఈ రెండు చోట్లా 10–15 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ చొప్పున గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ లీజింగ్ కార్యకలాపాలు నమోదు కావచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా ఆరు ప్రముఖ నగరాల్లో ఈ ఏడాది ఆఫీస్ స్పేస్ లీజింగ్ బలంగా ఉంటుందని.. 65–70 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ మేర లీజింగ్ నమోదు కావొచ్చని అంచనా వేసింది.
2025 సంవత్సరంలో ఈ ఆరు నగరాల్లో ఆఫీస్ స్పేస్ మార్కెట్ ఎలా ఉండొచ్చన్న అంచనాలతో నివేదికను ఫిక్కీ 18వ రియల్ ఎస్టెట్ సదస్సు సందర్భంగా విడుదల చేసింది. ఈ ఆరు నగరాల్లో 2024లో స్థూల ఆఫీస్ లీజింగ్ 66.4 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండగా.. ఈ ఏడాది 65–70 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంటుందని అంచనా వేసింది. జీసీసీల విస్తరణ, ఆశావహ వ్యాపార వాతావరణంతో లీజింగ్ పరి మాణం పెరగొచ్చని తెలిపింది.
బెంగళూరులో అధిక డిమాండ్
ఈ ఏడాది స్థూల ఆఫీస్ స్పేస్ డిమాండ్‌లో మూడింట ఒక వంతు బెంగళూరు నుంచే ఉంటుందని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సర్వీసెస్ ఎండీ అరి్పత్ మెహరోత్రా తెలిపారు. జీసీసీలు, ఇంజనీరింగ్, తయారీ సంస్థలు, ఫ్లెక్స్ ఆఫీస్ స్పేస్ ఆపరేటర్ల నుంచి డిమాండ్ ఉంటుందన్నారు. ముంబై, చెన్నై పుణెలలో 5–10 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ చొప్పున డిమాండ్ ఉండొచ్చని చెప్పారు. టాప్ మెట్రో నగరాల్లో జీసీసీలు అతిపెద్ద ఆఫీస్ స్పేస్ వినియోగదారులుగా ఉన్నట్టు అనరాక్ గ్రూప్ కమర్షియల్ లీజింగ్ ఎండీ పీయూష్ జైన్ సైతం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment