
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్యాలయాల కోసం లీజుకు తీసుకున్న స్థలం జనవరి–మార్చిలో 25 శాతం పెరిగి 1.08 కోట్ల చదరపు అడుగులు నమోదైంది. 2021 జనవరి–మార్చితో పోలిస్తే దేశవ్యాప్తంగా ఎనమిది ప్రధాన నగరాల్లో ఆఫీసుల కోసం నూతనంగా తోడైన స్థలం 13 శాతం వృద్ధి చెంది 1.19 కోట్ల చదరపు అడుగులుగా ఉంది.
నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం.. 2022 మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో హైదరాబాద్‌లో ఆఫీస్ లీజింగ్ 72 శాతం అధికమై 16 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది.
చెన్నైలో రెండింతలకుపైగా పెరిగి 10 లక్షల చదరపు అడుగులు, బెంగళూరు 5 శాతం దూసుకెళ్లి 35 లక్షలు, ఢిల్లీ–ఎన్‌సీఆర్ 37 శాతం అధికమై 23 లక్షలు, పుణే 15 శాతం వృద్ధి చెంది 9 లక్షలు, అహ్మదాబాద్ 2 లక్షల నుంచి 5 లక్షల చదరపు అడుగులకు ఎగసింది. ముంబై 24 శాతం తిరోగమనం చెంది 9 లక్షల చదరపు అడుగులుగా ఉంది. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడంతో కొన్ని త్రైమాసికాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ కోవిడ్ ముందస్తు స్థాయికి చేరుకుంటుంది.