హైదరాబాద్ (Hyderabad) రియల్ ఎస్టేట్ (real estate) ఆల్ టైం హై స్థాయికి చేరుకుంది. గతేడాది నగరంలో రికార్డు స్థాయిలో గృహ విక్రయాలు, ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, వడ్డీ రేట్ల పెంపు, హైడ్రా దూకుడు ఇవేవీ భాగ్యనగరంలో స్థిరాస్తి రంగాన్ని కదిలించలేకపోయాయి. కొత్త ప్రభుత్వ విధానాలతో కొద్ది కాలం అస్థిరత ఏర్పడినా.. మార్కెట్ తిరిగి శరవేగంగా పుంజుకుంది. దీంతో హైదరాబాద్ రియల్టీలో పూర్వ వైభవం సంతరించుకుంది. నగరంలో గతేడాది 32,974 యూనిట్లు విక్రయించగా.. 1.56 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది.
– సాక్షి, సిటీబ్యూరో
ఆర్థికవృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాలు, కొనుగోలుదారుల అభిరుచిలో మార్పుల కారణంగా హైదరాబాద్‌లో గృహ విక్రయాలు పెరిగాయి. గతేడాది నగరంలో 12 శాతం వృద్ధి రేటుతో 36,974 ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. ప్రస్తుతం సిటీలో అపార్ట్‌మెంట్ల సగటు ధర చ.అ.కు రూ.5,974. ఏడాదిలో అపార్ట్‌మెంట్ల ధరలు 8 శాతం మేర పెరిగాయి. గతేడాది సిటీలో 44,013 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 6 శాతం తగ్గాయి. హైడ్రా దూకుడు వ్యవహారంతో కొత్త గృహాల ప్రారంభానికి డెవలపర్లు ఆచితూచి వ్యవహరించడంతో లాంచింగ్స్‌లో క్షీణత నమోదయ్యింది.
పశ్చిమ హైదరాబాదే..
హైటెక్ సిటీ, కోకాపేట, రాయదుర్గం, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాదే కస్టమర్ల చాయిస్‌గా ఉంది. ఎల్బీనగర్, కొంపల్లి ప్రాంతాల్లో ధరల పెరుగుదల అధికంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో వరుసగా 11, 10 శాతం మేర రేట్లు పెరిగాయి. ఆ తర్వాత బంజారాహిల్స్‌లో 8 శాతం, కోకాపేటలో 8 శాతం, మణికొండలో 6, నాచారం, సైనిక్‌పురిలో 5 శాతం మేర ధరలు పెరిగాయి. ప్రస్తుతం నగరంలో అత్యధికంగా చ.అ.ధరలు బంజారాహిల్స్‌లో రూ.14,400–16,020 మధ్య ఉండగా.. జూబ్లీహిల్స్‌లో 13,400–14,034, కోకాపేటలో 10,045–12,500, మణికొండలో రూ.8,500–9,220 మధ్య ధరలు ఉన్నాయి.
ఆఫీస్ అ‘ధర’హో..
2024లో హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ లావాదేవీలు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. గతేడాది కొత్తగా 1.03 కోట్ల చ.అ.ఆఫీస్ స్పేస్ పూర్తి కాగా.. 1.56 కోట్ల చ.అ. స్పేస్ లావాదేవీలు జరిగాయి. కార్యాలయాల స్థలం లీజు, కొనుగోళ్లలో గ్లోబల్ కెపబులిటీ సెంటర్స్(జీసీసీ) ఆధిపత్యాన్ని కొనసాగించాయి. గతేడాది జరిగిన ఆఫీసు స్పేస్ లావాదేవీల్లో జీసీసీ వాటా 49 శాతంగా ఉంది. 51 లక్షల చ.అ.ఆఫీస్ స్పేస్‌ను బహుళ జాతి కంపెనీలు జీసీసీ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. దేశీయ వ్యాపార సంస్థలు 24 లక్షల చ.అ.లు, ఫ్లెక్సీబుల్ ఆఫీసు స్పేస్ 18 లక్షల చ.అ.లు, 12 లక్షల చ.అడుగుల స్థలంలో థర్డ్ పార్టీ ఐటీ సంస్థల లావాదేవీలు ఉన్నాయి. నగరంలో ఆఫీస్ స్పేస్ ధర చ.అ.కు సగటున రూ.70గా ఉంది. ఏడాది కాలంలో ధరలు 7 శాతం మేర పెరిగాయి.
దేశవ్యాప్తంగా ఇలా..
గతేడాది దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 3,72,936 యూనిట్లు లాచింగ్ కాగా.. 3,50,612 ఇళ్లు అమ్ముడుపోయాయి. అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే లాంచింగ్స్‌లో 6 శాతం, విక్రయాల్లో 7 శాతం వృద్ధి నమోదైంది. దేశంలో ఇంకా 4,95,839 యూనిట్ల ఇన్వెంటరీ ఉంది. వీటి విక్రయానికి 5.8 నెలల సమయం పడుతుంది. ఇక, గతేడాది 7.19 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరగ్గా.. 5.03 కోట్ల చ.అ. స్థలం కొత్తగా మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 8 నగరాల్లో మొత్తం 97.3 కోట్ల చ.అ.ఆఫీస్ స్పేస్ స్టాక్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment