జూన్ క్వార్టర్‌లో 48 శాతం అధికంగా లీజింగ్
3.4 మిలియన్ చదరపు అడుగులుగా నమోదు
ప్రముఖ పట్టణాల్లో 23 శాతం అధిక డిమాండ్
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో కార్యాలయ స్థలాలకు డిమాండ్ బలంగా ఉన్నట్టు వర్క్‌ప్లేస్ సొల్యూషన్స్ సంస్థ వెస్టియన్ వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు ఆఫీస్ స్పేస్ లీజింగ్ 48 శాతం వృద్ధితో 3.4 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 2.30 మిలియన్ చదరపు అడుగుల మేర (ఎస్‌ఎఫ్‌టీ) లీజింగ్ చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో జూన్ త్రైమాసికంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 23 శాతం పెరిగి 17.04 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది.
పట్టణాల వారీగా..
→ బెంగళూరులో కార్యాలయ స్థలాల లీజింగ్ 15 శాతం వృద్ధితో 4.25 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలానికి ఇది 3.70 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. ఐటీ – ఐటీఈఎస్, ఏఐ అండ్ రోబోటిక్స్ కంపెనీలే మొత్తం లీజింగ్‌లో 69 శాతం మేర వాటా కలిగి ఉన్నాయి.
→ ముంబైలో బలమైన వృద్ధి నమోదైంది. 88 శాతం పెరిగి 3.39 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది.
→ పుణెలో 60 శాతం వృద్ధితో 2.88 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది.
→ చెన్నైలో మాత్రం క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోలి్చనప్పుడు 20 శాతం తగ్గి 1.75 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది.
→ ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్లో 1.4 మిలియన్ చదరపు అడుగుల తాజా లీజింగ్ నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 43 శాతం తగ్గింది.
→ కోల్‌కతా మార్కెట్లో రెట్టింపు పరిమాణంలో 0.23 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ లీజింగ్ నమోదైంది.
ఇక ముందూ బలమైన వృద్ధి..
‘‘అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ.. భారత ఆఫీస్ స్పేస్ మార్కెట్ క్యూ2(జూన్ క్వార్టర్)లో బలమైన లావాదేవీలుగా వేదికగా నిలిచింది. ఐటీ–ఐటీఈఎస్, బీఎఫ్‌ఎస్‌ఐ రంగాల నుంచి బలమైన డిమాండ్ నేపథ్యంలో లీజింగ్ మార్కెట్ ఇక మీదటా వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నాం.
ఫ్లెక్స్ స్పేస్ ఈ వృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది’’అని వెస్టియన్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలోనూ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 18 శాతం వృద్ధితో 30 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు వెస్టియన్ నివేదిక వెల్లడించింది. గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ ఏడు పట్టణాల్లో బలంగా ఉందని.. ఈ ఏడాది మొత్తం మీద 60 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ అధిగమించొచ్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment