డిమాండ్‌కు మించి తాజా సరఫరా తోడవుతున్నందున 2026 మార్చి నాటికి హైదరాబాద్‌లోని మొత్తం కార్యాలయ స్థలంలో 24.5 శాతం ఖాళీగా ఉండవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. వేకెన్సీ స్థాయి 2023 మార్చిలో 14.1 శాతం, 2025 సెప్టెంబర్‌లో 19.3 శాతంగా ఉందని తెలిపింది.
‘హైదరాబాద్ మార్కెట్‌లో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీ 2026 మార్చి నాటికి 75.5–76 శాతానికి చేరవచ్చు. 2023 మార్చి నాటికి ఇది 86 శాతం నమోదైంది. నికర ఆక్యుపెన్సీతో పోలిస్తే సరఫరా ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌లో 2016–17 నుంచి 2023–24 మధ్య ఆఫీస్ స్పేస్ సరఫరా వార్షిక వృద్ధి రేటు ఏటా 14 శాతం దూసుకెళ్లింది. టాప్–6 ఆఫీస్ మార్కెట్లలో ఇది సుమారు 7 శాతం నమోదైంది. ఈ ఆరు మార్కెట్లలో 2024 మార్చి 31 నాటికి అందుబాటులో ఉన్న మొత్తం కార్యాలయ సరఫరాలో హైదరాబాద్ వాటా 15 శాతం. 2026 మార్చి నాటికి ఇది 17 శాతానికి చేరవచ్చు’ అని నివేదిక వివరించింది.
ఇదీ చదవండి: బేర్.. ఎటాక్! మార్కెట్ నేల చూపులు ఎందుకంటే..
అంచనాలు లేకుండా..
అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ) నియమాన్ని కలిగి ఉన్న ఏకైక ప్రముఖ భారతీయ నగరం హైదరాబాద్ అని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్, కో–గ్రూప్ హెడ్ అనుపమ రెడ్డి తెలిపారు. ‘ఈ నిబంధనలను సద్వినియోగం చేసుకుని కొంతమంది డెవలపర్లు సమీప కాలంలో లీజింగ్‌పై సరైన అంచనాలు లేకుండా భారీగా ఊహించుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. ఫలితంగా డిమాండ్–సరఫరా మధ్య భారీగా అసమతుల్యత ఏర్పడింది’ అని అన్నారు. ‘2023–24 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో 1.9 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ తోడైంది. ఇది హైదరాబాద్ చరిత్రలో అత్యధికం. అలాగే ఇతర టాప్ నగరాలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువ. ఈ అధిక సరఫరా ధోరణి 2024–25, 2025–26 వరకు కొనసాగుతుంది. ఏటా 1.7–2 కోట్ల చదరపు అడుగుల కొత్త సరఫరా తోడు కానుంది.
Comments
Please login to add a commentAdd a comment