icra ratings
-
దుస్తుల ఎగుమతుల్లో 9–11 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతీయ దుస్తుల ఎగుమతిదారులు 9–11 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేస్తారని ఇక్రా రేటింగ్స్ అంచనా వేస్తోంది. ప్రధాన మార్కెట్లలో నిల్వలు తగ్గిపోవడం, వివిధ దేశాలు భారత్ నుంచి కొనుగోళ్లను పెంచడం ఇందుకు కారణమని తెలిపింది. ‘భారతీయ దుస్తుల ఎగుమతులకు దీర్ఘకాలిక అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి. రిటైల్ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకు అంగీకారం, అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల పోకడలు, ఉత్పత్తి–సంబంధిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం, ఎగుమతి ప్రోత్సాహకాలు, యూకే, ఈయూతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం ఇందుకు కారణం. అధిక రిటైల్ ఇన్వెంటరీ, కీలక మార్కెట్ల నుండి మందగించిన డిమాండ్, ఎర్ర సముద్ర సంక్షోభం, పొరుగు దేశాల నుండి పెరిగిన పోటీతో సహా సరఫరా సమస్యల కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 2 శాతం క్షీణించాయి. మూలధన వ్యయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, 2025–26లో టర్నోవర్‌లో 5–8 శాతం మధ్య ఉండే అవకాశం ఉంది. స్థూల ఆర్థిక వాతావరణం ఒత్తిడి, భౌగోళిక రాజకీయ సమస్యల మధ్య కొన్ని కీలక మార్కెట్లలో డిమాండ్ అనిశ్చితి చుట్టూ సవాళ్లు కొనసాగుతున్నాయి. అధికం అవుతున్న కార్మిక వ్యయాలు, సరుకు రవాణా ఖర్చులు, ఇతర నిర్వహణ ఖర్చుల పెరుగుదలతో పరిశ్రమ యొక్క నిర్వహణ మార్జిన్లు 2024–25లో 30–50 బేసిస్ పాయింట్లు తగ్గుతాయని అంచనా. బంగ్లాదేశ్‌లో ఇటీవలి భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్‌సహా పలు దేశాల్లో సామర్థ్యం జోడించే అవకాశం ఉంది. పీఎల్ఐ పథకం కింద తాజా సామర్థ్య జోడింపుల నుండి పొందే ప్రయోజనాలతో పాటు, పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్, అపారల్ స్కీమ్ ద్వారా మానవ నిర్మిత ఫైబర్ ఉత్పత్తిలో దేశ ఉనికిని బలోపేతం చేయడంతో.. ప్రపంచ దుస్తుల వ్యాపారంలో భారత్ దూసుకెళ్తుందని పరిశ్రమ భావిస్తోంది’ అని నివేదిక వివరించింది. -
దేశీ విమాన ప్రయాణికుల్లో వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా మే నెలలో 1.39 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2023 మే నెలతో పోలిస్తే ఇది 5.1 శాతం అధికం. కోవిడ్ ముందస్తు కాలంతో పోలిస్తే 14 శాతం ఎక్కువ అని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదిక వెల్లడించింది. ఏప్రిల్‌లో 1.32 కోట్ల మంది రాకపోకలు సాగించారు. 2024–25లో ట్రెండ్ కొనసాగుతుందని ఇక్రా భావిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల ట్రాఫిక్‌లో సానుకూల ధోరణి కొనసాగుతుందని పేర్కొంది. నివేదిక ప్రకారం.. గత నెలలో వియానయాన సంస్థల సామర్థ్యం 2023 మే నెలతో పోలిస్తే 6 శాతం, 2024 ఏప్రిల్‌తో పోలిస్తే 2 శాతం పెరిగింది. భారత్ నుంచి 2023–24లో 24 శాతం అధికంగా 2.97 కోట్ల మంది విదేశీయానం చేశారు. పరిశ్రమ కోవిడ్‌కు ముందు స్థాయిల కంటే అధిక రాబడి అందుకుంది. -
విమాన ప్రయాణికుల సంఖ్యలో వృద్ధి
ముంబై: దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోవిడ్‌కు ముందున్న 141.2 మిలియన్ స్థాయిలను అధిగమిస్తుందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా బుధవారం తెలిపింది. 8–13 శాతం వృద్ధితో ప్రయాణికుల సంఖ్య 2023–24లో 150–155 మిలియన్లకు చేరుకుంటుందని వెల్లడించింది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల రద్దీ, సాపేక్షంగా స్థిర వ్యయ వాతావరణంలో కొనసాగుతున్న పునరుద్ధరణ మధ్య భారతీయ విమానయాన పరిశ్రమపై స్థిర దృక్పథాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపింది. ఇక్రా నివేదిక ప్రకారం.. రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాలలో పరిశ్రమ నికర నష్టంలో గణనీయ తగ్గింపు నమోదు చేయనుంది. సరఫరా సంబంధ సవాళ్లు, ఇంజిన్ వైఫల్య సమస్యలతో సమీప కాలానికి ఎదురుగాలి ఉండవచ్చు. ట్రాఫిక్ వృద్ధిలో ఊపు 2024–25లో కూడా కొనసాగుతుంది. యాత్రలు, వ్యాపార ప్రయాణాలకు డిమాండ్ పెరగడం, విమానాశ్రయ మౌలిక సదుపాయాలు మెరుగుపడడం వంటివి ఈ జోరుకు సహాయపడతాయి. గణనీంగా తగ్గనున్న నష్టాలు.. భారతీయ విమానయాన సంస్థల ద్వారా 2022–23లో నమోదైన విదేశీ ప్రయాణికుల రద్దీ కోవిడ్ ముందస్తు స్థాయిలను అధిగమించింది. 2018–19లో ఇది 25.9 మిలియన్ల గరిష్ట స్థాయిలను తాకింది. 7–12 శాతం వృద్దితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25–27 మిలియన్లు, 2024–25లో 27–29 మిలియన్లకు చేరవచ్చు. పరిశ్రమ మెరుగైన ధరల పెరుగుదలను చూడడంతో ఆదాయాల్లో వృద్ధి నమోదైంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలలో క్షీణత, సాపేక్షంగా స్థిరంగా ఉన్న విదేశీ మారకపు రేట్ల కారణంగా రాబోయే రోజుల్లోనూ ఇది అనుకూలంగా ఉంటుంది. పరిశ్రమ నష్టాలు 2022–23 స్థాయి రూ.17,000–17,500 కోట్ల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,000–4,000 కోట్లకు చేరవచ్చు. ఏటీఎఫ్ ధరలు, భారతీయ రూపాయి–యూఎస్ డాలర్ కదలికలు ఎయిర్‌లైన్స్ వ్యయ నిర్మాణంపై ప్రధాన ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. ఏటీఎఫ్ ధర 2022–23తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఫిబ్రవరి కాలంలో 15 శాతం క్షీణించింది. -
ICRA: ఆటో విడిభాగాల సంస్థల ఆదాయానికి బ్రేకులు
న్యూఢిల్లీ: దేశీయంగా అమ్మకాల పరిమాణం, ఎగుమతులు తగ్గే అవకాశాలు ఉండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) దిగ్గజ ఆటో విడిభాగాల తయారీ సంస్థల వార్షిక ఆదాయ వృద్ధి మందగించనుంది. 5–7 శాతానికి పరిమితం అయ్యే అవకాశం ఉంది. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఈ మేరకు అంచనాలతో నివేదికను రూపొందించింది. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 2.7 లక్షల కోట్ల వార్షిక ఆదాయాలు ఉన్న 45 ఆటో విడిభాగాల సంస్థలను ఈ అధ్యయనం కోసం పరిగణనలోకి తీసుకుంది. అధిక బేస్, ఎగుమతుల్లో ఒక మోస్తరు వృద్ధే ఉన్నప్పటికీ దేశీయంగా డిమాండ్ ఆరోగ్యకరమైన స్థాయిలో ఉన్నందున వీటి ఆదాయాలు ఈ ఆర్థిక సంవత్సరం 9–11 శాతం ఉండవచ్చని అంచనా వేసింది. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరం మాత్రం దేశీయంగా అమ్మకాల పరిమాణం మందగించవచ్చని, ఎగుమతుల పరిస్థితి కూడా బలహీనంగానే ఉండవచ్చని ఇక్రా పేర్కొంది. ఈ నేపథ్యంలో కంపెనీల ఆదాయ వృద్ధి కూడా మందగించే అవకాశం ఉందని తెలిపింది. నివేదికలోని మరిన్ని వివరాలు.. ► సామర్ధ్యాలను పెంచుకునేందుకు, టెక్నాలజీని మెరుగుపర్చుకునేందుకు కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా ఇన్వెస్ట్ చేశాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే ధోరణి కొనసాగనుంది. 2024–25లో పరిశ్రమ పెట్టుబడి వ్యయాలు కనీసం రూ. 20,000–25,000 కోట్ల మేర ఉండవచ్చని అంచనా. ► కొత్త ఉత్పాదనల తయారీ, అధునాతన టెక్నాలజీ అభివృద్ధి మొదలైన అంశాలపై అదనంగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాలు, సామర్ధ్యాల పెంపు, నియంత్రణ సంస్థపరంగా రాబోయే కొత్త మార్పుల అమలు మొదలైన వాటి కోసం మరింతగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ► అంతర్జాతీయ దిగ్గజ తయారీ సంస్థలు (ఓఈఎం) కొత్త తరహా వాహనాల కోసం సరఫరాదారులను విస్తృతంగా ఎంపిక చేసుకుంటూ ఉండటం, విదేశాల్లో ఆఫ్టర్ మార్కెట్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతూ ఉండటం వంటివి భారతీయ ఆటో విడిభాగాల సరఫరా సంస్థలకు సానుకూలం కాగలదు. ► మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా చూస్తే ఎలక్ట్రిక్ వాహనాలు .. ప్రీమియం వాహనాలు .. స్థానికంగా తయారీకి ప్రాధాన్యం పెరుగుతుండటం, విధానాలపరమైన మార్పులు మొదలైన అంశాలు ఆటో విడిభాగాల సరఫరా సంస్థల స్థిర వృద్ధికి తోడ్పడే అవకాశం ఉంది. రెండంకెల స్థాయిలో టూ–వీలర్ల ఆదాయ వృద్ధి ప్రీమియం మోడల్స్‌కు మరింత డిమాండ్– వచ్చే ఆర్థిక సంవత్సరంపై హీరోమోటో సీఈవో గుప్తా అంచనా వచ్చే ఆరి్థక సంవత్సరం దేశీ ద్విచక్ర వాహనాల పరిశ్రమ ఆదాయాలు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నట్లు హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. ప్రీమియం మోడల్స్‌కు డిమాండ్ మరింతగా పెరగనుండటం ఇందుకు దోహదపడగలదని చెప్పారు. టూ–వీలర్ల విషయంలో కొనుగోలుదారులు ఎక్కువ ఫీచర్లు ఉండే మోడల్స్ వైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. గత కొన్నాళ్లుగా అమ్మకాలు ఒక మోస్తరుగానే ఉంటున్న ఎంట్రీ స్థాయి బైకుల విభాగం కూడా కోలుకుంటోందని తెలిపారు. అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ డిమాండ్ గణనీయంగా మెరుగుపడిందని గుప్తా వివరించారు. ప్రీమియం సెగ్మెంట్ మోడల్స్ విక్రయం కోసం తమ అవుట్‌లెట్స్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటివరకు 300 డీలర్íÙప్‌లను అప్‌గ్రేడ్ చేసినట్లు గుప్తా పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి వీటి సంఖ్యను 400కు, వచ్చే ఏడాది 100 ప్రీమియా స్టోర్స్‌తో పాటు 500కు పెంచుకుంటామన్నారు. హీరో మోటోకార్ప్ గతేడాది అక్టోబర్‌లో ప్రీమియా బ్రాండ్ పేరుతో తొలి ప్రీమియం–ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌ను ప్రారంభించింది. ప్రీమియం సెగ్మెంట్లో కొత్తగా ప్రవేశపెట్టిన మావ్రిక్ 440 డెలివరీలు ఏప్రిల్ నుంచి ప్రారంభం కాగలవని గుప్తా పేర్కొన్నారు. -
చిన్న రుణాలకు మళ్లీ గిరాకీ.. బ్యాంకులను అధిగమించి, 40 శాతం వాటాతో
ముంబై: సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐలు) లాభదాయకత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.7–3 శాతానికి మెరుగుపడుతుందని ఇక్రా రేటింగ్స్ పేర్కొంది. మెరుగైన వసూళ్లు, తక్కువ రుణ వ్యయాలు, కొత్త రుణాలపై అధిక రేట్లు ఇవన్నీ లాభదాయకత పెరగడానికి అనుకూలతలుగా తెలిపింది. ఎంఎఫ్ఐలు కరోనా మహమ్మారి రాకతో కుదేలు కాగా, ఆ తర్వాత వేగంగా కోలుకుని సూక్ష్మ రుణాల్లో బ్యాంకులను అధిగమించి, 40 శాతం వాటాతో మొదటి స్థానానికి చేరుకోవడం గమనార్హం. 2021–22 నాటికి ఉన్న 34 శాతంతో పోలిస్తే 6 శాతం మార్కెట్ వాటాను గత ఆర్థిక సంవత్సరంలో పెంచుకున్నాయి. సూక్ష్మ రుణాల్లో బ్యాంకుల వాటా 40 శాతం నుంచి 34 శాతానికి తగ్గింది. ఈ మేరకు ఒక నివేదికను ఇక్రా విడుదల చేసింది. రుణాల్లో మెరుగైన వృద్ధి ఎంఎఫ్ఐలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాల పరంగా 24–26 శాతం వృద్ధిని నమోదు చేస్తాయని ఇక్రా రేటింగ్స్ నివేదిక అంచనా వేసింది. అంతేకాదు వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25)నూ 23–25 శాతం మేర రుణ వితరణలో వృద్ధిని సాధిస్తాయని తెలిపింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎంఎఫ్‌ఐల లాభదాయకత 3.2–3.5 శాతానికి పెరుగుతుందని అంచనా వ్యక్తీకరించింది. 2022–23 చివరికి నాటికి ఎంఎఫ్‌ఐల లాభదాయకత 2.1 శాతంగా ఉంది. ‘‘ఇక మీదట మంజూరు చేసే రుణాలు అధిక ధరపై ఉండడం, రుణ రేట్ల పరంగా ఆర్బీఐ వెసులుబాటు కల్పించడం నికర వడ్డీ మార్జిన్లను పెంచుతుంది. దీంతో ఎంఎఫ్‌ఐల లాభదాయకత పెరుగుతుంది’’ అని ఇక్రా తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన వ్యయాల్లో అధిక భాగాన్ని గత ఆర్థిక సంవత్సరంలో ఇవి సర్దుబాటు చేసుకున్నట్టు వివరించింది. అలాగే, కరోనా మహమ్మారి ముందు నాటి స్థాయికి రుణ వసూళ్లు మెరుగుపడినట్టు వెల్లడించింది. ఆస్తుల్లోనూ బలమైన వృద్ధి.. ఎంఎఫ్ఐలు గత ఆర్థిక సంవత్సరంలో తమ నిర్వహణ ఆస్తులను (రుణాల పోర్ట్‌ఫోలియో) 38 శాతం పెంచుకున్నాయి. బ్యాంకులతో పోలిస్తే ఎంఎఫ్ఐలు తమ ఆస్తులను అధికంగా విస్తరించుకున్నట్టు ఇక్రా రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ సచిన్ సచ్దేవ తెలిపారు. ఒక రుణగ్రహీతకు సంబంధించి సగటు ఖాతాలు కూడా పెరిగాయి. దీన్ని బట్టి చూస్తుంటే ఒకే రుణ గ్రహీత వెంట ఒకటికి మించిన సంస్థలు వెంటబడుతున్నట్టు తెలుస్తోందని ఇక్రా పేర్కొంది. ఇది రుణ గ్రహీతల రుణ భారాన్ని కూడా పెంచుతున్నట్టు తెలిపింది. కరోనా మహమ్మారి ప్రభావం సమసిపోవడంతో, రుణ బకాయిలు పేరుకుపోవడం తగ్గుతున్నట్టు వివరించింది. 90 రోజులకు పైగా చెల్లింపులు చేయని రుణ ఖాతాలు 2021–22 మొదటి ఆరు నెలల్లో 6.2 శాతానికి పెరగ్గా, 2023 మార్చి నాటికి 2.5 శాతానికి తగ్టినట్టు పేర్కొంది. 2023–24లో వసూలు కాని రుణాలు మరో 0.4–06 శాతం క్షీణించొచ్చని అంచనా వేసింది. ఎంఎఫ్‌ఐల లిక్విడిటీ పరిస్థితులు కూడా మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. -
ఆశావహ బాటనే ఎకానమీ... అంచనాలన్నీ అనుకూలమే..
అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతిలోనూ భారత్ ఎకానమీ పురోగతి బాటనే నడుస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదని విశ్లేషణా సంస్థలు పేర్కొంటున్నాయి. వృద్ధి, ద్రవ్యోల్బణం, ఎగుమతులు తక్షణం ఎకానమీ పురోగతికి అనుగుణంగా ఉంటాయన్నది వాటి అభిప్రాయం. స్థూల ఆర్థిక రంగానికి సంబంధించి కొన్ని విశ్లేషణలను పరిశీలిస్తే... న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ కాలంలో 8.5 శాతానికి చేరుకుంటుందని ఇక్రా రేటింగ్స్ మంగళవారం ఒక నివేదికలో పేర్కొంది. గత జనవరి–మార్చి త్రైమాసికంలో నమోదైన 6.1 శాతం వృద్ధిరేటు నుంచి గణనీయంగా కోలుకుంటుందని వివరించింది. వేగవంతమైన వృద్ధికి విస్తృత స్థాయిలో డిమాండ్, సేవల రంగంలో రికవరీ కారణమని పేర్కొంది. మొదటి త్రైమాసికంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)అంచనాలు 8.1 శాతం మించి ఇక్రా అంచనాలు ఉండడం గమనార్హం. సేవల డిమాండ్‌లో నిరంతర పురోగతి, మెరుగైన పెట్టుబడి కార్యకలాపాలు, ముఖ్యంగా ప్రభుత్వ మూలధన వ్యయంలో పెరుగుదల, కొన్ని రంగాలలో మార్జిన్లు పెరగడం, వివిధ వస్తువుల ధరలు అదుపులోనికి రావడం వంటి అంశాలు జూన్ జూన్ త్రైమాసికానికి సంబంధించి తమ వృద్ధి అంచనాను పెంచాయని ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితీ నాయర్ తెలిపారు. కేంద్రం, 23 రాష్ట్ర ప్రభుత్వాల (అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, గోవా, మణిపూర్, మేఘాలయ మినహా) మొత్తం మూలధన వ్యయం మొదటి త్రైమాసిక వ్యయం 76 శాతం పెరిగి రూ.1.2 లక్షల కోట్లకు, నికర రుణాలు 59.1 శాతం పెరిగి రూ.2.8 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆమె వెల్లడించారు. ఆధునికీకరణ, కొత్త ప్రాజెక్టులు, మూలధన వస్తువుల దిగుమతుల ప్రయోజనం కోసం మూల ధన సంబంధిత అంతర్జాతీయ వాణిజ్య రుణాలు క్యూ1లో 13.0 బిలియన్ డాలర్లని పేర్కొన్న నివేదిక, 2022–23 పూర్తి ఆర్థిక సంవత్సరంలో పోల్చితే (9.6 బిలియన్ డాలర్లు) అధికమని పేర్కొంది. కాగా, ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఇంకా కొంత అనిశ్చితి నెలకొన్నట్లు పేర్కొంది. 6 శాతం వృద్ధి మాత్రమే నమోదుకావచ్చని అంచనావేసింది. ద్రవ్యోల్బణం ఒత్తిడి తాత్కాలికమే ఆర్థికశాఖ నివేదిక టమోటా ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆహార పదార్థాలపై ధరల ఒత్తిడి తాత్కాలికంగానే ఉంటుందని మంగళవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే పెరిగిన ద్రవ్యోల్బణ ఒత్తిడిని ఎదుర్కోవటానికి ప్రభుత్వం, ఆర్బీఐ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం మూలధన వ్యయం కోసం పెంచిన కేటాయింపులు ఇప్పుడు ప్రైవేట్ పెట్టుబడుల పెరుగుదలకూ దారితీస్తున్నాయని పేర్కొన్న ఆర్థిక మంత్రిత్వశాఖ.. దేశీయ వినియోగం, పెట్టుబడి డిమాండ్ వృద్ధిని ముందుకు తీసుకువెళతాయని తన జూలై నెలవారీ ఎకనామిక్ రివ్యూలో పేర్కొంది. జూలైలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దాటి 15 నెలల గరిష్ట స్థాయిలో 7.44 శాతానికి పెరిగిన నేపథ్యంలో ఆర్థికశాఖ ఎకానమీకి సంబంధించి తాజా భరోసాను ఇచి్చంది. ద్రవ్యోల్బణం తగ్గుదలకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోందని, కొత్త స్టాక్ కూడా మార్కెట్లోకి వస్తోందని ఆర్థికశాఖ తెలిపింది. ఇవన్నీ ద్రవ్యోల్బణం కట్టడికి దారితీస్తాయని విశ్లేíÙంచింది. తగిన రుతుపవనాలు, ఖరీఫ్ సాగు గణనీయమైన పురోగతితో వ్యవసాయ రంగం ఊపందుకుంటోందని అంచనావేసింది. గోధుమలు, బియ్యం సమీకరణ బాగుందని తెలిపింది. దేశంలో ఆహార భద్రతను పెంచడానికి ఆహార ధాన్యాల బఫర్ స్టాక్ స్థాయిలను కేంద్రం పెంచుతుందని తెలిపింది. ప్రైవేట్ రంగం పెట్టుబడులను పెంచేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోందని పేర్కొంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) 14 కీలక రంగాలకు ప్రోత్సాహకాలను అందిస్తోందన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. పీఎం గతి శక్తి, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ)తో కలిసి కొత్త మౌలిక సదుపాయాలను సృష్టించడంలో ప్రైవేట్–రంగం భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపింది. 800 బిలియన్ డాలర్లు దాటిన విదేశీ వాణిజ్యం సేవల రంగం సాయం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ మందగించినప్పటికీ, 2023 ప్రథమార్థంలో భారతదేశం సేవల విభాగాలలో ఆరోగ్యకరమైన పెరుగుదల.. దేశం మొత్తం అంతర్జాతీయ వాణిజ్యానికి భరోసాను అందించిందని ఆర్థిక విశ్లేషనా సంస్థ–గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీíÙయేటివ్ (జీటీఆర్ఐ) తన తాజా నివేదికలో పేర్కొంది. 2023 జనవరి–జూన్ మధ్య భారత్ వస్తువులు, సేవల వాణిజ్యం 800 బిలియన్ డాలర్లు దాటినట్లు జీటీఆర్ఐ నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం, సమీక్షా కాలంలో వస్తు, సేవల ఎగుమతులు 1.5 శాతం పెరిగి 385.4 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు ఇదే కాలంలో 5.9 శాతం ఎగసి 415.5 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక వేర్వేరుగా చూస్తే.. వస్తు ఎగుమతులు 8.1 శాతం తగ్గి 218.7 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు 8.3 శాతం క్షీణించి 325.7 బిలియన్ డాలర్లకు పడ్డాయి. కాగా, సేవల ఎగుమతులు మాత్రం 17.7 శాతం పెరిగి 166.7 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 3.7 శాతం పెరిగి 89.8 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎస్బీఐ అంచనా 8.3 శాతం బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మొదటి త్రైమాసికంలో 8.3 శాతం వృద్ధి అంచనాలను వేసింది. ఆర్బీఐ అంచనాలకు మించి ఈ విశ్లేషణ నమోదుకావడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం మొత్తంలో 6.5 శాతం వృద్ధి నమోదవుతుందని తమ 30 హై ఫ్రీక్వెన్సీలతో కూడిన ఆరి్టఫిషియల్ న్యూట్రల్ నెట్వర్క్ (ఏఎన్ఎన్) అంచనా వేస్తున్నట్లు గ్రూప్ చీఫ్ ఎకమిస్ట సౌమ్య కాంతి ఘోష్ ఈ మేరకు విడుదలైన ఒక నివేదికలో పేర్కొన్నారు. నివేదిక ప్రకారం, జూలై–సెపె్టంబర్లో 6.5 శాతం, అక్టోబర్–డిసెంబర్ మధ్య 6 శాతం, జనవరి–మార్చి (2024)లో 5.7 శాతం వృద్ధి నమోదవుతుంది. ఆర్బీఐ ఈ నెల మొదట్లో జరిగిన పాలసీ సమీక్ష 2023–24లో దేశ జీడీపీ 6.5 శాతం ఉంటుందని అంచనావేస్తుండగా, క్యూ1లో 8 శాతం, క్యూ2లో 6.5 శాతం, క్యూ3లో 6 శాతం, క్యూ4లో 5.7 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా అంచనా. -
ఇక్రా రేటింగ్స్ ఫలితాలు ఆకర్షణీయం
ముంబై: దేశీయంగా రెండో అతిపెద్ద రేటింగ్ ఏజెన్సీ ‘ఇక్రా రేటింగ్స్’ జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 88 శాతం వృద్ధితో రూ.40.6 కోట్లకు చేరుకుంది. ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.103 కోట్లకు చేరింది. రేటింగ్ ఆదాయం 16 శాతం పెరిగింది. అనలైటిక్స్ విభాగంలో ఆదాయ వృద్ధి 4.4 శాతంగా ఉంది. క్రెడిట్ మార్కెట్లో సందడి నెలకొందని, బాండ్ల ఇష్యూలు, బ్యాంక్ క్రెడిట్ విభాగాల్లో మంచి వృద్ధి కనిపించినట్టు ఇక్రా రేటింగ్స్ తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో లోబేస్ (క్షీణత) ఉండడం, ఈల్డ్ మోస్తరుగా ఉండడం బలమైన పనితీరుకు దోహదపడినట్టు వివరించింది. సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ అనలైటిక్స్ వ్యాపారం వృద్ధి సాధించిందని, ఈ విభాగంపై తాము ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టు ఇక్రా రేటింగ్స్ ఎండీ రామ్‌నాథ్ కృష్ణన్ పేర్కొన్నారు. జూన్ త్రైమాసికంలో పరిశోధను విస్తరించామని, మౌలిక సదుపాయాలు, రోడ్లు, జాతీయ రహదారులు, స్టీల్, బ్యాంకింగ్ రంగాలపై ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలిపారు. -
ప్రీమియం హోటళ్లలో జోరుగా బుకింగ్‌లు
న్యూఢిల్లీ: ప్రీమియం హోటళ్లలో బుకింగ్‌లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) అక్యుపెన్సీ రేషియో (భర్తీ రేటు) దశాబ్దం గరిష్ట స్థాయి అయిన 70–72 శాతానికి చేరుకుంటుందని, సగటు రూమ్ రేటు రూ.6,000–6,200 మధ్య ఉండొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆక్యుపెన్సీ రేటు 68–70 శాతం మధ్య ఉంది. ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్నప్పటికీ, వినియోగ సెంటిమెంట్ స్థిరంగా మెరుగుపడుతున్నట్టు తెలిపింది. కార్పొరేట్ల స్థిరమైన పనితీరు, దేశీ ప్రయాణికుల రద్దీ కరోనా ముందు నాటి స్థాయిని అధిగమించడం రవాణా, హోటల్ పరిశ్రమలకు డిమాండ్‌ను తీసుకొస్తున్నట్టు వివరించింది. ఈ మేరకు ఇక్రా ఓ నివేదికను విడుదల చేసింది. భారత హోటల్ పరిశ్రమ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13–15 శాతం వృద్ధిని చూస్తుందని అంచనా వేసింది. ఒక రూమ్ నుంచి వచ్చే సగటు ఆదాయం ఇప్పటికీ 2007–08 నాటి గరిష్ట స్థాయితో పోలిస్తే 20–25 శాతం తక్కువగా ఉంటుందని పేర్కొంది. ఢిల్లీ, ముంబైలో ఎక్కువ డిమాండ్ ఢిల్లీ, ముంబై పట్టికలో ఎగువ భాగాన ఉన్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇక్కడి హోటళ్లలో ఆక్యుపెన్సీ రేషియో 75 శాతంగా ఉటుందని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ వినుత ఎస్ తెలిపారు. ఇతర అన్ని పట్టణాల్లోనూ డిమాండ్ ఆరోగ్యకరంగా ఉంటుందని, బెంగళూరు, పుణెలో మాత్రం బలహీనంగా ఉండొచ్చన్నారు. ముఖ్యంగా జీ20 సమావేశాలు ఉండడం, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడంతో వ్యాపార సమావేశాల ఫలితంగా పట్టణాల్లో హోటళ్లకు డిమాండ్ ఉంటుందని ఇక్రా పేర్కొంది. అలాగే విహార యాత్రలు, సదస్సులు, ఎగ్జిబిషన్లు, వ్యాపార ప్రయాణాలు, విదేశీ ప్రయాణికుల రాక డిమాండ్‌కు సానుకూలిస్తాయని వివరించింది. మధ్యస్థాయి హోటళ్లలోనూ భర్తీ రేటు పుంజుకుంటున్నట్టు తెలిపింది. వీటిల్లోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన రేటు నమోదు కావచ్చని అంచనా వేసింది. డిమాండ్ పుంజుకోవడంతో గత 12–15 నెలల్లో వాయిదా పడిన ప్రాజెక్టులను ప్రారంభించడం, కొత్త ప్రాజెక్టుల ప్రారంభం ఉండొచ్చని పేర్కొంది. ప్రీమియం విభాగంలో కొత్త హోటళ్ల ప్రారంభం ఎంపిక చేసిన మార్కెట్లలోనే ఉండొచ్చని తెలిపింది. కొత్తగా రానున్న హోటళ్లలో ఎక్కువగా బెంగళూరు, ముంబై మార్కెట్ల నుంచే ఉంటాయని వెల్లడించింది. ‘‘కొత్త హోటల్ వసతుల సరఫరా ఏటా 3.5–4 శాతం కాంపౌండెడ్ వృద్ధి రేటు ప్రకారం ఉండొచ్చు. ప్రీమియం విభాగంలో దేశవ్యాప్తంగా 15,000–16,000 రూమ్‌ల లభ్యత పెరుగుతుంది’’అని ఇక్రా వివరించింది. -
ఎన్బీఎఫ్సీలు అవుట్‌లుక్ మరింత మెరుగు: ఐసీఆర్ఏ
నాన్–బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ–రిటైల్) హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (హెచ్ఎఫ్సీ–రిటైల్) రుణాలు ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగ్గా ఉంటాయని రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ మేరకు తన అవుట్‌లుక్‌ను ఎగువముఖంగా సవరించింది. ఎన్‌బీఎఫ్‌సీల నిర్వహణలోని రిటైల్ రుణాలు (ఏయూఎం) 2023 మార్చి నాటికి రూ.14 లక్షల కోట్లు ఉంటే, 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇది 18 నుంచి 20 శాతం పురోగమించే అవకాశం ఉందని అంచనావేసింది. ఇంతక్రితం ఈ వృద్ధి అంచనా 12 నుంచి 14 శాతంగా ఉంది. ఇక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల రిటైల్ రుణాలు 2023 మార్చి నాటికి రూ.7లక్షల కోట్లయితే, 2023–24లో 12 నుంచి 14 శాతం వృద్ధి నమోదుకావచ్చని పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనా 11 నుంచి 13 శాతం. ఇక మౌలిక రంగానికి సంబంధించి మొత్తం ఎన్‌బీఎఫ్‌సీల రుణాలు మార్చి 2023 నాటికి రూ.40 లక్షల కోట్లయితే, ఈ విభాగంలో 2023–24లో క్రితం అంచనాల (10 నుంచి 12 శాతం)కన్నా అధికంగా 13 నుంచి 15 శాతం వృద్ధి నమోదుకావచ్చని పేర్కొంది. -
గోదాం వసతుల్లో 13–15 శాతం వృద్ధి
ముంబై: పారిశ్రామిక, వేర్ హౌస్ లాజిస్టిక్స్ పార్క్ సరఫరా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13–15 శాతం మేర పెరుగుతుందని ఇక్రా రేటింగ్స్ అంచనా వేసింది. ఎనిమిది ప్రధాన మార్కెట్లలో గోదాముల వసతి విస్తీర్ణం 435 మిలియన్ చదరపు అడుగులుగా ఉంటుందని పేర్కొంది. ముఖ్యంగా 50 శాతం గోదాం వసతి గ్రేడ్ ఏ రూపంలోనే వస్తుందని తెలిపింది. అయితే, కొత్తగా వచ్చే వసతిలో వినియోగం 39 మిలియన్ చదరపు అడుగులుగానే ఉంటుందని పేర్కొంది. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (రవాణా), ఆటోమొబైల్ రంగాల నుంచి గోదాముల పరిశ్రమ స్థిరమైన డిమాండ్‌ను చూస్తోందని, 2023 మార్చి నాటికి మొత్తం వేర్‌హౌసింగ్ లీజు విస్తీర్ణంలో ఈ రంగాల వాటా 53 శాతంగా ఉందని వివరించింది. దీనికి అదనంగా ఈ కామర్స్, అనుబంధ సేవల రంగాలు వేగంగా విస్తరిస్తుండడం కూడా గోదాములకు డిమాండ్‌ను పెంచుతోందని తెలిపింది. ప్రభుత్వం తయారీకి ప్రోత్సాహకాలు ఇస్తుండడం కూడా డిమాండ్ వృద్ధికి ఊతంగా నిలుస్తున్నట్టు వివరించింది. దేశవ్యాప్తంగా టాప్–8 పట్టణాల్లో గ్రేడ్ ఏ వేర్‌హౌస్ వసతి 17 శాతం వృద్ధి చెంది 195 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని అంచనా వేసింది. 2023 మార్చి నాటికి ఇది 167 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. కొత్తగా గ్రేడ్ ఏ విభాగంలో వచ్చే మార్చి నాటికి 28 మిలియన్ చదరపు అడుగుల వసతి అందుబాటులోకి వస్తుందని తన నివేదికలో ఇక్రా రేటింగ్స్ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న గ్రేడ్ ఏ గోదాముల వసతిలో 30 శాతాన్ని అంతర్జాతీయ ఆపరేటర్లు, ఇన్వెస్టర్లు అయిన సీపీపీఐబీ, జీఎల్పీ, బ్లాక్‌స్టోన్, ఈఎస్ఆర్, అలియాంజ్, జీఐసీ, సీడీపీ గ్రూప్ ఆక్రమించినట్టు తెలిపింది. దీర్ఘకాలంలో మెరుగైన వృద్ధి అవకాశాలు దీర్ఘకాలంలో గ్రేడ్–ఏ గోదాముల వసతి వృద్ధికి మెరుగైన అవకాశాలున్నట్టు ఇక్రా రేటింగ్స్ నివేదిక తెలిపింది. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్, ఆటోమొబైల్ రంగాలే అందుబాటులోని గోదాముల విస్తీర్ణంలో సగం వాటా ఆక్రమిస్తున్నాయి. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ నుంచి 8–9 శాతం, ఆటోమొబైల్ రంగం 6–9 శాతం వృద్ధి ఉంటుందని తెలిపింది. ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, పుణె, చెన్నై, కోల్‌కతా మార్కెట్లు వేర్‌హౌసింగ్‌కు టాప్ మార్కెట్లుగా ఉన్నాయని, ఈ పట్టణాలే మొత్తం వసతుల్లో 75–78 శాతం వాటా కలిగి ఉన్నాయని వివరించింది. ముంబై, ఢీల్లీ ఎన్సీఆర్ మార్కెట్లే 50% వాటా ఆక్రమిస్తున్నట్టు తెలిపింది. -
ఇన్సూరెన్స్ పాలసీలపై పెరిగిన అవగాహన.. రూ.3 లక్షల కోట్ల బీమా రంగ ఆదాయం
న్యూఢిల్లీ: బీమా పరిశ్రమ స్థూల ప్రీమియం ఆదాయం 2025 మార్చి నాటికి రూ.3 లక్షల కోట్లకు చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. 2023 మార్చి నాటికి ఇది రూ.2.4 లక్షల కోట్లుగా ఉంది. ప్రైవేటు బీమా సంస్థల కంబైన్డ్ రేషియో మెరుగుపడుతుందని, రిటర్న్ ఆన్ ఈక్విటీ (ఆర్‌వోఈ) 2023–24లో 11.2–12.8 శాతానికి, 2024–25లో 12.5–13.9 శాతానికి పెరుగుతుందని పేర్కొంది. ప్రభుత్వరంగ బీమా సంస్థలు కంబైన్డ్ రేషియో అధికంగా ఉంటుందని, దీంతో వాటి నష్టాలు కొనసాగుతాయని తెలిపింది. ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు 2024 మార్చి నాటికి సాల్వెన్సీ రేషియో (1.5 రెట్లు) చేరుకునేందుకు వీలుగా వాటికి రూ.17,500 కోట్ల నిధుల అవసరం అవుతాయని అంచనా వేసింది. పరిశ్రమ స్థూల ప్రీమియం ఆదాయం 2022–23లో వార్షికంగా చూస్తే 17.2 శాతం వృద్ధితో రూ.2.4 లక్షల కోట్లకు చేరుకున్న విషయాన్ని ప్రస్తావించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2022–23లో నికరంగా రూ.35,000 కోట్ల మేర పెరిగినట్టు పేర్కొంది. హెల్త్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన పెరగడంతో ఈ విభాగం మెరుగైన వృద్ధిని చూసిందని, వృద్ధి చెందిన స్థూల ప్రీమియం ఆదాయంలో 50 శాతం వాటా హెల్త్ ఇన్సూరెన్స్ నుంచే వచ్చినట్టు వివరించింది. కరోనా సమయంలో లాక్డౌన్లతో దెబ్బతిన్న మోటారు బీమా విభాగం సైతం పుంజుకున్నట్టు ఇక్రా తెలిపింది. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు సాధారణ స్థితికి చేరినట్టు పేర్కొంది. వేతన సవరణ, అందుకు సంబంధించిన బకాయిల చెల్లింపులతో ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలకు నష్టాలు పెరిగినట్టు వివరించింది. -
క్యూ3లో మార్జిన్ల నేలచూపు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో దేశీ కార్పొరేట్ల నిర్వహణ లాభ మార్జిన్లు మందగించనున్నట్లు రేటింగ్ దిగ్గజం ఇక్రా తాజాగా అంచనా వేసింది. ఇందుకు ద్రవ్యోల్బణం, ఇంధన వ్యయాలు కారణంకానున్నట్లు పేర్కొంది. వెరసి అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో వార్షిక ప్రాతిపదికన ఇబిటా మార్జిన్లు 2.37 శాతం క్షీణించి 16.3 శాతానికి పరిమితంకానున్నాయి. అయితే త్రైమాసికవారీగా అంటే జులై–సెప్టెంబర్(క్యూ2)తో పోల్చి చూస్తే 1.8 శాతం బలపడనున్నట్లు ఇక్రా రేటింగ్స్ అభిప్రాయపడింది. ఇందుకు ముడివ్యయాలు తగ్గడం, పలు కంపెనీలు ప్రొడక్టుల ధరలను పెంచడం దోహదపడనున్నట్లు తెలియజేసింది. త్రైమాసికవారీగా ముడివ్యయాలు నీరసించడంతోపాటు.. ఉత్పత్తుల విక్రయ ధరలు మెరుగుపడటంతో సమీప కాలంలో మార్జిన్లు బలపడనున్నట్లు వివరించింది. అయితే భౌగోళిక రాజకీయ ఆందోళనలు, ఆర్థిక మాంద్య భయాలు, ఫారెక్స్ హెచ్చుతగ్గుల కారణంగా రిస్కులు ఎదురుకావచ్చని పేర్కొంది. ఫైనాన్షియల్ మినహా.. ఫైనాన్షియల్ రంగ సంస్థలు మినహా ఇతర కంపెనీల ఆదాయం 17.2 శాతం పుంజుకోనున్నట్లు ఇక్రా అంచనా వేసింది. హోటళ్లు, చమురు గ్యాస్, ఆటో, ఎయిర్‌లైన్స్, విద్యుత్ రంగాలు ఆదాయ వృద్ధిలో ముందు నిలవనున్నట్లు తెలియజేసింది. త్రైమాసికవారీగా మాత్రం ఆదాయంలో 1.4 శాతమే వృద్ధి నమోదుకావచ్చని అభిప్రాయపడింది. ఇందుకు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కన్జూమర్ సెంటిమెంట్లు ప్రభావం చూపనున్నట్లు తెలియజేసింది. ఇంధన వ్యయాల ద్రవ్యోల్బణం, అభివృద్ధి చెందిన దేశాలలో మాంద్య పరిస్థితులు, ఎగుమతి, దిగుమతి కంపెనీలపై విదేశీ మారక ఆటుపోట్లు వంటి అంశాలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో దేశీ కార్పొరేట్ ఫలితాలు ఆధారపడి ఉంటాయని ఇక్రా నిపుణులు శ్రుతి థామస్ తెలియజేశారు. -
భారత్ ఐటీ సేవల వృద్ధి అంతంతే..!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎకానమీలు ఎదుర్కొంటున్న సవాళ్లు మధ్యకాలానికి భారతీయ ఐటీ సేవల పరిశ్రమ వృద్ధిని నిరోధిస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ పరిశోధనా నివేదిక ఒకటి తెలిపింది. నివేదిక ప్రకారం, భారత్ ఐటీ సేవల పరిశ్రమ అమెరికా మార్కెట్ నుండి 60–65 శాతం ఆదాయాన్ని, అలాగే యూరోపియన్ మార్కెట్ నుండి 20–25 శాతం ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఆయా దేశాల్లో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, ఈ కీలక ఆపరేటింగ్ మార్కెట్లలో నియంత్రణాపరమైన మార్పులు భారత్ ఐటీ పరిశ్రమకు ప్రతికూలంగా ఉంటాయి. నివేదికాంశాలను ఐసీఆర్ఏ అసిసెంట్ వైస్‌ప్రెసిడెంట్, సెక్టార్ హెడ్ దీపక్ జట్వానీ వెల్లడించారు. ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► సవాళ్లు ఉన్నప్పటికీ, ఐటీ రంగం అవుట్‌లుక్‌ను ‘స్టేబుల్’గానే ఉంచడం జరుగుతోంది. పలు కంపెనీల బ్యాలెన్స్ షీట్లు పటిష్టంగా ఉండడం దీనికి నేపథ్యం. ► ఐటీ కంపెనీలకు కీలకమైన విభాగాల్లో బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇ న్సూరెన్స్) ఒకటి. ఈ విభాగంలో వృద్ధి ఇటీవలి త్రైమాసికాల్లో ఇతర విభాగాల కంటే ఎక్కువగా పడిపోయింది. బ్యాంకింగ్ రుణ కార్యకలాపాలు భారీగా పెరక్కపోడానికి ఇదీ ఒక కారణమే. ► ఆర్థిక అనిశ్చితి కొనసాగితే, తయారీ, ఆరోగ్య సంరక్షణ విభాగాల కన్నా తనఖా, రిటైల్ రంగాలు ప్రభావింతం అయ్యే అవకాశం ఉంది. ► పలు ఐటీ కంపెనీలు ఉద్యోగుల వలసలతో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. దీనితో డిమాండ్–సరఫరాల మధ్య వ్యత్యాసం కనబడుతోంది. ప్రత్యేకించి డిజిటల్ టెక్ విభాగంలో ఈ సమస్య ఉంది. -
వాహనాలకు స్పీడ్ బ్రేకర్లుగా సీఎన్జీ ధర
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధర వాణిజ్య వాహన పరిశ్రమ వేగానికి కళ్లెం వేస్తోందని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఇక్రా ప్రకారం.. గ్యాస్ ధర దూసుకెళ్తుండడంతో వాణిజ్య వాహనాల్లో సీఎన్జీ విస్తృతి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 16 నుంచి 9–10 శాతానికి పరిమితం చేసింది. మధ్యస్థాయి వాణిజ్య వాహన విభాగంలో ఇది సుస్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ ఇంధన ధరల పెరుగుదల కారణంగా గత ఏడాదిలో సీఎన్జీ ధర 70 శాతం అధికమైంది. ఇది సీఎన్జీ, డీజిల్ మధ్య అంతరాన్ని తగ్గించింది. దీంతో పర్యావరణ అనుకూల ఇంధనానికి మారడానికి అడ్డుగా పరిణమించింది. కొన్ని నగరాల్లో సీఎన్జీ ధర కేజీ రూ.59 ఉంటే మరికొన్ని నగరాల్లో రూ.90 ఉంది. ధరల వ్యత్యాసం సీఎన్జీ విస్తృతికి అడ్డంకిగా ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీలు ప్రత్యామ్నాయ ఇంధనం/సాంకేతిక వాహనాలను అభివృద్ధి చేయడంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. ఎంపిక చేసిన విభాగాలలో ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేయడంతోపాటు, సీఎన్జీ మోడళ్ల ప్రవేశ వేగాన్ని తగ్గించాయి. హైడ్రోజన్ ఇంధనంపైనా ఫోకస్ చేస్తున్నాయి. సీఎన్జీ వ్యాప్తిలో ఇటీవలి క్షీణత కనిపించినప్పటికీ.. సీఎన్జీ ఇంధన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పర్యావరణ అనుకూల వాహనాలను పెంచడం ద్వారా మధ్యకాలిక అవకాశాలు అనుకూలంగానే ఉన్నాయి. పెరిగిన నిర్వహణ ఖర్చులు.. సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల వాటా 2021–22లో 38 శాతం ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 27 శాతానికి వచ్చింది. సీఎన్జీ వాహనాల నిర్వహణ ఖర్చులు గత ఏడాది కంటే దాదాపు 20 శాతం పెరిగాయి. ఢిల్లీ, ముంబై వంటి కొన్ని నగరాల్లో పోల్చదగిన డీజిల్ వేరియంట్లతో చూస్తే ఇప్పుడు వ్యయాలు 5–20 శాతం అధికం అయ్యాయి. వాహనం ధర అధికం కావడం, సీఎన్జీ ట్రక్కులు తక్కువ బరువు మోసే సామర్థ్యం ఉండడం.. వెరశి ఈ వాహనాలను స్వీకరించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల అమ్మకాలు ఒకానొక స్థాయిలో నెలకు 12,000 యూనిట్లు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇది 7,000 యూనిట్లకు వచ్చి చేరింది. కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ సవాళ్లు, ముఖ్యంగా ఉక్రెయిన్–రష్యా యుద్ధ ప్రభావం కారణంగా ప్రస్తుత పరిస్థితి దాదాపు మధ్యస్థ కాలానికి కొనసాగుతుంది. కాగా, సీఎన్జీ ఆధారిత ప్యాసింజర్ వాహనాలు, బస్సులకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. పర్యావరణ అనుకూల వాహనాల వినియోగం పెరిగేందుకు ప్రభుత్వ చొరవ కొంత వరకు తోడ్పడింది. -
ఆటో రంగంలో రూ.65,000 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్యాసింజర్ వాహన రంగంలో 2024–25 నాటికి భారీ పెట్టుబడులు రానున్నాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా సోమవారం తెలిపింది. అధికం అవుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఉత్పత్తి సామర్థ్యాలను పెంచేందుకు, ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ల అభివృద్ధితో సహా కొత్త ఉత్పత్తుల రూపకల్పనకై తయారీ కంపెనీలు సుమారు రూ.65,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయని వెల్లడించింది. ‘ఇప్పటికే కొన్ని సంస్థలు రూ.25,000 కోట్ల విలువైన విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. 2022 ప్రారంభం నుండి ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ ఆరోగ్యంగా ఉంది. బలమైన అంతర్లీన డిమాండ్‌కుతోడు సెమీకండక్టర్ కొరత సమస్య తగ్గుముఖం పట్టడం ఇందుకు సహాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వెహికిల్ పరిశ్రమ హోల్‌సేల్ పరిమాణం 21–24 శాతం వృద్ధితో 37–38 లక్షల యూనిట్లను తాకవచ్చు. సరఫరా వ్యవస్థ మెరుగుపడడంతో వాహన కంపెనీల సామర్థ్య వినియోగం గత కొన్ని త్రైమాసికాలుగా పటిష్ట స్థాయికి చేరింది. బలమైన డిమాండ్ సెంటిమెంట్ కొనసాగుతుండడంతో కంపెనీలు ఇప్పుడు తమ సామర్థ్య విస్తరణ ప్రణాళికలను పునరుద్ధరించాయి. కొత్త సామర్థ్యాలను జోడించడం వల్ల రాబోయే కొద్ది సంవత్సరాల్లో ప్లాంట్ల వినియోగ స్థాయిలు స్వల్పంగా తగ్గుతాయి. పటిష్ట డిమాండ్‌తో వినియోగం దాదాపు 70 శాతం వద్ద సౌకర్యవంతమైన స్థాయిలో ఉండే అవకాశం ఉంది’ అని ఇక్రా వెల్లడించింది. -
ఎయిర్‌లైన్స్‌కు రూ. 17 వేల కోట్ల నష్టాలు
ముంబై: అధిక ఇంధన ధరలు, ఆర్థిక పరిస్థితిపై ఒత్తిళ్ల నేపథ్యంలో దేశీ విమానయాన రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 15,000–17,000 కోట్ల మేర నష్టాలు నమోదు చేసే అవకాశం ఉంది. సమీప భవిష్యత్తులోనూ వాటి ఆర్థిక పనితీరుపై ఒత్తిడి కొనసాగనుంది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం .. దేశీయంగా ప్రయాణికుల ట్రాఫిక్ కోలుకుంటున్న తీరు మెరుగ్గానే ఉన్నప్పటికీ విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు భారీ స్థాయిలో ఉండటమనేది స్వల్పకాలికంగా, మధ్యకాలికంగా ఎయిర్‌లైన్స్ ఆదాయాలకు, లిక్విడిటీకి ప్రధాన ముప్పుగా కొనసాగనుంది. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ అక్టోబర్‌లో దేశీ ప్రయాణికుల సంఖ్య 26 శాతం పెరిగి 90 లక్షల నుంచి 1.14 కోట్లకు చేరింది. అయినప్పటికీ కరోనా పూర్వం అక్టోబర్‌తో పోలిస్తే ఇది 8 శాతం తక్కువే. ఈ నేపథ్యంలో దేశీ ఏవియేషన్ పరిశ్రమకు ఇక్రా నెగటివ్ అవుట్‌లుక్ ఇచ్చింది. నివేదికలోని మరిన్ని ముఖ్య అంశాలు.. ► డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణిస్తుండటమనేది ఎయిర్‌లైన్స్ వ్యయాల స్వరూపంపై గట్టి ప్రభావం చూపనుంది. రుణాల స్థాయిలు, లీజుల వ్యయాలు మొదలైన వాటి భారం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1,00,000 కోట్ల మేర ఉండవచ్చని అంచనా. ► మార్కెట్ వాటాను నిలబెట్టుకునేందుకు/పెంచుకునేందుకు ఎయిర్‌లైన్స్ ప్రయత్నాలు కొనసాగినా .. విమానయాన సంస్థలకు మార్జిన్లు పెంచుకునే సామర్థ్యాలు పరిమితంగానే ఉండనున్నాయి. ఇంధన ధరలు అధిక స్థాయిలో కొనసాగుతుండటమే ఇందుకు కారణం. పరిశ్రమ ఆదాయాలు మెరుగుపడటానికి ఈ అంశాలు పెను సవాలుగా ఉండనున్నాయి. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ ట్రాఫిక్ మెరుగుపడటం అర్ధవంతమైన స్థాయిలోనే ఉంటుందనే అంచనాలున్నా, పరిశ్రమ ఆదాయాల రికవరీ నెమ్మదించవచ్చు. వ్యయాలు భారీ స్థాయిలో ఉంటున్నందున పరిశ్రమ నికరంగా రూ.15,000–17,000 కోట్ల మేర నష్టాలు నమోదు చేసే అవకాశం ఉంది‘ అని ఇక్రా పేర్కొంది. అయితే, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నికర నష్టాలు తక్కువగానే ఉండవచ్చని తెలిపింది. ప్యాసింజర్ ట్రాఫిక్ మెరుగుపడటం, వడ్డీల భారం తగ్గడం (ఎయిరిండియా విక్రయానికి ముందు దాని రుణభారాన్ని ప్రభుత్వం గణనీయంగా తగ్గించడం) వంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని పేర్కొంది. ► విమానాల విడిభాగాలు, ఇంజిన్ల సరఫరాలో జాప్యం జరుగుతుండటం పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనితో కొన్ని దేశీ ఎయిర్‌లైన్స్ పలు విమానాలను నిలిపివేయాల్సి వస్తోంది. సరఫరాపరమైన సమస్యల పరిష్కారం కోసం తయారీ కంపెనీలతో ఎయిర్‌లైన్స్ చర్చలు జరుపుతున్నాయి. డిమాండ్‌కి అనుగుణంగా ఫ్లయిట్ సర్వీసులను పెంచుకునేందుకు విమానాలను వెట్ లీజింగ్‌కు (విమానంతో పాటు సిబ్బందిని కూడా లీజుకు తీసుకోవడం) తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. -
7.2 శాతం వృద్ధికే ఇక్రా ఓటు
ముంబై: ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) జీడీపీ వృద్ధి అంచనాను 7.2 శాతంగానే కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు మూలధన వ్యయాలు, కాంటాక్ట్ సేవలు పుంజుకోవడం సానుకూలతలుగా పేర్కొంది. నిలిచిన డిమాండ్ కూడా తోడు కావడంతో వృద్ధి కరోనా ముందు నాటికి స్థాయికి పుంజుకుంటుందని అంచనా వేసింది. ఏప్రిల్–జూన్ (క్యూ1) త్రైమాసికంలో దేశ జీడీపీ 13.5 శాతం వృద్ధిని చూడగా, సెప్టెంబర్ త్రైమాసికంలో దీనికంటే తగ్గుతుందని, తదుపరి రెండు త్రైమాసికాల్లోనూ ఇంకాస్త తక్కువ వృద్ధిని చూస్తుందని తెలిపింది. ఎక్కువ రేటింగ్ ఏజెన్సీలు జీడీపీ వృద్ధి అంచనాలను 7 శాతం, అంతకంటే దిగువకు ప్రకటించడం గమనార్హం. ఈ రకంగా చూస్తే ఇక్రా వృద్ధి అంచనాలు కొంచెం మెరుగ్గానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఆగస్ట్ నెలలో రోజువారీ రికార్డు స్థాయి జీఎస్టీ ఈవే బిల్లుల జారీ, పండుగలకు ముందస్తు భారీగా ఉత్పత్తుల నిల్వలను పెంచుకోవడం, కమోడిటీ ధరలు క్షీణించడం రానున్న పండుగల సీజన్‌కు ఎంతో సానుకూలమని.. అయితే, ఖరీఫ్‌లో కీలకమైన వరి దిగుబడి తగ్గనుండడం, వెలుపలి డిమాండ్ బలహీనపడడం వృద్ధికి ఉన్న సవాళ్లు అని, వీటిని పరిశీలించాల్సి ఉంటుందని ఇక్రా అభిప్రాయాలు వ్యక్తం చేసింది. త్రైమాసికం వారీగా.. ‘‘సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.5–7 శాతానికి పరిమితం కావచ్చు. డిసెంబర్ త్రైమాసికం (క్యూ3), 2023 జనవరి–మార్చి త్రైమాసికంలో (క్యూ4)లో 5–5.5 శాతంగా ఉండొచ్చు. బేస్ ప్రభావం వల్లే ఇలా ఉంటుంది’’అని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. 2022 చివరికి ప్రైవేటు రంగంలో పూర్తి స్థాయిలో మూలధన వ్యయాలు పుంజుకుంటాయని, కంపెనీల తయారీ సామర్థ్య వినియోగం పెరుగుతుందని ఇక్రా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీవీఏ 7 శాతంగా, రిటైల్ ద్రవ్యోల్బణం 6.5 శాతంగా, టోకు ద్రవ్యోల్బణం 10.1 శాతంగా, కరెంటు ఖాతా లోటు జీడీపీలో 3.5 శాతం (మూడు రెట్లు పెరిగి 120 బిలియన్ డాలర్లు) ఉంటుందని పేర్కొంది. దేశీయంగా డిమాండ్ బలంగా ఉండడంతో, దిగుమతులు పెరిగి కరెంటు ఖాతా లోటు విస్తరిస్తుందని అభిప్రాయపడింది. రూపాయి మరీ దారుణ పరిస్థితుల్లో డిసెంబర్ నాటికి డాలర్‌తో 83కు పడిపోవచ్చని, పదేళ్ల ప్రభుత్వ సెక్యూరిటీల ఈల్డ్స్ 7.3–7.8 శాతం స్థాయిలో ఉంటాయని అంచనా వేసింది. స్థూల ద్రవ్యలోటు 15.87 లక్షల కోట్లు (జీడీపీలో 6.7 శాతం) ఉంటుందని పేర్కొంది. -
ఆగస్ట్‌లో విమాన ప్రయాణికుల్లో వృద్ధి
న్యూఢిల్లీ: దేశీ విమాన ప్రయాణికుల రద్దీ ఆగస్ట్‌లో 5 శాతం పెరిగింది. 1.02 కోట్ల మంది విమాన సేవలను వినియోగించుకున్నట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ఆగస్ట్ నెలకు సంబంధించి ఈ రంగంపై ఒక నివేదికను గురువారం విడుదల చేసింది. జూలై నెలలో విమాన ప్రయాణికుల సంఖ్య 97 లక్షలతో పోలిస్తే 5 శాతం పెరిగినట్టు పేర్కొంది. ఇక 2021 ఆగస్ట్ నెల గణాంకాలతో పోల్చి చూస్తే 52 శాతం పెరిగినట్టు తెలిపింది. ఇక కరోనా ముందు సంవత్సరం 2019 ఆగస్ట్ నెల గణాంకాల కంటే 14 శాతం తక్కువే ఉన్నట్టు వివరించింది. విమాన సర్వీసులు పూర్తి సాధారణ స్థాయికి చేరుకోవడంతోపాటు, కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోయినందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల రద్దీ వేగంగా పుంజుకోవచ్చని ఇక్రా అంచనా వేసింది. భారత ఎయిర్‌లైన్స్ సంస్థలకు సంబంధించి విదేశీ ప్రయాణికుల సంఖ్య ఆగస్ట్‌లో 19.8 లక్షలుగా ఉందని, కరోనా ముందు నాటితో పోలిస్తే ఇది 32 శాతం అధికమని తెలిపింది. 2022 మొదటి ఐదు నెలల్లో దేశీ విమాన ప్రయాణికుల సంఖ్య 5.24 కోట్లుగా ఉంటుందని, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 131 శాతం అధికమని ఇక్రా పేర్కొంది. విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు పెరిగిపోవడంతో ఎయిర్‌లైన్స్ ఆదాయం రికవరీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిదానంగా ఉంటుందని అంచనా వేసింది. దీనికితోడు పరిశ్రమపై ద్రవ్యోల్బణ ప్రభావం సైతం ఉంటుందని పేర్కొంది. -
దేశానికి కరెంట్ అకౌంట్ లోటు కష్టాలు
ముంబై: భారత్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ– క్యాడ్) కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని దేశీయ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తోంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ లోటు అదే కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే 5 శాతానికి చేరే వీలుందని ఇక్రా అభిప్రాయపడింది. అదే విధంగా 2022–23లో 3.5 శాతంగా ఉండే వీలుందని అంచనావేసింది. దేశం నుంచి ఎగుమతులు తగ్గుతుండడం, దిగుమతుల పెరుగుదల, దీనితో భారీగా పెరగనున్న వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం) వంటి అంశాలు క్యాడ్ ఆందోళనకు కారణమని ఇక్రా విశ్లేషించింది. నివేదికకు సంబంధించి ముఖ్యాంశాలు... ►ఒక్క ఆగస్టును తీసుకుంటే వాణిజ్య లోటు రెట్టింపై 28.7 బిలియన్ డాలర్లకు చేరింది. భారత్ ఎగుమతులు 20 నెల్లో మొదటిసారి ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా 1.15 శాతం మేర క్షీణించడం, (విలువలో 33 బిలియన్ డాలర్లు) దిగుమతులు 37 శాతం పెరిగి, 61.68 బిలియన్ డాలర్లుగా నమోదవడం దీనికి కారణం. ఎగుమతుల ద్వారా ఆదాయం తగ్గడం క్యాడ్‌పై ప్రభావం చూపింది. ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో క్యాడ్ విలువ ఆల్‌టైమ్ హై 41 బిలియన్ డాలర్ల నుంచి 43 బిలియన్ డాలర్ల శ్రేణిలో (జీడీపీ విలువ అంచనాలో దాదాపు 5 శాతం) నమోదుకావచ్చు. 2022–23 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఈ విలువ 30 బిలియన్ డాలర్లుగా ఉంది. ►అయితే ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో (అక్టోబర్–మార్చి) క్యాడ్ 2.7 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. దీనివల్ల ఆర్థిక సంవత్సరం మొత్తంలో క్యాడ్ 3.5 శాతానికి పరిమితం కావచ్చు. కమోడిటీల బిల్లు తగ్గే అవకాశాలు, సీజనల్‌గా ఎగుమతులు కొంచెం మెరుగుపడే పరిస్థితులు దీనికి కారణం. అయితే దిగ్గజ ఎకనామీల్లో మాంద్యం పరిస్థితుల వల్ల దేశం వస్తు, సేవల ఎగుమతులు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. ►ఆర్థిక సంవత్సరం (2022–23)లో క్యాడ్ 120 బిలియన్ డాలర్లు (జీడీపీలో 3.5 శాతం)గా ఉండే వీలుంది. 2021–22లో ఈ విలువ కేవలం 38.7 బిలియన్ డాలర్లు. అంటే జీడీపీలో 1.2%. ►ఇక రూపాయి విషయానికి వస్తే, 2022 రానున్న కాలంలో డాలర్ మారకంలో రూపాయి విలువ 78.5–81 శ్రేణిలో తిరిగే వీలుంది. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) ఈక్విటీ ఇన్‌ఫ్లోస్ పెరగవచ్చు. ►2021 సెప్టెంబర్ 3తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు చరిత్రాత్మక రికార్డు 642 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే అటు తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత నిల్వలు భారత్ దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. భారత్ వద్ద ప్రస్తుతం (26 ఆగస్టు నాటికి 561 బిలియన్ డాలర్లు) విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకోడానికి దోహదపడతాయి. రూపాయి తీవ్ర ఒడిదుడుకులను నివారిస్తాయి. క్యాడ్ అంటే... ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
క్యూ1లో ముడివ్యయాల ఎఫెక్ట్
ముంబై: దేశీ కార్పొరేట్లకు ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ముడివ్యయాలు భారంగా పరిణమించినట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదిక పేర్కొంది. దీంతో ఏప్రిల్–జూన్(క్యూ1)లో నిర్వహణా లాభ మార్జిన్లు సగటున 2.13 శాతంమేర క్షీణించినట్లు తెలియజేసింది. వెరసి క్యూ1లో ఆదాయం 39 శాతం జంప్‌చేసినప్పటికీ ముడివ్యయాల ద్రవ్యోల్బణ ప్రభావంతో ఇబిటా మార్జిన్లు 17.7 శాతానికి పరిమితమైనట్లు వివరించింది. కమోడిటీ, ఇంధన ధరల పెరుగుదలను కంపెనీలు వినియోగదారులకు బదిలీ చేయడంతో ఆదాయంలో వృద్ధి నమోదైనట్లు తెలియజేసింది. అయితే వీటి కారణంగా లాభదాయకత నీరసించినట్లు తెలియజేసింది. ఫైనాన్షియల్ రంగ సంస్థలను మినహాయించి 620 లిస్టెడ్ కంపెనీలను నివేదికకు ఇక్రా పరిగణించింది. నివేదిక ప్రకారం..యుద్ధం ప్రభావం రష్యా– ఉక్రెయిన్ యుద్ధంతో ఎదురైన సరఫరా సవాళ్లు సైతం మార్జిన్లు మందగించేందుకు కారణమయ్యాయి. అయితే ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి మార్జిన్లు పుంజుకునే వీలుంది. గతేడాది(2021–22) తొలి క్వార్టర్లో కరోనా మహామ్మారి రెండో వేవ్ కారణంగా అమ్మకాలు దెబ్బతినడం.. ఈ ఏడాది క్యూ1 అమ్మకాల్లో వృద్ధికి దోహదం చేసింది. పలు రంగాలలో ప్రొడక్టుల ధరల పెంపు సైతం దీనికి జత కలిసింది. కాగా.. గ్రామీణ ప్రాంతాల నుంచి కొన్ని రంగాలకు డిమాండ్ తగ్గింది. ఇది ఇటు అమ్మకాలు, అటు లాభదాయకతకు కొంతమేర చెక్ పెట్టాయి. ఇక రంగాలవారీగా చూస్తే.. హోటళ్లు, విద్యుత్, రిటైల్, చమురు– గ్యాస్ విభాగాలు క్యూ1లో ఊపందుకోగా.. ఎయిర్‌లైన్స్, నిర్మాణం, క్యాపిటల్ గూడ్స్, ఐరన్ అండ్ స్టీల్ వెనకడుగు వేశాయి. పలు ప్రొడక్టులకు ధరల పెంపు చేపట్టిన ఎఫ్ఎంసీజీ రంగంలో ఓ మాదిరి వృద్ధి నమోదైంది. -
దేశీ ఎయిర్‌లైన్స్ రికవరీకి ఏటీఎఫ్ సెగ
ముంబై: విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు ఆకాశాన్నంటుతుండటం, రూపాయి పతనమవడం వంటి అంశాలు దేశీ విమానయాన సంస్థల రికవరీ ప్రక్రియకు పెను సవాలుగా పరిణమించే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో వెల్లడించింది. ఇక జెట్ ఎయిర్వేస్ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించనుండటం, ఆకాశ ఎయిర్ సర్వీసులు మొదలుపెట్టడం వంటివి ఎయిర్‌లైన్స్ మధ్య పోటీని మరింత తీవ్రం చేయవచ్చని పేర్కొంది. సాధారణంగా విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో ఏటీఎఫ్ వాటా 45 శాతం దాకా ఉంటుంది. నిర్వహణ వ్యయాల్లో 35–40 శాతం భాగం అమెరికా డాలర్ మారకంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏటీఎఫ్ రేట్లు పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనం కావడం వంటివి ఎయిర్‌లైన్స్‌పై ప్రభావం చూపనున్నాయి. ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతలతో ఏటీఎఫ్ రేట్లు ఆగస్టులో ఏకంగా 77 శాతం ఎగిశాయి. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో ఏటీఎఫ్ రేట్లు అధికంగా ఉండటంతో పాటు రూపాయి క్షీణత వల్ల పరిశ్రమ ఆదాయాలపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉంది‘ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ సుప్రియో బెనర్జీ తెలిపారు. సీజనల్‌గా ఉండే ప్రయాణాల ధోరణుల కారణంగా జూన్‌తో పోలిస్తే జులైలో ప్రయాణికుల సంఖ్య 7 శాతం తగ్గినట్లు ఇక్రా పేర్కొంది. టికెట్ చార్జీలు పెరుగుతుండటం కూడా విహార యాత్రల ప్రణాళికలపై ప్రతికూల ప్రభావం చూపినట్లు వివరించింది. ఆగస్టు 31 నుంచి చార్జీలపై పరిమితులు ఎత్తివేస్తున్నందున .. విమానయాన సంస్థలు వ్యయాల భారాన్ని రేట్ల పెంపు రూపంలో ప్రయాణికులకు బదలాయించే అవకాశాలు ఉన్నాయని ఇక్రా పేర్కొంది. అయితే, పరిశ్రమలో తీవ్ర పోటీ నెలకొన్నందున ఎకాయెకిన చార్జీల పెంపు భారీగా ఉండకపోవచ్చని వివరించింది. -
డిపాజిట్ రేట్లకు త్వరలో రెక్కలు
ముంబై: రుణాలకు పెరుగుతున్న డిమాండ్, వడ్డీ రేట్ల పెరుగుదల క్రమం నేపథ్యంలో రానున్న నెలల్లో బ్యాంకులు డిపాజిట్లపై రేట్లను పెంచక తప్పదని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. డిపాజిట్ రేట్ల పెరుగుదలకు సంకేతంగా, బ్యాంకులు అధికంగా నిధులు సమీకరించే మార్గమైన సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్ (సీడీలు) రేట్లు క్రమంగా పెరుగుతుండడం, ఇప్పటికే కొన్నేళ్ల గరిష్టానికి చేరుకోవడాన్ని ఇక్రా గుర్తు చేసింది. బ్యాంకుల మొత్తం డిపాజిట్లలో సీడీలు 2022 జూలై 1 నాటికి 1.5 శాతంగా ఉన్నాయి. అయితే, 2011 జూన్ నాటి గరిష్ట స్థాయి 8.3 శాతాన్ని చేరుకోవాల్సి ఉందని ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. రుణాలకు డిమాండ్ పెరుగుతుండడంతో బ్యాంకులు తాజా నిధుల కోసం సీడీలపై ఆధారపడడం పెరుగుతున్నట్టు వివరించింది. ఆర్బీఐ ఇప్పటికే రెండు విడతల్లో 0.90 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. దీంతో రుణాలపై, డిపాజిట్లపై తిరిగి రేట్ల పెరుగుదల ఆరంభమైంది. -
అమెరికాలో ఒత్తిళ్లు.. దేశీ ఫార్మాకు ధరల కష్టాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికా జనరిక్స్ మార్కెట్ నుంచి దేశీ ఫార్మా సంస్థలకు వచ్చే ఆదాయం ఒక మోస్తరుగానే వృద్ధి చెందనుంది. అక్కడి మార్కెట్లో ఔషధాల ధరలపరమైన ఒత్తిళ్లు నెలకొనడమే ఇందుకు కారణం కానుంది. రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఈ మేరకు అంచనాలు ప్రకటించింది. తాము పరిశీలించిన ఎనిమిది దిగ్గజ ఫార్మా కంపెనీలకు గత ఆర్థిక సంవత్సరంలో అమెరికా నుంచి వచ్చే ఆదాయాలు 0.2 శాతం మేర తగ్గినట్లు పేర్కొంది. ఉత్పత్తుల ధరలు గరిష్ట సింగిల్ డిజిట్ స్థాయి–కనిష్ట టీన్స్ (రెండంకెల) స్థాయిలో పడిపోవడం ఇందుకు కారణమని వివరించింది. గరిష్ట సింగిల్ డిజిట్ స్థాయిలో రేట్ల పతనం కొనసాగడం వల్ల సమీప భవిష్యత్తులోనూ ఆదాయాలపై ఒత్తిడి నెలకొనవచ్చని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ కింజల్ షా తెలిపారు. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో అమెరికా జనరిక్స్ మార్కెట్ నుంచి భారతీయ ఫార్మా కంపెనీలకు వచ్చే ఆదాయాలు ఒక మోస్తరుగానే వృద్ధి చెందే అవకాశం ఉందని వివరించారు. ఇతర వ్యయాల భారం.. ముడి వస్తువుల ధరలు, ప్యాకేజింగ్ వ్యయాలు, రవాణా వ్యయాలు భారీగా పెరగడం .. సరఫరాపరమైన అవాంతరాలు మొదలైన అంశాల కారణంగా మార్జిన్లపై పడే ప్రభావాన్ని కూడా నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని ఇక్రా పేర్కొంది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా 2021 ఆర్థిక సంవత్సరంలో కొత్త ఔషధాలకు అనుమతుల ప్రక్రియ వేగం మందగించిందని, 2022 ఆర్థిక సంవత్సరంలో ధరలపరమైన ఒత్తిళ్లు ఫార్మా కంపెనీల ఆదాయంపై ప్రభావం చూపాయని వివరించింది. అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ మళ్లీ ప్లాంట్ల తనిఖీలను మొదలుపెట్టే అవకాశం ఉందని పేర్కొంది. ఈమధ్య కాలంలో భారతీయ ఫార్మా కంపెనీలు చెప్పుకోతగ్గ స్థాయిలో చెల్లించి, లిటిగేషన్లను సెటిల్ చేసుకుంటూ ఉండటం కూడా వాటి ఆదాయాలపై ప్రభావం చూపుతోందని ఇక్రా వివరించింది. ఎఫ్‌డీఏ వంటి నియంత్రణ సంస్థలు, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) మొదలైనవి తరచుగా నిఘా పెట్టే రిస్కులు భారత ఫార్మా కంపెనీలకు ఉన్నట్లు పేర్కొంది. -
భారత్ మాల @ రూ.10.63 లక్షల కోట్లు
ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌మాలా (జాతీయ రహదారుల విస్తరణ) ప్రాజెక్టు తీవ్ర జాప్యాన్ని చూస్తోంది. ఈ ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు 23 శాతం పనులే కాగా, 2028 మార్చి నాటికి ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తవుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. వాస్తవానికి 2022 మార్చి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని భావించగా సాధ్యపడలేదు. ఆరేళ్లు ఆలస్యంగా, అది కూడా ముందు అంచనాలకు రెట్టింపు వెచ్చిస్తే కానీ ఈ ప్రాజెక్టు పూర్తి కాదని ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. అది కూడా ప్రస్తుత ధరల ప్రకారమే వ్యయాలు రెట్టింపు అవుతాయన్నది అంచనా. భూముల ధరలు, ఇన్పుట్ వ్యయాలను కూడా కలిపి చూస్తే ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి మరో 15–20 శాతం మేర వ్యయాలు పెరిగిపోవచ్చని ఇక్రా తన నివేదికలో తెలిపింది. భూ సమీకరణ పెద్ద సమస్యగా మారిందని పేర్కొంది. ప్రాజెక్టులో 60 శాతానికే అవార్డ్ భారత్‌మాలా ప్రాజెక్ట్ మొత్తం విస్తీర్ణం 34,800 కిలోమీటర్లు కాగా, ఇందులో 60 శాతానికే అంటే 20,632 కోట్ల మేర రహదారుల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఆర్డర్లు (2021 డిసెంబర్ నాటికి) ఇచ్చింది. భూ సమీకరణలో సమస్యలు, భూముల కొనుగోలు వ్యయాలు గణనీయంగా పెరిగిపోవడం, కరోనా మహమ్మారిని ప్రాజెక్టు జాప్యానికి కారణాలుగా ఇక్రా తెలియజేసింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) అదనపు రుణాల సమీకరణను పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. రహదారుల నిర్మాణానికి క్యాపిటల్ మార్కెట్లను ఆశ్రయిస్తామని, చిన్న ఇన్వెస్టర్లకు 8 శాతం వడ్డీని ఆఫర్ చేసి తగినన్ని నిధులను సమీకరిస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ గతవారమే ప్రకటించడం గమనార్హం. భారత్‌మాలా కింద పూర్తి విస్తీర్ణం మేరకు రహదారుల నిర్మాణ అవార్డులను జారీ చేయడం 2024 మార్చి నాటికి పూర్తవుతుందని ఇక్రా అంచాన వేస్తోంది. ఎన్నికల కారణంగా జాప్యం చోటు చేసుకుంటే ఇది 2025 మార్చి వరకు పట్టొచ్చని తెలిపింది. ఏటా 4,500–5,000 కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగితే 2028 మార్చి నాటికి మొత్తం ప్రాజెక్టు పూర్తవుతుందని పేర్కొంది. -
కోవిడ్ పూర్వ స్థాయికి అంతర్జాతీయ ప్రయాణికులు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ నుంచి విదేశీ రూట్లలో రాకపోకలు సాగించే అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య ఇది కోవిడ్ పూర్వ స్థాయిలో 96–97 శాతం స్థాయికి చేరవచ్చని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. 2022–23లో ఇది 32.9 కోట్లు – 33.2 కోట్ల స్థాయిలో ఉండవచ్చని పేర్కొంది. 2024 మార్చి ఆఖరు నాటికి అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ .. కోవిడ్ ముందు స్థాయిని దాటేయొచ్చని వివరించింది. కోవిడ్–19పరమైన ఆంక్షల నేపథ్యంలో దాదాపు రెండేళ్ల తర్వాత ఈ ఏడాది మార్చి 27 నుంచి అంతర్జాతీయ రూట్లలో పూర్తి స్థాయి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇక్రా అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మూడు నెలలుగా అప్.. అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సంఖ్య గత మూడు నెలలుగా క్రమంగా పెరుగుతోంది. జూన్ నెలలో కోవిడ్ పూర్వ స్థాయిలో 79 శాతానికి చేరింది. మొత్తం (దేశీ, అంతర్జాతీయ) విమాన ప్యాసింజర్ల సంఖ్య.. కోవిడ్ ముందు స్థాయిలో 88 శాతానికి పెరిగిందని ఇక్రా సీనియర్ అనలిస్ట్ అభిషేక్ లాహోటి తెలిపారు. పలు కీలక దేశాల్లో విమాన సేవలు తిరిగి ప్రారంభం కావడం, ప్రయాణాలపై ఆంక్షల తొలగింపు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు పూర్తి సామర్థ్యాలతో పనిచేస్తుండటం తదితర అంశాలు అంతర్జాతీయ ప్యాసింజర్ల ట్రాఫిక్ పెరగడానికి దోహదపడుతోందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, మే నెలతో పోలిస్తే జూన్‌లో దేశీయంగా విమాన ప్రయాణికుల రద్దీ కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే 98 శాతం నుంచి 91 శాతానికి తగ్గింది. వేసవి సెలవులు ముగియడం, పాఠశాలలు తెరుచుకోవడం, విహారయాత్రలు తగ్గడం వంటి అంశాలు ఇందుకు కారణమని లాహోటి వివరించారు.