
పెరుగుతున్న అప్‌గ్రేడ్‌లు
కనిష్ట స్థాయికి డౌన్‌గ్రేడ్‌లు
మున్ముందు మెరుగైన పరిస్థితి
రేటింగ్ ఏజెన్సీల వెల్లడి
న్యూఢిల్లీ: దేశీ కంపెనీల ఆర్థిక ఆరోగ్యం మెరుగుపడుతోంది. వాటి పరపతి రేటింగ్ బలపడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ కంపెనీల రేటింగ్‌లు అప్‌గ్రేడ్ కావడం దీన్ని తెలియజేస్తోంది. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా 2024–25 సంవత్సరంలో 301 కంపెనీల రేటింగ్‌లను అప్‌గ్రేడ్ (అప్పటి వరకు ఉన్న రేటింగ్ కంటే మెరుగైనది) చేయగా, 150 కంపెనీల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసినట్టు తెలిపింది.
కంపెనీల రుణ పరపతి మెరుగుపడడం వరుసగా నాలుగో ఏడాది కావడం గమనార్హం. ‘‘బ్యాలన్స్ షీట్ల బలోపేతం వల్ల భారత కంపెనీల క్రెడిట్ ప్రొఫైల్ మెరుగుపడడం సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. గత దశాబ్ద కాలంలో మేము విశ్లేషించిన 6,000 లిస్టెడ్, అన్ లిస్టెడ్ కంపెనీల నిర్వహణ లాభం ఏటా 12 శాతం చొప్పున కాంపౌండెడ్‌గా పెరిగింది. వాటి మొత్తం రుణం కేవలం 4 శాతమే పెరిగింది’’అని ఇక్రా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ రేటింగ్ ఆఫీసర్ కె.రవిచంద్రన్ తెలిపారు.
ఇక ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) సైతం 2024–25లో కార్పొరేట్ రుణ పరపతి మెరుగుపడినట్టు తెలిపింది. రేటింగ్‌ల డౌన్‌గ్రేడ్–అప్‌గ్రేడ్ నిష్పత్తి వరుసగా నాలుగో సంవత్సరంలోనూ చారిత్రక కనిష్ట స్థాయిలో ఉన్నట్టు ప్రకటించింది. 2023–24లో ఉన్న 0.37 నుంచి 0.28కి మెరుగుపడినట్టు వెల్లడించింది. ఇండియా రేటింగ్స్ గత ఆర్థిక సంవత్సరంలో 330 కంపెనీల ఇష్యూలకు రేటింగ్‌లను అప్‌గ్రేడ్ చేయగా, 94 డెట్ ఇష్యూల రేటింగ్‌లను డౌన్‌గ్రేడ్ చేసింది. బలమైన బ్యాలన్స్ షీట్ల కారణంగా కార్పొరేట్ కంపెనీలు రుణ పరపతి ప్రయోజనం పొందుతున్నట్టు ఇండియా రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అరవింద్ రావు తెలిపారు.
సానుకూల దృక్పథం
మరో ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ సైతం గత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల్లో 423 కంపెనీలకు రేటింగ్ అప్‌గ్రేడ్ ఇవ్వగా, 160 కంపెనీలకు డౌన్‌గ్రేడ్ ఇచ్చినట్టు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో క్రిసిల్ రేటింగ్స్ క్రెడిట్ రేషియో 2.75గా ఉంటే, ద్వితీయ ఆరు నెలల్లో 2.64 రెట్లకు తగ్గింది. భారత కంపెనీలకు సంబంధించి రుణ నాణ్యత పరంగా సానుకూల దృక్పథంతో ఉన్నట్టు తెలిపింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో డౌన్‌గ్రేడ్‌లను మించి అప్‌గ్రేడ్‌లు ఉంటాయన్న అంచనా వ్యక్తం చేసింది. ‘‘బడ్జెట్‌లో పన్ను తగ్గింపులు, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు పట్టణ వినియోగాన్ని పెంచనున్నాయి.
దీన్నుంచి కార్పొరేట్ ఇండియా ప్రయోజనం పొందుతుంది. ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై చేస్తున్న మూలధన వ్యయాలు అనుబంధ రంగాలపై ఎన్నో అంచల సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ ఎండీ సుబోధ్ రాయ్ వివరించారు. తాను రేటింగ్ ఇస్తున్న కంపెనీల మధ్యస్థ ఆదాయ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 8 శాతానికి పెరగొచ్చని క్రిసిల్ తెలిపింది. దేశీ డిమాండ్ బలోపేతంతో క్యాపిటల్ గూడ్స్, నిర్మాణ రంగం, రిటైల్ ఎక్కువగా ప్రయోజనం పొందుతాయని అంచనా వేసింది. అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానమైన రసాయనాలు, డైమండ్ పాలిషర్స్, ఆగ్రోకెమికల్స్ పనితీరును పరిశీలించాల్సి ఉందని పేర్కొంది.