
న్యూఢిల్లీ: దేశీ ఐటీ కంపెనీలు వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26) స్వల్ప వృద్ధికే పరిమితంకానున్నట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. వెరసి ఐటీ పరిశ్రమ ఆదాయం డాలర్ల రూపేణా 4–6 శాతం బలపడనున్నట్లు తాజాగా అంచనా వేసింది. వృద్ధి పుంజుకునేటంతవరకూ ఉద్యోగ కల్పన సైతం మందగించవచ్చని తెలియజేసింది. సమీప కాలంలో ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 12–13 శాతంగా నమోదుకావచ్చని అభిప్రాయపడింది.
దేశీ ఐటీ పరిశ్రమ ఆదాయంలో 60 శాతం ఆక్రమిస్తున్న దిగ్గజాలను పరిగణనలోకి తీసుకుని ఇక్రా తాజా అంచనాలకు తెరతీసింది. వచ్చే ఏడాది చివర్లో వృద్ధి ఊపందుకునేటంతవరకూ ఉపాధి కల్పన అంతంతమాత్రంగానే నమోదుకావచ్చని పేర్కొంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో డాలర్ల రూపేణా దేశీ ఐటీ పరిశ్రమ ఆదాయం 3.6 శాతం వృద్ధిని అందుకున్నట్లు ఇక్రా వెల్లడించింది. గత మూడు క్వార్టర్లుగా నెమ్మదిగా ప్రారంభమైన రికవరీ ఇందుకు సహకరించినట్లు తెలియజేసింది.
2023–24లో నమోదైన తక్కువ వృద్ధి(లోబేస్) సైతం ఇందుకు కారణమని తెలియజేసింది. అంతేకాకుండా కొన్ని మార్కెట్లలో బీఎఫ్‌ఎస్‌ఐ, రిటైల్ రంగాలలో కస్టమర్ల విచక్షణాధారిత వ్యయాలు స్వల్పంగా పెరగడం మద్దతిచి్చనట్లు పేర్కొంది. జనరేటివ్ ఏఐపై పెట్టుబడులు కొత్త ఆర్డర్లకు దారి చూపినట్లు వివరించింది. తాజా నివేదికకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, కోఫోర్జ్, సైయెంట్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్, బిర్లాసాఫ్ట్, మాస్టెక్, ఎంఫసిస్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, జెన్సార్ టెక్నాలజీస్‌ను పరిగణనలోకి తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment