next fiscal
-
ఔషధ సంస్థల ఆదాయ వృద్ధి 8–10 శాతం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఔషధ రంగంలోని టాప్–25 సంస్థల ఆదాయ వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8–10 శాతానికి పరిమితం అయ్యే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. ఇక్రా ప్రకారం.. భారతీయ మొత్తం ఔషధ పరిశ్రమలో 60 శాతం వాటా కలిగిన ఈ కంపెనీల ఆదాయం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 13–14 శాతం పెరిగింది. 2023–24 నాటి అధిక అమ్మకాలను అనుసరించి 2024–25లో యుఎస్ 8–10 శాతం, యూరప్ మార్కెట్ల నుండి 7–9 శాతం ఆదాయ వృద్ధి నమోదుకు ఆస్కారం ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇది యూఎస్ 18–20, యూరప్ 16–18 శాతం ఉండవచ్చు. దేశీయ మార్కెట్ 6–8 శాతం స్థిర వృద్ధిని చూడగలదు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు 2024–25లో 8–10 శాతం, 2023–24లో 16–18 శాతం పెరుగుదలను నమోదు చేయవచ్చు. పెరిగిన కొత్త ఉత్పత్తులు.. 2023–24లో పెరిగిన కొత్త ఉత్పత్తుల విడుదల, ఎంపిక చేసిన చికిత్స విభాగాల్లో ఉత్పత్తి కొరత, సంక్లిష్ట జనరిక్స్ ఆరోగ్యకర పనితీరు యూఎస్ విపణిలో టాప్–25 భారతీయ కంపెనీల ఆదాయ వృద్ధికి కారణం. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అధిక వృద్ధి ఉన్నప్పటికీ 2024–25లో వృద్ధి తగ్గుతుందని అంచనా. యుఎస్ మార్కెట్లో స్వల్ప ధరల ఒత్తిడి కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ, భారతీయ ఫార్మా సంస్థలు యుఎస్ మార్కెట్లోని కాంప్లెక్స్ జెనరిక్స్ నుండి తమ ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించాయి. గత సంవత్సరంలో భారతీయ ఔషధ సంస్థలకు యూఎస్ఎఫ్డీఏ జారీ చేసిన హెచ్చరిక లేఖలు, దిగుమతి హెచ్చరికల సంఖ్య పెరిగింది. దీంతో నూతన ఉత్పత్తుల విడుదలలో జాప్యానికి దారితీసింది. కన్సల్టెంట్లను నియమించుకోవడం, అదనపు వనరులను వినియోగించడం వంటి పరిష్కార చర్యలకు గణనీయంగా వ్యయ భారం పడుతోంది. తద్వారా లాభాల మార్జిన్లపై ప్రభావం చూపుతోంది. పొంచి ఉన్న ముప్పు.. కొనసాగుతున్న ఎర్ర సముద్ర సంక్షోభం ప్రస్తుతానికి భారతీయ ఔషధ కంపెనీలపై ప్రభావం చూపనప్పటికీ.. సరఫరా అంతరాయాలు, రవాణా వ్యయాల పెరుగుదల రూపంలో ఏదైనా ప్రతికూల ప్రభావం ఎదురైతే అవి కీలకంగా మారతాయి. ధరల పెరుగుదల కీలక ఆదాయ మార్గంగా ఉన్నందున జెనరిక్స్‌కు అనుకూలమైన ఏవైనా పరిణామాలు లేదా ముఖ్యమైన మందుల జాబితా (ఎన్ఎల్ఈఎం) కింద మరిన్ని ఉత్పత్తులను చేర్చినట్టయితే తయారీ సంస్థలకు నష్టాలు వాటిల్లే ముప్పు పొంచి ఉంది. -
ఐటీ ఆదాయాల్లో 3–5 శాతం వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 3–5 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రేటింగ్స్ తెలిపింది. ‘వృద్ధి వేగం పుంజుకునే వరకు ఈ రంగంలో నియామకాలు సమీప కాలంలో స్తబ్ధుగా ఉంటాయి. ఆదాయ వృద్ధిపై ఆందోళనల మధ్య కంపెనీల లాభదాయకత స్థితిస్థాపకంగా ఉంటుంది. 250 బిలియన్ డాలర్ల భారతీయ ఐటీ రంగానికి 2024–25లో నిర్వహణ లాభాల మార్జిన్లు 21–22 శాతానికి వస్తాయి. 2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో పరిశ్రమ కేవలం 2 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. వాస్తవానికి 3–5 శాతం ఆదాయ వృద్ధి ఉంటుందని పరిశ్రమ గతంలో అంచనా వేసింది. 2022–23 ఏప్రిల్–డిసెంబర్లో ఇది 9.2 శాతం సాధించింది. యూఎస్, యూరప్‌లోని కీలక మార్కెట్లలో స్థిర, స్థూల ఆర్థికపర ఎదురుగాలుల నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీలు ఐటీపై తక్కువ వ్యయం చేయడంతో 2024–25లో కూడా స్వల్ప ఆదాయ వృద్ధి అంచనాలకు దారితీసింది’ అని తెలిపింది. సగటు అట్రిషన్ 12–13 శాతం.. ‘క్లిష్ట వ్యయాలు, వ్యయ నియంత్రణ ఒప్పందాలు కొనసాగనున్నాయి. ఇది భారతీయ ఐటీ సేవల కంపెనీల వృద్ధి అవకాశాలకు కొంతవరకు మద్దతునిస్తుంది. బలమైన ఆర్డర్ బుక్స్, వివిధ దశల్లో ఉన్న డీల్స్.. స్థూల ఆర్థికపర ఎదురుగాలులు తగ్గిన తర్వాత ఊపందుకుంటాయి. కార్పొరేట్ సంస్థలకు మహమ్మారి తర్వాత మొత్తం మూలధన కేటాయింపులకు టెక్ ఖర్చులు మరింత సమగ్రంగా మారాయి. నియామక కార్యకలాపాలు స్తబ్ధుగా ఉంటాయని అంచనా వేస్తున్నప్పటికీ అట్రిషన్ స్థాయిలు సమీప కాలంలో స్థిరపడతాయి. -
హోటల్ పరిశ్రమలో కొనసాగనున్న జోరు
కోల్‌కతా: దేశ హోటల్ పరిశ్రమ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ మంచి వృద్ధిని చూడనుంది. 2024–25లో హోటల్ పరిశ్రమ ఆదాయం మొత్తం మీద 7–9 శాతం మధ్య పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దేశీయ విహార పర్యటనలు కొనసాగుతుండడం, సమావేశాలు, ప్రోత్సాహకాలు, సదస్సులు, ప్రదర్శనలనుకు (ఎంఐసీఈ) డిమాండ్ ఉండడం వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని ఇక్రా తెలిపింది. సాధారణ ఎన్నికల ప్రభావం స్వల్పకాలమేనని పేర్కొంది. హోటల్ పరిశ్రమ డిమాండ్‌లో ఆధాత్మిక పర్యాటకం, టైర్–2 సిటీలు కీలక చోదకంగా నిలుస్తాయని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హోటళ్లలో గదుల భర్తీ రేటు (ఆక్యుపెన్సీ) దశాబ్ద గరిష్టమైన 70–72 శాతానికి చేరుకుందని, 2022–23లో ఇది 68–70 శాతమే ఉన్నట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా హోటల్ గదుల రేట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున రూ.7,200–7,400 మధ్య ఉండొచ్చని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.7,800–8,000కు పెరగొచ్చని అంచనా వేసింది. దేశ ఆతిథ్య రంగంపై సానుకూల అవుట్‌లుక్‌ను ప్రకటించింది. -
సవాళ్లున్నా... 6.2 శాతం వృద్ధి!
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) 6.2 శాతం పురోగమిస్తుందని విదేశీ బ్రోకరేజ్ సంస్థ– యూబీఎస్ నివేదిక పేర్కొంది. విదేశీ ఒత్తిడులు, గృహ రుణ స్థాయిలు 15 సంవత్సరాల గరిష్ట స్థాయిలో (జీడీపీలో 5.8 శాతం) ఉన్నప్పటికీ సానుకూల పాలసీ విధానాలు, రుణ వృద్ధి, తగిన స్థాయిల్లో ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి స్థూల ఆర్థిక అంశాలు దేశం 2024–25లో 6.2 శాతం వృద్ధి బాటన నడవడానికి దోహదపడతాయని భావిస్తున్నట్లు నివేదిక ఆవిష్కరణ సందర్భంగా యుబీఎస్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ తన్వీ గుప్తా జైన్ పేర్కొన్నారు. నివేదికలోని అంశాల్లో కొన్ని... ► 2023–24లో 6.3 శాతం వృద్ధి అంచనా. 2024–25లో 6.2 శాతంగా ఉంటుందని విశ్వసిస్తున్నాం. వినియోగ రంగంలో వృద్ధి రేటు 4.5 శాతం నుంచి (2023–24 అంచనా), 4.7 శాతానికి మెరుగుపడే వీలుంది. ► వచ్చే ఆర్థిక సంవత్సరం మూలధన మరింత విస్తృత ప్రాతిపదికన మెరుగుపడే వీలుంది. ఎన్నికల ముందు నెమ్మదించే అవకాశం ఉన్న ఈ విభాగం, ఎన్నికల అనంతరం వేగం పుంజుకునే వీలుంది. ► 2025–26 నుంచి 2029–30 మధ్య వార్షికంగా భారత్ 6.5 శాతం పురోగమించవచ్చు. 2030లో దేశం 6 ట్రిలియన్ డాలర్ల ఎకనామీగా ఆవిర్భవించే అవకాశం ఉంది. ► డిజిటలైజేషన్, సేవల ఎగుమతుల పురోగతి, తయారీ రంగం పటిష్టత ఎకానమీకి దన్నుగా నిలుస్తాయి. ► 2024–25లో రుణ వృద్ధి 13 నుంచి 14 శాతం ఉండే వీలుంది. ► దేశంలో తిరిగి మోదీ ప్రభుత్వమే అధికారంలోని వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే రాజకీయ స్థిరత్వం విధాన నిర్ణయాల కొనసాగింపునకు తద్వారా వివిధ రంగాల పురోగతికి దోహదపడే అంశాలు. ► 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం సగటు 5.4 శాతం, 2024–25లో 4.8 శాతం నమోదయ్యే వీలుంది. సరఫరాల పరిస్థితి మెరుగుపడ్డం ఈ అంచనాలకు కారణం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశాల ప్రకారం– 4 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను చేరుకోడానికి దీర్ఘకాలం పట్టే వీలుంది. 4 ట్రిలియన్ డాలర్లకు ఎకానమీ: పీహెచ్‌డీసీసీఐ భారత్ ఎకానమీ విలువ 2024–25లో 4 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఇండస్ట్రీ చాంబర్ పీహెచ్‌డీసీసీఐ ఒక నివేదికలో పేర్కొంది. 2024–25లో ఈ విలువ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని విశ్లేíÙంచింది. 2024 ముగిసే సరికి ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ప్రస్తుతం 6.5 శాతం నుంచి 5.5 శాతం వరకూ తగ్గించే వీలుందని కూడా ఇండస్ట్రీ చాంబర్ విశ్లేíÙంచింది. అంతర్జాతీయ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంటూ దూసుకుపోతున్న భారత్– 2047 నాటికి ‘వికసిత భారత్ ఎకానమీ’ లక్ష్యాలను చేరుకోగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. 2024లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటు 4.5 శాతంగా ఉంటుందని అంచనావేసింది. వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్స్టైల్, దుస్తులు, ఫార్మాస్యూటికల్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎల్రక్టానిక్స్, ఫిన్‌టెక్ సహా వృద్ధికి ఆశాజనకంగా ఉన్న పలు రంగాలను కూడా ఇండస్ట్రీ సంస్థ గుర్తించింది. నాలుగు విభిన్న కాల వ్యవధులను విశ్లేషణకోసం పరిగణలోకి తీసుకోవడం జరిగింది. కరోనా ముందస్తు సంవత్సరాలు(2018, 2019), కరోనా పీడిత సంవత్సరాలు (2020, 2021), కరోనా తర్వాతి సంవత్సరాలు (2022,2023) భవిష్యత్ అవుట్‌లుక్ సంవత్సరాలుగా(2024,2025) వీటిని విభజించింది. ఈ నాలుగు కాలాల్లో లీడ్ ఎకనామిక్ ఇండికేటర్స్ ర్యాంకింగ్‌ను గమనించినట్లు ఇండస్ట్రీ బాడీ పీహెచ్‌డీసీసీఐ తెలిపింది. -
వచ్చే ఏడాదీ ట్రావెల్ కంపెనీలకు అనుకూలమే
ముంబై: పర్యాటక రంగం వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ మెరుగైన వృద్ధిని చూస్తుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 30 శాతం వృద్ధిని చూడనుండగా, వచ్చే ఏడాది దీనితో పోలిస్తే 12–14 శాతం వరకు వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనా 30 శాతం వృద్ధి అన్నది కరోనా ముందు నాటి గరిష్ట స్థాయితో పోలిస్తే 18 శాతం అధికమని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రావెల్ కంపెనీలు ప్రచారంపై ఎక్కువగా ఖర్చు చేసినప్పటికీ, వాటి నిర్వహణ మార్జిన్ ఆరోగ్యంగా 6.5 శాతానికి పైనే ఉంటుందని తెలిపింది. వ్యయాల నియంత్రణ, ఆటోమేషన్ చర్యలు ఇందుకు సహకరిస్తాయని పేర్కొంది. థామస్ కుక్, మేక్ మై ట్రిప్, యాత్రా, ఈజ్ మైట్రిప్ కంపెనీల గణాంకాల ఆధారంగా క్రిసిల్ ఈ నివేదికను రూపొందించింది. ట్రావెల్ రంగంలో 60 శాతం ఆదాయం ఈ నాలుగు కంపెనీలకే చెందుతుండడం గమనార్హం. విదేశీ ప్రయాణాలు పెరుగుతుండడం, చిన్న ప్రాంతాలకూ డిమాండ్‌లో వృద్ధి టూర్, ట్రావెల్ ఆపరేటర్ల వృద్ధికి సాయపడుతున్నట్టు క్రిసిల్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ తెలిపారు. ప్రభుత్వం టీసీఎస్ రేటు పెంచడం వల్ల పడే ప్రభావం స్వల్పమేనని, 80 శాతం ప్రయాణాల బిల్లు వ్యక్తిగతంగా రూ.7 లక్షల్లోపే ఉంటుందని ఆమె వెల్లడించారు. ఒక వ్యక్తి విదేశీ ప్రయాణాల కోసం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షలకు మించి వ్యయం చేస్తే వసూలు చేసే టీసీఎస్ రేటును 5 శాతం నుంచి కేంద్రం 20 శాతానికి పెంచడం గమనార్హం. -
వచ్చే ఏడాది ఫార్మా రంగం కళకళ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఔషధ పరిశ్రమ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6-8 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ‘విఘాతం కలిగించే అనేక సంఘటనలు ఉన్నప్పటికీ 2011-12 నుంచి 2021-22 మధ్య ఫార్మా రంగం 10.9 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 3-4 శాతానికి పరిమితం కానుంది. వృద్ధులు, జీవనశైలి/దీర్ఘకాలిక వ్యాధుల నిరంతర పెరుగుదల, జాతీయ జాబితాలోని అత్యవసర ఔషధాలకు (ఎన్ఎల్ఈఎం) టోకు ధరల ఆధారంగా ధరల పెంపు, కొత్త ఉత్పత్తుల విడుదల, ఎన్ఎల్ఈఎంయేతర ఔషధాలకు వార్షిక ధరల పెంపు వంటి నిర్మాణాత్మక అంశాలు పరిశ్రమ ఆదాయ వృద్ధికి తోడ్పడతాయి. 2017–18 నుండి ప్రతి ఆర్థిక సంవత్సరంలో పరిమాణ వృద్ధి 2-3 శాతం మధ్య ఉన్నప్పటికీ, ధరల పెరుగుదల, కొత్త ఉత్పత్తుల రాకతో ఔషధ రంగం జోరుకు మద్దతు లభించింది’ అని ఇక్రా తెలిపింది. (టాటా, మారుతి, హ్యుందాయ్: కారు ఏదైనా ఆఫర్మాత్రం భారీగానే!) కొత్త ఉత్పత్తులు, సిబ్బంది పెంపు.. ‘యాంటీ-ఇన్ఫెక్టివ్ల అధిక విక్రయాలు, ముడిసరుకు వ్యయాల ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు తీసుకున్న ధరల పెరుగుదలతో 2021-22లో మొత్తం ఫార్మా పరిశ్రమ వృద్ధి 14.6 శాతానికి చేరుకుంది. 2022-23 ఏప్రిల్-డిసెంబర్ కాలానికి పరిమాణం 1.2 శాతం తగ్గింది. కొత్త ఉత్పత్తుల పరిచయం, క్షేత్ర స్థాయిలో ఉద్యోగుల పెంపు దిశగా తీసుకుంటున్న చర్యలు ఫార్మా వృద్ధికి తోడ్పడతాయని కంపెనీలు భావిస్తున్నాయి. దేశీయ ఔషధ విపణిలో ఎన్ఎల్ఈఎం వాటా 17-18 శాతంగా ఉంది. కొన్ని కంపెనీలకు వీటి ద్వారా 30 శాతం వరకు ఆదాయం సమకూరుతోంది. పరిశ్రమలో అభివృద్ధి చెందుతున్న ధోరణులపరంగా ఈ-ఫార్మసీలు ఇటీవలి కాలంలో గణనీయమైన ఆకర్షణను పొందాయి. ప్రస్తుతం ఫార్మా రంగంలో వీటి వాటా 10-15 శాతం ఉంది’ అని ఇక్రా వివరించింది. (రూ. 32 వేల బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 1,999కే) -
మళ్లీ లాభాల్లోకి దేశీ ఎయిర్‌లైన్స్
ముంబై: కోవిడ్ మహమ్మారి ధాటికి కుదేలైన దేశీ విమానయాన సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మళ్లీ లాభాల బాట పట్టనున్నాయి. వ్యయాలపరమైన ఒత్తిళ్లు తగ్గడం, రుణభారాన్ని తగ్గించుకోవడం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఇచ్చిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఏవియేషన్ పరిశ్రమ ఈ ఆర్థిక సంవత్సరంలో తమ నష్టాల భారాన్ని 75–80 శాతం మేర రూ. 3,500–4,500 కోట్లకు తగ్గించుకోనున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఇది రూ. 17,500 కోట్లుగా నమోదైంది. ప్యాసింజర్ల ట్రాఫిక్ గణనీయంగా మెరుగుపడటం, వ్యయాలపరమైన ఒత్తిళ్లు తగ్గుతుండటం వంటివి ఎయిర్‌లైన్స్ నిర్వహణ పనితీరుపై సానుకూల ప్రభావం చూపుతున్నాయి. దేశీయంగా విమానయానంలో 75 శాతం వాటా ఉన్న మూడు పెద్ద ఎయిర్‌లైన్స్‌పై విశ్లేషణ ఆధారంగా క్రిసిల్ ఈ అంచనాలు రూపొందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ ట్రాఫిక్ .. కోవిడ్ పూర్వ స్థాయిని అధిగమించవచ్చని, చార్జీలు అప్పటితో పోలిస్తే 20–25 శాతం అధిక స్థాయిలో ఉండవచ్చని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ గౌతమ్ షాహి తెలిపారు. విమాన ఇంధన ధరలు సగటున తగ్గడం కూడా దీనికి తోడైతే ఎయిర్‌లైన్స్ నిర్వహణ పనితీరు మెరుగుపడి, అవి లాభాల్లోకి మళ్లగలవని ఆయన పేర్కొన్నారు. మరిన్ని కీలకాంశాలు.. ► 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే (కోవిడ్ పూర్వం) ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకూ 9 నెలల కాలంలో దేశీ, అంతర్జాతీయ ప్యాసింజర్ ట్రాఫిక్ వరుసగా 90 శాతం, 98 శాతానికి కోలుకుంది. ► అంతర్జాతీయ సర్వీసులను కూడా పునరుద్ధరించడంతో బిజినెస్, విహార ప్రయాణాలు సైతం పెరిగాయి. ద్వితీయార్ధంలో పండుగల సీజన్ కూడా వేగవంతమైన రికవరీకి ఊతమిచ్చింది. ► అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్నా భారత్ ఎదుర్కొని నిలబడుతున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరమూ ఇదే తీరు కొనసాగవచ్చని అంచనాలున్నాయి. ► చార్జీలపై పరిమితులను తొలగించడమనేది విమానయాన సంస్థలు తమ వ్యయాల భారాన్ని ప్రయాణికులకు బదలాయించేందుకు ఉపయోగపడుతోంది. ► ఏవియేషన్ రంగం వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 8,000–10,000 కోట్ల ఈక్విటీని సమకూర్చుకోనుంది. విమానాల సంఖ్యను పెంచుకునేందుకు, ప్రస్తుతమున్న వాటిని సరిచేసుకునేందుకు నిధులను వెచ్చించనుంది. ► నిర్వహణ పనితీరు మెరుగుపడటం, ఈక్విటీ నిధులను సమకూర్చుకోవడం వంటి అంశాల కారణంగా స్వల్ప–మధ్యకాలికంగా విమానయాన సంస్థలు రుణాలపై ఆధారపడటం తగ్గనుంది. ► బడా ఎయిర్‌లైన్‌ను (ఎయిరిండియా) ప్రైవేటీకరించిన నేపథ్యంలో రుణ భారం తగ్గి, ఫలితంగా వడ్డీ వ్యయాలూ తగ్గి పరిశ్రమ లాభదాయకత మెరుగుపడనుంది. ► అయితే, సమయానికి ఈక్విటీని సమకూర్చుకోవడం, విమానాల కొనుగోలు కోసం తీసుకునే రుణాలు, కొత్త వైరస్‌లేవైనా వచ్చి కోవిడ్–19 కేసులు మళ్లీ పెరగడం వంటి అంశాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. -
వచ్చే ఏడాదిలో ఎంజీ ఎలక్ట్రిక్ వెహికిల్, రేంజ్ ఎంతంటే..
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న ఎంజీ(Morris Garages) మోటార్ ఇండియా రూ.10–15 లక్షల్లో ఎలక్ట్రిక్ వెహికిల్‌ను ప్రవేశపెట్టనుంది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్న ఈ క్రాస్ఓవర్ భారత మార్కెట్‌కు తగ్గట్టుగా మార్పులు చెందనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం చివర్లో ఇది అందుబాటులోకి వస్తుందని కంపెనీ ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ ఛాబా తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో ఎంజీ జడ్ఎస్ ఈవీ రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఎక్స్‌షోరూంలో ధర రూ.21 లక్షల నుంచి ప్రారంభంగా తెలుస్తోంది. చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలకు స్టార్టప్‌ల జోరు! -
ఈ నెల 14 నుంచి బడ్జెట్ కసరత్తు
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ కసరత్తు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నది. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత రానున్న రెండో బడ్జెట్ ఇది. మరోవైపు ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే రెండో బడ్జెట్ కూడా ఇదే. బడ్జెట్ ముందస్తు/సవరించిన అంచనాల సమావేశాలు ఈ నెల 14 నుంచి మొదలవుతాయని ఆర్థిక వ్యవహారాల విభాగం వెలువరించిన బడ్జెట్ సర్క్యూలర్(2020–21) వెల్లడించింది. ఈ సమావేశాలకు అవసరమైన వివరాలను ఆర్థిక సలహాదారులందరూ అందజేయాల్సి ఉందని ఈ సర్క్యూలర్ పేర్కొంది. వచ్చే నెల మొదటివారం వరకూ ఈ సమావేశాలు కొనసాగుతాయని పేర్కొంది. కొత్త అంశాలు.... వచ్చే ఏడాది బడ్జెట్లో కొత్తగా ఎస్సీ సబ్ ప్లాన్, ట్రైబల్ సబ్‌ప్లాన్, లింగ, చిన్న పిల్లల బడ్జెట్ స్టేట్మెంట్స్ కూడా చేర్చనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ఈ బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. -
నాస్కామ్ అంచనాలపై ట్రంప్ ఎఫెక్ట్
ఐటి పరిశ్రమ యొక్క అత్యున్నత కమిటీ నాస్కామ్ తొలిసారి వెనకడుగు వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ పరిశ్రమపై అంచనాలపై దూరంగా జరిగింది. నాస్కామ్ ఏర్పాటైన 25 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అమెరికా, యూరప్ లో రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో 2018 ఆర్థిక సంవత్సర అంచనాలపై ప్రధానంగా సాఫ్ట్వేర్ ఎగుమతులపై ఆధారపడే ఐటీ పరిశ్రమ మందగింపు ప్రభావంతో ఈ వైఖరి తీసుకుంది. నాస్కామ్ ఇండియా లీడర్ షిప్ ఫోరం వార్షిక సమావేశాల సందర్బంగా మీడియాతో మాట్లాడిన నాస్కామ్ ఈ వ్యాఖ్యలు చేసింది. పరిశ్రమలో తాత్కాలికంగా పరిస్థితి అనిశ్చితంగా ఉందని పేర్కొంది. తమ నిపుణుల గణాంకాలు ఆధారంగా 6-10 శాతం వృద్ధి సలహా ఇచ్చినప్పటికీ వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్టు చెప్పారు. మరో క్వార్టర్ వరకు తమ గైడెన్స్ అంచనాలను వాయిదా వేసుకున్నట్టు నాస్కాం ఛైర్మన్ సీపీ గుర్నాని తెలిపారు. అనేక అనిశ్చితుల నేపథ్యంలో ఐటీ పరిశ్రమ ప్రభావితమైనట్టు తెలిపారు. ఈ క్రమంలో తరువాతి త్రైమాసికంలో మాత్రమే అంచనాలను అందివ్వగలమని చెప్పారు. వినియోగదారులు, ఇతర వాటాదరారులతో లోతుగా చర్చించిన అనంతరం అపూర్వమైన నిర్ణయం తీసుకున్నట్టు నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ చెప్పారు. ఐటీ, బిజనెస్ ప్రాసెస్ మేనేజ్ మెంట్ సెక్టార్ల తరువాతి త్రైమాసికానికి సంబంధించిన అంచనాలను బహుశా మే నెలలో అందిస్తామన్నారు. సాంకేతిక రంగంలో జరుగుతున్న డిజిటల్ వార్ కారణంగా ఐటీ సెక్టార్ నైపుణ్యతలను పెంచుకోవాలని చెప్పారు. సుమారు 1.5 కోట్ల ఉద్యోగులకి తదుపరి రెండు మూడు సంవత్సరాల్లో నైపుణ్యత శిక్షణ కావాలన్నారు. మరోవైపు 2017 ఆర్థిక సంవత్సరానికి ఐటీ పరిశ్రమ వృద్ధి8.6 శాతం ఉండనుందని అంచనా. దీనిలో 12-15 శాతం ఐటి రంగంలో చోటుచేసుకోనున్న డిజిటల్ రంగానిదేనని విశ్లేషించారు. కాగా ఐటీ పరిశ్రమ గైడెన్స్‌పై 10-12 శాతంగా నిర్ణయించిన నాస్కామ్ తన అంచనాలను గత డిసెంబర్లో సవరించిన సంగతి తెలిసిందే.