నాస్కామ్ అంచనాలపై ట్రంప్ ఎఫెక్ట్
ఐటి పరిశ్రమ యొక్క అత్యున్నత కమిటీ నాస్కామ్ తొలిసారి వెనకడుగు వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ పరిశ్రమపై అంచనాలపై దూరంగా జరిగింది. నాస్కామ్ ఏర్పాటైన 25 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అమెరికా, యూరప్ లో రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో 2018 ఆర్థిక సంవత్సర అంచనాలపై ప్రధానంగా సాఫ్ట్వేర్ ఎగుమతులపై ఆధారపడే ఐటీ పరిశ్రమ మందగింపు ప్రభావంతో ఈ వైఖరి తీసుకుంది. నాస్కామ్ ఇండియా లీడర్ షిప్ ఫోరం వార్షిక సమావేశాల సందర్బంగా మీడియాతో మాట్లాడిన నాస్కామ్ ఈ వ్యాఖ్యలు చేసింది. పరిశ్రమలో తాత్కాలికంగా పరిస్థితి అనిశ్చితంగా ఉందని పేర్కొంది.
తమ నిపుణుల గణాంకాలు ఆధారంగా 6-10 శాతం వృద్ధి సలహా ఇచ్చినప్పటికీ వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్టు చెప్పారు. మరో క్వార్టర్ వరకు తమ గైడెన్స్ అంచనాలను వాయిదా వేసుకున్నట్టు నాస్కాం ఛైర్మన్ సీపీ గుర్నాని తెలిపారు. అనేక అనిశ్చితుల నేపథ్యంలో ఐటీ పరిశ్రమ ప్రభావితమైనట్టు తెలిపారు. ఈ క్రమంలో తరువాతి త్రైమాసికంలో మాత్రమే అంచనాలను అందివ్వగలమని చెప్పారు.
వినియోగదారులు, ఇతర వాటాదరారులతో లోతుగా చర్చించిన అనంతరం అపూర్వమైన నిర్ణయం తీసుకున్నట్టు నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ చెప్పారు. ఐటీ, బిజనెస్ ప్రాసెస్ మేనేజ్ మెంట్ సెక్టార్ల తరువాతి త్రైమాసికానికి సంబంధించిన అంచనాలను బహుశా మే నెలలో అందిస్తామన్నారు. సాంకేతిక రంగంలో జరుగుతున్న డిజిటల్ వార్ కారణంగా ఐటీ సెక్టార్ నైపుణ్యతలను పెంచుకోవాలని చెప్పారు. సుమారు 1.5 కోట్ల ఉద్యోగులకి తదుపరి రెండు మూడు సంవత్సరాల్లో నైపుణ్యత శిక్షణ కావాలన్నారు.
మరోవైపు 2017 ఆర్థిక సంవత్సరానికి ఐటీ పరిశ్రమ వృద్ధి8.6 శాతం ఉండనుందని అంచనా. దీనిలో 12-15 శాతం ఐటి రంగంలో చోటుచేసుకోనున్న డిజిటల్ రంగానిదేనని విశ్లేషించారు. కాగా ఐటీ పరిశ్రమ గైడెన్స్‌పై 10-12 శాతంగా నిర్ణయించిన నాస్కామ్ తన అంచనాలను గత డిసెంబర్‌లో సవరించిన సంగతి తెలిసిందే.