దేశీ ఐటీ వృద్ధిపై నిస్పృహ చెందనక్కర్లేదు
నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ శివేంద్ర సింగ్
న్యూఢిల్లీ: హెచ్–1బీ వీసా వర్కర్లంటే అమెరికా ఉద్యోగుల స్థానాన్ని ఆక్రమించే చౌక కార్మికులని, అక్కడి వేతనాల స్థాయిని కుదించేస్తారనేది అపోహ మాత్రమేనని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ శివేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. అమెరికా ఎకానమీ వృద్ధిలో భారతదేశం, భారతీయ నిపుణులు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో దేశీ ఐటీ వృద్ధిపై నిస్పృహకు లోను కావాల్సిన అవసరమేమీ లేదని ఆయన పేర్కొన్నారు.
అమెరికా కొత్త అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ విధానాలపైన, 250 బిలియన్ డాలర్ల భారతీయ ఐటీ పరిశ్రమ మీద వాటి ప్రభావాలపైన అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికాలో పరిణామాలేమీ భారత ఐటీ పరిశ్రమ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపబోవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
హెచ్–1బీ వీసాలనేవి నాన్–ఇమిగ్రెంట్ వీసాలే కావడం వల్ల వివాదాస్పద వలసల సమస్యకు, వాటికి సంబంధమేమీ లేదని పేర్కొన్నారు. హెచ్–1బీ వీసాల్లో 70 శాతం వీసాలు భారతీయులకే లభిస్తుండటమనేది మన నైపుణ్యాలకు నెలకొన్న డిమాండ్‌కి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో కొత్త ప్రభుత్వం వృద్ధి సాధనపై దృష్టి పెట్టడమనేది ఇరు దేశాలు కలిసి పని చేసేందుకు మరింతగా అవకాశాలను కల్పించగలదని సింగ్ చెప్పారు. భారతీయ కంపెనీలు అమెరికాలో అక్కడివారికి నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు 1.1 బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేశాయని సింగ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment