ఆ వార్తల్లో నిజం లేదు.. మణిరత్నం సినిమాలు భద్రపరుస్తాం
‘దళపతి’ (1991), ‘రోజా’ (1992), బొంబాయి (1995), ‘యువ’ (2004).. ఇలా ఎన్నో అద్భుత చిత్రాలను అందించారు దర్శకుడు మణిరత్నం. ఇప్పటివరకూ ఆయన 26 సినిమాలు తీశారు. వాటిలో ‘క్లాసిక్’ అనదగ్గవి చాలా ఉన్నాయి. ఆ క్లాసిక్స్‌ని భద్రపరిచే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయం గురించి ఈ ప్రాజెక్ట్‌తో అసోసియేట్ అయిన శివేంద్ర సింగ్ మాట్లాడుతూ– ‘‘క్లాసిక్ సినిమాలను ఇప్పటి సాంకేతికతో భద్రపరచడం, మెరుగులు దిద్దడం వంటి అంశాలపై 2017లో చెన్నైలో వర్క్‌షాప్ చేశాం.
అప్పుడు మణిరత్నంతో మాట్లాడాను. ఆయన సినిమాల్లో కొన్ని ప్రింట్స్, నెగటివ్స్ మెరుగైన స్థితిలో లేవు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘దళపతి’, ‘రోజా’, ‘బొంబాయి’ వంటి ఆణిముత్యాలను ‘ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్’ (ఎఫ్‌హెచ్‌ఎఫ్)లో ఎలా భద్రపరుస్తామో వివరించాం. మణిరత్నం సానుకూలంగా స్పందించారు. సినిమాలను 8కె రిజల్యూషన్‌లో భద్రపరుస్తాం. ఇప్పుడు అందరూ 4కె రిజల్యూషన్‌ను మాత్రమే వినియోగిస్తున్నారు. పాత ప్రింట్స్, నెగటివ్‌లను జాగ్రత్తగా డీల్ చేస్తున్నాం. ఈ డిజిటలైజేషన్ ప్రాసెస్‌లో ప్రసాద్ కార్పొరేషన్ సహకారం ఉంది. అలాగే మేం ఒక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ కోసం ఇలా చేస్తున్నామని వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని పేర్కొన్నారు.