
2025–26లో టెక్నాలజీ రంగంపై నాస్కామ్ అంచనా
ఈసారి 5.1 శాతం వృద్ధితో 283 బిలియన్ డాలర్లకు చేరిక
ఆశావహంగా నియామకాలు
ముంబై: దేశీ టెక్నాలజీ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.1 శాతం వృద్ధితో సుమారు 283 బిలియన్ డాలర్లకు చేరనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇది 300 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. దేశీయ ఐటీ సేవలు, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ కంపెనీలు మొదలైన సంస్థల సమాఖ్య నాస్కామ్ ఈ విషయాలు వెల్లడించింది. ఆదాయ వృద్ధి సరైన దిశలోనే ఉందని నాస్కామ్ ప్రెసిడెంట్ రాజేశ్ నంబియార్ తెలిపారు.
పరిశ్రమ 2023–24లో 4 శాతంగా, 2024–25లో 5.1 శాతంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.1 శాతంగాను వృద్ధి చెందగలదని చెప్పారు. చుట్టూరా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా టారిఫ్‌ల వడ్డన వంటి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న తరుణంలోనూ పరిశ్రమ మెరుగ్గా రాణిస్తోందని వివరించారు. 2025 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1.26 లక్షల ఉద్యోగాల కల్పనతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 58 లక్షలకు చేరిందని, తదుపరి ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే స్థాయిలో నియామకాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నామని నంబియార్ వివరించారు.
ఐటీ ఆదాయం 4.3 శాతం అప్..
2025 ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలను విభాగాలవారీగా చూస్తే ఐటీ సేవల కంపెనీల ఆదాయాలు 4.3 శాతం వృద్ధితో 137.1 బిలియన్ డాలర్లకు, బీపీఎం పరిశ్రమ 4.7 శాతం వృద్ధితో 55.6 బిలియన్ డాలర్లకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇక ఇంజినీరింగ్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ రంగం అత్యంత వేగంగా 7 శాతం స్థాయిలో పెరిగి 55.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
అనూహ్యంగా అమెరికా..
దేశీ ఐటీ రంగానికి అమెరికాలో పరిస్థితులు అనూహ్యంగా ఉండొచ్చని నంబియార్ చెప్పారు. భారత ఐటీ పరిశ్రమ ఆదాయాల్లో అమెరికా వాటా 60–62 శాతం ఉంటుంది కాబట్టి, టారిఫ్‌ల బెదిరింపులనేవి పరిశ్రమకు అతి పెద్ద ముప్పని ఆయన పేర్కొన్నారు. నాస్కామ్ వార్షిక ఎన్‌టీఎల్‌ఎఫ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా నంబియార్ ఈ విషయాలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల గురించి భారతీయ ఐటీ రంగం ఆందోళన చెందనక్కర్లేదని ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్ చెప్పారు. ఒకవేళ ట్రంప్ ప్రభుత్వం తీసుకునే చర్యలతో అమెరికన్ కంపెనీలు లాభపడితే, క్లయింట్లు బలోపేతం కావడం వల్ల భారతీయ ఐటీ కంపెనీలకు కూడా లబ్ధి చేకూరుతుందని వివరించారు. అమెరికాలోని సిబ్బంది సంఖ్యలో స్థానిక ఉద్యోగుల సంఖ్యను 60 శాతానికి పెంచుకోవడంలాంటి చర్యలతో గత కొన్నాళ్లుగా అమెరికాలో వ్యాపారాన్ని బలోపేతం చేసుకున్న నేపథ్యంలో హెచ్–1బీ వీసాలపై ఆధారపడే పరిస్థితి తగ్గిందని పరేఖ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment