Technology Sector
-
సైన్స్ వర్క్ ఫోర్స్ పెరిగేదెలా?
సాక్షి, అమరావతి : భారతదేశంలో సైన్స్ వర్క్ ఫోర్స్ తక్కువగా ఉన్నట్టు తేలింది. లింగ వివక్ష, భౌగోళిక పరిమితులు, చేసిన కోర్సుకు సరిపోయే పని లేకపోవడం వంటి కారణాలతో దేశ సైంటిఫిక్ టాలెంట్ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడం లేదు. దాంతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో నైపుణ్యం కలిగిన వారి కొరత ఉండటంతో ఆయా ఖాళీలు అలాగే ఉన్నాయని గుర్తించారు. ఇటీవల ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నైపుణ్యం గలవారి సరఫరా, ఉద్యోగ డిమాండ్ల మధ్య అసమతుల్యత, లింగ బేధం మహిళలను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని ఆ సంస్థ పేర్కొంది. దీంతో మహిళలు చాలా మంది తాము ఇష్టపడి ఎంచుకున్న రంగాల్లోనూ పూర్తి కాలం పని చేయకుండానే వెనుదిరుగుతున్నట్టు తేలింది.కెరీర్ వదిలేసిన తర్వాత రీ–ఎంట్రీపై సరైన అవగాహన లేకపోవడంతో గ్యాప్ ఉత్పన్నమవుతోందని నివేదిక పేర్కొంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులు చేసి, శిక్షణ పొందిన చాలా మంది తమ నైపుణ్యానికి సరిపడే ఉద్యోగాలు చేయడం లేదని ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్స్ గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, ఇంజినీరింగ్ వంటి రంగాల్లో 52 శాతం మంది మహిళలు ఉన్నారు. వీరిలో సగం మందికి పైగా 30 ఏళ్లలోపు వారే ఉన్నారని, అయితే పనిచేసే చోట వయసు ఆధారిత పక్షపాతం చూపడంతో 40 సంవత్సరాలకే 80 శాతం మంది కెరీర్‌ను వదులుకుంటున్నారని అధ్యయనంలో తేలింది. దేశంలో పరిశోధన– అభివృద్ధి (ఆర్ అండ్ డీ) రంగంలో సరఫరా డిమాండ్ మధ్య కూడా ఇదే వ్యత్యాసం కనిపిస్తోందని, నిపుణులు పెరుగుతున్నప్పటికీ అవకాశాలు తక్కువగా ఉన్నట్టు ఐఐటీ రోపాపర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నేహా సర్దానా పేర్కొన్నారు. విద్యా సంస్థలు, పరిశ్రమ అవసరాల మధ్య సమన్వయం లేకపోవడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్టు అభిప్రాయపడ్డారు. స్కిల్ ఉన్నా రీ ఎంట్రీపై అవగాహన లేమి సైన్స్ రంగంలో ఉపాధి అవకాశాలు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా లేవని, భౌగోళికంగా అసమానతలు ఉన్నట్టు సర్వేలో గుర్తించారు. ఇది చాలా మంది నిపుణుల ఎంపికలను పరిమితం చేస్తోందని, ఆర్థిక లేదా కుటుంబ కారణాలతో మెట్రోపాలిటన్ ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారని గుర్తించారు. దీంతో నైపుణ్యం గల సైన్స్ అండ్ టెక్నాలజీ నిపుణుల సేవలను పెద్ద మొత్తంలో ఉపయోగించుకోలేకపోతున్నారు. కెరీర్లో విరామం తీసుకున్న నిపుణులకు అందుబాటులో ఉన్న రీ–ఎంట్రీ స్కీమ్‌లు, సపోర్ట్ ప్రోగ్రామ్‌లపై కూడా అవగాహన లేదని తేల్చారు.ఐఐటీ–బొంబాయిలోని సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మాజీ సీఈవో పోయిని భట్ మాట్లాడుతూ.. వర్క్‌ఫోర్స్‌లోకి తిరిగి ప్రవేశించే మహిళలకు కొన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పారు. పని చేయించుకుంటున్న సంస్థలు లేదా కంపెనీలు మహిళలకు చైల్డ్ కేర్ సపోర్ట్ ఇవ్వాలని, పనిలో ఫ్లెక్సిబుల్ అవర్స్‌ని కల్పించాలన్నారు. ఇది నైపుణ్యం గల మహిళలు కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే తమ కెరీర్‌ను కొనసాగించేందుకు వీలు కల్పిస్తుందని తెలిపారు. భారత సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం మహిళా శాస్త్రవేత్తల రీ ఎంట్రీకి ‘వైజ్ కిరణ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టినా, దీని గురించి పెద్దగా ఎవరికీ తెలియదని సర్వే వెల్లడించింది. ప్రపంచ సగటు కంటే చాలా తక్కువ ⇒ భారతదేశంలో పరిశోధన అభివృద్ధి (ఆర్ అండ్ డీ) విభాగంలో పనిచేసే వర్క్‌ఫోర్స్ ప్రపంచ సగటు కంటే చాల తక్కువగా ఉన్నట్టు సర్వే తేల్చింది. ఈ రంగంలో ప్రపంచ సగటు ప్రతి పది లక్షల మందిలో 1,198 మంది పని చేస్తుండగా, భారత్‌లో మాత్రం 255 మందే ఉన్నట్టు ప్రకటించింది. ⇒ వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం 2024 నివేదిక ప్రకారం భారత్‌లో జెండర్ గ్యాప్ గతేడాది కంటే పెరిగినట్టు పేర్కొంది. ప్రపంచంలో 146 దేశాల్లో చేసిన సర్వే ప్రకారం 2023లో ప్రపంచంలో భారత్ 127 స్థానంలో ఉండగా, గతేడాది ఈ ర్యాంకు 129కి చేరింది. ⇒ ర్యాంకింగ్‌లో మాల్దీవులు, పాకిస్థాన్ కంటే భారత్ కాస్త ముందుంది. ఈ గ్యాప్ తగ్గించాలంటే సౌకర్యవంతమైన పని ప్రదేశం, పార్ట్–టైమ్ అవకాశాలు, రిమోట్ విధానంలో పని చేసే అవకాశం కల్పించాలని శివ్ నాడార్ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ రూపమంజరి ఘోష్ తెలిపారు. ఈ విధానం ద్వారా మరింత మంది మహిళలు సైన్స్ వర్క్ ఫోర్స్‌లోకి వచ్చేందుకు అవకాశం లభిస్తుందన్నారు. వర్క్‌ఫోర్స్ నుంచి విరామం తీసుకుని, తిరిగి పనిలోకి వచ్చే మహిళలపై చిన్నచూపు ఉందని, ఇది తొలగి పోవాలన్నారు. ⇒ విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య భాగస్వామ్యం.. నైపుణ్యాల మధ్య అంతరాన్ని తగ్గిస్తుందని, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా స్కిల్స్ పెంచవచ్చని ఘోష్ చెప్పారు. అలాగే, ఉద్యోగాల పదోన్నతుల్లో ‘బయోలాజికల్ ఏజ్’ కంటే ‘విద్యా వయస్సు’ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా నైపుణ్యం గల సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. -
కొలువులకు కొత్త టెక్నాలజీల దన్ను
ముంబై: కొత్త సాంకేతికతల దన్నుతో దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం నూతన సంవత్సరంలోనూ జోరుగా వృద్ధి బాటలో ముందుకు సాగనుంది. 2025లో కొత్త ఉద్యోగాల కల్పన 20 శాతం పెరగనుంది. మానవ వనరుల సేవల సంస్థ ఫస్ట్‌మెరీడియన్ బిజినెస్ సర్వీసెస్ సీఈవో (ఐటీ స్టాఫింగ్) సునీల్ నెహ్రా ఈ విషయాలు తెలిపారు. డిజిటల్ పరివర్తన వేగవంతం కావడం, కొత్త సాంకేతికతల్లో నైపుణ్యాలున్న వారికి డిమాండ్ పెరగడం వంటి అంశాల కారణంగా 2024లో దేశీ ఐటీ, టెక్ రంగాల్లో కొత్త ఉద్యోగావకాశాలు 17 శాతం పెరిగినట్లు చెప్పారు.కొత్త సంవత్సరంలోనూ పరిశ్రమ వృద్ధి మరింత పుంజుకోగలదని పేర్కొన్నారు. అప్లికేషన్ డెవలపర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డెవాప్స్ ఇంజినీర్లు, ఏఐ, ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో నిపుణులకు ఉద్యోగావకాశాలు బాగుంటాయని నెహ్రా చెప్పారు. 2024లో ప్రధాన ట్రెండ్‌గా నిల్చిన కృత్రిమ మేథ (ఏఐ) 2025లో కూడా మరింత వేగవంతమవుతుందన్నారు. డేటా అనలిస్టులు, డేటా ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు తదితర నిపుణులకు డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు. జెన్–ఏఐలో పది లక్షల అవకాశాలు.. 2028 నాటికి జెనరేటివ్ ఏఐ (జెన్–ఏఐ) పరిశ్రమలో 10 లక్షలకు పైగా కొత్త కొలువులు వస్తాయని, స్థూల దేశీయోత్పత్తి వృద్ధికి ఇది గణనీయంగా తోడ్పడగలదని నెహ్రా తెలిపారు. జెనరేటివ్ ఏఐ ఇంజినీర్, అల్గోరిథం ఇంజినీర్, ఏఐ సెక్యూరిటీ స్పెషలిస్ట్ వంటి ఉద్యోగాలకు వేతనాలు గణనీయంగా పెరగవచ్చని పేర్కొన్నారు. మిడ్–లెవెల్ ఉద్యోగులకు వేతన వృద్ధి 25–30 శాతం శ్రేణిలో ఉంటుందని వివరించారు.వ్యాపారాలు వృద్ధి చెందుతూ, కొత్త ఆవిష్కరణలు చేసే కొద్దీ నూతన ప్రాజెక్టుల కోసం హైరింగ్ చేసుకోవడం, డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకోవడం, సాంకేతిక పురోగతులను అందిపుచ్చుకునేందుకు పోటీపడటం మొదలైన ధోరణులు పెరుగుతాయని తెలిపారు. 2018–19 నుంచి 2023–24 మధ్య కాలంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్‌లో (జీసీసీ) 6,00,000 ఉద్యోగాలు వచ్చినట్లు నెహ్రా చెప్పారు. 2030 నాటికి ఈ నిపుణుల సంఖ్య 25 లక్షల నుంచి 28 లక్షల వరకు పెరుగుతుందన్నారు. మరిన్ని విశేషాలు.. ⇒ 2025లో బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఇన్సూరెన్స్), టెలికం వంటి టెక్‌యేతర రంగాల్లో కూడా ఐటీ/టెక్నాలజీ నిపుణుల నియామకాలు పెరుగుతాయి. మధ్య స్థాయి నుంచి భారీ స్థాయి సంస్థల వరకు చాలా మటుకు కంపెనీలు తమ ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు కేటాయించే బడ్జెట్లు సగటున 15–20 శాతం వరకు పెంచే అవకాశం ఉంది. అంతేగాకుండా ఉద్యోగులు సైతం కొత్త తరం టెక్ కొలువులకు కావాల్సిన నైపుణ్యాలను సాధించేందుకు తమంతట తాముగా కూడా చొరవ తీసుకుంటారు. ⇒ దేశీ ఐటీలో తాత్కాలిక ఉద్యోగుల సంఖ్య మూడు రెట్లు పెరిగి 2030 నాటికి 2.4 కోట్ల స్థాయికి చేరుతుంది. టెక్నాలజీ రంగంలో ఎప్పటికప్పుడు మారిపోతున్న అవసరాలను పరిష్కరించుకునేందుకు, కావాల్సినప్పుడు అందుబాటులో ఉండే వర్కర్లపై ఆధారపడే ధోరణి పెరుగుతుండటం ఇందుకు కారణం. ⇒ భారతీయ ఐటీ రంగం చాలా మటుకు స్థిరపడినప్పటికీ, ఇంకా కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఏఐ, సైబర్‌సెక్యూరిటీ వంటి వర్ధమాన రంగాల్లో నిపుణుల కొరత ఉంటోంది. అలాగే, అంతర్జాతీయంగా ఆర్థిక అస్థిరత ప్రభావం కూడా మన ఐటీ రంగంపై పడతోంది. ⇒ డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియాలాంటి కార్యక్రమాలు ప్రయోజనకరంగానే ఉంటున్నాయి. కానీ, వ్యయాలపరంగా ఒత్తిళ్లు పెరుగుతున్న తరుణంలో ఉద్యోగులకి కొత్త నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు, కస్టమర్లకు మరింత విలువైన సేవలు అందించేందుకు వినూత్న వ్యూహాలు అవసరమవుతాయి. సాంకేతిక పరివర్తనకు సంబంధించి మరింతగా ముందుకెళ్లేందుకు ఇవి కీలకంగా ఉంటాయి. -
అగ్రగామిగా హైదరాబాద్.. సహకరించండి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక రంగంలో హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏఐ, జెన్ (జెనరేటివ్) ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ తదితరాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని, ఈ నేపథ్యంలో వివిధ సాంకేతిక అవసరాలకు అనుగుణంగా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. సీఎం సోమవారం.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి బంజారాహిల్స్‌లోని సత్య నాదెళ్ల నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలపై చర్చించారు. రీజినల్ రింగు రోడ్డు, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, కొత్తగా మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరించారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు అమలు చేస్తున్న ప్రణాళికలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్య శిక్షణ వంటి అంశాలను వివరించారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులను పెంచడంపై రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. నైపుణ్యాభివృద్ధితో టాప్ ఫిఫ్టీకి: సత్య నాదెళ్ల తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటామని సత్య నాదెళ్ల ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు తగిన రీతిలో మౌలిక సదుపాయాలు మెరుగు పరిచే అంశంలో ముఖ్యమంత్రి దార్శనికతను ఆయన ప్రశంసించారు. నైపుణ్యాభివృద్ధి, మెరుగైన మౌలిక వసతులే ఆర్థికాభివృద్ధికి దోహద పడతాయని, హైదరాబాద్‌ను ప్రపంచంలోని 50 అగ్రశ్రేణి నగరాల జాబితాలో చేర్చుతాయని చెప్పారు. హైదరాబాద్‌లో ఏర్పాటైన తొలి సాంకేతిక సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం ఇక్కడ పది వేల మందికి ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడి పెట్టామని గుర్తుచేశారు. సీఎస్ శాంతికుమారి, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. ఆర్ అండ్ డీ సెంటర్ ఏర్పాటు చేయండి: శ్రీధర్‌బాబు సీఎం భేటీ అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సత్య నాదెళ్లతో సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ఇటీవల కొత్తగా మరో 4వేల ఉద్యోగాల కల్పనకు మైక్రోసాఫ్ట్ ముందుకు రావడంపై మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. చందనవెల్లిలో రెండు, మేకగూడ, షాద్‌నగర్‌లో ఒక్కో సెంటర్ చొప్పున మొత్తంగా 600 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల ఏర్పాటును స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఫ్యూచర్ సిటీలో భాగంగా నిర్మించే ఏఐ సిటీలో ‘ఏఐ సాంకేతికత’కు సంబంధించి ప్రత్యేక పరిశోధన, అభివృద్ధి కేంద్రం (ఆర్ అండ్ డీ), ప్రొడక్ట్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఏఐ, జెన్ ఏఐ కోర్సుల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వాలని శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. -
చిప్ చిప్ హుర్రే
అడవుల సంరక్షణ కోసం చేసిన ‘చిప్కో’ ఉద్యమం గురించి విన్నాం... అయితే ఇప్పుడు టెక్నాలజీ రంగంలో భారత్‌ను పవర్‌హౌస్‌గా నిలిపేలా మరో ‘చిప్’కో ఉద్యమం నడుస్తోంది. దేశాన్ని సెమీకండక్టర్స్ శకంలోకి నడిపించేందుకు అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు పారిశ్రామిక అగ్రగాములు రంగంలోకి దూకడంతో ప్రపంచ దిగ్గజాలన్నీ భారత్‌లో చిప్స్ తయారీకి సై అంటున్నాయి. టాటా నుంచి అదానీ వరకు టాప్ కార్పొరేట్ గ్రూప్‌లన్నీ సెమీకండక్టర్ ఉద్యమంలో తలమునకలయ్యాయి. అమెరికా దిగ్గజం మైక్రాన్ నుండి తొలి మేక్ ఇన్ ఇండియా చిప్ కొత్త ఏడాది ఆరంభంలోనే సాక్షాత్కరించనుంది. ఈ భారీ ప్రణాళికల నేపథ్యంలో కొంగొత్త కొలువులకు ద్వారాలు తెరుచుకున్నాయి. రాబోయే రెండేళ్లలో ఏకంగా 10 లక్షల ‘చిప్’ జాబ్స్ సాకారమవుతాయనేది విశ్లేషకుల అంచనా!నిర్మాణంలో ఉన్న చిప్ ప్లాంట్లు...మైక్రాన్ టెక్నాలజీస్ఎక్కడ: గుజరాత్–సాణంద్ మొత్తం పెట్టుబడి: 2.75 బిలియన్ డాలర్లు. తొలి దశ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. 2025 నాటికి ఈ ప్లాంట్ నుంచి తొలి మేక్ ఇన్ ఇండియా చిప్ కల సాకారం కానుంది.టీటీపీఎల్–పీఎస్ఎంసీ ఎక్కడ: గుజరాత్–ధోలేరా మొత్తం పెట్టుబడి: రూ. 91,000 కోట్లు. తైవాన్‌కు చెందిన చిప్ తయారీ దిగ్గజం పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కార్ప్ (పీఎస్ఎంసీ) భాగస్వామ్యంతో టాటా ఎల్రక్టానిక్స్ (టీఈపీఎల్) ఈ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్‌ను నిర్మిస్తోంది. అదానీ–టవర్ (ఐఎస్ఎం ఆమోదం లభించాల్సి ఉంది)ఎక్కడ: పన్వేల్–మహారాష్ట్ర మొత్తం పెట్టుబడి: రూ.84,000 కోట్లుఇజ్రాయెల్ చిప్ తయారీ సంస్థ టవర్ సెమీకండక్ట్టర్, అదానీ భాగస్వామ్యంతో దీన్ని నెలకొల్పనుంది. టీశాట్ ఎక్కడ: అస్సాం–మోరిగావ్ మొత్తం పెట్టుబడి: రూ.27,000 కోట్లు. టాటా సెమీకండక్టర్ అసెంబ్లీ్ల అండ్ టెస్ట్ (టీశాట్) ఈ చిప్ ఏటీఎంపీ యూనిట్‌ను నెలకొల్పుతోంది. అత్యాధునిక స్వదేశీ సెమీకండక్టర్ ప్యాకేజింగ్ టెక్నాలజీలను టీశాట్ అభివృద్ధి చేస్తోంది.కేన్స్ సెమికాన్ ఎక్కడ: గుజరాత్–సాణంద్ మొత్తం పెట్టుబడి: రూ. 3,307 కోట్లు. మైసూరుకు చెందిన ఈ కంపెనీ రోజుకు 63 లక్షల చిప్‌ల తయారీ సామర్థ్యం గల ఓశాట్ (అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్) యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది.సీజీ పవర్, రెనెసాస్ ఎల్రక్టానిక్స్, స్టార్స్ మైక్రోఎల్రక్టానిక్స్ఎక్కడ: గుజరాత్–సాణంద్ మొత్తం పెట్టుబడి: రూ.7,600 కోట్లు. జపాన్‌కు చెందిన రెనెసాస్, థాయ్‌లాండ్ సంస్థ స్టార్స్ భాగస్వామ్యంతో సీజీ పవర్ ఈ చిప్ ఏటీఎంపీ యూనిట్‌ను నెలకొల్పుతోంది.భారత్‌ను సెమీకండక్టర్ తయారీ హబ్‌గా మార్చేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలతో విదేశీ చిప్ దిగ్గజాలు దేశంలో ల్యాండవుతున్నాయి. దేశీ కంపెనీలతో జట్టుకట్టి ఇప్పటికే భారీ పెట్టుబడులను కూడా ప్రకటించాయి. గుజరాత్ అయితే దేశంలో ప్రత్యేక సెమీకండక్టర్ పాలసీ తీసుకొచి్చన తొలి రాష్ట్రంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ స్కీమ్ ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)లో ప్రకటించిన రూ.76,000 కోట్ల ప్రోత్సాహకాల చలవతో ఇప్పటికే రూ.1.52 లక్షల కోట్ల విలువైన 5 భారీ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాయి. దీంతో చిప్ డిజైన్ నుంచి ఫ్యాబ్రికేషన్ వరకు పలు ప్రాజెక్టుల నిర్మాణ పనులు జోరందుకున్నాయి.ఈ స్కీమ్ ద్వారా కంపెనీల ప్రాజెక్ట్ వ్యయంలో కేంద్రం 50 శాతం సబ్సిడీ అందిస్తోంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక సదుపాయాలు కలి్పస్తున్నాయి. కాగా, మరో 20కి పైగా ప్రాజెక్టు ప్రతిపాదనలు కేంద్రం పరిశీలనలో ఉన్నాయి. దీంతో రెండు మూడు నెలల్లోనే మరింత భారీ స్థాయిలో ఐఎస్ఎం 2.0 స్కీమ్‌ను ప్రకటించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం దేశంలో 5,000కు పైగా కంపెనీలు సెమీకండక్టర్ పరిశ్రమ పరిధిలో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ డేటా క్లౌడ్ సంస్థ చెబుతోంది.ఇందులో ప్రత్యక్ష చిప్ తయారీ సంస్థలు, పరికర (కాంపొనెంట్) ఉత్పత్తిదారులతో పాటు ఎల్రక్టానిక్స్ డిజైన్, తయారీ, డి్రస్టిబ్యూషన్ డిస్ప్లే డిజైన్, ఎల్రక్టానిక్స్, ఇన్నోవేషన్ ఇలా మొత్తం సమగ్ర వ్యవస్థ (ఎకో సిస్టమ్)కు సంబంధించిన కంపెనీలు పాలు పంచుకుంటున్నాయి. 2023–24లో భారత్ దిగుమతి చేసుకున్న సెమీకండక్టర్ల విలువ అక్షరాలా 33.9 బిలియన్ డాలర్లు. 2030 నాటికి ఈ డిమాండ్ 148 బిలియన్ డాలర్లకు ఎగబాకుతుందనేది నోమురా అంచనా. ఇక చిప్ డిజైన్ జోరు.. త్వరలో కేంద్రం ప్రకటించనున్న సెమికాన్ 2.0 స్కీమ్‌లో చిప్ డిజైనింగ్‌తో పాటు సెమికండక్టర్ పరిశ్రమ ఎకో సిస్టమ్ వృద్ధికి పెద్ద పీట వేయనుంది. దిగ్గజ సంస్థలకూ ప్రాజెక్టుల వ్యయంలో సబ్సిడీ అందించే అవకాశముంది. ప్రస్తుత స్కీ మ్ (రూ.1,000 కోట్లు) చిప్ డిజైన్ స్టార్టప్‌లకు మాత్రమే 50 శాతం సబ్సిడీ (రూ.15 కోట్ల పరిమితితో) అమలవుతోంది. తదుపరి స్కీమ్‌లో ఈ పరిమితి పెంపుతో పాటు బడా కంపెనీలకూ వర్తింపజేయనున్నట్లు సమాచారం. ఎల్అండ్టీ సెమీకండక్టర్ టెక్నాలజీస్, క్వాల్కామ్, మీడియాటెక్, ఎన్ఎక్స్పీ వంటి కంపెనీలు రెడీగా ఉన్నాయి. అయితే, చిప్ మేధోసంపత్తి హక్కులు (ఐపీ) భారత్‌లోనే ఉండేలా షరతు విధించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.నిపుణులకు ‘చిప్’కార్పెట్! భారత్‌ను సెమీకండక్టర్ పవర్‌హౌస్‌గా తీర్చిదిద్దాలంటే నిపుణులైన సిబ్బందే కీలకం. అందుకే అటు ప్రభుత్వం, ఇటు పరిశ్రమవర్గాలు ఈ రంగంలో నైపుణ్యాలు పెంచేపనిలో పడ్డాయి. ఎన్ఎల్బీ సరీ్వసెస్ డేటా ప్రకారం 2026 నాటికి భారత సెమీకండక్టర్ పరిశ్రమ 10 లక్షల కొత్త కొలువులను సృష్టించనుందని అంచనా. ఇందులో చిప్ ఫ్యాబ్రికేషన్‌లో 3 లక్షలు, అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ (ఏటీఎంపీ)లో 2 లక్షల జాబ్స్ లభించనున్నాయి.ఇంకా చిప్ డిజైన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సిస్టమ్ సర్క్యూట్స్, తయారీ సరఫరా వ్యవస్థ నిర్వహణ తదితర రంగాల్లో దండిగా ఉద్యోగాలు రానున్నట్లు ఎన్ఎల్బీ నివేదిక పేర్కొంది. ‘సెమీకండక్టర్ పరిశ్రమకు అవసరమైన సిబ్బందిని అందించడంలో రీస్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. భారీ డిమాండ్‌ను తీర్చాలంటే కనీసం ఏటా 5 లక్షల నిపుణులను పరిశ్రమకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది’ అని ఎన్ఎల్బీ సరీ్వసెస్ సీఈఓ సచిన్ అలుగ్ అభిప్రాయపడ్డారు.ప్రధానంగా ప్రొక్యూర్మెంట్, క్వాలిటీ కంట్రోల్, మెటీరియల్ ఇంజనీరింగ్ వంటి విభాగాల్లో ఇంజనీర్లు, ఆపరేటర్లు, టెక్నీషియన్లు, స్పెషలిస్టులకు ఫుల్ డిమాండ్ ఉంది. కొన్ని చిప్ తయారీ కంపెనీలు ఇప్పటికే నైపుణ్యాభివృద్ధి చర్యలు మొదలుపెట్టాయి. ఏఎండీ, మైక్రాన్ ఇండియా, ఎల్ఏఎం రీసెర్చ్ తదితర కంపెనీలు కొత్త నియామకాల కోసం టెక్నికల్ బూట్క్యాంపులు, యూనివర్సిటీల్లో రీసెర్చ్ ల్యాబ్‌ల ఏర్పాటు, మెంటార్షిప్ అవకాశాల కల్పనకు నడుంబిగించాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఐటీలో మేటిగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్ : కొత్తగా దూసుకువస్తున్న కృత్రిమ మేథస్సు (ఏఐ టెక్నాలజీ)తో పాటు ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆధారంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలుపుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. ఐటీ ఉత్పత్తులు, ఎగుమతుల్లో బెంగళూరు చాలా ముందంజలో ఉందని, ఇతర రాష్ట్రాలు కూడా ఎమర్జింగ్ టెక్నాలజీ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు పోటీ పడుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఏఐ సాంకేతికత ద్వారా భారీ ముందడుగు వేసి ఐటీ రంగంలో బెంగళూరును అధిగమించే దిశగా ప్రయత్నాలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఏఐ టెక్నాలజీ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలు, వాణిజ్యం పెంచే దిశగా ప్రభుత్వం రోడ్ మ్యాప్ రూపొందిస్తోందని తెలిపారు. ఏఐ టెక్నాలజీని ప్రోత్సహించే ప్రణాళికలో భాగంగా ఏఐ సిటీ నిర్మిస్తామని, రాష్ట్ర అభివృద్ధిని పదింతలు పెంచుతామని చెప్పారు.గురు, శుక్రవారాల్లో రెండురోజుల పాటు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ) వేదికగా ‘తెలంగాణ గ్లోబల్ ఏఐ సమ్మిట్’(అంతర్జాతీయ ఏఐ సదస్సు)ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్‌బాబు ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. బహుముఖ లక్ష్యంతో.. ఐటీ రంగంలో కొత్తగా వస్తున్న ఏఐ టెక్నాలజీ ఫలితాలు, వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించడం సహా బహుముఖ లక్ష్యంతో నాస్కామ్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఏఐ ద్వారా భవిష్యత్తులో ఐటీ రంగంలో కొత్తగా భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. అదే సమయంలో ఇది కోడింగ్, అల్గారిథమ్స్ ఆధారిత ఉద్యోగాలు చేస్తున్న ఐటీ నిపుణుల ఉద్యోగ భద్రతకు కూడా సవాలు విసరనుంది. ఈ నేపథ్యంలో ఏఐ నిపుణులను తయారు చేసేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడానికి అనుసరించాల్సిన విధానాలపై సదస్సులో చర్చిస్తాం. వాణిజ్యం, వ్యాపార రంగాల్లో ఏఐ ఆధారిత అభివృద్ధి, ఉత్పాదకత పెంచడం తదితరాలపై సదస్సులో పాల్గొనే నిపుణులు సూచనలు చేస్తారు. ఏఐ టెక్నాలజీ రెండంచుల కత్తిలాంటిదనే ఆందోళన నేపథ్యంలో నైతిక మార్గంలో ఏఐ సాంకేతికత వినియోగం, ప్రభుత్వ నియంత్రణ తదితర అంశాలపై కూడా చర్చ జరుగుతుంది. ఏఐ పాలసీ రూపకల్పన కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో సదస్సులో పాల్గొనే నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటాం. తెలంగాణను ‘ఏఐ క్యాపిటల్’గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ సదస్సు జరుగుతోంది. ఉత్పాదకత పెంపునకు ఏఐ వినియోగం వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగంలో ఉత్పాదకత పెంచడం లక్ష్యంగా ఏఐ వినియోగం పెంచాలని భావిస్తున్నాం. పరిశ్రమల ఆటోమేషన్, మెరుగైన నాణ్యత, యంత్రాల మెయింటినెన్స్, మార్కెటింగ్, మెరుగైన విద్యుత్ వినియోగం వంటి అంశాల్లో ఏఐ టెక్నాలజీ ఉపయోగించేలా ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం. వ్యవసాయంలో ఎరువులు, నీళ్లు, తెగుళ్లు, పంట నూరి్పళ్లు సమర్ధవంతంగా జరిగేలా చూడటం, కూలీల కొరతను అధిగమించడం వంటి సవాళ్ల పరిష్కారంపై ఇప్పటికే పలు ఏఐ ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాయి. వైద్య రంగంలో రోబోటిక్ సర్జరీలు, చికిత్సలు, రోగ నిర్ధారణ సమర్ధవంతంగా చేయడం సాధ్యమవుతోంది. విద్యారంగంలోనూ ఏఐ సాంకేతికతతో బహుళ లాభాలు ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ఏఐ ఆధారిత శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంటర్ స్థాయిలో ఏఐ! సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా ఎనలిటిక్స్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీ ఆధారిత ఉత్పత్తులు, సేవలు అందుబాటులోకి తెచ్చేలా పరిశోధనలు, అభివృద్ధి కార్యకలాపాలు జరుగుతున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు జూనియర్ కాలేజీ స్థాయి నుంచి కరిక్యులమ్‌లో ఏఐ పాఠ్యాంశాలను చేర్చడంపై సదస్సులో చర్చిస్తాం. బెంగళూరు తరహాలో ఇక్కడి ఏఐ హబ్ నుంచి యూనికార్న్‌లు (బిలియన్ డాలర్ల వ్యాపారం చేసే సంస్థలు) పుట్టుకొచ్చే వాతావరణం కల్పిస్తాం. త్వరలో ఎస్ఎంఎస్ఈ, లైఫ్ సైన్సెస్ పాలసీలను కూడా ఆవిష్కరిస్తాం. -
సైన్స్, టెక్నాలజీలో మహిళా గ్రాడ్యుయేట్లు పెరగాలి
న్యూఢిల్లీ: దేశీయంగా టెక్నాలజీ రంగంలో లింగ అసమానతలు గణనీయంగా ఉంటున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఈషా అంబానీ తెలిపారు. మహిళలంటే ఉపాధ్యాయ వృత్తిలాంటివి మాత్రమే చేయగలరంటూ స్థిరపడిపోయిన అభిప్రాయాలే ఇందుకు కారణమని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా టెక్నాలజీ రంగంలో మహిళల వాటా 36 శాతమే ఉండగా, స్టెమ్ గ్రాడ్యుయేట్స్‌లో 43 శాతం, మొత్తం సైంటిస్టులు, ఇంజినీర్లు, టెక్నాలజిస్టుల్లో 14 శాతం మాత్రమే ఉందని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ విభాగాల్లో మహిళా గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని ’ గాల్స్ ఇన్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) డే’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈషా తెలిపారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో పరిస్థితిని సరిదిద్దుకునే అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకోవాలని ఆమె పేర్కొన్నారు. -
ఇస్రో సేవలు అద్భుతం
సాక్షి, న్యూఢిల్లీ: శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇస్రో అద్భుతమైన సేవలందిస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మార్గాని భరత్‌రామ్ కొనియాడారు. అంతరిక్ష రంగంలో మహిళల ప్రమేయం పెరిగేలా ప్రోత్సహించాల ని కేంద్రాన్ని కోరారు. లోక్‌సభలో గురువారం చంద్రయాన్–3 విజయంపై జరిగిన చర్చలో ఎంపీలు ఇరువురూ మాట్లాడారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ఇంతటి గొప్ప పరిశోధనలు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి జరగటం తెలుగువారికి గర్వకారణమన్నారు. చంద్రయాన్ ప్రయోగంలో భాగస్వాములైన మెజారిటీ శాస్త్రవేత్తలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలల నుంచి రావ డం గొప్ప విషయమని చెప్పారు. యూనివర్సిటీలకు రాష్ట్రీయ య ఉచ్చతర్ శిక్షా అభియాన్(రూసా)కింద గత నాలుగైదు సంవత్సరాలుగా ఏటా రూ.8,120 కోట్ల నిధులు కేటాయిస్తున్నా వినియోగం 60 శాతం కూడా ఉండటంలేదని వివరించారు. వర్సిటీలు ఈ నిధులు వాడుకునేలా వెసులుబాటు కల్పించాల్సి ఉందన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని మెరుగుపరచాల్సిఉందని సూచించారు. ఎంపీ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ.. అంతరిక్ష రంగంలో మన శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడా రు. దేశమంతా చంద్రయాన్–3 విజయాన్ని కొనియాడుతుంటే టీడీపీ మాత్రం మాజీ సీఎం చంద్రబాబు గురించి మాట్లాడుతోందని ఎద్దే వా చేశారు. రూ.3,300 కోట్ల కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్టయ్యారన్నారు. చంద్రబాబు చేసిన ఇతర కుంభకోణాలు సైతం త్వరలో బయటపడతాయన్నారు. చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ల్యాండయినప్పుడు తన ఆరేళ్ల కుమార్తె ‘నాన్నా చంద్రుడి మీద అడుగుపెట్టాం’ అంటూ ఎంతో సంబరపడిందని, ‘మనం ఎప్పుడు చంద్రుడి మీద కు వెళ్తాం అమ్మా?’ అని తన తల్లిని అడగడం తనని ఎంతో సంతోషానికి గురిచేసిందన్నారు. చంద్రయాన్–3 విజయంపై ఇస్రో బృందం, ప్రధాని నరేంద్రమోదీకి భరత్ కృతజ్ఞతలు తెలిపారు. -
అవకాశాలను సృష్టించుకోవాలి!
‘డ్రీమ్ బిగ్, ఫాలో యువర్ పాషన్, వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్’... నాలుగు మాటలు. ఈ నాలుగు మాటలే వీణాగుండవెల్లిని విజేతగా నిలబెట్టాయి. ‘ఇలా ముందుకెళ్లమని నాకెవ్వరూ చెప్పలేదు. స్వీయశోధన తో తెలుసుకున్న సత్యాలివి. కొత్తతరానికి నేను చెప్పగలిగిన సూచన ఇది. నేను ఆచరించిన మార్గమే నా సందేశం’ అన్నారామె. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చేసిన వీణ ఆ తర్వాత యూఎస్ వెళ్లి శాంటాక్లారా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. యూఎస్‌లోని సిలికాన్ వ్యాలీ కేంద్రంగా ఇమాజియా సాఫ్ట్వేర్ కంపెనీని నిర్వహిస్తున్న వీణ ఇటీవల హైదరాబాద్‌కి వచ్చినప్పుడు సాంకేతిక రంగంలో విజయవంతమైన తన జర్నీని ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘యూఎస్‌లో నేను కానన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, సిస్కో సిస్టమ్స్‌లో పని చేసిన తర్వాత టెక్నాలజీ రంగంలో సొంత కంపెనీ ప్రారంభించాను. ఇంటర్నెట్ మొదలైన రోజులు, అలాగే వైటూకే క్రైసిస్ ఎదురైన రోజులు కూడా. ఆ సమస్యలను అధిగమిస్తూ ఇంటర్నెట్ ఆధారిత ఫైనాన్స్ అప్లికేషన్స్ సర్వీసులందించింది మా సంస్థ. ఈ టెక్నాలజీకి భవిష్యత్తు ఉందని నమ్మాను, నా నమ్మకమే పునాదిగా ముందుకెళ్లాను. ఒక దశ తరవాత కంపెనీ కార్యకలాపా లను విస్తరించాలనే ఉద్దేశంతో వెంచర్ క్యాపిటల్ ద్వారా ఫండ్ రైజింగ్ మొదలుపెట్టాను. మా కంపెనీ సేవల పట్ల నమ్మకం కలిగినప్పటికీ పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందడుగు వేయలేక΄ోయారు. అందుకు కారణం మహిళను కావడమే. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను కాన్ఫిడెంట్‌గా ముందుకెళ్తున్నాను. ఆ మేరకు పెట్టుబడి పెట్టేవాళ్లలో విశ్వాసం కలిగించడం కొంచెం కష్టమైందనే చెప్పాలి. కష్టం అని వదిలిన వాళ్ల వెంట సక్సెస్ రాదు. కష్టాన్ని జయించడమే విజయానికి తొలిమెట్టు. మొత్తానికి నాకున్న సాంకేతిక పరిజ్ఞానం పట్ల విశ్వాసం కలిగిన తరవాత పెట్టుబడులు పెట్టారు. కానీ ఆ తర్వాత ‘మీ కంపెనీలో మా ప్రతినిధి సీఈవో హోదాలో ఉంటారు. మీరు టెక్నాలజీ పా ర్ట్ చూసుకోండి’ అన్నారు. ఆ షరతును అంగీకరించాల్సి వచ్చింది. కానీ ఆ ప్రయత్నం విజయవంతం కాలేదు. టాప్‌లో ఉన్న మా కంపెనీ ఒడిదొడుకులకు లోనయింది. తిరిగి టాప్‌లో నిలపడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ముందుచూపు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వినియోగం ఇప్పుడు బాగా ఎక్కువైంది. మేము 2015లోప్రోడక్ట్ బిల్డ్ చేశాం. సాంకేతిక రంగానికి ఏఐని పరిచయం చేశామని చెప్పాలి. ఆ తర్వాత మూడేళ్లకు కృత్రిమ మేధ ఆధారిత ఆర్థిక సహకారాన్ని డిజిటల్‌గా అందించడం మొదలుపెట్టాం. మరో రెండేళ్లలో ఫైనాన్షియల్ డాక్యుమెంట్లను చదివి, ప్రాజెస్ చేయగలిగిన తొలి ఏఐ ఇంజన్‌ను తీసుకొచ్చాం. ఈ రంగంలో మేమిచ్చిన డైరెక్షన్‌ను ముందుచూపున్న కంపెనీలు అందుకున్నాయి. మేము ఏఐ ఆధారిత డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం. ఆర్థిక లావాదేవీలు వేగంగా జరుగుతుంటే వ్యాపా రం కూడా అంతే వేగంగా జరుగుతుంది. ఓటూసీ (ఆర్డర్ టూ కస్టమర్) ్రపా సెస్‌ని మా కంపెనీ చేస్తుంది. తొంభై దేశాల్లో, 25 భాషల్లో మా సేవలందింస్తున్నాం. భవిష్యత్తు దర్శనం విజేత కావాలంటే భవిష్యత్తును దర్శించగలగాలి. ఆలోచనను ఆచరణలో పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకూడదు. అలాగే అవకాశాలను అందిపుచ్చుకోవడమనేది పా త మాట. అవకాశాలను సృష్టించుకోవాలనేది ఈ జనరేషన్ అనుసరించాల్సిన ఫార్ములా. హెన్రీ ఫోర్డ్ ఒక ఇంజనీర్‌గా మిగిలిపోలేదు. తన ఆలోచనతో రవాణాకు యంత్రంతో నడిచే కారు అనే వాహనానికి రూపకల్పన చేసి పా రిశ్రామికవేత్త అయ్యాడు. గుర్రం మీద ప్రయాణించే కాలాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. మన ఆలోచన సమాజానికంటే ముందుండాలి. అది శతాబ్దం కావచ్చు, దశాబ్దం కావచ్చు. ఆ సమయానికి సమాజం మన ఆలోచనను స్వాగతించవచ్చు లేదా విమర్శించనూ వచ్చు. కానీ దానిని నిరూపించిన తరవాత మన వెంట నడిచి తీరుతుంది’’ అన్నారు వీణా గుండవెల్లి. ఆమె తన విజయాలనే పా ఠ్యాంశాలుగా కాలిఫోర్నియా యూనివర్సిటీలో బోధిస్తున్నారు. అల్పాదాయ వర్గాల వారికి సహాయం చేయడానికి టచ్ ఏ లైఫ్ పేరుతో ఒక ఫౌండేషన్ ద్వారా సేవలందిస్తున్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ, సామాజిక ప్రయోజనం చేకూరే స్టార్టప్‌లతో ముందుకు వచ్చే యువతకు చేయూతనిస్తున్నారు. ఈ ప్రయాణంలో ఆమెను వరించిన అవార్డుల ప్రస్తావనకు ఆమె ‘ఎన్నని చెప్పాలి, అయినా ఆ లెక్క ఇప్పుడెందుకు’ అన్నారు నవ్వుతూ. – వాకా మంజులారెడ్డి -
వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు
వాషింగ్టన్: ఆర్థిక సంక్షోభ భయాలతో అమెరికాలో టెక్ కంపెనీలు హెచ్–1బీ వీసాదారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న తరుణంలో వారి జీవితభాగస్వామి అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చని అమెరికా న్యాయమూర్తి ఒకరు తీర్పు చెప్పారు. దీంతో అమెరికాలో టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలు పోయి ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటున్న వేలాది మంది భారతీయ టెకీలకు పెద్ద ఊరట లభించినట్లయింది. అమెరికాలో ప్రత్యేక ఉపాధి, నైపుణ్య వృత్తుల్లోకి తీసుకునేందుకు అక్కడి కంపెనీలు నాన్ ఇమిగ్రెంట్ హెచ్–1బీ వీసాలతో భారత్‌వంటి దేశాలకు చెందిన విదేశీ నిపుణులకు కొలువులు కల్పిస్తున్న విషయం విదితమే. అయితే ఇలా ఏటా వేలాదిగా తరలివస్తున్న హెచ్–1బీ వీసాదారులు, వారి భాగస్వాముల కారణంగా స్థానిక అమెరికన్లు ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే సంస్థ వాషింగ్టన్‌లోని జిల్లా కోర్టులో దావా వేసింది. హెచ్–1బీ వీసాదారుల జీవితభాగస్వాములూ జాబ్ కార్డ్ సాధించి ఉద్యోగాలు చేసేందుకు వీలు కల్పిస్తున్న ఒబామా కాలంనాటి నిబంధనలను కొట్టేయాలని సంస్థ కోరింది. ఈ దావాను అమెజాన్, ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బడా కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇప్పటికే అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ వీసాదారుల దాదాపు లక్ష మంది జీవితభాగస్వాములకు పని చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ కేసును మార్చి 28వ తేదీన జిల్లా మహిళా జడ్జి తాన్య చుత్కాన్ విచారించారు. ‘అమెరికా ప్రభుత్వం పూర్తి బాధ్యతతోనే వారికి వర్క్ పర్మిట్ ఇచ్చింది. వీరితోపాటే వేర్వేరు కేటగిరీల వారికీ తగు అనుమతులు ఇచ్చింది. విద్య కోసం వచ్చే వారికి, వారి జీవిత భాగస్వామికి, వారిపై ఆధారపడిన వారికి హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఉపాధి అనుమతులు కల్పించింది. విదేశీ ప్రభుత్వాధికారులు, అంతర్జాతీయ సంస్థల అధికారులు, ఉద్యోగుల జీవితభాగస్వాములకూ అనుమతులు ఉన్నాయి’ అంటూ సేవ్ జాబ్స్ యూఎస్ఏ పిటిషన్‌ను జడ్జి కొట్టేశారు. అయితే తీర్పును ఎగువ కోర్టులో సవాల్ చేస్తామని సంస్థ తెలిపింది. అభినందనీయం ‘ఉద్యోగాలు పోయి కష్టాల్లో ఉన్న హెచ్–1బీ హోల్డర్ల కుటుంబాలకు ఈ తీర్పు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. వలసదారుల హక్కుల సమానత్వ వ్యవస్థ సాధనకు ఇది ముందడుగు’ అని వలసదారుల హక్కులపై పోరాడే భారతీయ మూలాలున్న అమెరికా న్యాయవాది అజయ్ భుటోరియా వ్యాఖ్యానించారు. గత ఏడాది నవంబర్ నుంచి చూస్తే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్‌సహా అమెరికాలోని చాలా ఐటీ కంపెనీలు దాదాపు 2,00,000 మంది ఉద్యోగులను తొలగించాయని ‘ది వాషింగ్టన్ పోస్ట్’ తన కథనంలో పేర్కొనడం తెల్సిందే. ఇలా ఉద్యోగాలు పోయిన వారిలో 30–40 శాతం మంది భారతీయ ఐటీ నిపుణులే కావడం విషాదం. -
టెక్నాలజీ రంగంలో ఉపాధి కోతలు
వాషింగ్టన్: టెక్నాలజీ రంగంలో గతేడాది నుంచి ఆరంభమైన ఉద్యోగ కోతల క్రమం ఇప్పుడప్పుడే ఆగేట్టు కనిపించడం లేదు. తాజాగా కంప్యూటర్ తయారీ సంస్థ డెల్ 6,600 ఉద్యోగులను తగ్గించుకుంటున్నట్టు ప్రకటించింది. గత నెలలోనే టెక్నాలజీ రంగంలో 50వేల ఉద్యోగాలకు కోత పడింది. అయినప్పటికీ చాలా వరకు టెక్నాలజీ కంపెనీలు మూడేళ్ల క్రితం నాటితో పోలిస్తే ఇప్పటికీ అదనపు ఉద్యోగులతో ఉండడం గమనార్హం. ► డెల్ తన ఉద్యోగుల్లో 5 శాతాన్ని తొలగించుకోనుంది. ఈ సంస్థలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,33,000గా ఉంది. ► గత నెలలో అమెజాన్ 18వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. ► సేల్స్‌ఫోర్స్ 8,000 మంది ఉద్యోగులను తొలగించింది. ► మైక్రోసాఫ్ట్ 10వేల మంది, గూగుల్ 12వేల మంది చొప్పున ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. ► గూగుల్ 12,000 మంది (6 శాతం) ఇంటికి వెళ్లకతప్పదని ప్రకటించింది. ► స్పాటిఫై 6 శాతం మందిని తొలగించుకుంది. ► ఎస్ఏపీ అయితే ప్రపంచవ్యాప్తంగా 3,000 మంది ఉద్యోగులను (2.5 శాతం) తగ్గించుకుంది. ► పేపాల్ సంస్థ 7 శాతం ఉద్యోగులను (2,000 మంది) తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ► ఐబీఎం సంస్థ కూడా 3,900 ఉద్యోగులను తొలగించింది. ► గతేడాది చివర్లో ట్విట్టర్ సైతం పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. ► మెటా సంస్థ 11,000 మందిని (13 శాతం), లిఫ్ట్ 700 మందికి ఉద్యోగులకు ఉద్వాసన చెప్పింది. -
ప్రపంచవ్యాప్తంగా ఈ విద్యార్థులకు డిమాండ్.. అత్యధిక వేతనాలు వారికే..
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు సాంకేతిక రంగంలో అత్యాధునిక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఇంటర్నేషనల్ బ్లాక్‌చెయిన్ కాంగ్రెస్ (ఐబీసీ) ఫౌండర్ అభిషేక్ పిట్టి తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ మూడో తరంగా పిలుచుకునే వెబ్ 3.0లో అపార అవకాశాలున్నాయన్నారు. మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)కు మంచి డిమాండ్ రాబోతోందన్నారు. వాణిజ్య, వ్యాపార అవసరాలకు వెబ్ 3.0 ఉపయుక్తమవుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 90 వేల సంస్థలకు వెబ్ 3 ఉద్యోగులు అవసరమని వెల్లడించారు. అంతర్జాతీయ సంస్థలైన పోల్కాడాట్, అవలాంచ్, ఆప్టాస్ మొదలైన సంస్థలు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయని వివరించారు. ఏడాదికి వెబ్ 3 ఇంజనీర్లు కనీసం 80 వేల డాలర్ల వరకు సంపాదించవచ్చన్నారు. ప్రస్తుతం ఐటీ సంస్థల్లో వీరికే అత్యధిక వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. వెబ్ 3.0 ఇంజనీర్ల కొరత ఎక్కువగా ఉండటంతో విద్యార్థులకు ఇది మంచి అవకాశమన్నారు. విద్యార్థుల భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వానికి మంచి విజన్ ఉందని చెప్పారు. అందుకే రాష్ట్రంలో 20 వేల మంది విద్యార్థులకు వెబ్ 3.0లో నైపుణ్య శిక్షణతోపాటు హ్యాకథాన్ ద్వారా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. విశాఖపట్నం గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీలో ఐబీసీ హ్యాక్‌ఫెస్ట్ చాలెంజ్ సదస్సు ప్రారంభం సందర్భంగా ‘సాక్షి’తో అభిషేక్ పిట్టి పలు విషయాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. భవిష్యత్తుని శాసించేవి ఇవే.. వెబ్, వెబ్ 1.0 నుంచి వెబ్ 2.0కి మారడానికి 10 ఏళ్లకు పైగా పట్టింది. ఇప్పుడు వెబ్ 3.0 అమలు చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వెబ్ 3.0 అనేది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పరికరాలు, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్.. ఇలా రెండింటినీ మేళవిస్తూ అభివృద్ధి చెందిన సాంకేతికత. దీనిద్వారా క్రిప్టోకరెన్సీ, టోకనైజేషన్‌తో కూడిన బ్లాక్‌చెయిన్ ఆ«ధారిత ఇంటర్నెట్ ప్రోగ్రామ్‌లను వేగవంతం చేయొచ్చు. దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు మరికొంత సమయం పడుతుంది. అయినప్పటికీ వెబ్ 3.0కి ప్రపంచవ్యాప్తంగా మంచి అవకాశాలున్నాయి. ఇప్పటి నుంచే విద్యార్థులు దీనిపై పట్టు సాధిస్తే అంతర్జాతీయ కంపెనీలు రెడ్‌కార్పెట్ పరుస్తాయి. వెబ్ 3లో రస్ట్, సాలిడిటీ, మూవ్, సబ్‌స్ట్రేట్ వంటి లాంగ్వేజ్ కోర్సులు వచ్చాయి. భవిష్యత్తుని శాసించేవి ఇవే. కేవలం ఇంజనీరింగ్ విద్యార్థులే కాకుండా గ్రాడ్యుయేట్స్ సైతం వెబ్ 3 డెవలపర్స్‌గా శిక్షణ తీసుకోవచ్చు. తద్వారా మంచి ఉద్యోగాలు సాధించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. యువతకు అంతర్జాతీయ నైపుణ్యాలు క్రిప్టో కరెన్సీ, ఆన్లైన్ ఎడ్యుకేషన్, బ్యాంకింగ్ రంగాల్లో డిజిటల్ సమాచారాన్ని భద్రపరిచేందుకు వినియోగించే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీకి మంచి డిమాండ్ ఉంది. దీనిపై యువత దృష్టి సారించేందుకు ఇంటర్నేషనల్ బ్లాక్‌చెయిన్ కాంగ్రెస్ (ఐబీసీ)హ్యాకథాన్లని నిర్వహిస్తోంది. సంప్రదాయ డెవలపర్స్‌తో పోలిస్తే ఈ టెక్నాలజీ ద్వారా యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అలవడతాయి. కొన్ని పెద్ద టెక్ కంపెనీలు తమ డేటా భద్రత, ప్రైవసీని మెరుగుపరిచేందుకు వెబ్ 3ని ఎంపిక చేసుకుంటున్నాయి. నైపుణ్యాల పెంపునకు ప్రభుత్వం అడుగులు.. విద్యార్థుల్లో నైపుణ్యాల్ని పెంపొందించేందుకు ఏయే అవకాశాలున్నాయనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం అధ్యయనం చేస్తోంది. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. మా సంస్థ నిర్వహిస్తున్న హ్యాకథాన్‌కు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించింది. ఇక్కడ 8 రోజుల పాటు వెబ్ 3.0లో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ గురించి శిక్షణ ఇస్తాం. వారికి ఫౌండేషన్ కోర్సును కూడా ఉచితంగా అందిస్తున్నాం. తెలంగాణలో 20 వేల మందికి శిక్షణ ఇచ్చాం. ఏపీలోనూ 20 వేల మందికి శిక్షణ అందించాలని నిర్ణయించాం. కొత్త టెక్నాలజీలో అత్యధిక శాతం మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందాలన్నదే ఐబీసీ ప్రధాన లక్ష్యం. -
డీప్ టెక్ స్టార్టప్స్‌లోకి మరిన్ని పెట్టుబడులు రావాలి
బెంగళూరు: దేశీ డీప్ టెక్నాలజీ స్టార్టప్ సంస్థలు వేగంగా ఎదిగేందుకు వాటికి ప్రారంభ దశలో మరింత ఎక్కువగా పెట్టుబడులు అందాల్సిన అవసరం ఉందని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ చెప్పారు. ప్రస్తుతం టెక్నాలజీ రంగంలోకి వచ్చే పెట్టుబడుల్లో కేవలం 11 శాతం మాత్రమే డీప్ టెక్ స్టార్టప్‌లకు లభిస్తున్నాయని తెలిపారు. చైనా, అమెరికా వంటి దేశాలు తమ డీప్ టెక్ స్టార్టప్ వ్యవస్థను పటిష్టం చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తుండగా, దేశీయంగానూ వీటి నిధుల అవసరాలపై మరింత దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) నిర్వహించిన స్టార్టప్‌లు, ఎంట్రప్రెన్యూర్షిప్ వర్క్‌షాప్‌లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. దేశీయంగా 25,000 పైచిలుకు టెక్ స్టార్టప్‌లు ఉండగా.. వీటిలో డీప్‌టెక్‌కు సంబంధించినవి 12 శాతం (3,000) మాత్రమే ఉన్నాయని తెలిపారు. కృత్రిమ మేథ (ఏఐ), రోబోటిక్స్, బ్లాక్‌చెయిన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), డ్రోన్లు మొదలైన టెక్నాలజీపై డీప్ టెక్ సంస్థలు పని చేస్తుంటాయి. ఇలాంటి సంస్థల పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలపై సమయం వెచ్చించాల్సి ఉంటుంది కాబట్టి వాటి ఉత్పత్తులు మార్కెట్లోకి రావడానికి ఎక్కువ సమయం పడుతుందన్న విషయాన్ని ఇన్వెస్టర్లు, నియంత్రణ సంస్థలు గుర్తించాలని దేవయాని ఘోష్ చెప్పారు. ప్రతిభావంతులు చాలా మందే ఉంటున్నప్పటికీ .. వారిని అందుకోవడం సమస్యగా మారిన నేపథ్యంలో సింగపూర్ వంటి దేశాల్లో మిలిటరీ సర్వీసును తప్పనిసరి చేసిన విధంగా ’స్టార్టప్ సర్వీసు’ను కూడా ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించవచ్చని తెలిపారు. తద్వారా మూడు, నాలుగో సంవత్సరంలోని ఇంజినీరింగ్ విద్యార్థులు ఏడాది పాటు ఏదైనా టెక్ స్టార్టప్స్‌లోకి వెళ్లి పనిచేయొచ్చని పేర్కొన్నారు. ఆ రకంగా ప్రతిభావంతుల తోడ్పాటుతో ఆయా అంకుర సంస్థలు, పెద్ద కంపెనీలతో పోటీపడవచ్చన్నారు. అవ్రా మెడికల్ రోబోటిక్స్‌లో ఎస్ఎస్ఐకి వాటాలు న్యూఢిల్లీ: దేశీ మెడ్‌టెక్ స్టార్టప్ కంపెనీ ఎస్ఎస్ ఇన్నోవేషన్ తాజాగా అమెరికాకు చెందిన నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ అవ్రా మెడికల్ రోబోటిక్స్‌లో నియంత్రణ వాటాలను కొనుగోలు చేసింది. దీనితో తమకు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ప్రవేశించేందుకు అవకాశం లభించినట్లవుతుందని సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ సుధీర్ పి. శ్రీవాస్తవ తెలిపారు. ’ఎస్ఎస్ఐ మంత్ర’ రూపంలో ఇప్పటికే తాము మేడిన్ ఇండియా సర్జికల్ రోబో వ్యవస్థను ప్రవేశపెట్టామని ఆయన చెప్పారు. అవ్రాతో భాగస్వామ్యం .. రోబోటిక్ సర్జరీలకు సంబంధించి వైద్య సేవల్లో కొత్త మార్పులు తేగలదని శ్రీవాస్తవ వివరించారు. -
Jyotsna Cheruvu: స్థిరత్వమే సక్సెస్ సూత్రం
హైదరాబాద్ నగరం... దుర్గం చెరువు వంతెనకు సస్పెండెడ్ రోప్ ప్లాట్‌ఫామ్. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో ఓ వలయాకారపు షాఫ్ట్. బహుళ అంతస్తుల నిర్మాణంలో పాసెంజర్ అండ్ మెటీరియల్ హాయిస్ట్. ఇవన్నీ సాంకేతికరంగం రూపొందించుకున్న అద్భుతమైన ఆవిష్కరణలు. వీటి రూపకల్పన... తయారీలో కీలకమైన మహిళ... జ్యోత్స్న చెరువు. ‘ఇండిపెండెంట్‌గా నిలబడాలంటే ఇండిపెండెంట్‌గా ఆలోచించాలి, ఇండిపెండెంట్‌గా నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే మీరు పదిమంది నడిచే దారిలో పదకొండవ వ్యక్తిగా మిగలకుండా మీదైన కొత్త çపథాన్ని నిర్మించుకోగలుగుతా’ రంటూ మహిళలకు సందేశమిస్తుంటారు... సీఎమ్ఏసీ, మెకనైజేషన్ అండ్ ఆటోమేషన్ ఇన్ కన్స్ట్రక్షన్ కంపెనీ డైరెక్టర్ జ్యోత్స్న చెరువు. ‘ప్రౌడ్ టు మేక్ ఇన్ ఇండియా, ఎక్స్పోర్ట్ దెమ్ యాజ్ మేడ్ ఇన్ ఇండియా’ నినాదంతో పరిశ్రమను విజయవంతంగా నిర్వహిస్తున్న జ్యోత్స్న చెరువు తన వైవిధ్యభరితమైన పారిశ్రామిక ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు. ► సీబీఐటీ స్టూడెంట్‌ని! ‘‘నేను పుట్టింది నెల్లూరు జిల్లా బిట్రగుంటలో. తాత అప్పుడు అక్కడ రైల్వే ఉద్యోగి. అలా అది మా అమ్మమ్మగారి ఊరైంది. నాన్న బ్యాంకు ఉద్యోగరీత్యా మేము పెరిగిందీ, చదువు, కెరీర్ అంతా హైదరాబాద్‌లోనే. మా కాలేజ్ రోజుల్లో అమ్మాయిలు సివిల్ ఇంజనీరింగ్‌ని పెద్దగా తీసుకునేవాళ్లు కాదు. నాకు సీబీఐటీలో సివిల్ ఇంజనీరింగ్ సీటు వచ్చింది. చేరిన తర్వాత సబ్జెక్ట్‌లో ఉన్న అందం తెలిసి వచ్చింది. ఆనందంగా ఆస్వాదిస్తూ కోర్సు పూర్తి చేశాను. ఆ తర్వాత ఉస్మానియాలో ఎంబీఏ చేశాను. మా వారు మెకానికల్ ఇంజనీర్. పెళ్లి తర్వాత కొంతకాలం ఇద్దరమూ ఉద్యోగం చేశాం. మా వారి ఉద్యోగరీత్యా పూనాకి వెళ్లాం. అప్పుడు పిల్లలు చిన్నవాళ్లు. నేనక్కడ ఉద్యోగంలో చేరలేదు, కానీ హోమ్ బ్యూటిఫికేషన్ వంటి సర్వీస్ ప్రాజెక్టులు మొదలుపెట్టాను. మార్కెట్ అవగాహన ఉంది కాబట్టి నిర్మాణ రంగం మీద దృష్టి పెట్టమని ఓ రిటైర్డ్ పర్సన్ చెప్పిన మాట నన్ను పారిశ్రామికవేత్తగా నిలిపాయి. ► నిర్మాణరంగంలో సాంకేతిక వేగం! పిల్లలు పెద్దవుతున్నారు, హైదరాబాద్‌కి వెళ్లిపోదామనే ఆలోచన వచ్చిన నాటికి హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణరంగం కొత్త రూపు సంతరించుకుంటోంది. 25–30 అంతస్తుల భవనాల నిర్మాణం మొదలైన రోజులవి. అది నాకు బాగా కలిసి వచ్చింది. నిర్మాణరంగంలో అవసరమైన కొత్త టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్ తయారీని ప్రారంభించాం. ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ని అప్పటివరకు చైనా, యూరప్ నుంచి దిగుమతి చేసుకుంటూ వచ్చిన నిర్మాణసంస్థలకు అవన్నీ ఇండియాలోనే దొరకడం మంచి సౌలభ్యం కదా. అలా 2006లో మొదలైన మా కంపెనీ ఇప్పుడు దేశవ్యాప్తంగా మూడు వందలకు పైగా సంస్థలకు సేవలందిస్తోంది. వ్యాపారం అంటే... సమాజం లోని అవసరాన్ని గుర్తించి ఆ అవసరాన్ని తీర్చడం, ఒక సమస్యకు పరిష్కారం చూపించడం. అప్పుడే బిజినెస్ విజయవంతమవుతుంది. మా కంపెనీ సిద్ధాంతం నాలుగు ‘ఎస్’లు... స్పీడ్, సేఫ్టీ, సేవింగ్స్, స్ట్రెంగ్త్. పని వేగంగా జరగాలి, పనిలో పాల్గొనే కార్మికులకు రక్షణ కల్పించాలి, ప్రాజెక్టు వ్యయం తగ్గాలి, పని చేసే కార్మికుని శక్తిని ఇనుమడింప చేయాలి. మా క్లయింట్ అవసరానికి తగినట్లు కస్టమైజ్డ్ ఎక్విప్మెంట్ను డిజైన్ చేయడం, తయారు చేయడం, ఇన్స్టాల్ చేయడం, యాన్యుయల్ మెయింటెనెన్స్ సర్వీస్ ఇవ్వడం, ఆ కంపెనీ ప్రాజెక్టు మరో చోటకు మారినప్పుడు ఎక్విప్మెంట్ని ఆ ప్రదేశానికి తీసుకువెళ్లి అమర్చడం... ఇలా ఉంటుంది మా పని. ఇప్పుడు దేశం ఎల్లలు దాటి విదేశాలకు కూడా విస్తరించాం. నా రంగంలో నేను లక్ష్యంగా పెట్టుకున్న శిఖరానికి చేరాననే చెప్పాలి. నా వంతు బాధ్యతగా మహిళా సమాజానికి, యువతకు కెరీర్ ప్లానింగ్ గురించి చెబుతున్నాను. కోవె (కన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్) తెలంగాణ అధ్యక్షురాలిగా వేలాది మహిళలకు, యువతకు ఎంటర్‌ప్రెన్యూరల్ మైండ్‌సెట్ క్లాసులు చెప్తున్నాను. కంపెనీ నిర్వహణలో ఉద్యోగులను కలుపుకుపోవడం చాలా అవసరం. పని వరకే చేయించుకుని మిగిలిన విషయాల్లో వాళ్లను డార్క్‌లో ఉంచరాదు. కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలను వారితో చర్చించాలి. ఈ కంపెనీతో కొనసాగితే కెరీర్లో పైకి ఎదగగలమనే భరోసా కలిగితేనే ఉద్యోగులు మనతో కొనసాగుతారు. ఇలాంటి అనేక విషయాలను చెబుతుంటాను. ఈ జర్నీ నాకు సంతోషంగా ఉంది. ఏటా ఈ ఏడాది ఎంతమంది మహిళలకు దిశానిర్దేశం చేశానని లెక్కచూసుకున్నప్పుడు కనిపించే పెద్ద సంఖ్య నాకు ఆత్మసంతృప్తి కలిగించే విషయం ’’ అని వివరించారు జ్యోత్స్న చెరువు. లీడర్‌గా ఎదిగేది కొందరే! మా దగ్గరకు ట్రైనింగ్‌కు వచ్చిన మహిళలకు నేను చెప్పే తొలిమాట ‘మీ స్ట్రెంగ్త్ ఏమిటో మీరు తెలుసుకోండి’ అని. వాళ్లకు ఏం వచ్చో తెలిసిన తర్వాత వాళ్లకు ఎటువంటి కెరీర్ సౌకర్యంగా ఉంటుందో సూచిస్తాను. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలంటే... మొదటగా ఉండాల్సింది స్థిరత్వం. చిన్న ఉదాహరణ చెబుతాను... ఒక ఇస్త్రీ షాపు వ్యక్తి రోజూ కచ్చితంగా షాపు తెరవకపోతే మనం దుస్తులు ఇవ్వం కదా! రోజూ ఠంచన్‌గా పని చేసే వ్యక్తికి మాత్రమే ఇస్తాం. ఇంటి ముందుకు వచ్చే వాళ్ల దగ్గర కూరగాయలు కొనాలన్నా అంతే. మన సర్వీస్ అందుకునే క్లయింట్ ప్రత్యామ్నాయాన్ని వెతుక్కునే పరిస్థితిని కల్పించకూడదు. ఎందరు వచ్చినా, ఎవరూ రాకపోయినా సరే వర్క్‌ప్లేస్‌ని మూతవేయరాదు. నేను నా రంగంలో సంపాదించుకున్న నమ్మకం అదే. ఏ సమయంలో ఫోన్ వచ్చినా సరే... ఎవరో ఒకరు హాజరవుతారనే భరోసా కల్పించడంలో విజయవంతం అయ్యాం. మా దగ్గరకు కోర్సులో చేరిన పాతిక మందిలో చివరకు ఆ కోర్సును ఉపయోగపెట్టుకునేవాళ్లు పదికి మించరు. కోర్సు సమయంలో ‘ఇంటికి బంధువులు వచ్చార’ని క్లాసు మానేసే వాళ్లు ఎంటర్ ప్రెన్యూర్‌గా కూడా కొనసాగలేరు. బిజినెస్ రంగంలో ఉన్న ఇద్దరు మగవాళ్లు కలిస్తే తమ వ్యాపారం గురించి, ఇతరుల వ్యాపారం గురించి, విస్తరణకు ఉన్న అవకాశాల గురించి మాట్లాడుకుంటారు. అదే ఇద్దరు మహిళలు రిలేషన్ షిప్ మీద మాట్లాడినంతగా తమ ప్రొఫెషన్ గురించి చర్చించరు. ప్రొఫెషన్ గురించి మాట్లాడగలిగిన మహిళలే లీడర్లుగా ఎదుగుతారు, ఫీల్డ్‌లో విజయవంతంగా నిలబడగలుగుతారు. – జ్యోత్స్న చెరువు, డైరెక్టర్, సిఎమ్ఏసీ, ప్రెసిడెంట్, కోవె తెలంగాణ – వాకా మంజులారెడ్డి ఫొటోలు : మోహనాచారి -
టెక్నాలజీ ఉద్యోగాల్లో మహిళలకే ఎక్కువ అవకాశాలు
ముంబై: కరోనా వచ్చిన తర్వాత టెక్నాలజీ అభివృద్ధి రంగంలో పురుషులతో పోలిస్తే మహిళలకే ఎక్కువ అవకాశాలు అందుబాటులోకి వచ్చినట్టు బ్రిడ్జ్‌ల్యాబ్స్ సంస్థ తెలిపింది. బ్రిడ్జ్ల్యాబ్ టెక్ ఎంప్లాయిబులిటీ క్వొటెంట్ టెస్ట్‌లో మహిళలకు 42 శాతం స్కోరు రాగా, పురుషుల స్కోరు 39 శాతంగా ఉంది. ‘‘టెక్నాలజీ రంగంలోని వివిధ విభాగాల్లో ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఉద్యోగులను అట్టిపెట్టుకోవడం పెద్ద సమస్య కానుంది. మహిళల నైపుణ్యాలను తక్కువగా వినియోగించుకోవడం కనిపించే వ్యత్యాసాల్లో ఒకటి. కొత్తగా చేరే మహిళలు అయినా, కెరీర్లో కొంత విరామం తర్వాత వచ్చి చేరే వారయినా నైపుణ్య అంతరాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పని ప్రదేశంలో వైవిధ్యం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం’’ అని బ్రిడ్జ్‌ల్యాబ్స్ వ్యవస్థాపకుడు నారయణ్ మహదేవన్ తెలిపారు. 40,000 మంది ఇంజనీరింగ్ నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను సంస్థ విడుదల చేసింది. ఉన్నత విద్యార్హతలు, ఎంతో అనుభవం ఉన్న మహిళలు మిడ్ మేనేజ్మెంట్ ఉద్యోగాల స్థాయికి చేరుకుంటున్నట్టు, తమ ఉద్యోగాల నుంచి తరచుగా బ్రేక్ తీసుకుంటున్నట్టు బ్రిడ్జ్‌ల్యాబ్స్ తెలిపింది. -
స్పేస్ టెక్నాలజీ హబ్‌గా రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష సాంకేతికత (స్పేస్ టెక్నాలజీ)కు తెలంగాణ రాష్ట్రాన్ని తొలి గమ్యస్థానంగా మార్చాలని రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సంబంధిత రంగానికి చెందిన పరిశ్రమలు, విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఇప్పటికే ‘తెలంగాణ స్పేస్‌టెక్ పాలసీ ఫ్రేమ్‌వర్క్’ను రూపొందించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను తాజాగా విడుదల చేసిన ఐటీ శాఖ... దీనిపై ఈ నెల 25లోగా సలహాలు ఇవ్వాల్సిందిగా కోరింది. రోజువారీ సమస్యలకు పరిష్కారాలు... ప్రజల దైనందిన జీవితంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాలకు చూపడంలో అంతరిక్ష సాంకేతికత అంచనాలకు మించి ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. భారతీయ అంతరిక్ష సాంకేతిక రంగంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సాహించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ‘స్పేస్‌కామ్ పాలసీ 2020’, ‘స్పేస్ ఆర్ఎస్ పాలసీ 2020’, ‘జియో స్పేషియల్ పాలసీ 2021’తదితరాలను విడుదల చేసింది. దీంతో ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’(ఎన్ఎస్ఐఎల్), ‘ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్’(ఇన్‌స్పేస్) వంటి సంస్థలు ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో అంతరిక్ష ఆర్థిక రంగంలో ప్రైవేటు రంగం మద్దతు కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ స్పేస్‌టెక్ పాలసీ ఫ్రేమ్‌వర్క్’ను సిద్ధం చేసింది. తద్వారా ప్రపంచ స్పేస్ టెక్నాలజీ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వ్యాపార, వాణిజ్యాభివృద్ధి, తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్లకు పరీక్ష కేంద్రంగా తీర్చిదిద్దడం, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు, భాగస్వామ్యాలను ఆహ్వానించడం వంటి లక్ష్యాలను ఈ ఫ్రేమ్‌వర్క్ ద్వారా సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం మౌలిక వసతులు, వాణిజ్య అవకాశాలు, నైపుణ్యాభివృద్ది, శిక్షణ, పరిశోధన, ఆవిష్కరణల కోసం అనేక విధాన నిర్ణయాలు తీసుకోనుంది. ఇప్పటికే స్పేస్ టెక్నాలజీ రంగంలో పేరొందిన అనంత్ టెక్నాలజీస్, వీఈఎం టెక్నాలజీస్, ఎంటార్ టెక్నాలజీస్ వంటి సంస్థలు, స్కై రూట్, ధ్రువ వంటి స్టార్టప్‌లతోపాటు డీఆర్డీఓ, ఎన్ఆర్ఎస్, అడ్రిన్, డీఆర్డీఎల్, ఆర్సీఐ, బీడీఎల్, ఆర్డినెన్స్ ప్యాక్టరీ వంటి రక్షణ రంగ పరిశోధన, తయారీ సంస్థలు హైదరాబాద్‌లో అంతరిక్ష సాంకేతిక వాతావరణానికి ఊతమివ్వనున్నాయి. అంతరిక్ష సాంకేతిక కార్యకలాపాలకు హైదరాబాద్ ఇప్పటికే కీలక కేంద్రంగా ఉంది. మార్స్ ఆర్బిటర్ మిషన్‌లోని 30 శాతం విడిభాగాలు రాష్ట్రంలోనే తయారయ్యాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర టెక్నాలజీ పాలసీ ఆశించిన ఫలితాలను రాబడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
స్వయంగా ఎదగాలి
సాంకేతిక రంగంలో రెండు దశాబ్దాల విశేష అనుభవం. మోటరోలా, సిస్కో వంటి కంపెనీలకు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, స్ట్రాటజీ ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం.. మైక్రోసాఫ్ట్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్... ఫేబుల్స్ ఆప్‌తో ఎంటర్ప్రెన్యూర్... ఎన్నో విజయాలు సాధించారు విజయవాడకు చెందిన పద్మశ్రీ వారియర్. మరింతమంది మహిళలు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగాలంటూ వారిని ఆహ్వానిస్తున్నారు. ‘మహిళలు సాంకేతిక రంగంలోకి ప్రవేశించి, అత్యున్నత స్థాయికి ఎదగాలి. స్త్రీలు ఉన్నతాధికారులుగా మారే రోజులు రావాలి. మీకు మీరుగా స్వయంగా ఎదగాలి. కొత్తకొత్త వ్యవస్థలను నిర్మించాలి, మీ అనుభవాలను అందరికీ పంచాలి’’ అంటారు పద్మశ్రీ వారియర్. ఇప్పుడు మహిళలు ముందుకు వచ్చి, అనేక రంగాలలో పనిచేస్తూ, ఉన్నత స్థానానికి ఎదుగుతున్నారు. కొన్ని దశాబ్దాల ముందు వరకు మహిళలు పైకి ఎదగడానికి చాలా నిచ్చెనలే ఎక్కవలసి వచ్చేది. నిర్ణయాలు తీసుకోవటానికి కూడా ఆలోచించవలసి వచ్చేది. ఆ రోజుల్లోనే అవలీలగా నిచ్చెనలు ఎక్కినవారిలో పద్మశ్రీ వారియర్ ప్రముఖంగా కనిపిస్తారు. సాంకేతిక రంగంలో నిస్సందేహంగా ప్రముఖ పాత్ర పోషించారు. మోటొరోలా, సిస్కో, టెస్టా కాంపిటీటర్ నియో కంపెనీలలో అపారమైన అనుభవం సంపాదించి, ఇప్పుడు స్వయంగా ‘ఫేబుల్’ ఆప్‌ను ప్రారంభించి, అందరూ మంచిమంచి పుస్తకాలు చదువుకోవటానికి అవకాశం కల్పిస్తున్నారు. ‘‘మహిళలు ఎక్కువ సంఖ్యలో ముందుకు వచ్చి, భవిష్యత్తులో సాంకేతిక రంగానికి నాయకత్వం వహించాలని కోరుకుంటున్నాను’’ అంటారు పద్మశ్రీ వారియర్. అన్నిటికీ తట్టుకోవాలి... ఒక రంగంలోకి ప్రవేశించినప్పుడు ఎన్నో ఎత్తుపల్లాలు చూడాల్సి ఉంటుంది. అయినప్పటికీ.. అవకాశం దొరికినప్పుడు విడిచిపెట్టకుండా అందిపుచ్చుకుని, విజయాలు సాధించాలి. నిర్ణయం తీసుకోవటంలో జాగ్రత్తగా వహించాలి.. అంటూ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగబోతున్న మహిళలకు సలహా ఇస్తారు పద్మశ్రీ వారియర్. రెడ్పాయింగ్ వెంచర్స్ సంస్థ అందించిన 7.25 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ ఆప్‌ను ఎంతో ధైర్యంగా లాంచ్ చేశారు పద్మశ్రీ వారియర్. వార్షిక చందా కట్టి, ఈ – బుక్స్ ద్వారా పుస్తకాలను ఆన్లైన్లో కొనుక్కుని చదువుకోవచ్చు. 120 మిలియన్ల వాడకం దారులు ఉన్న గుడ్‌రీడ్స్ కంపెనీని తట్టుకుని, ముందుకు వెళ్లేలా ‘ఫేబుల్’ని రూపొందించారు పద్మశ్రీ వారియర్. సోషల్ మీడియాలో చర్చ.. పద్మశ్రీ వారియర్ ఈ ఆప్‌ను ప్రారంభించగానే, సోషల్ మీడియాలో, ‘గుడ్‌రీడ్స్ కంపెనీని తట్టుకుని నిలబడగలదా ఈ ఆప్’ అని రకరకాలుగా విమర్శించారు. అందరి మాటలను పక్కకు పెట్టి ముందుకు దూకారు పద్మశ్రీ వారియర్. ‘‘ఇరవై సంవత్సరాలకు పైగా అనుభవం గడించిన నేను నాకు ఏది ఇష్టమైతే అదే చేస్తాను. ముందుగా నా గురించి నేను సరైన అంచనా వేసుకుంటాను. ఒక అధికారిగా నా నిర్ణయాల సక్రమంగా ఉండేలా ఆలోచిస్తాను’’ అంటారు పద్మశ్రీ వారియర్, ఫేబుల్ సంస్థ ద్వారా అత్యున్నత ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదుగుతున్నారు. ఉద్యోగాలలో స్త్రీపురుషులను సమానంగా చూడాలనే అంశం మీద గొంతెత్తుతారు. ‘అందమైన రేపటి కోసం మహిళలు ఎంతో ఉత్సాహంగా పని చేస్తున్నారు, మరింతమంది మహిళలు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగాలని ఆశిస్తాను’ అంటారు. అత్యంత ప్రతిభ.. విజయవాడలో పుట్టి పెరిగిన పద్మశ్రీ, ఢిల్లీ ఐఐటి నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో బి.ఎస్., అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్. పూర్తి చేశారు. సాంకేతిక రంగంలో 2020లో అత్యంత ప్రతిభ చూపిన 50 మందిలో పద్మశ్రీ వారియర్‌ను ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. సాంకేతిక రంగంలో సంపాదించిన అనుభవంతో ఇప్పుడు ఫేబుల్స్ ఆప్‌ను ప్రారంభించి ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిరూపించుకున్నారు పద్మశ్రీ వారియర్. ‘ఫేబుల్ హ్యాజ్ స్టోరీస్ ఫర్ ఎవ్రీవన్, మై హోప్ ఈజ్ దట్ యు విల్ టేక్ ఎ డైలీ బ్రేక్ టు రీడ్ బికాజ్ యు ఆర్ వర్త్ ఇట్’ అంటున్నారు. పద్మశ్రీ వారియర్ -
వర్చువల్ కార్యకలాపాలకు డిమాండ్
ముంబై: కరోనా మహమ్మారి కారణంగా డిజిటలైజేషన్ పెరిగిన నేపథ్యంలో గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య సాంకేతిక రంగంలో ఉద్యోగ నియామకం స్థిరంగా ఉందని గ్లోబల్ జాబ్ సైట్ ఇన్‌డీడ్ తెలిపింది. జనవరిలో దేశీయ టెక్ జాబ్స్ పోస్టింగ్ 13 శాతం మేర పెరిగాయని పేర్కొంది. రిమోట్ వర్కింగ్, టెక్నాలజీ ఆధారిత వ్యాపార కార్యకలాపాల అవసరం పెరగడం వంటి కారణాలతో టెక్ నియామకాలను పెంచుకోవాల్సి వచ్చిందని ఇన్‌డీడ్.కామ్ ఎండీ సాషి కుమార్ తెలిపారు. సమీప భవిష్యత్తులో డిజిటలైజేషన్, వర్చువల్ కార్యకలాపాలు మరింత వృద్ధి చెందుతాయని, దీంతో ఈ రంగాలలో టెక్ సంబంధిత ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడుతుందని పేర్కొన్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న తొలి పది టెక్ ఉద్యోగాలలో అప్లికేషన్ డెవలపర్ జాబ్స్ ప్రథమ స్థానంలో ఉన్నాయని, ఆ తర్వాత ఐటీ సెక్యూరిటీ స్పెషలిస్ట్, సేల్స్‌ఫోర్స్ డెవలపర్స్, సైట్ రిలయబులిటీ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్ ఉద్యోగాలు ఉన్నాయని వివరించారు. గతేడాది ఏప్రిల్ – ఈ ఏడాది జనవరి మధ్య కాలంలో బిజినెస్ ఇంటలిజెన్స్ డెవలపర్, ఎస్ఏపీ కన్సల్టెంట్, సీనియర్ క్వాలిటీ అస్యూరెన్స్ ఇంజనీర్, టెక్నికల్ కన్సల్టెంట్, ఆటోమేషన్ ఇంజనీర్ జాబ్స్ సానుకూల నమోదు కనిపించిందని తెలిపారు. టెక్ ఆధారిత ఉద్యోగాలు ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈ–కామర్స్ కంపెనీలలో జరుగుతున్నాయని పేర్కొన్నారు. -
కొత్త ఉద్యోగాలు వస్తున్నాయ్
సాక్షి, అమరావతి: ‘కొత్త కొలువులు వస్తున్నాయి. 2021లో దేశంలో 53 శాతం కంపెనీలు కొత్త ఉద్యోగాలు కల్పించేందుకు సంసిద్ధమవుతున్నాయి.’ అని ‘ఇండియాస్ ట్యాలెంట్ ట్రెండ్స్– 2021’ నివేదిక వెల్లడించింది. బ్రిటన్ ప్రధాన కేంద్రంగా ఉన్న ‘మైఖేల్ పేజ్’ అనే రిక్రూటింగ్ ఏజెన్సీ దీన్ని విడుదల చేసింది. 2021లో ఇతర ఆసియా–పసిఫిక్ దేశాల కంటే భారత్‌లో కొత్త ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది. ఆసియా–పసిఫిక్ దేశాల్లోని 42 శాతం కంపెనీలు కొత్త ఉద్యోగాలు కల్పించనున్నాయని అంచనా వేసింది. కరోనా నుంచి కోలుకుని మెల్లగా గాడిలో పడిన దేశ ఆర్థిక వ్యవస్థ జోరందుకోనుందని పేర్కొంది. ఈ నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ.. ► టెక్నాలజీ రంగంలో ఉన్న కంపెనీల్లో ఏకంగా 74 శాతం కంపెనీలు తాము ఉద్యోగుల సంఖ్యను 14 శాతం పెంచుతామని తెలిపాయి. రిమోట్ వర్కింగ్‌కు అవకాశాలు కల్పిస్తామని ఆ కంపెనీలు చెప్పాయి. ► డేటా సైంటిస్టులు, గ్రోత్ హ్యాకర్స్, పెర్ఫార్మెన్స్ మార్కెటర్స్, సేల్స్–బిజినెస్ డెవలపర్స్, రీసెర్చ్ డెవలపర్స్, లీగల్ కౌన్సిల్ మొదలైన ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువ ఉంటుందని పేర్కొంది. ► కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న ఆ 53 శాతం కంపెనీల్లో 60 శాతం కంపెనీలు ఉద్యోగుల జీతాలు పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాయి. ఇక వాటిలో 55 శాతం కంపెనీలు ఉద్యోగులకు బోనస్‌లు ఇచ్చేందుకు సిద్ధపడుతుండగా.. 43 శాతం కంపెనీలు ఒక నెల కంటే ఎక్కువ జీతం బోనస్‌గా ఇవ్వనుండటం విశేషం. ► జీతాల పెంపుదలలో టెక్నాలజీ, ఆరోగ్య సేవల రంగం మొదటి స్థానంలో ఉంది. టెక్నాలజీ రంగంలో 15 శాతం నుంచి 25 శాతం, ఆరోగ్య సేవల రంగంలో 15 నుంచి 20 శాతం వరకు జీతాలు పెరిగే అవకాశాలున్నాయి. రిటైల్ రంగంలో 7.6 శాతం, ఈ–కామర్స్/ఇంటర్నెట్ సేవల రంగాల్లో 7.5 శాతం, తయారీ రంగంలో 5.9 శాతం, నిర్మాణ రంగంలో 5.3 శాతం జీతాలు పెరగవచ్చు. ► ఈ కంపెనీలు తమ ఉద్యోగుల్లో మూడోవంతు మందికి పదోన్నతులు కల్పించనున్నాయి. -
పతనానికి చెక్ -యూఎస్ బౌన్స్‌బ్యాక్
మూడు రోజుల భారీ నష్టాలకు బుధవారం తెరపడింది. ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే టెక్నాలజీ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో యూఎస్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. వెరసి డోజోన్స్ జులై 14 తదుపరి అత్యధికంగా లాభపడింది. 440 పాయింట్లు(1.6%) పుంజుకుని 27,940 వద్ద నిలిచింది. ఎస్అండ్పీ జూన్ 5 తరువాత 67 పాయింట్లు(2%) ఎగసి 3,399 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 294 పాయింట్లు(2.7%) జంప్‌చేసి 11,142 వద్ద స్థిరపడింది. తద్వారా ఏప్రిల్ 29 తరువాత సింగిల్ డేలో అధిక లాభాలు ఆర్జించింది. షార్ట్ కవరింగ్.. ఇటీవల వెల్లువెత్తిన అమ్మకాలతో మూడు ట్రేడింగ్ సెషన్లలోనే నాస్డాక్ ఇండెక్స్ 10 శాతం కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో ట్రేడర్లు షార్ట్‌కవరింగ్ చేపట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఫలితంగా మార్కెట్లు రీబౌండ్ అయినట్లు తెలియజేశారు. ఓవైపు ఆర్థిక వ్యవస్థలకు కోవిడ్-19.. సవాళ్లు విసురుతుండటం, మరోపక్క డీల్ కుదుర్చుకోకుండానే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుందన్న(బ్రెగ్జిట్) అంచనాల నేపథ్యంలో గత మూడు రోజులుగా మార్కెట్లు పతన బాటలో సాగుతూ వచ్చిన విషయం విదితమే. వీటికి జతగా టెక్నాలజీ దిగ్గజాల కౌంటర్లలో సాఫ్ట్‌బ్యాంక్ భారీ స్థాయిలో డెరివేటివ్ పొజిషన్లు తీసుకున్నట్లు వెలువడిన వార్తలు కూడా ఒక్కసారిగా అమ్మకాలకు కారణమైనట్లు విశ్లేషకులు తెలియజేశారు. జోరు తీరు ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్ ఎకానమీ కౌంటర్లలో యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ 4 శాతం స్థాయిలో జంప్‌చేశాయి. ఈ బాటలో గూగుల్ 1.6 శాతం, ఫేస్బుక్ 1 శాతం చొప్పున ఎగశాయి. ఇక ఆటో, టెక్నాలజీ కంపెనీ టెస్లా ఇంక్.. 11 శాతం దూసుకెళ్లింది. కంప్యూటర్ చిప్స్ తయారీ దిగ్గజం ఏఎండీ 4 శాతం పెరిగింది. క్లినికల్ పరీక్షలను తిరిగి వచ్చేవారం ప్రారంభించగలదన్న అంచనాలున్నప్పటికీ ఆస్ట్రాజెనెకా షేరు 2 శాతం క్షీణించింది. 16 బిలియన్ డాలర్లతో చేపట్టదలచిన టేకోవర్‌ను విరమించుకోనున్నట్లు లగ్జరీ గూడ్స్ దిగ్గజం ఎల్వీఎంహెచ్ వెల్లడించడంతో జ్యువెలరీ కంపెనీ టిఫనీ అండ్ కో 6.5 శాతం పతనమైంది. -
కలాం విజన్ ఇదీ..
దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ప్రజల్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. 2020 నాటికి భారత్ ఎలా ఉండాలో, దాని రూపురేఖలు ఎలా మారిపోవాలో ఆయనకు ఎన్నో అంచనాలున్నాయి. 2000 సంవత్సరంలో కలాం నేతృత్వంలో శాస్త్ర, సాంకేతిక రంగంలోని టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ (టీఐఎఫ్‌ఐసీ)కు చెందిన 500 మంది నిపుణులతో విజన్–2020 డాక్యుమెంట్ రూపొందించారు. అప్పటికి భారత్ రూపురేఖలు ఎలా మారిపోవాలో ఆయన వైఎస్.రాజన్ తో కలసి ‘2020: ఏ విజన్ ఫర్ ది న్యూ మిలీనియం’పేరుతో పుస్తకాన్ని తీసుకొచ్చారు. భారత్‌లో ఉన్న సహజవనరులు, మానవ వనరులు, భారతీయుల్లో నెలకొన్న పోటీతత్వం మన దేశాన్ని శక్తిమంతమైన దేశాల సరసన నిలబెడుతుందని అంచనా వేశారు. విద్యతోనే దేశ సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని 2020 నాటికి భారత్ అన్ని రంగాల్లోనూ దూసుకుపోయి అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరుతుందని ఆకాక్షించారు. అవినీతి రహిత సమాజం ఏర్పాటు కావాలంటే అక్షరాస్యత పెరగాలన్నారు. ‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి’అంటూ యువతకు పిలుపునిచ్చారు. భారత్ ఆర్థికంగా ఉచ్ఛ స్థితికి చేరుకోవాలంటే 2020 నాటికి స్థూల జాతీయోత్పత్తి 11 శాతంగా ఉండాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాల కల్పన జరిగితేనే దేశంలో ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని అభిప్రాయపడ్డారు. కలాం కన్న కలలకు అందరూ సలాం చేసినా ఆయన అంచనాలకు దేశం ఏ మాత్రం చేరుకోలేకపోయింది. పైగా సరికొత్త సవాళ్లు పుట్టుకొస్తున్నాయి. -
టెక్ స్టార్టప్‌లలో భారీ నియామకాలు
న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగంలోని స్టార్టప్స్ (అంకుర సంస్థలు) ఈ ఏడాదిలో 60,000 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు సాఫ్ట్వేర్ సంస్థల సమాఖ్య నాస్కామ్ వెల్లడించింది. ఐటీ మంత్రిత్వ శాఖ, పరిశ్రమ సమాఖ్యలు సంయుక్తంగా నిర్వహించిన ‘ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్’ కార్యక్రమంలో ఈ విషయాన్ని తెలియజేసింది. నాస్కామ్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. దేశంలోని టాప్ 15 కంపెనీలు నిరంతరం ఉద్యోగాలను కల్పిస్తూనే ఉన్నాయని ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. -
సమాజం మారాలి సర్
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగాలంటే వారిపట్ల సమాజపు ఆలోచనా ధోరణి, ప్రభుత్వ విధానాల్లోనూ మార్పులు అత్యవసరమని పద్మశ్రీ ఎం.రోహిణి గోడ్బోలే అంటారు. ‘‘సమాజంలో పైకి తెలియకుండానే మహిళలపట్ల ఒక రకమైన వివక్ష ఉంటుంది. కొన్ని పనులు మహిళలు చేయలేరని, కొన్నింటికి మాత్రమే వారు పరిమితం అని సమాజం భావిస్తుంటుంది. ఈ ధోరణి మారాలి’’ అని ప్రొఫెసర్ రోహిణి అన్నారు. బుధవారం ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్ (ఐడబ్ల్యూఎస్‌ఏ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్)లో పద్నాలుగవ త్రైవార్షిక జాతీయ సదస్సు ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు ప్రొఫెసర్ రోహిణి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసిన ‘సాక్షి’తో ఆమె ముచ్చటించారు. పిల్లల పెంపకం ఒక్క తల్లి బాధ్యతగా మాత్రమే కాకుండా.. తల్లిదండ్రులు / అత్తమామలూ చేయూత ఇవ్వడం ద్వారా మహిళలు శాస్త్ర రంగంలో మరింత ముందుకు ముందుకు వెళ్లే అవకాశం ఉందని ప్రొఫెసర్ రోహిణి అభిప్రాయపడ్డారు. ‘‘ప్రభుత్వ విధానాల్లోనూ మహిళల శక్తియుక్తులను వినియోగించుకునేందుకు తగినట్టుగా కొన్ని మార్పులు కూడా అవసరమే. దేశంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో చదువుకుంటున్న, బోధిస్తున్న మహిళలు చాలామందే ఉన్నప్పటికీ... పరిశోధన, అభివృద్ధి సంస్థల్లో, కంపెనీల్లోనూ ఉన్నతస్థానాల్లో ఉన్న వారు తక్కువే. భారత్‌లో సైన్స్ సబ్జెక్టులు చదువుతున్న మహిళలు కాలేజీస్థాయిలో 40 శాతం మంది ఉంటే, యూనివర్శిటీ స్థాయికి వచ్చేసరికి ఇది 30 శాతానికి, పీహెచ్డీ స్థాయిలో 20 –22 శాతానికి తగ్గిపోతోంది. శాస్త్రవేత్తగా పనిచేస్తున్న వారి విషయానికి వస్తే ఇది మరీ తక్కువగా పదిశాతం మాత్రమే ఉంది’’ అని ప్రొఫెసర్ రోహిణి చెప్పారు. ఒకటే కారణం కాదు ‘‘పెళ్లి, కుటుంబ బాధ్యతలు, ఇంట్లోని వృద్ధుల ఆలనపాలన వంటి విషయాల కోసం మహిళా శాస్త్రవేత్తలు తమ వృత్తిని వదిలేసుకుంటున్నారనే భావన కూడా సమాజంలో నెలకొని ఉంది. కానీ వీటితోపాటు చాలా ఇతర కారణాలూ ఉన్నాయని ఇటీవలి సర్వే ఒకటి స్పష్టం చేస్తోంది. మహిళలు స్వేచ్ఛగా పనిచేసేందుకు తగ్గ వాతావరణం సంస్థల్లో లేకపోవడం, మహిళల అవసరాలకు తగ్గ వెçసులుబాట్లు కల్పించలేని విధానాలు, చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగాలు లేకపోవడమూ కారణమే’’ అని ప్రొఫెసర్ రోహిణి అంటారు. ఎం.రోహిణి గోడ్బోలే సెంటర్ ఫర్ హై ఎనర్జీ ఫిజిక్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, బెంగళూరు సైన్స్‌ను సమాజానికి చేరువ చేసేందుకు పరిశోధనశాలల్లో ఎంత నిబద్ధతతో పరిశోధనలు చేసినా...శాస్త్ర విజ్ఞానాన్ని సమాజానికి చేరవేయకపోతే ప్రయోజనం లేదన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది ఇండియన్ విమెన్ సైంటిస్ట్ అసోసియేషన్ 1973 జూన్ 13న అప్పటి బాంబే ప్రస్తుత ముంబైలో రిజిస్టర్ అయిన ఈ సంస్థ అప్పటి నుంచి ఇప్పటివరకూ సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి శాస్త్రాన్ని చేరవేసే లక్ష్యంతో పలు కార్యకలాపాలు చేపట్టింది. వేర్వేరు శాస్త్ర రంగాలకు చెందిన 12 మంది వ్యవస్థాపక సభ్యుల ఏర్పాటుకు తొలి ఆలోచన చేయగా, రెండేళ్ల తరువాత ఐడబ్ల్యూఎస్‌ఏ సాకారమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐడబ్ల్యూఎస్ఏకు 11 శాఖలు ఉన్నాయి. మొత్తం రెండువేల మంది మహిళా శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉన్నారు. శాస్త్ర విజ్ఞానాన్ని సమాజానికి చేరువ చేయడం సంస్థ తొలి లక్ష్యమైతే... శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చేసేందుకూ పలు కార్యకలాపాలు చేపడుతుంది. మహిళా శాస్త్రవేత్తల విజయాలను ప్రోత్సహించడం, శాస్త్ర రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలు సూచించడం తద్వారా మహిళా సాధికారతకు సాయపడటం కూడా సంస్థ లక్ష్యాల్లో కొన్ని. ఈ లక్ష్యాల సాధన కోసం ఐడబ్ల్యూఎస్‌ఏ పలు కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తోంది. పిల్లల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ముంబైలో ‘లెర్నింగ్ గార్డెన్’ పేరుతో పార్కును ఏర్పాటు చేయడం, ఏడాది కాలంలో సుమారు 17 వేల మంది పిల్లలు ఈ పార్కును సందర్శించడం ఐడబ్ల్యూఎస్‌ఏ సాధించిన ఒక ఘనత మాత్రమే. దీంతోపాటు మహిళా శాస్త్రవేత్తల కోసం ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, పిల్లల కోసం డే కేర్ సెంటర్, నర్సరీ స్కూల్, ఆరోగ్య కేంద్రం, లైబ్రరీ రీడింగ్ రూమ్ వంటి వసతులూ కల్పిస్తోంది. స్కాలర్షిప్పులు, అవార్డులు సరేసరి! ప్రతిభకు పోషణ ‘‘దేశం శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ఎదగాలని ఆకాంక్షిస్తోంది. ఇది నెరవేరాలంటే కాబోయే తల్లులకు తగిన పోషకాహారం అందించడం ఎంతో కీలకం’’ అని జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత తెలిపారు. ‘‘మహిళల్లో సుమారు 50 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతూంటే సుమారు 20 శాతం మందికి తగినన్ని పోషకాలు అందడం లేదు. అదే సమయంలో 40 శాతం మంది మహిళలు ఊబకాయలు’’ అని ఆమె వివరించారు. గర్భధారణ సమయంలో మహిళలు వంద గ్రాముల బరువు పెరిగితే పుట్టబోయే బిడ్డ.. జనన సమయ బరువు 20 గ్రాముల వరకూ పెరుగుతుందని, అలాగే గర్భధారణ సమయంలోనూ, బిడ్డకు రెండేళ్లు వచ్చే వరకూ తగినంత మోతాదులో పోషకాలను పొందడం బిడ్డ ఎదుగుదలకు, భవిష్యత్తులో సాంక్రమిక వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ఎంతో కీలకమని డాక్టర్ హేమలత వివరించారు. అంతేకాకుండా పిండం ఏర్పడ్డ తొలినాళ్లలో తల్లిద్వారా తగినన్ని పోషకాలు అందకపోతే ఆ ప్రభావం కాస్తా బిడ్డ జీవక్రియలతోపాటు, జ్ఞాపకశక్తి, మెదడు పనితీరులపై కూడా దుష్ప్రభావం పడుతుందని తెలిపారు. డాక్టర్ ఆర్. హేమలత డైరెక్టర్ ఎన్.ఐ.ఎన్. శశికళ సిన్హా భారత రక్షణ రంగానికి కలికి తురాయి వంటి అడ్వాన్స్డ్ ఏరియా డిఫెన్స్ ప్రాజెక్టు డైరెక్టర్. డీఆర్డీవో ఔట్‌స్టాండింగ్ సైంటిస్ట్ జ్యోత్స్న ధవన్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సీనియర్ శాస్త్రవేత్త. దేశంలో అంతరిక్ష ప్రయోగాలకు బాటలు వేసిన దిగ్గజ శాస్త్రవేత్త సతీశ్ ధవన్ కుమార్తె కూడా! మంజులా రెడ్డి హైదరాబాద్‌లోని సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త. ఈ ఏటి ఇన్ఫోసిస్ అవార్డు గ్రహీత సౌమ్య స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త. ►పరిశోధన ఉద్యోగం కాదు. జీవితాంతపు విధి నిర్వహణ. కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూనే ఉద్యోగ బాధ్యతల్ని సమర్థంగా చేపట్టడం ఈ రంగంలోని ఏ మహిళకైనా సవాలే. అసలే సమాజంలో పురుషాధిక్యత. అడుగడుగునా అననుకూలమైన పరిస్థితులు. సామర్థ్యం, ప్రతిభ ఉన్నప్పటికీ, వాటికి తగిన గుర్తింపు లభించడం ఓ గగన కుసుమం. అయితే ఇన్ని చిక్కుముళ్ల మధ్యలోనూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో తమదైన ముద్ర వేసిన మహిళామణులు ఎందరో..! వారిలో వీరు కొందరు. ►మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం అంత తప్పేమీ కాకపోవచ్చు. కాకపోతే మానవ మేధలో 50 శాతాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడం లేదన్నది అందరూ గుర్తించాలి. వైవిధ్యత అన్నది అన్ని రంగాల్లోనూ మంచిదే. ఇంటిని అత్యంత సమర్థంగా నిర్వహించగలిగిన మహిళ పరిశోధన రంగంలోనూ పూర్తిస్థాయిలో పనిచేసి ఉంటే మానవ శాస్త్ర విజ్ఞానం మరింత పురోగమించి ఉండేదేమో. ►పరిశోధన, అభివృద్ధి రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలన్న ఆలోచన కేవలం వారి సాధికారత కోసం లేదా దయతో చేయాల్సిన పని కాదు. మెరుగైన సైన్స్ కోసమే ఇది జరగాలి. ►‘‘మహిళా శాస్త్రవేత్తగా గుర్తింపు వచ్చేందుకు, తగిన అవార్డులు లభించేందుకు ఆలస్యం జరుగుతోంది’’ -
సుందర్ పిచాయ్‌కు గ్లోబల్ లీడర్షిప్ అవార్డు
వాషింగ్టన్: గూగుల్ సీఈఓ, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్‌కు అరుదైన గౌరవం దక్కింది. టెక్నాలజీ రంగంలో ఈయన చేసిన విశిష్ట సేవలను గుర్తించిన అమెరికా–భారత వాణిజ్య మండలి (యూఎస్ఐబీసీ).. ప్రతి ఏడాది ఇచ్చే గ్లోబల్ లీడర్షిప్ అవార్డుకు పిచాయ్‌ను ఎంపికచేసినట్లు ప్రకటించింది. ఈయనతో పాటు నాస్డాక్ ప్రెసిడెంట్ అడెనా ఫ్రైడ్మాన్ పేరును ప్రకటించిన యూఎస్ఐబీసీ.. ఇరువురి నేతృత్వంలోని కంపెనీలు, అంతర్జాతీయ టెక్నాలజీ రంగ ప్లాట్‌ఫాంను ఏర్పాటుచేయడంలో తమవంతు కృషిచేసినట్లు కొనియాడింది. ఇరు సంస్థల కారణంగా భారత్, అమెరికా మధ్య వస్తు, సేవల ద్వైపాక్షిక వాణిజ్యం గడిచిన ఐదేళ్లలో 150 శాతం పెరిగి గతేడాదినాటికి 142.1 బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిపింది. ఇక వచ్చేవారం జరగనున్న ఇండియా ఐడియాస్ సదస్సులో ఇరువురికి అవార్డులను అందించనున్నట్లు వెల్లడించింది. వచ్చే ఆరేళ్లలో 8.8 కోట్లకు 5జీ కనెక్షన్లు..! జీఎస్ఎంఏ అంచనా న్యూఢిల్లీ: భారత మొబైల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 2025 నాటికి 92 కోట్లకు చేరనుందని గ్లోబల్ టెలికం పరిశ్రమ సమాఖ్య (జీఎస్ఎంఏ) అంచనావేసింది. ఇదేసమయంలో 5జీ కనెక్షన్లు 8.8 కోట్లకు చేరనున్నట్లు పేర్కొంది. 2018 చివరినాటికి మొత్తం సబ్స్క్రైబర్ల సంఖ్య 75 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ఈ రంగ ఆదాయం 2016 నుంచి 20 శాతం తగ్గిపోయినట్లు వెల్లడించింది. -
ఉద్యోగార్థుల్లో నైపుణ్యాలు అంతంతే..
ముంబై: టెక్నాలజీ రంగంలో కొంగొత్త ఉద్యోగావకాశాలు కుప్పతెప్పలుగా వస్తున్నా.. వాటికి అవసరమైన నైపుణ్యాలు ఉద్యోగార్థుల్లో ఉండటం లేదని అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం సీఈవో గినీ రోమెటీ చెప్పారు. విద్యాపరంగా కేవలం డిగ్రీ పట్టా సంపాదించడం మాత్రమే కాకుండా నైపుణ్యాలను పెంచుకోవడంపై ఉద్యోగార్థులు దృష్టి సారించాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. ఇది కేవలం భారత్‌కు మాత్రమే పరిమితం కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉందని కంపెనీ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా గినీ తెలిపారు. లక్షల కొద్దీ ఇంజినీర్లు, బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్స్‌లో నాలుగింట మూడొంతుల మందికి ఉద్యోగనైపుణ్యాలు లేవంటూ నివేదికలు చెబుతున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 180 బిలియన్ డాలర్ల దేశీ సాఫ్ట్వేర్ రంగంలో ప్రస్తుతం సుమారు 40 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. సీఎంఐఈ గణాంకాల ప్రకారం దేశీయంగా 135 కోట్ల జనాభాలో 60 శాతం మంది 35 ఏళ్ల వయస్సులోపు వారు ఉండగా.. 3.12 కోట్ల యువ జనాభా ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నారు. -
అమెరికాలో భారత నారీ భేరి
న్యూయార్క్: అమెరికాలో భారత సంతతికి చెందిన మహిళలు కూడా టెక్నాలజీ రంగంలో విజయపతాకం ఎగురవేస్తున్నారు. ఫోర్బ్స్ సంస్థ 2018 సంవత్సరానికి సంబంధించి రూపొందించిన ‘అమెరికాలో అగ్ర స్థాయి 50 మంది టెక్నాలజీ ప్రముఖుల’ జాబితాలో భారత సంతతికి చెందిన నలుగురు మహిళలు చోటు దక్కించుకోవటమే దీనికి నిదర్శనం. సిస్కో మాజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పద్మశ్రీ వారియర్, ఉబెర్ సీనియర్ డైరెక్టర్ కోమల్ మంగ్తాని, కన్‌ఫ్లూయంట్ సహ వ్యవస్థాపకురాలు నేహ నార్ఖడే, ఐడెంటిటీ మేనేజ్మెంట్ కంపెనీ అయిన ‘డ్రాబ్రిడ్జ్’ వ్యవస్థాపకురాలు, సీఈవో కామాక్షి శివరామకృష్ణన్ ఈ జాబితాలో నిలిచారు. ‘‘మహిళ భవిష్యత్తు కోసం వేచి చూడదు. 2018 టాప్ 50 టెక్నాలజీ మహిళల జాబితా... ముందుచూపుతో ఆలోచించే మూడు తరాల టెక్నాలజీ నిపుణులను గుర్తించడం జరిగింది’’ అని ఫోర్బ్స్ పేర్కొంది. ఐబీఎం సీఈవో గిన్ని రోమెట్టి, నెట్‌ఫ్లిక్స్ ఎగ్జిక్యూటివ్ అన్నే ఆరన్ వంటి టెక్నాలజీ దిగ్గజాలూ ఈ జాబితాలో ఉన్నారు. సిస్కో ఎదుగుదలలో వారియర్ పద్మశ్రీ వారియర్ (58) మోటొరోలా, సిస్కో కంపెనీల్లో ఉన్నతస్థాయిల్లో పనిచేశారు. ప్రస్తుతం చైనీస్ ఎలక్ట్రిక్ స్టార్టప్ ఎన్‌ఐవోకు అమెరికా సీఈవోగా ఉన్నారు. 138 బిలియన్ డాలర్ల సిస్కో సిస్టమ్స్ కంపెనీ కొనుగోళ్ల ద్వారా మరింత ఎదగటంలో వారియర్ ముఖ్య పాత్ర పోషించారు. మైక్రోసాఫ్ట్, స్పాటిఫై బోర్డుల్లోనూ భాగస్వామిగా ఉన్నారు. ‘‘టెక్నాలజీ రంగంలో ఇతర మహిళలకు మార్గదర్శిగా వ్యవహరించేందుకు వారియర్ ఇప్పటికీ వీలు చేసుకుంటున్నారు. ట్విట్టర్ ద్వారా 16 లక్షల మంది ఫాలోవర్లకు అందుబాటులో ఉంటున్నారు’’అని ఫోర్బ్స్ ప్రస్తుతించింది. గుజరాత్‌లోని ధర్మసిన్హ్ దేశాయ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థి అయిన మంగ్తాని ప్రస్తుతం క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్‌లో బిజినెస్ ఇంటెలిజెన్స్ హెడ్. పలు స్వచ్ఛంద సంస్థలకూ సేవలందిస్తున్నారు. పుణే యూనివర్సిటీ పూర్వ విద్యార్థి నార్ఖెడె లింక్డెన్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసే సమయంలో అపాచేకఫ్‌కా అనే అప్లికేషన్‌ను అభివృద్ధి చేశారు. ఇది రియల్‌టైమ్‌లో భారీ గా వచ్చే డేటాను ప్రాసెస్ చేస్తుంది. కన్‌ఫ్లూయెంట్‌ను కూడా ఆమె స్థాపించారు. ఈ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్, నెట్‌ఫ్లిక్స్, ఉబెర్‌కు సేవలందిస్తోంది. ‘‘ప్రజలు రోజువారీగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లను విస్తృతంగా వినియోగిస్తున్నారు. అన్ని రకాల పరికరాల్లో ప్రకటనలను చూపించే మార్గం ప్రకటనదారులకు కావాలి. ఫేస్బుక్, గూగుల్ ప్రకటనదారులకు ఇప్పటికే ఈ సేవలందిస్తున్నాయి. డ్రాబ్రిడ్జ్ వ్యవస్థాపకురాలు కామాక్షి శివరామకృష్ణన్(43) రూపంలో వా టికిపుడు పోటీ ఎదురైంది’’ అని ఫోర్బ్స్ తెలిపింది.