అంతరిక్షంలో మువ్వన్నెల రెపరెపలు! | Reparepalu tricolor space! | Sakshi
Sakshi News home page

అంతరిక్షంలో మువ్వన్నెల రెపరెపలు!

Published Tue, Dec 30 2014 5:35 PM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

అంతరిక్షంలో మువ్వన్నెల రెపరెపలు! - Sakshi

అంతరిక్షంలో మువ్వన్నెల రెపరెపలు!

2014 రౌండప్

భారత ‘గడుసు’ పిల్లాడు(జీఎస్‌ఎల్‌వీ రాకెట్) ఎట్టకేలకు మాట విన్నాడు. కోట్ల మైళ్లు ప్రయాణించి అంగారకుడిని చేరుకున్న ‘మామ్’ తిరుగులేని విజయం కట్టబె ట్టింది. జీఎస్‌ఎల్‌వీ మార్క్-3తో మానవసహిత అంతరిక్ష యాత్రకు ఇస్రో తొలి అడుగు వేసింది. మొత్తానికి 2014లో అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ ఒక వెలుగు వెలిగింది. మరోవైపు యూరోపియన్ అంతరిక్ష సంస్థ(ఈసా)కు చెందిన రోసెట్టా వ్యోమనౌక గ్రహశకలంపై ల్యాండర్‌ను జారవిడిచి మరో చరిత్రను సృష్టించింది. ఈ ఏడాది శాస్త్ర, సాంకేతిక రంగంలో నమోదైన కొన్ని ముఖ్య విజయాలు..
- నేషనల్ డెస్క్
 
‘క్రయో’జయం..

2014, జనవరి 5: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 20 ఏళ్ల కల సాకారమైన రోజిది. జీఎస్‌ఎల్‌వీ-డీ5 రాకెట్ శ్రీహరికోటలోని షార్ నుంచి జీశాట్-14 సమాచార ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్‌తో తొలిసారిగా సత్తాచాటిన జీఎస్‌ఎల్‌వీ రాకెట్.. భారత్‌ను అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్‌ల సరసన నిలిపింది. భారీ ఉపగ్రహాలను సొంతంగానే ప్రయోగించే సత్తాను అందించింది.
 
మార్స్ చెంతకు మామ్

సెప్టెంబర్ 24: భారత అంగారక యాత్ర దిగ్విజయం అయిన రోజిది. ఇస్రో ప్రయోగించిన మంగళ్‌యాన్(మామ్) ఉపగ్రహం 9 నెలల్లో 65 కోట్ల కి.మీ. ప్రయాణించి మార్స్‌ను చేరుకుంది. అమెరికా, రష్యా, ఐరోపాలు ఈ ఘనత సాధించినా.. తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్న ఏకైక దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. రూ.450 కోట్ల ఖర్చుతోనే ఇంతటి విజయం సాధించడంపై ప్రపంచమంతా ప్రశంసల వర్షం కురిపించింది.
 
తోకచుక్కను చేరిన రోసెట్టా

నవంబర్ 12: ఐరోపా అంతరిక్ష సంస్థ ప్రయోగించిన రోసెట్టా వ్యోమనౌక పదేళ్లలో 600 కోట్ల కి.మీ. ప్రయాణించి ‘65/పీ చుర్యుమోవ్ గెరాసిమెంకో’ తోకచుక్కను చేరింది. వేల కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్న ఆ తోకచుక్క చుట్టూ తిరుగుతూనే ‘ఫీలే’ ల్యాండర్‌ను రోసెట్టా జారవిడిచింది.  ల్యాండర్ రాళ్ల మధ్య చీకట్లో పడటం వల్ల విద్యుదుత్పత్తి చేసుకోలేక తాత్కాలికంగా మూగబోయింది. అయినా ఆ లోపే భూమికి సమాచారం పంపింది.
 
తొలి అడుగు

డిసెంబర్ 18: మానవ సహిత అంతరిక్ష యాత్ర దిశగా ఇస్రో తొలి అడుగు వేసింది. శ్రీహరికోటలోని షార్ నుంచి జీఎస్‌ఎల్‌వీ మార్క్-3ని విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా వ్యోమగాముల గదిని అంతరిక్షానికి పంపి, దానిని తిరిగి నేలకు సురక్షితంగా తీసుకురాగలిగింది. అయితే, ఈ రాకెట్‌లో డమ్మీ క్రయోజెనిక్ ఇంజన్‌ను ఉపయోగించారు. అసలైన క్రయోజెనిక్ ఇంజన్‌ను తయారుచే సి పరీక్షించేందుకు మరో రెండేళ్లు పట్టనుంది.  
 
ఐఎస్‌ఎస్‌కు 3డీ ప్రింటర్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)కు ఈ ఏడాది ‘3డీ ప్రింటర్’ చేరింది. అక్కడి వ్యోమగాములు ఆ ప్రింటర్‌తో నాసా అనే అక్షరాలను, బోల్టులను బిగించేందుకు ఉపయోగించే స్పానర్‌నూ ప్రింట్ చేశారు. స్పానర్‌కు కావలసిన సాఫ్ట్‌వేర్‌ను నాసా భూమి నుంచి ఈ-మెయిల్ చేసింది. భవిష్యత్తులో అంతరిక్షంలో అవసరమైన పనిముట్లను, వస్తువులను అక్కడే 3డీ ప్రింటర్ ద్వారా ప్రింట్ చేసుకునేందుకు దీనితో మార్గం సుగమం అయింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement