‘శక్తి’మాన్‌ భారత్‌ | India successfully tests anti-satellite missile system | Sakshi
Sakshi News home page

‘శక్తి’మాన్‌ భారత్‌

Published Thu, Mar 28 2019 3:44 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

India successfully tests anti-satellite missile system - Sakshi

ఉపగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు నింగిలోకి దూసుకెళ్తున్న ఏశాట్‌ క్షిపణి

న్యూఢిల్లీ/బీజింగ్‌/ఇస్లామాబాద్‌: అంతరిక్ష రంగంలో భారత్‌ మరో కీలక ముందడుగు వేసింది. అంతరిక్షంలోని శత్రుదేశాల ఉపగ్రహాలను కూల్చివేయగల శాటిలైట్‌ విధ్వంసక క్షిపణి(ఏశాట్‌)ని భారత్‌ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. భూదిగువ కక్ష్యలో 300 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న పనిచేయని ఓ ఉపగ్రహాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఏశాట్‌ క్షిపణి 3 నిమిషాల్లో కూల్చివేసింది. అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఈ సామర్థ్యం సాధించిన నాలుగో దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది. ‘మిషన్‌ శక్తి’ పేరుతో చేపట్టిన ఈ ప్రయోగం వివరాలను ప్రధాని మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో వెల్లడించారు.

ఏ దేశానికీ వ్యతిరేకం కాదు
మోదీ ప్రసంగిస్తూ..‘భారత్‌ శాటిలైట్‌ విధ్వంసక క్షిపణి(ఏశాట్‌)ని విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని బాలాసోర్‌లో ఉన్న డా.ఏపీజే అబ్దుల్‌కలాం ద్వీపం నుంచి బుధవారం ఉదయం 11.16 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టాం. ప్రతీ దేశ చరిత్రలో ప్రజలు చాలా గర్వపడే, భవిష్యత్‌ తరాలపై గొప్ప ప్రభావం చూపే ఘటనలు కొన్ని చోటుచేసుకుంటాయి. ఈరోజు జరిగిన ఏశాట్‌ ప్రయోగం అలాంటిదే. భూదిగువ కక్ష్యలో 300 కి.మీ ఎత్తులో తిరుగుతున్న ఓ ఉపగ్రహాన్ని అత్యంత కచ్చితత్వంతో కేవలం 3 నిమిషాల వ్యవధిలో ఏశాట్‌ కూల్చివేసింది. ఇప్పటివరకూ భూ,జల, వాయు మార్గాల్లో పటిష్టంగా ఉన్న మనం అంతరిక్షంలోనూ మన ప్రయోజనాలను కాపాడుకునే సామర్థ్యాన్ని సొంతం చేసుకున్నాం. ఏశాట్‌ ప్రయోగం సందర్భంగా భారత్‌ ఎలాంటి అంతర్జాతీయ చట్టాలను, ఒప్పందాలను ఉల్లంఘించలేదు.

ముంబైలో బాంబే స్టాక్‌ ఎక్చేంజ్‌ వద్ద మోదీ ప్రసంగం వింటున్న స్థానికులు

ఈ క్షిపణిని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది. ఏశాట్‌ చేరికతో భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమైంది. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన శాస్త్రవేత్తలతో పాటు దేశప్రజలందరికీ అభినందనలు’ అని తెలిపారు. ప్రసంగం అనంతరం ఈ ప్రయోగం చేపట్టిన శాస్త్రవేత్తలతో మోదీ సమావేశమయ్యారు. శాస్త్రవేత్తల తాజా విజయంతో దేశప్రజలంతా గర్వపడుతున్నారని వారితో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బుధవారం మధ్యాహ్నం 11.45 నుంచి 12 గంటల మధ్యలో కీలక ప్రకటన చేస్తానని మోదీ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. అయితే ఏశాట్‌ ప్రయోగం విజయవంతమైందని ధ్రువీకరించుకునేందుకు ఎక్కువ సమయం పట్టడంతో మధ్యాహ్నం 12.10 గంటలకు ఈ విషయాన్ని ప్రకటించారు.

ఆచితూచి స్పందించిన చైనా
భారత్‌ ఏశాట్‌ క్షిపణి ద్వారా ఉపగ్రహాన్ని కూల్చివేయడంపై చైనా ఆచితూచి స్పందించింది. ‘భారత్‌ ఏశాట్‌ క్షిపణిని పరీక్షించినట్లు తెలిసింది. ప్రపంచదేశాలన్నీ అంతరిక్షంలో శాంతి, సుస్థిరతను కాపాడేందుకు కట్టుబడి ఉంటాయని ఆశిస్తున్నాం’ అని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. మరోవైపు ఈ ప్రయోగంపై పాక్‌ తీవ్రంగా స్పందించింది. భారత్‌ అంతరిక్షంలో ఊహాజనిత శత్రువుల కోసం సిద్ధమవుతోందని పాక్‌ విదేశాంగ ప్రతినిధి ఫైజల్‌ విమర్శించారు.

ఈసీకి ప్రతిపక్షాల ఫిర్యాదు
శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగం నిర్వహిస్తే, దాని ఘనతను సొంతం చేసుకునేందుకు మోదీ ఉబలాటపడుతున్నారని దుయ్యబట్టాయి. ఏప్రిల్‌ 11న లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రసంగించడం ద్వారా మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ విషయమై కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ స్పందిస్తూ..‘ఏశాట్‌ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన శాస్త్రవేత్తలకు అభినందనలు. ప్రధాని మోదీకి అంతర్జాతీయ నాటక దినోత్సవ శుభాకాంక్షలు’ అని చురకలు అంటించారు. ఏశాట్‌ ప్రాజెక్టు మన్మోహన్‌ సింగ్‌ హయాంలో ప్రారంభమైందని కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ వ్యాఖ్యానించారు.


మోదీ అడ్డూఅదుపులేని డ్రామాపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. నిరుద్యోగం, మహిళల భద్రత, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మోదీ మళ్లించారని ఎస్పీ, బీఎస్పీలు విమర్శించాయి. ప్రధాని ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ సీపీఎం ఈసీకి ఫిర్యాదు చేసింది. మరోవైపు ఈ వ్యవహారంపై విచారణకు అధికారులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు ఈసీ ప్రకటించింది. భారత్‌ దగ్గర 2007 నుంచి శాటిలైట్‌ విధ్వంసక క్షిపణి(ఏశాట్‌) సాంకేతికత ఉందని ఇస్రో మాజీ చైర్మన్‌ జి.మాధవన్‌ తెలిపారు. కానీ ఈ విషయంలో అప్పటి ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో ప్రయోగాన్ని చేపట్టలేదని వెల్లడించారు.

రెండేళ్ల క్రితమే ఆమోదం
కీలక సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో భారత సామర్థ్యానికి ఏశాట్‌ ప్రయోగం ఓ మచ్చుతునక అని డీఆర్‌డీవో చైర్మన్‌ సతీశ్‌రెడ్డి తెలిపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రెండేళ్ల క్రితమే ఆమోదముద్ర లభించిందన్నారు. శత్రుదేశాలకు ఇది ఓ హెచ్చరికగా ఉపయోగపడుతుందన్నారు. తాజా ప్రయోగంతో భారత్‌ శత్రుదేశాల ఉపగ్రహాలను సెంటీమీటర్ల కచ్చితత్వంతో కూల్చివేసే సామర్థ్యాన్ని సొంతం చేసుకుందన్నారు. ఈ ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తిచేశామనీ, తద్వారా డీఆర్‌డీవో సమర్థతను చాటుకున్నామని పేర్కొన్నారు. భారత రక్షణశాఖ, డీఆర్‌డీవో సమన్వయంతో ఈ ప్రయోగాన్ని చేపట్టాయన్నారు.

డీఆర్‌డీవో చైర్మన్‌ సతీశ్‌రెడ్డి

ఏ శాట్‌ క్షిపణి పనిచేసిందిలా..
ఖండాంతర క్షిపణి కార్యక్రమం (ఐడీబీఎం)లో భాగంగా భారత్‌ అభివృద్ధి చేసిన ఏశాట్‌ క్షిపణిని ఇందులో ఉపయోగించారు. ఈ ప్రయోగం ప్రధానంగా మూడుదశల్లో కొనసాగింది. తొలుత భారత భూభాగంపై నిఘాపెట్టిన ఓ ఉపగ్రహాన్ని భూమిపైన ఉన్న రాడార్లు గుర్తించాయి. ఓసారి టార్గెట్‌ను లాక్‌చేసిన అనంతరం మొబైల్‌ లాంచర్‌ ద్వారా క్షిపణిని నిర్దేశిత లక్ష్యంపైకి ప్రయోగించారు. రెండోదశలో భాగంగా భూమి నుంచి నిర్ణీత ఎత్తులోకి వెళ్లాక ఏశాట్‌కు అమర్చిన హీట్‌షీల్డ్స్‌ తొలగిపోయాయి. మూడో దశలో భాగంగా రాడార్‌ సాయంతో ఏశాట్‌ క్షిపణి లక్ష్యంవైపు దూసుకుపోయి నిర్దేశిత ఉపగ్రహాన్ని కూల్చివేసింది.

తిరుగులేని గురి
శత్రు దేశాల నుంచి వచ్చే క్షిపణులను మార్గమధ్యంలో గాల్లోనే పేల్చేయడం గురించి మనం చాలాసార్లు వినే ఉంటాం. మిషన్‌ శక్తిలో కూడా దాదాపు ఇలాంటి క్షిపణినే వాడారు. అయితే, ఇందులో వాడిన సాంకేతిక పరిజ్ఞానంలో కొంత తేడా ఉంది. కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉండే అతి చిన్న లక్ష్యాన్ని ఛేదించాలంటే క్షిపణి ఎంతో కచ్చితమైన మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. బుధవారం నాటి పరీక్షలో ఈ కచ్చితత్వం సాధించగలిగామని, అన్ని రకాలుగా పరీక్ష సఫలమైందని డీఆర్‌డీవో వర్గాలు తెలిపాయి.  

అమెరికాతో మొదలు
ఉపగ్రహ ప్రయోగాలు మొదలైన 1950లలోనే అమెరికా వాటిని ఆకాశంలోనే కూల్చేసే టెక్నాలజీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అమెరికా వాయుసేన నిపుణులు వెపన్‌ సిస్టమ్స్‌ –199ఏ పేరుతో ఈ ప్రయోగాలు చేపట్టారు. వీటిల్లో ఒకటి లాక్‌హీడ్‌ మార్టిన్‌ ప్రాజెక్టు బోల్డ్‌ ఓరియన్‌. సార్జెంట్‌ క్షిపణి మోటార్‌ ఆధారంగా తయారు చేసిన ఈ యాంటీ శాటిలైట్‌ మిస్సైల్‌ను 1958 మే నుంచి 1959 అక్టోబరు మధ్యకాలంలో దాదాపు 12సార్లు పరీక్షించారు. చాలా పరీక్షలు విఫలమయ్యాయి. దీంతో  క్షిపణి వ్యవస్థలో మార్పులు చేశారు. 1700 కిలోమీటర్ల పరిధితో కూడిన క్షిపణిని సిద్ధం చేసి పరీక్షించారు. కానీ, ఇది లక్ష్యానికి 6.4 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకెళ్లింది.

అప్పటి సోవియట్‌ యూనియన్‌ కూడా ఉపగ్రహాలను కూల్చివేసే వ్యవస్థలను పలుమార్లు పరీక్షించింది. శత్రు ఉపగ్రహాలను బలమైన విద్యుదావేశంతో నాశనం చేయగల వ్యవస్థను సోవియట్‌ యూనియన్‌ 1970 తొలినాళ్లలోనే సిద్ధం చేసింది. 1985లో అమెరికా ఏజీఎం –135 పేరుతో ఎఫ్‌–15 యుద్ధ విమానం నుంచి ప్రయోగించగల ఇంకో క్షిపణి ద్వారా సోల్‌విండ్‌ పీ78–1 ఉపగ్రహాన్ని కూల్చివేసింది. 2007లో చైనా పాతకాలపు వాతావరణ ఉపగ్రహాన్ని కూల్చివేయడంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. చైనా ప్రయోగం పుణ్యమా అని అంతరిక్షంలో దాదాపు మూడు వేల శకలాలు చెల్లాచెదురుగా ఏర్పడ్డాయి. 2008లో అమెరికా కూడా ఓ నౌకపై నుంచి ఎస్‌ఎం3 క్షిపణిని ప్రయోగించి అంతరిక్షంలో పనిచేయని ఉపగ్రహం ఒకదాన్ని కూల్చేసింది.  

సైనిక అవసరాలకు కూడా
అంతరిక్షంలోని ఉపగ్రహాలను కూల్చేసే సాంకేతికతతో మిలటరీకీ ప్రయోజనకరమనడంలో ఎలాంటి సందేహం లేదు. శత్రుదేశాల ఉపగ్రహాలను కూల్చివేస్తే వారికి వ్యూహాత్మక సమాచారం అందకుండా పోతుంది. బుధవారం నాటి ప్రయోగాలతో భారత వ్యతిరేక శక్తుల ఉపగ్రహాలను కూల్చివేసే సామర్థ్యం సంపాదించుకున్నట్లు అయింది. ఒకవైపు పాకిస్తాన్‌ తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూండటం.. భారత వాయుసేన బాలాకోట్‌పై దాడి నేపథ్యంలో ఈ టెక్నాలజీకి మరింత ప్రాధాన్యం లభించింది. చైనా, రష్యా రాకెట్ల సాయంతో పాకిస్తాన్‌ ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఉపగ్రహాలను కూల్చివేసే క్రమంలో ఏర్పడుతున్న శకలాలు అనేక సమస్యలు సృష్టిస్తున్నాయి. విపరీతమైన వేగంతో ప్రయాణించే ఈ శకలాలు ఏ ఒక్కటి ఢీకొన్నా ఆయా కక్ష్యల్లో ఉండే ఉపగ్రహాలకు భారీ నష్టం వాటిల్లుతుంది. భూమికి 330 కిలోమీటర్ల ఎత్తులో ఉండే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తరచూ తన కక్ష్యను మార్చుకుంటూ ఈ శకలాల నుంచి తప్పించుకుంటోంది.


ఊహాత్మక చిత్రం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement