sucessfully
-
Chandrayaan-3: ఇక అంగారకుడిపైకి అడుగు!
బెంగళూరు: దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ హర్షం వ్యక్తంచేశారు. భారత శాస్త్రవేత్తల కృషి ఫలించిందని, ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘చంద్రయాన్–3 విజయంతో అంగారకుడిపైకి వెళ్తాం. భవిష్యత్తులో శుక్రుడితోపాటు ఇతర గ్రహాలపైకి వెళ్తాం’ అని చెప్పారు. ఇది ఏ దేశానికైనా కష్టం ‘ఈ రోజు టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందినా చంద్రుడిపైకి ప్రయాణం చేయడం ఏ దేశానికైనా అంత సులువు కాదు. అదీగాక సాఫ్ట్ లాండింగ్ మరింత సంక్లిష్టమైన విషయం. అయితే, కేవలం రెండు మిషన్లతోనే భారత్ సుసాధ్యం చేసి చూపింది. మానవరహిత వ్యోమనౌకను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు మాత్రమే చంద్రయాన్–1ను చేపట్టాం.’ అని సోమనాథ్ చెప్పారు. మేడిన్ ఇండియా మిషన్ ‘ చంద్రయాన్–2 నుంచి నేర్చుకున్న పాఠాలు ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రతి ఒక్కరూ చంద్రయాన్ విజయం కోసం ప్రార్థించారు. చంద్రయాన్–2 మిషన్‌లో పాలుపంచుకున్న చాలామంది కీలక శాస్త్రవేత్తలు చంద్రయాన్–3 మిషన్ బృందంలో పనిచేశారు. చంద్రయాన్–3లో వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానం ఏ టెక్నాలజీ కంటే కూడా తక్కువ కాదు. ప్రపంచంలోని అత్యుత్తమ సెన్సర్లు మన వద్ద ఉన్నాయి. ఇది పూర్తిగా ప్రపంచస్థాయి పరికరాలతో దేశీయంగా రూపొందించిన మేడిన్ ఇండియా మిషన్’ అని సోమనాథ్ చెప్పారు. -
నేటితో ఎల్ఐసీ ఐపీవో ముగింపు
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. షేరుకి రూ. 902–949 ధరలో ఈ నెల 4న ప్రారంభమైన ఇష్యూ నేడు(9న) ముగియనుంది. ఆదివారానికల్లా ఇష్యూ మొత్తం 1.8 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. దాదాపు 16.21 కోట్ల షేర్లకుగాను 29 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. రిటైలర్ల విభాగంలో ఆఫర్ చేసిన 6.9 కోట్ల షేర్లకుగాను 10.99 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. పాలసీదారుల నుంచి 5 రెట్లు, ఉద్యోగుల నుంచి 3.8 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. ఇక నాన్‌ఇన్‌స్టిట్యూషనల్ విభాగంలో 1.24 రెట్లు బిడ్స్ దాఖలుకాగా.. క్విబ్ కోటాలో మాత్రం 0.67 శాతమే స్పందన కనిపించింది. పాలసీదారులకు రూ. 60, ఉద్యోగులు, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ. 45 చొప్పున ఎల్ఐసీ ఐపీవో ధరలో రాయితీ ఇస్తోంది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయానికి ఉంచిన సంగతి తెలిసిందే. తద్వారా రూ. 20,600 కోట్లవరకూ సమకూర్చుకోవాలని చూస్తోంది. 5 కోట్ల మార్క్ తొలిసారి 5 కోట్ల అప్లికేషన్ల మైలురాయిని దాటిన ఐపీవోగా ఎల్ఐసీ నిలిచినట్లు పేటీఎమ్ మనీ సీఈవో వరుణ్ శ్రీధర్ పేర్కొన్నారు. వినియోగదారుల నుంచి భారీ స్పందన కనిపిస్తున్నట్లు చెప్పారు. ఒక్కో దరఖాస్తుపై సగటు పెట్టుబడికంటే అధికంగా రూ. 29,000 చొప్పున లభిస్తున్నట్లు తెలియజేశారు. యూపీఐ ద్వారా ఐపీవోకు రూ. 5 లక్షలవరకూ అనుమతించడంతో హెచ్ఎన్ఐ పెట్టుబడులు సైతం తరలివస్తున్నట్లు పేర్కొన్నారు. -
టోక్యో గెలిచింది
కరోనా వచి్చనా... వేరియంట్లతో కలకలం రేపినా... ఓ ఏడాది వాయిదా పడినా... ఆఖరి దాకా అనుమానాలే ఉన్నా... మెజార్టీ జపనీయులు వ్యతిరేకించినా... సక్సెస్ (ఒలింపిక్స్)... డబుల్ సక్సెస్ (పారాలింపిక్స్)... టోక్యో ఇప్పుడు వేదిక కాదు... ముమ్మాటికి విజేత! ఎనిమిదేళ్ల జపాన్ శ్రమ వృథా కాలేదు. నాడు ఆతిథ్య హక్కులు పొందిన రాజధాని (టోక్యో) నేడు హ్యాపీగా ముగించేంత వరకు... చేసిన కసరత్తు, పడిన శ్రమ, వెచ్చించిన వ్యయం, కట్టుదిట్టంగా రూపొందించిన నియమావళి, వేసుకున్న ప్రణాళికలు అన్నీ కుదిరాయి. మాటు వేసిన మహమ్మారిని జయించి మరీ ఒలింపిక్స్, పారాలింపిక్స్ భేషుగ్గా జరిగాయి. భళారే అన్నట్లుగా ముగిశాయి. ప్రేక్షకులు లేని లోటు ఉన్నా... ఆటగాళ్లకు, అధికారులకు ఏ లోటు లేకుండా జపాన్ పకడ్బందీగా పనులు చక్కబెట్టిన తీరుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), పారాలింపిక్ కమిటీ (ఐపీసీ), ప్రపంచ క్రీడా సమాఖ్యలు ఫిదా అయ్యాయి. టోక్యోకు జయ హో అన్నాయి. ఇక ఒలింపిక్ టార్చ్ చలో చలోమని పారిస్ (2024) బాట పట్టింది. ఇంకో మూడేళ్లే ఉన్న తదుపరి ఒలింపిక్స్ కోసం ఫ్రాన్స్ ఏర్పాట్లలో తలమునకలైంది. మనం... అందరం... కలుద్దాం పారిస్‌లో..! సందడి చేద్దాం ఒలింపిక్స్‌లో! ఎదురులేని చైనా మొత్తం 162 దేశాలు పాల్గొన్న టోక్యో పారాలింపిక్స్‌లో చైనా తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. చైనా 96 స్వర్ణాలు, 60 రజతాలు, 51 కాంస్యాలతో కలిపి మొత్తం 207 పతకాలు సాధించింది. 124 పతకాలతో బ్రిటన్ (41 స్వర్ణాలు, 38 రజతాలు, 45 కాంస్యాలు) రెండో స్థానంలో... 104 పతకాలతో అమెరికా (37 స్వర్ణాలు, 36 రజతాలు, 31 కాంస్యాలు) మూడో స్థానంలో నిలిచాయి. ఓవరాల్‌గా 78 దేశాలు కనీసం ఒక్క పతకమైనా సాధించాయి. తదుపరి పారాలింపిక్స్ 2024లో పారిస్‌లో జరుగుతాయి. -
అమ్ముల పొదిలో నాగాస్త్రం
జైపూర్: మన దేశ రక్షణ రంగం మరింత బలోపేతమైంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ట్యాంకు విధ్వంసక క్షిపణి నాగ్ తుది దశ ప్రయోగాలను రక్షణ అధ్యయన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) విజయవంతంగా పూర్తి చేసింది. రాజస్తాన్‌లోని పోఖ్రాన్లో గురువారం ఉదయం 6:45 గంటలకి నాగ్ క్షిపణి నిర్దేశిత లక్ష్యాలను కచ్చితంగా ఛేదించినట్టు డీఆర్డీఓ వెల్లడించింది. శత్రువుల యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయడానికి యాంటీ ట్యాంకు మిస్సైల్ గైడ్ (ఏటీజీఎం)ను డీఆర్డీఓ అభివృద్ధి చేసింది. నాగ్ క్షిపణి నాలుగు నుంచి ఏడు కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలదు. మూడో తరానికి చెందిన ఈ క్షిపణి రాత్రయినా, పగలైనా శత్రువుల యుద్ద ట్యాంకుల్ని, ఇతర సాయుధ వాహనాల్ని ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణి క్యారియర్ని రష్యాకు చెందిన బీఎంపీ–2 పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఈ తరహా పరిజ్ఞానం ‘లాక్ బిఫోర్ లాంచ్’ వ్యవస్థని కలిగి ఉంటుంది. అంటే క్షిపణిని ప్రయోగించడానికి ముందే లక్ష్యాలను గుర్తిస్తారు. భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండడంతో కేంద్రం క్షిపణి ప్రయోగాలను వేగవంతం చేసింది. తుది దశ ప్రయోగం విజయవంతం కావడం పగలు, రాత్రి కూడా క్షిపణి కచ్చితంగా లక్ష్యాలను ఛేదించడంతో ఈ క్షిపణి ఉత్పత్తి దశకు చేరుకుందని డీఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ అధికారులు అందించిన సమాచారం ప్రకారం ఈ క్షిపణి ఇక భారత అమ్ముల పొదిలోకి చేరడానికి సిద్ధంగా ఉంది. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో నాగ్ క్షిపణిని మోహరించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పోఖ్రాన్లో నింగిలోకి దూసుకెళ్తున్న నాగ్ క్షిపణి -
యుద్ధనౌకపై తేజస్ ల్యాండింగ్ విజయవంతం
న్యూఢిల్లీ: భారత నేవీ కోసం సిద్ధమవుతున్న తేజస్ ‘ప్రయోగదశ’ విమానం.. యుద్ధవిమాన వాహకనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై విజయవంతంగా దిగి చరిత్ర సృష్టించింది. దీంతో యుద్ధ విమాన వాహక నౌకలపై యుద్ధ విమానాలను దించగల అతికొన్ని దేశాల జాబితాలో భారత్ చేరింది. ఈ నావికాదళ తేజస్‌ను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ), ఏర్‌క్రాఫ్ట్ రీసెర్చ్ అండ్ డిజైన్ సెంటర్ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, సీఎస్ఐఆర్ తదితర సంస్థలు కలసి అభివృద్ధి చేశాయి. తీర ప్రాంత పరీక్ష సౌకర్యాలపై పరీక్షించిన అనంతరం ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై శనివారం ఉదయం 10 గంటల 2 నిమిషాలకు తేజస్ యుద్ధ విమానాన్ని ల్యాండింగ్ చేయించినట్లు డీఆర్డీవో ప్రతినిధి తెలిపారు. నావికాదళానికే సంబంధించిన తేజస్ లైట్ ఇంకా అభివృద్ధి దశలో ఉంది. భారత యుద్ధ విమానాల అభివృద్ధి కార్యక్రమంలో ఇదో గొప్ప మెట్టు అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. -
పాక్ అణు క్షిపణి పరీక్ష
ఇస్లామాబాద్: భూతలం నుంచి భూతలానికి ప్రయోగించగల అణుసామర్థ్య బాలిస్టిక్ క్షిపణి ‘షహీన్–1’ను పాక్ విజయవంతంగా పరీక్షించింది. సోమవారం పరీక్షించిన ఈ క్షిపణి దాదాపు 650 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. భారత్‌లోని పలు నగరాలు ఈ క్షిపణి పరిధిలోకి వచ్చాయి. గత ఆగస్టులోనూ 290 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల ఘజ్నావీ క్షిపణిని పాకిస్తాన్ పరీక్షించింది. భారత్ కూడా ఇటీవల బ్రహ్మోస్ క్షిపణితో పాటు 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల అగ్ని–2 క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. -
అందరి చూపూ ఇక సెప్టెంబర్ 7 వైపు!
హమ్మయ్యా...! ఒక ఘట్టం ముగిసింది. చంద్రయాన్ –2 ప్రయోగం విజవంతమైంది. ఇంకేముంది.. అంతా హ్యాపీయేనా?. ఊహూ.. అస్సలు కాదు. ఇస్రోకు అసలు పరీక్ష ముందుంది. కచ్చితంగా చెప్పాలంటే సెప్టెంబరు 7వ తేదీన! ఆ రోజు ఏం జరగబోతోంది? చక్కగా వేసిన రహదారిపై వాహనాన్ని నడపడం చాలా సులువే. రహదారి అస్సలు లేకపోతేనే సమస్య. ఇస్రో పరిస్థితి ఇప్పుడు ఇదే. ఇప్పటివరకూ ఎవ్వరూ చేయని విధంగా జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రయాన్ –2ను దింపాలన్న ఇస్రో ఆలోచన చాలా సమస్యలతో కూడుకున్నది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ స్వయంగా అంగీకరించారు కూడా. జూలై 22న నింగికి ఎగసిన చంద్రయాన్ –2 ముందుగా భూమి చుట్టూ కొన్ని చక్కర్లు కొట్టి.. ఆ తరువాత జాబిల్లి కక్ష్యలోకి చేరుతుంది. చందమామను కూడా కొన్నిసార్లు చుట్టేసిన తరువాత ఆచితూచి జాబిల్లిపైకి దిగుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత సంక్లిష్టమైన, సమస్యా పూర్వక ఘట్టం.. జాబిల్లిపై చంద్రయాన్ దిగే చివరి 15 నిమిషాలు మాత్రమే! భూమి చుట్టూ 23 రోజులు, చంద్రుడి చుట్టూ 12 రోజులు భూమికి అతిదగ్గరగా 170 కిలోమీటర్లు (అపోజీ) అతి దూరంగా 40,000 కిలోమీటర్లు (పెరిజీ) ఉండేలా దాదాపు 23 రోజుల పాటు చక్కర్లు కొడుతూ ఉంటుంది. పూర్తిస్థాయి వేగం అందుకున్న తరువాత చంద్రయాన్ –2ను జాబిల్లి కక్ష్యలోకి పంపుతారు. ఇందుకు ఐదు రోజుల సమయం అవసరమవుతుంది. ఒక్కసారి జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించిన తరువాత లాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞ్యాన్‌లతో కూడిన చంద్రయాన్–2 మాడ్యూల్ దాదాపు 12 రోజుల పాటు చక్కర్లు కొడుతూ క్రమేపీ తన వేగాన్ని తగ్గించుకుంటూ జాబిల్లికి దగ్గరగా చేరుతుంది. ప్రయోగం జరిగిన 48వ రోజున.. అంటే సెప్టెంబరు ఏడున ఆర్బిటర్ (జాబిల్లి చుట్టూ తిరిగి వివరాలు సేకరించే భాగం) నుంచి రోవర్‌తో కూడిన ల్యాండర్ వేరుపడుతుంది. జరిగేది జూలై 15 ప్రణాళిక ప్రకారమే ఆర్బిటర్ నుంచి ల్యాండర్ వేరుపడటంతో మొత్తం ప్రయోగంలో అత్యంత కీలకమైన ఘట్టం మొదలవుతుంది. దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఇప్పటికే గుర్తించిన రెండు భారీ గుంతల మధ్య దిగేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ల్యాండర్ తన వేగాన్ని నియంత్రించుకుంటూ.. నిర్దిష్ట ప్రాంతంలో దిగాల్సి ఉండటం ఇందుకు కారణం. ఈ ప్రక్రియ కాస్తా విజయవంతమైతే.. కొంత సమయం తరువాత ల్యాండర్ లోపలి నుంచి రోవర్ కిందకు దిగుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ముందుగా అనుకున్నట్లు చంద్రయాన్ –2 ప్రయోగం జూలై 15న జరిగి ఉంటే.. జాబిల్లిపై ల్యాండింగ్ 54వ రోజు జరగాల్సి ఉండింది. కానీ ప్రయోగం వాయిదా పడింది. అయినాసరే.. సెప్టెంబరు 6–7 మధ్యకాలంలో జాబిల్లిపై ల్యాండ్ అయితే వచ్చే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇస్రో కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. భూమి చుట్టూ తిరిగే కాలాన్ని 17 నుంచి 23 రోజులకు పెంచింది. అదేసమయంలో జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించడం, అక్కడ చక్కర్లు కొట్టే కాలాన్ని తగ్గించింది. జాబిల్లిపై రోవర్, ల్యాండర్లు చేయాల్సిన ప్రయోగాలకు ఇది కీలకం. ఈ రెండు పరికరాలూ సోలార్ ప్యానెల్స్‌తో విద్యుదుత్పత్తి చేసుకుని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబరు ఆరవ తేదీ మొదలుకొని కొన్ని రోజుల పాటు ల్యాండర్, రోవర్లు దిగే ప్రాంతం భూమికి అభిముఖంగా ఉంటూ సూర్యుడి కిరణాలు ప్రసారమవుతూంటాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నిప్పులు చిమ్ముతూ...
జాబిల్లి రహస్యాలను శోధించే లక్ష్యంతో చేపట్టిన చంద్రయాన్ 2 తొలి అడుగు విజయవంతంగా పడింది. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన బాహుబలి జీఎస్ఎల్వీ మార్క్ 3 ఎం 1 రాకెట్.. చంద్రయాన్ 2ను నిర్ధారిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇక.. సెప్టెంబర్ 7న చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో విజయవంతంగా ల్యాండర్‌ను దింపడమనే మలి అడుగు కోసం మానవాళి ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో విజయవంతంగా చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా భారత దేశ అంతరిక్ష పరిశోధన శక్తి సామర్థ్యాలను ఇస్రో మరోసారి ప్రపంచం కళ్లకు కట్టింది. శ్రీహరికోట (సూళ్లూరుపేట)/సాక్షి ప్రతినిధి, అమరావతి: చంద్రుణ్ని చేరుకునే ప్రయాణంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకుంది. బాహుబలిగా పిలిచే, 640 టన్నుల బరువుండే జీఎస్ఎల్వీ–మార్క్3–ఎం1 రాకెట్ ద్వారా చంద్రయాన్–2ను విజయవంతంగా భూ కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టింది. 3,850 కేజీల బరువున్న చంద్రయాన్–2ను సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో వేదిక నుంచి నింగికి పంపారు. ప్రయోగం సమయంలో మేఘావృతమై ఉన్న ఆకాశంలోకి రాకెట్ నారింజ, పసుపు వర్ణాల్లో నిప్పులు చిమ్ముతూ ఎగిరింది. సరిగ్గా 16.14 నిమిషాల్లో చంద్రయాన్–2 మాడ్యూల్‌ను భూ కక్ష్యలోకి రాకెట్ ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది. ప్రయోగం సమయంలో ఎంతో ఉత్కంఠతో ఊపిరిబిగబట్టుకుని కూర్చున్న శాస్త్రవేత్తలు, తొలిదశ విజయవంతమైందన్న ప్రకటనతో ఒక్కసారిగా హర్షధ్వానాలతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని తమ సంతోషాన్ని పంచుకున్నారు. ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 15న తెల్లవారుజామున 2.51 గంటలకే చంద్రయాన్–2 ప్రయోగం జరగాల్సి ఉండగా.. రాకెట్‌లోని మూడో దశ క్రయోజనిక్‌లో పోగో గ్యాస్ బాటిల్స్ నుంచి క్రయోఇంజిన్ ట్యాంక్‌కు వెళ్లే పైపులు బయట ప్రాంతంలో లీకేజిని గుర్తించి ప్రయోగాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇస్రో శాస్త్రవేత్తలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని 24 గంటల్లోనే లోపాన్ని సరిచేశారు. 48 రోజుల పాటు లక్షల కిలోమీటర్ల ప్రయాణం అనంతరం సెప్టెంబర్ 7న ఈ ఉపగ్రహం జాబిల్లిపై అడుగుమోపనుంది. టెన్షన్.. టెన్షన్ చంద్రుడిపైకి మొట్టమొదటిగా ఆర్బిటర్ ద్వారా ల్యాండర్, ల్యాండర్లో అమర్చిన రోవర్ ప్రయోగం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలందరిలో ఎడతెగని టెన్షన్.. ఈ భారీ ప్రయోగంపైనే అందరి ధ్యాస. ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 20 గంటలు ముగిసే సమయం దగ్గర పడింది. షార్‌లోని మీడియా సెంటర్, మిషన్ కంట్రోల్ సెంటర్లోని మైక్‌లలో 6.. 5.. 4.. 3.. 2.. 1.. 0 అనగానే ఒక్కసారిగా అందరి కళ్లూ తూర్పు దిక్కున ఆకాశం వైపునకు మళ్లాయి. క్షణాల్లో ఆకాశంలో కమ్ముకున్న మబ్బులను చీల్చుకుంటూ జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ఉపగ్రహ వాహకనౌక చంద్రయాన్–2ను మోసుకుని నింగివైపుకెళ్లింది. మిషన్ కంట్రోల్‌రూంలోని శాస్త్రవేత్తలు కంప్యూటర్లను ఆపరేట్ చేస్తూ రెప్ప వాల్చకుండా రాకెట్ గమనాన్ని పరిశీలిస్తున్నారు. ఒక్కో దశ విజయవంతంగా దూసుకుపోవడంతో శాస్త్రవేత్తల వదనాల్లో చిరునవ్వులు. ఇలా మూడు దశలను సమర్థవంతంగా పూర్తి చేశారు. చంద్రయాన్–2ను నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీంతో మిషన్ కంట్రోల్‌రూంలోని శాస్త్రవేత్తల్లో విజయగర్వం తొణికిసలాడింది. చంద్రయాన్–2 భూ కక్ష్యలోకి చేరిందనీ, అంతా సవ్యంగా సాగుతోందని బెంగళూరులోని ఇస్రో మాస్టర్ కంట్రోల్ సెంటర్ ప్రకటించింది.శ్రీహరికోట నుంచి చేసిన అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో 75వ సారి ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించింది. ప్రయోగం ఇలా జరిగింది.. మొత్తం 3,850 కేజీల బరువైన చంద్రయాన్–2 మిషన్‌లో 2,379 కేజీల బరువైన ఆర్బిటర్, 1,471 కిలోల బరువు కలిగిన ల్యాండర్ (విక్రమ్), 27కేజీల బరువైన రోవర్ (ప్రజ్ఞాన్) ఉన్నాయి. ఇందులో మొత్తంగా 13 పేలోడ్లు ఉండగా, వాటిలో 3 యూరప్‌వి, రెండు అమెరికావి, ఒకటి బల్గేరియాది. నాసాకు చెందిన లేజర్ రెట్రోరిఫ్లెక్టర్ ఎరే (ఎల్ఆర్ఏ) కూడా వాటిలో ఓ పే లోడ్. జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ మొదటి దశలో ఇరువైపులా అత్యంత శక్తివంతమైన ఎస్–200 బూస్టర్ల సాయంతో నింగికి తన ప్రయాణాన్ని దిగ్విజయంగా ప్రారంభించింది. ఈ దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో 400 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించి 132.7 సెకన్లలో మొదటి దశను పూర్తి చేశారు. రెండో దశలో ఎల్–110 అంటే ద్రవ ఇంజిన్ మోటార్లు 110.84 సెకన్లకే స్టార్ట్ అయ్యాయి. 205 సెకన్లకు రాకెట్ శిఖరభాగాన అమర్చిన చంద్రయాన్–2 మిషన్‌కు ఉన్న హీట్‌షీల్డ్స్ విజయవంతంగా విడిపోయాయి. ఇక్కడ 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి 307 సెకన్లకు రెండో దశను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. క్రయోజనిక్ (సీ–25) మోటార్లు 311.22 సెకన్లకు మండించి 978 సెకన్లకు 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగించి మూడో దశను పూర్తి చేశారు. ఈ దశ నుంచి రాకెట్‌కు శిఖర భాగాన అమర్చిన త్రీ–ఇన్–ఒన్ చంద్రయాన్–2 మిషన్‌ను క్రయోజనిక్ దశతో 978.8 సెకన్లకు (16.55 నిమిషాల వ్యవధిలో) భూమికి దగ్గరగా (పెరిజీ) 170 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 40,000 కి.మీ. ఎత్తులో హైలీ ఎసిన్‌ట్రిక్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. రాకెట్ గమన తీరు అత్యంత సజావుగా సాగడంతో అపోజిని మరో 6,000 కి.మీ. దూరం ముందుకు పంపించి జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ తన సత్తాను చాటుకుంది. అంటే 46,000 కి.మీ. దూరంలోకి తీసుకెళ్లారు. దీనివల్ల చంద్రయాన్–2 కాలపరిమితి పెరగడమే కాకుండా ఆర్బిట్ రైజింగ్ ప్రక్రియ తగ్గింది. దీంతోచంద్రయాన్–2లో ఉన్న ఇంధనం కూడా ఆదా అయ్యి దాని జీవిత గమనం పెరిగిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇప్పటినుంచి చంద్రుడిపైకి వెళ్లే వరకు మిషన్‌ను బెంగళూరులోని మాస్టర్ కంట్రోల్ సెంటర్లోనే పూర్తి చేస్తారు. చంద్రుడిపైకి ఇలా... ముందుగా 16 రోజుల్లో ఆర్బిటర్‌లో నింపిన ఇంధనాన్ని మండించి అపోజిని 46,000 కి.మీ. నుంచి 1,41,000 కి.మీ.కు పెంచేందుకు ఆర్బిటర్‌ను మండించి 4సార్లు కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను చేపడతారు. ఐదోసారి ఆర్బిటర్‌కు ట్రాన్స్‌లూనార్ ఇంజెక్షన్ ద్వారా చంద్రుడివైపు ప్రయా ణం చేసేందుకు మళ్లిస్తారు. అనంతరం చంద్రుని చుట్టూ కక్ష్య ఏర్పరిచేందుకు చంద్రునికి చుట్టూ రెట్రోబర్న్ చేసి వంద కి.మీ. వృత్తాకార కక్ష్యను తగ్గించడానికి 4సార్లు ఆపరేషన్ చేపడతారు. 100 కి.మీ. నుంచి 30 కి.మీ. ఎత్తుకు తగ్గించుకుంటూ ఆర్బిటర్‌ను మండిస్తారు. ఆ తరువాత ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి చంద్రుడి మీదకు ప్రయాణం చేస్తుంది. ఆ తర్వాత ల్యాండర్‌ను 15 నిమిషాలు మండించి చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో మృదువైన ప్రదేశంలో నెమ్మదిగా దించే ప్రక్రియను చేపడతారు. ఆ 15 నిమిషాలు... చంద్రయాన్–1లో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్నే చంద్రయాన్–2లోనూ ఉపయోగించారు. అయితే ఇందులో ల్యాండర్‌ను చంద్రు డిపై దించే ప్రక్రియను కొత్తగా రూపొందించారు. ఇప్పటి దాకా ఇలాంటి ల్యాండింగ్ ఎవరూ చేయలేదు. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయే కీలకమైన సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తుతాయోనని ఇస్రో శాస్త్రవేత్తల్లో కొంత ఆందోళన నెలకొని ఉంది. ఈ 15 నిమిషాల సమయాన్ని అధిగమించేందుకు ఈ ప్రయోగంలో ఇస్రో మొదటిసారిగా థొరెటల్–అబల్ అనే లిక్విడ్ ఇంజిన్లను ఉపయోగించనున్నారు. చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ మృదువైన చోట ల్యాండ్ అయిన తరువాత ల్యాండర్ తలుపులు తెరుచుకోకుంటే ల్యాండర్ తలుపు బయటకొచ్చేలా డిజైన్ చేశారు. ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుడి ఉపరితలంపై రావడానికి 4 గంటల సమయం తీసుకుంటుంది. తొలిసారిగా చంద్రు ని దక్షిణ ధృవంపై అడుగుపెడుతున్న దేశంగా భారత్ రికార్డులకు ఎక్కనుంది. 14 రోజుల్లో 500 మీటర్లు రోవర్ సెకెండ్‌కు ఒక సెంటీమీటర్ వేగంతో కదులుతుం ది. రోవర్ ఒక లూనార్ డే (చంద్రరోజు) పనిచేస్తుంది. చంద్రుడిపై ఒక రోజు అంటే భూమి మీద మనకు 14 రోజులు. ఈ 14 రోజుల్లో 500 మీటర్లు దూరం ప్రయాణించి చంద్రుడి ఉపరితలంపై మూలాలను పరిశోధించి భూ నియంత్రిత కేంద్రానికి సమాచారాన్ని చేరవేస్తుంది. ఇప్పటిదాకా చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాల్లో భారత్ నాలుగోది.ఇప్పటి వరకూ రష్యా, అమెరికా, చైనాలకు చెందిన అంతరిక్ష సంస్థలు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశాయి. ఇప్పుడు చంద్రయాన్–2 పేరుతో చంద్రుడి ఉపరితలంపైకి ఆర్బిటర్ ద్వారా ల్యాండర్‌ను, ల్యాండర్ ద్వారా రోవర్‌ను పంపించే నాలుగోదేశంగా నిలిచింది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు ఈ ఘనత సాధించాయి. మూడింటిని ఒకేసారి పంపిస్తున్నారు కనుక దీన్ని త్రీ ఇన్ ఒన్ ప్రయోగంగా ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చందమామ కథ ఇదీ.. అంతరిక్షంపై పట్టు బిగించడానికి అమెరికా గట్టి ప్రయత్నాలే చేసింది. అపోలో మిషన్ ద్వారా చంద్రలోకంపైకి తొలి అడుగు వేసింది. ప్రాజెక్టు జెమినీ ప్రారంభించి అపోలోకు సాంకేతికపరంగా కొత్త హంగులు అద్దడానికి కృషి చేసింది. మొదట్లో అపజయాలు ఎదురైనా కుంగిపోలేదు. అపోలో–1 ప్రయోగం విఫలమై ముగ్గురు వ్యోమగాములు మృతి చెందారు. ఆ తర్వాత మరిన్ని పరిశోధనలు చేసింది. మొత్తంగా 6,300 టెక్నాలజీలపై ఆధిపత్యం సాధించింది. సరిగ్గా యాభై ఏళ్ల క్రితం అపోలో–11ను ప్రయోగించింది. 1969 జూలై 16న నాసా కేప్ కేనర్వాల్ అంతరిక్ష కేంద్రం నుంచి శాటర్న్–5 రాకెట్ ద్వారా అపోలో–11 నింగికి ఎగిసింది. ఈ ప్రయోగం జరిగిన 3 రోజుల తర్వాత అపోలో–11 జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది. జూలై 20న జాబిల్లిపై నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ తొలి అడుగు వేశారు. ఆ తర్వాత ఆరు గంటల పైగా తేడాతో లూనార్ మాడ్యూల్ పైలట్ బజ్ అల్డ్రిన్ జాబిల్లిపైకి దిగారు. ఇద్దరు వ్యోమగాములు జాబిల్లిపై 21.38 గంటలు గడిపారు. 21.7 కేజీల మట్టి, రాతి నమూనాలను సేకరించారు. జూలై 22న లూనార్ మాడ్యూల్‌ను విడుదల చేసిన తర్వాత అపోలో భూమికి తిరుగు ప్రయాణమైంది. 1969 జూలై 24న ఇద్దరు వ్యోమగాములు సురక్షితంగా భూమికి వచ్చారు. ఇక సూర్యుడిపై... 2020లో ఆదిత్య ఎల్1 ప్రయోగం న్యూఢిల్లీ: చంద్రయాన్–2 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన ఇస్రో ఇప్పుడు సూర్యుడిపై దృష్టి సారించింది. సూర్యుడి ఉపరితలంపై కొన్ని వేల కిలోమీటర్ల మేర విస్తరించిన ‘కరోనా’ను అధ్యయనం చేసేందుకు ‘ఆదిత్య –ఎల్1’ అనే వ్యోమనౌకను ప్రయోగించనుంది. 2020 ప్రధమార్థంలో ఈ ప్రయోగాన్ని చేపడతామని ఇస్రో తెలిపింది. ‘సూర్యుడి ఉపరితంలపై సాధారణంగా 6,000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అదే సూర్యుడి బాహ్య ఉపరితల ప్రాంతమైన ‘కరోనా’లో 9.99 లక్షల డిగ్రీల ఉష్ణోగ్రత నమోదువుతోంది. కరోనాలో ఇంతభారీగా ఉష్ణోగ్రతలు ఎందుకు నమోదవుతున్నాయో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. తాజాగా మేం ప్రయోగించనున్న ఆదిత్య–ఎల్1 నౌక కరోనాతో పాటు ట్రోపోస్పియర్, ఫొటోస్పియర్, సూర్యుడి నుంచి కణాల ప్రవాహాన్ని అధ్యయనం చేస్తుంది’ అని ఇస్రో వెల్లడించింది. వాతావరణ మార్పులపై కరోనా గణనీయమైన ప్రభావం చూపుతుందని పేర్కొంది. భూమికి సూర్యుడు 14.96 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. చంద్రయాన్–1తో పరిశోధనలిలా.. శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2007 దాకా వివిధ రకాలైన రాకెట్ల ద్వారా రిమోట్ సెన్సింగ్, సమాచారం, వాతావరణ పరిశోధన, ఖగోళ పరిశోధనలకు సంబంధించిన ప్రయోగాలు మాత్రమే చేస్తూ వచ్చింది. గ్రహాంతర ప్రయోగాలు చేయాలని నిశ్చయించుకుని 2008లో చంద్రయాన్–1 ప్రయోగాన్ని పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా చేపట్టింది. ఆ ప్రయోగంలో చంద్రుని కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపి పరిశోధనలు చేసింది. అయితే చంద్రయాన్–1 ఉపగ్రహాన్ని రెండేళ్లపాటు పనిచేసే లా రూపొందించారు. అయితే, అందులో పంపిన పరికరాలు పది నెలలకే పనిచేయడం మానేశాయి. అంటే చంద్రయా న్–1 పది నెలలు పనిచేసిన తరువాత సాంకేతికపరమైన లోపంతో పనిచేయడం మానేసింది. అప్పటికే చంద్రుడిపై నీటి అణువుల జాడ ఉందని గుర్తించి ఇస్రో చరిత్ర సృష్టించి ంది. భారతదేశం నుంచి చంద్రుడిపైకి వెళ్లిన మొట్టమొదటి ప్రయోగం ఇదే. అతి తక్కువ ఖర్చుతో ఈ ప్రయోగాన్ని చేపట్టి చంద్రుడిపై పరిశోధనలు జరిపింది. చంద్రయాన్–1 మిషన్ పూర్తిస్థాయిలో పని చేయకపోవడంతో దానికి కొనసాగింపుగా చంద్రయాన్–2 మిషన్‌ను ప్రయోగించారు. ఇస్రోకు నాసా అభినందనలు చంద్రయాన్–2 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రోకు అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా అభినందనలు తెలిపింది. ఈ ప్రయోగం ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువం గురించి ఇస్రో వెలుగులోకి తెచ్చే కొత్త విషయాల కోసం ఎదురుచూస్తామని తెలిపింది. ‘చంద్రునిపై అధ్యయనానికి చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతం చేసిన ఇస్రోకు అభినందనలు. విశ్వాంతరాళంలో ఉన్న మా సాంకేతిక వనరులను మీకు సాయంగా అందించడానికి గర్విస్తున్నాం. చంద్రుని దక్షిణ ధ్రువం గురించి మీరు కనుగొనే కొత్త విషయాల కోసం ఎదురుచూస్తున్నాం. త్వరలోనే మేం కూడా ఆర్టిమిస్ మిషన్ ద్వారా ఆ ప్రాంతంలోకి వ్యోమగాములను పంపనున్నాం’ అని ట్విట్టర్లో నాసా పేర్కొంది. చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతం కావడం దేశ ప్రజలందరికీ గర్వించదగ్గ క్షణం. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు అభినందనలు. – ట్విట్టర్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇది ప్రతి భారతీయుడూ గర్వించాల్సిన విషయం. సాంకేతిక కారణాలతో గత వారం ఈ ప్రయోగం వాయిదాపడినా.. వారంలోనే విజయవంతంగా ప్రయోగం పూర్తి చేశారు. మీకు (ఇస్రో శాస్త్రవేత్తలకు) అభినందనలు. – ట్విట్టర్ ఆడియో సందేశంలో మోదీ గర్వంగా ఉంది. ఇందులో ప్రయోగించిన అన్ని సాంకేతిక పరికరాలను భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్ చరిత్రాత్మక ప్రయాణం మొదలైంది. – డాక్టర్ కె.శివన్, ఇస్రో చైర్మన్ -
మాటల్లో చెప్పలేనిది!
‘‘నా భార్య నమ్రత నా చుట్టూ ఉంటే చాలు. దేని గురించీ నేను ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆమె నాకు నిజమైన విమర్శకురాలు. మంచి సలహాలు కూడా ఇస్తుంది’’ అంటున్నారు మహేశ్‌బాబు. అంతేకాదు ఇండస్ట్రీలో ‘మహర్షి’ సినిమాతో 25 సినిమాలను పూర్తి చేసిన మహేశ్‌బాబు కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఓ ఆంగ్ల పత్రికతో పంచుకున్నారు. ‘‘నా సినిమా జర్నీ గురించి మాటల్లో చెప్పలేను. ఈ సక్సెస్ఫుల్ జర్నీలో నా ఫ్యాన్స్ స్థానం మాత్రం ప్రత్యేకమైనది. ఇక ఆన్‌స్క్రీన్ క్యారెక్టర్స్ చేసేప్పుడు డైరెక్టర్స్‌ని నమ్మి నటిస్తాను’’ అన్నారు. ‘‘నా పిల్లలు గౌతమ్, సితారలను నేను గారాబం చేస్తాను. నమ్రత మాత్రం చాలా స్ట్రిక్ట్. నా సినిమాల్లో ‘అతడు’ అంటే గౌతమ్‌కి, ‘శ్రీమంతుడు’ అంటే సితారకు ఇష్టం. నా సినిమాలు వేరే భాషల్లో రీమేక్ అవుతున్నాయి కానీ రీమేక్ సినిమాల్లో నటించడం నాకు పెద్ద ఆసక్తి లేదు’’ అని మహేశ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. 5 నుంచి కశ్మీర్లో.. ఫ్యామిలీతో కలిసి లండన్‌లో హాలీడేస్ ఎంజాయ్ చేసి, తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు మహేశ్. ఇంకొన్ని రోజుల్లో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బిజీ అవుతారు. మహేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో అనిల్ సుంకర, ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు కీలక పాత్రలు చేయనున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ వచ్చే నెల 5న కశ్మీర్లో ప్రారంభం అవుతుంది. -
‘శక్తి’మాన్ భారత్
న్యూఢిల్లీ/బీజింగ్/ఇస్లామాబాద్: అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేసింది. అంతరిక్షంలోని శత్రుదేశాల ఉపగ్రహాలను కూల్చివేయగల శాటిలైట్ విధ్వంసక క్షిపణి(ఏశాట్)ని భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. భూదిగువ కక్ష్యలో 300 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న పనిచేయని ఓ ఉపగ్రహాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఏశాట్ క్షిపణి 3 నిమిషాల్లో కూల్చివేసింది. అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఈ సామర్థ్యం సాధించిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ‘మిషన్ శక్తి’ పేరుతో చేపట్టిన ఈ ప్రయోగం వివరాలను ప్రధాని మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో వెల్లడించారు. ఏ దేశానికీ వ్యతిరేకం కాదు మోదీ ప్రసంగిస్తూ..‘భారత్ శాటిలైట్ విధ్వంసక క్షిపణి(ఏశాట్)ని విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని బాలాసోర్‌లో ఉన్న డా.ఏపీజే అబ్దుల్‌కలాం ద్వీపం నుంచి బుధవారం ఉదయం 11.16 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టాం. ప్రతీ దేశ చరిత్రలో ప్రజలు చాలా గర్వపడే, భవిష్యత్ తరాలపై గొప్ప ప్రభావం చూపే ఘటనలు కొన్ని చోటుచేసుకుంటాయి. ఈరోజు జరిగిన ఏశాట్ ప్రయోగం అలాంటిదే. భూదిగువ కక్ష్యలో 300 కి.మీ ఎత్తులో తిరుగుతున్న ఓ ఉపగ్రహాన్ని అత్యంత కచ్చితత్వంతో కేవలం 3 నిమిషాల వ్యవధిలో ఏశాట్ కూల్చివేసింది. ఇప్పటివరకూ భూ,జల, వాయు మార్గాల్లో పటిష్టంగా ఉన్న మనం అంతరిక్షంలోనూ మన ప్రయోజనాలను కాపాడుకునే సామర్థ్యాన్ని సొంతం చేసుకున్నాం. ఏశాట్ ప్రయోగం సందర్భంగా భారత్ ఎలాంటి అంతర్జాతీయ చట్టాలను, ఒప్పందాలను ఉల్లంఘించలేదు. ముంబైలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ వద్ద మోదీ ప్రసంగం వింటున్న స్థానికులు ఈ క్షిపణిని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) అభివృద్ధి చేసింది. ఏశాట్ చేరికతో భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమైంది. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన శాస్త్రవేత్తలతో పాటు దేశప్రజలందరికీ అభినందనలు’ అని తెలిపారు. ప్రసంగం అనంతరం ఈ ప్రయోగం చేపట్టిన శాస్త్రవేత్తలతో మోదీ సమావేశమయ్యారు. శాస్త్రవేత్తల తాజా విజయంతో దేశప్రజలంతా గర్వపడుతున్నారని వారితో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బుధవారం మధ్యాహ్నం 11.45 నుంచి 12 గంటల మధ్యలో కీలక ప్రకటన చేస్తానని మోదీ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అయితే ఏశాట్ ప్రయోగం విజయవంతమైందని ధ్రువీకరించుకునేందుకు ఎక్కువ సమయం పట్టడంతో మధ్యాహ్నం 12.10 గంటలకు ఈ విషయాన్ని ప్రకటించారు. ఆచితూచి స్పందించిన చైనా భారత్ ఏశాట్ క్షిపణి ద్వారా ఉపగ్రహాన్ని కూల్చివేయడంపై చైనా ఆచితూచి స్పందించింది. ‘భారత్ ఏశాట్ క్షిపణిని పరీక్షించినట్లు తెలిసింది. ప్రపంచదేశాలన్నీ అంతరిక్షంలో శాంతి, సుస్థిరతను కాపాడేందుకు కట్టుబడి ఉంటాయని ఆశిస్తున్నాం’ అని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. మరోవైపు ఈ ప్రయోగంపై పాక్ తీవ్రంగా స్పందించింది. భారత్ అంతరిక్షంలో ఊహాజనిత శత్రువుల కోసం సిద్ధమవుతోందని పాక్ విదేశాంగ ప్రతినిధి ఫైజల్ విమర్శించారు. ఈసీకి ప్రతిపక్షాల ఫిర్యాదు శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగం నిర్వహిస్తే, దాని ఘనతను సొంతం చేసుకునేందుకు మోదీ ఉబలాటపడుతున్నారని దుయ్యబట్టాయి. ఏప్రిల్ 11న లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రసంగించడం ద్వారా మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ విషయమై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ స్పందిస్తూ..‘ఏశాట్ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన శాస్త్రవేత్తలకు అభినందనలు. ప్రధాని మోదీకి అంతర్జాతీయ నాటక దినోత్సవ శుభాకాంక్షలు’ అని చురకలు అంటించారు. ఏశాట్ ప్రాజెక్టు మన్మోహన్ సింగ్ హయాంలో ప్రారంభమైందని కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ వ్యాఖ్యానించారు. మోదీ అడ్డూఅదుపులేని డ్రామాపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. నిరుద్యోగం, మహిళల భద్రత, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మోదీ మళ్లించారని ఎస్పీ, బీఎస్పీలు విమర్శించాయి. ప్రధాని ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ సీపీఎం ఈసీకి ఫిర్యాదు చేసింది. మరోవైపు ఈ వ్యవహారంపై విచారణకు అధికారులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు ఈసీ ప్రకటించింది. భారత్ దగ్గర 2007 నుంచి శాటిలైట్ విధ్వంసక క్షిపణి(ఏశాట్) సాంకేతికత ఉందని ఇస్రో మాజీ చైర్మన్ జి.మాధవన్ తెలిపారు. కానీ ఈ విషయంలో అప్పటి ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో ప్రయోగాన్ని చేపట్టలేదని వెల్లడించారు. రెండేళ్ల క్రితమే ఆమోదం కీలక సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో భారత సామర్థ్యానికి ఏశాట్ ప్రయోగం ఓ మచ్చుతునక అని డీఆర్డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి తెలిపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రెండేళ్ల క్రితమే ఆమోదముద్ర లభించిందన్నారు. శత్రుదేశాలకు ఇది ఓ హెచ్చరికగా ఉపయోగపడుతుందన్నారు. తాజా ప్రయోగంతో భారత్ శత్రుదేశాల ఉపగ్రహాలను సెంటీమీటర్ల కచ్చితత్వంతో కూల్చివేసే సామర్థ్యాన్ని సొంతం చేసుకుందన్నారు. ఈ ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తిచేశామనీ, తద్వారా డీఆర్డీవో సమర్థతను చాటుకున్నామని పేర్కొన్నారు. భారత రక్షణశాఖ, డీఆర్డీవో సమన్వయంతో ఈ ప్రయోగాన్ని చేపట్టాయన్నారు. డీఆర్డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి ఏ శాట్ క్షిపణి పనిచేసిందిలా.. ఖండాంతర క్షిపణి కార్యక్రమం (ఐడీబీఎం)లో భాగంగా భారత్ అభివృద్ధి చేసిన ఏశాట్ క్షిపణిని ఇందులో ఉపయోగించారు. ఈ ప్రయోగం ప్రధానంగా మూడుదశల్లో కొనసాగింది. తొలుత భారత భూభాగంపై నిఘాపెట్టిన ఓ ఉపగ్రహాన్ని భూమిపైన ఉన్న రాడార్లు గుర్తించాయి. ఓసారి టార్గెట్‌ను లాక్‌చేసిన అనంతరం మొబైల్ లాంచర్ ద్వారా క్షిపణిని నిర్దేశిత లక్ష్యంపైకి ప్రయోగించారు. రెండోదశలో భాగంగా భూమి నుంచి నిర్ణీత ఎత్తులోకి వెళ్లాక ఏశాట్‌కు అమర్చిన హీట్‌షీల్డ్స్ తొలగిపోయాయి. మూడో దశలో భాగంగా రాడార్ సాయంతో ఏశాట్ క్షిపణి లక్ష్యంవైపు దూసుకుపోయి నిర్దేశిత ఉపగ్రహాన్ని కూల్చివేసింది. తిరుగులేని గురి శత్రు దేశాల నుంచి వచ్చే క్షిపణులను మార్గమధ్యంలో గాల్లోనే పేల్చేయడం గురించి మనం చాలాసార్లు వినే ఉంటాం. మిషన్ శక్తిలో కూడా దాదాపు ఇలాంటి క్షిపణినే వాడారు. అయితే, ఇందులో వాడిన సాంకేతిక పరిజ్ఞానంలో కొంత తేడా ఉంది. కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉండే అతి చిన్న లక్ష్యాన్ని ఛేదించాలంటే క్షిపణి ఎంతో కచ్చితమైన మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. బుధవారం నాటి పరీక్షలో ఈ కచ్చితత్వం సాధించగలిగామని, అన్ని రకాలుగా పరీక్ష సఫలమైందని డీఆర్డీవో వర్గాలు తెలిపాయి. అమెరికాతో మొదలు ఉపగ్రహ ప్రయోగాలు మొదలైన 1950లలోనే అమెరికా వాటిని ఆకాశంలోనే కూల్చేసే టెక్నాలజీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అమెరికా వాయుసేన నిపుణులు వెపన్ సిస్టమ్స్ –199ఏ పేరుతో ఈ ప్రయోగాలు చేపట్టారు. వీటిల్లో ఒకటి లాక్‌హీడ్ మార్టిన్ ప్రాజెక్టు బోల్డ్ ఓరియన్. సార్జెంట్ క్షిపణి మోటార్ ఆధారంగా తయారు చేసిన ఈ యాంటీ శాటిలైట్ మిస్సైల్‌ను 1958 మే నుంచి 1959 అక్టోబరు మధ్యకాలంలో దాదాపు 12సార్లు పరీక్షించారు. చాలా పరీక్షలు విఫలమయ్యాయి. దీంతో క్షిపణి వ్యవస్థలో మార్పులు చేశారు. 1700 కిలోమీటర్ల పరిధితో కూడిన క్షిపణిని సిద్ధం చేసి పరీక్షించారు. కానీ, ఇది లక్ష్యానికి 6.4 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకెళ్లింది. అప్పటి సోవియట్ యూనియన్ కూడా ఉపగ్రహాలను కూల్చివేసే వ్యవస్థలను పలుమార్లు పరీక్షించింది. శత్రు ఉపగ్రహాలను బలమైన విద్యుదావేశంతో నాశనం చేయగల వ్యవస్థను సోవియట్ యూనియన్ 1970 తొలినాళ్లలోనే సిద్ధం చేసింది. 1985లో అమెరికా ఏజీఎం –135 పేరుతో ఎఫ్–15 యుద్ధ విమానం నుంచి ప్రయోగించగల ఇంకో క్షిపణి ద్వారా సోల్విండ్ పీ78–1 ఉపగ్రహాన్ని కూల్చివేసింది. 2007లో చైనా పాతకాలపు వాతావరణ ఉపగ్రహాన్ని కూల్చివేయడంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. చైనా ప్రయోగం పుణ్యమా అని అంతరిక్షంలో దాదాపు మూడు వేల శకలాలు చెల్లాచెదురుగా ఏర్పడ్డాయి. 2008లో అమెరికా కూడా ఓ నౌకపై నుంచి ఎస్ఎం3 క్షిపణిని ప్రయోగించి అంతరిక్షంలో పనిచేయని ఉపగ్రహం ఒకదాన్ని కూల్చేసింది. సైనిక అవసరాలకు కూడా అంతరిక్షంలోని ఉపగ్రహాలను కూల్చేసే సాంకేతికతతో మిలటరీకీ ప్రయోజనకరమనడంలో ఎలాంటి సందేహం లేదు. శత్రుదేశాల ఉపగ్రహాలను కూల్చివేస్తే వారికి వ్యూహాత్మక సమాచారం అందకుండా పోతుంది. బుధవారం నాటి ప్రయోగాలతో భారత వ్యతిరేక శక్తుల ఉపగ్రహాలను కూల్చివేసే సామర్థ్యం సంపాదించుకున్నట్లు అయింది. ఒకవైపు పాకిస్తాన్ తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూండటం.. భారత వాయుసేన బాలాకోట్‌పై దాడి నేపథ్యంలో ఈ టెక్నాలజీకి మరింత ప్రాధాన్యం లభించింది. చైనా, రష్యా రాకెట్ల సాయంతో పాకిస్తాన్ ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఉపగ్రహాలను కూల్చివేసే క్రమంలో ఏర్పడుతున్న శకలాలు అనేక సమస్యలు సృష్టిస్తున్నాయి. విపరీతమైన వేగంతో ప్రయాణించే ఈ శకలాలు ఏ ఒక్కటి ఢీకొన్నా ఆయా కక్ష్యల్లో ఉండే ఉపగ్రహాలకు భారీ నష్టం వాటిల్లుతుంది. భూమికి 330 కిలోమీటర్ల ఎత్తులో ఉండే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తరచూ తన కక్ష్యను మార్చుకుంటూ ఈ శకలాల నుంచి తప్పించుకుంటోంది. ఊహాత్మక చిత్రం -
క్రయోజనిక్ హాట్ టెస్ట్ విజయవంతం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ ఏడాది డిసెంబర్లో ప్రయోగించబోయే జీఎస్ఎల్వీ ఎఫ్–11కు సంబంధించి క్రయోజనిక్ ఇంజిన్ యాక్సెప్ట్ హాట్ టెస్ట్ విజయవంతంగా ముగిసింది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కేంద్రంలో ఆగస్టు 27న చేపట్టిన ‘హాట్ టెస్ట్’ సక్సెస్ అయ్యిందని ఇస్రో శనివారం ప్రకటించింది. క్రయోజనిక్ ఇంజిన్‌ను సుమారు 200 సెకన్లపాటు పనిచేయించి పరీక్షించారు. జీఎస్ఎల్వీ రాకెట్‌కు సంబంధించి కీలకమైన క్రయోజనిక్ దశ అత్యంత సంక్లిష్ట పరిజ్ఞానంతో కూడుకున్నది కావడంతో ఈ దశలో ఎప్పటికప్పుడు నూతనంగా పలు పరీక్షలు చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది. -
సూపర్సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం
బాలాసోర్: తక్కువ ఎత్తులో దూసుకొచ్చే బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేయగల స్వదేశీ సూపర్సోనిక్ ఇంటర్సెప్టార్ క్షిపణిని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని ఒడిశాలోని బాలాసోర్ అబ్దుల్ కలాం దీవి నుంచి ప్రయోగించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రయోగంలో భాగంగా పృథ్వీని శత్రు క్షిపణిలా మార్చి సూపర్సోనిక్ ఇంటర్సెప్టార్ క్షిపణికి లక్ష్యంగా నిర్దేశించారు. అబ్దుల్ కలాం దీవిలో ఏఏడీ (అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్) సూపర్సోనిక్ క్షిపణిని మోహరించారు. దీనిలోని రాడార్ల ద్వారా పృథ్వీకి సంబంధించిన సంకేతాలు అందుకున్న ఇంటర్సెప్టార్ క్షిపణి గాలిలోనే పృథ్వీని ఢీకొట్టింది. 7.5 మీటర్ల పొడవు ఉండే ఈ క్షిపణిలో అధునాతన వ్యవస్థలున్నాయి. -
ఇస్రోకు ‘వంద’నం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రక విజయం నమోదైంది. ఇస్రో తన వందో ఉపగ్రహంతో పాటు మరో 30 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి విజయవంతంగా పంపింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట వేదికగా 28 గంటల కౌంట్‌డౌన్ తర్వాత శుక్రవారం ఈ ప్రయోగం జరిగింది. నాలుగు ప్రయోగ దశల్లో మండిన పీఎస్ఎల్వీ సీ–40 వాహకనౌక కార్టోశాట్–2 సిరీస్‌లోని మూడో ఉపగ్రహంతో పాటు 30 మైక్రో, నానో ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లోకి చేర్చింది. దీంతో అంతరిక్ష రంగంలో, వాణిజ్య ఉపగ్రహాల ప్రయోగాల్లో ఇస్రో తన సమర్ధతను మరోసారి చాటుకున్నట్లయింది. పీఎస్ఎల్వీ రాకెట్‌తో చేపట్టిన ప్రయోగాల్లో అత్యంత సుదీర్ఘ కాలం కొనసాగిన ప్రయోగం ఇదే. ప్రయోగం విజయవంతమైనందుకు రాష్ట్రపతి కోవింద్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. మైలురాయిగా 100వ ఉపగ్రహం... నాలుగు నెలల క్రితం నావిగేషన్ ఉపగ్రహం ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్ ప్రయోగ సందర్భంగా ఎదురైన వైఫల్యాన్ని పక్కనపెట్టి ఇస్రో తాజా విజయాన్ని అందుకుంది. ఈసారి అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాల్లో దేశీయంగా రూపొందించిన వందో ఉపగ్రహం ఉండటం ఒక మైలురాయిగా నిలిచిపోయింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.28 గంటలకు పీఎస్ఎల్వీ సీ–40 31 ఉపగ్రహాలతో నింగికెగిసింది. 17 నిమిషాల్లోనే కార్టోశాట్ ఉపగ్రహాన్ని 505 కి.మీ ఎత్తులోని సూర్యానువర్తిత ధృవకక్ష్యలో చేర్చింది. తర్వాత ఏడు నిమిషాల వ్యవధిలో భారత్‌కు చెందిన ఒక నానో ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 28 పేలోడ్లను ఒకదాని తర్వాత మరోదాన్ని కక్ష్యల్లో విడిచిపెట్టింది. మిగిలిన ఏకైక(వందో ఉపగ్రహం) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చడానికి కొంత సమయం పట్టింది. ఇందుకోసం ప్రయోగం ప్రారంభమైన సుమారు 105 నిమిషాల తరువాత రాకెట్ నాలుగో దహన దశను రెండుసార్లు పునఃప్రారంభించారు. చివరి దశను పూర్తిచేయడానికి సుమారు 2 గంటల 21 నిమిషాలు పట్టింది. అత్యంత ఎక్కువ సమయం తీసుకున్న పీఎస్ఎల్వీ మిషన్ ఇదే. ఇస్రో చైర్మన్‌గా చివరి ప్రయోగాన్ని విజయవంతంగా ముగించిన కిరణ్ కుమార్ సహచరులతో కలసి సంతోషం పంచుకున్నారు. కార్టోశాట్–2 వెంట ప్రయాణించిన ఉపగ్రహాల్లో కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, కొరియా, యూకే, అమెరికాలకు చెందిన మూడు మైక్రో, 25 నానో ఉపగ్రహాలున్నాయి. కొత్త ఏడాది కానుక ఇదే: ఇస్రో చైర్మన్ ప్రయోగం పూర్తయిన తరువాత ఇస్రో చైర్మన్ కిరణ్ మీడియాతో మాట్లాడుతూ...ఇస్రో కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించిందని అన్నారు. కార్టోశాట్ ఉపగ్రహాన్ని దేశానికి కానుకగా ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తాము ప్రయోగించిన 100 ఉపగ్రహాల్లో విద్యార్థులు తయారుచేసిన వాటన్నింటికీ చోటిచ్చామని తెలిపారు. చంద్రుడిపై అధ్యయనం కోసం చేపట్టబోయే రెండో ప్రయోగం చంద్రయాన్–2 మిషన్‌కు ఏర్పాట్లు సజావుగానే జరుగుతున్నాయని వెల్లడించారు. ఫ్లైట్ మోడల్స్‌ను వివిధ దశల్లో పరీక్షిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది నుంచి నెలకో ప్రయోగం చొప్పున జరిపేందుకు సన్నద్ధమవుతున్నామని వెల్లడించారు. తాజా ప్రయోగానికి ఎంత వ్యయమైందని ఓ విలేకరి అడగ్గా... ఖర్చు కన్నా మన రాకెట్ల సాయంతో వాణిజ్యపరంగా ఉపగ్రహాలను పంపించేందుకు ఎన్ని దేశాలు ముందుకొస్తున్నాయన్నదే ముఖ్యమని చెప్పారు. జీఎస్ఎల్వీ ఎంకే2, ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ప్రయోగాలు త్వరలో జరుగుతాయని తెలిపారు. బంగారు భవితకు సూచిక: మోదీ ఇస్రో వందో ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం సంస్థ విజయాలు, అంతరిక్ష రంగంలో దేశ బంగారు భవిష్యత్‌కు సూచిక అని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలుపుతూ...తాజా విజయంతో ప్రజలు, రైతులు, మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఇస్రో కృషిని అభినందించిన కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: పీఎస్ఎల్వీ–సీ 40 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభినందించారు. మన శాస్త్రవేత్తల కృషి మరవలేనిదని, ఇది మన దేశానికి గర్వకారణమని ఆయన కొనియాడారు. ఇస్రోకు జగన్ శుభాకాంక్షలు... సాక్షి, హైదరాబాద్: ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలను అభినందించారు. ఇస్రో భవిష్యత్‌లో మరిన్ని అద్భుత ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. -
విజయ భేరి
సాక్షి ప్రతినిధి, అనంతపురం : సహకార సంఘం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయభేరి మోగించారు. ఏడు స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో ఐదు చోట్ల విజయకేతనం ఎగురవేసి.. మరో స్థానంలో సీపీఐ మద్దతుతో పాగా వేయనున్నారు. భయోత్పాతం సృష్టించి ఒక స్థానాన్ని టీడీపీ మద్దతుదారులు కైవసం చేసుకోగా, కాంగ్రెస్‌కు రిక్త హస్తమే మిగిలింది. మొత్తానికి కాంగ్రెస్, టీడీపీ సంయుక్తంగా మద్దతు ఇచ్చినా..నోట్ల కట్టలనువిచ్చలవిడిగావెదజల్లినావైఎస్ఆర్సీపీ మద్దతుదారుల విజయాన్నిఅడ్డుకోలేకపోయారు. జిల్లాలో ఏడాది క్రితం 116 పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. బూదిలి, తలుపుల, రామగిరి, పి.యాలేరు, పెద్దవడుగూరు, వేములపాడు, పుట్లూరు పీఏసీఎస్‌ల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు విజయం సాధించడం ఖాయమనే అంచనాకు వచ్చిన కాంగ్రెస్, టీడీపీలు.. శాంతిభద్రతల సమస్యను సాకుగా చూపి వాటి ఎన్నికలను వాయిదా వేయించాయి. ఆ ఏడు పీఏసీఎస్‌లకు ఎట్టకేలకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలను వేదికగా చేసుకుని సత్తా చాటడానికి జేసీ బ్రదర్స్ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. తమ పరిధిలోని పీఏసీఎస్‌లలో తమ మద్దతుదారులను గెలిపించుకోవడం ద్వారా టీడీపీలోకి ఘనంగా వెళ్లాలని భావించారు. తాడిపత్రి నియోజకవర్గం పరిధిలోని పెద్దవడుగూరు, వేములపాడు పీఏసీఎస్‌ల పరిధిలో జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన తనయుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి, సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డిలు విస్తృతంగా ప్రచారం చేశారు. టీడీపీతో ముందస్తు అవగాహన కుదర్చుకుని అభ్యర్థులను బరిలోకి దించారు. ఓటుకు సగటున రూ.ఐదు వేల వరకూ పంపిణీ చేశారు. కానీ.. ఓటర్లు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులకు దన్నుగా నిలిచారు. ఆ పార్టీ నేతలు పేరం నాగిరెడ్డి, వీఆర్ రామిరెడ్డి, సూర్యనారాయణరెడ్డి, శరభారెడ్డిలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ జేసీ బ్రదర్స్ ఎత్తులను చిత్తు చేశారు. పెద్దవడుగూరు పీఏసీఎస్ పరిధిలోని 13 డెరైక్టర్ స్థానాల్లో 12 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే.. ఎనిమిదింటిలో వైఎస్ఆర్సీపీ, మూడింటిలో కాంగ్రెస్, ఒక స్థానంలో టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. వేములపాడు పీఏసీఎస్ పరిధిలోని 13 స్థానాల్లో నాలుగింట్లో వైఎస్ఆర్సీపీ, ఐదింట్లో కాంగ్రెస్, మూడింట్లో సీపీఐ, ఒక స్థానంలో టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. సీపీఐ మద్దతుతో వేములపాడు పీఏసీఎస్‌ను కూడా వైఎస్ఆర్సీపీ తన ఖాతాలో వేసుకోవడానికి పావులు కదుపుతోంది. శైలూ, నిమ్మలకు ఝలక్ పుట్లూరు పీఏసీఎస్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల విజయాన్ని అడ్డుకునే బాధ్యతను జేసీ ప్రభాకర్‌రెడ్డికి మంత్రి శైలజానాథ్ అప్పగించారు. ఇక్కడ టీడీపీ-కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థులను బరిలోకి దించింది. నోట్ల కట్టలను విచ్చలవిడిగా వెదజల్లింది. మద్యాన్ని ఏరులై పారించింది. అయితే వైఎస్ఆర్సీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డి, మాజీ ఎంపీపీ కేతిరెడ్డి పెద్దారెడ్డి, మండల కన్వీనర్ రాఘవరెడ్డిలు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. మూడు డెరైక్టర్ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులను ఏకగ్రీవంగా గెలిపించుకున్నారు. శుక్రవారం ఎన్నికలు జరిగిన పది డెరైక్టర్ స్థానాల్లో ఆరింట వైఎస్సార్సీపీ, నాలుగింట కాంగ్రెస్-టీడీపీ సంయుక్త అభ్యర్థులు విజయం సాధించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డితో శైలజానాథ్ చేతులు కలిపినా తన ఇలాకాలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల విజయాన్ని అడ్డుకోలేకపోయారు. ఎంపీ నిమ్మల క్రిష్టప్పకూ సొంత మండలంలో ఘెర పరాభవం ఎదురైంది. గోరంట్ల మండల పరిధిలోని బూదిలి పీఏసీఎస్‌లో 13 డెరైక్టర్ స్థానాల్లో కాంగ్రెస్-టీడీపీ సంయుక్తంగా అభ్యర్థులను బరిలోకి దింపినా.. కనీసం బోణీ కూడా కొట్టలేకపోయారు. కదిరి నియోజకవర్గం పరిధిలోని తలుపుల పీఏసీఎస్‌ను వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఏకగీవ్రంగా కైవసం చేసుకున్నారు. తలుపుల పీఏసీఎస్ పరిధిలోని 13 డెరైక్టర్ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఎనిమిది, టీడీపీ మద్దతుదారులు ఐదు స్థానాల్లో ఏకగీవ్రంగా విజయం సాధించారు. రామగిరిలో హైడ్రామా రామగిరి ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతం.. ఆత్మకూరు మండలం పి.యాలేరు పీఏసీఎస్ పరిధిలో కల్లోలిత గ్రామాలు లేవు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే విజయం సాధించలేమని భావించిన ఎమ్మెల్యే పరిటాల సునీత ఓ మంత్రి సహాయాన్ని అర్థించారు. ఆ మంత్రి ఆదేశాలకు పోలీసు ఉన్నతాధికారులు తలొగ్గి.. పి.యాలేరులో 200 మంది పోలీసులను మోహరించి, పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. అదే రామగిరిలో కేవలం 20 మంది పోలీసులను మోహరించి బందోబస్తును సక్రమంగా ఏర్పాటు చేయలేదు. ఇదే అలుసుగా తీసుకున్న పరిటాల సునీత తన వర్గీయులను రె చ్చగొట్టారు. ఆమె సోదరుడు బాలాజీ నేతృత్వం లో వైఎస్సార్సీపీ నేతలు ముకుందనాయుడు, అమర్నాథ్రెడ్డిలు ప్రయాణిస్తోన్న వాహనంపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో రామగిరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రాళ్ల దాడి చేసిన సురేందర్ అనే కార్యకర్తలను పోలీసులు అ దుపులోకి తీసుకుంటే.. పరిటాల సునీత స్టేషన్‌కు వచ్చి ఆయనను విడిపించుకుని వెళ్లారు. ఓటేసేం దుకు వస్తోన్న వైఎస్ఆర్సీపీ మద్దతుదారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఇది పో లింగ్ శాతాన్ని తగ్గేలా చేసింది. అదే టీడీపీకి వరం గా మారింది. భయోత్పాతం సృష్టించి రామగిరి పీఏసీఎస్‌ను టీడీపీ ఖాతాలో వేసుకున్నారు. పి.యాలేరు పీఏసీఎస్ ఎన్నికల్లో 13 డెరైక్టర్ స్థానాలకుగా ఆదిలోనే రెండు స్థానాలను వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఏకగీవ్రంగా చేజిక్కించుకున్నా రు. ఎన్నికలు జరిగిన 11 స్థానాల్లో తొమ్మిదింట వైఎఎస్ఆర్సీపీ.. రెండు చోట్ల స్వల్ఫ ఆధిక్యంతో టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు.