అమ్ముల పొదిలో నాగాస్త్రం | India is anti-tank missile Nag test-fired in Pokhran | Sakshi
Sakshi News home page

అమ్ముల పొదిలో నాగాస్త్రం

Published Fri, Oct 23 2020 4:36 AM | Last Updated on Fri, Oct 23 2020 4:37 AM

India is anti-tank missile Nag test-fired in Pokhran - Sakshi

జైపూర్‌: మన దేశ రక్షణ రంగం మరింత బలోపేతమైంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ట్యాంకు విధ్వంసక క్షిపణి నాగ్‌ తుది దశ ప్రయోగాలను రక్షణ అధ్యయన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) విజయవంతంగా పూర్తి చేసింది. రాజస్తాన్‌లోని పోఖ్రాన్‌లో గురువారం ఉదయం 6:45 గంటలకి నాగ్‌ క్షిపణి నిర్దేశిత లక్ష్యాలను కచ్చితంగా ఛేదించినట్టు డీఆర్‌డీఓ వెల్లడించింది. శత్రువుల యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయడానికి యాంటీ ట్యాంకు మిస్సైల్‌ గైడ్‌ (ఏటీజీఎం)ను డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది. నాగ్‌ క్షిపణి నాలుగు నుంచి ఏడు కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలదు. మూడో తరానికి చెందిన ఈ క్షిపణి రాత్రయినా, పగలైనా శత్రువుల యుద్ద ట్యాంకుల్ని, ఇతర సాయుధ వాహనాల్ని ధ్వంసం చేయగలదు.

ఈ క్షిపణి క్యారియర్‌ని రష్యాకు చెందిన బీఎంపీ–2 పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఈ తరహా పరిజ్ఞానం ‘లాక్‌ బిఫోర్‌ లాంచ్‌’ వ్యవస్థని కలిగి ఉంటుంది. అంటే క్షిపణిని ప్రయోగించడానికి ముందే లక్ష్యాలను గుర్తిస్తారు. భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండడంతో కేంద్రం క్షిపణి ప్రయోగాలను వేగవంతం చేసింది. తుది దశ ప్రయోగం విజయవంతం కావడం పగలు, రాత్రి కూడా క్షిపణి కచ్చితంగా లక్ష్యాలను ఛేదించడంతో ఈ క్షిపణి ఉత్పత్తి దశకు చేరుకుందని డీఆర్‌డీఓ చైర్మన్‌ సతీష్‌ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ అధికారులు అందించిన సమాచారం ప్రకారం ఈ క్షిపణి ఇక భారత అమ్ముల పొదిలోకి చేరడానికి సిద్ధంగా ఉంది. తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో నాగ్‌ క్షిపణిని మోహరించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
పోఖ్రాన్‌లో నింగిలోకి దూసుకెళ్తున్న నాగ్‌ క్షిపణి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement