eastern Ladakh
-
సరిహద్దు గస్తీపై కీలక పురోగతి
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ విషయమై చైనాతో నెలకొన్న నాలుగేళ్ల పై చిలుకు సైనిక వివాదం కొలిక్కి వచి్చంది. ఇరు దేశాల దౌత్య, సైనిక ఉన్నతాధికారులు కొద్ది వారాలుగా జరుపుతున్న చర్చల ఫలితంగా ఈ విషయమై కీలక ఒప్పందం కుదిరింది. విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ సోమవారం ఈ మేరకు ప్రకటించారు. ‘‘తాజా ఒప్పందం ఫలితంగా తూర్పు లద్దాఖ్‌లోని దెస్పాంగ్, దెమ్చోక్ తదితర ప్రాంతాల నుంచి చైనా సైన్యం వెనుదిరుగుతుంది. అక్కడ ఇకపై భారత సైన్యం 2020కి ముందు మాదిరిగా గస్తీ కాస్తుంది’’ అని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల దిశగా దీన్నో మంచి ముందడుగుగా అభివర్ణించారు. రష్యాలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో భాగంగా మంగళ, బుధవారాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ప్రధాని కీలక భేటీ ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. ఈ వివాదానికి తెర దించేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా గత వారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో చర్చలు జరిపారు. చైనాతో సరిహద్దు వివాదానికి సంబంధించి 75 శాతం సమస్యలు ఇప్పటికే పరిష్కారమైనట్టు జైశంకర్ గత నెలలో పేర్కొన్నారు. -
తూర్పు లద్దాఖ్‌పై భారత్, చైనా సైనిక చర్చలు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో మూడున్నరేళ్ల క్రితం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను సడలించేందుకు భారత్, చైనా 21వ విడత సైనిక చర్చలు జరిపాయి. చర్చల్లో ఎలాంటి కీలకమైన ఉమ్మడి నిర్ణయాలు తీసుకోలేకపోయారు. వాస్తవా«దీన రేఖ వెంబడి ఛుషుల్–మోల్డో బోర్డర్ పాయింట్ వద్ద చైనా వైపు భూభాగంలో ఫిబ్రవరి 19వ తేదీన ఈ చర్చలు జరిగాయి. భారత్ తరఫున లేహ్ కేంద్రంగా ఉన్న 14వ కోర్ లెఫ్టినెంట్ జనరల్ రషీమ్ బాలీ, చైనా తరఫున దక్షిణ గ్జిన్జియాంగ్ సైనిక జిల్లా కమాండర్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. కోర్ కమాండర్ స్థాయిలో జరిగిన ఈ చర్చల్లో ఇరు దేశాల సైనికుల మొహరింపును ఉపసంహరించుకోవడంపై ప్రధానంగా చర్చించారు. ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే సైనిక, దౌత్య కమ్యూనికేషన్లను ఇకమీదటా కొనసాగించాలని నిర్ణయించారు. స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిగాయని భారత విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది. దెస్పాంగ్, దెమ్చోక్ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ అంశమూ చర్చకొచి్చందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్టోబర్‌లో 20వ విడత చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వెంట సున్నితమైన పరిస్థితులు నెలకొన్నాయని జనవరిలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వ్యాఖ్యానించడం తెల్సిందే. 2020 ప్రథమార్ధంలో తూర్పు లద్దాఖ్‌లో ఉన్న సాధారణ స్థాయికి ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరుదేశాలు ప్రయతి్నస్తున్నాయి. -
సరిహద్దులు సురక్షితం.. కానీ కొంత సున్నితం
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాదీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి భారత్–చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ప్రస్తుతం సాధారణంగా, స్థిరంగానే ఉన్నప్పటికీ, కొంత సున్నితమైనవేనని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే చెప్పారు. సరిహద్దుల్లో ఎప్పుడు ఎలాంటి సవాలు ఎదురైనా గట్టిగా తిప్పికొట్టడానికి మన సైనిక దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఉన్నతస్థాయి సన్నద్ధతను పాటిస్తున్నాయని వెల్లడించారు. తగినన్ని సైనిక రిజర్వ్ దళాలు సరిహద్దుల్లో మోహరించాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో భద్రతాపరమైన వైఫల్యాలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. సైనిక దినోత్సవం నేపథ్యంలో జనరల్ మనోజ్ పాండే గురువారం మీడియాతో మాట్లాడారు. సరిహద్దు వివాదం సహా ఇతర అంశాలకు పరిష్కారం కనుగొనడానికి భారత్, చైనా మధ్య సైనిక, దౌత్యవర్గాల స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇక భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి చొరబాట్లను కట్టడి చేస్తున్నామని తెలిపారు. జమ్మూకశీ్మర్‌లో హింసాకాండ తగ్గుముఖం పట్టిందని, రాజౌరీ–పూంచ్ సెక్టార్లో మాత్రం హింసాత్మక సంఘటనలు కొంతమేరకు పెరిగాయని వివరించారు. సరిహద్దుకు అవతలివైపు ఉగ్రవాద సంస్థలు చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్నాయని చెప్పారు. జమ్మూకశీ్మర్‌లో కాల్పుల విరమణ కొనసాగుతోందన్నారు. సరిహద్దు అవతలి వైపు నుంచి భారత్‌లోకి ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన యాంటీ డ్రోన్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇండియా–మయన్మార్ సరిహద్దులో.. రెండు దేశాల నడుమ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకొనే దిశగా భూటాన్–చైనా మధ్య కొనసాగుతున్న చర్చలపై జనరల్ మనోజ్ పాండే స్పందించారు. ఈ పరిణామాన్ని నిశితంగా గమనిస్తున్నామని చెప్పా రు. భూటాన్‌తో భారత్‌కు బలమైన సైనిక సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఇక ఇండియా–మయన్మార్ సరిహద్దులో పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని అంగీకరించారు. అక్కడి పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని అన్నారు. -
భారత్–చైనా ఆర్మీ మధ్య రేపు చర్చలు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని మిగిలిన ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ వేగంగా జరగాలని భారత్ స్పష్టం చేయనుంది. భారత్– చైనా మధ్య 19వ విడత చర్చలు ఈ నెల 14న జరగనున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రెండు దేశాల కార్ప్స్ కమాండర్ స్థాయి చివరి దఫా చర్చలు నాలుగు నెలల క్రితం జరిగాయి. రేపు జరిగే చర్చల్లో మిగిలిన ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ పూర్తిగా జరగాలని భారత ప్రతినిధి బృందం పట్టుబడ్టనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రెండు దేశాల మధ్య పలు విడతలుగా జరిగిన చర్చల ఫలితంగా తూర్పులద్దాఖ్‌లోని కొన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి ఇరు పక్షాలు బలగాలను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. 18వ విడత చర్చల్లో ప్రధానంగా డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలంటూ భారత్ గట్టిగా డిమాండ్ చేసింది. తాజా చర్చలు చుషుల్–మోల్డో సరిహద్దు పాయింట్‌లోని భారత భూభాగంలో జరుగుతాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. భారత బృందానికి లెఫ్టినెంట్ జనరల్ రషీమ్ బాలి, చైనా కు సౌత్ జిన్జియాంగ్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ నాయకత్వం వహించే అవకాశాలున్నాయి. -
సరిహద్దుల్లో శాంతితోనే చైనాతో సత్సంబంధాలు
న్యూఢిల్లీ: చైనాతో సత్సంబంధాలపై భారత్ మరోసారి స్పష్టతనిచ్చింది. తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా ఆ దేశంతో సాధారణ సంబంధాలను సాగించడం వీలుకాదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కుండబద్దలు కొట్టారు. సరిహద్దులకు అత్యంత సమీపంలో చైనా తన బలగాలను మోహరించడమే ప్రధాన సమస్య అని ఆయన గురువారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. చైనాతో సంబంధాలను మెరుగుపర్చుకోవాలని భారత్ కూడా కోరుకుంటోందన్న ఆయన.. రెండు దేశాల సరిహద్దుల్లో శాంతి, సుస్థిరత నెలకొన్నప్పుడు మాత్రమే అలాంటిది సాధ్యమని పేర్కొన్నారు. చైనా ఒప్పందాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇదే విషయాన్ని ఆ దేశానికి తెలియజేశామన్నారు. ఘర్షణలు, రెచ్చగొట్టే చర్యలు, తప్పుడు కథనాలు వంటి వాటికి భారత్ భయపడబోదన్నారు. సరిహద్దుల్లో పరిస్థితులు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌ల పట్ల చైనాకు తన నిరసనను భారత్ పలుమార్లు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు మార్గాలు అన్వేషించాల్సిన అవసరం ఇరు దేశాలకు ఉందన్నారు. ‘ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న పరిస్థితులు చైనాకు కూడా ఏమంత మంచివికావు. సరిహద్దుల్లో పరిస్థితుల ప్రభావం ఇప్పటికే రెండు దేశాల సంబంధాలపై ప్రభావం చూపింది..ఇంకా చూపుతోంది. సరిహద్దుల్లో ప్రశాంతత లేనప్పుడు సాధారణ సంబంధాలను ఆశించడం సరికాదు’అని జై శంకర్ అన్నారు. 2020 మేలో సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తినప్పుడు చైనా బలగాలు భారత భూభాగాన్ని ఆక్రమించాయంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను మీడియా ప్రస్తావించగా.. సరిహద్దులకు అత్యంత సమీపంలో రెండు దేశాల బలగాల మోహరింపే అసలైన సమస్య అని మంత్రి బదులిచ్చారు. సమస్య పరిష్కారానికి రెండు పక్షాలు చర్చలు జరుపుతున్నాయని చెప్పారు. ‘సంబంధాలు మాత్రం తెగిపోలేదు. విషయం ఏమిటంటే..రెండు దశాబ్దాల్లోనే అత్యంత భీకరంగా 2020 జూన్‌లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించాయి. గల్వాన్ ఘర్షణల తర్వాత రోజు ఉదయం చైనా విదేశాంగ మంత్రితో ఫోన్లో మాట్లాడాను కూడా. ఆ తర్వాత కూడా దౌత్య, సైనిక మార్గాల్లో చర్చలు సాగిస్తున్నాం. అయితే, చైనా మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఘర్షణలకు దిగుతోంది. అందుకే ఆ దేశంతో సంబంధాలు గాడినపడటం లేదు’అని వివరించారు. ఒక్క చైనాతో తప్ప అన్ని ముఖ్యమైన అన్ని దేశాలు, సమూహాలతో భారత్ సంబంధాలు గణనీయంగా అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. -
సరిహద్దు సమస్యల పరిష్కారానికే పెద్ద పీట
గోవా: తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో శాంతి స్థాపన లక్ష్యంగా సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకోవాలని చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్కు భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. గురువారం జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఒ) విదేశాంగ మంత్రుల మండలి సమావేశంలో పాల్గొనడానికి గోవాకి వచ్చిన కిన్ గాంగ్‌తో బెనౌలిమ్ బీచ్ రిసార్ట్‌లో జై శంకర్ సమావేశమయ్యారు. సరిహద్దు సమస్యతో పాటు ఎస్సీఒ, జీ–20, బ్రిక్స్‌కు సంబంధించిన అంశాలపై ఇరుదేశాల మంత్రులు చర్చించారు. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో జైశంకర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్ రష్యా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించారు. ఎస్సీఓలో పాల్గొనేందుకు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ గురువారం గోవాకు చేరుకున్నారు. -
సరిహద్దుల్లో శాంతితోనే సత్సంబంధాలు
న్యూఢిల్లీ: భారత్–చైనా మధ్య సత్సంబంధాలు కొనసాగాలంటే సరిహద్దు సమస్యలన్నీ ద్వైపాక్షిక ఒప్పందాలకు లోబడి పరిష్కారం కావాల్సి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుండబద్దలు కొట్టారు. గురువారం ఆయన చైనా రక్షణ మంత్రి లి షంగ్ఫుతో చర్చలు జరిపారు. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి(ఎల్ఏసీ) మూడేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) దేశాల రక్షణ మంత్రుల సమావేశం కోసం లి గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్, లి సుమారు 45 నిమిషాలసేపు చర్చలు జరిపారు. ఇరువురు మంత్రులు సరిహద్దు వివాదాలతోపాటు ద్వైపాక్షిక సంబంధాలపై ఎటువంటి దాపరికాలు లేకుండా చర్చలు జరిపినట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎల్ఏసీ వెంట నెలకొన్న వివాదాలు రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు, హామీలు, ఒడంబడికలకు లోబడి పరిష్కారం కావాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. ‘సరిహద్దుల్లో శాంతియుత వాతావరణాన్ని బట్టే రెండు దేశాల మధ్య సంబంధాల కొనసాగింపు ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దు ఒప్పందాల ఉల్లంఘనలతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని, ఉద్రిక్తతలు సడలిన తర్వాత మాత్రమే బలగాల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు’అని రక్షణ శాఖ ఆ ప్రకటనలో వివరించింది. -
గల్వాన్ లోయలో క్రికెట్ ఆడిన భారత జవాన్లు..
న్యూఢిల్లీ: 2020 జూన్ 15. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ. భారత్, చైనా సరిహద్దులోని పెట్రోలింగ్ పాయింట్(పీపీ)–14. సరిగ్గా అక్కడే ఇరు దేశాల సైనికుల నడుమ భీకర స్థాయిలో ఘర్షణ జరిగింది. పదునైన ఆయుధాలతో చైనా జవాన్లు దాడి చేయగా, దెబ్బకు దెబ్బ అన్నట్లుగా భారత సైనికులు దీటుగా బదులిచ్చారు. ఈ కొట్లాటలో తమ జవాన్లు ఎంతమంది బలయ్యారో చైనా ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టలేదు. 40 మందికిపైగానే చనిపోయి ఉంటారని అంచనా. భారత్ వైపు నుంచి దాదాపు 20 మంది చనిపోయారు. రణక్షేత్రంగా రక్తంతో తడిసిపోయిన పీపీ–14 ఇప్పుడు క్రికెట్ మైదానంగా మారింది. పటియాలా బ్రిగేడ్‌కు చెందిన త్రిశూల్ డివిజన్ క్రికెట్ పోటీ నిర్వహించింది. సైనికులు సరదాగా క్రికెట్ ఆడారు. పీపీ–14కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఈ పోటీ జరిగింది. జవాన్లు క్రికెట్ ఆడుతున్న ఫొటోలను భారత సైన్యం శుక్రవారం ట్విట్టర్లో పోస్టు చేసింది. గడ్డ కట్టించే తీవ్రమైన చలిలో పూర్తి ఉత్సాహంతో ఈ పోటీ జరిగిందని వెల్లడించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని ఉద్ఘాటించింది. జీ20 విదేశాంగ మంత్రుల సదస్సు సందర్భంగా గురువారం ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. ఆ మరుసటి రోజే గల్వాన్‌లో భారత సైనికులు క్రికెట్ పోటీ నిర్వహించుకోవడం విశేషం. -
భారత భూభాగం ఆక్రమించిన చైనా.. కేంద్రానికి సంచలన నివేదిక!
భారత్ సరిహద్దుల్లో చైనా కారణంగా ఎప్పుడూ ఉద్రిక్తత చోటుచేసుకుంటూనే ఉంటుంది. డ్రాగన్ కంట్రీ భారత్‌కు చెందిన సరిహద్దులపై కన్నేసి ఆక్రమణలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా భారత్‌కు సంబంధించిన భూమిని చైనా ఆక్రమించుకున్నట్టు స్వయంగా దేశానికి చెందిన సీనియర్ అధికారి ఓ నివేదికలో చెప్పడం సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. జమ్మూ కాశ్మీర్‌లోని తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనా కొంత భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఈ ప్రాంతంలోని 65 పాయింట్లలో భారత్ గస్తీ నిర్వహించాల్సి ఉండగా.. మన బలగాలు 26 చోట్లకు మాత్రమే ప్రవేశించగలుగుతున్నాయి. పలు చోట్ల భారత్ గస్తీ నిర్వహించడం లేదని ఈ క్రమంలోనే ఆక్రమణ జరిగినట్టు లేహ్ ఎస్పీ నిత్య కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందించారు. ఈ నివేదికను ఆమె.. ఢిల్లీలో జరిగిన పోలీసుల సదస్సులో కేంద్రానికి సమర్పించారు. కాగా, ఆ ప్రాంతం కారాకోరం శ్రేణుల్లో నుండి చమూరు వరకు విస్తరించి ఉన్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. ఇక, ఈ ప్రాంతాల్లో భారత్ గస్తీ నిర్వహించకపోవడంతో చైనా.. ఆయా ప్రాంతాలను ఆక్రమించుకుంటున్నట్టు తెలిపారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో కొన్ని చోట్ల బఫర్ జోన్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అయితే, బఫర్ జోన్లను ఆసరాగా తీసుకుని భారత్‌కు చెందిన ప్రాంతాలను చైనా ఆక్రమిస్తున్నట్టు నివేదికలో చెప్పుకొచ్చారు. అలాగే, భారత్ బలగాల కదలికలను సైతం గుర్తించేందుకు అక్కడి ఎత్తైన శిఖరాలపై చైనా.. కెమెరాలను అమర్చినట్టు తెలిపారు. ఇలా, బఫర్ జోన్లోకి భారత సైన్యం వెళ్లిన వెంటనే ఆ ప్రదేశం తమ దేశానికి చెందినదే అని చైనా దూకుడగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు. కొద్దిరోజులుగా ఇలా చైనా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని నివేదికలో స్పష్టం చేశారు. ఇక, ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కూడా ఉన్నారు. Did India lose access to 26 patrolling points in Eastern Ladakh? Become a Youturn Supporter: https://t.co/6cvL9b8072#Youturn | #FactCheck | #IndiaBorder | #Ladakh pic.twitter.com/kHY6nsLBcY — Youturn English (@Youturn_media) January 25, 2023 -
ఫలితం లేకుండానే ముగిసిన భారత్–చైనా చర్చలు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లోని తవాంగ్ వద్ద రెండు దేశాల ఆర్మీ మధ్య తలెత్తిన ఘర్షణల నేపథ్యంలో భారత్, చైనాల మధ్య మంగళవారం జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. అయితే, తూర్పు లద్దాఖ్ ప్రతిష్టంభన తొలిగేదిశగా నిర్మాణాత్మక చర్చలు జరిగాయని భారత్, చైనా పేర్కొన్నాయి. అపరిష్కృత సమస్యలను వేగంగా పరిష్కరించుకోవాలంటూ ఇరు దేశాల నేతలు అందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా దాపరికాలు లేకుండా మరింత వివరణాత్మకంగా చర్చలు జరిపినట్లు గురువారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. క్షేత్ర స్థాయిలో సరిహద్దుల్లో భద్రతను, స్థిరతను కాపాడుకోవాలని అంగీకరించినట్లు చెప్పాయి. సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగిస్తూ, విభేదాలకు ఆమోదయోగ్య పరిష్కారాన్ని త్వరగా కనుగొనాలని పేర్కొన్నాయి. ఈ నెల 20న సరిహద్దుల్లోని చైనా భూభాగంలో చుషుల్–మోల్దో వద్ద 17వ విడత భారత్–చైనా కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరిగినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు. -
భారత్-చైనా సరిహద్దు వివాదంలో కీలక పురోగతి
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దు వివాదంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా కీలక ముందడుగు పడింది. తూర్పు లద్దాక్ పెట్రోలింగ్ పాయింట్ 15 సమీపంలోని గోగ్రా హైట్స్ హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో ఇరుదేశాలు తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్నాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రక్రియ మంగళవారం పూర్తయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కోసం ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నిర్మాణాలను కూడా ఇరు దేశాల సైన్యాలు తొలగించాయి. దీంతో 2020 మే తర్వాత ఈ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. గోగ్రా హాట్‌స్ప్రింగ్స్‌లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ సెప్టెంబర్ 12న పూర్తవుతుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ గతవారమే చెప్పింది. భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా మంగళవారంతో ఈ ప్రక్రియ పూర్తవుతుందని సోమవారం వెల్లడించారు. శనివారం ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన తూర్పు లద్దాక్‌లో పరిస్థితిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. 2020 మే 5న భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ తలెత్తినప్పటినుంచి తూర్పు లద్దాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత సరిహద్దులోని ఇతర ప్రాంతాలకు ఈ వివాదం విస్తరించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇరు దేశాల సైనికాధికారులు రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. మొత్తం 16 సార్లు కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిపారు. పరస్పర ఒప్పందం ప్రకారం ఎట్టకేలకు బలగాల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేశారు. చదవండి: అందరూ దొంగలే.. అవినీతిపై మంత్రి సంచలన వ్యాఖ్యలు.. -
గోగ్రా నుంచి మూడు రోజుల్లో సైన్యం వెనక్కి
న్యూఢిల్లీ: తూర్పులద్దాఖ్‌లోని గోగ్రా హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో సైన్యాన్ని వెనక్కి ప్రక్రియను మూడు రోజుల్లో పూర్తి చేయాలని భారత్, చైనా నిర్ణయించాయి. సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి ఈ నెల 12 సోమవారం వరకు గడువు ఉందని భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంబడి గత రెండేళ్లుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న గోగ్రా–హాట్‌స్ప్రింగ్స్ పెట్రోలింగ్ పాయింట్ 15 దగ్గర్నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకునే ప్రక్రియను మొదలు పెట్టామని భారత్, చైనా ప్రకటించిన ఒక్క రోజు తర్వాతే భారత్ విదేశాంగ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వచ్చేవారం ఉజ్బెకిస్తాన్‌లో షాంఘై సహకార సంస్థ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశాలున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఇతర అంశాలను కూడా పరిష్కరించుకొని సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడానికి ఇరుపక్షాలు అంగీకరించినట్టుగా విదేశాంగ శాఖ అధికారప్రతినిధి అరిందమ్ బగాచి చెప్పారు. గురువారం ఉదయం 8.30 గంటలకు మొదలైన సైన్యం ఉపసంహరణ సోమవారంతో ముగియాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో తాత్కాలిక నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాలనూ ధ్వంసం చేస్తున్నటు చెప్పారు. 2020 జూన్ గల్వాన్‌లోయలో ఘర్షణలు జరగడానికి ముందు ఎలా ఉండేదో అలా ఉండేలా ఇరు పక్షాలు చర్యలు తీసుకుంటాయన్నారు. -
ఆక్రమిత ప్రాంతంలో చైనా వంతెన నిర్మాణం
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన నిర్మిస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ గురువారం నిర్ధారించింది. అయితే వంతెన నిర్మిస్తున్న ప్రాంతం గత 60 ఏళ్లుగా చైనా అక్రమ ఆధీనంలో ఉందని తెలిపింది. చైనా చర్యల నేపథ్యంలో దేశ రక్షణ ప్రయోజనాలు సంపూర్ణంగా పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడాన్ని కూడా ఆయన ఖండించారు. అరుణాచల్ ఎప్పుడూ భారత్‌లో భాగమేనన్నారు. చైనా ఇలాంటి వక్ర చర్యలకు బదులు ఘర్షణాత్మక అంశాలపై భారత్‌తో నిర్మాణాత్మక చర్చలు జరపాలని సూచించారు. -
India, China Military Talks: అసంపూర్తిగానే సుదీర్ఘ సైనిక చర్చలు
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లో మిగతా ప్రాంతాల్లోని ప్రతిష్టంభనపై భారత మరియు చైనా సైనిక కమాండర్ల మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు భారత సైన్యం ప్రకటించింది. అయితే భారత్–చైనా మధ్య 13వ దఫా కార్ప్స్ కమాండర్ స్థాయి సైనిక చర్చలు చుషుల్–మోల్డో బోర్డర్ పాయింట్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చైనా ప్రతిపాదనలను భారత్ సైన్యం అంగీరించడానికీ ముందుకు వచ్చినా చైనా ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదని పేర్కొంది. ఈ సమావేశంలో తూర్పు లడఖ్‌లోని మిగతా ప్రాంతాల్లో సమస్యల పరిష్కార మార్గానికి భారత్ కొన్ని ప్రతిపాదనలు సూచించిన చైనా ఏ మాత్రం ఆమోదించడానికి మొగ్గు చూపలేదని స్పష్టం చేసింది. (చదవండి: భారత స్పేస్ అసోసియేషన్‌ని ప్రారంభించనున్న మోదీ) కాగా, సరిహద్దు ప్రాంతాల్లో ఘర్ణణ వాతావరణం ఏర్పడకుండా ఉండటానికీ సహకరిస్తామని ఇరు సైన్యాలు అంగీకరించినట్లు తెలిపింది. భారత్-చైనాల ద్వైపాక్షిక సంబంధాల దృష్ట్యా సరిహద్దు సమస్యల పరిష్కారానికై కృషి చేస్తున్నమాని భారత్ పేర్కొంది. గోగ్రాలోని రిజల్యూషన్ ఆరు ఫ్లాష్పాయింట్లలో నాలుగింటిలో భారత్ , చైనాలు వెనక్కి తగ్గడానికి అంగీకరించాయి. అదేవిధంగా మిగిలిన గంగాన్, పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ సరిహద్దు ప్రాంతాల్లోని డిప్సాంగ్, హాట్ స్ప్రింగ్స్‌లో చైనా బలగాలు వెనక్కి తగ్గి సహకరించాలని భారత్ ఒత్తిడి చేస్తోంది. ఇటీవల చైనా సైన్యం వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను అతిక్రమించి ఉత్తరాఖండ్‌లోని బారాహోతి సెక్టార్, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే డెప్సాంగ్తో సహా మిగిలిన వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాలు సాధ్యమైనంత త్వరగా వెనక్కి వెళ్లిపోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇదే అత్యుత్తమైన పరిష్కార మార్గం అని భారత్ నొక్కి చెబుతోంది. మే 5,2020న తూర్పు లడఖ్‌లో భారత్–చైనా సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిన అనంతరం ఇరు దేశాల అధికారులు సంప్రదింపుల కారణంగా 12వ దఫా కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు ఈ ఏడాది జూలై 31న జరిగిన సంగతి తెలిసిందే . (చదవండి: "మేం ఒత్తిడికి తలొగ్గుతామని భ్రమపడొద్దు") -
పీపీ–15 నుంచి వెనక్కి వెళ్లిపోండి: చైనాకు తెగేసి చెప్పిన భారత్
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో మిగిలిన వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాలు సాధ్యమైనంత త్వరగా వెనక్కి వెళ్లిపోవాలని భారత్ మరోసారి తేల్చిచెప్పింది. భారత్–చైనా మధ్య 13వ దఫా కార్ప్స్ కమాండర్ స్థాయి సైనిక చర్చలు ఆదివారం జరిగాయి. ఇరు దేశాల నడుమ చుషుల్–మోల్డో బోర్డర్ పాయింట్ వద్ద చైనా వైపు భూభాగంలో ఉదయం 10.30 గంటలకు మొదలైన ఈ చర్చలు రాత్రి 7 గంటలకు ముగిశాయని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. 8.30 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన చర్చల్లో కీలకాంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపాయి. భారత్ తరఫు బృందానికి లేహ్‌లోని 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పి.జి.కె.వీునన్ నేతృత్వం వహించారు. ప్రధానంగా తూర్పు లద్దాఖ్ హాట్‌స్ప్రింగ్స్ ప్రాంతంలోని పెట్రోలింగ్ పాయింట్(పీపీ)–15 నుంచి బలగాల ఉపసంహరణ గురించే చర్చించినట్లు తెలిసింది. గత ఏడాది మే నెలలో చోటుచేసుకున్న ఘర్షణ పురావృతం కాకుండా సరిహద్దుల్లో పెట్రోలింగ్ చేపట్టాలని, ఇందుకోసం కొత్త ప్రోటోకాల్స్ రూపొందించుకోవాలని ఇరు వర్గాలు ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. అయితే, దీనిపై సైన్యం నుంచి అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు. గోగ్రా నుంచి ఉపసంహరణ పూర్తి 2020 మే 5వ తేదీన తూర్పు లద్దాఖ్‌లో భారత్–చైనా సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరువైపులా పదుల సంఖ్యలో జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా వివిధ స్థాయిల్లో అధికారులు సంప్రదింపులు ప్రారంభించారు. రాజకీయ, దౌత్య, సైనిక పరమైన చర్చలు జరుగుతున్నాయి. 12వ దఫా కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు ఈ ఏడాది జూలై 31న జరిగాయి. ఈ చర్చల్లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గోగ్రా నుంచి తమ బలగాల ఉపసంహరణ ప్రక్రియను భారత్, చైనా పూర్తి చేశాయి. ఇరు దేశాల నడుమ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడాలంటే డెస్పాంగ్‌తో సహా అన్ని వివాదాస్పద ప్రాంతాలపై ఒక ఒప్పందానికి రావాలని భారత్ నొక్కి చెబుతోంది. ఇటీవల చైనా సైన్యం వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను అతిక్రమించి ఉత్తరాఖండ్‌లోని బారాహోతి సెక్టార్, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఇరు దేశాల అధికారులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో 13వ దఫా చర్చలు సాఫీగా సాగడం విశేషం. -
భారత్–చైనామధ్య 13వ దఫా చర్చలు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించే లక్ష్యంతో భారత్, చైనా ఆదివారం 13వ దఫా చర్చలు జరపనున్నాయి. చైనా బలగాలు ఇటీవల సరిహద్దులు దాటి ఉత్తరాఖండ్‌లోని బారాహోతీ సెక్టార్, అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లలోకి ప్రవేశించిన నేపథ్యంలో జరుగుతున్న ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తూర్పు లద్దాఖ్ ఘర్షణాత్మక ప్రాంతాల్లోని కొన్ని ఫార్వర్డ్ పోస్టుల్లో మోహరించిన బలగాల ఉపసంహరణే ఈ భేటీ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా వైపు ఉన్న మోల్డో బోర్డర్ పాయింట్లో 10వ తేదీ ఉదయం 10.30 గంటలకు చర్చలు ప్రారంభం కానున్నాయని వెల్లడించాయి. భారత బృందానికి లెహ్‌లోని 14 కారప్స్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ నాయకత్వం వహించనున్నారు. డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల విషయం ప్రస్తుతానికి పక్కనబెట్టి, మిగతా ఘర్షణాత్మక ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా బలగాల ఉపసంహరణ చేపట్టాలని చర్చల సందర్భంగా భారత్ ప్రతినిధులు పట్టుబట్టే అవకాశం ఉంది. 12వ విడత చర్చలు జూలై 31వ తేదీన జరిగాయి. ఫలితంగా కీలకమైన గోగ్రా పాయింట్ నుంచి రెండు దేశాల ఆర్మీ ఉపసంహరణ పూర్తయింది. చైనా మోహరింపులు ఆందోళనకరం ప్రతిష్టంభన కొనసాగుతున్న తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనా మిలటరీ మోహరింపులు కొనసాగించడం, మౌలిక వసతులను పెంచుకోవడం ఆందోళన కలిగించే అంశమని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే అన్నారు. ఇండియాటుడే కాంక్లేవ్‌లో శనివారం ఆయన మాట్లాడారు. శీతాకాలం ఆసాంతం బలగాల మోహరింపులను చైనా కొనసాగించాలని చూస్తే, పాకిస్తాన్ వైపు ఎల్వోసీ (నియంత్రణ రేఖ) వెంబడి వంటి పరిస్థితికి దారితీయవచ్చని భావిస్తున్నామన్నారు. ఆ దేశ మిలటరీ పీఎల్ఏ (పీపుల్స్ లిబరేషన్ ఆరీ్మ)కదలికలపై ఓ కన్నేసి ఉంచామన్నారు. చైనా సైన్యానికి సరితూగే స్థాయిలో భారత్ కూడా బలగాల మోహరింపులను కొనసాగిస్తుందని, ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. ప్రపంచమంతటా కోవిడ్ మహమ్మారి తీవ్రత కొనసాగుతుండటం, దక్షిణ చైనా సముద్రంలో ఒక వైపు వివాదాలను ఎదుర్కొంటున్న చైనా..మరో వైపు భారత్‌తో ప్రతిష్టంభనను ఎందుకు కొరుకుంటోందనేది అర్థం కాని విషయమన్నారు. ఏదేమైనప్పటికీ తూర్పు లద్దాఖ్ ప్రతిష్టంభనతో నిఘా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరాన్ని గుర్తించామన్నారు. కశ్మీర్లో పరిస్థితులపై ఆయన మాట్లాడుతూ.. అఫ్గాన్ ఉగ్రవాదులు కశీ్మర్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారం చెలాయించిన సమయంలోనూ అక్కడి ఉగ్రమూకలు కశీ్మర్‌లోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారని ఆయన గుర్తు చేశారు. అక్రమ చొరబాట్లను నిరోధించేందుకు, ఉగ్రవాదుల ఆటకట్టించేందుకు మన బలగాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి రావడానికి, ఇటీవలి కాలంలో ఉగ్రవాదులు కశీ్మర్లో పౌరులను లక్ష్యంగా చేసుకోవడంతో సంబంధం ఉన్నట్లు భావించడం లేదని తెలిపారు. లోయలో అశాంతిని ప్రేరేపించాలని కుట్రపన్నిన ఉగ్రమూకలు చివరి ప్రయత్నంగా అమాయకులను పొట్టనబెట్టుకుంటున్నాయన్నారు. స్వేచ్ఛా నౌకాయానమే కీలకం: రాజ్‌నాథ్ భారతదేశ అభివృద్ధి స్వేచ్ఛా నౌకాయానంతోనే ఎక్కువగా ముడిపడి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఎంతోకాలం నుంచి సముద్రంతోనే మనకు సన్నిహిత సంబంధం కొనసాగుతోంది. మన వాణిజ్యం, ఆరి్థక వ్యవస్థ, మన పండుగలు, సంస్కృతి సముద్రంతోనే సాన్నిహిత్యం కలిగి ఉన్నాయి. అయినప్పటికీ, సముదప్రాంతానికి సంబంధించి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం’ అని శనివారం జరిగిన భారత తీర రక్షక దళం(ఐసీజీ) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సముద్రయాన భద్రత లేకుండా, దేశానికి సమగ్ర రక్షణ వ్యవస్థను సాధించడం అసాధ్యమన్నారు. -
సరిహద్దుల్లో శాంతి కపోతాలు..!
న్యూఢిల్లీ: దాదాపు 15నెలల ఉద్రిక్తతల అనంతరం తూర్పు లద్దాఖ్‌లోని గోగ్రా వద్ద ఇండియా, చైనాలు తమతమ బలగాల ఉపసంహరణను పూర్తి చేశాయి. దీంతో ఈ ప్రాంతంలో ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు చల్లారేందుకు, శాంతి నెలకొనేందుకు వీలు కలగనుంది. ఈ ప్రాంతంలో బలగాల ఉపసంహరణ ఆగస్టు 4,5 తేదీల్లో పూర్తయిందని, అంతేకాకుండా ఇరుపక్కలా నిర్మించిన తాత్కాలిక కట్టడాలను, ఇతర మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలించడం జరిగిందని భారత ఆర్మీ శుక్రవారం ప్రకటించింది. బలగాల ఉపసంహరణ, కట్టడాల నిర్మూలనను ఇరుపక్షాలు పరస్పరం నిర్ధారించుకున్నాయని తెలిపింది. పాంగాంగ్ సరస్సుకు ఇరుపక్కలా బలగాలను, ఆయుధాలను ఇండియా, చైనా ఉపసంహరించుకున్న ఐదునెలల అనంతరం గోగ్రా ఏరియా(పెట్రోలింగ్ పాయింట్ 17ఏ– పీపీ 17ఏ) వద్ద బలగాల ఉపసంహరణ జరిగింది. ఇరు దేశాల మిలటరీ అధికారుల నడుమ జరిగిన 12వ దఫా చర్చల్లో కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా ఈ ఉపసంహరణ చేసినట్లు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. సరిహద్దు వెంట కొంత ప్రాంతాన్ని బఫర్ జోన్‌గా ప్రకటించుకోవాలని, ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ జరగకూడదని ఇరుదేశాల మిలటరీ నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సరిహద్దుల్లో మరింత శాంతి నెలకొనేందుకు త్వరలో జరిగే మిలటరీ చర్చల్లో ప్రాధాన్యమివ్వాలని సైతం నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఏడాది పైగా ఉద్రిక్తతలు గతేడాది మేలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలతో ఉద్రికత్తలు ఆరంభమయ్యాయి. అనంతరం ఇరు పక్షాలు వేలాదిగా బలగాలను ఎల్ఏసీ ప్రాంతాలకు తరలించాయి. అనంతరం ఇండో చైనా విదేశాంగ మంత్రులు, సైనికాధికారుల మధ్య చర్చలతో వివాదం క్రమంగా కరిగిపోతూ వస్తోంది. తాజాగా గోగ్రా ఏరియాలో ప్రస్తుత బలగాలను ఉపసంహరించడంతో పాటు కొత్తగా బలగాలను మోహరించకూడదని ఇరు పక్షాలు నిర్ణయించుకున్నట్లు ఆర్మీ ప్రకటన తెలిపింది. ప్రస్తుతం ఇరుదేశాల సైనికులు తమ తమ స్వస్థలాలకు చేరుకున్నారని పేర్కొంది. దీంతో మరో సున్నితమైన ప్రాంతంలో దిగ్విజయంగా శాంతిస్థాపన జరిగిందని, ఇకపై ఇదే ధోరణితో ముందుకెళ్లాలని, ఇతర వివాదాస్పద అంశాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరుదేశాల సైన్యం నిర్ణయించుకుందని తెలిపింది. నిజానికి గతేడాదిలోనే ఈ ప్రాంతాల్లో ఇరుపక్షాలు కొంతమేర బలగాల ఉపసంహరణ చేపట్టినా పాంగాంగ్ సరస్సు దక్షిణ భాగంలో ఉద్రిక్తతలు పెరగడంతో ఉపసంహరణ పూర్తిస్థాయిలో జరగలేదు. కానీ తాజా నిర్ణయంతో ఇకపై ఎల్ఏసీ(లైన్ఆఫ్ యాక్చువల్ కంట్రోల్)ను పూర్తిగా గౌరవించాలని ఇరుపక్షాలు భావిస్తున్నట్లు ప్రకటన తెలిపింది. ఇదే సమయంలో భారత సార్వభౌమత్వ పరిరక్షణకు, ఎల్ఏసీ వద్ద శాంతి నెలకొల్పేందుకు ఆర్మీ ధృఢనిశ్చయంతో ఉందని తెలిపింది. గోగ్రా ఏరియాలో శాంతి నెలకొనడంతో ఇకపై హాట్‌స్ప్రింగ్స్, డెప్సాంగ్, డెమ్చాక్ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ జరగాల్సి ఉంది. ఇరు దేశాల బంధానికి ఈ ప్రాంతాల్లో వివాద పరిష్కారమే మార్గమని భారత్ చెబుతోంది. -
ప్రపంచంలోనే ఎత్తయిన రహదారి
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రోడ్డును సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్ఓ) నిర్మించింది. సముద్ర మట్టానికి 19,300 అడుగుల ఎగువన తూర్పు లద్దాఖ్‌లోని ఉమ్లింగ్లా పాస్ వద్ద 52 కిలోమీటర్ల పొడవునా వాహనాలు వెళ్లగలిగే (మోటరబుల్) ఈ రహదారిని నిర్మించినట్లు భారత రక్షణ శాఖ బుధవారం వెల్లడించింది. ఇప్పటిదాకా ఎత్తయిన మోటరబుల్ రోడ్డుగా బొలీవియాలోని రహదారి రికార్డుకెక్కింది. అక్కడ 18,953 అడుగుల ఎత్తులో రోడ్డు నిర్మించారు. ఉమ్లింగ్లా పాస్ వద్ద నిర్మించిన రహదారి తూర్పు లద్దాఖ్‌లో చుమార్ సెక్టార్‌లోని ముఖ్యమైన పట్టణాలను అనుసంధానిస్తోంది. లేహ్ నుంచి చిసుమ్లే, డెమ్‌చోక్‌కు చేరుకోవడం సులభతరం అయ్యిందని రక్షణ శాఖ తెలిపింది. ఈ రహదారితో లద్దాఖ్‌లో పర్యాటక రంగం వృద్ధి చెంది స్థానికుల ఆర్థిక స్థితిగతులు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. సముద్ర మట్టానికి 19,300 అడుగుల ఎగువన శీతాకాలంలో మైనస్ 40 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. -
చైనా సైన్యం పూర్తిగా వెనక్కి మళ్లాల్సిందే
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని డెస్పాంగ్, హాట్‌స్ప్రింగ్స్, గోగ్రాతోపాటు ఇతర కీలక ప్రాంతాల నుంచి చైనా సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని భారత్ పునరుద్ఘాటించింది. బలగాల ఉపసంహరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని డ్రాగన్ దేశానికి స్పష్టం చేసింది. సరిహద్దుల్లో మోహరించిన ఆయుధ సంపత్తిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. బలగాల ఉపసంహరణపై భారత్, చైనా మధ్య 12వ దఫా సైనిక చర్చలు శనివారం తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) సమీపంలో చైనా వైపు ఉన్న మోల్డో బోర్డర్ పాయింట్ వద్ద జరిగాయి. ఇరు దేశాల సైనికాధికారులు దాదాపు 9 గంటలపాటు చర్చించుకున్నట్లు తెలిసింది. ఈసారి చర్చలు సమగ్రంగా జరిగాయని, పలు కీలక అంశాలపై ఇరు దేశాల అధికారులు అభిప్రాయాలను పంచుకున్నారని భారత సైనిక వర్గాలు వెల్ల డించాయి. అయితే, ఈ భేటీలో చివరకు ఏం తేల్చారన్న దానిపై సైన్యం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. భారత్, చైనా మధ్య ఘర్షణకు కారణమవుతున్న ప్రాంతాల నుంచి ఇరు దేశాల సైన్యం సాధ్యమైనంత త్వరగా వెనక్కి వెళ్లిపోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. హాట్‌స్ప్రింగ్స్, గోగ్రాలో చైనా కార్యకలాపాల పట్ల భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. భారత్, చైనా నడుమ 11వ దఫా చర్చలు ఏప్రిల్ 9వ తేదీన 13 గంటలపాటు జరిగిన సంగతి తెలిసిందే. శనివారం జరిగిన 12వ దఫా చర్చల్లో భారత్ తరపున లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ పాల్గొన్నారు. తూర్పు లద్దాఖ్‌లో ఎల్ఏసీ వద్ద భారత్, చైనా ప్రస్తుతం దాదాపు 60,000 చొప్పున సైనికులను మోహరించాయి. -
తూర్పు లద్దాఖ్ నుంచి వెనక్కి మళ్లుదాం
న్యూఢిల్లీ: పాంగాంగ్ సరస్సు నుంచి బలగాల ఉపసంహరణ పూర్తి కావడంతో తూర్పు లద్దాఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, డెస్పాంగ్‌పై భారత్, చైనా ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఆయా ప్రాంతాల్లో విధుల్లో ఉన్న బలగాలను వెనక్కి తీసుకోవడంపై ఇరు దేశాలు సంప్రదింపులు ప్రారంభించాయి. భారత్, చైనా మధ్య పదో దఫా కమాండర్ స్థాయి చర్చలు శనివారం ఎల్ఏసీ వద్ద మోల్డో బోర్డర్ పాయింట్లో జరిగాయి. ఉదయం 10 గంటలకు మొదలైన ఈ సంప్రదింపులు రాత్రి 9.45 గంటల వరకు కొనసాగాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల సైనిక అధికారులు హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, డెస్పాంగ్ నుంచి బలగాల ఉపసంహరణపైనే ప్రధానంగా చర్చించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా ఈ ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై అభిప్రాయాలు పంచుకున్నారు. సైనిక బలగాలను వెనక్కి మళ్లించే ప్రక్రియ చాలా వేగంగా జరగాలని భారత్ నొక్కి చెప్పింది. చైనా కూడా అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
బలగాల ఉపసంహరణపై చైనాతో డీల్
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతల తొలగింపు లక్ష్యంగా ఇరుదేశాల మధ్య కీలకమైన ఒప్పందం కుదిరిందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం పార్లమెంటులో వెల్లడించారు. ఉద్రిక్తతలకు ప్రధాన కారణమైన పాంగాంగ్ సో సరస్సుకు ఇరువైపుల మోహరించిన బలగాలను రెండు దేశాలు వెనక్కు తీసుకునే విషయంలో ఒప్పందం కుదిరిందన్నారు. ఈ ఒప్పందం మేరకు సరస్సుకు ఉత్తర, దక్షిణ తీరాల వద్ద మోహరించిన ఫ్రంట్‌లైన్ సైనికులు ‘దశలవారీగా, సమన్వయంతో, నిర్ధారించుకోదగిన విధానంలో’వెనక్కు వెళ్తారని పేర్కొన్నారు. దాదాపు గత 9 నెలలుగా రెండు దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా చైనాతో కుదిరిన ఒప్పందం వివరాలను రాజ్‌నాథ్ సింగ్ రాజ్యసభకు వెల్లడించారు. తాజా ఒప్పందంతో గత సంవత్సరం మే 5 నాటి కన్నా ముందున్న స్థితికి సరిహద్దుల్లో పరిస్థితులు చేరుకుంటాయన్నారు. అన్ని ద్వైపాక్షిక నిబంధనలు, ఒప్పందాలను గౌరవిస్తూ, సాధ్యమైనంత తొందరగా ఉపసంహరణ జరగాలని ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయన్నారు. పాంగాంగ్ సొ సరస్సునకు ఇరువైపులా గత సంవత్సరం ఏప్రిల్ తరువాత నిర్మించిన అన్ని నిర్మాణాలను తొలగించేందుకు అంగీకారం కుదిరిందన్నారు. ఏ విషయాన్ని దాచి పెట్టలేదు ఆయా ప్రాంతాల్లో గస్తీ సహా అన్ని మిలటరీ కార్యకలాపాలపై తాత్కాలిక నిషేధం విధించినట్లు వెల్లడించారు. గస్తీ పునః ప్రారంభంపై ఇరుదేశాలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయన్నారు. చైనాతో చర్చల విషయంలో భారత్ ఏ విషయాన్ని దాచి పెట్టలేదని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. అలాగే, భారత భూభాగంలోని అంగుళం భూమిని కూడా ఎవరూ తీసుకోవడానికి అంగీకరించబోమన్నారు. తాజా ఒప్పందం ప్రకారం, చైనా తమ సైనిక బలగాలను పాంగాంగ్ సరస్సు ఉత్తర సరిహద్దు నుంచి తూర్పు దిశగా ‘ఫింగర్ 8’ వరకు వెనక్కు తీసుకుంటుందని రాజ్‌నాథ్ తెలిపారు. అలాగే, భారత దళాలు ‘ఫింగర్ 3’ సమీపంలోని శాశ్వత మిలటరీ కేంద్రం ధన్సింగ్ థాపా పోస్ట్ వరకే పరిమితమవుతాయన్నారు. ఈ ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి రావడం ప్రారంభమైందన్నారు. ఈ ఉపసంహరణ ముగిసిన 48 గంటల్లోపు రెండు దేశాల మిలటరీ కమాండర్ స్థాయిలో మరో విడత చర్చలు జరుగుతాయన్నారు. అప్పుడు, ఇతర అపరిష్కృత అంశాలపై చర్చిస్తారని వెల్లడించారు. ‘ప్రణాళికాబద్ధ విధానంతో చైనాతో క్రమం తప్పకుండా చర్చలు కొనసాగించిన కారణంగా, పాంగాంగ్ సరస్సుకు ఉత్తర, దక్షిణ తీరాల వెంట మోహరించి ఉన్న ఇరుదేశాల బలగాల ఉపసంహరణకు ఒప్పందం కుదిరింది’అని రాజ్‌నాథ్ రాజ్యసభలో ప్రకటించారు. పాంగాంగ్ సరస్సుకు ఉత్తర, దక్షిణ తీరాల వెంట చైనా, భారత్ దళాల ఉపసంహరణ ప్రారంభమైందని చైనా బుధవారమే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఈ సందర్భంగా రాజ్‌నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. సైనికులు చేసిన త్యాగాలను దేశం గుర్తుంచుకుంటుందన్నారు. పాంగాంగ్ సరస్సుకు ఉత్తరంగా ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 వరకు చైనా తన బలగాలను ఉపసంహరించాలని ఆ దేశంతో జరిగిన 9 విడతల చర్చల్లోనూ భారత్ గట్టిగా వాదించింది. ప్రతిగా, సరస్సు దక్షిణ తీరం వెంట ఉన్న కొన్ని వ్యూహాత్మక ప్రాంతాల నుంచి భారత దళాలు వైదొలగాలని చైనా డిమాండ్ చేసింది. ముఖపరి, రెచిన్ లా, మగర్ హిల్ తదితర వ్యూహాత్మకంగా కీలకమైన పర్వత ప్రాంతాలను ఐదు నెలల క్రితం భారత దళాలు స్వాధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజా ఒప్పందం ప్రకారం.. ఫింగర్ 3 నుంచి ఫింగర్ 8 వరకు తాత్కాలికంగా ‘నో పెట్రోలింగ్ జోన్’గా మారుతుంది. ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 మధ్య చైనా పలు బంకర్లను నిర్మించింది. ఫింగర్ 4 ను దాటి ముందుకు వచ్చేందుకు ప్రయత్నించిన భారత దళాలను అడ్డుకుంది. చైనా దళాలు ఫింగర్ 8 వరకు వెళ్లేందుకు అంగీకరించడం గొప్ప విజయంగా భావించవచ్చని రక్షణ రంగ నిపుణులు వ్యాఖ్యానించారు. రాజ్యసభలో మాట్లాడుతున్న రాజ్‌నాథ్ -
చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభం
బీజింగ్: కొన్ని నెలలుగా వివాదాస్పదంగా మారిన చైనా, భారత్ దేశాల సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో ప్యాంగ్యాంగ్ సొ సరస్సు దక్షిణ, ఉత్తర సరిహద్దుల నుంచి చైనా, భారత్ బలగాల ఉపసంహరణ బుధవారం ప్రారంభమైందని చైనా రక్షణ శాఖ ప్రకటించింది. అయితే, చైనా చేసిన ఈ ప్రకటనపై భారత్ స్పందించలేదు. ‘ప్యాంగ్యాంగ్ సొ సరస్సుకు దక్షిణ, ఉత్తర తీరాల వద్ద ఉన్న చైనా, భారత్ దేశాల ఫ్రంట్‌లైన్ దళాల ప్రణాళికాబద్ధ ఉపసంహరణ ఫిబ్రవరి 10న ప్రారంభమైంది’ అని చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి, సీనియర్ కల్నల్ వూ క్విన్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య కోర్ కమాండర్ స్థాయిలో జరిగిన తొమ్మిదవ విడత చర్చల సందర్భంగా కుదిరిన ఏకాభిప్రాయం మేరకు చైనా, భారత్ బలగాల ఉపసంహరణ ప్రారంభమైందన్నారు. -
పరాక్రమంతో తిప్పికొట్టాం
న్యూఢిల్లీ: తూర్పు లద్దాక్‌లోని వాస్తవాధీన రేఖవద్ద, భారత సైనిక దళాలు అత్యంత ధైర్యంతో, పరాక్రమంతో చైనా బలగాలను తిప్పికొట్టాయని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘‘ చరిత్రలో తనకోసం తాను పోరాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు దేశం ఎవరితోనైనా పోరాడితీరుతుంది. మనుగడ కోసం ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి సంసిద్ధం అవుతుంది’’అని ఎఫ్ఐసీసీఐ వార్షిక సమావేశం సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. దేశంలో రైతాంగం చేస్తున్న ఆందోళనలను గురించి వ్యాఖ్యానిస్తూ రాజ్‌నాథ్ సింగ్ వ్యవసాయం ఒక ‘‘మాతృ విభాగం’’ అని, వ్యవసాయరంగాన్ని తిరోగమన దిశలో పయనింపజేసే ఎటువంటి చర్యలను చేపట్టే సమస్యేలేదని ఆయన నొక్కి చెప్పారు. కవ్వింపులకు బదులిస్తాం:రావత్ కోల్‌కతా: చైనా వైపు నుంచి ఎలాంటి కవ్వింపులు ఎదురైనా గట్టిగా బదులు చెప్పేందుకు భారత సైనిక బలగాలు సిద్ధంగా ఉన్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) టిబెట్‌లో పలు అభివృద్ధి పనుల్లో నిమగ్నమైందని అన్నారు. దేశ భద్రత విషయంలో రాజీ లేదని అన్నారు. -
ఈ సైనిక శిబిరాలు స్మార్ట్
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లద్దాఖ్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సైనికులు సమర్థంగా పనిచేయడానికి వీలుగా అత్యంత ఆధునిక వసతి సౌకర్యాలను కల్పించారు. కొద్ది రోజులుగా చైనాతో ఉద్రిక్తతలు నెలకొని ఉండడంతో శీతాకాలంలో సైనికుల ఆరోగ్యానికి పూర్తిగా రక్షణ కల్పించేలా స్మార్ట్ శిబిరాలను ఏర్పాటు చేశారు. నవంబర్ నుంచి ఈ ప్రాంతంలో రక్తం గడ్డకట్టే చలి మొదలవుతుంది. ఉష్ణోగ్రతలు దాదాపు మైనస్ 40 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోతాయి. 40 అడుగుల ఎత్తున మంచు పేరుకుపోతుంది. ఇలాంటి కఠినమైన వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుంటూ దేశ రక్షణ కోసం కంటి మీద రెప్ప వేయకుండా కాపలా కాసే మన జవాన్ల కోసం నిర్మించిన ఈ స్మార్ట్ క్యాంపుల్లో అన్ని రకాల సదుపాయాలున్నాయి. చలిని తట్టుకోవడానికి శిబిరాల్లో హీటర్లు, 24 గంటలు వేడి నీళ్ల సదుపాయం, విద్యుత్, బెడ్లు, కబోర్డులు ఇలా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. ‘లద్దాఖ్‌లో గస్తీ ఉండే సైనికులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాం. వారు చలిని తట్టుకునేలా స్మార్ట్ శిబిరాల నిర్మాణం పూర్తయింది. దేశ రక్షణ కోసం పాటు పడే జవాన్లు శీతాకాలంలో సమర్థమంతంగా విధులు నిర్వహించడం కోసం మెరుగైన వసతి సదుపాయాలు కల్పించాం’అని భారత సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. స్మార్ట్ శిబిరాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ట్విట్టర్లో షేర్ చేయడంతో అవి విస్తృతప్రచారం పొందాయి. గత నెలలోనే చైనా కూడా ఈ ప్రాంతంలో ఆధునిక సదుపాయాలతో సైనిక శిబిరాలు ఏర్పాటు చేసి, వాటి వీడియోల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. చైనా శిబిరాలకు ఏమాత్రం తీసిపోకుండా భారత్‌కి చెందిన స్మార్ట్ శిబిరాలు కూడా ఉండడం గమనార్హం. -
చైనాతో ఉద్రిక్తతలకు చెక్!
న్యూఢిల్లీ: భారత్–చైనాల సరిహద్దుల్లో 6 నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభన త్వరలోనే ముగింపునకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్రిక్తతలను తొలగించుకునే క్రమంలో ఇరు దేశాల సైనికాధికారులు ఇప్పటి వరకు 8 దఫాలుగా చర్చలు జరిపారు. వారం క్రితం కోర్ కమాండర్ల స్థాయిలో జరిగిన 8వ విడత చర్చల్లో సరిహద్దుల్లో శాంతి స్థాపన సాధన దిశగా కీలక ముందడుగు పడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీటిపై త్వరలోనే జరిగే 9వ విడత కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల సందర్భంగా సంతకాలు జరిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగా, ఘర్షణాత్మక ప్రాంతాల్లో మోహరించిన సైన్యాన్ని, ఆయుధ సామగ్రిని నిర్ణీత కాల వ్యవధిలో మూడు విడతలుగా ఉపసంహరించుకునేందుకు స్థూలంగా ఒక అంగీకారం కుదిరింది. ఇది అమల్లోకి వస్తే వాస్తవ ఆధీన రేఖ(ఎల్ఏసీ) వెంట తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఏప్రిల్ నాటి పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయని బుధవారం అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం మొదటి దశలో ఒప్పందం కుదిరిన మూడు రోజుల్లోనే రోజుకు 30 శాతం చొప్పున బలగాలను రెండు దేశాలు ఉపసంహరించుకోవాలి.