న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో మిగిలిన వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాలు సాధ్యమైనంత త్వరగా వెనక్కి వెళ్లిపోవాలని భారత్ మరోసారి తేల్చిచెప్పింది. భారత్–చైనా మధ్య 13వ దఫా కార్ప్స్ కమాండర్ స్థాయి సైనిక చర్చలు ఆదివారం జరిగాయి. ఇరు దేశాల నడుమ చుషుల్–మోల్డో బోర్డర్ పాయింట్ వద్ద చైనా వైపు భూభాగంలో ఉదయం 10.30 గంటలకు మొదలైన ఈ చర్చలు రాత్రి 7 గంటలకు ముగిశాయని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి.
8.30 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన చర్చల్లో కీలకాంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపాయి. భారత్ తరఫు బృందానికి లేహ్‌లోని 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పి.జి.కె.వీునన్ నేతృత్వం వహించారు. ప్రధానంగా తూర్పు లద్దాఖ్ హాట్‌స్ప్రింగ్స్ ప్రాంతంలోని పెట్రోలింగ్ పాయింట్(పీపీ)–15 నుంచి బలగాల ఉపసంహరణ గురించే చర్చించినట్లు తెలిసింది. గత ఏడాది మే నెలలో చోటుచేసుకున్న ఘర్షణ పురావృతం కాకుండా సరిహద్దుల్లో పెట్రోలింగ్ చేపట్టాలని, ఇందుకోసం కొత్త ప్రోటోకాల్స్ రూపొందించుకోవాలని ఇరు వర్గాలు ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. అయితే, దీనిపై సైన్యం నుంచి అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు.
గోగ్రా నుంచి ఉపసంహరణ పూర్తి
2020 మే 5వ తేదీన తూర్పు లద్దాఖ్‌లో భారత్–చైనా సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరువైపులా పదుల సంఖ్యలో జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా వివిధ స్థాయిల్లో అధికారులు సంప్రదింపులు ప్రారంభించారు. రాజకీయ, దౌత్య, సైనిక పరమైన చర్చలు జరుగుతున్నాయి. 12వ దఫా కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు ఈ ఏడాది జూలై 31న జరిగాయి. ఈ చర్చల్లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గోగ్రా నుంచి తమ బలగాల ఉపసంహరణ ప్రక్రియను భారత్, చైనా పూర్తి చేశాయి.
ఇరు దేశాల నడుమ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడాలంటే డెస్పాంగ్‌తో సహా అన్ని వివాదాస్పద ప్రాంతాలపై ఒక ఒప్పందానికి రావాలని భారత్ నొక్కి చెబుతోంది. ఇటీవల చైనా సైన్యం వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)ను అతిక్రమించి ఉత్తరాఖండ్‌లోని బారాహోతి సెక్టార్, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఇరు దేశాల అధికారులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో 13వ దఫా చర్చలు సాఫీగా సాగడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment