line of control
-
BSF: 150 మంది ఉగ్రవాదులు కాచుక్కూర్చున్నారు..
శ్రీనగర్: శీతాకాలం సమీపిస్తున్నండగా కశ్మీర్ లోయలో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి 150 మంది వరకు ఉగ్రవాదులు మన భూభాగంలోకి దొంగచాటుగా ప్రవేశించేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని బీఎస్ఎఫ్(సరిహద్దు భద్రతా దళం) తెలిపింది. చొరబాటుదారులు చేసే ఎలాంటి ప్రయత్నాలనైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ‘చొరబాటు యత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ నిఘా విభాగాల నుంచి అందుతున్న సమాచారం ఆధారంగా ఆర్మీతో సమన్వయం చేసుకుంటూ సరిహద్దుల్లో భద్రతపై అప్రమత్తంగా ఉన్నాం’అని బీఎస్ఎఫ్ ఐజీ(కశ్మీర్) అశోక్ యాదవ్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ‘పాక్ వైపు సరిహద్దులకు సమీపంలోని స్థావరాల్లో ఉండే ముష్కరుల గురించిన అంచనాలను బట్టి, చొరబాటుయత్నాలను తిప్పికొట్టి, వారిపై పైచేయి సాధించేలా మా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాం’అని యాదవ్ వివరించారు. ‘ఎల్వోసీకి సమీపంలోని స్థావరాల్లో కాచుకుని ఉండే ఉగ్రవాదుల సంఖ్య 130–150 మధ్య మారుతూ ఉంటుంది. ఒక్కోసారి ఇంతకంటే కాస్త ఎక్కువమందే ఉండొచ్చు’అని తెలిపారు. అంతర్జాతీయ పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఎల్వోసీ వెంట ఉన్న తంగ్ధర్, కెరన్ సెక్టార్ల పరిధిలో డ్రగ్స్ అక్రమ రవాణాకు అవకాశాలున్నాయంటూ ఆయన..వీటిని అడ్డుకునేందుకు మొబైల్ బంకర్లు, మహిళా ట్రూపర్లను రంగంలోకి దించామని వెల్లడించారు. స్మగ్లర్లు డ్రగ్స్ కొరియర్లుగా మహిళలను వాడుకుంటున్నారని ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు. -
ఎల్ఓసీ వద్ద పేలిన ల్యాండ్‌మైన్.. ఆర్మీ జవాన్ మృతి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీపంలో ల్యాండ్‌మైన్‌పై కాలు పెట్టడంతో పేలుడు సంభవించి భారత ఆర్మీ జవాను ప్రాణాలు విడిచాడు. మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం ఉదయం 10.30 గంటలకు జరిగింది. రాజౌరీ జిల్లా నౌషేరాలో నియంత్రణ రేఖ వెంబడి సైనికులు పెట్రోలింగ్‌లో ఉండగా ఒక జవాను ల్యాండ్‌మైన్‌పై అడుగు పెట్టడంతో ప్రమాదవశాత్తూ అది ట్రిగ్గర్ అయ్యింది. దీంతో పేలుడు సంభవించండో ముగ్గురు ఆర్మీ జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరిని ఉధంపూర్‌లోని కమాండ్ ఆసుపత్రికి తరలించగా ఒక సైనికుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. అయితే మరణించిన జవాన్ వివరాలను ఇంకా భారత ఆర్మీ వెల్లడించలేదు. -
ఎల్ఏసీ వెంట చైనా మోహరింపులు
వాషింగ్టన్: అది 2022 సంవత్సరం. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ. ఆ సమయంలో చైనా చడీచప్పుడూ లేకుండా వాస్తవాదీన రేఖ వెంబడి అన్నిరకాలుగా బలపడే ప్రయత్నాలు చేస్తూ వచి్చంది. ముఖ్యంగా అరుణాచల్‌ప్రదేశ్ వెంబడి సైనిక మోహరింపులను విపరీతంగా పెంచేసింది. డోక్లాం వెంబడి భూగర్భ నిల్వ వసతులను పటిష్టపరుచుకుంది. మరెన్నో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంది. పాంగాంగ్ లేక్ మీదుగా రెండో వంతెనతో పాటు డ్యుయల్ పర్పస్ ఎయిర్‌పోర్టు, మలి్టపుల్ హెలిపాడ్లను నిర్మించుకుంది. తూర్పు లద్దాఖ్ వెంబడి పలుచోట్ల కొన్నేళ్లుగా చైనా సైన్యం కయ్యానికి కాలుదువ్వడం, మన సైన్యం దీటుగా బదులివ్వడం తెలిసిందే. ముఖ్యంగా మూడేళ్లుగా అక్కడ ఇరు సైన్యాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ‘చైనాలో సైనిక, భద్రతాపరమైన పరిణామాలు–2023’ పేరిట అమెరికా రక్షణ శాఖ తాజాగా ఒక సమగ్ర నివేదికను విడుదల చేసింది. ‘2020 మే నుంచే భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు తీవ్ర ఉద్రిక్త స్థాయికి చేరడం మొదలైంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రెండు డివిజన్ల జిన్జియాంగ్, టిబెట్ మిలిటరీ డి్రస్టిక్ట్స్ దన్నుతో ఒక బోర్డర్ రెజిమెంట్‌నే ఏర్పాటు చేసింది. నాలుగు కంబైన్డ్ ఆర్మీ బ్రిగేడ్ (సీఏబీ) తదితరాలను 2022లో వాస్తవా«దీన రేఖ వెంబడి రిజర్వులో ఉంచింది. మరో మూడు సీఏబీలను ఇతర కమాండ్ల నుంచి తూర్పు సెక్టార్‌కు తరలించి సిద్ధంగా ఉంచింది. తర్వాత వీటిలో కొన్నింటిని వెనక్కు పిలిపించినా మెజారిటీ సేనలు ఇప్పటికీ వాస్తవా«దీన రేఖ వెంబడే మోహరించే ఉన్నాయి’ అని ఆ నివేదిక స్పష్టంచేసింది. 2020 జూన్‌లో గల్వాన్ లోయలో ఇరు సైన్యాలు తీవ్ర ఘర్షణకు దిగడం తెలిసిందే. ఆ నేపథ్యంలో చైనా ఈ చర్యలకు దిగిందని నివేదిక వెల్లడించింది. ఈ మోహరింపులు ఇలాగే కొనసాగవచ్చని అభిప్రాయపడింది. ఇక భూటాన్ వెంబడి వివాదాస్పద ప్రాంత సమీపంలో చైనా ఏకంగా ఊళ్లనే ఏర్పాటు చేసిందని తెలిపింది. చైనా వద్ద 500 అణు వార్హెడ్లు! ప్రయోగానికి అన్నివిధాలా సిద్ధంగా ఉన్న అణు వార్ హెడ్లు చైనా వద్ద ఏకంగా 500 దాకా ఉన్నట్టు పెంటగాన్ నివేదిక పేర్కొంది. ‘గత రెండేళ్లలోనే ఏకంగా 100 వార్హెడ్లను తయారు చేసుకుంది. 2030 కల్లా వీటిని కనీసం 1,000కి పెంచడమే డ్రాగన్ దేశం లక్ష్యంగా పెట్టుకుంది’ అని నివేదిక వివరించింది. 300కు పైగా ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లు తదితరాలు ఇప్పటికే చైనా అమ్ములపొదిలో చేరినట్టు వివరించింది. వాటిని దేశవ్యాప్తంగా మూడు చోట్ల అండర్‌గ్రౌండ్ వసతుల్లో అతి సురక్షితంగా ఉంచింది. ‘వీటితో పాటు సంప్రదాయ ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్ల తయారీని మరోసారి వేగవంతం చేసింది. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద నావికా దళం ఇప్పటికే చైనా సొంతం. ఏడాదిలోనే 30 యుద్ధ నౌకలను నిర్మించుకుంది. దాంతో చైనా వద్ద మొత్తం యుద్ధ నౌకలు ఏకంగా 370కి చేరాయి. వీటిని 2025 కల్లా 400కు, 2030 కల్లా 450కి పెంచే యోచనలో ఉంది’ అని పేర్కొంది. ‘విదేశాల్లో సైనిక స్థావరాలను పెంచుకునేందుకు చైనా ముమ్మర ప్రయత్నాలు చేసింది. నైజీరియా, నమీబియా, మొజాంబిక్, బంగ్లాదేశ్, బర్మా, సాల్మన్ దీవులు, థాయ్‌లాండ్, తజకిస్థాన్, ఇండొనేసియా, పపువా న్యూ గినియా వంటి దేశాల్లో వ్యూహాత్మక సైనిక స్థావరాలను పెంచుకునేలా కనిపిస్తోంది’ అని నివేదిక తెలిపింది. -
చొరబాటుకు యత్నించిన ముగ్గురు పాక్ తీవ్రవాదులు హతం
శ్రీనగర్: బారాముల్లా ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ సమీపంలో ముగ్గురు పాక్ తీవ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత భూభాగమైన యూరిలోకి చొరబడేందుకు ప్రయత్నించగా భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు, గూఢచారి ఏజెన్సీలు చేసిన జాయింట్ ఆపరేషన్‌లో ముగ్గురూ మృతి చెందినట్లు చినార్ కార్ప్స్ ఇండియన్ ఆర్మీ ఎక్స్(ట్విట్టర్) ద్వారా వెల్లడించింది. ఇండియన్ ఆర్మీ తెలిపిన వివరాల ప్రకారం బారాముల్లా వద్ద పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ముగ్గురు తీవ్రవాదులు వాస్తవాధీన రేఖను దాటుకుని యురి వైపుగా వస్తుండటాన్ని గమనించి సైనికులు అప్రమత్తమై కాల్పులు జరిపారని దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోగా ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పాకిస్తాన్ దళాలు మాపై కాల్పులు జరపడంతో మరో మృతదేహాన్ని క్యాప్చర్ చేయడం సాధ్యపడలేదని తెలిపారు. మూడో మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్తుండగా పాక్ దళాలు కాల్పులు జరపడం 2021లో వాస్తవాధీన రేఖ వద్ద కాల్పులు విరమణకు చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. యురి సెక్టార్లో ఇప్పటికీ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. Update Op Khanda, #Uri A Joint operation was launched today morning in Uri Sector. Contact established & firefight ensued. 03xTerrorists eliminated. 02xAK Rifles, 01xPistol, 07xHand Grenades, 01xIED and other war like stores along with Pak Currency Notes recovered. Joint… — Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) September 16, 2023 ఇది కూడా చదవండి: మాటలు జాగ్రత్త.. విద్వేషాలను రెచ్చగొట్టకూడదు -
ఎల్ఓసీ వెంట చైనా దుశ్చర్య
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) సరిహద్దు అయిన నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంట పాకిస్తాన్ సైన్యం రక్షణపరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. ఈ పనులకు పొరుగున ఉన్న దాని మిత్రదేశం చైనా సహకరిస్తోందని భారత ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. డ్రోన్లు, కమ్యూనికేషన్ టవర్లను పాకిస్తాన్‌కు చైనా అందజేస్తోందని చెప్పారు. భూగర్భæ కేబుళ్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. పీఓకేలో చైనా స్థావరాలు పెరుగుతున్నాయని, వాటి రక్షణ కోసం పాక్ సైన్యానికి సాయం అందిస్తోందని అన్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న 155 ఎంఎం ఎస్‌హెచ్–15 శతఘ్నులను ఎల్ఓసీ వద్ద పాక్ మోహరించిందని పేర్కొన్నారు. పాక్ సైనిక పోస్టుల వద్ద చైనా సైనికాధికారులు తరచుగా కనిపిస్తున్నారని తెలియజేశారు. ఇదిలా ఉండగా, ఈ మొత్తం వ్యవహారంపై భారత సైన్యం ఇంకా అధికారికంగా స్పందించలేదు. తన ప్రయోజనాల కోసం చైనా చేస్తోందని నిపుణులంటున్నారు. -
ఎల్ఏసీ వద్ద పరిణామాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. చైనాతో సరిహద్దు వివాదంపై పార్లమెంట్లో సమగ్రంగా చర్చ జరపాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘సరిహద్దులు దాటి మన భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదు. మన ఆర్మీ పోస్టులను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని మూడేళ్ల క్రితం గల్వాన్ ఘర్షణలు జరిగాక అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ చెప్పారు. చైనా సైనికులు సరిహద్దులు దాటి చొచ్చుకొచ్చేందుకు, మన భూభాగంలో టెంట్లు వేసేందుకు ప్రయతి్నంచడంతో గల్వాన్ ఘటన జరిగిందంటూ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇవి రెండూ పరస్పర విరుద్ధ ప్రకటనలు’అని తివారీ తెలిపారు. అందుకే భారత్–చైనా సరిహద్దు వివాదంపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరపడంతోపాటు గత మూడేళ్లుగా ఎల్ఏసీ వెంట జరుగుతున్న వాస్తవ పరిణామాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బాధ్యతాయుత ప్రతిపక్షంగా కాంగ్రెస్ కోరుతోందన్నారు. ‘ఎల్ఏసీ వెంట ఉన్న 65 పెట్రోలింగ్ పాయింట్లకు గాను 26 వరకు మన ఆర్మీ నియంత్రణలో లేవన్న విషయం నిజమా? చైనా ఆక్రమణలను మనం ఎందుకు ఆపలేకపోయాం?’అని తివారీ కేంద్రాన్ని నిలదీశారు. -
బోర్డర్లో రెచ్చిపోతున్న చైనా.. నివేదికలో పలు సంచలన అంశాలు
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద డ్రాగన్ దేశం చైనా రెచ్చిపోతోంది. డ్రాగన్ సైన్యం భారత భూభాగంలోకి క్రమంగా చొచ్చుకొస్తూ సరిహద్దును సైతం మార్చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన డీజీపీల సమావేశంలో చైనా వ్యవహారంపై అధికారులు సమర్పించిన ఓ నివేదికలో పలు సంచలన అంశాలు బహిర్గతమయ్యాయి. సరిహద్దు ప్రాంతంలో చైనా కొత్త సైనిక స్థావరాలను ఏర్పాటుచేస్తున్న నేపథ్యంలో భారత్–చైనా సైనికుల నడుమ మరిన్ని ఘర్షణలు జరగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. దీనిపై అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఒక కథనాన్ని వెలువరించింది. భారత్–చైనాల మధ్య కొన్నేళ్లుగా నెలకొన్న ఉద్రిక్తతలు, నిఘా సంస్థలు సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ‘‘2013–14 తర్వాత రెండు మూడేళ్లకోసారి ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతల తీవ్రత పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. సరిహద్దులో ఇరు దేశాలు పోటాపోటీగా సైనిక బలగాలను పెంచుకుంటున్నాయి. చైనా చర్యల వల్ల తూర్పు లద్దాఖ్‌లో భారత్ ఇప్పటికే పలు కీలక గస్తీ పాయింట్లను కోల్పోయింది. చైనా దూకుడును అడ్డుకోవాలంటే సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధిని వేగవంతం చేయాలి. సరిహద్దు పర్యాటకాన్ని ప్రోత్సహించాలి’’ అని సూచించారు. -
భారత్-చైనా సరిహద్దు గస్తీపై చైనా అధ్యక్షుడు ఎంక్వైయిరీ
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆసక్తికర పరిణామానికి దారి తీశారు. తూర్పు లడఖ్‌లో భారత్-చైనా సరిహద్దులో ఉన్న చైనా సైనికులతో వీడియోకాల్‌లో ముచ్చటించారు. అక్కడ గస్తీ నిర్వహణపై ఎంక్వైయిరీ చేశారు. సరిహద్దు వెంబడి పరిస్థితుల గురించి సైనికులను అడిగి తెలుసుకున్నాడు. అలాగే అక్కడ నిరంతరం మారుతున్న పరిస్థితులు గురించి ఆరా తీశారు జిన్‌పింగ్. ఈ మేరకు ఆయన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం నుంచి జిన్‌పింగ్ ఖుంజెరాబ్‌లోని సరిహద్దు రక్షణ స్థితిపై అక్కడ సైనికులను ఉద్దేశించి కాసేపు ప్రసంగించారు. అలాగే వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి గస్తీ కాస్తున్న సైనికులు తాము సమర్థవంతంగా పర్యవేక్షిస్తున్నామంటూ అధ్యక్షుడి జిన్‌పింగ్‌కి బదులిచ్చారు. సైనికులు అక్కడ ఎలా ఉంటున్నారో తెలుసుకోవడమే గాక వారి క్షేమ సమాచారాలను కూడా జిన్‌పింగ్ తెలుసుకున్నారు. వారు ఉన్న ప్రదేశాల్లో తాజా కూరగాయాలు దొరుకుతున్నాయో లేదా అని కూడా అడిగారు. అంతేగాదు జిన్‌పింగ్ సరిహద్దులో పోరాడేందకు వారికి కావాల్సిన సహాయసహకారాలు అందిస్తామని కూడా సైనికులకు భరోసా ఇచ్చారు. కాగా, ఇదే తూర్పు లడఖ్ ప్రాంతంలో 2020,మే5న పాంగోంగ్ సరస్సు ప్రాంతంలో హింసాత్మక ఘర్షణ చెలరేగి భారత్ చైనాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. అదీగాక తూర్ప లడఖ్ సరిహద్దు స్టాండ్ ఆఫ్‌పై భారత్, చైనా ఇరుపక్షాలు 17 రౌండ్ల ఉన్నత స్థాయి సైనిక చర్చలు జరిపాయి. చైనాతో ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర అభివృద్ధికి వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి శాంతి, ప్రశాంతత అవసరమని భారత్ నొక్కి చెప్పింది. (చదవండి: పుతిన్ బతికే ఉన్నాడా! తెలియడం లేదు! జెలెన్స్కీ షాకింగ్ వ్యాఖ్యలు) -
‘చైనా పే చర్చ’ ఎప్పుడు ?
న్యూఢిల్లీ: ఛాయ్ పే చర్చా అంటూ ప్రతీసారి మాట్లాడే ప్రధాని మోదీ.. కీలకమైన చైనా అంశంపై ‘చైనా పే చర్చ’ ఎప్పుడు నిర్వహిస్తారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిలదీశారు. ‘అరుణాచల్‌లో వాస్తవాధీన రేఖ వెంట చైనా సైనికుల చొరబాటు యత్నంతో దేశ ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించి వారిలో విశ్వాసం పాదుకొల్పేలా ఎప్పుడు మాట్లాడతారు ? అని ప్రధాని మోదీకి ఖర్గే సూటి ప్రశ్నవేశారు. ‘ దేశ ప్రధాన భూభాగంతో ఈశాన్య రాష్ట్రాలను కలిపే సింహద్వారం ‘సిలిగురి కారిడార్’ భద్రతకు మరింత ముప్పు వాటిల్లేలా చైనా డోక్లామ్‌లో శాశ్వత నిర్మాణాలు పూర్తిచేసినట్లు వార్తలొచ్చాయి. డోక్లామ్ నుంచి జంపేరీ రిట్జ్ వరకు నిర్మాణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది దేశ భద్రతను మరింత ప్రమాదంలోకి నెట్టేయడమే. ఇలాంటి కీలక తరుణంలో ‘చైనా పే చర్చ’ ఎప్పుడు నిర్వహిస్తారు?’ అని ఖర్గే శనివారం ట్వీట్‌చేశారు. కాగా, ప్రధాని వీటికి సమాధానాలు చెప్పాల్సిందేనంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ పలు ప్రశ్నలు ట్వీట్‌చేశారు. 1. తూర్పు లద్దాఖ్‌లో 2020 జూన్ 20న భారత భూభాగంలోకి చైనా చొరబడలేదని ఎందుకు చెప్పారు ? 2. 2020 మే నెల ముందువరకు అక్కడి వేలాది కి.మీ.ల విస్తీర్ణంలో పహారా కాసే మన సేనలను ఆ తర్వాత చైనా సైన్యం అడ్డుకుంటే మీరేం చేశారు ? 3. కేబినెట్ ఆమోదించిన ‘పర్వతప్రాంత మెరుపు దాడి దళం’ కార్యరూపం ఎందుకు దాల్చలేదు? -
ఈశాన్యంలో వైమానిక విన్యాసాలు ప్రారంభం
న్యూఢిల్లీ: ఈశాన్య ప్రాంతంలో భారత వైమానిక దళం(ఐఏఎఫ్) విన్యాసాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ జెట్లతో సహా ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్ పరిధిలోఉన్న సుఖోయ్–30 యుద్ధవిమానం, ఇతర అత్యాధునిక యుద్ధ విమానాలు ఇందులో పాల్గొంటున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైనికుల చొరబాటు యత్నం నేపథ్యంలో ఈ విన్యాసాలు ప్రారంభం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారమే ఇవి జరుగుతున్నాయని, సైనికుల ఘర్షణతో వీటికి సంబంధం లేదని భారత వైమానిక దళం స్పష్టం చేసింది. విన్యాసాలు శుక్రవారం ముగియనున్నాయి. ఇదిలా ఉండగా, 36 రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్‌కు చేరుకున్నాయని ఐఏఎఫ్ ట్వీట్ చేసింది. దీంతో ఒప్పందం మేరకు మొత్తం విమానాలు వచ్చినట్లయ్యిందని పేర్కొంది. -
గోగ్రా నుంచి మూడు రోజుల్లో సైన్యం వెనక్కి
న్యూఢిల్లీ: తూర్పులద్దాఖ్‌లోని గోగ్రా హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో సైన్యాన్ని వెనక్కి ప్రక్రియను మూడు రోజుల్లో పూర్తి చేయాలని భారత్, చైనా నిర్ణయించాయి. సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి ఈ నెల 12 సోమవారం వరకు గడువు ఉందని భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంబడి గత రెండేళ్లుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న గోగ్రా–హాట్‌స్ప్రింగ్స్ పెట్రోలింగ్ పాయింట్ 15 దగ్గర్నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకునే ప్రక్రియను మొదలు పెట్టామని భారత్, చైనా ప్రకటించిన ఒక్క రోజు తర్వాతే భారత్ విదేశాంగ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వచ్చేవారం ఉజ్బెకిస్తాన్‌లో షాంఘై సహకార సంస్థ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశాలున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఇతర అంశాలను కూడా పరిష్కరించుకొని సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడానికి ఇరుపక్షాలు అంగీకరించినట్టుగా విదేశాంగ శాఖ అధికారప్రతినిధి అరిందమ్ బగాచి చెప్పారు. గురువారం ఉదయం 8.30 గంటలకు మొదలైన సైన్యం ఉపసంహరణ సోమవారంతో ముగియాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో తాత్కాలిక నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాలనూ ధ్వంసం చేస్తున్నటు చెప్పారు. 2020 జూన్ గల్వాన్‌లోయలో ఘర్షణలు జరగడానికి ముందు ఎలా ఉండేదో అలా ఉండేలా ఇరు పక్షాలు చర్యలు తీసుకుంటాయన్నారు. -
సరిహద్దుల వద్ద 250 మంది ఉగ్రవాదులు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్ర శిబిరాల్లో 250 ఉగ్రవాదులు సరిహద్దులు దాటేందుకు నక్కి ఉన్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. చొరబాట్లు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి రవాణాతోపాటు సరిహద్దుల ఆవలి నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ ఆందోళన కలిగిస్తోందని డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. చలికాలం రానున్నందున 12 వేల అడుగుల ఎత్తులో గస్తీ విధుల నిర్వహణ మరింత కఠిన తరం కానుందన్నారు. నిఘా వ్యవస్థలను బలోపేతం చేశామన్నారు. ఇద్దరు ఉగ్రవాదులు హతం అనంత్‌నాగ్ జిల్లా పొష్‌క్రీరి ప్రాంతంలో భద్రతా బలగాలతో ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిని డనిష్ భట్, బషరత్ నబీగా గుర్తించారు. -
కశ్మీర్ సరిహద్దుల్లో కూలిన ఆర్మీ హెలికాప్టర్
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో సమీపంలో భారత ఆర్మీ హెలికాప్టర్ కూలింది. ఉత్తర కశ్మీర్‌లోని బందిపొర జిల్లా గురేజ్ సెక్టార్‌లోని గజ్రాన్ నల్లాహ్ వద్ద ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతం లైన్ ఆఫ్ కంట్రోల్‌కు అతి దగ్గర్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అస్వస్థతకు గురైన ఓ బీఎస్ఎఫ్ జవాన్‌ను తీసుకొచ్చేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో పైలట్, కో-పెలట్ ఉన్నట్లు తెలిపారు. An Indian Army Cheetah helicopter has crashed in the Baraum area of Gurez sector of Jammu and Kashmir. The search parties of the security forces are reaching the snow-bound area for the rescue of the chopper crew. More details awaited: Defence officials pic.twitter.com/LMFunz5c0a — ANI (@ANI) March 11, 2022 ల్యాండింగ్ కోసం హెలికాప్టర్ ప్రయత్నించినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో వెనక్కి మళ్లినట్లు ఓ అధికారి చెప్పినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి రెస్క్యూ బృందాలు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా ప్రమాదంలో పైలట్ మృతిచెందినట్లు, కో పైలట్ గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: ఆమ్ ఆద్మీ పార్టీకి మోదీ అభినందనలు.. కేజ్రీవాల్ రిప్లై ఇదే -
చైనా నుంచి భారత్‌కు పెను సవాళ్లు
వాషింగ్టన్: భారత్‌కు ప్రధానంగా డ్రాగన్ దేశం చైనా నుంచి పెనుసవాళ్లు ఎదురవుతున్నాయని అగ్రరాజ్యం అమెరికా వెల్లడించింది. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చైనా దుందుడుకు వైఖరి భారత్‌కు ఆందోళకరంగా పరిణమిస్తోందని పేర్కొంది. ఈ మేరకు ఇండో–పసిఫిక్ ప్రాంతంతో వ్యూహాత్మక భాగస్వామ్యంపై జో బైడెన్ ప్రభుత్వ విధానాన్ని వివరిస్తూ శ్వేతసౌధం తన తొలి నివేదికను శుక్రవారం విడుదల చేసింది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలోని ప్రభావవంతమైన దేశం భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకుంటామని నివేదికలో తెలియజేసింది. రెండు దేశాలు కలిసి పని చేస్తాయని అభిప్రాయపడింది. దక్షిణాసియాలో అస్థిరతకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఆరోగ్యం, అంతరిక్షం, సైబర్‌స్పేస్ తదితర కీలక రంగాల్లో అమెరికా, భారత్ పరస్పరం సహకరించుకోవాలని సూచించింది. ఆర్థిక, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని శ్వేతసౌధం తెలిపింది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్యానికి తలుపులు తెరవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ఈ ప్రాంతంలో భారత్ ప్రబలమైన శక్తిగా ఎదిగేందుకు మద్దతిస్తామని ప్రకటించింది. భారత్ నాయకత్వ స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించింది. భారత్ తమ భాగస్వామ్య దేశమని ఉద్ఘాటించింది. దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతే పెద్దన్న అని స్పష్టం చేసింది. ఇండియాతో కలిసి పనిచేస్తాం.. ఆస్ట్రేలియా, తదితర దేశాల తరహాలో కాకుండా భారత్ భౌగోళికంగా కీలకమైన స్థానంలో ఉందని, పొరుగు దేశం చైనా నుంచి పెనుసవాళ్లు ఎదురవుతున్నాయని వైట్‌హౌజ్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఎల్ఏసీ వద్ద చైనా ప్రవర్తన భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్న మాట వాస్తమేనని అన్నారు. గత ప్రభుత్వ(డొనాల్డ్ ట్రంప్ సర్కారు) హయాంలో భారత్–అమెరికా మధ్య సంబంధాలు చెప్పుకోదగిన స్థాయిలో విస్తృతమయ్యాయని గుర్తుచేశారు. ఈ సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని బైడెన్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. తమలాగే మరో ప్రజాస్వామ్య దేశమైన ఇండియాతో కలిసి పనిచేసే విషయంలో ఎన్నో అవకాశాలు కళ్లెదుట కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఇండియాతోపాటు ఇండోనేషియా, మలేసియా, మంగోలియా, న్యూజిలాండ్, సింగపూర్, తైవాన్, వియత్నాం, పసిఫిక్ దీవులతో సంబంధాలను మెరుగుపర్చుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ‘క్వాడ్’ మినిస్టీరియల్ సదస్సు జరిగిన రోజే ‘ఇండో–పసిఫిక్ ప్రాంతంతో వ్యూహాత్మక భాగస్వామ్యం’పై బైడెన్ ప్రభుత్వం తొలి నివేదికను విడుదల చేయడం విశేషం. -
మీ సైనికుడి మృతదేహాన్ని తీసుకెళ్లండి: ఇండియన్ ఆర్మీ
శ్రీనగర్: తమ దేశ సైనికుడి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని పాకిస్తాన్‌కు భారత్ ఆర్మీ తెలిపింది. శనివారం నియంత్రణ రేఖ వద్ద చోటు చేసుకున్న చొరుబాటును భారత్ ఆర్మీ ముందుగానే పసిగట్టి కాల్పులు జరిపింది. కెరాన్ సెక్టర్లో నియంత్రణ రేఖ వద్ద జరిగిన కాల్పుల్లో పాక్ ఆర్మీ బోర్డర్ యాక్షన్ టీమ్‌కు చెందిన సైనికుడు మృతి చెందినట్లు మేజర్ జనరల్ ఏఎస్ పెంధార్కర్ పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తి మహ్మద్ షబీర్ మాలిక్‌గా గుర్తించామని తెలిపారు. పాకిస్తాన్ వైపున భారత చొరబాటు నిరోధక వ్యవస్థ ఉన్న చోట ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. భారత్‌లోకి చొరబడటానికి ప్రయత్నం జరిగిందని పేర్కొన్నారు. అయితే భారత్ సైనికులు జరిపిన కాల్పులో ఓ వ్యక్తి మృతి చెందాడని తెలిపారు. అతని వద్ద ఏకే రైఫిల్, మందుగుండు సామాగ్రి, 7గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని స్పష్టంగా తెలుస్తోందని తెలిపారు. మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని పాక్‌కు సమాచారం అందిచినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తి వద్ద పాకిస్తాన్ జాతీయ గుర్తింపు కార్డు, పాక్ వైద్యశాఖ జారీ చేసిన కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు లభ్యమైనట్లు పేర్కొన్నారు. అందులోని ఫోటోలో సదరు వ్యక్తి పాక్ ఆర్మీ దుస్తుల్లో కనిపిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఇరుదేశాల మధ్య ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘింగిచే చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. -
‘పక్కా’గా కట్టేస్తోంది
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో డ్రాగన్ దేశం తన దురాక్రమణను యధేచ్ఛగా కొనసాగిస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా ఏడాది కాలంలోనే వాస్తవాధీన రేఖ వెంబడి 60 భవనాల సముదాయాన్ని నిర్మించింది. అంతర్జాతీయ సరిహద్దులు, వాస్తవాధీన రేఖ మధ్యలో భారత్ భూభాగంలో 6 కి.మీ. పరిధిలో ఈ కొత్త భవనాలు వెలిశాయి. 2019లో తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో ఈ ప్రాంతంలో భవనాలేవీ లేవు. ఎన్డీటీవీ వార్తా సంస్థ తాజాగా సంపాదించిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో ఈ భవనాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అరుణాచల్ సరిహద్దుల్లో 100 ఇళ్లతో కూడిన ఒక గ్రామాన్నే నిర్మించిన చైనా దానికి 93 కి.మీ. దూరంలో తూర్పున ఈ భవన సముదాయాన్ని నిర్మించింది. మరోవైపు భారత్ ఆర్మీ ఈ శాటిలైట్ చిత్రాలను చూసి వాస్తవాధీన రేఖకి ఉత్తరాన ఈ భవన నిర్మాణం జరిగిందని, ఆ ప్రాంతం చైనా వైపే ఉందని అంటోంది. అరుణాచల్ సీఎం ప్రేమ ఖాండూ ఇతర ప్రభుత్వ అధికారులెవరూ ఈ కొత్త నిర్మాణాలపై పెదవి విప్పడం లేదు. చైనా గత దశాబ్దకాలంగా సరిహద్దుల్లో అక్రమ నిర్మాణాలను పెంచుతోంది. నిఘా రెట్టింపు చేస్తోంది. భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతూ వస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఏకంగా 100 ఇళ్లతో కూడిన గ్రామాన్నే నిర్మించినట్టు ఈ ఏడాది మొదట్లోనే ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా వెల్లడింది. ఇటీవల అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ కూడా ఈ విషయాన్ని తన నివేదికలో ధ్రువీకరించింది. ఇలా ఇష్టారాజ్యంగా సరిహద్దుల్లో ఆక్రమణలు పెంచుకుంటూ వెళితే చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకోమని భారత్ హెచ్చరిస్తూనే ఉంది. అయినప్పటికీ చైనా ఏకపక్షంగా సరిహద్దుల్లో పౌరులు నివాసాలు ఏర్పరుచుకోవడానికి వీలుగా కొత్త భూ సరిహద్దు చట్టాన్ని కూడా తీసుకువచ్చింది. భూటాన్‌లో 4 గ్రామాలు నిర్మించిన చైనా భూటాన్‌లో చైనా దురాక్రమణ జోరుగా సాగుతోంది. డోక్లాం పీఠభూమికి సమీపంలో ఇటీవల చైనా 4 గ్రామాలను నిర్మించింది. దీనికి సంబంధించిన ఉపగ్రహ ఛాయా చిత్రాలను కాంగ్రెస్ నేతలు పలువురు గురువారం ట్వీట్‌చేశారు. ఈ ఏడాది మే–నవంబర్ మధ్య చైనా ఈ నిర్మాణాలను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇలా సరిహద్దుల్లో చైనా భూముల్ని ఆక్రమించడం దేశ భద్రతకు పెనుముప్పుగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి, ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్మాణాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన నిలదీశారు. -
పీపీ–15 నుంచి వెనక్కి వెళ్లిపోండి: చైనాకు తెగేసి చెప్పిన భారత్
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో మిగిలిన వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాలు సాధ్యమైనంత త్వరగా వెనక్కి వెళ్లిపోవాలని భారత్ మరోసారి తేల్చిచెప్పింది. భారత్–చైనా మధ్య 13వ దఫా కార్ప్స్ కమాండర్ స్థాయి సైనిక చర్చలు ఆదివారం జరిగాయి. ఇరు దేశాల నడుమ చుషుల్–మోల్డో బోర్డర్ పాయింట్ వద్ద చైనా వైపు భూభాగంలో ఉదయం 10.30 గంటలకు మొదలైన ఈ చర్చలు రాత్రి 7 గంటలకు ముగిశాయని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. 8.30 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన చర్చల్లో కీలకాంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపాయి. భారత్ తరఫు బృందానికి లేహ్‌లోని 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పి.జి.కె.వీునన్ నేతృత్వం వహించారు. ప్రధానంగా తూర్పు లద్దాఖ్ హాట్‌స్ప్రింగ్స్ ప్రాంతంలోని పెట్రోలింగ్ పాయింట్(పీపీ)–15 నుంచి బలగాల ఉపసంహరణ గురించే చర్చించినట్లు తెలిసింది. గత ఏడాది మే నెలలో చోటుచేసుకున్న ఘర్షణ పురావృతం కాకుండా సరిహద్దుల్లో పెట్రోలింగ్ చేపట్టాలని, ఇందుకోసం కొత్త ప్రోటోకాల్స్ రూపొందించుకోవాలని ఇరు వర్గాలు ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. అయితే, దీనిపై సైన్యం నుంచి అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు. గోగ్రా నుంచి ఉపసంహరణ పూర్తి 2020 మే 5వ తేదీన తూర్పు లద్దాఖ్‌లో భారత్–చైనా సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరువైపులా పదుల సంఖ్యలో జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా వివిధ స్థాయిల్లో అధికారులు సంప్రదింపులు ప్రారంభించారు. రాజకీయ, దౌత్య, సైనిక పరమైన చర్చలు జరుగుతున్నాయి. 12వ దఫా కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు ఈ ఏడాది జూలై 31న జరిగాయి. ఈ చర్చల్లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గోగ్రా నుంచి తమ బలగాల ఉపసంహరణ ప్రక్రియను భారత్, చైనా పూర్తి చేశాయి. ఇరు దేశాల నడుమ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడాలంటే డెస్పాంగ్‌తో సహా అన్ని వివాదాస్పద ప్రాంతాలపై ఒక ఒప్పందానికి రావాలని భారత్ నొక్కి చెబుతోంది. ఇటీవల చైనా సైన్యం వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను అతిక్రమించి ఉత్తరాఖండ్‌లోని బారాహోతి సెక్టార్, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఇరు దేశాల అధికారులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో 13వ దఫా చర్చలు సాఫీగా సాగడం విశేషం. -
కుటుంబానికొక్కరు సైన్యంలోకి
న్యూఢిల్లీ: భారత్‌కు దీటుగా సరిహద్దుల్లో బలాన్ని పెంచుకునేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని డ్రాగన్ దేశం చైనా వినియోగించుకుంటోంది. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంట మోహరించడమే లక్ష్యంగా టిబెట్ యువతను సైన్యంలోకి తీసుకుంటోంది. టిబెట్‌లోని ప్రతి కుటుంబం నుంచి ఒక్కరు చొప్పున సైన్యంలో చేరాల్సిందేనని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ, చైనా సైన్యం) ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి నుంచి టిబెట్‌లోని యువతకు పీఎల్ఏ వివిధ విధేయత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని భారత నిఘావర్గాలు తెలిపాయి. వారికి మాండరిన్ బోధించడం, మిగతా అన్నిటి కంటే చైనా కమ్యూనిస్టు పార్టీయే మిన్న అని వారిలో నూరిపోయడం వంటివి చేపట్టిందని పేర్కొన్నాయి. ఎంపికైన వారికి కొండ ప్రాంతాల్లో, కఠిన శీతల పరిస్థితుల్లో విధి నిర్వహణపై శిక్షణ అందిస్తోందని వెల్లడించాయి. టిబెటన్లను సైన్యంలోకి తీసుకోవడం ద్వారా అనేక అనుకూలతలను సాధించాలని చైనా భావిస్తోంది. మొదటగా, చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం, పీఎల్ఏ పట్ల యువతలో విధేయతను సాధించడం, టిబెట్ అటానమస్ రీజియన్‌లోని ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించడం. రెండోది..లద్దాఖ్ వంటి కఠిన పరిస్థితులుండే ప్రాంతంలో పీఎల్ఏకు భద్రత విధుల భారం తగ్గించడం. మూడోది, ముఖ్యమైంది.. కఠిన పరిస్థితులుండే లద్దాఖ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని ఎల్ఏసీ వెంట భారత్‌లోని ప్రవాస టిబెటన్లు విధులను సమర్థవంతంగా నిర్వహిస్తుండటంతో వారికి దీటుగా టిబెటన్లను అంతే స్థాయిలో ఎల్ఏసీ వెంట శాశ్వత ప్రాతిపదికన రంగంలోకి దించడం అని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది పాంగాంగో సో సరస్సు దక్షిణం వైపు ఎల్ఏసీ వెంట పీఎల్ఏ చొచ్చుకు వచ్చే అవకాశాలున్నాయని అనుమానించిన భారత్ టిటెటన్లతో కూడిన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్‌ను మొఖపరి, బ్లాక్ టాప్, ఇతర కొండ ప్రాంతాల్లో ఆక్రమించి చైనాకు షాకిచ్చింది. అప్పటి ఈ పరిణామమే చైనాను టిబెటన్ యువత వైపు మొగ్గేలా చేసిందని భావిస్తున్నారు. నేడు భారత్–చైనా 12వ రౌండ్ చర్చలు సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించే లక్ష్యంతో దాదాపు మూడున్నర నెలల తర్వాత ఈనెల 31వ తేదీన భారత్, చైనాల సైనికాధికారులు చర్చలు జరపనున్నారు. తూర్పు లద్దాఖ్‌లోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా హాట్ స్ప్రింగ్స్, గోగ్రాల నుంచి సైనికబలగాల ఉపసంహరణలో కొంత పురోగతి సాధించడంపై రెండు వర్గాలు దృష్టి పెడతాయని సైనిక వర్గాలు తెలిపాయి. శనివారం ఉదయం 10.30 గంటలకు తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంట చైనా భూభాగంలోని మోల్దో బోర్డర్ పాయింట్లో కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు మొదలు కానున్నాయి. రెండు దేశాల సైనికాధికారుల మధ్య భారత్ భూభాగంలోని చుషుల్ వద్ద ఏప్రిల్ 9వ తేదీన 11వ విడత చర్చలు జరిగాయి. 11వ విడత చర్చల తర్వాత ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై చైనా సానుకూలంగా లేకపో వడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. గత ఏడాది మే నెల నుంచి తూర్పు లద్దాఖ్‌లో రెండు దేశాలు పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించిన విషయం తెలిసిందే. -
దృఢ భారత్.. నేతాజీకి గర్వకారణం
కోల్‌కతా/సాక్షి, న్యూఢిల్లీ: బలమైన భారతదేశం నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) నుంచి వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వరకూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అడుగు జాడల్లో నడుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నేతాజీ ఇప్పుడు జీవించి ఉంటే అన్ని విధాలా బలోపేతమైన భారత్‌ను చూసి గర్వపడేవారని అన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటానికి మనమే సొంతంగా టీకాలు అభివృద్ధి చేసుకోవడం, ఇతర దేశాలకు సైతం టీకాలను అందజేయడం, మన దేశ సార్వభౌమత్వానికి సవాలు ఎదురైనప్పుడు దీటుగా జవాబు ఇవ్వడం చూసి నేతాజీ ఎంతగానో గర్వపడేవారని పేర్కొన్నారు. సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ‘పరాక్రమ్ దివస్’ వేడుకలను కేంద్ర ప్రభుత్వం శనివారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఎల్ఏసీ నుంచి ఎల్ఓసీ వరకు బలమైన భారత్ రూపుదిద్దుకోవాలని నేతాజీ కలలుగన్నారని, ఆయన అడుగు జాడల్లో మనం నడుస్తున్నామని తెలిపారు. అజేయమైన సైనిక శక్తి మన సొంతమని చెప్పారు. తేజస్, రఫేల్ వంటి అత్యాధునిక ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకున్నామని వివరించారు. దీవికి బోస్ పేరుపెట్టడం నా అదృష్టం ఆత్మనిర్భర్ భారత్, సోనార్ బంగ్లాను(బంగారు బెంగాల్) కలగనడానికి నేతాజీ గొప్ప స్ఫూర్తి అని నరేంద్ర మోదీ కొనియాడారు. బోస్ పేరు విన్నప్పుడల్లా తాను ఎంతగానో స్ఫూర్తి పొందుతానని చెప్పారు. ఆయన స్వాతంత్య్రం కోసం అర్థించలేదని, దాని కోసం పోరాటం సాగించారని శ్లాఘించారు. 2018లో అండమాన్‌లోని ఓ దీవికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవిగా నామకరణం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. బోస్‌కు సంబంధించిన ఫైళ్లను ప్రజల ముందుంచామని అన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్(ఐఎన్ఏ) సభ్యులు సైతం గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొంటారని తెలిపారు. ప్రతి ఒక్క భారతీయుడు బోస్‌కు రుణపడి ఉన్నాడని ఉద్ఘాటించారు. 130 కోట్ల మందిలోని ప్రతి రక్తం చుక్క బోస్‌కు రుణపడి ఉంటుందన్నారు. గృహ నిర్బంధం నుంచి తప్పించుకొనే ముందు సుభాష్ చంద్రబోస్ తన మేనల్లుడు శిశిర్ బోస్‌ను ‘నా కోసం నువ్వు ఏదైనా చేస్తావా?’ అంటూ ప్రశ్నించారని గుర్తుచేశారు. గుండెపై చెయ్యి వేసుకొని, నేతాజీ సమక్షంలో ఉన్నట్లు ఊహించుకుంటే అదే ప్రశ్న వినిపిస్తుందన్నారు. భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి ఇది ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోషించినట్లుగానే ఆత్మనిర్భర్ భారత్‌లోనూ బెంగాల్ ముఖ్యమైన పాత్ర పోషించాలన్నారు. జైశ్రీరామ్‌లో తప్పేముంది?: బీజేపీ మమతా బెనర్జీ తీరు పట్ల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గియా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఓ వర్గాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. జైశ్రీరామ్ నినాదంలో తప్పేముందని నిలదీశారు. జైశ్రీరామ్ అనేది రాజకీయ నినాదం కాదని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు. ఈ నినాదంలో ఎలాంటి తప్పు లేదని, నేతాజీ జయంతిని రాజకీయం చేయొద్దని నేతాజీ బంధువు చంద్రకుమార్ బోస్ సూచించారు. తమ రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానించారని బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్‌రంజన్ చౌదరి ధ్వజమెత్తారు. ఒక మహిళను పది మందిలో అవమానించడం దారుణమన్నారు. ఈ ఘటన తమ రాష్ట్రానికే అవమానమని సీపీఎం సీనియర్ నేత బిమన్ బోస్ పేర్కొన్నారు. సీఎం మాట్లాడుతుండగా నినాదాలు చేయడాన్ని టీఎంసీ ముఖ్య అధికార ప్రతినిధి డెరెక్ ఓ బ్రెయిన్ తప్పుపట్టారు. బోస్ నివాసంలో మోదీ కోల్‌కతాలో సుభాష్ చంద్రబోస్ నివాసం ‘నేతాజీ భవన్’ను ప్రధాని మోదీ సందర్శించారు. అనంతరం నేషనల్ లైబ్రరీలో నేతాజీపై నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్లో పాల్గొన్నారు. అక్కడ కళాకారులు, ప్రతినిధులతో కొద్దిసేపు ముచ్చటించారు. నన్ను పిలిచి అవమానిస్తారా? బెంగాల్ సీఎం మమత విక్టోరియా మెమోరియల్ హాల్లో జరిగిన నేతాజీ జయంతి కార్యక్రమంలో సీఎం మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురయ్యింది. ప్రసంగించేందుకు ఆమె ఉద్యుక్తురాలు కాగానే కొందరు ప్రధాని సమక్షంలో జైశ్రీరామ్ అంటూ బిగ్గరగా నినదించారు. దీంతో అసహనానికి గురైన మమత ప్రసంగించేందుకు నిరాకరించారు. తనను ఈ వేడుకకు పిలిచి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమే తప్ప రాజకీయ కార్యక్రమం కాదన్నారు. ఇలాంటి చోట మర్యాద పాటించాలన్నారు. పిలిచి అవమానించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. తాను ఇక మాట్లాడబోనని, జై బంగ్లా, జైహింద్ అంటూ ముగించారు. -
పరాక్రమంతో తిప్పికొట్టాం
న్యూఢిల్లీ: తూర్పు లద్దాక్‌లోని వాస్తవాధీన రేఖవద్ద, భారత సైనిక దళాలు అత్యంత ధైర్యంతో, పరాక్రమంతో చైనా బలగాలను తిప్పికొట్టాయని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘‘ చరిత్రలో తనకోసం తాను పోరాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు దేశం ఎవరితోనైనా పోరాడితీరుతుంది. మనుగడ కోసం ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి సంసిద్ధం అవుతుంది’’అని ఎఫ్ఐసీసీఐ వార్షిక సమావేశం సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. దేశంలో రైతాంగం చేస్తున్న ఆందోళనలను గురించి వ్యాఖ్యానిస్తూ రాజ్‌నాథ్ సింగ్ వ్యవసాయం ఒక ‘‘మాతృ విభాగం’’ అని, వ్యవసాయరంగాన్ని తిరోగమన దిశలో పయనింపజేసే ఎటువంటి చర్యలను చేపట్టే సమస్యేలేదని ఆయన నొక్కి చెప్పారు. కవ్వింపులకు బదులిస్తాం:రావత్ కోల్‌కతా: చైనా వైపు నుంచి ఎలాంటి కవ్వింపులు ఎదురైనా గట్టిగా బదులు చెప్పేందుకు భారత సైనిక బలగాలు సిద్ధంగా ఉన్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) టిబెట్‌లో పలు అభివృద్ధి పనుల్లో నిమగ్నమైందని అన్నారు. దేశ భద్రత విషయంలో రాజీ లేదని అన్నారు. -
సరిహద్దుల్లో డ్రాగన్ మరో కుట్ర
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లోని భారత్ సరిహద్దుల్లో డ్రాగన్ దేశం మరో కుట్రకు తెరలేపింది. మెక్‌మోహన్ రేఖ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ సుమారు 65 చదరపు కిలోమీటర్ల భారత భూభాగం తమదేనంటూ వాదించేందుకు సరిహద్దులకు అత్యంత సమీపంలో మూడు వరకు గ్రామాలను నిర్మించింది. తూర్పు లద్దాఖ్‌లో ఒకవైపు భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతూనే మరోవైపు ఈ ప్రణాళికను అమలు చేసింది. భారత్–చైనా–భూటాన్ సరిహద్దులు కలిసే బూమ్లా కనుమకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో కొండ ప్రాంతంలో ఈ గ్రామాలను ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్ సహా అన్ని వసతులను కల్పించింది. అన్ని వేళలా ప్రయాణించేందుకు వీలుండే రహదారులను నిర్మించింది. హన్ చైనీయులు, టిబెట్ కమ్యూనిస్టు పార్టీకి చెందిన పశుపోషకులను ఈ గ్రామాల్లోకి తరలించింది. 2017లో భారత్– చైనా బలగాల మధ్య డోక్లాం ప్రతిష్టంభన చోటు చేసుకున్న ప్రాంతానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో, భూటాన్ భూభాగంలో కొన్ని గ్రామాలను చైనా అక్రమంగా నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడైన వారానికే ఈ పన్నాగం బయటపడటం గమనార్హం. క్రమక్రమంగా సరిహద్దులకు సమీపంలోకి చొచ్చుకువచ్చి తిష్టవేసేందుకు చైనా ఆర్మీ ప్రయత్నిస్తోందని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ 2017లోనే అప్పటి ఆర్మీ చీఫ్, ప్రస్తుత చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెచ్చరించడం గమనార్హం. అరుణాచల్ సరిహద్దుల వెంట ఉన్న భూభాగం అంతా తమదేనని వాదించేందుకు చైనా ఈ ఎత్తుగడలకు పాల్పడుతోందని విశ్లేషకుడు డాక్టర్ బ్రహ్మ చెల్లనీ అంటున్నారు. భారత్ మాత్రం మెక్‌మోహన్ రేఖే సరిహద్దులకు ప్రాతిపదిక అంటూ తిప్పికొడుతోంది. ఉపగ్రహ చిత్రాలు ఏం చెబుతున్నాయి? ప్లానెట్ ల్యాబ్స్ నుంచి ఎన్డీటీవీ సంపాదించిన నివేదికను బట్టి ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన ఉపగ్రహ చిత్రాన్ని బట్టి భారత సరిహద్దులకు సమీపంలోని కొండలపై 20 వరకు ఇళ్లున్న ఒకే ఒక్క గ్రామం ఉంది. నవంబర్ 28వ తేదీన ఉపగ్రహం పంపిన రెండో చిత్రంలో అక్కడికి సమీపంలోనే మరో 50 వరకు ఇళ్ల నిర్మాణాలు కనిపిం చాయి. మరో 10 ఇళ్ల నిర్మాణా లతో మరో ప్రాంతం కూడా అక్కడికి సమీపంలోనే ఉన్నట్లు ఎన్డీటీవీ తెలిపింది. మొత్తంగా చైనా ఆ ప్రాంతంలో కనీసం మూడు గ్రామాలను నిర్మించినట్లు తేలింది. చైనా అధికార గ్లోబల్ టైమ్స్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ గ్రామాల్లో ఉండే పశుపోషకులు సరిహద్దులను కాపలా కాస్తుంటారని కూడా పేర్కొంది. ఫిబ్రవరి 17న తీసిన తొలి చిత్రంలో కొత్తగా నిర్మించిన గ్రామాలు (వృత్తంలో) నవంబర్ 28 నాటి రెండో చిత్రంలో కొత్తగా వెలిసిన నివాసాలు (వృత్తంలో) -
ఈ సైనిక శిబిరాలు స్మార్ట్
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లద్దాఖ్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సైనికులు సమర్థంగా పనిచేయడానికి వీలుగా అత్యంత ఆధునిక వసతి సౌకర్యాలను కల్పించారు. కొద్ది రోజులుగా చైనాతో ఉద్రిక్తతలు నెలకొని ఉండడంతో శీతాకాలంలో సైనికుల ఆరోగ్యానికి పూర్తిగా రక్షణ కల్పించేలా స్మార్ట్ శిబిరాలను ఏర్పాటు చేశారు. నవంబర్ నుంచి ఈ ప్రాంతంలో రక్తం గడ్డకట్టే చలి మొదలవుతుంది. ఉష్ణోగ్రతలు దాదాపు మైనస్ 40 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోతాయి. 40 అడుగుల ఎత్తున మంచు పేరుకుపోతుంది. ఇలాంటి కఠినమైన వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుంటూ దేశ రక్షణ కోసం కంటి మీద రెప్ప వేయకుండా కాపలా కాసే మన జవాన్ల కోసం నిర్మించిన ఈ స్మార్ట్ క్యాంపుల్లో అన్ని రకాల సదుపాయాలున్నాయి. చలిని తట్టుకోవడానికి శిబిరాల్లో హీటర్లు, 24 గంటలు వేడి నీళ్ల సదుపాయం, విద్యుత్, బెడ్లు, కబోర్డులు ఇలా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. ‘లద్దాఖ్‌లో గస్తీ ఉండే సైనికులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాం. వారు చలిని తట్టుకునేలా స్మార్ట్ శిబిరాల నిర్మాణం పూర్తయింది. దేశ రక్షణ కోసం పాటు పడే జవాన్లు శీతాకాలంలో సమర్థమంతంగా విధులు నిర్వహించడం కోసం మెరుగైన వసతి సదుపాయాలు కల్పించాం’అని భారత సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. స్మార్ట్ శిబిరాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ట్విట్టర్లో షేర్ చేయడంతో అవి విస్తృతప్రచారం పొందాయి. గత నెలలోనే చైనా కూడా ఈ ప్రాంతంలో ఆధునిక సదుపాయాలతో సైనిక శిబిరాలు ఏర్పాటు చేసి, వాటి వీడియోల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. చైనా శిబిరాలకు ఏమాత్రం తీసిపోకుండా భారత్‌కి చెందిన స్మార్ట్ శిబిరాలు కూడా ఉండడం గమనార్హం. -
లద్దాఖ్‌లో పట్టుబడ్డ చైనా జవాను
న్యూఢిల్లీ: చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కు చెందిన సైనికుడు ఒకరు సోమవారం తూర్పు లద్దాఖ్‌లో భారత సైన్యానికి పట్టుబడ్డాడు. రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) దాటి అతడు భారత భూభాగంలోకి ప్రవేశించడం సంచలనం రేపింది. ఈ ఘటనపై భారత సైన్యం స్పందించింది. ‘ఈ నెల 19వ తేదీన తూర్పు లద్దాఖ్ సెక్టార్‌లోని డెమ్చోక్ ప్రాంతంలో చైనా సైనికుడొకరు ఎల్ఏసీని దాటి భారత భూభాగంలోకి దారి తప్పి ప్రవేశించాడు. అతడి వద్ద ఉన్న గుర్తింపు కార్డు ఆధారంగా పీఎల్ఏ కార్పొరల్ వాంగ్ య లాంగ్గా తెలిసింది. స్వస్థలం చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్‌లోని షాంగ్జిఝెన్ పట్టణమని తేలింది. దీని వెనుక గూఢచర్యం ఉన్నట్లు భావించడం లేదు’ అని భారత ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘పర్వతమయమైన ఈ ప్రాంతంలో అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య దారితప్పి వచ్చిన అతడికి ఆక్సిజన్, ఆహారంతోపాటు చలి నుంచి రక్షణ కల్పించే దుస్తులు అందించాం. తప్పిపోయిన తమ సైనికుడి ఆచూకీ కోసం పీఎల్ఏ నుంచి ఒక వినతి అందింది’అని భారత ఆర్మీ వెల్లడించింది. చైనాతో ఉన్న అవగాహనను అనుసరించి ఇతర లాంఛనాలన్నీ పూర్తయ్యాక చుషుల్–మోల్డో ప్రాంతంలో అతడిని తిరిగి చైనా సైనిక అధికారులకు అప్పగిస్తామని భారత సైన్యం స్పష్టం చేసింది. ‘భారత్–చైనా సరిహద్దులు దాటి భారత్‌లోకి అతడు ఎలా రాగలిగాడనే విషయం రాబట్టేందుకు అధికారులు ప్రస్తుతం అతడిని ప్రశ్నిస్తున్నారు. మంగళవారం నాటికి అతడిని తిరిగి వెనక్కు పంపించే అవకాశాలున్నాయి’అని పేర్కొంది. భారత్, చైనాలు ఈ విషయంలో సంప్రదింపులు జరుపుతున్నాయని, పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాయని చైనా అధికార గ్లోబల్ టైమ్స్ తెలిపింది. సరిహద్దుల్లో ఇది మరో వివాదానికి తెరతీయబోదనీ, ఈ అంశం పరిష్కారం మరిన్ని ద్వైపాక్షిక చర్చలకు మార్గం సుగమం చేస్తుందని వ్యాఖ్యానించింది. పీఎల్ఏలో కార్పొరల్ హోదా భారత ఆర్మీలో నాయక్ స్థాయికి సమానం. కాగా, తూర్పు లద్దాఖ్‌లో ఎల్ఏసీ వెంట ఆరు నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. చైనాలో భాగంగా జమ్మూకశ్మీర్! జమ్మూకశ్మీర్ చైనాలో భాగం అంటూ ట్విట్టర్ చూపడం వివాదాస్పదంగా మారింది. ఈ పొరపాటును వెంటనే సరిచేసినట్లు ట్విట్టర్ చెబుతున్నప్పటికీ జమ్మూకశ్మీర్‌ను భారత్‌కు చెందినట్లు చూపకపోవడం, లేహ్ ప్రాంతాన్ని కశ్మీర్లో అంతర్భాగంగా పేర్కొనడం కొనసాగు తోందని నిపుణులు అంటున్నారు. జాతీయ భద్రతా వ్యవహారాల విశ్లేషకుడు నితిన్ గోఖలే ఆదివారం లేహ్‌లోని హాల్ ఆఫ్ ఫేంను గురించి ట్విట్టర్లో ఒక వీడియో పోస్టు చేశారు. అందులో లేహ్‌ను జమ్మూకశ్మీర్‌కు చెందినట్లు, జమ్మూకశ్మీర్ చైనాలో ఉన్నట్లు చూపుతోంది. సాంకేతిక లోపాల కారణంగా ఇలా జరిగిందని ట్విట్టర్ ఇండియా ప్రతినిధి చెప్పారు. -
పాక్ కుట్రను తిప్పి కొట్టిన భారత్
శ్రీనగర్: భారత్‌లో పేలుళ్లే లక్ష్యంగా పాక్ పన్నిన కుట్రల్ని భారత ఆర్మీ భగ్నం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి కశ్మీర్‌లోని కెరాన్ సెక్టార్‌కు భారీ ఎత్తున ఆయుధాలు తరలించడానికి చేసిన ప్రయత్నాలను ఆర్మీ తిప్పికొట్టినట్టు సైనిక అధికారి ఒకరు వెల్లడించారు. కెరాన్ సెక్టార్లో నాలుగు ఏకే74 రైఫిళ్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కిషన్‌గంగ నది మీదుగా ఒక తాడు సాయంతో ఇద్దరు, ముగ్గురు దుండగులు ఒక పెద్ద ట్యూబులో ఆయుధాలను ఉంచి తరలిస్తుండగా జవాన్లు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగి రైఫిల్స్, 8 మ్యాగజైన్స్‌తో పాటుగా రెండు పెద్ద సంచుల నిండా ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతమంతా అణువణువునా గాలిస్తున్నట్టుగా లెఫ్ట్‌నెంట్ జనరల్ బీఎస్ రాజు వెల్లడించారు. ‘అప్రమత్తంగా ఉంటూ పాక్ చేసిన ఏ పనినైనా తిప్పి కొడతాం’అని చెప్పారు. కెరాన్, టాంగ్ధర్, జమ్మూ, పంజాబ్ సెక్టార్లలో కశ్మీరీ యువతని ఉగ్రవాదం వైపు మళ్లించడానికి పాక్ నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉందని ఆ కమాండర్ తెలిపారు. కాగా, కశ్మీర్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గామ్ జిల్లాలోని చింగామ్‌లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతాబలగాలు సోదాలు చేపట్టాయి. నక్కి ఉన్న ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరపగా, భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లోఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దదూరా ప్రాంతంలో ఇదే రీతిలో జరిగిన మరో ఎన్కౌంటర్లో కూడా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. -
చర్చలతో చైనా దారికి రాదు
వాషింగ్టన్: భారత్, చైనా మధ్య గత అయిదారు నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతలకు చర్చలతో పరిష్కారం లభించదని అమెరికా అభిప్రాయపడింది. డ్రాగన్ దేశంతో చర్చలు జరిపి ఇక లాభం లేదని భారత్‌కు హితవు పలికింది. ఇరుదేశాల మధ్యనున్న వాస్తవాధీన రేఖను చైనా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని స్పష్టం చేసింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రియెన్ చైనాతో ఒప్పందాలు, చర్చలు అంటూ కాలయాపన చేయొద్దని, చర్చలతో పరిష్కారం దొరకదన్న విషయాన్ని భారత్ అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా చైనా వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. భారత్ సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉత్తరంగా చైనా 60 వేల మందికి పైగా సైనికుల్ని మోహరించి కయ్యానికి కాలు దువ్వుతోందని అన్నారు. చైనాది దురాక్రమణ బుద్ధి కమ్యూనిస్టు పార్టీ దురాక్రమణ బుద్ధితో భారత్, తైవాన్ దేశాల సరిహద్దుల్ని ఆక్రమించుకోవడానికి కుట్రలు పన్నుతోం దని రాబర్ట్ ఓ బ్రియెన్ అన్నారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తైవాన్ సరిహద్దుల్లో నిరంతరాయంగా సైనిక విన్యాసాలకు దిగుతోందని అన్నారు. చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ (ఓబీఓఆర్) ప్రాజెక్టు కూడా ఇతర దేశాల ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని దెబ్బ తీయడానికేనని ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యులైన కంపెనీలకు చైనా బలవంతంగా రుణాలు తీసుకునే పరిస్థితి కల్పిస్తుందని వాటిని చెల్లించలేక అవన్నీ డ్రాగన్ దేశానికి దాసోహం అంటాయని అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కల్పించే మౌలిక సదుపాయాలు అంతిమంగా చైనాకే ప్రయోజనం చేకూరుస్తున్నాయని ఆయన అన్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని భారత్ ఇకనైనా చర్చలతో చైనా దారికి రాదు అన్న విషయాన్ని గ్రహించుకోవాలన్నారు. క్వాడ్ దేశాలకు డ్రాగన్‌తో ముప్పు డ్రాగన్ దేశం అత్యంత హీనంగా వ్యవహరిస్తూ క్వాడ్ దేశాలకు ముప్పుగా మారిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ సరిహద్దుల్లో 60 వేల మందికి పైగా సైనికుల్ని మోహరించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంద న్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో చైనాకు చెక్ పెట్టడానికి ఇండో పసిఫిక్ దేశాలు అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియా క్వాడ్ గ్రూపుగా ఏర్పడ్డాయి. ఇటీవల ఈ దేశాల విదేశాంగ మంత్రులు టోక్యోలో సమావేశమై చర్చించారు. భారత్ విదేశాంగ మంత్రి జై శంకర్‌తో ఫలప్రదమైన చర్చలు జరిపానని టోక్యో నుంచి వాషింగ్టన్కు తిరిగి వచ్చిన అనంతరం ఒక టీవీ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.