పాకిస్థాన్ మరోసారి పాపిస్థాన్ అనిపించుకుంది. జమ్ము కాశ్మీర్లో నియంత్రణ రేఖను దాటి వచ్చిన పాకిస్థానీ దళాలు భారత సైనికులపై కాల్పులు జరిపి, ఐదుగురు జవాన్ల ప్రాణాలు బలిగొన్నాయి. పూంచ్ జిల్లా చకన్ దా బాగ్ సెక్టార్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఎల్ఓసీలోని కర్మాడ్ గ్రామంలో గల తమ సైనిక పోస్టుపై వాళ్లు దాడి చేసి, తమ సైనికుల్లో ఐదుగురిని కాల్చి చంపారని, తర్వాత మళ్లీ పాకిస్థాన్ భూభాగంలోకి పారిపోయారని సైన్యానికి చెందిన ఓ అధికారి తెలిపారు.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య 2003 సంవత్సరంలో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాన్ని పాకిస్థాన్ పదే పదే ఉల్లంఘిస్తోంది. ఈ సంవత్సరం జనవరిలో కూడా ఇద్దరు భారతీయ సైనికులను ఎల్ఓసీ వద్ద గల మేంధర్ సెక్టార్లో హతమార్చింది. ఈ సంఘటనలో పాకిస్థాన్ సైన్యం ప్రత్యక్ష ప్రమేయం ఉందని భారత వర్గాలు ఆరోపించాయి.
ఇంతకుముందు ఒకసారి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి, భారత సైనికుడి తల తెగనరికిన సంఘటన అప్పట్లో తీవ్ర వివాదానికి కారణమైంది. పదే పదే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా మన విదేశాంగ శాఖ వైపు నుంచి తగిన స్థాయిలో ప్రతిస్పందన ఉండట్లేదని సైన్యం ఆరోపిస్తోంది.
గీత దాటిన పాకిస్థాన్: ఐదుగురు భారత జవాన్ల హతం
Published Tue, Aug 6 2013 11:24 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
Advertisement
Advertisement